Saturday, February 21, 2015
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పైనే ఆధారపడితే------
Friday, November 28, 2014
ఉపాధి హామీపై ఉదారవాద దాడి
ఉపాధి హామీ పరి రక్షణకై దేశవ్యాప్త ఉద్యమం సాగుతోంది. గత రెండేళ్లుగా ఉపాధి హామీ ప్రయోజనాలను తక్కువ చేసి చూపే ప్రయత్నం ప్రారంభమైనా తాజా పార్లమెం టు ఎన్నికల తర్వాత ఈ ప్రయత్నాలు రాజకీయ దాడి రూపం తీసుకున్నాయి. ఎన్నికలకు ముందే స్వేచ్ఛా మార్కెట్ సిద్ధాంతకర్తలు ఈ చట్టాన్ని సవరించాలని పెద్దఎత్తున ప్రచారం ప్రారంభించారు. ఈ తరహా విశ్లేషకులు, సంస్కరణల అనుకూలురు లెవనెత్తిన అంశాలను సమర్థించే బిజెపి అధికారానికి రావటంతో ఈ ప్రచారానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఏకంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరి, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె సింధియా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి వారు ఉపాధి హామీ చట్టాన్ని తొలుత నిర్వీర్యం చేయటానికి, కాలక్రమంలో కేవలం ఒక పథకం స్థాయికి పరిమితం చేయటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ దాడి రూపమే విస్తృత భాగస్వామ్య ప్రణాళికా కసరత్తు. ఈ చట్టంపై జరుగుతున్న దాడిని ఎదుర్కోవటానికి, చట్టాన్ని పరిరక్షించుకోవటానికి శ్రామిక శక్తులు ఏకమవుతున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరింపజేయాలని, అటువంటి ప్రయత్నానికి ఉపాధి హామీ చట్టం ప్రధాన సాధనంకానున్నదని నమ్ముతున్న ఆర్థికవేత్తలు, విశ్లేషకులు, మేధావులు ఈ ప్రయత్నాలను సమర్థించి ముందుకొస్తున్నారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు కూడా రెండుగా చీలిపోయాయి. కేంద్ర ప్రభుత్వం వందలాది పథకాలు అమలు పరుస్తుండగా ఉదారవాదులు ఈ ఒక్క చట్టం ఆధారిత పథకాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవటం వెనకగల కారణాలు ఏమిటి?
ఉపాధి హామీ చట్టం ప్రాధాన్యత గురించి సరిగ్గా అర్థం చేసుకోవాలంటే గత రెండు దశాబ్దాల ఆర్థిక సంస్కరణల దుష్ప్రభావాలను కూడా అర్థం చేసుకోవాలి. 1991లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు గ్రామీణ భారతాన్ని కుంగదీశాయి. గ్రామీణ భారతానికి ఆయువుపట్టుగా ఉన్న వ్యవసాయాన్ని సంక్షోభ భరితం చేశాయి. లక్షలాది మంది రైతులు ఆత్మహత్యల పాలైనా సంస్కరణల మత్తులో జోగుతున్న ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయి. 2000 సంవత్సరం తర్వాత గానీ ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న సంక్షోభం నిర్దిష్ట రాజకీయ రూపం తీసుకోవటం ప్రారంభం కాలేదు. ఫలితంగా 2004 ఎన్నికల నాటికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించటం ప్రధాన రాజకీయ పార్టీల ఎజెండాలో అంతర్భాగం అయ్యింది. అంతకు ముందే ప్రణాళికా సంఘం వంటి పలు కీలక ప్రభుత్వ విభాగాలు చితికిపోతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గుర్తించి దానికి తగిన పరిష్కారాలు ప్రతిపాదించటం ప్రారంభించాయి. ప్రణాళికా సంఘం రూపొందించిన 11వ పంచవర్ష ప్రణాళిక దిశా నిర్దేశ పత్రంలో గ్రామీణ ఆర్థిక సంక్షోభానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కనుమరుగవటం కీలక అంశంగా భావించి గ్రామీణ ఉపాధి పరిరక్షణ ఒక్కటే ఈ సంక్షోభం నుంచి దేశాన్ని బయట పడేయగలదని నిర్ధారించింది. తదనుగుణంగా రూపొందిందే గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ప్రస్తుతం ఈ చట్టం ఆవశ్యకత, ప్రాసంగికతపై సందేహాలు లేవనెత్తుతున్న శక్తులు, వ్యక్తులే నాడు ఈ చట్టం అవసరాన్ని కూడా ప్రశ్నిస్తూ వచ్చిన విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఉపాధి హామీ చట్టం అవసరం లేదన్న వాదన ముందుకు తేవటం అంటే ఆర్థిక సంస్కరణలు ఫలప్రదం అయ్యాయన్న మార్కెట్ ఛాందసవాదుల ప్రచారాన్ని ధృవీకరించటమే కాక గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న వాస్తవిక స్థితిని గుర్తించ నిరాకరించటమే అవుతుంది. నిజానికి ఈ చట్టం చిన్న సన్నకారు రైతాంగానికి, కౌలు రైతాంగానికి ఉపాధి అవకాశాలు కల్పించింది. తద్వారా వ్యవసాయ కార్మికులు, రైతాంగంలోని దిగువ తరగతుల మధ్య ఐక్యతకు పునాదులు వేసింది. ఈ చట్టం ద్వారా చేపట్టిన అనేక పనులు దీర్ఘకాలంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచటానికి దారితీసిందని స్వయంగా ఎన్‌ఎస్‌ఎస్‌ఒ వంటి సంస్థలతో పాటు ప్రణాళికా సంఘం ఆధీనంలో పని చేసే అనేక మేధో సంస్థలు ధృవీకరించాయి. ఇప్పటికే 10 లక్షల ఎకరాలకు పైగా అదనపు నీటి వనరులు ఈ చట్టం ద్వారా అందుబాటులోకి తెచ్చామని గ్రామీణాభివృద్ధి శాఖ నివేదికే స్పష్టం చేస్తోంది. ఈ ఐక్యత దీర్ఘకాలంలో ఆర్థిక సంస్కరణలపై జరిగే పోరాటానికి కొత్త ఊపిరులూదనుంది. ఉపాధి హామీ చట్టం వల్ల వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోయిందన్న వాదన ముందుకు తేవటం ద్వారా వ్యవసాయ సంక్షోభానికి కారణమవుతున్న ప్రభుత్వ విధానాలు, ఆర్థిక సంస్కరణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించటానికి ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నంలో కార్పొరేట్ మీడియా కూడా తనవంతు సహకారం అందిస్తోంది.
ఈ చట్టం ఆశించిన ప్రయోజనాలు చేకూర్చలేదని, లక్షల కోట్ల రూపాయలు వృథా అయ్యాయన్నది వీరు ముందుకు తెస్తున్న మరో వాదన. ఈ చట్టం 2005లో ప్రారంభమైన నాటి నుంచి 2013-2014 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఉపాధి హామీ కోసం కేంద్ర ప్రభుత్వం వెచ్చించిన వ్యయం రూ.2,38,500 కోట్లు. మొత్తంగా జాతీయ ఆర్థిక వ్యవస్థను ఇటువంటి కేటాయింపులు సంక్షోభంలోకి నెడుతున్నాయని సంస్కరణవాదులు ప్రచారం చేస్తున్నారు. ఇది జిడిపిలో కేవలం 0.5 శాతం. మొత్తం జాతీయ ఆర్థిక వ్యవస్థ కేవలం 0.5 శాతం కేటాయింపుల వల్ల సంక్షోభంలో పడిందని తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లు కార్పొరేట్ వర్గాలకు కేటాయించిన రూ.34 లక్షల కోట్ల గురించి ఎందుకు నోరెత్తటం లేదు? ఉపాధి హామీ చట్టం అమలుకు కేటాయించిన నిధుల్లో 65 శాతం అంటే రూ.1,55,000 కోట్లు నేరుగా వ్యవసాయ కార్మికులకు వేతనాల రూపంలో వారికి చేరింది. రూ.35 కోట్ల కుటుంబాలకు నేరుగా ఆర్థిక ప్రయోజనం చేకూరింది. 1,575 కోట్ల పనిదినాలు సృష్టించబడ్డాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరిగింది. ప్రజలు ప్రత్యేకించి వ్యవసాయ కార్మికులు విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలు తీర్చుకోగలుగుతున్నారని పలు పరిశోధనల్లో రుజువు అయ్యింది. ఆ మేరకు వ్యవసాయ కార్మికులు గ్రామీణ పెత్తందారుల ఆధిపత్యం నుంచి విముక్తి పొందారు. ఊపిరి తీసుకున్నారు. కానీ సంస్కరణవాదులకు ఇదంతా 'వృథా వ్యయం', 'బూడిదలో పోసిన పన్నీరు'లాగా కనిపిస్తోంది. నితిన్ గడ్కరి వంటి వారికి ఇదంతా కేవలం రాజకీయ పక్షపాతం కోసం ప్రభుత్వ నిధుల దుర్వినియోగంలా మాత్రమే కనిపిస్తోంది.
బిజెపి అధికారానికి వచ్చాక అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి లావాదేవీలు పెరిగాయి. రానున్న కాలంలో భారతదేశాన్ని అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడికి క్రీడాస్థలంగా మార్చే విధానాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఉపాధి హామీ చట్టం వల్ల కాస్తో కూస్తో గ్రామీణ శ్రమశక్తి విలువ పెరిగింది. వేతనాలు పెరిగాయి. వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ప్రాంతాల్లోని సంఘటిత, అసంఘటిత కార్మికులు, నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని కార్మికుల ముందు ఒక ప్రత్యామ్నాయం ఉంది. గతిలేని పరిస్థితుల్లో నామమాత్రపు వేతనాలకు గొడ్డుచాకిరీ చేసే స్థితి నుంచి గ్రామీణ కార్మికులు కాస్తంట ఊరట పొందారు. మరోవైపున ఉపాధి హామీ వేతనాల నేపథ్యంలో భవన నిర్మాణం, ప్రత్యేక ఆర్థిక మండళ్ల నిర్మాణం, పారిశ్రామిక క్లస్టర్లలో పని చేసే కార్మికుల వేతనాలు ఎంతో కొంత పెంచాల్సి వచ్చింది. ఈ మేరకు పెట్టుబడి లాభాల్లో కోత పడుతోంది. గతంలో కారుచౌకగా దొరికే శ్రమశక్తి ఇప్పుడు దొరకటం లేదు. గ్రామీణ కార్మికులు తమ కాళ్ల మీద తాము నిలబడే అవకాశాలు వస్తే అంతిమంగా తమ లాభాల్లో కోతపడుతుందని గుర్తించింది పెట్టుదారీ వర్గం. అందువల్లనే దేశీయ గుత్తపెట్టుబడిదారీ వర్గం, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడితో కుమ్మక్కై వ్యవసాయ కార్మికులకు, చిన్న సన్నకారు రైతాంగానికి, గ్రామీణ కార్మికవర్గానికి ఊతమిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలన్న దాడిని ఉధృతం చేస్తోంది.
- కొండూరి వీరయ్య
Monday, November 17, 2014
నిజమైన లౌకిక వాది నెహ్రూ
నిజమైన లౌకికవాది నెహ్రూ..ప్రొ.కె.నాగేశ్వర్
Sunday, November 17, 2013
Thursday, October 17, 2013
ఔషధ ప్రయోగార్ధుల పరిరక్షణ సాధ్యమేనా?
Saturday, March 12, 2011
''ద్రవ్యలోటును తగ్గించిన ద్రవ్యోల్బణం!!''
ద్రవ్యలోటు
మొత్తం ప్రభుత్వ వ్యయానికి, రుణాలను మినహాయించిన ప్రభుత్వ ఆదాయానికి మధ్య ఉన్న తేడాను ద్రవ్యలోటు అంటారు. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటే ద్రవ్యలోటు గాను, వ్యయం కంటే ఆదాయం ఎక్కువగా ఉంటే ద్రవ్య మిగులు గాను పరిగణిస్తారు. ద్రవ్యలోటును సహజంగా స్థూల దేశీయోత్పత్తి (జి.డి.పి)లో శాతంగా వ్యక్తపరుస్తారు.
స్థూలదేశీయోత్పత్తి (జి.డి.పి)
ఒక నిర్ణీత కాలంలో దేశీయ, విదేశీయ అనే తేడాతో నిమిత్తం లేకుండా, ఒక దేశ సరిహద్దులకు పరిమితమై ఉత్పత్తి అయ్యే అన్ని రకాల సరుకులు, సేవలు, మదుపులు (ఇన్‌వెస్ట్‌మెంట్స్), ఎగుమతుల, దిగుమతుల మధ్య ఉండే నికర ఎగుమతులన్నింటి ''మొత్తం ద్రవ్య విలువ''ను స్థూలదేశీయోత్పత్తి లేదా జి.డి.పి (గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్) అని అంటారు.
నామమాత్ర స్థూలదేశీయోత్పత్తి (నామినల్/నామమాత్ర జి.డి.పి)
లెక్కించే సమయానికి అమలులో ఉన్న ధరల ఆధారంగా గణించబడిన స్థూలదేశీయోత్పత్తిని నామమాత్ర స్థూలదేశీయోత్పత్తి లేదా నామినల్ జి.డి.పి అంటారు.
నిజ స్థూల దేశీయోత్పత్తి (రియల్ జి.డి.పి)
స్థిరమైన ధరల ఆధారంగా గణించబడిన జి.డి.పి ని నిజ స్థూలదేశీయోత్పత్తి లేదా రియల్ జి.డి.పి (నిజ జి.డి.పి) అంటారు. వివిధ కాలాల మధ్య జి.డి.పి ని పోల్చేటప్పుడు సాధారణంగా నిజ జి.డి.పి ని వాడుతారు.
ద్రవ్యోల్బణం
దీర్ఘ కాలం నికరంగా కొనసాగే సరకులు, సేవల ధరలలోని పెరుగుదల స్థాయిని ద్రవ్యోల్బణంగా పరిగణిస్తారు. నామ మాత్ర జి.డి.పి కి, నిజ జి.డి.పి కి మధ్య తేడాయే ద్రవ్యోల్బణం (ఇన్‌ప్లేషన్) అవుతుంది. ద్రవ్యోల్బణ రేటు 2%-3%గా ఉంటే సున్నిత ద్రవ్యోల్బణమని, 5% వరకు ఉంటే నడిచే ద్రవ్యోల్బణమని, 10% వరకు ఉండే ద్రవ్యోల్బణాన్ని పరిగెత్తే ద్రవ్యోల్బణమని, ఆపైన ఉండే ద్రవ్యోల్బణాన్ని విజృంభించే ద్రవ్యోల్బణమని పిలుస్తారు. భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రమాణాలలో 5% వరకు ద్రవ్యోల్బణ రేటు ఆరోగ్యకరమైనది గాను, ఆపైన ఉంటే ప్రమాదకరమైనదిగాను పరిగణిస్తున్నారు.
కేంద్ర బడ్జెట్ పై విశ్లేషణలో ద్రవ్యలోటు
2010-11 సంవత్సరం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బడ్జెట్ కాలంలో స్థూల దేశీయోత్పత్తి (జి.డి.పి)ని అప్పటి ధరల్లో 69 లక్షల 35 వేల కోట్ల రూపాయలుగా, ద్రవ్య లోటును 3 లక్షల 81 వేల కోట్ల రూపాయలుగా అంచనా వేసి, ద్రవ్య లోటును 5.5%గా నిర్ణయించారు. 2009 మే అయిదు నుండి మన ఆర్థిక వ్యవస్థలో వరుసగా 76 వారాల పాటు రెండంకెల విజృంభణ ద్రవ్యోల్బణం గంగ వెర్రులెత్తించింది. ఈ నేపథ్యంలో 2011-12 బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తుతం అమలులో ఉన్న ధరలలో నామమాత్ర జి.డి.పి రూ.78.78 లక్షల కోట్లకు పెరిగిందని. అలాగే ద్రవ్యలోటు నాలుగు లక్షల కోట్ల రూపాయలకు చేరిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న నామమాత్ర జి.డి.పి కి, గత సంవత్సరం అంచనా వేసిన నామమాత్ర జి.డి.పి కి మధ్య ఉన్న తేడా 9.43 లక్షల కోట్ల రూపాయలు. ఇది శుద్ధమైన ద్రవ్యోల్బణం.
ప్రస్తుతమున్న ద్రవ్య లోటుకు (నాలుగు లక్షల కోట్ల రూపాయలకు), ద్రవ్యోల్బణంతో పెరిగిన జి.డి.పికి (రూ.78.78 లక్షల కోట్లకు) మధ్య ఉన్న నిష్పత్తి 5.1శాతం. అంటే గత బడ్జెట్ సమయానికి అంచనా వేసిన 5.8శాతం కంటే ఇది తగ్గినట్లుగా కనిపిస్తుంది. ఈ కాలంలో ద్రవ్యలోటు తగ్గటానికి సంపన్నులపై పన్నులేవి విధించబడలేదు. పైపెచ్చు సామాజిక వ్యయం, బడ్జెట్ అంచనాల కంటె చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వ చర్యలతో నిమిత్తం లేకుండా, కేవలం పెరిగిన ద్రవ్యోల్బణం మూలకంగా తగ్గిన ద్రవ్యలోటు రేటును ఆర్థిక మంత్రి తన సొంత విజయంగా చెప్పుకుంటున్నారు. ద్రవ్య లోటయిన నాలుగు లక్షల కోట్ల రూపాయలతో, ద్రవ్యోల్బణం అసలేమీ లేదనుకొని గత సంవత్సరం అంచనా వేయబడ్డ రూ.69.35 లక్షల కోట్ల నామమాత్ర జి.డి.పి తో గణిస్తే ద్రవ్యలోటు రేటు 5.8% అవుతుంది. అంటే అంచనా కంటే ఆచరణలో ద్రవ్యలోటు పెరిగినట్లు భావించాలి.
విచిత్రమేమంటే ఆర్థిక మంత్రి ప్రసంగంలో ఏమున్నా, బడ్జెట్ పత్రాలకు జతచేయబడిన ''మధ్యస్థ కాల ద్రవ్య విధాన ప్రకటన''లో జి.డి.పి లోని అత్యధిక నామమాత్ర పెరుగుదలే (ద్రవ్యోల్బణం) ద్రవ్యలోటును తగ్గించిందని అంగీకరించటం కొసమెరుపు. అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు లెక్కించే ద్రవ్యలోటు రేట్లు అసంబద్ధమైనవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్లో వాస్తవ పరిస్థితులతో నిమిత్తం లేని అంకెల గారడీతో ఎంతకాలం పాలక వర్గాలు సామాన్య ప్రజలను మోసగించగల్గుతారు? పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాల నుండి పాలకులు గుణపాఠాలు నేర్చుకోకపోతే, ఆ దుస్థితే మన దేశంలో పునరావృతం కాకమానదు.