Monday, September 14, 2015

"మేము లొంగం
2002 గుజరాత్ దాడులకు బాధ్యులైన 120మందిని శిక్షార్హుల్నిచేసి  న్యాయం కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న తీస్తా సేతల్వాద్  తో "ఫ్రంట్ లైన్" అనుపమ కటకం ఇంటర్వ్యూ లోని కొన్ని భాగాలు   
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో తీవ్రమైన ఇబ్బందులకు గురౌతున్న వ్యక్తి  తీస్తా సెతల్వాద్.  జ్వలించే కార్యకర్తగా,న్యాయవాదిగా 2002 గుజరాత్ అల్లర్ల బాధితులకు న్యాయ మందించటం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న  తీస్తా సెతల్వాద్  ఇటీవలి నెలలలో తీవ్రమైన కక్ష్య సాధింపు వేటకు గురౌతున్నారు.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ప్రధాన నిందితుడుగా వున్న"జాకియా జెఫ్రి కేసు"కు సంబంధించిన  వాదనలు గుజరాత్ హైకోర్టులో  తుది స్థాయికి చేరటంతో తనపై దాడులు ఉధృత మౌతున్నాయని తీస్తా సెతల్వాద్  విశ్వసిస్తున్నారు. ఆయన ప్రధాన మంత్రి అయినప్పటికీ, ఇటీవలి కాలంలో సంభవించిన భయంకరమైన మతహింసలో తనపై పడ్డ మచ్చను ఆయన  విజవంతంగా   తుడిపించుకోగలిగినప్పటికీ,  2002 మతహింస బాధితులు కనుమరుగు కాకుండా నిలబెట్టడంలో తీస్తా సెతల్వాద్  నిర్వహిస్తున్న  బృహత్తర ప్రయత్నాలు  నరేంద్ర మోడీ కి కంటకంగానే వున్నాయి. తనను హింసించటం ద్వారా మత ఘర్షణల కేసుల్ని నీరు కార్చడానికి  బాహాటంగా ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. 

మత సామరస్యం కోసం కృషి చేస్తున్న ఒక ప్రభుత్వేతర సంస్థ అయిన' సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్(సి జె ఐ )" ను ఆమె, ఆమె భర్త జావేద్ ఆనంద్ సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఆ దంపతుల పైన గుజరాత్ పోలిస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)లు అనేక అభియోగాల్ని మోపింది. 
ఇతర అంశాలతోపాటు మత ఘర్షణల సాక్షులను ట్యూటర్ చేస్తున్నారని, గుల్బెర్గ్  సొసైటీ బాధితుల నిధుల్ని దుర్వినియోగం చేస్తున్నారని, విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలు వారిపై బనాయింప బడ్డాయి. 
జూలై నెల తొలిరోజుల్లో నిధుల దుర్వినియోగం కేసులో సిబిఐ ఆమె ఇంటిని, ఆఫీసును సోదా చేసింది. ఫిబ్రవరి నెలలో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆమెను,ఆమె భర్త ఆనంద్ ను అరెస్ట్ చేయటానికి ప్రయత్నించింది. ఆమె ముంబై హైకోర్టు నుండి ముందస్తు బైలును పొందింది. అది సుదీర్ఘ మైన,కష్టతరమైన పోరాటమని ఆమెకు తెలుసు. మోడీ ప్రధాన మంత్రి హోదాలో కేంద్ర ఏజెన్సీల సహకారంతో తనను బాధించ గలడని ఆమె అంటుంది. 
మత ఘర్షణలు జరిగిన గత 13 సంవత్సరాల నుండి  తీస్తా సెతల్వాద్  ,ఆనంద్ కలసి 68 కేసుల్లో పోరాడి 120 మందికి శిక్షలు పడేటట్లు కృషి చేశారు. ఆమె ఎదుర్కొంటున్ననిర్బంధంతో  పాటు, ఆమెకు వివిధ వర్గాల నుండి  మద్దతు వెల్లువెత్తింది. న్యాయం కోసం నినదించే ఏ నిరసనైనా,నినాదమైనా జాతి వ్యతిరేకంగా పరిగణింప బడుతున్నఈ  రోజుల్లో, పౌర బృందాలు, కార్యకర్తలు, రాజకీయ నాయకులు, మాజీ బ్యూరోక్రట్లు ఆమె తరఫున బహిరంగంగా మాట్లాడుతున్నారు. 
ఫ్రంట్ లైన్  తీస్తా సెతల్వాడ్ తో సంభాషించింది. . తన బాటను విడనాడేది లేదని  ఆమె వ్యక్తం చేసిన కృత నిశ్చయాన్ని ఆమె మాటలలోనే  చూద్దాం
జనవరి 2014 లో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో ప్రధమ సమాచార నివేదిక(ఎఫ్ ఐ ఆర్) దాఖలు చేసినప్పటి నుండి మీరు నిరంతరం అరెస్ట్ బెదిరింపులను ఎదుర్కొన్నారు, మీ అకౌంట్స్ స్తంభింప బడ్డాయి, మిమ్మల్ని లక్ష్యం చేసికోవటంలో ఉద్దేశ్యాన్ని ఏమని  అనుమానిస్తున్నారు? 
గుల్బెర్గ్  సొసైటీ ఉచకోతలో బ్రతికి బైట పడ్డవారు తమ వ్యక్తిగత ఆస్తుల్ని సముచిత ధరకు అమ్ముకోలేని కారణంగా, దాదాపు 2007-8లోగుల్బెర్గ్  సొసైటీ లో ఒకమెమోరియల్ నిర్మాణం  కోసం నిధుల్ని సమీకరించటానికి  ప్రయత్నించాలని సమిష్టిగా నిర్ణయింప బడింది. సబ్రంగ్ ట్రస్ట్-సిజెపి చెందిన మేము రూ. 4.6లక్షల నిధుల్ని సమీకరించడం తప్ప, మాకు మెమోరియల్ తో ఏ రకమైన సంబంధం లేనందువల్ల, 2012లోసొసైటీ సభ్యులకు ప్రాజెక్ట్ సాధన సాధ్యంకాదని చెప్పాల్సి వచ్చింది.ఏ విధమైన ఒప్పందం పై సంతకాలు చేయబడలేదు, ఏ రకమైన ఆస్తి లేదా దస్తావేజులు చేతులు మారలేదు. ఏ రకమైన కిరాయి కుదర్చబడలేదు, డబ్బులు చేతులు మారలేదు. భారత దేశ సంతతికి చెందిన ఒకరితో సహా, భారతీయులందరూ కలసి రూ.4. 6లక్షల విరాళాలు అందచేశారు.ఆ సొమ్ము  ఇంకా వినియోగింప బడకుండా అట్లానే  వుంది. 
జనవరి 2013 లో మొట్టమొదటగా ఫిర్యాదు చేయబడింది. జనవరీ 2014లో ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయబడింది. ఆ తర్వాత ఒకటిన్నర సంవత్సరమైనా ఇంతవరకు ఛార్జి షీట్ దాఖలు చేయబడలేదు. మా దృష్టిలో ప్రధమ సమాచార నివేదిక ద్వేషపూరితంగా ప్రేరింప బడింది. దీన్ని ఫిరోజ్ సయీద్ ఖాన్ చే దాఖలు చేయబడింది. ఫిరోజ్ సయీద్ ఖాన్ గుల్బెర్గ్ కేసు లో ప్రత్యక్ష సాక్షి సోదరుడు మరియు సొసైటీ నివాసి. కానీ ఊచకోత జరిగిన సందర్భంలో సంఘటన స్థలంలో ఆయన లేడు . సి జె పి మాజీ  ఉద్యోగి ని అదికార వర్గాలు ప్రణాళికా బద్ధంగా వినియోగించుకొన్నారు. ఆయన  నాపై 5 కేసులు బనాయించారు. ఆయన క్రైమ్ బ్రాంచ్ సాక్షి కూడ. 
గుజరాత్ ప్రభుత్వం మమ్మల్ని అగౌరవ పరుస్తూ, పోలిస్ అదుపులో నిర్భందిస్తూ పనికట్టుకొని మమ్మల్ని అపఖ్యాతి పాల్జేస్తున్నట్లుంది.  క్రైమ్ బ్రాంచ్ పరిశోధనాదికారి 2015పిబ్రవరి 2015 న మా ఇంటి ముందు ప్రదర్శించిన పూర్తి స్థాయి తమాషా ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. క్రైమ్ బ్రాంచ్ తన అఫిడవిట్ లో పేర్కొన్న వాదనలకు  వేటికి డాక్యుమెంటరీ ఋజువులు లేవు. ఇంతవరకు ఏ విధమైన అభియోగ పత్రం(చార్జి షీటు) దాఖలు చేయబడలేదు. ట్రస్ట్ నిధులు కాకుండా, మా డబ్బును మేమెలా ఖర్చు పెట్టుతున్నమో తెలిసికొని, మాపై అసభ్యకర ప్రచారానికి పూనుకొని   మా జీవితాల్లో జోక్యం చేసికోవాలనుకునే కుటిల యత్నమిది.  తీవ్రవాద వ్యతిరేక స్క్వాడ్ ముఖ్య నేత హేమంత్ కర్కరేను ఇదే విధంగా హింసించి 2008 నవంబర్ 28న భయంకరంగా చంపేశారు. 
మమ్మల్ని న్యాయపరమైన  చిక్కుల్లోకి స్పష్టంగా నెట్టి, మరో ప్రక్క భారత రాజ్యాంగాన్ని సమున్నతంగా నిలబెట్టుతూ,  ప్రభుత్వం యొక్క సైదాంతిక చట్రాన్ని సవాలు చేస్తున్న మా ప్రయత్నాలను స్థంబింప చేయటమే వాళ్ళ  ఉద్దేశ్యంగా వుంది. 
సి బి ఐ   మిమ్మల్ని జనవరి 2013 నుండి విచారిస్తూనే వుంది. ఇటీవలవారు మిమ్మల్ని  "జాతికే ఉపదవ్రం" గా అభివర్ణిస్తున్నారు 
 మత సామరస్యం,శాంతి  కోసం కృషి చేసే వారంతా "జాతికి ఉపద్రవం" కల్గించే వారనుకుంటే, మేమూ అటువంటి వారమే. మా పోరాటం,ఆరాట మంతా బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిలబెట్టడమే. మన రాజ్యాంగ మౌళిక విలువల్ని నిలబెట్టడం కోసమే మేము కృషి చేస్తున్నాం. జాతికి ముప్పుగా మేము చూడబడటం లేదు. వారసత్వంగా రాజ్యాంగ వ్యతిరేక ప్రాపంచిక దృక్పధం కల్గిన  ఆర్ ఎస్ ఎస్ సారధ్యంలోని  పాలకులకు మాత్రం మేము  ముప్పు గా కనబడుతున్నాం.  విచ్చిన్నకర,ద్వేష రాజకీయాలను విశ్వసిస్తున్న వారికి  మేము ముప్పుగానే వున్నాం. ఈ శక్తులేన్నడూ స్వాతంత్ర్యం కోసం పోరాడలేదు. భారత రాజ్యాంగంలో పొందుపరచిన ఉన్నతమైన నిబద్ధతా నియమాలతో వారికి సంబంధం లేదు. 
మీపై మోపబడ్డ అభియోగాలేమిటి? మీరు ప్రతి అంశంలోనూ సహకరించామని చెప్తున్నారు, కాని వాళ్ళు మీ ఇంటిని/ఆఫీస్ ను దాడిచేసి  సోదా చేశారు. న్యాయపరమైన దృక్కోణంలో ఆలోచిస్తే, ఇవ్వన్నీ చేయటానికి వారికి అధికారం వుందా?
దాడులు,సోదాలతో వారు న్యాయ ప్రక్రియను అతిక్రమించారు. సోదా వారంట్  ను పొందటంలో పోలిస్ అనుసరించిన చర్యల్ని మేము దాన్ని  జారీచేసిన మేజిస్ట్రేట్ ముందు సవాలు చేశాము (సోదాలు జరిపిన 2 రోజుల తర్వాత జూలై 17న వారంట్ జారీ చేసారు), మిమ్మల్ని తప్పుదోవ పట్టించారని మేజిస్ట్రేట్ కు చెప్పాము. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 192-193 కు అనుగుణంగా సి బి ఐ ఎటువంటి చర్యలు అమలు చేయలేదు. రాజ్యంగ హక్కుల పూర్తి ఉల్లంఘన జరిగిందని మేము నమ్ముతున్నాం. మా అభ్యర్ధన పై ఒక నోటీస్ ఇవ్వబడింది. ఆగస్ట్ లో దానిపై విచారణ జరుగుతుంది. మా మీద అనేక అభియోగాలు మోపబడ్డాయి. వాటన్నింటిని ఖండిస్తూ సమాధానాలిచ్చాం. సాధ్యమైనంత వరకు సహకరిస్తూనే వున్నాం. దాదాపు 24000పేజీల పత్రాల్ని మేము సి బి ఐ కి అందించాం. 
సంస్థాపక పత్రాలను బట్టి  సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్","సబ్రంగ్ ట్రస్ట్ "ల ఆశయాలు ఆదర్శాలు విశాల ప్రాతిపదికన విస్తృతమైన కార్యకలాపాలు నిర్వహించ కలిగేటట్లుగా వున్నాయి. అయినప్పటికీ 2002లో  సి జె పి స్థాపన నుండి సామూహిక నేరాలకు బలైన  బాధితులకు న్యాయ సహాయం అందించట దాని ముఖ్య కర్తవ్యంగా వుంది.  స్కూళ్ళలో ఖోజ్(బహుళ జన భారతానికి విద్య నందించే వేదిక) కార్యకలాపాలకు, ఘర్షణల నివారణ మరియు శాంతి స్థాపనలపై సబ్రంగ్ ట్రస్ట్ ప్రధానంగా కేంద్రీకరిస్తున్నది. గుల్బెర్గ్  మెమోరియల్ విషయంలో నేను ఇంతకు ముందు చెప్పినట్లు నిధులు వసూలు చేయబడ్డాయి. కాని కేవలం రూ4.6లక్షలు మాత్రం వసూలైనందున .ప్రాజెక్ట్ సాధన సాధ్యం కాదని సొసైటీ సభ్యులకు తెలియచేశాం. ఆ డబ్బు కదిలించకుండా ఆట్లానే వుంది. 
న్యాయ సహాయానికి నిధులు వసూలు చేయటం,కార్యక్రమాలు నిర్వహించటానికి సంబంధించి, గుజరాత్ మారణ హోమ బాధితులకు న్యాయ సహాయం అందించటం కోసం  సి. జె.పి భారత దేశం లోనే అపూర్వమైన పాత్రను  నిర్వహించింది. పాలన వ్యవస్థ శత్రుపూరితంగా వున్నప్పటికీ, విచారణ సందర్భంగా బాధితులకు  రక్షణను, స్థైర్యాన్ని కల్పిస్తూ  120 మంది నిందితులకు శిక్షలు పడేటట్లు చూడటం ప్రధానమైంది.  
నాకు,జావేద్ ఆనంద్ కు చెల్లించిన లావాదేవీలన్నీ 'ఫోర్డ్ ఫౌండేషన్', 'ఐక్య రాజ్య సమితి హింసా బాధితుల ఐచ్చిక నిధి'ల  బడ్జెట్ ప్రతిపాదనలకు,అంగీకారాలకు ఖచ్చితంగా లోబడే  వున్నాయి.  
సిజేపి, సబ్రంగ్ ట్రస్ట్లు తిరిగి చెల్లించిన మా వంతు ఖర్చులు ఆ ట్రస్టీలు వివిధ సందర్భాలలో ఆమోదించిన తీర్మానాలకు అనుగుణంగా వున్నాయి. జావేద్,నేనూ ఆ సమయాల్లో తీసికున్న నిర్ణయాలకు కట్టుబడి ఉన్నాము. 
మాకు చెల్లించిన పరిహారాల నుండి మాకు మేము ఖర్చు చేసికుంటున్నామన్న ఆరోపణ వ్యాఖ్యానించటానికే  తగనిది. 
సబ్రంగ్ ట్రస్ట్లు కళా ఖండాల వేలంద్వారా సమీకరించిన నిధులు ప్రారంభంలో చెప్పిన విధంగా మౌలిక కార్యక్రమాలు నిర్వహించటానికి ఉద్దేశింప బడ్డాయి. దీనికి వసూలు చేసిన నిధుల్ని బాధితులకు ఆర్ధిక సహాయంకోసం వినియోగిస్తామని ఎన్నడూచెప్పివుండ లేదు . మేము చేస్తున్న కృషిపై అత్యంత గౌరవం వున్నందున సుప్రసిద్ధ కళాకారులందరూ ఈ  ప్రయత్నాలకు ఉదారంగా  మద్దతునిచ్చారు. 
సిజేపి నిర్వహించిన న్యాయ సహాయ కృషికి లెక్కలు లేవన్న ఆరోపణను పరిశీలిస్తే, సిజేపి నిర్వహించిన న్యాయ సహాయ కృషి,అపూర్వ రీతిలో సాధించిన విజయాలు గుజరాత్ పోలీసులకు తప్ప దేశంలోనూ,విదేశాలలోని  ప్రతి ఒక్కరికి తెలుసు. సిజేపి వార్షిక ఖర్చుల్లో 80-90శాతం ఖర్చులు న్యాయ సహాయానికి, గుజరాత్ లో సిజేపి క్షేత్ర స్థాయి ఆఫీస్ కార్యకలాపాలకు సంబంధించి వున్నట్లు  ఇన్ కమ్ టాక్స్, చారిటి కమీషనర్, హొమ్ మంత్రిత్వ శాఖల అధికారులకు సమర్పించిన సిజేపి వార్షిక ఆడిట్ చేసిన అకౌంట్స్ తెలియ చేస్తున్నాయి. 
నిధుల సమీకరణ గురించి, ఫోర్డ్ ఫౌండేషన్ తో మీకుండే బాంధవ్యాన్ని వివరించగలరా ? 
స్పష్టంగా నిర్వచించుకున్న కార్యకలాపాల పొందిక ద్వారా కులం,మతతత్వం లకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం సబ్రంగ్ కమ్యునికేషన్స్, "కమ్యూనలిజం కంబాట్" అనే మాస పత్రిక ప్రచురణకు 2004,2006లలో ఫోర్డ్ ఫౌండేషన్ తో కన్సల్టేన్సిఒప్పందాన్ని కుదుర్చుకుంది.  కమ్యూనలిజం కంబాట్ పత్రికతో కాని, సంపాదక/ యాజమాన్య బాధ్యతల నిర్వహణకు జావేద్ ఆనంద్ కు,తీస్తా సేతల్వాడ్కు చెల్లించే పరిహారాలతో ఈ ఒప్పందానికి ఎటువంటి సంబంధం లేదు. న్యాయ నిపుణుల సలహా పొందిన తర్వాతే సబ్రంగ్ కమ్యూనికేషన్స్ కన్సల్టేన్సి ఒప్పదంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం  విదేశీ విరాళాల చట్టం సెక్షన్ 4 నుండి మినహాయింప బడటం వల్ల, దీని క్రింద  స్వీకరించే కన్సల్టేన్సి ఫీజు విరాళం క్రింద గాని, గ్రాంటు క్రింద కాని పరిగణింప బడకపోవటం మూలకంగా చట్ట ఉల్లంఘన క్రిందకు రాదు.
ఈ పరిణామాలు మీ సంస్థ కు, మీ కృషికి ఎంతటి నష్టాన్ని కలిగించాయి?
కొనసాగుతున్న ఒత్తిడి కాకుండా, ఈ పరిణామాలు మా విరాళాల దాతలను భయభ్రాంతుల్ని చేశాయి. అయినప్పటికీ మా మద్దతు దారులు పెరిగారు. పాలక వర్గం బహిరంగంగా మమ్మల్ని ఆహ్వానింప తగని వారుగా వర్గీకరిస్తే,అదొక సందేశాన్ని పంపింది. దాన్ని చాలామంది మౌనంగా స్వీకరించి, మాకు దూరంగా ఉంటున్నారు. దానర్ధం వాళ్ళు మమ్మల్ని ఏ మాత్రం నమ్మడంలేదని కాదు. వాళ్ళని వాళ్ళు రక్షించు కొంటున్నారు. 
లక్ష్యంగా చేయబడింది మీరు,జావేద్,మీ సంస్థే కాదు. గ్రీన్ పీస్, అణు వ్యతిరేక కార్యకర్తలు, మానవ హక్కుల కార్యకర్తలు కూడా పాలక  వర్గ  దాడులకు గురౌతున్నారు  
అది వాస్తవం. ఇతరులపై కంటే మాపై దాడులు తీవ్రమైనవైనా, ప్రజాతంత్ర నిరసనను నోరు నొక్కాలనే విస్తృత ధోరణి లో అదొక భాగంగా వుంది.  మతోన్మాదానికి, ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నవారిని ఒక ప్రక్క లక్ష్యం గా చేసికుంటుంన్నారు. మరో ప్రక్క ఫాసిస్ట్ తరహా అభివృద్ది నమూనాను, ప్రజా వనరులను అయినవారికి కట్టబెట్టే ధోరణులను ఎదుర్కొనే వారిని అమానుషంగా మట్టుబెడుతున్నారు. ఈ ఆగడాల్ని తీవ్రంగా ఎదుర్కోవలసిన సమయం ఆసన్నమైంది. 
సిబిఐ చర్యలు న్యాయ సాధనకు అవరోధంగా వున్నాయని మీరు మీడియా సమావేశంలో చెప్పారు. వివరించగలరా?
 మేము చట్టానికి అతీతులమని అనుకోము. కానీ సక్రమమైన  న్యాయ ప్రక్రియ కోసం ఒత్తిడి చేస్తాం. దుర్బుద్ధితో,దురుద్దేశ్య కరమైన దర్యాప్తులను ప్రశ్నించే హక్కును వుంచుకుంటూ మేము ఎప్పుడూ సహకరిస్తూనే ఉన్నాము. గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ దాఖలు చేసిన ప్రధమ సమాచార నివేదిక లో ఆర్ధిక అవకతవకల్ని ఆరోపించారు. లిఖిత పూర్వకమైన సాక్ష్యాలను పరిశీలించి సిబిఐ చే దర్యాప్తు చేయించుకోవచ్చును. అటువంటప్పుడు పోలీస్ కస్టడిలోనే మమ్మల్ని విచారించాలని  వారు కోరటంలో అర్ధమేమిటి? 
మేము ఏ చట్టాలను ఉల్లంఘించ లేదు. మేమిక్కడ సహకరించేందుకే వున్నాము. మొట్టమొదట గుజరాత్ అధికారులు ,ఇప్పుడు కేంద్రం, హోం మంత్రిత్వ శాఖ,సిబి ఐ ల త్రయం మా వ్యక్తిగత స్వేచ్చ లను పరిరక్షిస్తున్నట్లు  మమ్మల్ని పనిలో వుంచుతూ  గత 20నెలలు గడిచి పొయినాయి. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ఇచ్చిన'క్లీన్ చిట్'ను సవాలు చేసినందువల్ల, మేజిస్ట్రేట్ ఆమోదం పొందిన జకియా జఫ్రి రివిజన్ కేసు వాదనల సందర్భంగా గుజరాత్ హైకోర్టు లో నా ప్రమేయాన్ని, నా వ్యక్తిగత హాజరును అడ్డుకునేందుకే  ఇటివల సి బి ఐ మాపై చేసిన అసాధారణమైన దాడి ఉద్దేశ్యింప బడింది. సిబిఐ పంజరంలో చిలకల వ్యవహరిస్తున్నది. రోజువారీ విచారణల తో మమ్మల్ని కట్టి వేసి జాకియా జఫ్రి కేసులో మా కృషి ని నివారించేందుకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. 
నిరాఘాటంగా జరిగే సాముహిక మతతత్వ నేరాలకుభారత దేశంలో శిక్షలు లేవని పెట్రేగుతున్న దుష్టసంస్కృతికి , భారత దేశ సుప్రీంకోర్టు నిరంతర పర్యవేక్షణలో, చట్టబద్ధ సంస్థల మద్దతుతో, సి జే పి సమిష్టి కృషితో వెన్ను విరువ బడింది. 1983 నెల్లి ఊచకోతలోగాని,1984 సిక్కుల మారణహోమంలో గాని, 1992-93 బొంబాయిహింస లో గాని మనం న్యాయాన్ని చూడకలిగామా? పటేల్ తెగకు సంబంధించిన  కొంత మంది పలుకుబడి కలిగిన వ్యక్తులతో సహా 120 మంది ని శిక్షింప కలిగిన మా ప్రయత్నం చారిత్రకమైనది. ఈ విజయాలను మొరటుగా తలక్రిందులు చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లుంది. 
జాకియా జఫ్రి కేసు తుది దశలో వున్నది. మీ పై జరిగిన దాడి సందర్భం కాకతాళీయమా?     
ఇది కాకతాళీయం కాదు. మేము మొట్టమొదట 2006లో ఫిర్యాదును దాఖలు చేసినప్పుడు జాకియా జఫ్రి పరిణామాలకు సాక్షిగా నిలిచి, దుశ్చర్యలకు నివ్వెర పోయిన ఒక మహిళ. గుల్బెర్గ్ ఊచకోత జరిగిన తర్వాత రాత్రంతా ఆమె పోలిస్ స్టేషన్ లోనే గడిపింది. 'అహమ్మదాబాదు కాల్తుంటే పోలీసులు సెలవులపై వున్నట్లుందని 'ఆమె నాతో అన్న మాటలు  నాకు గుర్తున్నాయి. జరిగిన దుశ్చర్యలు  ఉద్దేశ్యపూర్వకంగా బాహాటంగా చేసినవనే భావన ఆమె మనస్సులో నాటుకొనివుంది. క్రిమినల్ కేసు దాఖలు చేయటానికి ఆ భావన ఒక్కటే సరిపోదు. ఇప్పుడు ఆ దుశ్చర్యలను  ఋజువు చేయటానికి తిరుగులేని సాక్ష్యాలు కలిగి వున్నాము. 
మన దేశంలో గోధ్రా ఎక్కడైనా జరిగివుంటే, దానికి ప్రతీకారంగా మూడు,నాలుగు దాడులు నిస్సందేహంగా జరిగి వుండ వచ్చునని చెప్పగలను. కాని పాలన వ్యవస్థ నిర్వహించాల్సిన పాత్ర ఏమిటి? ప్రశాంతం గా,శాంతియుతంగా వుండమని, ప్రతీకారాలకు, రక్తపాతానికి పాల్పడ వద్దనే స్పష్టమైన అభ్యర్ధనలు ఏమైనా ఉన్నాయా? ఇదే మేము చెప్తుంది. దీనిచుట్టూనే మేము కేసును నిర్మించాము. 
ఈ వాదనలే ప్రజా క్షేత్రంలోకి తిరిగి  వస్తాయని మేము ఆశిస్తున్నాం.కాని అది పాలకులకు రుచించదు."మీరు పిలుచు కొనే "క్లీన్ చిట్" పై మీకంత విశ్వాసముంటే, గుజరాత్ హైకోర్టులో విచారణలో వున్న  క్రిమినల్ రివిజన్ అప్లికేషన్(205/2014) మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంద"ని మేము పాలక వర్గాన్ని ప్రశ్నిస్తున్నాం. మీరు అభద్రత గా వున్నారా?
న్యాయాన్వేషణ,కార్యశీలతలు బాహాటంగా  అణచివేతకు గురౌతున్నాయా? నిర్భయమైన కార్యశూరతకు మీరు ప్రతీకలౌతున్నారు. . 
అదే అనుకుంటుంటే, ఆ పిలుపును వినయంగా స్వీకరిస్తాను. న్యాయం కోసం పోరాడేశక్తులకు మేము చెప్పేదేమంటే, " మేము లొంగం". మన ప్రజాస్వామ్యాన్ని ఫాసిస్ట్ తరహా సిద్దాంత వశం కానివ్వమని పూరించే  శంఖారవమిది.  
ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు భయభ్రాంతుల్ని చేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల కంటే భయానకంగా వున్నాయి. భారత రాజ్యాంగ  బద్ధ ప్రజాస్వామ్యాన్ని ఆశ్రిత కార్పోరేట్ సారధ్య హిందూ రాజ్యంగా మార్చాలన్న స్పష్టమైన అజెండా తయారయింది. పార్లమెంట్ లో 292 సీట్లున్నప్పటికి ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం విశిష్టమైనది కాదని మనం గుర్తుంచుకోవాలి. భారత  రాజ్యాంగమే అంతింమంగా విశిష్టమైనది. సమానత,సుపరిపాలన తో కూడిన రాజ్యాంగ సూత్రాలకు ఎన్నికలతో ఒనగూడిన  అధికారం యొక్క ఆటవిక ప్రదర్శన ఎన్నడూ ప్రత్యామ్నాయం కాజాలదు. జాతీయంగా కేవలం 31శాతం ప్రజలే ఈ నియంతృత్వ పాలనా వ్యవస్థను సమర్దిస్తున్నారన్న వాస్తవాన్ని మనం నిరంతరం గమనంలో వుంచుకోవాలి.  
గత కొద్ది నెలల నుండి మీకు మద్దతు వెల్లువెత్తు తుంది. కొంత  కాలం పాటు మిమ్మల్ని ఎలక్రానిక్ మీడియా పట్టించుకోలేదు 
 వెల్లువెత్తుతున్న ప్రజా మద్దతుకు కృతజ్ఞులమై  వుంటాము. దీని ద్వారా  మా శక్తియుక్తులు పునరుజ్జీవనమౌతున్నాయి. అనేక ప్రజా సమూహాలు,సంఘాలు, రాజకీయ పార్టీలు మమ్మల్ని నికరంగా సమర్ధిస్తున్నాయి. మీడియా మమ్మల్ని భారీగా తోసేసింది. ఏక పక్షంగా నష్టం జరిగి పోయిన తర్వాతనైనా ప్రతిస్పందనలను ప్రచురిస్తూ పత్రికా రంగం కొద్ది మేరకు మెరుగ్గావున్నా, ఎలక్ట్రానిక్ మీడియా, పాలక వర్గ సారధ్యంలో కక్షసాధింపు వేటను కొనసాగించింది. ఆ పరిణామాల్ని వివరణాత్మకంగా అధ్యయనం చేయాలన్నా ఒళ్ళు గగుర్పొడుతుంది. సమతుల్యం లేని వార్తా ప్రసారాలు, ఋజువులు లేని ఆరోపణలు,  ఏక పక్ష కధనాలతో కార్పోరేట్ సారధ్య మీడియా  పాలక వర్గాలకిచ్చిన మూర్ఘమైన మద్దతుకు మేము బలిపశువుల మయ్యాం. 
మీరు న్యాయంకోసం పోరాడుతున్నా మన్నప్పుడు , దానర్ధం ఏమిటి?
మేము చేసేది వ్యక్తిగత పోరాటం కాదు, సామూహిక నేరాలకు జవాబుదారీతనం  కోరుతూ  చేస్తున్న పోరాటమిది. గోద్రా ఉదంతం జరిగిన మొదటి  72గంటలే కాకుండా వారాలు,నెలలపాటు రాజ్యంగా వ్యవస్థ కుప్పకూలి అధికారంలో వున్న ప్రభుత్వం చట్టపరంగా జవాబుదారీ అయి, 2002మే వరకు గుజరాత్ అట్టుడిగి పోతూ , కెపిఎస్ గిల్ ను మొదటి ఎన్డియేప్రభుత్వం  పంపేవరకు జరిగిన పరిణామాలు, ప్రజా న్యాయం కోసం జరిగిన పోరాటాలు కావా?
రాష్ట్ర నిఘా విభాగం తీవ్రమైన హెచ్చరికలు చేసినా, స్పందించని పొలీస్, పరిపాలన వ్యవస్థల వైఫల్యాలను , పోలిస్ కంట్రోల్ రూం, మద్దతు కోసం ఇచ్చిన సందేశాలను తిరస్కరించిన  సీనియర్ అధికారుల నిర్లక్ష్యాన్ని   ప్రశ్నించి నప్పుడు- ఇవన్నీ పౌరుల  ప్రాధమిక హక్కుల పరిరక్షణ కోసం చేసే చట్టపరమైన చర్యలు కావా??  28.5. 2002 న మేము ఉపయోగించిన జాకియా జఫ్రి  దర్యాప్తు పత్రాలలో భాగమైన అహమ్మదాబాద్ పోలిస్ బ్రిగేడ్ ఇచ్చిన 47 సందేశాల్ని,  బాహాటంగా ఉద్దేశ్యపూర్వకంగా  త్రోసిపుచ్చినప్పుడు, తప్పొప్పులకు బాధ్యులైన పోలిస్ కమీషనర్ పి. సి.పాండే, అడిషనల్ పోలిస్ కమీషనర్ శివానంద్ ఝా ల వైఖరి మనకు ఏం చెప్తుంది? జవాబుదారితనం కోసం చేసే ఈ పోరాటాన్నివిరమించాలా??  మళ్ళీ ఎప్పుడూ చేయకూడదా ???
మీరు,మీ భర్త గడుపుతున్న కష్టతరమైన రోజులనుండి మ్మిమ్మల్ని,మీ భర్తని బయటపడి,రక్షణ పొందమని మీ శ్రేయోభిలాషులు మిమ్మల్ని ఎప్పుడైనా కోరారా? మీరలా చేస్తే ఏమవు తుందో ఆలోచించారా ?
ఇప్పటివరకు మా కాళ్ళ మీద మేమేనిలబడి, తీవ్రమైన వ్యక్తిగత నష్టానికి ఓర్చి  పోరాటం చేస్తున్నాము. మమ్మ్మల్ని నిలబెట్టిన ఈ స్థైర్యం  వీడదని  ఆశిస్తున్నాము. 

Saturday, July 25, 2015

గుజరాత్ కొమ్ముకాస్తూ దాచబడ్డ శిశు పౌష్టికాహార లోప సర్వే సమాచారం


-అమిత్  సేన్ గుప్తా 
వివాదాలతో, కుంభకోణాలతో గొంతు వరకు కూరుకుపోయిన ఎన్డియే ప్రభుత్వం అరుదైన మరో ఘన విజయాన్ని సాధించింది! కేంద్ర ప్రభుత్వ సహకారంతో యూనిసెఫ్(ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ శిశు అత్యవసర నిధి ) శిశుఆరోగ్యం పై నిర్వహించిన సర్వే పరిశీలనల్ని దాచటానికి ప్రభుత్వం నానా అగచాట్లు పడుతుందని ఇటీవల 'ఎకనమిస్ట్' పత్రిక మొట్టమొదటగా  ప్రచురించింది . 2013, 2014సం. లకు సంబంధించిన  శిశు పౌష్టికాహార లోపం పై సమాచారాన్ని సేకరించదంకోసం యుపియే ప్రభుత్వం శిశువుల పై రాపిడ్ సర్వేకు(రాపిడ్ సర్వే ఆన్ చిల్డ్రన్ -ఆర్ ఎస్ వొ సి ) ఆదేశించింది.

దాదాపు గత దశాబ్ద కాలంలో శిశు పౌష్టికాహారం పై మొట్ట మొదటగా నిర్వహిస్తున్న సర్వే కావటం వల్ల , సాధారణంగా విధాన నిర్ణయాలలో ఈ సర్వేసమాచారాన్ని  ఒక ముఖ్య సాధనంగా వినియోగించుకుంటాం .అప్పటివరకు 2005లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే- ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ )  పరిశీలనలు  శిశు పౌష్టికాహారం పై సమాచారం పొంద కలిగే చివరి వనరుగా వుండేవి. శిశు పౌష్టికాహార లోపంపై నిర్వహించిన యూనిసెఫ్ సర్వే  పరిశీలనల్ని దాచటంలో ఒక చమత్కారం వుంది. గత దశాబ్ద కాలంలో భారత దేశంలో పౌష్టికాహార లోపం గణనీయంగా తగ్గినట్లుగా ప్రశంసించ తగిన సమాచారాన్ని యూనిసెఫ్ సర్వే(రాపిడ్ సర్వే ఆన్ చిల్డ్రన్) తెలియచేస్తున్నది. అక్టోబర్2014 లోనే సర్వే తుది నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరినప్పటికీ,  ఇంతవరకు ఆ నివేదికను ప్రభుత్వం బహిరంగ పరచలేదని 'ఎకనమిస్ట్' పత్రిక ఆరోపిస్తున్నది. 

శిశు పౌష్టికాహార లోపంలో తగ్గుదలను సూచిస్తున్నయూనిసెఫ్ సర్వే 
గత దశాబ్ద కాలంలోస్థూలంగా భారత దేశంలో శిశు పౌష్టికాహార లోపం గణనీయంగా తగ్గినట్లు  సర్వే తెలియచేస్తున్నది.
 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(2005) లో గిడసబారిన(స్టంటింగ్), శుష్కించిన(వేస్టింగ్), బరువుతగ్గిన(అండర్ వెయిట్)శిశువుల(5సం.లోపు)శాతం, వరుసగా 48,20,43 వుండగా, యూనిసెఫ్ సర్వే(2014) లో వరుసగా 39,15,29 గా వుంది. (మూలం: ఎకనామిస్ట్ పత్రిక )

1998-99 ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ 2 సర్వే , 2005-6 ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ సర్వే ల మధ్య తగ్గిన తగ్గుదల కంటే యూనిసెఫ్ సర్వే లో గిడసబారిన(స్టంటింగ్), శుష్కించిన(వేస్టింగ్), బరువుతగ్గిన(అండర్ వెయిట్)శిశువుల తగ్గుదల రేట్లు  వరుసగా 9,5,14 శాతం పాయింట్లగా  వుండి . 1998-99 ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ 2 సర్వే , 2005-6 ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ సర్వేలలోతగ్గుదల కంటే గణనీయంగా తగ్గాయి. ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ సర్వేలలో1998 నుండి 2005 మధ్య కాలంలో  గిడసబారిన(స్టంటింగ్) శిశువులు, బరువుతగ్గిన(అండర్ వెయిట్) శిశువుల తగ్గుదల రేట్లు  వరుసగా 6, 3 శాతం పాయింట్లు వుండగా, ఇదే కాలంలోశుష్కించిన( వేస్టింగ్) శిశువులు  వాస్తవంలో 3శాతం పాయింట్లు పెరిగారు. పైన పేర్కొన్న ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ సర్వేను, యూనిసెఫ్ సర్వే(రాపిడ్ సర్వే ఆన్ చిల్డ్రన్) తో   పోల్చేటప్పుడు ఒక  హెచ్చరికను మనం గమనంలో ఉంచుకోవలసివుంది. ఈ రెండు సర్వేలు వైవిధ్యం కలిగిన  జనాభా పొందికలను,  లెక్కింపు ప్రక్రియలను కలిగి ఉన్నందున, వీటిని ఏ విధంగాను పోల్చలేము. అయినప్పటికీ యూనిసెఫ్ సర్వే సూచించిన గత దశకంలోని గణనీయమైన తగ్గుదల  పౌష్టికాహార లోపంలోని వాస్తవ తగ్గుదల రేట్లను సూచిస్తున్నది. 

గిడసబారటం(స్టంటింగ్), శుష్కించటం(వేస్టింగ్), బరువు తగ్గటం(అండర్ వెయిట్) లాంటి లక్షణాలు శిశువులలో పౌష్టికాహార లోప కొలమానాలుగా వుండి,  పౌష్టికాహార లోపం యొక్క మూలాలలోని  వివిధ అంశాల్ని వివరిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సూచికల ప్రభావాల్ని ఇలా వివరిస్తున్నది. స్టంటింగ్ అంటే గిడసబారటంగా పరిగణిస్తాము. దీనర్ధం వయస్సుకు తగ్గ ఎత్తు లేకపోవటం. శిశువుల పుట్టుక ముందు నుంచి వారిలో పేరుకున్న పౌష్టికాహార లేమిని, క్రిమిదోషకాల(ఇన్ఫెక్షన్) బారిన పడ్డ ప్రభావాన్ని, వారి తల్లులలో తీవ్రమైన పౌష్టికాహార లోపాన్ని శిశువులలో గిడసబారిన బాధితుల శాతం  తెలియచేస్తుంది.  శిశువులను పెరగనీయ కుండా దీర్ఘకాలంగా అదిమిపెట్టిన పెరుగుదల సామర్ధ్యాన్ని, కొనసాగుతున్న అధ్వాన్నపరిస్థితులకు  కొలమానంగా ఈ సూచికను పరిగణించ వచ్చును. శిశువులలో ఎత్తుకు  తగ్గ బరువు లేకపోవటాన్నిశుష్కించటం( వేస్టింగ్) అంటాము. శిశువులలో వయస్సుకు తగ్గ ఎత్తు లేకపోవటం(గిడసబారటం), ఎత్తుకు  తగ్గ బరువు లేకపోవటం  (శుష్కించటం )కలగలిసిన స్థితిని బరువు తగ్గటం(అండర్ వెయిట్) అంటాము. క్లుప్తంగా చెప్పుకుంటే, బరువు తగ్గట మంటే గిడసబారటం, శుష్కించటం ల కలగలిసిన లక్షణం. ఈ స్థితి తీవ్రమైన బరువు లోపాన్ని తెలియచేస్తుంది.'గిడసబారటం' తీవ్రమైన పౌష్టికాహార కొరతకు మెరుగైన సూచిక కాగా, ఇటీవలే తలెత్తిన ఆహార కొరత, తీవ్ర అస్వస్థల మూలంగా ఏర్పడ్డ పౌష్టికాహార లోపానికి 'శుష్కించటం' సూచికగా వుంటుంది. 

Monday, June 29, 2015

బేసెల్ ప్రమాణాల అడకత్తెరలో భారత జాతీయ బ్యాంకులు

బేసెల్ ప్రమాణాల అడకత్తెరలో భారత జాతీయ బ్యాంకులు 
-కొండముది లక్ష్మీ ప్రసాద్ 
ప్రపంచ ఆర్ధిక సంక్షోభ ధాటి నుండి ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థను రక్షించడం కోసం బాసెల్ 3 ప్రమాణాలు రూపకల్పన చేయబడ్డాయి. ప్రపంచీకరణ నేపధ్యంలో భారత ఆర్ధిక వ్యవస్థ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థతో అనుసంధానించిన కారణంగా భారత రిజర్వ్ బ్యాంక్ 1.4.2013 నుండి భారత దేశంలోని జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు బేసెల్ 3 ప్రమాణాలను అమలుచేయాలని ఆదేశించింది. ఈ ప్రమాణాల అమలుతో  బ్యాంకుల పరిరక్షణ ఎలాగున్నా, అదనపు మూలధన సమీకరణలో జాతీయ బ్యాంకులు జీవన్మరణ పోరాటం జరుపుతూ అంతిమంగా  ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయాల్సిన దుర్భర పరిస్థితులను నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వం కల్పిస్తున్నది.

బేసెల్ ప్రమాణాల నేపధ్యం 
నయా ఉదారవాద విధానాలు అమలౌతున్న దేశాలలో ద్రవ్య రంగంలో స్పెక్యులేషన్ ధోరణులు మితిమీరడంతో ఆర్ధిక వ్యవస్థలలో ఒడుదుడుకులు సర్వసామాన్య మయ్యాయి. వీటి నీలినీడలు  బ్యాంకింగ్ రంగంపై పడి బ్యాంకుల మనుగడే ప్రశ్నార్ధక మయ్యింది. ఈ క్లిష్ట పరిస్థితుల్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడం కోసం "అంతర్జాతీయ పరిష్కారాల బ్యాంకు"(బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ) పర్యవేక్షణలో, స్విజర్లాండ్ నందలి బేసెల్ నగరంలో బ్యాంకింగ్ పర్యవేక్షణ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీయే తదనంతర కాలంలో బేసెల్ కమిటీ గా ప్రాచుర్యం పొందింది. బ్యాంకుల పరిరక్షణకు బేసెల్ కమిటీ నిర్దేశించిన విధానాలను బేసెల్ నారమ్స్‌ లేదా  బేసెల్ ప్రమాణాలుగా పిలువబడుతున్నాయి. 
బేసెల్1 ప్రమాణాలు 
జులై, 1988లో అంతర్జాతీయ బ్యాంకులకు కావల్సిన కనీస స్థాయి మూలధన అవసరాలపై బేసెల్‌ కమిటి కొన్ని ప్రమాణాలను రూపొందించింది.  బ్యాంకింగ్‌ రంగ సుస్థిరతపై మొట్టమొదటిగా రూపొందించిన ఈ ప్రమాణాలను బేసెల్‌-1 ప్రమాణాలు లేదా బేసెల్‌ నారమ్స్‌గా ప్రసిద్ధికెక్కాయి. ఈ ప్రమాణాల ప్రకారం బ్యాంకు మంజూరు చేసిన ''రిస్క్‌''తో కూడిన రుణాల మొత్తంలో 8%తో సమానమైన మూలధనాన్ని ఆ బ్యాంకు అదనంగా కలిగి ఉండాలి. దీన్నే సముచిత మూలధన నిష్పత్తి (క్యాపిటల్‌ ఎడిక్వసీ రేషియో)  అని అన్నారు.  దీన్ని లెక్కించడం కోసంగా వివిధ రుణాలకు, వాటిలో ఇమిడివున్న రిస్క్‌ను బట్టి వెయిటేజ్‌లను నిర్ణయించారు. రుణాల నాణ్యతను బట్టి రుణ మొత్తంలో  పేర్కొన్న వెయిటేజ్‌ శాతం మేరకు ''సముచిత మూలధన నిష్పత్తి''ని బ్యాంకులు అమలు చేయాల్సి వుంటుంది.
బేసెల్1 ప్రభావాలు 
బ్యాంకులలో ''తగినంత మూలధన సమీకరణ''లో బేసెల్‌-1 ప్రమాణాలు విజయవంతమైనాయి. బేసెల్‌-1 ప్రమాణాలు ప్రధానంగా రుణాలలో ఇమిడి ఉన్న రిస్క్‌ పరిమాణంపై కేంద్రీకరించాయి. రుణాలలోని రిస్క్‌ విశ్లేషణ వర్గీకరణతో, అంతవరకు సామాజిక బాధ్యతగా అందించబడుతున్న రుణాలు అధిక రిస్క్‌ కలిగినవిగా భావించబడ్డాయి. దీనితో వాటి కేటాయింపులు తగ్గించడం మొదలైంది. ఫలితంగా వివిధ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రాధాన్యత రుణాల కేటాయింపు తగ్గిపోయింది. వసూలు కాని రుణాలను నిరర్ధక ఆస్థులు (నాన్‌ పర్‌ఫార్మింగ్‌ ఎస్సెట్స్‌)గా పరిగణించారు. బ్యాంకుల మొత్తం రుణాలలో నిరర్ధక ఆస్థుల నిష్పత్తిపై పరిమితి విధింపబడింది. ఈ పరిమితిని అమలు చేయటానికి అనేక బ్యాంకులు మొండి బకాయిలను తమ లాభాల్లో సర్దుబాటు చేసుకోవడంతో అవి నష్టాల బారిన పడి, మూలధన కొరతను ఎదుర్కొన్నాయి. బేసెల్‌-1 తదనంతర కాలంలో ద్రవ్య రంగంలో నెలకొన్న మౌళిక మార్పుల కారణంగా ఉత్పన్నమైన సమస్యల్ని పరిష్కరించడంలో బేసెల్‌-1 ప్రమాణాలు వైఫల్యం చెందాయి. అందువల్ల వాటిని సవరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బేసెల్‌-2 ప్రమాణాలకు రూపకల్పన జరిగింది. 
బేసెల్2 ప్రమాణాలు 
 ప్రపంచీకరణ స్వరూప స్వభావాలలో నెలకొన్న మార్పులతో ద్రవ్య మార్కెట్‌లో వినూత్న ద్రవ్య ఉత్పత్తులు (ఫైనాన్షియల్‌ ఇన్నోవేషన్స్‌) రంగం మీదకొచ్చాయి. ఈ ద్రవ్య ఉత్పత్తుల్లో స్పెక్యులేషన్‌ తీవ్రత భారీగా ఉంది. రుణ రంగ ప్రాధాన్యత పెరిగి, రుణ డెరివేటీవ్‌ ల్లాంటి అత్యధిక రిస్క్‌ కలిగిన ద్రవ్య ఉత్పత్తుల ప్రవేశంతో మార్కెట్‌ రిస్క్‌ అపరిమితంగా పెరిగింది. దీని తట్టుకోగలిగే ''రిస్క్‌'' యాజమాన్య పద్ధతులు బేసెల్‌-1 ప్రమాణాలలో లేకపోవడం బ్యాంకులకు పెను సవాలుగా మారింది. బేసెల్‌-1 ప్రమాణాలు అంచనా కట్టిన రుణ రిస్క్‌ పరిధికి మించిన పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని అదునుగా తీసుకున్న కొన్ని అంతర్జాతీయ బ్యాంకులు వారి వారి బ్యాలెన్స్‌ షీట్లను తమ్మినిబమ్మిని చేశాయి. నూతన ద్రవ్య ఉత్పత్తుల మూలకంగా నెలకొన్న అదనపు రిస్క్‌కు అనుగుణంగా అదనపు మూలధన సమీకరణ ప్రమాణాలు లేకుండా పోయాయి. అధిక నాణ్యత కలిగిన రుణాలపై బ్యాంకు ఆర్జించే లాభాల కంటే నాసిరక రుణాలు/పెట్టుబడులు అత్యధిక లాభాల్ని ఆర్జించడంతో, అంతర్జాతీయ బ్యాంకులు నాణ్యత కలిగిన రుణాల మంజూరును నిర్లక్ష్యం చేయడం మొదలైంది. బ్యాంకులు అంతర్గతంగా అనుసరిస్తున్న పద్ధతుల్లో పారదర్శకత లోపించింది. 1990లలో బేసెల్‌-1 ప్రమాణాలను తు.చ తప్పకుండా అమలు చేసిన థాయ్లాండ్‌, ఇండోనేషియా, మలేషియా లాంటి ఆసియా దేశాలలోని ద్రవ్య వ్యవస్థలు ద్రవ్య సంక్షోభంతో తల్లక్రిందులైనాయి. అనేక బ్యాంకులు మూతబడ్డాయి. ఈ సవాళ్ళను అధిగమించడానికి బేసెల్‌ కమిటి జూన్‌-2004లో బేసెల్‌-2 ప్రమాణాల పేర నూతన మార్గదర్శకాల్ని రూపొందించింది. ఈ ప్రమాణాలు బేసెల్‌-1 ప్రమాణాల కంటే మెరుగ్గా ఉన్నా, సంక్లిష్టంగా ఉన్నాయి. కనీసం మూలధన పరిమాణం, పర్యవేక్షణ సమీక్ష, మార్కెట్‌ క్రమశిక్షణ అనే మూడు స్తంభాలపై (పిల్లర్స్‌) బేసెల్‌-2 ప్రమాణాలు నిర్మింపబడ్డాయి.బ్యాంకులు  ఎదుర్కొనే రిస్క్‌ను బేసెల్‌-2 ప్రమాణాలు  రుణాల రిస్క్‌, మార్కెట్‌ రిస్క్‌, నిర్వహణ రిస్క్‌లుగా వర్గీకరించాయి.  
బేసెల్‌-2 ప్రభావాలు
 1. బ్యాంకులు ఎదుర్కొనే రిస్క్‌ ఆధారంగా వివిధ రుణాలపై వడ్డీరేట్లు నిర్ణయింపబడ్డాయి. 2. బేసెల్‌-2 ప్రమాణాల రూపకల్పనకు అత్యధిక స్థాయిలో గణాంక వివరాలు కావల్సి వచ్చింది. వివిధ స్థాయిలలో రిస్క్‌ను గణించటానికి అత్యధిక స్థాయి టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ల అవసరంవుంది. దీనికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందటానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరమయ్యాయి .3. ఇంత భారీస్థాయి పెట్టుబడులు, సేకరించాల్సిన అదనపు మూలధనం పెద్ద బ్యాంకులకే సాధ్యమవటం వల్ల, చిన్న బ్యాంకులు ఈ రంగంలోకి అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది.   బ్యాంకుల విలీనాలు, ఏకీకరణలకు బేసెల్‌-2 ప్రమాణాలు సారధులుగా పనిచేశాయి. 4. అత్యధిక మూలధన అవసరాల కోసం బ్యాంకులు విదేశీ పెట్టుబడులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి . 5. ద్రవ్య సంక్షోభ సమయాలలో కార్పోరేట్ల రుణ రేటింగ్‌ పడిపోయింది . దీని కారణంగా బేసెల్‌-2 ప్రమాణాల ప్రభావంతో అవసరమైన కాలంలో రుణాల లభ్యత పొందలేని పరిస్థితి ఏర్పడింది. అదే సందర్భంలో ఆర్థిక విజృంభణ (బూమ్‌) కాలం లో కార్పొరేట్ల రుణ రేటింగ్‌లు మెరుగై, బ్యాంకుల అధిక నిధుల లభ్యతతో రుణాల మంజూరు వేగవంతమయ్యాయి . దీని కారణంగా రుణ సంక్షోభాలకు దారి తీసి,  బ్యాంకుల సుస్థిరతకు పకడ్భం దీగా  బేసెల్‌-2 ప్రమాణాలురూపకల్పన  జరిగింద నుకొన్నప్పటికీ , 2007/2008 లో  సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని, బ్యాంకుల దివాళాలను అవి  ఆపలేకపోయాయి.
బేసెల్ ప్రమాణాలు -భారత దేశం 
సరళీకరణ విధానాల నేపథ్యంలో 1992లో భారత దేశంలో ఈ ప్రమాణాల అమలుకు పూనుకున్న రిజర్వు బ్యాంక్‌, 1999 నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. బేసెల్‌ కమిటీ ఈ ప్రమాణాలలో ''సముచిత మూలధన నిష్పత్తి'' (క్యాపిటల్‌ ఎడిక్వసీ రేషియో)ని 8%గా నిర్ణయించగా, రిజర్వు బ్యాంకు ఈ నిష్పత్తిని 9%గా ఖరారు చేసింది.బేసెల్‌-1 ప్రమాణాల ప్రకారం నిరర్దక ఆస్తులు పెరిగిన మేరకు బ్యాంకులు అదనపు మూలధనాన్ని పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బ్యాంకులు అనివార్యంగా నిరర్దక ఆస్తుల్ని తగ్గించాల్సి వచ్చింది. జాతీయ బ్యాంకులు ఆర్జించిన విశేష లాభాలను మొండిబాకీలకు సర్దుబాటు చేయడంతోను, ప్రభుత్వం అందించిన అదనపు మూలధనంతోనూ, నిరర్దక ఆస్తుల శాతం తగ్గింది. ఈ పరిణామంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలలో పడటం, వాటి ప్రయివేటీకరణకు పాలక వర్గాలు కసరత్తు చేయటం మొదలైంది. బ్యాంకుల రుణ డిపాజిట్‌ నిష్పత్తి తగ్గుముఖం పట్టింది. ప్రాధాన్యతారంగ రుణాలను ఇవ్వటానికి వాణిజ్య బ్యాంకులు విముఖతను చూపడంతో, వ్యవసాయ రుణాల మంజూరు తగ్గింది.
ఫిబ్రవరి 2005లో బేసెల్‌-2 ప్రమాణాల అమలుకు కావల్సిన మార్గదర్శకాల్ని రిజర్వు బ్యాంక్‌ నియమించిన స్టీరింగ్‌ కమిటీ విడుదల చేసింది. వీటి ప్రకారం  భారతీయ వాణిజ్య బ్యాంకులు బేసెల్‌-2 ప్రమాణాల్ని అనుసరించాల్సిన అవసరం లేదు.  అంతర్జాతీయ ద్రవ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు వివిధ దేశాలలో బేసెల్‌-2 ప్రమాణాల పూర్తి అమలును ప్రోత్సహించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ కూడా తమ సభ్య దేశాలు ద్రవ్య రంగ సుస్థిరత కోసం ఈ ప్రమాణాలను అమలు చేయాలని, విదేశీ బ్యాంకుల విస్తరణకు అంగీకరించాలని, వివిధ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలలో పేర్కొంది. భారత్‌ కూడా అందులో ఒక సభ్య దేశం. ఈ నేపథ్యంలో భారత దేశంలో రిజర్వ్‌ బ్యాంకు బేసెల్‌-2 ప్రమాణాల అమలుకు సిద్ధమైంది. బేసెల్ 2 ప్రమాణాల అమలుకు కావలసిన  నిధుల పరిమాణం మరింతగా పెరిగింది. జాతీయ బ్యాంకులు వారి లాభాలను  అంతకు ముందు నిరర్దక ఆస్తుల అదుపుకు సర్దుబాటు చేయడం, ప్రభుత్వం నుండి బాండుల రూపంలో రుణం పొందటంతో అదనపు మూలధన సమీకరణకు నూతన మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ బ్యాంకులు 51%నికి మించిన ప్రభుత్వ వాటాలను రిటైల్‌ మార్కెట్లో అమ్మటానికి అనుమతించింది. ఈ చర్య ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణకు శ్రీకారం చుట్టింది. అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు బేసెల్‌-2 ప్రమాణాల అమలుకు ప్రభుత్వ వాటాల ఉపసంహరణకు పూనుకున్నాయి. ఈ ధోరణి వేగం పుంజుకొని ప్రభుత్వ ఆధీనంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటాలను 33%నికి తగ్గించాలని వత్తిడి పెరిగింది. బ్యాంకు ఉద్యోగ, అధికార సంఘాల వ్యతిరేకత, 2007/2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో ఈ ధోరణికి బ్రేక్‌ పడింది. ప్రయివేట్‌ బ్యాంకులు సైతం అదనపు మూలధన సమీకరణకు పెట్టుబడి మార్కెట్‌ను ఆశ్రయించాయి. ఈ సమయంలో మార్చి 2004లో ప్రయివేట్‌ రంగ బ్యాంకులలో ఆటోమేటిక్‌ మార్గంలో 74% వరకు విదేశీ పెట్టుబడిని అనుమతించటానికి ప్రభుత్వం అంగీకరించింది. కొన్ని ప్రయివేట్‌ బ్యాంకులు విదేశీ పెట్టుబడిని ఆహ్వానించి విదేశీ బ్యాంకులుగా మారాయి. ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు, హెచ్‌.డి.ఎఫ్‌.సి బ్యాంకు ఈ కోవలోవే. ఈ రకంగా బారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటీకరించటానికి, విదేశీ బ్యాంకుల విస్తరణను పెంచటానికి బేసెల్‌-2 ప్రమాణాలు సాధనాలయ్యాయి. బేసెల్‌-2 ప్రమాణాలు ''సముచిత మూలధన నిష్పత్తి'' 8%గా ఉండాలని నిర్దేశించగా, రిజర్వ్‌ బ్యాంకు 9%గా నిర్ణయించింది కాని భారత ప్రభుత్వం ఈ నిష్పత్తి 12% ఉండాలని ఆదేశించింది. దీంతో వాణిజ్య బ్యాంకులు సమీకరించాల్సిన మూలధన పరిమాణం అనూహ్యంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య సంస్థ నుండి రెండు బిలియన్‌ డాలర్ల మొదటి విడత రుణాన్ని బ్యాంకుల అదనపు మూలధనం సమీకరణకోసం పొందింది.
బేసెల్‌-3 ప్రమాణాలు
 అత్యధిక లాభాల వేటలో నిజ ఆర్ధిక వ్యవస్థను లక్ష్య పెట్టకుండా ద్రవ్య పెట్టుబడి చేపట్టిన వికృత చేష్టలు 2007/2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి కారణభూతం కాగా, వాటిని అరికట్టే చర్యలేమి చేపట్టకుండా,  ఇటువంటి సంక్షోభాల నుండి బ్యాంకులను, ద్రవ్య వ్యవస్థలను పరిరక్షించే కర్తవ్యాన్ని బేసెల్ 3 ప్రమాణాలు నెత్తికెత్తుకున్నాయి. అమితమైన నిధులలభ్య త(లిక్విడిటి), అత్యధికమైన అప్పులు/మూలధన నిష్పత్తి(లివరేజ్ రేషియో), అతి తక్కువ మూలధనం, చాలీచాలని నిధుల లభ్యత బఫర్లు- 2008 ద్రవ్య సంక్షోభానికి ప్రధాన కారణాలుగా బేసెల్ కమిటీ భావించింది. వీటితో పాటు రిస్క్ యాజమాన్యం, కార్పోరేట్ పాలన, మార్కెట్ పారదర్శకత మరియు పర్యవేక్షణ నాణ్యతలు లోపభూయిష్టంగా వున్నట్లు అభిప్రాయపడింది. బేసెల్‌-2 ప్రమాణాలు బ్యాంకుల నియంత్రణను కీలకంగా తీసుకొని రూపొందించబడ్డాయి. విడివిడిగా బ్యాంకుల సుస్థిరతే కాకుండా ''ద్రవ్య రంగ వ్యవస్థ మొత్తం సుస్థిరత'' ధ్యేయంగా బేసెల్‌-3 ప్రమాణాల ప్రతిపాదనలు తయారయ్యాయి. బేసెల్‌-2 ప్రమాణాల కంటే కనీస సముచిత మూలధనంలో మెరుగైన  నాణ్యతను, గణనీయమైన పరిమాణాన్ని ఈ ప్రమాణాలు నిర్దేశిస్తున్నాయి. అలాగే నిధుల లభ్యత (లిక్విడిటీ) నిష్పత్తిపై విడివిడి దేశాలకు స్వేచ్ఛనివ్వకుండా విశ్వ ప్రామాణికమైన నిధుల లభ్యత నిష్పత్తిని ఖరారు చేయటానికి ఈ ప్రమాణాలు సిద్ధమయ్యాయి.
భారత దేశంలో బేసెల్ 3 ప్రమాణాల అమలు ఎందుకు?
భారత ఆర్ధిక వ్యవస్థ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తో అనుసంధానం కావడం, ప్రపంచంలో అభివృద్ది చెందుతున్న ఒక ప్రధాన ఆర్ధిక వ్యవస్థ గా భారత దేశం పరిణామం చెందే దిశలో  వుండటం ప్రధాన కారణాలుగా  భారత రిజర్వ్ బ్యాంకు  బేసెల్ 3 ప్రమాణాల అమలుకు అంగీకరించింది. మొదట్లో ఈ ప్రమాణాలను భారత దేశంలో జనవరి1,2013 నుండి అమలుచేయాలనుకున్నప్పటికి, ఏప్రియల్ 1,2013 నుండి మొదలై  ఈ ప్రక్రియ 31మార్చి2019 నాటికి అన్ని విధాలుగా పూర్తి  కావాలని  రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించింది. 
బేసెల్3 ప్రమాణాల అమలు ఖరీదెంత 
ఈ ప్రమాణాల అమలుకు భారతీయ బ్యాంకులు ప్రత్యేకించి జాతీయ బ్యాంకులు భారీ స్థాయిలో నిధుల్ని సేకరించాల్సి వుంది. ఈ నిధుల్ని మొదటి అంచె (టైర్ 1)మూలధనం, రెండవ అంచె(టైర్ 2) మూలధనం గా వర్గీకరించారు.  మొదటి అంచె మూలధనం క్రింద బ్యాంకు వాటాదారుల నుండి సేకరించే అదనపు మూలధనం, బ్యాంకుల అంతర్గత నిదులైన లాభాలు, రిజర్వ్ నిధులు, బ్యాంకు వాటాలు అమ్మడంద్వారా ఒనకుడే మూలధనం, మరియు మొదటి అంచె హైబ్రిడ్ బాండుల అమ్మకం ద్వారా సేకరించిన నిధులు వున్నాయి. రెండవ అంచె మూలధనం  క్రింద రెండవ అంచె బాండుల విక్రయం ద్వారా పొంద కలిగే నిధులు వున్నాయి. 
ఈ ప్రమాణాల ప్రకారం మొత్తం మూలధన నిష్పత్తి 31. 3. 2014 నాటికి 9శాతం తో మొదలై, 31. 3. 2018 నాటికీ 11. 5శాతానికి చేరుకోవాలి.  వివిధ రేటింగ్ సంస్థల అంచనాలలో,  భారత జాతీయ బ్యాంకుల్లోవచ్చే 4 సంవత్సరాలో అదనంగా 4,60,120 కోట్ల రూపాయలు పెట్టుబడి  కనీసంగా  సమీకరించ వలసివుంది. ఇందులో మొదటి అంచె(టైర్1)మూలధన ఈక్విటీ  రూపంలో రూ. 2,39,720 కోట్లు, మొదటి అంచె(టైర్1) మూలధన  హైబ్రిడ్ బాండుల  రూపంలో రూ. 1,55,900కోట్లు, రెండవ అంచె(టైర్2) పెట్టుబడి బాండుల రూపంలో రూ. 64,500కోట్లు సమీకరించాలి. మొదటి అంచె(టైర్1) మూలధన  హైబ్రిడ్ బాండులు,రెండవ అంచె(టైర్2) పెట్టుబడి బాండులను సంస్థలు, వ్యక్తుల నుండి సమీకరించ వచ్చును.  కాని మొదటి అంచె(టైర్1)మూలధనాన్ని జాతీయ బ్యాంకుల ఈక్విటీ వాటాల  విక్రయం ద్వారా,బ్యాంకుల అంతర్గత వనరులైన లాభాలు , రిజర్వ్ నిధులు ద్వారా  కాని  సమీకరించాలి. 
నిధుల సమీకరణలో కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ 
ఇంతటి భారీ నిధులు స్వంతంగా సమీకరించ కలిగే శక్తి జాతీయ బ్యాంకులకు  లేని కారణంగా, జాతీయ బ్యాంకుల అత్యధిక వాటాల హక్కుదారుడైన కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను అందించ వలసి వున్నది. గతంలో బేసెల్ 1,బేసెల్ 2 ప్రమాణాలు అమలు సందర్భంగా  అవసరమైన మూలధనం లో కొంత భాగాన్ని కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ కేటాయింపులా ద్వారా సమకూర్చింది. 2000-01నుండి 2014-15 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం రూ. 80,200కోట్ల పెట్టుబడిని జాతీయ బ్యాంకులకు సమకూర్చింది . ఇందులో రూ. 58,600 కోట్లు 2010-11 నుండి 2013-14 మధ్య కాలంలో సమకూర్చినవే. కాని మోడీ నాయకత్వంలోని ఎన్డియే ప్రభుత్వం 2014-15 సం. లో  జాతీయ బ్యాంకుల  మూలధన  సమీకరణకు  రూ. 11,200కోట్ల బడ్జెట్ కేటాయింపు వుండగా వాస్తవంలో రూ.6900కోట్లు మాత్రమే అందించింది.కుదించిన ఈ మొత్తం కేవలం 9 జాతీయ బ్యాంకులకు వాటి పనితీరును బట్టి  ప్రభుత్వం నిర్దిష్టంగా  కేటాయించింది. మిగిలిన బ్యాంకులకు నిధుల కేటాయింపు శేష ప్రశ్నగానే మిగిలివుంది. దీనికి కొనసాగింపుగా 2015-16 సం. నికి బడ్జెట్ కేటాయింపును అరకొరగా రూ. 7940కోట్లకు తగ్గించింది . కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ఒంటెద్దు పోకడలు జాతీయ బ్యాంకులకు  మూలధనం అందించడంలో తమ వ్యతిరేకతను తెలియ జేస్తున్నాయి. 
ముందస్తు వ్యూహంలో ఎన్డియే ప్రభుత్వం .
ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మూలధన సమీకరణ విషయంలో జాతీయ బ్యాంకులకిస్తున్న సందేశం సుస్పష్టంగానే వున్నది. ద్రవ్య  సుస్థిరత (ఫిస్కల్ కన్సొలిడేషన్)మిషతో, జాతీయ బ్యాంకులకు మూలధనం క్రింద జరిపే బడ్జెట్ కేటాయింపులు  ద్రవ్య లోటును భారీగా పెంచుతుందని, భారత ఆర్ధిక వ్యవస్థ ఈ లోటును భరించే స్థితిలో లేదని కేంద్ర ప్రభుత్వం వాదిస్తుంది. పారిశ్రామిక ప్రగతి పేరుతో లక్షల కోట్ల రూపాయలను బడా పారిశ్రామిక వేత్తలకు రాయితీలు కట్టబెట్టినప్పుడు స్పురణకు రాని ద్రవ్య లోటు, ఆర్ధిక వ్యవస్థకు పట్టుగొమ్మలుగా  ఆపార సేవలందించిన జాతీయ బ్యాంకుల మనుగడను నిలబెట్టేందుకు అందించాల్సిన నిధులు ప్రభుత్వానికి తలకు మించిన భారం కావడం కేంద్ర ప్రభుత్వ వర్గ దృక్పధాన్ని తేటతెల్లం చేస్తున్నది. జాతీయ బ్యాంకులు మూలధన సమీకరణకు అవసరమైన నిధుల్ని వాటంతటవే వివిధ సృజనాత్మక పద్ధతులలో ఏర్పరచుకోవాలని,  బ్యాంకుల మూలధన సమీకరణ కేంద్ర బడ్జెట్ కు మరింత భారం కాకూడదన్న  వాదనను మనం కూడా అంగీకరిస్తే, సృజనాత్మక ద్రవ్య ఆవిష్కరణలతో నిధులను సమీకరించే ప్రక్రియకు రిజర్వ్ బ్యాంకు సహాయం చేయవలసి వుంటుంది .  కానీ  దానితోనే  ఈ సమస్య పరిష్కారం కాదు. ద్రవ్య సుస్థిరత చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకుల మూల ధన సమీకరణ బాధ్యత నుండి తప్పించుకుంటే, జాతీయ బ్యాంకులకు  ప్రభుత్వ  వాటాల విక్రయం ద్వారానే నిధులను  సేకరించు కోవటం అనివార్యమౌతుంది.  52శాతానికి తగ్గకుండా జాతీయ బ్యాంకులు ప్రభుత్వ ఈక్విటీ హోల్డింగ్ ను తగ్గించుకోవచ్చునని  మార్చి 2015 లో  కేంద్ర ప్రభుత్వ సహాయ ఆర్ధిక మంత్రి జయంత్ సిన్హా పార్లమెంట్ లో చేసిన ప్రకటనను ఈ పరిణామాలలో భాగంగా చూడాల్సి వుంది. 
దొడ్డి త్రోవన జాతీయ బ్యాంకుల ప్రయివేటీకరణకు కుట్ర 
రిజర్వ్ బ్యాంకు బేసెల్3 ప్రమాణాల అమలుకు నిర్యయం తీసికున్నప్పుడు ప్రభుత్వ అంచనాలు ఇలా వున్నాయి. వచ్చే నాలుగేళ్ళలో జాతీయ బ్యాంకులలో ప్రభుత్వ వాటా 52శాతం తగ్గకుండా, ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా  రూ. 1,60,825 కోట్లు, మొదటి అంచె, రెండవ అంచె బాండుల మార్కెట్  విక్రయం ద్వారా రూ. 2,20,400 కోట్లు, బడ్జెట్ కేటాయింపుల ద్వారా 78,895 కోట్లు మూలధనాన్ని సమీకరించాలి.  ఈ కాలంలో జాతీయ బ్యాంకుల నుండి డివిడెండ్ల రూపంలో రూ. 34500కోట్లు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం నికరంగా భరించాల్సిన భారం రూ. 44395 కోట్లు అవుతుంది. అంటే సంవత్సరానికి రూ. 11000 కోట్లు సరిపోతాయి. ఈ అంచనాలు చూడటానికి, వినడానికి సాధ్యమైనవిగా తోచిన, ఆచరణలో అవి అంత సులువుగా సుసాధ్యాలు కావని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జాతీయ బ్యాంకులలోప్రభుత్వ ఈక్విటీ,  43శాతం బ్యాంకులలో 51-61శాతంగా, 24శాతం బ్యాంకులలో 62-71 శాతంగా, 19శాతం బ్యాంకులలో 72-81 శాతంగా, 14శాతం బ్యాంకులలో 82శాతంగా వున్నది. సెన్సెక్స్ గరిష్టంగా 29000 పాయింట్ల స్థాయికి పెరిగిందనుకొని,  ప్రస్తుత జాతీయ బ్యాంకుల వాటాల బుక్ చేసే ధరకు , జాతీయ బ్యాంకుల లోని 52శాతానికి పైబడ్డ వాటాలనన్నింటిని విక్రయించినా,  రూ.1,00,000 కోట్లకు మించి మూలధన సమీకరణ సాధ్యం కాదని స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. . ప్రభుత్వ విధానం- జాతీయ బ్యాంకుల మూలధన సమీకరణ కేవలం ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారానే జరగాలంటే , రూ.1,60,825 కోట్ల సమీకరణకు, జాతీయ బ్యాంకులలో 52శాతం కంటే తక్కువగా ప్రభుత్వ  ఈక్విటీని పెద్ద మొత్తంలో  తగ్గించవలసి వుంటుంది. దీని పర్యవసానంగా  జాతీయ బ్యాంకులలో కేంద్ర ప్రభుత్వం తమ యాజమాన్యాన్నే వదులుకోవలసి వస్తుంది. ఈ అంచనాను రూఢీ  చేస్తున్నట్లు, కలకత్తాలో రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధి  పత్రికా సమావేశంలో మాట్లాడుతూ జాతీయ బ్యాంకులలో 52శాతానికి మించిన ప్రభుత్వ వాటాల విక్రయంతోనే బేసేల్3 ప్రమాణాల అవసరాలు తీరవన్నారు. .
ప్రగతే వినాశకారి 
 మూలధన అవసరాలను అంచనా వేసేటప్పుడు, ఈ గణాంకాలు ఎలా వచ్చాయో కూడా అవగాహన చేసికొనవలసివుంది. జాతీయ బ్యాంకుల ఆర్ధిక స్థాయిని బట్టి,  భవిష్యత్తులో నిర్వహించబోయే వ్యాపారాన్ని బట్టి మూలధన పరిమాణం నిర్ణయించబడుతుంది. శీఘ్రంగా డిపాజిట్లు వసూలుచేసి,రుణాలు మంజూరు చేసినట్లయితే వాటిలో రిస్క్ తో కూడిన  ఆస్తులూ పెరుగుతాయి. బేసెల్ 3 ప్రమాణాల నిబంధనల ప్రకారం రిస్క్ తో   కూడిన ఆస్థులు పెరిగితే, ఆస్థుల పరిమాణం, అందులోవున్న రిస్క్ మోతాదును బట్టి  అవసరమైన మూలధన పరిమాణం పెరుగుతుంది. ఉదాహరణకు ఒక బ్యాంకు ఒక రంగంలో రూ. 1000 కోట్ల రుణాలు మంజూరు చేయాలనీ లక్ష్యం గా పెట్టుకుంటే కనీసం రూ. 90 కోట్ల మూలధనం సమకూర్చు కుంటే కాని రుణాల మంజూరుకు రిజర్వ్ బ్యాంకు అనుమతి నివ్వదు.  బేసెల్ 3 ప్రమాణాల అమలు ఐచ్చిక మైనా, భారత దేశంలో ఒక బ్యాంకు ఈ ప్రమాణాల ప్రకారం మూలధన నిధుల్ని ఏర్పరచుకోక పోతే, ఆ బ్యాంకు కార్యకలాపాల నిర్వహణను రిజర్వ్ బ్యాంకు అనుమతించదు  మూడీ రేటింగు సంస్థ వాదనల ప్రకారం, భారత దేశంలో బ్యాంకుల వ్యాపారాభివృద్ధి మోస్తరుగా వుండి, బ్యాంకుల నిరర్ధక ఆస్థులు తగ్గుముఖంలో వుంటే, బ్యాంకు ఋణ వితరణలో 62శాతంగా వున్న 11 జాతీయ బ్యాంకులు 2015 నుండి  2019 ఆర్ధిక సంవత్సరం వరకు కనీసం  రూ.1,50,000నుండి రూ.2,40,000 కోట్ల మూలధనం సమీకరించాల్సి వుంటుంది. మూడీ రేటింగ్ సంస్థ కు భారత దేశ అసోసియేట్ సంస్థ అయిన "ఇక్రా"2010లో అంచనా వేస్తూ 2019లోగా  భారత దేశంలో జాతీయ, ప్రైవేట్ బ్యాంకులు కలసి 6 లక్షల కోట్లు మూలధనం క్రింద సేకరించు కోవాల్సి వుంటుదన్నారు.
ఇంతటి భారి నిధుల సమీకరణ తో జాతీయ బ్యాంకులు బతికి బట్టకట్టేనా ? 
పెట్టుబడులపై అధిక ఆదాయం(రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ మెంట్). రావాలంటే అధికంగా వ్యాపారం చేయాలి. అధికంగా వ్యాపారం చేయాలంటే అధికంగా అదనపు మూలధనం సమీకరించాలి. ఈ మూలధనాన్ని మార్కెట్లో  మొదటి అంచె(టైర్1) మూలధన బాండుల రూపంలో సమీకరిస్తే 5 సంవత్సరాలపాటు వడ్డీ , తర్వాత ఆ బాండు దారునికి ఈక్విటీ వాటాలు విక్రయించాలి. అంటే క్రమంగా ప్రైవేట్ బాగస్వామ్యాన్ని అధిక వ్యాపారం చేసి పెంచడమే అవుతుంది.రెండవ అంచె  బాండుల విక్రయం మొదటి అంచెబాండుల విక్రయంకు మించి ఉండకూడదు   రెండవ అంచె  బాండుల విక్రయంతో మూలధనాన్ని సమీకరించాలంటే దాదాపు 11.5 శాతం వడ్డీ చెల్లించాలి. ఇది ఖర్చును పెంచి  లాభాలను కుదిస్తుంది. ఇది ఈక్విటీ పై ఆదాయాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా వాటాల మార్కెట్ విలువ తగ్గుతుంది. టైర్1 మూలధన సమీకరణకు  అధిక పరిమాణంలో బ్యాంకు వాటాలను అమ్మాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ కూడా జాతీయ బ్యాంకులలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచేదే. దీనర్ధం ప్రభుత్వం, జాతీయ బ్యాంకులలో  తేడా చూడకుండా  మూలధన వనరులను అందించక పొతే అవి మనుగడ ప్రశ్నార్ధకమే. 
అంత్య క్రియలకు రంగం సిద్ధం 
బేసెల్ ప్రమాణాల పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే, అవి ఆచరణలో అన్ని విధాలుగా జాతీయ బ్యాంకుల మనుగడకు విఘాతంగా వున్నాయి. దీనికి తోడు జాతీయ బ్యాంకుల పనితీరుపై కేంద్ర ప్రభుత్వం జనవరి 20,2014న పి. జె.. నాయక్ సారధ్యంలో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ మే 12. 2014 న తన నివేదికను అందించింది. జాతీయ బ్యాంకుల పనితీరు లోపభూయిష్టంగా వుండి, ప్రభుత్వానికి గుదిబండగా వున్న కారణంగా జాతీయ బ్యాంకులలో ప్రభుత్వ వాటాలను 50శాతం కంటే తక్కువకు కుదించి వాటి పని తీరులో  తీవ్ర మార్పుల్ని చేపట్టాలని సిఫార్సుచేసింది. బేసెల్ 3 ప్రమాణాల అమలుతో ఉత్పన్నమయ్యే  పరిణామాలను వినియోగించుకొని జాతీయ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయటానికి బాటలు వేయటమే ఈ సిఫార్సుల లక్ష్యం గా వుంది. ఈ సిఫార్సులను సూత్రప్రాయంగా ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తున్నది. 2015 జనవరి 2,3 తేదీలలో పూనా లో జ్ఞాన్ సంగం పేర జాతీయ బ్యాంకుల అధినేతలతో సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిధి గా హాజరయ్యారు. ఈ సమావేశం జాతీయ బ్యాంకులను ప్రైవేటు పరం చేసే రోడ్  మ్యాప్ ను చర్చించి నట్లు తెలుస్తుంది.  
 ప్రత్యామ్నాయం ఏమిటి ?
అదనపు మూలధన అవసర పరిమాణాలు  చాలా వింతగా వున్నాయి. బేసెల్ల్3 ప్రమాణాల రూపకల్పన ముందు అంతర్జాతీయ ప్రమాణాల కంటే భారత దేశ బ్యాంకింగ్ రంగంలో సముచిత మూలధన నిష్పత్తి  చాలా ఆరోగ్యకరంగా  వుంది.  వాస్తవంలో బ్యాంకింగ్ వ్యవస్థ  పనితీరు స్థానిక ప్రమాణాల కంటే మెరుగ్గా వుంది. బేసెల్ 2 ప్రమాణాల ప్రకారం సాధారణ టైర్ 1 మూలధన నిష్పత్తి 2 శాతం ఉండాల్సి వుండగా  భారత దేశ ప్రమాణం 3.6 శాతం గా వుంది. బేసెల్ 2 ప్రమాణాల ప్రకారం మొత్తం మూలధన నిష్పత్తి 8 శాతం కాగా, భారత దేశ ప్రమాణాలలో అది 9శాతంగా వుంది. 
ప్రాధమికంగా ఇటువంటి అనుకూల పరిస్థితులున్నప్పటికి, మూలధన అంచనాలు ఈ క్రింది   కారణాల రీత్యా  భారీగా వున్నాయని నిపుణులు భావిస్తూ, జాతీయ బ్యాంకుల పరిరక్షణకు క్రింది సూచనలు చేస్తున్నారు  
. 1. బ్యాంకింగ్ వ్యాపారం లో భారత దేశం భారీగా విస్తరింప బడుతుందని అంచనా వేయబడింది. 1990లలో షెడ్యుల్డ్ బ్యాంకుల  స్థూల దేశీయోత్పత్తిలో రుణాల శాతం 20-22 వుండగా, 2003-04 నాటికి 55శాతానికి చేరింది. ఈ అనుభవంతో రుణాల బూమ్ యధాతధంగా కొనసాగుతుందని అంచనా వేశారు. కాని 2000 సం. లలో విదేశీ నిధులు భారీగా భారత దేశంలో ప్రవేశించి తేలిక గా  నిధుల లభ్యత కలిగిన ఆర్ధిక పరిస్థితులలో ఋణాల బూమ్ ఏర్పడింది. బ్యాంకింగ్ రంగంలో చొరబడిన సరళీకరణ మూలకంగా విస్తారమైన రుణ గ్రహీతలతో అప్పులు చెల్లించని వారి సంఖ్యను కూడా పెంచింది. ఫలితంగా  స్థూల నిరర్ధక ఆస్తులు పెరిగాయి . అందువల్ల భారత దేశంలో అపరిమితంగా పెరిగిన  బ్యాంకింగ్ వ్యాపార విస్తరణ ఆరోగ్య ఫలితాల్ని ఇవ్వనందున, అటువంటి వ్యాపారంపై ఆధారపడ్డ  భవిష్యత్తు అంచనాలు సమంజసం కాదు. ఈ అంచనాల్ని తిరిగి సమీక్షించాలి. 
2.  ఈ మధ్య సంవత్సరాలలో గణనీయంగా పెరిగి డిసెంబర్ 2014 నాటికి 5. 6 శాతంగా వున్న స్థూల నిరర్ధక ఆస్తుల స్థాయి ఇంకా పెరుగుతుందని అంచనా వేయబడింది. దీని పర్యవసానంగా కూడా అదనపు మూలధన పరిమాణ అంచనాను పెంచారు.  మొండి బాకీలలో అత్యధిక శాతం సంపన్న వర్గాలు, రాజకీయ నాయకులవి. పారుబాకీల చిట్టాను బహిర్గతం చేసి కఠిన చర్యలతో, చట్టాలతో బా వసూళ్ళకు పూనుకోవడంలో  పాలక వర్గాలు తగు రీతిలో స్పందించలేదు. డిశంబర్2014 నాటికి జాతీయ బ్యాంకులలో నిరర్ధక ఆస్తుల క్రింద రూ. 2,73,000 కోట్లు, పునర్నిర్మాణం చేయబడ్డ కార్పోరేట్ల బకాయిలు రూ. 2,72,000 కోట్లు పేరుకుపోయి జాతీయ బ్యాంకులకు గుదిబండలుగా మారాయి. నిరర్ధక ఆస్థులలొ బకాయి పడ్డ మొదటి 30 సంస్థల  బకాయీలు  మొత్తం నిరర్ధక ఆస్థులలొ 37శాతంగా వున్నాయి. పునర్నిర్మాణం చేయబడ్డ కార్పొరేట్ల బకాయిలలో 64శాతం మౌలిక రంగాలకు సంబందించిన సంస్థలవే. నయా ఉదారవాద విధానాలలో భాగంగా  మౌలిక రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం పెంచాలనే ఉబలాటంలో ప్రభుత్వాలు జాతీయ బ్యాంకులను  ఒత్తిడి చేసి ప్రైవేటు సంస్థలకు,పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య సంస్థలకు ఇప్పించిన అప్పులు ఇవి.  వీటి రికవరీ బాధ్యతా ప్రభుత్వానిదే.  
3.   బేసెల్ 3 ప్రమాణాలు ప్రపంచ ద్రవ్య సంక్షోభానికి కారణమైన బ్యాంకుల సమస్యల నుద్దేశింఛి రూపకల్పన చేయబడినవి. భారత దేశంలో జాతీయ బ్యాంకులు ద్రవ్య సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదురుకోవడమే కాకుండా విస్తృతమైన సామాజిక బాధ్యతలను నిర్వహిస్తున్నాయి.  అందువల్ల బేసెల్ 3 ప్రమాణాలను యధాతధంగా  అమలు చేసి జాతీయ బ్యాంకులను బలిచేయటం  సమంజసం కాదు. 
3. బేసెల్3 ప్రమాణాల అమలులో అత్యుత్సాహం జాతి ప్రయోజనాలకే నష్టదాయకం . బేసెల్3 ప్రమాణాల అమలు తుది గడువు మార్చలేని శిలాశాసనం కాదు ఇప్పటికే 31. 3. 2018 నుండి     31. 3. 2019 మార్చారు. ఈ తుది గడువును మరో 4 సంవత్సరాలు పెంచి జాతీయ బ్యాంకుల అదనపు మూలధన అవసరాలను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు ద్వారానే జరపాలి.  
4. . ప్రపంచ  దేశాలలో బ్యాంకులు, నియంత్రణ సంస్థలు బేసెల్  3 ప్రమాణాలను నిర్ణీత గడువు లోపు పూర్తిగా అమలు చేస్తారా లేదా అనే అంశం ఇంకా  తేలాల్సి వుంది. బెసేల్ ప్రమాణాల అమలు వర్ధమాన దేశాల మనుగడకు నష్టదాయకమనే భావన సర్వత్రా వ్యాపించివుంది. 
5. జాతీయ బ్యాంకుల మనుగడకు ముప్పు కలిగించే నాయక్ కమిటీ సిఫార్సులను అమలు చేయరాదు. జాతీయ బ్యాంకులలో తేడ లేకుండా అన్నింటికి అవసరమైన అదనపు మూలధనం ప్రభుత్వం అందించిన తరువాతే వాటి పనితీరును సమీక్షించాలి. వాటి పనితీరు మెరుగుపరిచేందుకు ఉద్యోగ, అదికార సంఘాలతో చర్చించాలి. 
6. అవసరమైతే జాతీయ బ్యాంకుల పరిరక్షణకు దేశ వ్యాప్త ఉద్యమానికి పిలుపునివ్వాలి   

(మార్క్సిస్టు జూన్ 2015 సంచికలో ప్రచురింపబడింది) 


Sunday, June 28, 2015

మోడీ పాలనలో- సంతోష పెట్టేదేమీ లేదు

మోడీ పాలనలో- సంతోష పెట్టేదేమీ లేదు 
సి.పి. చంద్ర శేఖర్ 
దేశం ఎదుర్కుంటున్న ఆర్ధిక సమస్యల పరిష్కారంలో సమర్ధవంతమైన కాల్పనికత కొరవడటం వల్ల మోడీ ప్రభుత్వ తొలి సంవత్సర పాలన తప్పడడుగుల క్రమంగా అభివర్ణించ బడుతున్నది. దొర్లిన తప్పుల్ని సవరించుకునే ఛాయలు కానరావడంలేదు. 

ఆర్ధిక రంగంలో ఏదో సాదిస్తామంటూ గంపెడాశల్ని కల్పించి అధికారానికొచ్చిన మోడీ ప్రభుత్వం తొలి సంవత్సరం  ముగించుకొని, నిరుత్సాహాన్ని, విచారాన్ని మిగిల్చింది. నిరుత్సాహ మెందుకంటే, తాను సృస్టించిన ప్రచార హోరుకు  తగట్టు ఆర్ధిక వృద్ది రంగంలో నైనా మోడీ ప్రభుత్వం ఈ కాలంలో తాను సాధించింది ఏమిటో చెప్పుకోలేక పోతున్నది. విచార మెందుకంటే, ప్రస్తుత విడివడిన ఆర్ధిక వ్యవస్థ పరిధిలో నూతన ప్రభుత్వం అనుసరించిన విధానాలు పరిస్థితుల్ని పెనం నుండి పొయ్యిలోకి నెట్టుతున్నాయి. 

దీనితో పాటు సృజనాత్మక మైన  ద్రవ్య విధానాలతో  గాడి తప్పిన పాలనను సరి చేయకుండా,  వ్యయాన్ని ప్రత్యేకించి సామాజిక వ్యయాన్ని కత్తిరించ పూనుకుంది. క్లిష్ట సమయంలో  ద్రవ్య లోటును అదుపు చేయటం కోసమే  వ్యయాన్ని కుదించాల్సి వచ్చిందని పైపెచ్చు  సమర్ధించుకుంటుంది.  "వినాశనకరమైన నయా ఉదార వాద తీవ్ర రూపానికి తాను కట్టుబడివున్నానని" మోడీ ప్రభుత్వంచేసే ప్రకటనగా ఈ సమర్దనను చూడాల్సి వుంది. 

అటువంటి    ప్రకటన చేయాలనే ఉద్దేశ్యానికి మూడు పర్యవసానాలు కారణమైయ్యాయి. . మొదటిది మోడీ ప్రభుత్వం వ్యయాన్ని పూర్తిగా కుదించింది. దీని ప్రభావంగా ఈ మధ్యనే కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసిన కేంద్ర బడ్జెట్ వాస్తవ గణాంకాలలో 2014-15 సం. లో స్థూలదేశీయోత్పత్తిలో వ్యయం 13శాతం గా వుండగా, బడ్జెట్ సమర్పించినప్పుడు సవరించిన అంచనాలలో ఈ శాతం 13. 3 గా వుండటం గమనించాలి. దీనర్ధం   2012-13లో 14.1శాతం నుండి 2013-14 లో13. 8 శాతానికి తగ్గిన స్థూలదేశీయోత్పత్తిలో కేంద్ర ప్రభుత్వ వ్యయం మోడీ ప్రభుత్వ తొలి సంవత్సరం2014-15 లోనే 13శాతానికి పడిపోయింది.  ఆశ్చర్య పడాల్సిన అవసరం  లేకుండానే అనేక ముఖ్య మంత్రుల తోపాటు, ఎన్డియే ప్రభుత్వంలోని కేంద్ర మహిళా,శిశు అభివృద్ధి శాఖా మంత్రిణి శ్రీమతి మేనకా గాంధీ కూడా ఈ అంశంపై తమ ఆక్షేపణల్ని ఆర్ధిక మంత్రి కి వ్రాత పూర్వకంగా తెలిపినట్లు తెలుస్తుంది.

రెండవది.  స్థూల దేశీయోత్పత్తి లో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్నుల రెవిన్యూ 10శాతం నుండి 9.8 శాతానికి పతనమైన కారణంగా తన ద్రవ్యలోటు లక్ష్య సాధనకు ప్రభుత్వం అదనంగా ప్రభుత్వ రంగ వాటాల ఉపసంహరణ ( ఋణేతర పెట్టుబడి ఆదాయంగా పరిగణింప బడింది ) లాంటి ప్రత్యామ్నాయ వనరుల కోసం చూడవలసి వచ్చింది. కాని ప్రభుత్వం తాను కోరుకున్నట్లు ఇక్కడకూడా సఫలం కాలేక పోయింది. 2014-15 సం. బడ్జెట్లో   ప్రభుత్వ రంగ వాటాల ఉపసంహరణ ద్వారా రూ.58,425 కోట్ల ఆదాయం ప్రతిపాదింపబడగా, వాస్తవంగా రూ. 26,353 కోట్లు మాత్రమే సాధించబడిందని 2015-16 సం. బడ్జెట్ పత్రాల్లో ప్రస్తావించ బడింది. ఇదికూడా అంతకు ముందు సంవత్సరంలో సాధించిన రూ.24,362 కోట్ల కంటే అంత ఎక్కువేమీ కాదు. పార్లమెంట్ దిగువ సభలో తనకున్న మంద బలంతో సంస్కరణలను ముందుకు తీసికొని వెళ్ళే సమర్ధత వున్నా, వాటాల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా అదనపు వనరులను సమీకరించాలన్న మోడీ ప్రభుత్వ మొండి పట్టుదల జయప్రదం కాలేకపోయింది.దీని కారణంగానే మోడీ ప్రభుత్వం వ్యయకుదింపు ప్రక్రియపై అంతగా ఆధారపడాల్సి వచ్చింది. మూడవది.  క్షేత్ర స్థాయిలో ఈ రకమైన వైఫల్యాలు ఎదురుకావటంతో, ప్రభుత్వం తన సంస్కరణల అనుకూల  ముద్రను నిలబెట్టుకునేందుకు గాను కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడం, అనేక రాష్ట్రాలు అభ్యంతర పెట్టినా సరుకుల సేవల పన్ను బిల్లును ఆమోదింపచేసికోవడం, అన్నింటికి మించి కార్పోరేట్ రంగానికి స్పష్టంగా మేలు కల్గించే భూ సేకరణ బిల్లును ఆమోదింప చేసుకోవటం లాంటి దుశ్చర్యలకు  తెగబడింది. 

2014 ఎన్నికల సందర్భంగా, కార్పోరేట్, బడా వాణిజ్య వర్గాల బహిరంగ మద్దతుతోనే, ప్రధాన మంత్రి పదవికి జరిగిన పోటీలో మోడీ  ఎన్నికల ముందే పాక్షికంగా విజయం సాధించారు. వాళ్ళు కోరిన వరాల నందిస్తానాని పెట్టుబడిదారీ వర్గాలను ఒప్పించి తన విజయాన్ని సుగమం చేసికున్నారు.  గుజరాత్ రాష్ట్రంలో కార్పోరేట్ వర్గాలకు రాయితీలను వెదజల్లి వాళ్ళను ప్రసన్నంచేసికునే మోడీ అధికారాన్ని   హస్తగతం చేసికున్నారు. ఫోర్బెస్ ఏషియా సమాచారం ప్రకారం గుజరాత్ ప్రభుత్వం అదాని గ్రూప్ కు ముంద్రాలో 7,350 హెక్టార్ల భూమిని చదరపు మీటర్ కు ఒకటి నుండి 45 అమెరికన్ సెంట్ల అద్దెపై 30సంవత్సరాల లీజుకు ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనిలో కొంత భాగాన్ని ఓడరేవు, విద్యుత్ కేంద్రం మరియు ప్రత్యేక ఆర్ధిక మండలాలకి వినియోగిస్తూ, మరి కొంత భాగాన్ని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ కు చదరపు మీటరు 11 అమెరికన్ డాలర్లకు సబ్ లీజుకు ఇచ్చినట్లు సమాచారం. భారత దేశంలో ఇతర ప్రాంతం నుండి గుజరాత్ కు నానో ప్లాంటును తరలించడం కోసం టాటా మోటార్స్ కు రూ. 30,000 కోట్ల రాయితీలు ఇచ్చినట్లు చెప్తున్నారు.   గుజరాత్ ప్రభుత్వం మరియు ఆ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు కలిసి  రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎస్సార్ స్టీల్ మరియు అదాని పవర్ లిమిటెడ్ లాంటి పెద్ద పారిశ్రామిక దిగ్గజాలకు అర్హత లేకుండా ఇచ్చిన రాయితీల మూలంగా ఒక్క సంవత్సరంలోనే ప్రభుత్వ ఖజానాకు     రూ. 750 కోట్ల నస్టం వాటిల్లినదని 2012-13 సం  సంబందించిన కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ నివేదిక తెలుపుతున్నది. 

ఈ రకమైన చరిత్ర ప్రైవేట్ రంగంలో అనేక అత్యాశలను రేపింది. ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం  పైస్థాయిలో రాయితీలను ప్రైవేట్ రంగంలో అందించడంలో విఫలమైన కారణంగా అనేక మందిని  నిరాశకుగురిచేసింది. ఈ సందర్భంగా వెల్లువెత్తిన విమర్శలకు మోడీ అనుకూల పారిశ్రామిక వర్గాలు సమాధానం చెప్పుకోవలసి వచ్చింది. ప్రధాన మంత్రికి మరింత సమయం ఇవ్వాల్సివుందని స్వయంగా రతన్ టాటా తన సహచరులను అభ్యర్ధించాడు. మోడీ ప్రభుత్వం కార్పోరేట్ అనుకూల విధానాలు అనుసరిస్తుందని ఘాటుగా విమర్శిస్తున్న రాహుల్ గాంధిని, బైకన్  కంపెనీ   చైర్  పర్సన్ , కిరణ్ మజుందార్ అడ్డుకోవలసి వచ్చింది.   

కనీసం ఆర్ధిక వృద్ది లో నైనా తన వాగ్దానాలను నిలబెట్టుకోలేక పోయిన మోడీ ప్రభుత్వం తన తొలి సంవత్సర పరిపాలనలో పై సంఘటనలతో ఇబ్బందులలో పడింది. ఈ వైఫల్యాలను అనేక గణాంకాలు రూఢీ చేస్తున్నాయి. మోడీ పాలన మొదటి 6నెలల కాలంలోనే(మే నుండి అక్టోబర్2014) పారిశ్రామిక ఉత్పాదన  సూచీ తో లెక్కింపబడే నెలవారీ పారిశ్రామిక వృద్ది రేటు 5. 9 శాతం నుండి -5. 6 శాతానికి పడిపోయింది.  2014లో 4. 7శాతానికి పుంజుకున్నా, అది తిరోగమిస్తూ మార్చి2015 నాటికీ 2. 2శాతానికి(తాత్కాలికం ) చేరింది. దాగుడు మూత లాడుతున్న వర్షపాతం మరియు ప్రభుత్వ అసమర్ధతలు  కలగలిసిన  కారణంగా  వ్యవసాయ రంగం  మరింత దుర్భరంగా వుంటుందని ఊహిస్తున్నారు. ఉదాహరణకు 2014-15 పంట సంవత్సరం (జూలై నుండి జూన్ వరకు) లో  ఆహార ధాన్యాల ఉత్పత్తి కి సంబంధించిన మూడవ అధికార ముందస్తు అంచనాల ప్రకారం ఆహార ధాన్యాల దిగుబడి 5. 3శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. గత రెండు సంవత్సరాల ఆహారోత్పత్తి ఆశాజనకంగా లేని కారణంగా, ఈ పరిణామం పరిస్థితుల్ని  మరింతగా దిగజార్చేటట్లుంది. ఇంతలో అకాల వర్షాలమూలంగా పంటలు పోగొట్టుకొని గొంతు వరకు ఋణాలలో కూరుకున్న రైతుల ఆత్మహత్యలు వార్తా పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా వచ్చాయి. 

ఈ అధమమైన ఆర్ధికవృద్ది పనితీరు సహజ దృశ్యాన్ని రెండు అంశాలు గందరగోళ పరుస్తున్నాయి.  కేంద్ర గణాంక సంస్థ నూతన డేటా వనరులను కూర్చుకొని 2011-12 బేస్ సంవత్సరంగా జాతీయ ఆదాయ నూతన సిరీస్ గణాంకాల నిర్మాణంలో ఎంచుకున్న నూతన లెక్కింపు ప్రక్రియ ఈ  అంశాలలో మొదటిది. ఈ ప్రక్రియలో ఉద్భవించిన 2011-12నుండి 2013-14 మధ్యనున్న స్థూల దేశీయోత్పత్తి గణాంకాలు 2004-05 బేస్ సం. గా వున్న పాత సిరీస్ గణాంకాలతో సమానంగానో లేదా తక్కువగానో వున్నాయి. కాని 2012-13,2013-14సం.లలో పాత సిరీస్ ప్రకారం స్థూల దేశీయోత్పత్తి వృద్ది రేటు 4.7శాతం నుండి 5. 0 శాతానికి పెరుగగా, నూతన సిరీస్ లో ఈ వృద్ది రేటు 5.1శాతం నుండి 6.9శాతానికి పెరిగింది. ఈ వృద్ది రేటులోని పెరుగుదల యూపియే ప్రభుత్వ కాలానికి సంబంధించి నందువల్ల, దీన్ని ఎన్డియే విజయంగా కీర్తించ నవసరంలేదు. కాని 2014-15 సం. సంబందించిన స్థూల దేశీయోత్పత్తి వృద్ది రేటు ముందస్తు అంచనాలు సాపేక్షంగా అధికంగా వున్న 7.5 శాతాన్ని ఎన్డియే పనితీరు ఖాతాకు జమచేయాల్సి వుంటుంది. కానీ ఈ గణాంకాలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయని ఎవ్వరూ నమ్మడం లేదు. గందరగోళ పరుస్తున్న రెండవ అంశం గత సంవత్సర కాలమంతా తన ఆధిపత్యాన్ని  కొనసాగించి,   సెన్సెక్స్ ను రికార్డు స్థాయికి  తీసికెళ్ళిన స్టాక్ మార్కెట్ బుల్ రన్ కు సంబందించినది. దీన్ని అదనుగా  తీసికొని ప్రభుత్వ పనితీరు ఎలాగున్నా, మోడీ ప్రభుత్వం 'మదుపుదారుల విశ్వాసాన్ని పునరుధ్ధరించ కలిగించిందనే'  ముమ్మర ప్రచారానికి మీడియా పూనుకుంది. మార్చి2015 నాటికి సెన్సెక్స్ ప్రప్రధమంగా 30,000పాయింట్లను  చేరుకోవటం వాస్తవ విషయమే. కానీ అప్పటి నుండి సెన్సెక్స్ పతనమయ్యే సంకేతాలున్నాయి. అందువల్ల మే7 నాటికి బిఎస్ఇ సెన్సెక్స్ 26,599 పాయింట్ల దగ్గర ముగిసింది. జనవరి 2014 ప్రారంభం నాటికి సాపేక్షంగా అనేక కారణాల రీత్యా సెన్సెక్స్ అధిక  స్థాయిలో ఉన్నప్పటికీ, ఈ పతనం 'సులభంగా సొమ్ము చేసికోవటానికి' అలవాటు పడ్డ  అనేక మంది  మదుపుదార్లను ఇబ్బందులకు గురిచేసింది. మే 7నాటికి వున్న సెన్సెక్స్ సాపేక్షంగా అధిక స్థాయిలో ఉన్నప్పటికీ, ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంతగా రెండు నెలల క్రితం ఎగబ్రాకిన 30,000 పాయింట్ల తో  పోల్చుకుంటే సెన్సెక్స్ లో పతనం 10శాతానికి మించి వుంది. 

ఈ పతనం ఒక అంశాన్ని ముందుకు తెస్తున్నది. తమ దేశాల్లో చౌకగా లభ్యమౌతున్న నిధులతో వర్ధమాన దేశాల మార్కెట్లను చేజిక్కించుకోవాలన్న తపనతో, మూడు సంవత్సరాల క్రితం అంటే మే 2012 నాటికి  సెన్సెక్స్ 16000 పాయింట్లకు పైబడి  తచ్చాడుతున్న సమయం నుండి విదేశీ సంస్థాగత మదుపుదార్లు ఈ స్టాక్ మార్కెట్ల బుల్ రన్ కు సారధ్యం వహిస్తునారన్న అంశంలో మార్కెట్ పరిశీలకుల్లో ఏ భేదభావం లేదు. కాబట్టి ఈ స్టాక్ మార్కెట్ విజ్రుంభణ(బూమ్)  స్పెక్యులేషన్ జ్వరం ఫలితంగా సృష్టింపబడి,. మాంద్యం తో కొట్టుమిట్టాడుతున్న అభివృద్ది చెందిన దేశాలలో చౌకగా లభించే నిధులతో ప్రోత్సహింపబడుతున్నట్లుంది.  ఇటీవలి కాలంలో సెన్సెక్స్ ఎగబ్రాకిన దశ 2014 తొలి మాసాల్లో ప్రారంభమై 2015 ఆరంభం వరకు కొనసాగి,. ఒక సంవత్సరంలోనే  సెన్సెక్స్ 20,000 నుండి 30,000 పాయింట్లకు ఎగబ్రాకింది. మార్కెట్లో అనిశ్చితి(ఒలటాలిటీ) తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ సెన్సెక్స్ గణనీయంగా 50శాతం పెరిగింది. అయినప్పటికీ ఆర్ధిక వృద్ది అన్ని విధాలుగా మందంగా వున్న కాలంలో మదుపరుల అత్యుత్సాహంతో ఈ విజ్రుంభణ(బూమ్)సృష్టింప బడింది. దీనర్ధమేమంటే  ఈ అత్యుత్సాహం అన్ని విధాలుగా అశాస్త్రీయమైనది. ఎక్కుపెట్టిన ఈ విజ్రుంభణ(బూమ్) అంతం కావలసిందే. అదే  జరిగినప్పుడు,  అనేక అర్ధం లేని భయాందోళనలను రేకెత్తిస్తున్న అమెరికన్ ఫెడరల్ 'టేపర్ తంత్రానికి' మించిన తీవ్ర పతనాన్ని చవిచూడాల్సి వస్తుంది. గత సంవత్సరం అంతర్జాతీయ చమురు ధరల పతనం   గాలివాటంగా కలసొచ్చినప్పటికి. ఎన్డియే ప్రభుత్వ మొదటి సంవత్సర పాలనలో ఆర్ధిక వృద్ధి పనితీరు నిర్లక్ష్యంగా, అధమంగా వుంది.   ఉదాహరణకు బ్రెంట్ క్రూడ్ ధర జూన్ 2014నాటికి బ్యారల్ 115 డాలర్లు వుండగా జనవరి 2015 నాటికి 50 డాలర్లకు అంటే సగానికి సగం పడిపోయింది. 

చమురు  ధరలలో పతనం నాలుగు విధాల ప్రభావాన్ని కలిగించాయి. మొదటిది. రిటైల్ ధరలలో గణనీయమైన పతనాన్ని నిలువరించి, పెట్రోలియం ఉత్పత్తులపై  అదనపు పన్నులను విధించటానికి వీలుకల్పిస్తూ ప్రభుత్వానికి  అదనపు రెవిన్యూ వనరులను సమకూర్చింది. ప్రభుత్వానికి రూ.10,000కోట్ల అదనపురెవిన్యూ ను అందించటం కోసం, అతి తక్కువ కాల పరిమితిలోనే  పెట్రోలు,డీజిల్ పై ఎక్షైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం వెంట వెంటనే మూడు సార్లు(నవంబర్ 12,డిసెంబర్ 2,జనవరి 1) పెంచింది. రెండవది. చౌక చమురు ధరల మూలకంగా   ప్రత్యక్ష ప్రభావంగాను, ఉత్పదకాలు గా వినియోగించే హైడ్రో కార్బన్ల  ధరలు తగ్గి, ఉత్పాదితాల వ్యయం, ధరలు  తగ్గిన నందువల్లనూ, ద్రవ్యోల్బణం అదుపు చేయబడింది. మూడవది. ఈ రకంగా ధరలు తగ్గడం మూలంగా పెట్రోలియం ఉత్పత్తులపై ఇవ్వాల్సిన సబ్సిడీ వ్యయం తగ్గి, అంతిమంగా బడ్జెట్లో వ్యయం తగ్గింది.  బంగారం దిగుమతులపై సుంకాల్ని,పరిణామాత్మక ఆంక్షల్ని తగ్గించు కోవటానికి విదేశీ మారకాన్ని దుబారా చేసినా,  చమురు ధరల పతనం వాణిజ్య, కరెంట్ ఖాతాల లోటును తగ్గించటానికి దోహద పడింది. దీని ఫలితంగా నడమంత్రంగా కలిసొచ్చిన ద్రవ్యోల్బణ అదుపు, విదేశీ మారక సమతుల్యత సాధనలను  ప్రభుత్వం తాను స్వంతంగా సాధించిన విజయాలుగా చెప్పుకుంటుంది. 

అయినప్పటికీ పెరుగుతున్న ఆర్ధిక పనితీరురాహిత్య భావనను ప్రభుత్వం  అడ్డుకోవాలనుకున్నా సాధ్యం కాలేదు.  మోడీ కేంద్రంగా బిజెపి ఎన్నికల ప్రచారంలో చూపిన  అత్యాశలకు అనుగుణంగా  ఆచరణలో ప్రయోజనాలు పొందలేకపోవడంతో మోడీకి గట్టి మద్దతుదారులైన మధ్యతరగతి, సంపన్న వర్గాలు సైతం అసంతృప్తి చెందాయి. ప్రచార హోరు కొనసాగినప్పటికీ, అది అంత ప్రభావాన్ని కల్గించలేక పోయింది. ఈ పరిస్థితులలో మోడీ ఉద్దేశపూర్వకంగానో,మరోరకంగానో మౌలిక రంగాలకు అవసరమైన పెట్టుబడులను రాబట్టేందుకూ, ప్రపంచ మార్కెట్ ఉత్పత్తికి కేంద్రంగా  భారత దేశాన్నిమలిచేందుకు అవసరమైన విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధానాలను నొక్కిచేప్పే "భారతదేశంలో తయారీ"ఎజండా కేంద్రీకరణకు పూనుకున్నాడు.  ఏ ఇతర ప్రధాని చేయనంతగా తన పదవీ కాల మొదటి సంవత్సరంలోనే భారత దేశాన్ని వదలి మోడీ  విదేశీ పర్యటనలలో  వుండటం ఈ వాస్తవాన్ని వివరిస్తుందనుకుంటాను. దురదృష్ట వశాత్తు మోడీ  చేపట్టిన ఈ  చర్య విశేషంగా ఉంటుదనుకోవటానికి స్పష్టమైన సంకేతాలేమి లేవు.  
(ఫ్రంట్ లైన్ 12. 6. 2015 సంచిక లో ప్రచురింప బడింది) 
అనువాదం: కొండముది  లక్ష్మీప్రసాద్  

Tuesday, March 31, 2015

భారత దేశ వార్తా పత్రికా రంగం -భవితవ్యం - సవాళ్లు

భారత దేశ వార్తా పత్రికా రంగం -భవితవ్యం - సవాళ్లు 
-ఎన్. రామ్ 
అభివృద్ది చెందిన ప్రపంచ దేశాలలో వార్తా పత్రికారంగం చూస్తుండగానే   సంక్షోభంలో కూరుకుంది. ఈ డిజిటల్ యుగంలో బాగా అభివృద్ది చెందిన దేశాలలోని  వార్తా పత్రికలూ మరియు సమాచార టెలివిజన్ల  భవితవ్యంపై విషాదం అలముకుంది. వ్యాన్ ఇఫ్రా ఆధ్వర్యంలో అక్టోబర్ 2011న వియన్నాలో నిర్వహించిన ప్రపంచ న్యూస్ పేపర్ కాంగ్రెస్స్ మరియు ప్రపంచ సంపాదకుల ఫోరం  లలో నేనూ పాల్గొన్నాను. ఆ సమావేశాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిలోనూ వార్తా పత్రికా రంగ చారిత్రక యుగం ముగింపు కొచ్చిందని, ప్రపంచ వ్యాప్తంగా అటూ ఇటూగా  అందరం నిలకడలేని అనిశ్చితి లోకి అడుగుపెడుతున్నామన్న భావన  కలిగింది. పాఠకుల ప్రవర్తనలలోను,  వార్తలను స్వీకరించే రీతిలోనూ వస్తున్న పెను మార్పులతో పాటు వెబ్ మరియు మొబైల్ వేదికలు వేగాన్ని పుంజుకోవడంతో, ప్రాణాంతకమైన ఆర్ధిక ఇబ్బందులతో పాటు  జారిపోతున్న పాఠకలోకాన్ని తిరిగి చేజిక్కించుకోవడం సంప్రదాయ వార్తాపత్రికారంగానికి పెను సవాలైంది. ఇటువంటి  పరిశ్రమకు సంబంధించిన ధోరణులతో పాటు,అబివృద్ది చెందిన దేశాలలో ఒత్తిళ్ళు, నిరాశ నిర్వేదాలు, గందరగోళాలతో    ఇప్పటికే స్వతంత్రమైన, సమర్ధవంతమైన జర్నలిజం   భారిగా దెబ్బతింది. కొలంబియా యూనివర్సిటీ మా పూర్వ విద్యార్ధుల సంఘం  ఆధ్వర్యంలో ప్రచురించిన " అమెరికా జర్నలిజం పునర్నిర్మాణం " అన్న సమకాలీన నివేదికలో  ప్రస్తావించినట్లు, "స్వతంత్ర నివేదనలో దేశానికి  పట్టుగొమ్మలైన వార్తా పత్రికలు, కొద్దిమంది జర్నలిస్టులతో, కొద్ది పేజీలకు పరిమితమై కొద్ది కధనాలతో వాస్తవంగా కుంచించుకు పోతున్నాయి. ''

ఈ దుస్థితితో భారత దేశ వార్తా పత్రికా రంగాన్ని పోల్చి చూస్తే,అది అభివృద్ది బాటలో ప్రస్పుటంగా కనిపిస్తుంది. కాని ఎగసిపడుతున్న మన అభివృద్ది వృత్తాంతం, దాని పర్యవసానాల్ని విమర్శనాత్మకం గా  పరిశీలించుకోవాల్సివుంది. గణాంకాలు అందుబాటులో వున్నా వాటిని అంతగా పట్టించుకోదలచలేదు. 2012 న్యూయార్కర్ పత్రికలో కెన్ ఔలెట్ట తన వ్యాసంలో వ్రాస్తూ, భూఖండంలో వార్తా పత్రికలు బతికి బట్టకడుతున్న దేశాలలో భారత దేశం ఒకటని, ఇక్కడ జర్నలిస్టులకు,  ప్రత్యేకించి యువకులకు పుష్కలంగా నైపుణ్యావకాశాలు వున్నాయని వ్రాశారు. 

ఇండియన్ ప్రెస్ ప్రత్యేకించి భారత దేశ భాషా వార్తా పత్రికలూ మరియు ఉపగ్రహ వార్తా టెలివిజన్ వృద్ధి పధంలో కొనసాగుతున్నాయి. ఈ అభివృద్ది కధనంలో కొంత భాగాన్ని విశేషంగా పరిశోధించి, విశ్లేషించిన  అంశాల్ని 15సంవత్సరాల క్రితమే రాజకీయ శాస్త్రవేత్త అయిన రాబిన్ జఫ్రీ తన "భారత దేశ వార్తా పత్రికా విప్లవం" అన్న పుస్తకంలో పొందుపరచారు. దీనితో పాటు ఈ అంశంపై ఎకనామిక్ మరియు పొలిటికల్ వీక్లీ లో 1987,1993,1997లలో సీరియల్ గా ఆయన  వ్యాసాల్ని ప్రచురించారు. అభివృద్ది చెందిన సాంకేతిక విజ్ఞానం, నిలకడగా విస్తరిస్తున్న అక్షరాస్యత, మెరుగైన కొనుగోలుశక్తి, వైరుధ్యభరితమైన కధనాలు, వీటన్నిటిని మించి రాజకీయ ఉత్సుకతలు- భారత వార్తా పత్రికా విప్లవం వెనుకనున్న కీలకాంశాలుగా రాబిన్ జఫ్రి  పేర్కొన్నారు. ఇక్కడ వార్తల దాహార్తి పుష్కలంగా వుండి, విశ్లేషణలు, వ్యాఖ్యానాలు , వినోదం , వాటి సంకర ఆవిష్కరణ అయిన "వినోదాత్మక సమాచారం " - అన్నీ వార్తల ముసుగు క్రింద చలామణి అవుతున్నాయి. ఈ మూసలో  పలుకుబడి కలిగిన భారత భాషా వార్తా దినపత్రికలు  పుంఖాను పుంఖాలుగా విస్తరించాయి. అందులో చాలా పత్రికలు  అత్యధిక సర్క్యులేషన్, భారీ పాఠకలోకాన్నికలిగి వున్నాయి. 
అయినప్పటికీ భారత పత్రికా రంగం ప్రదర్శిస్తున్న  ఎగసిపడే అబివృద్ధిని, వాటి పర్యవసానాల్ని ఆరాధనా స్థాయికి తీసుకు వెళ్ళకూడదు. భిన్నత్వాలు కలిగిన ప్రజల అవసరాలు ప్రత్యేకించి గ్రామీణ ప్రజలు మరియు మహిళల అవసరాలకు న్యాయం చేయకలిగే సామాజిక దృక్కోణం  కలిగివుండటానికి భారత వార్తా పత్రికా రంగం ఇంకా చాలా దూరం  ప్రయాణించ వలసి వున్నది. ఈ అంశాలపై సంపాదకీయాలు వ్రాయటానికి వాస్తవంలో అనేక ఇబ్బందులు  ఇమిడి వున్నాయి. 

భారత టెలివిజన్ భారి ప్రేక్షక లోకం కలిగివుండి ఇంకా వృద్ది చెందుతూనే వుంది. అయినప్పటికీ ఈ సామూహిక ప్రేక్షక లోకం లో అత్యధిక భాగం వినోద చానళ్ళ కు సంబందించిన వారే. ఇంగ్లీష్ మరియు ఇతర భాషా వార్తా పత్రికలతో పోటీ పడకలిగిన 24 x 7 ఉపగ్రహ టెలివిజన్ వార్తా చానళ్ళు దజన్లలో వున్నా మొత్తం టివి మార్కెట్లో వాటి నిష్పత్తి చాలా స్వల్పంగా వుంది. 

భారత పత్రికా రంగ ప్రదర్శిస్తున్న ఎగసిపడే వృద్ధిని పెద్దదిగా చేసి చూపించవద్దనటానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కవర్ పేజి ధరలకంటే తక్కువ ధరలకు పత్రికల నమ్మడం, వందలవేలాది కాపీలను ముద్రించి,  వాటిని పాత  కాగితాల మార్కెట్ కు తరలించడం లాంటి అనైతిక పద్ధతులతో భారీ సర్క్యులేషన్ లేబిల్ పొందటం వార్తా పత్రికలకు పరిపాటి అయ్యింది. వీటిలో రెండవ పధ్ధతి వాణిజ్య ప్రకటనల సముపార్జనకు ఒక విధాన ప్రక్రియగా మారింది. ఇది చాలదన్నట్లు టెలివిజన్ ప్రేక్షకుల కొలమాన విధానం(టి.ఎ. ఎం ) విస్తృతమైన విమర్శలకు గురై, న్యాయపరమైన చిక్కులను  ఎదుర్కొంటుంది. . 

ప్రింట్ మరియు సమాచార రంగ వ్యవస్థలన్నీ క్రమంగా  ఆర్ధిక సంక్లిష్టతను ఎదుర్కొంటున్నాయి. గత కొద్ది సంవత్సరాలుగా వాణిజ్య ప్రకటనల రంగం బిగుసుకు పోతున్నది. ప్రింట్ రంగంలో వృద్ది మందగించింది. 2008-09 ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ఇందుకు దోహద పడినట్లుంది. అది భారత పత్రికా రంగ వృద్ది నే దెబ్బ తీసింది. సంక్షోభ పూర్వ కాలంలో చవి చూసిన,  కీలకమైన వాణిజ్య ప్రకటనల రెవిన్యూను మనం తిరిగి చూడలేమని నిపుణులు చెప్తున్నారు. 
భారత దేశం డిజిటల్ యుగ  వైరుధ్యాలను ఎదుర్కొని ఎలా మనగలుగుతుంది? పరివర్తనా యుగానికి కేంద్రమైన ఈ వైరుధ్యాన్ని నిర్వచించటానికి ప్రయత్నిస్తాను. ఒక ప్రక్కన అత్యధికంగా ప్రజలు డిజిటల్ గా  వార్తా పత్రికల్ని చదువేందుకు ముందుకొస్తున్నారు. మొట్టమొదటి సారిగా చరిత్రలో ఉత్తమ ప్రచురణలకు ప్రపంచ వ్యాప్త సజీవ పాఠకలోకాన్ని  కలిగివున్నాము. బహుముఖ మైన శీర్షికలతో,  మల్టీ మీడియా హంగులతో  సుసంపన్నమైన అనేక అత్యత్భుత వార్తా పత్రికలూ, వార్తా వెబ్సైట్ లు లభ్యమౌతున్నాయి. లభ్యమౌతున్న ఈ స్థలంలో అందించ కలిగే సమర్ధతకు ఆకాశమే హద్దు గా ఉన్నట్లుంది. మరో ప్రక్క, పాత వార్తా పత్రికా రంగాన్ని అతలాకుతలం చేస్తున్న " అస్తిత్వ సంక్షోభం" ఇంకా పరిష్కరింపబడలేదు. భారీ నష్టాన్ని చవిచూస్తూ అది కొనసాగుతూనేవుంది. జర్నలిజం భవితవ్యం పై చర్చలు ముగియ లేదు. దిగజారిన నైతికత, అల్ప స్థాయి చైతన్యం జర్నలిస్ట్ వృత్తిని, వార్తా పత్రిక పరిశ్రమను వెంటాడుతూనే వున్నది. ఎందుకంటే ఈ అద్భుతమైన పరిణామం అటు అంతర్జాలానికి గాని లేదా ఇటు డిజిటల్ జర్నలిజానికి గాని మనగలిగే ఆదాయాల్ని మరియు వ్యాపార నమూనాన్ని ఇవ్వలేక పోతున్నది. 

అంతర్జాల వినియోగంలో, బ్రాడ్ బ్యాండ్ సౌలభ్యం కావడంలో మన దేశం సాపేక్షంగా వెనుకబడి ఉన్న కారణంగా వార్తా పత్రికా రంగం,సమాచార టెలివిజన్ ఆ మేరకు ప్రయోజనాల్ని  పొందకలగడంలో  ఎవరికీ లేశ మాత్రమైన సందేహం కూడా లేదు. . ఈ విషయంలో చైనా అత్యద్భుత ప్రగతిని సాధించింది. జూలై 2014 అంతానికి ఆ దేశంలో 632 మిలియన్ల అంతర్జాల వినియోగ దారులున్నట్లు అంచనా వేస్తున్నారు. వీరిలో అత్యధిక భాగం బ్రాడ్ బ్యాండ్ వినియోగ దారులు కావటం విశేషం. మన దేశ అంతర్జాల అభివృద్ది పై అధికారికంగా ఇంతవరకు  ఏ విధమైన శాస్స్త్రీయ సర్వే నిర్వహింపబడలేదు. చిత్తు అంచనాలలో భారత దేశంలో 240 మిలియన్ల అంతర్జాల వినియోగ దారులున్నట్లు తేలింది. వీరిలో అత్యధికులు లోపభూయిష్టమైన బ్యాండ్ విడ్త్  తో సతమత మౌతున్నారు. పోల్చదగ్గ జనాభా కల్గిన ఈ రెండు దేశాల్లో  అంతర్జాల విస్తరణ పోలిక ఆసక్తికరమైన విశేషాన్ని తెలియచేస్తుంది. భారత దేశంలో అంతర్జాల విస్తరణ కంటే రెట్టింపుకు మించి చైనా లో విస్తరణ 47శాతం గా వుంది. 

దీనర్ధమేమంటే వార్తా పత్రికా రంగం మరియు సమాచార టెలివిజన్ల పై డిజిటల్ విప్లవ ప్రభావం పడటం ఇంకా ప్రారంభం కాలేదు. మనదేశంలో ప్రతి వార్తా పత్రిక వెబ్ సైట్ కలిగివుండి, అందులో అనేక పత్రికలూ సమాచారాన్ని, ఆకర్షణీయ మైన డిజిటల్ హంగులను దేశీయ, విదేశీ పాఠకుల ప్రయోజనం కోసం నిర్వహిస్తున్నప్పటికీ, అవి ప్రింట్ మీడియాకు లోబడే వున్నాయి. ది గార్డియన్ పత్రిక సంపాదకులు ఎలన్ రుస్ బ్రిడ్జర్ చెప్పినట్లుగా ఇలా చెప్తుంటారు,'జర్నలిజం కాంతి తరంగాల  వేగంతో సమానంగా మార్పుకు గురౌతున్నది( దాదాపు సెకనుకు 3 లక్షల కి.మీ ),  మీడియాను పరివర్తింప చేస్తున్న డిజిటల్ టెక్నాలజీల  నూతన విజ్ఞానాన్ని, నవీన సత్యాలను  తప్పనిసరిగా ప్రతి వారం తెలుసుకుంటున్నాము".   ఈ మార్పు మన దేశంలో శబ్ద తరంగాల వేగంతో (సెకనుకు 342.29 మీటర్లు)వున్నట్లు మన దేశ వార్తా పత్రికా పరిశ్రమ అంతర్గతంగా అబిప్రాయ పడుతున్నట్లుంది. 

ఈ పరిస్థితి ఉదాసీనతను పుట్టిస్తున్నది. డిజిటల్ యుగానికి ముఖ్యమైన నూతన విజ్ఞానాన్ని. నవీన సత్యాలను తెలిసికోవాలనే నిజమైన చొరవ వుండటం లెదు. అమెరికా ప్రింట్ మీడియా ఎదుర్కుంటున్న పరిస్థితిని భారత వార్తా పత్రికా రంగం 2040 నాటికి ఎదుర్కోవలసి వుంటుందని, . ప్రకటనలపైన, ఇతర అంశాలపైన ఆర్జించ కలిగే రెవెన్యూ లో అత్యధిక భాగం మనం సాంతం చేసికోవటానికి సంసిద్దులం కావాలని  భారత దేశంలో కొన్ని అధ్యయనాలు తెలుపుతున్నాయి. డిజిటల్ ప్రభావం తక్షణం కాకపోయినా సమీపంలో వుంటుదన్న వాస్తవాల్ని గుర్తించలేని వారి జోస్యాలు, అంచనాలు సత్య దూరా లనిపిస్తుంది. 2040 వరకు పరివర్తన సమయం రావడం అసాధ్యమనిపిస్తుంది. 

ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఏకీకరణల  ప్రక్రియతో రాజీపడటం -ఇక్కడ మన ముందు పెద్ద సవాలుగా నిలిచింది. 'మార్పు'యొక్క నడకను నిశితంగా అంచనా వేసికొని, సంక్లిష్ట పరిస్థితులను గమనంలో వుంచుకొని భవిష్యత్ జీవితానికి సిద్ధం కావలసి వుంది. 

భారత వార్తా పత్రిక రంగంలో పలుకుబడి కలిగిన వర్గాలు చాలాకాలంగా రాజకీయాలలో నిర్వహిస్తున్న  ప్రజాతంత్ర పాత్ర ప్రశ్నించలేనిది. దురదృష్టవశాత్తు, ఆర్ధిక సమస్యలు, విధానాలు వచ్చేసరికి ప్రధాన స్రవంతి మీడియా అప్రజాస్వామికంగానే వ్యవహరిస్తున్నది. కానీ ఎప్పుడూ ఇదే విధానం కొనసాగలేదు. ఆకలి చావుల సమస్యల్లో క్షేత్ర స్థాయిలో  తీవ్ర బాధితుల వాస్తవ జీవితాల్ని బహిరంగ పరచడంలోను  ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశకర విధానాల అమలును నివారించి, తీవ్ర ఆకలి, క్షామ పరిస్థితుల నుండి విముక్తిపరిచే గ్యారంటీలు పొందటంలోను ఇతర ప్రజాతంత్ర సంస్థలతో కలసి భారత దేశ  మీడియా  నిర్వహించిన చారిత్రాత్మక పాత్రను అమర్త్యసేన్ కొనియాడారు. 

గత రెండు దశాబ్దాలుగా తీవ్ర దుష్ప్రభావాల్ని కలిగించిన నయా ఉదారవాద విధానాలను సవాలు చేసే వార్తలు, విశ్లేషణలు, వ్యాఖ్యానాల్ని భారత వార్తా పత్రికా పరిశ్రమను నిర్వహిస్తున్న అనేక శక్తులు బహిష్కరించాయి. ప్రధాన స్రవంతి పత్రికలు మరియు సమాచార టెలివిజన్ ఆ విధానాలను నెత్తి కెత్తుకొని, వాటిపై వస్తున్న విమర్శల్ని, అభ్యంతరాల్ని ప్రచురణకు నోచుకోకుండా చేయటమో లేదా విమర్సల  పదునును తగ్గించడమో చేస్తున్నారు. సామాజిక ఆర్ధిక ప్రతికూల ప్రభావాల్ని సెన్సార్ చేస్తున్నారు. ఆర్ధిక నిపుణులతో పాటు ఈ విధానాలపై  పటిష్టమైన విమర్శలు చేసేవారి గొంతుకలకు కూడా  ప్రచురణ స్థానం ఇవ్వడంలేదు. 

ప్రజల దైన్య స్థితుల వాస్తవాలను ప్రముఖంగా చెప్పటం కంటే "అంతా బాగానే వుంది"అన్న భావనకు ప్రచురణలలో ప్రాధాన్యతనివ్వాలని పత్రికా యజమానులు , ప్రకటన కర్తలు, మార్కెటింగ్ అధికారులు, కార్పోరేట్ మేనేజర్లు, చివరకు సీనియర్ జర్నలిస్టుల నుండి కూడా భారత దేశ జర్నలిజం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటుందని విమర్శకులు ఎత్తిచూపుతున్నారు. . "పేదరికం,ప్రత్యేకంగా గ్రామీణ పేదరికం, వార్తలకుగాని, సంపాదకీయాలకు గాని కధనా వస్తువు  వుండ కలిగే అర్హత లేదని, పేదరికాన్ని ఆకాంక్ష గా స్వీకరించలేని యువకులకు, ఈ వార్తాసేకరణ వారి  ఆకాంక్షల్ని ఎలా నెరవేర్చగలదని , వ్యాపార తాత్వికత నుండి ఉద్భవించిన వార్తాపత్రిక సంపాదకీయ తాత్వికత, ఆశావాదాలలో ఒకటిగా ఎలా మనగలుతుందనే అంశాల గూర్చి  భారత దేశ వార్తా పత్రికా ఎగ్జిక్యుటివ్లతో 'ఔలెట్ట'  నిర్మోహమాటం గా జరిపిన సంభాషణలనుండి   తెలుసుకున్నారు. 

చెన్నై లోని ఆసియా స్కూల్ అఫ్ జర్నలిజం విద్యార్ధులకు 2002 సంవత్సర స్నాతకోపన్యాసంగా ప్రముఖ ఆర్ధిక వేత్త ప్రభాత్ పట్నాయక్, "మార్కెట్లు, నైతికత, మీడియా "అనే అంశం పై తన స్వతస్సిద్ధమైన, అసాధారణమైన  దృక్కోణ పధ్ధతిలో ప్రసంగించారు. ఆయన ఆ సందర్భంగా చేసిన ప్రసంగ పూర్తి  పాఠం ఆన్ లైన్ లో లభ్యమౌతున్నది. ఇక్కడ దాని ముగింపును మాత్రం   ప్రస్తావిస్తాను. 

ఆర్ధిక అంశాలకు సంబంధించి మీడియా శక్తి పై,  పై ప్రసంగాన్ని  మనం "పట్నాయక్ చట్టం" గా అభివర్ణించ వచ్చును. "అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి, మీడియా ఒకే సరసన ఉన్నప్పుడు, మీడియా శక్తిమంతంగా కనిపిస్తుంది. కానీ దానంతటదిగా మీడియా మానవ విలువల్ని సమర్ధిస్తూ, పేదలు నిర్భాగ్యుల వేదనల్ని వాస్తవంగా వ్యక్తంచేసినప్పుడు అది శక్తి విహీనంగా కనిపిస్తుంది.  ఈ శక్తి విహీనత ఒక ప్రక్రియ ద్వారా ఉద్భవిస్తుందని ఆయన సూత్రీకరించారు. ఆర్ధిక వ్యవస్థ పై అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రాబల్యం సాధించటమే ఆ ప్రక్రియగా చెప్పారు. వైరుధ్య పూర్వకంగా గౌరవనీయమైన కొన్ని మినహాయింపులు తప్పించి, స్థూలంగా ఈ ప్రాబల్యాన్నిమీడియా మనస్పూర్తిగా  సమర్ధిస్తున్నది. 

పేదరికం , సామూహిక నిరాకరణ, మౌలిక జీవనాధార సమస్యలు, ఈ సమస్యలపై ప్రభుత్వ విధానాల ప్రభావం, వ్యవసాయం స్థితిగతులు,గ్రామీణ సమస్యలు భారతదేశ వార్తాపత్రికల్లో, సమాచార టెలివిజన్ లో అతి తక్కువ స్థాయిలో ప్రచురణకు నోచుకుంటున్నాయి పట్నాయక్ ప్రస్తావించిన ' గౌరవనీయ మినహాయింపులు' చాలా  సార్ధకమైనవి. గ్రామీణ దుస్థితి,రైతుల ఆత్మహత్యలు, సామూహిక వలసలు లాంటి సామాజిక అంశాలపై పి. సాయినాథ్ పరిశోధన వ్యాసాలు- ప్రజా హితమైన, పరిశోధనాత్మకమైన, కార్యాచరణను రూపొందించే జర్నలిజం యొక్క విలువైన సాంప్రదాయాలకు కట్టుబడి ఉన్నాయి. ఇటువంటి జర్నలిజానికి విలువనివ్వకలిగే ప్రజా సంస్కృతిని నిర్మించగలిగి, ప్రతిభావంతమైన పై కృషికి వివిధ భారతీయ భాషల్లో ఈ అంశాలపైనే ఆదర్శ భావాలు గల యువ విలేఖరుల రచనలు తోడైతే ప్రస్తుత సంక్లిష్ట స్థితి నుండి బయటపడటానికి మార్గం దొరకగలదు. 

భారత వార్తా పత్రికా రంగం చర్చలలో తరచూ ఉపేక్షింప బడుతున్న క్లిష్టమైన అంశం దగ్గరకు తీసుకు రాబడ్డాను. రెండు స్థితులు: వార్తా పత్రికా పరిశ్రమ యొక్క అదృష్టాలు మరియు జర్నలిజం యొక్క స్థితి. ఈ రెంటిని కలుపకూడదు. యాజమాన్యాల  ఆర్ధిక రాజకీయ ప్రయోజనాల్ని నెరవేర్చటం కోసం వార్తల్ని, విశ్లేషణల్ని, వ్యాఖ్యనాల్ని మార్చడం, ప్రముఖ వార్తా పత్రికలూ , వార్తా టెలివిజన్ సంస్థలలో సంపాదకీయ విషయాన్ని,సంపాదకీయ కార్యకలాపాల్ని తక్కువ చేయటం, విలువలేకుండా చేయటం, మార్కెట్ పరిశోధన పేరు మీద క్రమ పద్ధతిన నోరు మూయించడం, యాజమాన్యాలు,సీనియర్ మేనేజ్ మెంట్ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సంపాదకీయాల స్థాయిని దిగజార్చే పద్ధతులకు ఇష్టపూర్వకంగా అంగీకరించడం, సంపాదకీయ సమాచారం ముసుగులో అందించే అడ్వర్ టైజ్ మెంట్ సమాచారంలో వార్తలకు చెల్లించే వివరాలను పూర్తిగా ఇవ్వకపోవడం/ అసలు ఇవ్వకపోవడం, ప్రైవేట్ ఒప్పందాలు, ఎన్నికల ప్రచార వార్తలకు చేల్లిపులు స్వీకరించడం, అనుకూల వార్తల ప్రచురణకు లంచాలు తీసికోవటం,  ఈ రకమైన పద్ధతులతో వార్తా పత్రికలూ , ఇతర వార్తా మీడియా వర్ధిల్లుతుంటే. భారత దేశ మీడియా  రంగం అభివృద్ది బాటలో తీవ్రమైన అక్రమాలున్నాయి.  

ఫ్రంట్ లైన్ పత్రికలో ప్రచురించిన వ్యాసానికి కె.యల్. ప్రసాద్  సంక్షిప్త అనువాదం 

Sunday, March 22, 2015

అంకెల మాయాజాలంలో ఆర్థిక వ్యవస్థ

ప్రభుత్వం చెపుతున్నట్లు ఆర్థికాభివృద్ధి 7 శాతానికిమించితే తదనుగుణంగా ఆర్థిక వ్యవస్థలో లావాదేవీలుపెరగాలి. బ్యాంకు రుణాలు 2013-14లో 9. 7 శాతం ఉండగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతానికి మించలేదు. కీలకమైన మౌలికవసతుల కల్పన రంగం - జాతీయ రహదారులు, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు, ప్రత్యేక పారిశ్రామిక వాడలు వంటి రంగాల్లో ఉన్న కంపెనీలకు రుణాలు ఇవ్వవద్దని రిజర్వు బ్యాంకు ఆదేశించింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుకు అనుగుణంగానే పన్నుల ఆదాయాలు పెరగాలి. కానీ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోయిందని బడ్జెట్‌ 
పత్రాల్లో ఆర్థిక మంత్రి పార్లమెంట్‌కు నివేదించారు.
                    ''అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభంలో భాగంగా నాలుగేళ్ల పాటు నత్తనడక సాగించిన భారత ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఉరుకులు పరుగులు తీయనారంభించింది.'' 2015-16 బడ్జెట్‌ ప్రతిపాదిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో చేసిన ప్రసంగపాఠం ఇది. కేంద్ర గణాంకాల సంస్థ తాజాగా వెలువరించిన నూతన గణాంకాలు దీనికి ప్రాతిపదిక అని కూడా ఆయన ప్రకటించారు. ఈ నూతన గణాంకాల ఆధారంగానే దేశ ఆర్థిక ప్రగతి చైనాతో పోటీ పడే స్థాయిలో ఉందన్న విశ్లేషణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర గణాంకాలు, ఆర్థికవ్యవస్థ ప్రగతిని కొలవటంలో దాని అంచనాల పాత్ర, వాటి ప్రాసంగికత వంటి అంశాలపై మరోమారు చర్చ మొదలైంది. ఏ ఆర్థిక వ్యవస్థ విశ్లేషణకైనా ఆయా దేశాల్లోని ప్రజల స్థితిగతుల్లో వచ్చిన మార్పులు పరిశీలించటం ప్రమాణం. ఈ మార్పులను జాతీయ స్థాయిలోనో, రాష్ట్రాల స్థాయిలోనో పరిశీలించేటప్పుడు అంకెల్లో అంచనాలకు రావటం పరిపాటి. అయితే ఈ అంచనాలు జనజీవితాల్లో కనిపించే వాస్తవికతకు దగ్గరగా లేకపోతే కేవలం అంకెల గారడీగానే మిగిలిపోతాయి. 2015 జనవరిలో కేంద్ర గణాంకాల సంస్థ విడుదల చేసిన తాజా అంచనాలు, అందుకు అనుసరించిన ప్రమాణాలు ఇటువంటి గారడీకి పాల్పడ్డాయా అన్న సందేహం రిజర్వు బ్యాంకు గవర్నర్‌తో సహా పలువురు వ్యక్తం చేస్తున్నారు. 
                  జాతీయ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను అంకెల్లో బంధించి ప్రపంచం ముందుంచటానికి అన్ని ప్రభుత్వాల ఆధీనంలో గణాంక సంస్థలు పని చేస్తాయి. భారతదేశంలో దీనికోసం ఏకంగా ఒక మంత్రిత్వశాఖే పని చేస్తోంది. ఈ శాఖ ఆధీనంలోనే కేంద్ర గణాంకాల సంస్థ, జాతీయ నమూనా సర్వే సంస్థ వంటి కీలకమైన విభాగాలు ఉన్నాయి. కేంద్ర గణాంకాల సంస్థ ప్రభుత్వ విభాగాలు, ప్రైవేటు పారిశ్రామిక సంస్థల నుండి ప్రతి నెలా గణాంకాలు సేకరించి వాటి ఆధారంగా జాతీయ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను అంచనా వేస్తుంది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విధి విధానాలు రూపొందించటంలో ఈ అంచనాలే ప్రభుత్వాలకు మౌలికమైన ఆధారాలుగా పని చేస్తాయి. కార్మికులకు డిఎ పెంచాలన్నా, వేతన కమిషన్‌ సిఫార్సులు అమలు జరపాలన్నా, వేతన పెంపు నిలుపుదల చేయాలన్నా, కొత్త పన్నులు విధానాలు ప్రతిపాదించాలన్నా అన్నింటికీ ఈ గణాంక సంస్థ అంచనాలే కీలకం. ఈ గణాంక సంస్థలు విడుదలచేసే పారిశ్రామికోత్పత్తి సూచిక (ఇండెక్స్‌ ఆఫ్‌ ఇండిస్టియల్‌ ప్రొడక్షన్‌) ప్రభుత్వాలు అనుసరించే పారిశ్రామిక విధానాలకు దిశా నిర్దేశం చేస్తుంది. ప్రపంచీకరణ యుగంలో వాస్తవాలకతీతంగా అంచనాలు విడుదలచేయటం ఆనవాయితీగా మారింది. 
                2004-05 ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికన ఇప్పటి వరకు భారత ఆర్థిక వ్యవస్థను అంచనా వేస్తూ వచ్చారు. అంటే 2004-05 నాటికి అన్ని గణాంకాలు 100గా ఉన్నాయనుకుంటే తర్వాతి సంవత్సరాల్లో ఆయా గణాంకాలు 100 కంటే ఎంత ఎక్కువ ఉన్నాయి, ఎంత తక్కువ ఉన్నాయి అన్నదాన్ని బట్టి ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందా, తిరోగమిస్తోందా, స్థబ్ధతలో ఉందా అన్న నిర్ధారణకు వస్తుంటారు. ఈ అంచనాల ఆధారంగానే యుపిఎ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో విఫలం అయ్యిందనే ప్రచారం హోరెత్తింది. అంతిమంగా కాంగ్రెస్‌ను అంపశయ్యపైకి చేర్చి బిజెపి అధికారానికి వచ్చింది. కుర్చీలో కూర్చున్నాకగానీ అయ్యవార్లకు అసలు విషయం అంతుబట్టలేదు. ఆర్థిక విధానాలు గాడిలో పెట్టామని బిజెపి ఎంతగా డంభాలు పలికినా ఆచరణలో పారిశ్రామికోత్పత్తి సహా అన్ని ఆర్థికాభివృద్ధి సూచికలు నేల చూపు కొనసాగించాయి. ఆర్థిక వ్యవస్థను నడిపించే లాభాపేక్షకు జేబులో మిగులు పోగుపడిందా లేదా అన్నదే ప్రధానం తప్ప ప్రభుత్వంలో బిజెపి ఉందా కాంగ్రెస్‌ ఉందా అన్నది పెట్టుబడికి సంబంధం లేని విషయం. అందువల్లే మోడీ మాటల మంత్రదండం పని చేయలేదు. గోబెల్స్‌ ప్రచారంలో ప్రావీణ్యం సాధించిన బిజెపి ఏకంగా ఆర్థిక అంచనాల ప్రాతిపదిక సంవత్సరాన్ని 2004-05 నుండి 2011-12కు మార్చింది. దాంతో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా అంగలుపంగలు మీద పరుగులెత్తుతున్నట్లు కనిపించింది. ఈ పరిణామం హేతుబద్దంగా ఆలోచించే మేధావుల ముందు పలు ప్రశ్నలు లేవనెత్తింది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇటువంటి అంకెల మాయాజాలాన్ని బాగా అర్థం చేసుకుని ఇప్పుడు రిజర్వు బ్యాంకు గవర్నర్‌ హోదాలో పని చేస్తున్న రఘురాం రాజన్‌ వంటివారే తాజా అంచనాల్లో ద్రవ్యోల్బణానికి సంబంధించిన అంచనాలు తప్ప మరేవీ నమ్మశక్యంగా లేవని ప్రకటించారు. 
                     ఈ గణాంకాల ప్రాతిపదికను, పొందికను మార్చటానికి ఐక్యరాజ్యసమితి గణాంకాల సంస్థ సూచనలు కారణమని ప్రభుత్వం సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది ఈ తాజా కసరత్తు. గణాంకాల సూచికలు ఐక్యరాజ్యసమితి సూచనల మేరకు ఉన్నాయని భావించినా వాటిని దేశానికి వర్తింపచేసుకోవటంలో ప్రభుత్వం, ఉదారవాద మేధావులు అనుసరించిన మతలబుతో కుంటి గుర్రంలా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ ఏకంగా కుందేలులాగా కుప్పిగంతులు వేయనారంభించింది. అందుకే అనుభవజ్ఞుల అంకెలు నందిని పందిగాను, పందిని నందిగానూ నిరూపిస్తాయని విమర్శిస్తుంటారు. సాధారణంగా ప్రభుత్వం విడుదలచేసే వివిధ గణాంకాల మధ్య పోల్చి విశ్లేషకులు లోతుపాతులు వ్యాఖ్యానించటం ఆనవాయితీ. విశ్లేషణ కోసం పోల్చాలన్నా సూచికలు ఒకే విధంగాఉండాలి. కానీ ప్రభుత్వం విడుదల చేసిన తాజా అంచనాల్లో అటువంటి కీలక సూచికల్లో కూడా మార్పులు చేయటంతో ఈ అంచనాలను విమర్శనాత్మకంగా విశ్లేషించటానికి, పోల్చి తప్పొప్పులు చూపటానికి, విధానపరమైన నిర్ధారణలకు రావటానికి అవకాశం లేకపోయింది. నయాఉదారవాదం ప్రత్యామ్నాయ దృక్ఫధాన్ని, ఆలోచనలను, విశ్లేషణా సామర్ధ్యాన్ని ఎలా నియంత్రిస్తుందో తెలియచెప్పేందుకు ఇది ఒక తాజా ఉదాహరణ. 
ప్రభుత్వం చెపుతున్నట్లు ఆర్థికాభివృద్ధి 7 శాతానికి మించితే తదనుగుణంగా ఆర్థిక వ్యవస్థలో లావాదేవీలు పెరగాలి. లావాదేవీలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగాలి. కానీ ప్రభుత్వ అంచనాల్లోనే ద్రవ్యోల్బణం రికార్డుస్థాయిలో తగ్గిపోయింది. పారిశ్రామికోత్పత్తి పుంజుకుంటే ఆయా కంపెనీల షేర్లు అమ్మకాలు పెరగాలి. కానీ ఈ గత సంవత్సర కాలంగా విదేశీ మదుపరులను మినహాయిస్తే దేశీయ పారిశ్రామిక సంస్థల షేర్ల అమ్మకాలు స్థబ్దతకు లోనయ్యాయి. 2014 ఏప్రిల్‌ - డిశంబరు వరకు తొమ్మిది నెల్లపాటు 2.1 శాతంగా ఉన్న పారిశ్రామికోత్పత్తుల సూచి ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి 6.7 శాతంగా ఉంటుందని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఫిబ్రవరి వరకు విడుదల అయిన ఈ సూచి లెక్కలు కూడా అంచనాలు తప్పే అని చెపుతున్నాయి. బ్యాంకు రుణాలు 2013-14లో 9. 7 శాతం ఉండగా 2014 -15 ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతానికి మించలేదు. కీలకమైన మౌలికవసతుల కల్పన రంగం-జాతీయ రహదా రులు, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు, ప్రత్యేక పారిశ్రామిక వాడలు వంటి రంగాల్లో ఉన్న కంపెనీలకు రుణాలు ఇవ్వవద్దని రిజర్వు బ్యాంకు ఆదేశించింది. ఆర్థిక వ్యవస్థలో ఉపద్రవం స్థాయికి చేరనున్న సంక్షోభానికి ఇవి సూచనలు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుకు అనుగుణంగానే పన్నుల ఆదాయాలు పెరగాలి. కానీ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోయిందని బడ్జెట్‌ పత్రాల్లో ఆర్థిక మంత్రి పార్లమెంట్‌కు నివేదించారు. ఈ వివరాలన్నీ ప్రభుత్వం విడుదల చేస్తున్న అంచనాలకు, ఆర్థిక వ్యవస్థ వాస్తవిక స్థితికి మధ్య పొంతనలేని వైనాన్ని తెలియ చేస్తుంది. 
                   ప్రభుత్వాల ఆర్థిక అంచనాలన్నీ ఏదో ఒక సంవత్సరం వాస్తవిక లెక్కలు ఆధారం చేసుకుని (స్థిర ధరల ప్రాతిపదికన) సాగుతుంటాయి. అటువంటి ఆధారిత సంవత్సరాన్ని గణాంకాల పరిభాషలో బేస్‌ ఇయర్‌ అంటారు. ఈ బేస్‌ ఇయర్‌ ప్రతి పదేళ్లకొకసారి మారుతుంది. స్వాతంత్వ్రానంతరం 1948-49 ఆర్థిక సంవత్సరాన్ని బేస్‌ ఇయర్‌గా తీసుకుని నాటి స్థిర ధరల ప్రాతిపదికన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంచనాలు లెక్కగట్టటం ప్రారంభం అయ్యింది. అప్పటి వరకు ఆర్థిక వ్యవస్థ ఇంగ్లాండ్‌ పార్లమెంట్‌ కనుసన్నల్లో ఉండేది. దాంతో దేశీయంగా అన్ని వివరాలు అందుబాటులో లేని పరిస్థితి తలెత్తింది. కాల క్రమంలో దేశీయ ఆర్థిక వ్యవస్థ కేంద్రం ఢిల్లీకి మారటం, గణాంకాల్లో తగు మార్పులు చేసుకోవటం, మార్పులుకు అనుగుగణంగా వివరాలు సేకరణ ప్రారంభం కావటంతో 1967 నాటికి గణాంకాల సేకరణ గాడిలో పడింది. దాంతో 1960-61 ఆర్థిక సంవత్సరం బేస్‌ ఇయర్‌గా తీసుకుని 1967 సంవత్సరపు ఆర్థిక అంచనాలు రూపొదించబడ్డాయి. క్రమంగా 1978లో ఆర్థిక అంచనాలకు 1960-61 సంవత్సరాన్ని, 1988 సంవత్సరానికి 1970-71 సంవత్సరాన్ని, ఆధారిత సంవత్సరాలుగా పరిగణించటం, ఆమేరకు ఆర్థిక అంచనాలు లెక్కకట్టడం జరిగింది. 1998 వచ్చేసరికి ఆధారిత సంవత్సరం ప్రమాణాలు మారిపోయాయి. 1999లో ఆర్థిక వ్యవస్థ అంచనాలు రూపొందించటానికి 1993-94 సంవత్సరాన్ని ఆధారిత సంవత్సరంగా మార్చారు. 1991 వరకు దేశీయ ఆర్థిక అంచనాలు ప్రధానంగా దేశీయ ప్రజల ప్రయోజనాలు, అందుకవసరమైన విధానాల రూపకల్పన లక్ష్యంతో సూచికలను నిర్ధారించుకునేవి. 1991కు ముందు వివిధ దేశాలు విడుదలచేసిన ఆర్థిక అంచనాలను పున:పరిశీలించటానికి, మదింపు చేయటానికి, విదేశీ పెట్టుబడుల ప్రయోజనాల దృష్ట్యా విశ్లేషించటానికి విదేశీ పెట్టుబడుల కేంద్ర స్థానాలు ప్రత్యేక అధ్యయనాలు చేసేవి. 
                        1991 తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో మన దేశ ఆర్థిక వ్యవస్థ శక్తిని ప్రదర్శించటం కూడా ఒక లక్ష్యంగా మారింది. అంతిమంగా దేశీయంగా రూపొందించే ఆర్థిక అంచనాలు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని ఆకర్షించేలా రూపొందించటం ఒక ముఖ్యమైన లక్ష్యంగా మారింది. దాంతో దేశీయ గణాంకాల అధ్యయనం తీరుతెన్నులు కూడా పర్యవేక్షించటం, అవరమైన శిక్షణ ఇవ్వటం ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వంటి సంస్థల కార్యకలాపాల్లో అంతర్భాగం అయ్యాయి. దానికనుగుణంగా మన దేశంలో కూడా గణాంక అధ్యయనాల దశ, దిశల్లో మార్పులు వచ్చాయి. ఉద్దేశ్యాలు కూడా మారిపోయాయి. అందువల్లనే 1999 నుండి ఆధారిత సంవత్సరాన్ని పదేళ్ల నుండి ఐదేళ్లకు తగ్గించారు. అందువల్లనే 1999 ఆర్థిక సంవత్సరం అంచనాలుకు 1993-94 ప్రాతిపదిక అయ్యింది. 2006 అంచనాలకు 2004-05 అంచనాలు ప్రాతిపదిక అయ్యాయి. ఈ కోవలోనే తాజా అంచనాలకు 2011-12ను ఆధారిత సంవత్సరంగా పరిగణించారు. 2011-12 ఆర్థిక సంవత్సరం నాటికి ఆర్థికాభివృద్ధి రేటుపై ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ప్రభావం ఉంది. వృద్ధి రేటు వేగం తగ్గిపోయింది. ఎక్కువ వృద్ధి రేటు ఉన్న సంవత్సరం ప్రాతిపదికగా తీసుకుంటే తాజా సంవత్సరంలో అంతకంటే వృద్ధి రేటు పెరిగితేనే ఆర్థికాభివృద్ధి జరిగినట్లు అర్థమవుతుంది. తక్కువ వృద్ధి రేటు ఉన్న సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఈ సమస్య ఉండదు. ఎంత పెరిగినా పెరిగినట్లే కనిపిస్తుంది. దీనినే బేస్‌ ఇయర్‌ ఎఫెక్ట్‌ అంటారు. ఆర్థిక వ్యవస్థలో నిజమైన వృద్ధి రేటు ప్రాతిపదికన అంచనాలు, విధానాలు రూపొందించటానికి బదులు అటువంటి బేస్‌ ఇయర్‌ ఎఫెక్ట్‌పై ఆధారపడి అంచనాలు, విధానాలు రూపొందించే ప్రయత్నం చేయటం తాజా అంచనాల పర్యవసానం. అంటే ముతక భాషలో చెప్పాలంటే బలుపు ఆధారంగా అంచనాకు రావటం పక్కన పెట్టి వాపు ఆధారంగా అంచనాకు రావటం ప్రారంభమైంది. 
                     ప్రైవేటు కార్పొరేట్‌ వర్గపు మదుపు రేట్లు, పెట్టుబడి రేట్లు పాత అంచనాల ప్రకారం ఈ మదుపు రేట్లు 30 శాతానికి మించి లేవు. కానీ కొత్త అంచనాల ప్రకారం మదుపు రేట్లు 40 శాతానికి పెరిగాయి. ఇక్కడే మరో ప్రశ్న తలెత్తుతుంది. జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కంటే ప్రైవేటు కంపెనీల వద్ద పోగుపడే లాభాల రేటు ఎక్కువగా ఉన్నపుడు వారికి మరిన్ని రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి అన్న ప్రశ్న అది. పెరిగిన వృద్ధి రేటును కొనసాగించగల సామర్ధ్యం ప్రైవేటు కార్పొరేట్‌ వర్గానికి ఉన్నపుడు బడ్జెట్‌లో మూడో వంతు ఆదాయాన్ని వారికి రాయితీల రూపంలో కట్టుబెట్టాల్సిన అవసరం ఏమిటి? ఈ అంచనాలే విధానాల రూపకల్పనకు ప్రాతిపదికన అనుకున్నపుడు సాధారణ ప్రజల చేతుల్లో మదుపు 72 శాతం నుండి 59 శాతానికి పడిపోయింది. అంటే ప్రభుత్వ విధానాల లక్ష్యం సాధారణ చేతుల్లో మదుపు సామర్థ్యం పెంచేదిగా ఉండాలి. కానీ బడ్జెట్‌లో అనుసరించిన పరోక్ష పన్నుల విధానం ఈ ప్రజల మదుపు సామర్ధ్యాన్ని మరింత కుంగదీసేదిగా ఉంది. 
                        స్థూలంగా చూసినప్పుడు మనం కొన్ని నిర్ధారణలకు రావచ్చు. ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థ వాస్తవిక చిత్రాన్ని ప్రతిబింబించటం లేదు. అంతర్జాతీయ ద్రవ్యమార్కెట్‌లో ఈ అంచనాలతో తమ పరిపాలన సామర్ద్యానికి మెప్పు పొందే ప్రయత్నమే ఇది. ఇటువంటి కపటవాస్తవాలు కళ్ల ముందు పెట్టి విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నించటం ఎండమావిలో దప్పిక తీర్చుకునే ప్రయత్నం తప్ప మరోటి కాదు. యుపిఎ హయాంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్న బిజెపి ప్రచారం తప్పుడు ప్రచారమని ఈ అంచనాలు నిరూపిస్తున్నాయని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విమర్శించటం ఇందులో కొసమెరుపు. ఇటువంటి అనుమానాస్పద అంచనాలు ఆధారం చేసుకుని విధానాలు రూపొందించటం అంటే రోగాన్ని గుర్తించకుండా మందులు వేయటమే అవుతుంది.
-కె. లక్ష్మీప్రసాద్‌