Friday, July 2, 2010

బేస్ రేట్ వడ్డీ విధానం - పరిచయం

భారతదేశంలోని వాణిజ్య బ్యాంకులు మంజూరు చేసే వివిధ ఋణాలపై వసూలు చేసే వడ్డీ రేటు బి. పి. యల్‌. ఆర్‌. (బెంచ్‌ మార్క్‌డ్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటు - నిర్దేశిత ప్రాధాన్యతా ఋణరేటు) ప్రాతిపదికగా ఉన్నది. ఈ బేస్‌ రేటు తొలుత ఏప్రిల్‌ ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని ఆర్‌బిఐ ప్రకటించింది. కానీ శుక్రవారం (05.03.2010) సాయంత్రం విడుదలైన ఆర్‌బిఐ ప్రకటనలో బేస్‌రేట్‌ జూన్‌ ఒకటి నుంచి అమల్లోకి వుంటుందని సవరించింది. బేస్‌ రేటు విధాన అమలులో ఋణాలపై విధించే వడ్డీ రేటు పారదర్శకంగాను, శాస్త్రీయంగాను ఉండి, వివిధ ఋణ గ్రహీతలకు ప్రయోజన కరంగా ఉంటుందని రిజర్వ్‌ బ్యాంకు అభిప్రాయపడింది. అదే సందర్భంలో మన దేశంలో ఫైనాన్షియల్‌ రంగ సంస్కరణల సాఫల్యతకు వడ్డీ రేట్ల సరళీకరణ అనివార్యమని రఘురాజన్‌ కమిటి నివేదికతో పాటు బేస్‌ రేటు విధానంపై రిజర్వ్‌ బ్యాంకు నియమించిన దీపక్‌ మొహంతి నాయకత్వంలోని కార్యనిర్వాహక బృందం సిఫార్సు చేసింది.

వడ్డీ రేట్ల సరళీకరణ ప్రక్రియ -


దీపక్‌ మొహంతి కమిటి పరిశీలనలు- ముఖ్యాంశాలు

బేస్‌ రేటు విధాన రూపకల్పనపై జూన్‌ 2009లో రిజర్వ్‌ బ్యాంకు నియమించిన దీపక్‌ మొహంతి నాయకత్వంలోని కమిటి అక్టోబర్‌ 2009లో తన నివేదికను సమర్పించింది. దాని పరిశీలనలోని కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

1. బి.పి.యల్‌.ఆర్‌ - అనుభవం -

1. గత సం|| మొదటి భాగంలో ఆర్ధిక మాంద్య ప్రభావం నుండి ఆర్ధిక వ్యవస్ధను బయట పడవేయటానికి రిజర్వ్‌ బ్యాంక్‌ చేపట్టింది. కరెన్సీ చర్యలకు (మానిటరీ మెజర్స్‌) అనుగుణంగా స్పందించడంలో బి.పి.యల్‌.ఆర్‌ పద్దతి విఫలమైందని పై కమిటి అభిప్రాయ పడింది. లిక్విడిటి లభ్యతను పెంచినా, రెపో రివర్స్‌ రెపో రేట్లలో గణనీయమైన మార్పులు చేపట్టినా, వినియోగదారులకు భారీ ఋణ మంజూరులకు బ్యాంకులు సిద్ధం కాకుండా తక్కువ వడ్డీ రేట్లు కలిగిన రిజర్వ్‌ బ్యాంకు సెక్యూరిటీలలో పెట్టుబడికి సిద్ధమయ్యాయి. దానితోపాటు తమ వడ్డీ రేట్లను తగినంతగా మార్చలేదు. ఆ సందర్భంగా బి.పి.యల్‌.ఆర్‌ పద్ధతి వైఫల్యంతో పాటు, ఆర్ధిక వ్యవస్ధపై బ్యాంకులకు ఏర్పడ్డ అవిశ్వాసం కూడా కీలకమైనది. కమిటి ఈ అంశాన్ని తన నివేదికలో ప్రస్తావించలేదు. 2. బి.పి.యల్‌.ఆర్‌ పద్ధతిలో పారదర్శకత లేని కారణంగా, వినియోగదారుడికి ఋణ వడ్డీరేట్ల తీరులో అవగాహన లేకుండా పోయింది. 3. సబ్‌ పి.యల్‌.ఆర్‌ రేటుకు అంటే పి.యల్‌.ఆర్‌ కంటే తక్కువ వడ్డీ రేట్లకు కార్పొరేట్‌ రంగానికి ఋణాలుఇచ్చే వెసులుబాటు ఇవ్వడంతో, బ్యాంకులు రూ. 2 లక్షలలోపు చిన్న ఋణ గ్రహీతలు, వ్యవసాయ దారులను నిర్లక్ష్యం చేశాయి. బ్యాంకు ఋణాలలో 65-70 శాతం ఋణాలు సబ్‌ పి.యల్‌.ఆర్‌ క్రింద మంజూరు చేసినవి. దీనితో బి.పి.యల్‌.ఆర్‌ అస్ధిత్వానికి అర్ధం లేకుండా పోయింది.

2. బేస్‌ రేట్‌ లెక్కింపు విధానం -

1. బేస్‌ రేట్‌ లెక్కింపులో డిపాజిట్‌లపై వ్యయం, రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించే లిక్విడిటి రెపో రేట్ల నిర్వహణకు అయ్యే ఖర్చు, బ్యాంకు నిర్వహణకు అయ్యే ఖర్చు, బ్యాంకు లాభాల మార్జిన్‌ పరిగణలోనికి తీసుకొని బేస్‌ రేట్‌ లెక్కిస్తారు. ఈ బేస్‌ రేట్‌కు ఒక్కొక్క తరహా రంగానికి అయ్యే నిర్వహణ ఖర్చులు అదనంగా చేర్చి వడ్డీ రేట్లను విధిస్తారు. ఈ బేస్‌ రేట్‌ కంటే తక్కువ వడ్డీ రేటుతో సాధారణంగా ఋణాలు మంజూరు చేకూడదు. సం||లోపు కాల పరిమిత గల ఋణాలు బేస్‌ రేట్‌ పరిధిలో ఉండవు. విద్యాభ్యాస ఋణాలకు నియంత్రిత రేట్లు అమలవుతాయి. ఈ రేటు 5 ప్రభుత్వ రంగ బ్యాంకుల సగటు బేస్‌ రేటుకు 200 బేసిస్‌ పాయింట్‌లు కలిపి వడ్డీ రేటును నిర్ణయిస్తారు. 3. రూ. 2 లక్షలకు పైబడ్డ సబ్‌ పి.యల్‌.ఆర్‌. ఋణాలు, రూ. 2 లక్షలలోపు బి.పి.యల్‌.ఆర్‌ సీలింగ్‌ రేటుకు లోబడిన ఋణాలు బేస్‌ రేటు పద్దతిలోనే మంజూరు చేయాలి. దీని వల్ల ఇదివరకు నిర్లక్ష్యం చేయబడ్డ చిన్న ఋణ లబ్ది దారులకు, వ్యవసాయ దారులకు ఋణ లభ్యత అవకాశాలు మొరుగుపడతాయి. 4. ఫ్లోటింగ్‌ రేటు ఋణాలు కూడా బేస్‌ రేటు ప్రాతిపదికనే నిర్వహింపబడాలి. 5. బేస్‌ రేటు పారదర్శకంగా ఉన్న కారణంగా లబ్ధిదారులకు ప్రయోజనకరంగా ఉండే బ్యాంకు ఋణాలను ఎన్నుకొనే అవకాశం పెరుగుతుంది. 6.బేస్‌ రేటు పద్దతిలో వడ్డీ రేటు బి.పి.యల్‌.ఆర్‌ వడ్డీ రేటు కంటే తక్కువగా ఉంటుంది. 7. సం||లో ప్రతి మూడు నెలలకు బ్యాంకులు బేస్‌ రేటు ప్రకటించాల్సి ఉంటుంది. 8. బేస్‌ రేటు విధానం నూతన ఋణాలకు మాత్రమే వర్తిస్తుంది. పాత ఋణాల రెన్యూవల్‌ సమయంలో వడ్డీ రేట్లపై వినియోగ దారులకు ఆఫ్షన్‌ ఉంటుంది.

ముగింపు - దీపక్‌ మొహంతి కమిటి సిఫార్సులను రిజర్వ్‌ బ్యాంకు అమోదించి అమలుకు పూనుకుంది. కార్పొరేట్‌ రంగానికి ఈ సిఫార్సులు ప్రయోజన కరంగా ఉంటాయి. దేశీయ పొదుపు పై వీటి దుష్ప్రభావం గణనీయంగా ఉండే అవకాశముంది. సామాన్య ప్రజానీకం ఈ సిఫార్సులతో ఏ మేరకు లబ్ది పొందగలరనేది వేచి చూడాలి. సామాన్య ప్రజల ప్రయోజనాలకంటే సమాజానికి హాని కల్గించే ఫైనాన్షియల్‌ రంగ సరళీకరణ ఈ సిఫార్సుల ప్రధాన లక్ష్యం.

Thursday, June 17, 2010

నమోదైన కంపెనీల్లో పబ్లిక్‌ హౌల్డింగ్‌ పెంపు ఎవరికి శ్రేయస్కరం

ఒక పరిశీల

సెబీతో (స్టాక్‌ ఎక్స్చ్‌ంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా) నమోదైన భారతీయ కంపెనీలు తప్పనిసరిగా కనీసం 25% ల వాటాలను పబ్లిక్‌ హౌల్డింగ్‌ లో (ప్రజల చేతుల్లో కంపెనీ వాటాలు) ఉంచాలని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. వీటిపై అటు ప్రయివేటు రంగంలోను, ఇటు ప్రభుత్వ రంగంలోను విస్త్రృత చర్చ నడుస్తున్నది. ఈ మార్గదర్శక సూత్రాల ప్రభావం ''ప్రభుత్వరంగ వాటాల ఉపసంహరణ (డిజిన్వెస్ట్‌మెంట్‌) పై తీవ్ర ప్రభావాల్ని కల్గించనున్నది. ఈ మార్గదర్శక సూత్రాల పర్యవసానాల్ని కొన్నింటిని పరిశీలించుదాం

మార్గదర్శక సూత్రాలు

యు.పి.ఏ-2 ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, క్యాపిటల్‌ మార్కెట్‌ అభివృద్ధికి కొన్ని చర్యల్ని చేపట్టింది. అందులో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫరింగ్‌ మార్గంలో ప్రభుత్వ రంగ వాటాల ఉపసంహరణ ప్రధానమైనది. ఇంత వరకు సెబీతో నమోదైన (లిస్టెడ్‌) కంపెనీలలో పబ్లిక్‌ హౌల్డింగ్‌ క్రింద కనీసం 10% ఉంచాలి. అప్పుడు ప్రమోటర్‌ కోటా 90% గా ఉంటుంది. ఈ మార్గదర్శక సూత్రాలను ప్రభుత్వం అనేక మినహాయింపులతో చూసి చూడనట్లుండేది. ఆ సూత్రాలు, నమోదైన ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తించేవి కావు. ప్రభుత్వ రంగ సంస్థల వాటాల ఉపసంహరణ పై మోజు పెరిగినాక, కేంద్ర ప్రభుత్వం, పబ్లిక్‌ హౌల్డింగ్‌ ప్రమాణాల సవరణకు పూనుకుంది. నూతన ప్రమాణాల ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థ అయిన, ప్రయివేటు రంగ సంస్థ అయిన సెబీ దగ్గర నమోదైతే కనీసం పబ్లిక్‌ హౌల్డింగ్‌లో 25% వాటాలు ఉంచాలి. దీనికి ఏరకమైన మినహాయింపులుండవు. ఒక సంవత్సరంలో 25% పబ్లిక్‌ హౌల్డింగ్‌ సాధ్యం కాని పక్షంలో ప్రతి సంవత్సరం 5% తగ్గకుండా కంపెనీ పబ్లిక్‌ హౌల్డింగ్‌ను పెంచాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో మరుసటి సంవత్సరం 25% పబ్లిక్‌ హౌల్డింగ్‌ ఒక్క సంవత్సరంలోనే సాధించవలసి ఉంటుంది. ఉదాహరణకు ఒక నమోదైన కంపెనీలో పబ్లిక్‌ హౌల్డింగ్‌ 10% ఉంటే 3 సం||లోగా పబ్లిక్‌ హౌల్డింగ్‌ను 25% పెంచాలి

చర్చా పత్రం వివరాలు-

''పబ్లిక్‌ హౌల్డింగ్‌ను పెంచడమంటే నమోదైన కంపెనీలలో ప్రజల వాటా శాతాన్ని పెంచడమే. ఈ రకంగా ప్రజల వాటాలా విస్తృతి పెంచటం మూలకంగా వ్యక్తిగత షేర్‌ మదుపుదారులకు విలువైన కంపెనీల వాటాలు విస్తృతంగా లభిస్తాయి. ఫలితంగా సక్రమమైన వాటా ధర నిర్ణయం చేయబడి, ఎక్కువ సంఖ్యలో వాటాలు, ఎక్కువ మంది వాటా దారులకు అందుబాటులో ఉంచగల''వని మార్గదర్శక సూత్రాలకు జారీకి ముందు విడుదల చేసిన చర్చా పత్రంలోసెబీ వివరించింది. ''వ్యక్తిగత వాటాదారులకు వాటాల లభ్యత ఏ మేరకు తగ్గుతాయో, ఆ మేరకు ప్రమోటర్‌ వాటాలు కలిగిన ఆ కంపెనీ యాజమాన్యాలు వివిధ అవకతవలకు పాల్పడే ప్రమాదముందని'' ఆ పత్రంలో సెబీ వాదించి, పబ్లిక్‌ హౌల్డింగ్‌ను 25% కి పెంచటానికి కావలసిన ప్రాతిపదికను ఆ పత్రం సిద్ధం చేసింది.

పూర్వ చరిత్ర -

1993 సం|| పూర్వం సెక్యూరిటీ కాంట్రాక్ట్‌ రెగ్యులేషన్స్‌ చట్టం 1956 ప్రకారం, నమోదైన కంపెనీ 60% వాటాలను పబ్లిక్‌ హౌల్డింగ్‌ క్రింద జారీ చేయవలసియుంది. ఈ నియమాలను వివిధ రకాలుగా మినహాయిస్తూ, (కేంద్ర ప్రభుత్వ అంగీకారంతో) స్టాక్‌ ఎక్స్ఛెంజ్‌లకు అనుమతినిచ్చారు. భారతదేశంలో నయాఉదారవాద విధానాల అమలు జోరు అందుకున్నాక, 60% పబ్లిక్‌ హౌల్డింగ్‌ నియమంతో ''విదేశీ సంస్థలు స్వదేశీ కంపెనీల వాటాలను అత్యధికంగా హస్తగతం చేసుకొనే ప్రమాదం ఉందన్న'' సాకుతో, పబ్లిక్‌ హౌల్డింగ్‌ శాతాన్ని తగ్గించాలని భారతదేశ ప్రయివేటు రంగం ప్రభుత్వంపై తీవ్ర వత్తిడి తెచ్చింది. దేశీయ కంపెనీల వత్తిడికి తలొగ్గి 1999లో కేంద్ర ప్రభుత్వం పబ్లిక్‌ హౌల్డింగ్‌ శాతాన్ని 25% కి తగ్గించింది. అందులోనూ మరిన్ని మినహాయింపులను మంజూరు చేసింది. ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ కంపెనీలు, 20 లక్షల వాటాల్ని ఆఫర్‌ చేయగల సంస్థలు, వేయి కోట్లకు పైబడి మార్కెట్‌ నుండి పెట్టుబడి సమీకరించగల కంపెనీలకు పబ్లిక్‌ హౌల్డింగ్‌ 10% నికి తగ్గించబడింది. 25% పబ్లిక్‌ హౌల్డింగ్‌ అన్న సూత్రం ఆచరణలో 10% నికి కుదించబడింది. ఈ విధంగా భారతీయ ప్రయివేటు కంపెనీలు విదేశీ కంపెనీల బూచిని చూపి అత్యధిక ప్రయోజనాల్ని పొందాయి. ప్రమోటర్స్‌ కోటా 90% నికి పెంచుకోవటంలోనూ, పబ్లిక్‌ హౌల్డింగ్‌ను 10%నికి నిర్వహించడంలోను వివిధ కంపెనీల యాజమాన్యాలు అనేక రకాల అవకతవకలకు పాల్పడ్డాయి.

అంచనావేస్తున్న పర్యవసానాలు - యు.పి.ఏ-2 అధికారంలోకి వచ్చినాక ప్రభత్వరంగ సంస్థల వాటాల ఉపసంహరణకు నడుంకట్టింది. తాజా మార్గదర్శక సూత్రాలను అమలు జరిపితే ఈ క్రింద పేర్కొన్న పర్యవసానాలకు అవకాశమున్నట్లు యస్‌.యం.సి. క్యాపిటల్స్‌, ఈక్విటీ హెడ్‌ జగన్నాధం తూనుగుంట్ల తెలియజేస్తున్నారు.

1. 25% కంటే తక్కువ పబ్లిక్‌ హౌల్డింగ్‌ కలిగి నమోదైన కంపెనీలు 183.

2. ఈ 183 కంపెనీల నుండి వివిధ పబ్లిక్‌ ఆఫరింగ్‌ల ద్వారా రూ. 1,50,527 కోట్లు నిధులు మార్కెట్లో సమీకరింపబడాలి. వీటిలో ప్రభుత్వరంగ సంస్థల ద్వారా రూ. 1,24,547 కోట్లు (మొత్తంలో 83%) మరియు ప్రయివేటు రంగం నుండి రూ. 25,981 కోట్లు (మొత్తంలో 17%).

3. పై వాటాలను ప్రతి సంవత్సరం 5% చొప్పున జారీ చేస్తే, జూన్‌ 2010 నుండి జూన్‌ 2011 వరకు రూ.61,327 కోట్లు, జూన్‌ 2011 నుండి జూన్‌ 2012 వరకు రూ. 43,668 కోట్లు, జూన్‌ 2012 నుండి జూన్‌ 2013 వరకు రూ. 24,475 కోట్లు, జూన్‌ 2013 నుండి జూన్‌ 2014 వరకు రూ. 11,911 కోట్లు, జూన్‌ 2014 నుండి 2015 వరకు రూ. 9,147 కోట్ల నిధులు మార్కెట్లో సమీకరించాల్సి ఉంటుంది.

4. పై 183 కంపెనీలలో 148 కంపెనీలు ప్రయివేటు రంగంలోను, 35 కంపెనీలు ప్రభుత్వ రంగంలోను ఉన్నాయి.

5. ప్రభుత్వరంగ సంస్థలలో హిందూస్థాన్‌ కాపర్‌, యం.యం.టి.సి, నైవేలి లిగ్‌నైట్‌, యన్‌.టి.పి.సి, యన్‌.హెచ్‌.పి.సి, పవర్‌ గ్రిడ్‌ , భారత్‌ ఎలక్ట్రానిక్స్‌, యునైటెడ్‌ బ్యాంకు, ఐ.ఒ.సి మొదలైనవి ఉన్నాయి.

6. ప్రయివేటు రంగంలో డి.యల్‌.ఎఫ్‌, విప్రో, రిలయన్స్‌ పవర్‌, సన్‌ టి.వి, టాటా టెలికమ్యూనికేషన్స్‌ మొదలైనవి ఉన్నాయి.

7. వచ్చే దశకం సగం భాగం ఎఫ్‌.పి.ఒల యుగంగా మారనున్నది.

స్పందనలు-

1. ప్రభుత్వరంగ సంస్థల వాటాల ఉపసంహరణకు ఈ చర్యలు ప్రధానంగా దారితీస్తాయి. అందువల్ల ఈ మార్గ దర్శక సూత్రాల నుండి ప్రభుత్వరంగాన్ని మినహాయించాలని ప్రభుత్వ రంగ పరిరక్షణ సంఘాలు కోరుతున్నాయి.

2. ప్రజల వాటా విస్త్రృతి పెంచటం క్యాపిటల్‌ మార్కెట్‌ నియమాలలో ఆరోగ్యకర పరిణామమే. 1993 పూర్వంలోని పబ్లిక్‌ వాటాల స్థాయికి పబ్లిక్‌ హౌల్డింగ్‌ను తీసుకువెళ్ళడం శ్రేయస్కరం. తాజా మార్గదర్శక సూత్రాల వల్ల లబ్ది పొందే సామాన్య మదుపదుల సంఖ్య చాలా స్వల్పమైనదని సామాన్య నిపుణులు ఆభిప్రాయపడుతున్నారు (దేశ జనాభాలో షేర్‌ల మదుపు దారులు రెండు శాతం కంటే తక్కువ).

3. జనవరి 2008 సం||లో రూ. 74,48,000 కోట్ల మార్కెట్‌ సమీకరణ కలిగిన భారత స్టాక్‌ మార్కెట్‌ మే 2010 నాటికి రూ.43,75,020 కోట్లు మాత్రమే ఉంది. అత్యధిక బూమ్‌ ను చూసిన 2007 వ సం||లో పబ్లిక్‌ షేర్లు అత్యధికంగా రూ. 59,000 కోట్లు మాత్రమే ట్రేడ్‌ అయినాయి. యూరప్‌ పరిణామాల దుష్ప్రభావాలు ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకుంటున్నాయి. మార్కెట్‌ నిరుత్సాహంగా, నిశ్చేజంగా ఉన్న నేపధ్యంలో మదుపుదారులు తగ్గుతున్నారు. ఈ స్థితిలో ఈ మార్గదర్శక సూత్రాల అమలు, విలువైన షేర్‌లను తెగబడి అమ్మే సంస్రృతికి నెట్టబడుతుందని, ఇది సరిఅయిన సమయం కాదని కార్పోరేట్‌ మార్కెట్‌ వర్గాలు అభిప్రాయబడుతున్నాయి.

4. ఈ చర్యలు అంతిమంగా అత్యధిక ధనవంతులకు, సంస్థాగత పెట్టుబడిదారులకు మాత్రమే ప్రయోజనం కలిగించేవిగా అభ్యుధయ వాదులు భావిస్తున్నారు. కారణాలేవైనా అన్ని వర్గాలలో పై మార్గదర్శక సూత్రాల అమలు పై విముఖత పెరుగుతుంది.

Monday, June 7, 2010

భారత దేశం లో పేదరిక రేఖ పై విభిన్న దృక్పధాలు

ప్రపంచీకరణ వేగవంతమవడంతో పేదరికం గురించిన చర్చ దశ, దిశ మారాయి. ఆర్థిక వేత్తలు రెండు శిబిరాలుగా చీలారు ఇందులో ఒకటి ప్రపంచీకరణ విధానాలు పేదరిక నిర్మూలనకు దోహదపడ్డాయన్నది. రెండవది ఈ ఆర్థిక విధానాలు పేదరికాన్ని తీవ్రంగా పెంచాయన్నది. ఈ వాదనలకు అనుగుణంగా వివిధ దేwwdoit2.jpg poverty image by chelseamuhxree

శాలపై పేదరిక గణాంకాలు వివిధ రకాలుగా వెలుగులోకి వచ్చాయి. అదే పద్ధతిలో భారత దేశంలో పేదల సంఖ్యపై విభిన్నమైన, పరస్పర విరుద్ధమైన ప్రమాణాలు చర్చకు వచ్చాయి. భిన్న గణాంకాలు తెరమీదకు వచ్చాయి.

భారతదేశంలో విభిన్న పేదరిక గణాంకాలు- భారతదేశంలో ఆర్థిక సంస్కరణల అవసరాలకు అనుగుణంగా నూతన చర్చకు తెరలేపింది లక్డావాలా కమిటి అని చెప్పవచ్చు. ఇప్పటికి ఖరారైన పేదరిక ప్రమాణాలకు 2004-05 సం|| ప్రమాణాలు ఆధారంగా ఉన్నాయి. అధికారికంగా ప్లానింగ్‌ కమీషన్‌ నిపుణుల బృందం నిర్ధారించిన పేదరిక గణాంకాల ప్రకారం మన దేశంలో పట్టణ ప్రాంతాలలో 25.7%, గ్రామీణ ప్రాంతాలలో 28.3% పేదలున్నట్లు తెలుస్తుంది. ఇదే సందర్భంలో కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ, మాజీ ప్రణాళికా సంఘ సభ్యుడు యన్‌.సి. సక్సేనా నాయకత్వంలో చేపట్టిన అధ్యయనాల ప్రకారం మన దేశంలో పేదలు 50%గా ఉన్నట్టు తేలుతున్నది. అర్జున్‌ సేన్‌ గుప్తా నాయకత్వంలో పారిశ్రామిక సంస్థలలో అసంఘటిత రంగంపై అధ్యయనానికి నియమించిన జాతీయ కమీషన్‌ మన దేశంలో 77% మంది రోజుకు రూ.20/- లు అంత కంటే తక్కువ ఆదాయంతో జీవనం గడుపుతున్నారని ప్రకటించారు. ఆర్థిక వృద్ధి కేవలం లాభార్జనే పరమావధిగా ఉండకూడదని, సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజల జీవన స్థితిగతుల్ని గణనీయంగా మెరుగుపరిచేదిగా ప్రణాళికలుండాలని ఈ అధ్యయన బృందం అభిప్రాయపడింది. ఈ విధంగా భిన్న ఆధ్యయనాలు, భిన్న నిర్ధారణలకు రావడానికి కారణం అర్థికవేత్తల సామాజిక దృక్పథంలో ఉన్న వైవిధ్యమే.

వేరువేరు అధ్యయనాలతో కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఆర్థిక సంస్కరణలు పేదరిక నిర్మూలనకు దోహద పడుతున్నాయని పాలక వర్గాలు చేస్తున్న ప్రచారం బెడిసికొట్టింది. కేంద్ర ప్రణాళికా సంఘం పేదరిక నిర్ధారణపై అధ్యయనానికి మార్చి 2009లో సురేష్‌ టెండూల్కర్‌ నాయకత్వంలో మరొక నిపుణుల బృందాన్ని నియమించింది. ఈ బృందం కూడా 2004-05 సం||లో ఖరారైన పేదరిక ప్రమాణాలను ప్రాతిపదికగా తీసుకుంది. ఈ బృందం ఖరారు చేసిన నివేదికలో పట్టణ ప్రాంతాలలోని పేదలు 25.7%గా యథాతథంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పేదలు 28.3% నుండి 41.8% పెరిగి దేశవ్యాప్తంగా పేదలు 27.5% నుండి 37.2% పెరిగినట్లు నివేదిక పేర్కొన్నది. గతంలో జరిగిన వివిధ అధ్యయనాలకు భిన్నంగా టెండూల్కర్‌ కమిటి పేదరిక నిర్ధారణలో పౌష్ఠికాహార వినియోగంతో పాటు విద్య, వైద్య అవసరాలను పరిగణలోకి తీసువాలన్నది. అదే సందర్భంలో పట్టణ ప్రాంతాల్లో వినియోగమైన రూ. 19/- (రోజుకు) లలో విద్య, వైద్య ఖర్చులు ఇమిడి ఉన్నాయని చెప్తూ నూతన పేదరిక ప్రమాణాలను నిర్ధారించటానికి ప్రయత్నించింది. యన్‌.సి.సక్సేనా, అర్జున్‌ సేన్‌ గుప్తా కమిటీల అధ్యయనాలలో తేలిన పేదరిక పెరుగుదలతో కంగారు పడ్డ పాలక వర్గాలు టెండూల్కర్‌ కమిటి నివేదికతో ఊపిరిపీల్చుకుని, కమిటి సిఫార్సులను అమోదించాయి. మూడు నివేదికల సారాంశం సంస్కరణల తరువాత పేదరికం పెరిగిందన్నదే.

టెండూల్కర్‌ కమిటి సిఫార్సులపై విమర్శలు - టెండూల్కర్‌ కమిటి సిఫార్సులపై వివిధ ఆర్థిక, సామాజిక రంగాల నిపుణులు తీవ్రమైన అభ్యంతరాల్ని వ్యక్తం చేసారు.

1. మౌలిక పౌష్ఠికాహార వినియోగ ప్రమాణాలను నీరు కార్చటం- ఆదాయం పై కాకుండా పౌష్ఠికాహార వినియోగంపై ఆధారపడి పేదరిక రేఖ అంచనాలు వేయాలని 1957,1979 సం||లలో ప్లానింగ్‌ కమీషన్‌ నిపుణుల బృందం నిర్ధారించింది. భారత వైద్య పరిశోధన కౌన్సిల్‌ నిర్ధారణ మేరకు తీవ్రమైన పనుల్లో ఉన్న మగవారు 3800 కేలరీలు, ఆడవారు 2925 కేలరీల పౌష్ఠికాహారాన్ని వినియోగించుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ప్లానింగ్‌ కమీషన్‌ నిపుణుల బృందం పట్టణ ప్రాంతాలలో 2100 కేలరీలు, గ్రామీణ ప్రాంతాలలో 2400 కేలరీల పౌష్ఠికాహార వినియోగాన్ని పేదరిక ప్రమాణ నిర్ధారణకు నిర్ణయించింది. కానీ టెండూల్కర్‌ కమిటి సిఫార్సులలో ఈ పౌష్ఠికాహార ప్రమాణాలను పట్టణ ప్రాంతాల్లో 1795 కేలరీలు, గ్రామీణ ప్రాంతాలలో 1820 కేలరీలుగా నిర్ణయించి అంచనాలు తయారు చేసింది. ఇందుకు ప్రపంచ ఆహార సంస్థ భారతదేశ పౌష్ఠికాహార వినియోగ ప్రమాణం 1800 కేలరీలు చాలునన్న సిఫార్సుల్ని సాకుగా చూపింది. ఈ ప్రమాణం అనేక అబివృద్ధి చెందిన దేశాల పౌష్ఠికాహార వినియోగ ప్రమాణాల కంటే తక్కువగా ఉండటం గమనార్హం. పౌష్ఠికాహార వినియోగ ప్రమాణాల్ని తగ్గించి తయారు చేసే పేదరిక నిర్ధారణ అంచనాలు తప్పని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. భారతదేశ పౌష్ఠికాహార ప్రమాణాలు ఈ దేశంలోనే నిర్ణయించబడాలని ప్రతిపాదిస్తున్నారు. పౌష్ఠికాహార ప్రమాణాలను తగ్గించాల్సిన పరిస్థితులు ఏమి లేవని అభిప్రాయపడుతున్నారు.

2. లోపభూయిష్టమైన ధరల సూచి- 1973 ధరల ఆధారంగా గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ.49/- లు పట్టణ ప్రాంతాలలో నెలకు రూ. 57/-లు కంటే తక్కువ పౌష్ఠికాహార వినియోగం కలవారు పేదలుగా పరిగణించటం ఈనాటికీ ప్రమాణంగానే ఉంది. కానీ దీనిని వినియోగదారుల ధరల సూచి ఆధారంగా పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేస్తున్నారు. వాస్తవంగా వినియోగదారుల ధరల సూచి వాస్తవ జీవన వ్యయాన్ని సక్రమంగా ప్రతిబింబించలేదన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల లోపభూయిష్టమైన ధరల సూచి ఆధారంగా చేసే అంచనాలు వాస్తవాలను ప్రతిబింబించవు.

3. అమలులో ఉన్న పేదరిక రేఖ పౌష్ఠికాహార వాస్తవ అవసరాలతో పాటు జీవించటానికి కావలసిన నివాసం, గుడ్డ, ఆరోగ్య రక్షణ, పారిశుధ్యం, సాగునీరు, విద్య లాంటి మౌలిక అవసరాలను నిర్లక్ష్యం చేస్తున్నది.

4.జనాభా పెరగడం మూలకంగా తగ్గే పేదరిక శాతాన్ని, పేదరికం తగ్గినట్లుగా పరిగణించకూడదు.

5. పై వాదనల ఆధారంగా అంచనావేసే వాస్తవ పేదరికం అధికారికముగా ప్రకటించే పేదరికానికి రెండింతలు ఉంటుందని. నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ముగింపు - ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులైన మాంటెక్‌ సింగ్‌ అహుల్వాలియా టెండూల్కర్‌ కమిటి సిఫార్సులను ఆమోదిస్తూ, పేదరిక ప్రమాణాల నిర్ధారణలో విద్య, వైద్యం లాంటి మౌళిక అవసరాల్ని పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించారు. కానీ మౌలికంగా పేదరిక రేఖ నిర్ధారణలో జరుగుతున్న పొరపాటు అవగాహనలు, తప్పుడు వ్యాఖ్యలు సరికాకుండా వాస్తవ పేదరిక రేఖ నిర్ధారణ ఎండమావియే.

Saturday, June 5, 2010

సామర్థ్యాల పేదరికం - పరిచయం

See full size imageసాపేక్ష నిరాకరణ (రెలెటివ్‌ డిప్రివేషన్‌) భావనకు కొనసాగింపుగా ''సామర్థ్యాల అవగాహన'' (కేపబిలిటీస్‌ అప్రోచ్‌) మరింత మెరుగ్గా పేదరికాన్ని నిర్వచించినది. ఈ అవగాహనకు రూపశిల్పి నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌. ఈ అవగాహనలో మానవ జీవిత నిర్వహణలోని ''సామర్థ్యాల పాత్రను'' ఆయన విశిష్టంగా విశ్లేషిస్తారు. సామర్థ్యాల పేదరికంపై ఆయన వాదనలు ఇలా ఉన్నాయి. సామర్థ్యాల నిరాకరణ - పేదరికాన్ని ఆదాయాల్లో కొరత (జీవనభృతి) ప్రమాణాలలో కంటే సామర్థ్యాల నిరాకరణ (డిప్రివేషన్‌ ఆఫ్‌ కేపబిలిటీస్‌)గా చూడాలి. సామర్థ్యాల నిరాకరణ అవగాహనలోనే, ఆదాయాల్లో కొరత భావన ఇమిడివుంది. సామర్థ్యాల కొరత/నిరాకరణ కున్న అనేక కారణాలలో ఆదాయ కొరత/నిరాకరణ ఒకటి మాత్రమే. సామాన్యంగా ఆదాయాల కొరత/నిరాకరణ, సామర్థ్యాల కొరత/నిరాకరణకు దారితీస్తుంది. అందువలన సామర్థ్యాల నిరాకరణను ఆమోదించడమంటే పేదరికంపై ఆదాయకొరత అవగాహనను నిరాకరించడం కాదని అమర్త్యసేన్‌ అభిప్రాయపడ్డారు.

వివరణ - సామాన్యంగా సామర్థ్యాలను మానవుడు సరుకులు, వాటి లక్షణాల నుండి పొందుతాడు. ఈ సామర్థ్యాలే అంతిమంగా మానవుని అవసరాలను తీర్చగల్గుతాయి. ఉదాహరణకు సైకిల్‌ ఒక సరుకు. దాని ప్రధాన లక్షణం రవాణా చేయటం. అది మనిషిని ఒక చోట నుండి మరొక చోటికి త్వరగా చేర్చ కలిగే మానవ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ రకం సామర్థ్యాలే మానవుని జీవన ప్రమాణాల్ని మెరుగుపరుస్తాయి. ఈ ప్రక్రియనే సరుకుల్ని ప్రయోజనాత్మకంగా మార్చుకోవటం (ఫంక్షనింగ్‌) అంటారు. జీవన ప్రమాణాల మెరుగుదలలో సరుకులు, వాటి వినియోగాలే కాకుండా, మానవ సామర్థ్యాల పాత్ర కీలకమని అమర్త్యసేన్‌ వాదిస్తారు. సుదీర్ఘంగా ఆరోగ్యవంతమైన, విద్యావంతమైన జీవితాన్ని గడపటానికి కావలసిన పోషణ కరువైనప్పుడు మౌలిక సామర్థ్యాలు కొరవడుతాయని, ఫలితంగా జీవన ప్రమాణాలు క్షీణిస్తాయని, అందువల్ల సామర్థ్యాల నిరాకరణే పేదరికంగా అమర్త్యసేన్‌ నిర్వచించారు. పేదరికమంటే కూడు, గూడు, గుడ్డ తోపాటు ఆరోగ్యం, విద్య, స్వేచ్ఛ లేకపోవటం లేక నిరాకరింపబడటం. పేదరిక నిర్వచనం విసృతమైనది.

సామర్థ్యాలపై వివిధ ప్రభావాలు - సామర్థ్యాలపై (ఆదాయం పై కంటే ) వివిధ ప్రభావాలుంటాయి. 1. వయస్సు - యుక్తవయస్సు కంటే వృధ్ధాప్యంలో సామర్ధ్యంలో తేడా ఉంటుంది. వాళ్ళ అవసరాలు భిన్నంగా ఉంటాయి. 2. లింగభేదం, సామాజిక పాత్ర - గర్భధారణ బాధ్యత, ఆచారపరంగా నిర్వహించాల్సిన కుటుంబ బాధ్యతలు సామర్థ్యాలపై ప్రభావం చూపిస్తాయి. 3. స్థితి/స్ధానం - వరదలు, కరువుకాటకాలు, అభద్రత, హింస ఎక్కువగా ఉండే ప్రాంతాలలో సామర్థ్యాలపై వాటి ప్రభావం తీవ్రంగా ఉంటుంది.4. అంటువ్యాధులు - అంటువ్యాధులు తరచు సోకే ప్రాంతాలలో ప్రజల సామర్థ్యాలపై వాటి ప్రభావం అధికంగా ఉంటుంది. 5. మానవుని అదుపు లేని వివిధ పరిస్థితులు మానవ సామర్థ్యాలపై ప్రభావాన్ని చూపిస్తాయి.

ఆదాయం, సామర్థ్యాలు - 1. వృద్ధాప్యం, అంగవైకల్యం మనిషి సంపాదనపై పరిమితులను ఏర్పరుస్తాయి. సరుకుల్ని ప్రయోజనాత్మకంగా మార్చుకోవడంలో వారి మధ్య అనేక వ్యత్యాసాలు ఉంటాయి. వృద్ధులు, అంగవైకల్యులు, అనారోగ బాధితులు సగటు మనిషి జీవన ప్రమాణాలను సాధించటానికి ఎక్కువ ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. వీటి ప్రభావం వారి సామర్థ్యాలపై అధికంగా ఉండి, వారి వ్యయ ప్రాధాన్యతలను తారుమారు చేస్తున్నాయి. అందువల్ల వీరికి ప్రభుత్వ చర్యలు అవసరమై ఉంటాయి. 2. లింగవివక్ష కొన్ని కుటుంబాలలో కొన్ని వైరుధ్యాలను సృష్టిస్తుంది. లింగవివక్ష పాటించే ప్రాంతాలలో మగవారికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, కుటుంబ వనరులను అత్యధికంగా కేటాయించటం మూలకంగా, కుటుంబంలో మహిళలకు అందించగలిగే వనరులు కొరవడి అవి వారి సామర్థ్యంపై ప్రభావాన్ని కల్గిస్తాయి. లింగసమానత్వం ఉందనుకున్న యూరప్‌లోని ఇటలీలో జాతీయ ఆదాయంలో మహిళా శ్రమశక్తి గుర్తింపబడలేదు. అందువలన ఆదాయాలపరంగా సాపేక్ష నిరాకరణ, సామర్థ్యాల పరంగా సంపూర్ణంగా ఉండి సంపూర్ణ పేదరికానికి (ఆబ్జల్యూట్‌ పావర్టి) దారితీస్తుంది. 3. సామాజిక కార్యక్రమాలలో పాల్గొననివ్వని ''సామాజిక వెలివేత'' విధానాలు మానవ సామర్థ్యాలపై ప్రభావం కలిగి ఉంటాయి. టి.వి, వీడియో ప్లేయర్లు, ఆటోమోబైల్స్‌ అత్యధికంగా ఉత్పత్తి అయ్యే ధనిక దేశాలలో, వాటి నిరాకరణ కూడా సామర్థ్యాల నిరాకరణకు దారితీయవచ్చు.

సామర్థ్యాల పేదరిక విశ్లేషణలు, ''సామర్థ్యాల పేదరిక'' నిర్వచనాల యొక్క స్వభావం, కారణాలపై అవగాహనను పెంచుతుంది. అది పేదరిక నిర్మూలన సాధనాల కంటే, పేదరికానికి మూలమైన సమస్యలను వెదికి, వాటి పరిష్కారానికి కేంద్రీకరిస్తుంది.

వనరులపై హక్కును పొందటం (ఎన్‌టైటిల్‌మెంట్‌)- అమర్త్యసేన్‌ సామర్థ్యాలపై చేసిన సూత్రీకరణలతో పాటు, వనరులపై స్వాధీన హక్కును పొందే (ఎన్‌టైటిల్‌మెంట్‌) ప్రక్రియపై చేసిన వాదనలు ప్రముఖమైనవి. సమాజంలో వనరులు విస్తారంగా ఉండవచ్చుకాని, వాటి అవసరాలున్న ప్రజానీకం వాటిని సేకరించుకోగలిగే హక్కు కల్గియుండాలి. ఆ హక్కు భూమి కావచ్చు, జీవనభృతి, వేతనాల రూపంలో గాని ఉండవచ్చు లేదా ప్రభుత్వ జోక్యంతో సంక్రమించవచ్చు. లేని పక్షంలో మానవ సామర్థ్యాలు చైతన్యాలుడిగి నీరుకారి పోతాయి. అమర్త్యసేన్‌, ''కరువుకాటకాలలో మగ్గుతున్న ప్రజల్ని ఉదహరిస్తూ, వారు ఆహార పదార్థాల నందుకొనే హక్కు కల్గియుంటే, వారి సామర్థ్యాలు నిలబడతాయి. లేకపోతే కరువుకాటకాలతో బాధపడటమే వారికి సంక్రమించిన హక్కుగా భావించవలస ివుంటుంద''న్నారు. అందువల్లే వన రులపై హక్కులు లేకపోవడమే సామర్థ్యాల నిరాకరణగా, అదే పేద రికంగా అమర్త్యసేన్‌ పేదరికంపై నిర్వచనాన్ని విసృత పరిచారు.

సామర్థ్యాలు, వనరులపై హక్కు సాధనకు స్వేచ్ఛ అనివార్యమైంది - తమ దగ్గర ఉన్న సంపదను ఉపయోగించుకొని సామర్థ్యాల మెరుగుదలకు అవసరమైన సుదీర్ఘ జీవనం, ఆరోగ్యం, చలనం లాంటి జీవన ప్రమాణాలు వాటంతటవే ప్రజలదగ్గరకు రావు. వాటిని ఎన్నుకోకలిగి, సాధించగలిగే స్వేచ్ఛ అవసరమని, అందుకు రాజకీయ, పౌర స్వేచ్ఛలు కావాలని అమర్త్యసేన్‌ అభిప్రాయపడ్డారు. రాజకీయ, పౌర స్వేచ్ఛలను సాధించటానికి, అనుభవించటానికి హక్కులు అవసరమని, ఈ హక్కుల సాధనకు సంఘాలు ఏర్పాటు చేసుకోవటం, దానికి చట్టబద్ధత, చట్టపరమైన భద్రత అనివార్యమైనదన్నారు. ఇదంతా జరిగితే వ్యవస్థ స్వరూప స్వభావాలే మారిపోవచ్చు. అందుకనే పాలక వర్గాలు పై వాదనలకు అనేక ప్రతివాదనలను ముందుకు తెస్తున్నాయి. సంపద సృష్టిలో శ్రమ శక్తికి మానవ సామర్థ్యాల కల్పన ముందస్తు షరతుగా ''కారల్‌ మార్క్సు'' చేసిన సూత్రీకరణ, సామర్థ్యాల పేదరికంపై మరింత స్పష్టతనిస్తుంది.


Sunday, May 30, 2010

భారతదేశంలో పేదరిక నిర్ధారణప్రమాణాలు- పరిచయం

భారతదేశంలో పేదరిక నిర్ధారణప్రమాణాలు- పరిచయం

మొదటి భాగం

See full size image

19వ శతాబ్దంలో కనీస పౌష్టికాహార లభ్యత ప్రాతిపదికన నిర్వచించబడ్డ ''పేదరికం'' ఆర్థికాంశంగాను కొనసాగుతూ వచ్చింది. 1970 నాటికి కనీస మౌలికాంశాల ప్రాతిపదికన పేదిరిక నిర్వచనం ఆర్థికాంశం గానే విసృతమైంది. ఫైనాన్స్‌ పెట్టుబడి ఆర్థిక వ్యవస్థలపై పట్టు బిగించి ఆధిపత్యాన్ని కొనసాగించే క్రమంలో సంక్షేమ ఆర్థిక వ్యవస్థ పునాదులు వివిధ దేశాలలో నిర్వీర్యమయ్యాయి ఈ నేపథ్యంలో పేదరిక నిర్వచనాన్ని ఆర్థికాంశం నుండి సామాజికాంశంగా మార్పు చేసే పరిశోధనలు ముమ్మరమయ్యాయి. ఈ దిశలోనే ప్రముఖ ఆర్థిక వేత్తలు అమర్త్యసేన్‌, అర్కిన్‌సన్‌ తదితరులు ప్రతిపాదించిన సామర్థ్యాల నమూనా (కేపబులిటిస్‌ అప్రోచ్‌) పేదరిక నిర్వచన స్వరూప స్వభావాల్ని మార్చేసింది. మానవాభివృద్ధి అవగాహన (హ్యూమన్‌ డెవలెప్‌మెంట్‌ అప్రోచ్‌) దర్పణంలో నూతన పేదరిక అంచనాలు ముందుకు వచ్చాయి.

ప్రపంచ బ్యాంకు దృష్టిలో పేదరికం-వివిధ దేశాలు వివిధ రకాలుగా పేదరికాన్ని నిర్వచిస్తూ , పేదరిక రేఖల్ని రకరకాలుగా ప్రమాణికరించాయి. ''కనీస జీవన ప్రమాణాలు గల జీవితాన్ని పొందలేక పోవటమే పేదరికంగా'' ప్రపంచబ్యాంకు నిర్వచించుకుంది ఈ ప్రమాణాలలో రెండు అంశాలు చోటు చేసుకున్నాయి. ఒకటి పౌష్ఠికాహారము, ఇతర కనీస అవసరాలు. రెండవది సమాజంలో జీవించటానికి ప్రతిరోజు అయ్యే ఖర్చు. కాని అభివృద్ధి చెందుతున్న దేశాలకు నిర్ధారించే పేదరిక ప్రమాణాలలో ప్రపంచబ్యాంకు రెండవ అంశాన్ని పక్కన పెట్టింది.

కనీస పౌష్ఠికాహార వినియోగ ప్రాతిపదికనే పేదరికాన్ని కొలవటానికి ప్రమాణాల్ని తయారు చేసింది. ప్రపంచబ్యాంకు దృష్టిలో రోజుకు ఒక డాలర్‌ (అమెరికన్‌) కంటే తక్కువ ఆదాయం కలవారిని పేదలుగాను (1985 ధరలననుసరించి), డాలర్‌లో 3/4 వంతు కంటే తక్కువ ఆదాయం కలవారిని నిరుపేదలుగాను సూత్రీకరించింది. ఈ ప్రమాణాలననుసరించి భారతదేశంలో పేదలు 75%గా అంచనా వేస్తున్నారు.

భారతదేశంలో పేదరికంపై అంచనాలు-

స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటగా 1957లో జరిగిన భారత కార్మిక సమావేశంలో పేదరికాన్ని నిర్వచించే ప్రతిపాదనలు చేయబడ్డాయి. దీని కొనసాగింపుగా ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలోని ఒక కార్యనిర్వాహక బృందం పౌష్ఠికాహార వినియోగ ప్రాతిపదికన పేదరిక రేఖను నిర్ధారించింది. దీనినే కేలరీల ఆధారిత పేదరిక రేఖ అంటారు. ఆ నిపుణుల బృందం నెలకు రూ. 20/- లోపు ఆదాయం కల వారిని పేదలుగా పరిగణించింది. 1979లో ప్రణాళికాసంఘం పేదరికాన్ని తిరిగి నిర్వచించటానికి ఒక టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. సుధీర్ఘమైన చర్చలనంతరం ఆ బృందం క్యాలరీల ఆధారంగానే పేదరిక రేఖను నిర్ధారించటానికి నిర్ణయించి, పేదరిక ప్రమాణాలను గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంతాలకు వేరువేరుగా నిర్వచించింది. ఈ ప్రమాణాలను బట్టి 1973 ధరల ఆధారంగా గ్రామీణ ప్రాంతాలలో నెలకు రూ. 49/-, పట్టణ ప్రాంతాలలో రూ. 57/-లు కంటే తక్కువ ఆదాయం కలవారు పేదలుగా వర్గీకరించింద

ఈ ప్రాతిపదిక ఆధారంగానే ఈనాటికి భారతదేశంలో పేదరికాన్ని నిర్వచిస్తున్నారు. కానీ ద్రవ్యోల్బణానికి అనుబంధమైన ధరల సూచి ప్రాతిపదికన గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నెలసరి ఆదాయ పరిమితులను సరిచేస్తున్నారు. 1999-2000లలో గ్రామీణ ప్రాంతాలలో రూ.327/-లు, పట్టణ ప్రాంతాలలో రూ. 454/-లు లోపు నెలసరి ఆదాయాలను పేదరిక రేఖ ప్రమాణాలుగా తీసుకుంటే 2004-05 నాటికి గ్రామీణ ప్రాంతాలలో రూ. 356/-లు, పట్టణ ప్రాంతాలలో రూ. 538/-లు నెలసరి ఆదాయాల లోపు ప్రజలను పేదలుగా నిర్ధారిస్తున్నారు.పేదరిక రేఖపై భారతదేశంలో జరిగిన అధ్యయనాలలో పి.డి.ఒజా, ఆర్‌.యన్‌.మిన్హాన్‌, బి.యమ్‌.దండేకర్‌, రాథ్‌, జాతీయ శాంపుల్‌ సర్వే సంస్థ, ప్రణాళికా సంఘం నిర్వహించినవి ప్రముఖమైనవి. ఈ ఆధ్యయనాలన్నీ పౌష్ఠికాహార ప్రాతిపదికపై పేదరికాన్ని అంచనా వేయబడ్డవే. టెండూల్కర్‌ కమిటీ అధ్యయనాలలో అదనంగా సామాజిక అంశాలు చోటుచేసుకోవటంతో పేదరికరేఖపై విసృత చర్చలు మొదలయ్యాయి. భారతదేశంలో పేదరికరేఖ నిర్ధారణా అంచనాలపై, వాటి విశ్వాసనీయతపై అనేక విమర్శలు చోటుచేసుకున్నాయి. అనేక దశాబ్ధాలుగా వివిధ ఆర్థికవేత్తలు సామాజికవేత్తలు ప్రజాసంఘాలు భారతదేశంలో మౌలికాంశాల ఆధారంగా పేదరిక రేఖ నిర్ధారణ జరగాలని పట్టుబడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో సామర్థ్యాల ప్రాతిపదికన పేదరికం నిర్ధారణ ఆవశ్యకత ఎంతగానో వుంది.

Sunday, May 16, 2010

సామాజిక, ఆర్థిక భావనగా పేదరికం-ఒక పరిచయం

టెండూల్కర్‌ కమిటీ నివేదిక అనంతరం పేదరికం నిర్వచనంపై, దారిద్య్రరేఖ ప్రమాణాలపై మొదలైన విస్తృత చర్చ ఆహర భధ్రత హక్కు చట్టం గురించిన చర్చతో వేడెక్కింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్న క్రమంలోనూ, ప్రపంచీకరణ విధానాల ప్రభావంతో పెరుగుతున్న అసమానతలతోనూ, ప్రభుత్వ సహాయానికై ఎదురుచూస్తున్న ప్రజానీకంపై పేదరిక నిర్వచనాలు, దారిద్య్రరేఖ ప్రమాణాల ప్రభావం ఎంతగానో ఉంటుంది. పేదరికాన్ని అవగాహన చేసుకోవటంలో, దాని నిర్మూలనకు కృషి చేయటంలో శతాబ్ధాలుగా, మానవ సమాజం, మేధావులు నిమగమై ఉన్నారు. అయినప్పటికీ పేదరికంపై నిర్ధిష్టమైన, విశ్వవ్యాప్తమైన నిర్వచనం రూపొందలేదు. 19వ శతాబ్ధం నుండి పేదరికం గూర్చి జరుగుతున్న చర్చను 3 భాగాలుగా విభజించవచ్చు. అవి జీవనభృతి(ఆదాయం), మౌలిక అవసరాలు, సాపేక్ష నిరాకరణలు గూర్చిన చర్చలు.

1) జీవనభృతి(ఆదాయం): జీవన భృతిపై ఆధారపడ్డ భావన విక్టోరియన్‌ ఇంగ్లాండ్‌లోని పౌష్టికాహార శాస్త్రవేత్తల కృషి నేపధ్యంలో ఏర్పడింది. పారిశ్రామిక విప్లవ నేపధ్యంలో ఉత్పత్తి క్రమంలో మానవ శ్రమ ప్రాధాన్యతను గుర్తించిన కాలమిది. కార్మి కులను శక్తి వంతంగా, ఆరోగ్య వంతంగా ఉంచటానికి (భౌతిక సమర్ధత) కావలసిన జీవిత అవసరాలకు తగ్గట్టు ఆదాయ ప్రమా ణాలను నిర్ధారించటం ఇందులో ముఖ్యమైనది. భౌతిక సమర్థ తను నిలబెట్టగలిగే కనీస జీవితావసరాలకు సరిపడని జీవన భృతి గల కుటుంబాలను పేద కుటుంబాలుగా నిర్వచించే వాళ్ళు. ఇంటి అద్దె మినహాయింపబడిన భృతి దారిద్య్రరేఖ ప్రమా ణాల కంటే దిగువ నుంటే పేద కుటుంబాలుగా పరిగణించేవారు. దారిద్య్రరేఖ రూపకల్పనలో ఆదాయ స్థాయిలో గుడ్డ, ఇంధనం, కొన్ని ఇతర అవసరాలకు చోటు కల్పించినా వాటి స్థాయి చాలా తక్కువగా ఉండేది. ఆహార వ్యయానికి అత్యధిక ప్రాధాన్యత నిచ్చేవారు.

ప్రభావం: ఈ భావన వంద సంవత్సరాల పాటు వివిధ శాస్త్ర అధ్యయనాలను, అంతర్జాతీయ, జాతీయ విధానాల్ని గణనీయంగా ప్రభావితం చేసింది. సామాజిక స్థితిగతుల్ని వివరించటానికి వివిధ దేశాల స్థాయిల్లోనూ, ప్రపంచబ్యాంకు తదితర అంతర్జాతీయ సంస్థల స్థాయిలలోనూ, గణాంక కొలమానాల రూపకల్పనకు ఇది ప్రాతిపదిక అయ్యింది. అప్పటి బ్రిటీష్‌ సామ్రాజ్యంలోని అనేక దేశాలలో ఈ అవగాహన విస్తృతంగా ప్రచారం చేయబడింది. బ్రిటీష్‌ సామ్రాజ్యంలోని దక్షిణాఫ్రికాలో నల్లజాతి కార్మికుల వేతన నిర్ణయంలోను, మలేషియా, భారత దేశాలలోని అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనలోను ఈ భావన పునాదిగా నిలిచింది.

విమర్శలు: అదే సందర్భంలో ఈ భావన అనేక విమర్శలకూ గురైంది. ''మానవ అవసరాలు, సామాజిక అవసరాలతో నిమిత్తం లేని భౌతిక అవసరాలేనా?'' అనే ప్రశ్న ప్రధానంగా ఎదురైంది. ''భౌతికశక్తికి కావాల్సిన వనరుల్ని సమీకరించుకోవాల్సిన ప్రజలు కేవలం వ్యక్తిగత జీవులే కాదు, వారు సమాజంలోని కార్మికులు, పౌరులు, తల్లిదండ్రులు, స్నేహితులు. ఇలా సమాజ నిర్వహణలో వారి పాత్ర విస్తృతమైంది. వారు సామాజిక జీవులు కూడా. అలాగే వారు భౌతిక వస్తువుల వినియోగదారులే కాదు, వాటి ఉత్పత్తికి సృష్టికర్తలు కూడా. అందువల్ల వారు వ్యక్తిగత ఆదాయాలతోపాటు కుటుంబ పరంగా సమిష్టిగా అందించాల్సిన సదుపాయాలు, ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నారు. ఈ అవసరాలు విశ్వవ్యాప్తమైనవి. కేవలం ధనిక పారిశ్రామిక వ్యవస్థలకే పరిమితమైనవి కావు'' అనే వాదనలు బలంగా ముందుకు వచ్చాయి. నాటి నుండే వేతనాల నిర్ధారణకు కుటుంబ విసృత అవసరాలు, విద్య, వైద్య సదుపాయలకయ్యే ఖర్చు ప్రాతిపదికగా మారింది.

2) మౌలిక అవసరాలు: సంక్షేమ భావన వేళ్ళూనుకున్న 50,60 దశకాలలో ఆర్థిక వేత్తలు, సామాజిక శాస్త్రవేత్తల దృష్టి మరోమారు పేదరికం వైపుకు మళ్ళింది. 1970ల నాటికి మౌళిక అవసరాల భావన రూపుదాల్చింది. ''అంతర్జాతీయ కార్మిక సంస్థ'' ఈ భావనను బలంగా సమర్ధించింది. ఈ భావనలో రెండు అంశాలు చోటు చేసుకున్నాయి. మొదటిది కుటుంబానికి కావాల్సిన మౌలిక వినియోగ అవసరాలు. అవి కూడు, గుడ్డ, ఇంటికి అవసరమైన కనీస పరికరాలు. రెండవది సమాజం మొత్తానికీ కావాల్సిన అత్యవసర సేవలు. అవి రక్షిత నీరు, పారిశుద్ధ్యం, ప్రజారవాణా, ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు సాంస్కృతిక సదుపాయాలు గా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో మౌళిక అవసరాలతో పాటు అదనంగా భూమి, వ్యవసాయ పరికరాలు మరియు సేద్యం చేయగలిగే అవకాశాలు చేర్చబడ్డాయి సదరు వ్యక్తి వర్తమానం లో గౌరవ ప్రదమైన జీవితం గడపటమే అభివృద్ధికి పరమార్ధం కాదని, ఆ వ్యక్తి భాగస్వామ్యమైన కుటుంబానికి శాశ్వత ఆదాయ వనరులు ఉండాలన్న అవగాహన ఈ చర్చకు నేపధ్యం గ్రామీణ ప్రాంతాలలో భూసంస్కరణలు, పారిశ్రామికి ప్రాంతాలలో పెన్షన్‌లు శాశ్వత ఆదాయ వనరులుగా గుర్తించబడ్డాయి. మౌలిక అవసరాల భావన జీవన భృతి భావనను మెరుగుపర్చటమే. జీవన భృతి భావన పరిధి పరిమితమైనందున విధాన నిర్ణయాలు, రాజకీయ జోక్యాల ఆవశ్యకత పరిమితంగానే ఉంది. సామాజిక బాధ్యతలతో సంబంధం లేని జీవన భృతి భావన పాలకవర్గాలకు ఆకర్షణీయంగా ఉంది. కాని మౌలిక అవసరాల భావన సమాజ అభివృద్ధికి ముందస్తు షరతుల్ని విధించింది. రాజకీయ జోక్యం, విధాన నిర్ణయాల అవసరాల్ని పెంచింది. ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ ఏజెన్సీల అభివృద్ధి ప్రణాళికలలో మౌలిక అవసరాల భావన విశిష్టమైన పాత్రను నిర్వహించింది.

3) సాపేక్ష నిరాకరణ: 20వ శతాబ్ధంలో పేదరికం నిర్వచనాలలో మూడవ భావన ముందుకొచ్చింది. అది సాపేక్ష నిరాకరణ భావన. సాపేక్షంగా అతి తక్కువ ఆదాయం గల ప్రజలనే పేదలుగా పరిగణించటం సరికాదనే వాదన ఇది. పేదరికానికి, అసమానతకు మధ్య ఉన్న సంబంధాన్ని సరిగ్గా గుర్తించటం లేదని, పేదలంటే లోప భూయిష్టమైన పంపిణీ వ్యవస్థ బాధితులే కాదు, అంతకు మించి సామాజిక అవసరాలు, అవకాశాల లభ్యత పొందలేని వారు మరియు నిరాకరించబడ్డ వారిని పేదలుగా ఈ భావన పేదరికాన్ని నిర్వచిస్తుంది. పై రెండు భానలకు, సాపేక్ష నిరాకరణ భావనకు మధ్య కీలకమైన వ్యత్యాసం ఉంది. పై రెండు భావనలు పేదరికం నుండి బయటపడటానికి కావలసిన సాధనాలను చర్చిస్తే, సాపేక్ష నిరాకరణ భావన పేదరికం కారణాలపై దృష్ఠి సారిస్తుంది. ప్రపంచీకరణ ప్రపంచ సమాజాన్ని ఏకీకరణ చేసే క్రమంలో ఆర్ధిక, సామాజిక అంతరాల్ని పెంచింది. దేశాలలోని ప్రజల మధ్య, వివిధ దేశాల మధ్య అసమానతలు తారాస్థాయికి చేరాయి. ధరల సూచి ప్రాతిపదికన అమలులో ఉన్న దారిద్య్రరేఖ ప్రమాణాలు తీవ్ర విమర్శలకూ గురయ్యాయి. అందువల్లే సాపేక్ష నిరాకరణ భావన ప్రపంచీకరణ నేపధ్యంలో ప్రాధాన్యతను పొందింది. సాపేక్ష నిరాకరణ భావన కుటుంబ పరిమాణం, నమూనాను బట్టి ఆదాయ పరిధుల్ని నిర్ణయిస్తుంది. ఈ పరిధిలోకి నెట్టబడినవారు సమాజంలో బ్రతకలేనివారుగా పరిగణింపబడతారు. ఈ దిశలోనే అమర్త్యసేన్‌ రూపొందించిన సామర్ధ్యాల భావన పేదరిక నిర్వచనానికి నూతన కోణాల్ని చూపింది.

Saturday, May 15, 2010

క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌ -

అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి వేగవంతమైన విస్తరణకు వీలు కల్పిస్తు సృష్టించబడ్డ మరో నూతన ద్రవ్య ఉత్పత్తి ''క్రెడిట్‌ డిఫాల్ట్‌' శ్వాప్స్‌'' (సి.డి.యస్‌) లేదా రుణ చెల్లింపు వైఫల్య పరిహార ఒప్పందాలు. అమెరికా గృహ రుణ బూమ్‌ విజృంభణకు కొల్లెటరలైజ్‌డ్‌ డెట్‌ ఆబ్లిగేషన్స్‌ (సి.డి.ఒలు) తో పాటు క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌ (సి.డి.యస్‌.లు) కీలకమైన పాత్రను పోషిం చాయి. గ్రీసు రుణ భారాన్ని తక్కువ చేసి చూపేందుకు గోల్డ్‌ మెన్‌ శ్యాక్స్‌ రూపొందించిన క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌ తీవ్రమైన అంతర్జాతీయు ఆరోపణలకు గురికావటం ఈ మధ్య కాలంలో చూసాం.

క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌ - వీటిని సి.డి.యస్‌లుగాను లేదా రుణ చెల్లింపు వైఫల్య పరిహార ఒప్పందాలుగాను పిలుస్తారు. ఇవి డెరివేటివ్‌ల స్వభావం కలిగినవి. వీటికి ఆధారమైన రుణ ఒప్పందాల నుండి ఇవి విలువను పొందుతాయి. సి.డి.యస్‌లలో ''హామి'' అనే సేవ సరుకుగా మారుతుంది. రుణ చెల్లింపు వైఫల్యాల ప్రమాదం (రిస్క్‌) నుండి రుణ దాతకు అందించే హామి ఇది. ఈ హామికి అమ్మకందారులు, కొనుగోలు దారులు ఉంటారు. హామి అమ్మకం దారులకు, హామి కొనుగోలు దారులకు మధ్య ఏర్పడిన ద్వైపాక్షిక ఒప్పందాన్ని క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్‌ (సి.డి.యస్‌) లేదా రుణ చెల్లింపు వైఫల్య పరిహార ఒప్పందం అని అంటారు.

వివరణ - హామి కొనుగోలుదారుడు, హామి అమ్మకం దారులకు నిర్ణిత కాల పరిమితులలో ప్రీమియం లాంటి వాయిదాలు చెల్లిస్తుంటాడు. దానికి ప్రతిఫలంగా కొనుగోలు దారుడు తన బాధ్యతలో ఉన్న రుణ బకాయిలను చెల్లించలేనప్పుడు హామి అమ్మకం దారుడు ఆ బాకీని తీరుస్తాడు. స్ధూలంగా సి.డి,యస్‌. నిర్వచన సారాంశం ఇది. ఉదాహరణకు ఒక ప్రభుత్వం తమ అవసరాల కోసం నిధుల సమీకరణకు బాండులను ప్రజలకు జారీ చేస్తుంది. ఆ బాండులను కొన్న రుణ దాత ఆ బాండులపై సి.డి.యస్‌ ఒప్పందం కుదుర్చుకొని వాయిదాలు కడుతూఉంటే, బాండులు జారీ చేసిన ప్రభుత్వం ఏదైన విపత్కర పరిస్థితులలో బాండు పరిపక్వ తేదీ నాటికి దానిపై చెల్లించాల్సిన ప్రతిఫలాన్ని చెల్లించలేనప్పుడు, ఆ బాధ్యతలను సి.డి.యస్‌ ను జారీచేసిన సంస్థ నిర్వహిస్తుంది. బాండులపై గాని, వాటి ఆధారంగా సృష్టించబడ్డ సి.డి.ఒల పై గాని హక్కులను కైవసం చేసుకొని ఈ సంస్థ మరొకరికి అమ్ము తుంది. అందువల్ల ఒక రుణం ఒప్పందం పై ఒకరికి మించిన రుణ దాతలు ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే సి.డి,యస్‌ అంటే ప్రధాన రుణదాత యొక్క రుణ చెల్లింపు వైఫల్య ప్రమాదానికి వర్తిరచే ఇన్సురెన్స్‌ లాంటిది. కాని సి.డి.యస్‌లకు, ఇన్సురెన్స్‌కు మౌలిక సూత్రాలలో తేడాలున్నాయి.

సి.డి.యస్‌, ఇన్సురెన్స్‌ల మధ్య తేడా- 1.ఇన్సురెన్స్‌లో ఇన్సురెన్స్‌ కొనుగోలుదారుడు అనివార్యంగా ఇన్సురెన్స్‌ చేయబడే రుణ ఒప్పందంలో ప్రత్యక్ష భాగస్వామి కావలసియుంటుంది. ఇది ప్రత్యక్ష ఒప్పందం. అతను ఇన్సురెన్స్‌ ప్రయోజనాలు పొందగలిగే హక్కు (ఇన్స్యూరబుల్‌ ఇన్‌టరెస్ట్‌) కలిగి వుండాలి. సి.డి.యస్‌లో అటువంటి నిబంధన ఏదీ లేదు. సి.డి.యస్‌లు పరోక్ష ఒప్పందాలు. సి.డి.యస్‌ కొనుగోలుదారుడికి సి.డి.యస్‌కు ఆధారమైన రుణ ఒప్పందంతో ఏ విధమైన సంబంధం ఉండాల్సిన అవసరం లేదు. రుణ గ్రస్తుని ఆర్ధిక స్థోమతపై స్పెక్యూలేట్‌ చేస్తూ, సి.డి,యస్‌ను ఎవరైన కొనుగోలు చేయవచ్చు. రుణ ఒప్పందాలతో సంబంధం లేని వాళ్ళకు అమ్మే సి.డి.యస్‌లను ''నేకెడ్‌ క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌'' లేదా ''నగ రుణ చెల్లింపు వైఫల్య పరిహార ఒప్పందాలు'' అంటారు. ప్రపంచంలోని సి.డి,యస్‌ మార్కెట్‌లో నేకెడ్‌ క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌ శాతం అత్యధికం. 2.ఇన్సురెన్స్‌ నియంత్రించబడి వుంటుంది. సి.డి.యస్‌లలో నియంత్రణ లేదు. 3. ఇన్సురెన్స్‌లో అమ్మకం దారుడికి రిజర్వ్‌ నిల్వలు ఉండాలి, సి.డి.యస్‌లలో అలాంటి రిజర్వ్‌ నిధుల అవసరం లేదు. దీని కారణంగా సి.డి.యస్‌ రంగంలో తరచు తీవ్ర అనిశ్చితి నెలకొంటుంది. సి.డి.యస్‌లు స్పెక్యూలేటివ్‌ సాధనాలయ్యాయి. 4. ఇన్స్‌రెన్సులో కట్టవలసిన ప్రీమియంలు ముందుగానే నిర్ణయించబడి ఉంటాయి. బాండుల యాజమాన్యం మారితే ఇన్స్‌రెన్సు రద్దవుతుంది. అందువల్ల ఇన్స్‌రెన్సులో స్పెక్యూలేషన్‌ కు అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాని సి.డి.యస్‌లలో అలా కాదు బాండు యాజమాన్యం మారినప్పుడు సి.డి.యస్‌ వాయి దాలలో మార్పు ఉంటుంది. బాండు యాజమాన్యంతో నిమిత్తం లేకుండా అనేక మంది ఒకే రుణ ఒప్పందపై అనేక సి.డి.యస్‌లు కొనుగోలు చేసుకొనే అవకాశం ఉన్నందున, సి.డి.యస్‌లను మరొకరికి బదిలి చేసే అవకాశం ఉన్నందున ఈ రంగంలో అత్యధిక స్పెక్యూలేషన్‌కు, దురాశకు అవకాశం దొరికింది.

ప్రయోజనాలు- రుణ మార్కెట్‌ విస్తరణకు ప్రధాన అవరోధమైన రుణ చెల్లింపు వైఫల్య ప్రమాదాన్ని సి.డి.యస్‌లు వాయిదా చేస్తాయి. దీని కారణముగా రుణ మార్కెట్‌ విస్తరణ వేగవంతమై, చెల్లింపు సామర్ధ్యంతో నిమిత్తం లేకుండా వినియోగదారులకు రుణ సదుపాయాలు చేకూరుతాయి.

దుష్పలితాలు- రుణ చెల్లింపు వైఫల్యాల ప్రమాదం సి.డి.యస్‌ల మూలకంగా వాయిదా పడినందువల్ల, సి.డి.యస్‌లపై ఎటువంటి నియంత్రణలు లేనందువల్ల, రుణ దాతలు రుణ మంజూరులో స్వీయ రక్షణ ప్రమాణాలను గాలికి వదిలేసి బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల రుణ వైఫల్యాల సంఖ్య పెరగటం మొదలైంది. పెరిగిన మేరకు పరిహారాలు చెల్లింపలేని స్థితిలో ఉండి సి.డి.యస్‌ మంజూరు సంస్ధలు దివాలా తీయటంతో రుణ చెల్లింపు వైఫల్య ప్రమాదం బ్రద్దలై, ఆర్థిక సంస్థలను, వ్యవస్థలను దివాళా తీయించాయి. అమెరికా గృహ రుణ సంక్షోభంతో బేర్‌ స్టెరన్స్‌ దివాళా తీయగా, అమెరికా ఇన్సురెస్స్‌ గ్రూప్‌ సంస్థ జాతీయం చేయబడింది.

ముగింపు - క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌ 1990 ప్రథమార్థంలో సృష్టించబడ్డాయి 1994లో జే.పి. మోర్గాన్‌ అండ్‌ కో తయారు చేసిన సి.డి.యస్‌లు ఈ రంగంలో ఒక మలుపుగా చెప్పుకోవాలి. 2003 సం||లో 3.7 ట్రిలియన్‌ డాలర్లు ఉన్న సి.డి.యస్‌ మార్కెట్‌ 2007 అంతానికి 62.2 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకుంది.అమెరికాలో నెలకొన్న గృహరుణాల విజృంభణతో సి.డి,యస్‌ల మార్కెట్‌ పరిమాణం అత్యధికంగా పెరిగింది. 2008లో ఆ బుడగ పగిలిపోవటంతో ఆ మార్కెట్‌ 38 ట్రిలియన్‌ డాలర్లకు పడిపోయింది. సి.డి.యస్‌లు జారీ ఒక ఎక్స్ఛేంజ్‌ పరిధినుండి ఉండవు అనేక కంపెనీలు ఒవర్‌దికౌంటర్‌ జారీ చేస్తుంటాయి. వీటిపై నియంత్రణ లేదు. సి.డి.యస్‌ జారీ చేసే సంస్థలకు సాల్వెన్సీ ప్రమాణాలు అనుసరించాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఉవ్వెత్తున పెరుగుతున్న రుణ మార్కెట్‌తో సమానంగా సి.డి.యస్‌ మార్కెట్‌ పెరుగుతుంది. వివిధ ప్రభుత్వాలు చేదు అనుభవాలనుంచి గుణ పాఠాలను పరిమితంగానే తీసుకుంటున్నాయి. భారతదేశంలో కూడా కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్‌ పెరుగుదల కోసం క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్స్‌ను 2010లో అమలు చేయాలని రిజర్వ్‌ బ్యాంకు ఆరాటపడుతుంది. నియంత్రణలు లేని నూతన ద్రవ్య ఉత్పత్తుల వాణిజ్యం ఆచరణలో ఆర్థిక వ్యవస్థలకు వినాశకరమౌతుంది.