Saturday, March 12, 2011

''ద్రవ్యలోటును తగ్గించిన ద్రవ్యోల్బణం!!''


కేంద్ర బడ్జెట్‌పై విశ్లేషణలు, వ్యాఖ్యానాలు, విమర్శలు జరుపుతున్న రోజులివి. గత సంవత్సర కాలం ద్రవ్య సంక్షోభ కష్టాల నుండి నుండి భారత ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించటం కోసం అత్యధికంగా వ్యయం చేసినప్పటికీ ద్రవ్యలోటును గతంలో అంచనా వేసిన 5.5శాతం నుండి 5.1శాతానికి తగ్గించగలిగానని 2011-12 బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి సగర్వంగా చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక నిపుణులు ''ద్రవ్యలోటును తగ్గించిన ద్రవ్యోల్బణం'' అన్న శీర్షిక కింద చేసిన విశ్లేషణలు ఆర్థికాంశాలపై ఆసక్తి ఉన్నవారందరికి విస్మయాన్ని కల్గిస్తుంది. అయినప్పటికి ఇది వాస్తవం. వివరాలలోకి పోయే ముందు బడ్జెట్‌కు సంబంధించిన కొన్ని పారిభాషిక పదాలను మరోసారి గుర్తుచేసుకుందాం.

ద్రవ్యలోటు

మొత్తం ప్రభుత్వ వ్యయానికి, రుణాలను మినహాయించిన ప్రభుత్వ ఆదాయానికి మధ్య ఉన్న తేడాను ద్రవ్యలోటు అంటారు. ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంటే ద్రవ్యలోటు గాను, వ్యయం కంటే ఆదాయం ఎక్కువగా ఉంటే ద్రవ్య మిగులు గాను పరిగణిస్తారు. ద్రవ్యలోటును సహజంగా స్థూల దేశీయోత్పత్తి (జి.డి.పి)లో శాతంగా వ్యక్తపరుస్తారు.

స్థూలదేశీయోత్పత్తి (జి.డి.పి)

ఒక నిర్ణీత కాలంలో దేశీయ, విదేశీయ అనే తేడాతో నిమిత్తం లేకుండా, ఒక దేశ సరిహద్దులకు పరిమితమై ఉత్పత్తి అయ్యే అన్ని రకాల సరుకులు, సేవలు, మదుపులు (ఇన్‌వెస్ట్‌మెంట్స్‌), ఎగుమతుల, దిగుమతుల మధ్య ఉండే నికర ఎగుమతులన్నింటి ''మొత్తం ద్రవ్య విలువ''ను స్థూలదేశీయోత్పత్తి లేదా జి.డి.పి (గ్రాస్‌ డొమెస్టిక్‌ ప్రాడక్ట్‌) అని అంటారు.

నామమాత్ర స్థూలదేశీయోత్పత్తి (నామినల్‌/నామమాత్ర జి.డి.పి)

లెక్కించే సమయానికి అమలులో ఉన్న ధరల ఆధారంగా గణించబడిన స్థూలదేశీయోత్పత్తిని నామమాత్ర స్థూలదేశీయోత్పత్తి లేదా నామినల్‌ జి.డి.పి అంటారు.

నిజ స్థూల దేశీయోత్పత్తి (రియల్‌ జి.డి.పి)

స్థిరమైన ధరల ఆధారంగా గణించబడిన జి.డి.పి ని నిజ స్థూలదేశీయోత్పత్తి లేదా రియల్‌ జి.డి.పి (నిజ జి.డి.పి) అంటారు. వివిధ కాలాల మధ్య జి.డి.పి ని పోల్చేటప్పుడు సాధారణంగా నిజ జి.డి.పి ని వాడుతారు.

ద్రవ్యోల్బణం

దీర్ఘ కాలం నికరంగా కొనసాగే సరకులు, సేవల ధరలలోని పెరుగుదల స్థాయిని ద్రవ్యోల్బణంగా పరిగణిస్తారు. నామ మాత్ర జి.డి.పి కి, నిజ జి.డి.పి కి మధ్య తేడాయే ద్రవ్యోల్బణం (ఇన్‌ప్లేషన్‌) అవుతుంది. ద్రవ్యోల్బణ రేటు 2%-3%గా ఉంటే సున్నిత ద్రవ్యోల్బణమని, 5% వరకు ఉంటే నడిచే ద్రవ్యోల్బణమని, 10% వరకు ఉండే ద్రవ్యోల్బణాన్ని పరిగెత్తే ద్రవ్యోల్బణమని, ఆపైన ఉండే ద్రవ్యోల్బణాన్ని విజృంభించే ద్రవ్యోల్బణమని పిలుస్తారు. భారతీయ రిజర్వ్‌ బ్యాంకు ప్రమాణాలలో 5% వరకు ద్రవ్యోల్బణ రేటు ఆరోగ్యకరమైనది గాను, ఆపైన ఉంటే ప్రమాదకరమైనదిగాను పరిగణిస్తున్నారు.

కేంద్ర బడ్జెట్‌ పై విశ్లేషణలో ద్రవ్యలోటు

2010-11 సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ కాలంలో స్థూల దేశీయోత్పత్తి (జి.డి.పి)ని అప్పటి ధరల్లో 69 లక్షల 35 వేల కోట్ల రూపాయలుగా, ద్రవ్య లోటును 3 లక్షల 81 వేల కోట్ల రూపాయలుగా అంచనా వేసి, ద్రవ్య లోటును 5.5%గా నిర్ణయించారు. 2009 మే అయిదు నుండి మన ఆర్థిక వ్యవస్థలో వరుసగా 76 వారాల పాటు రెండంకెల విజృంభణ ద్రవ్యోల్బణం గంగ వెర్రులెత్తించింది. ఈ నేపథ్యంలో 2011-12 బడ్జెట్‌ ప్రసంగంలో ప్రస్తుతం అమలులో ఉన్న ధరలలో నామమాత్ర జి.డి.పి రూ.78.78 లక్షల కోట్లకు పెరిగిందని. అలాగే ద్రవ్యలోటు నాలుగు లక్షల కోట్ల రూపాయలకు చేరిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న నామమాత్ర జి.డి.పి కి, గత సంవత్సరం అంచనా వేసిన నామమాత్ర జి.డి.పి కి మధ్య ఉన్న తేడా 9.43 లక్షల కోట్ల రూపాయలు. ఇది శుద్ధమైన ద్రవ్యోల్బణం.

ప్రస్తుతమున్న ద్రవ్య లోటుకు (నాలుగు లక్షల కోట్ల రూపాయలకు), ద్రవ్యోల్బణంతో పెరిగిన జి.డి.పికి (రూ.78.78 లక్షల కోట్లకు) మధ్య ఉన్న నిష్పత్తి 5.1శాతం. అంటే గత బడ్జెట్‌ సమయానికి అంచనా వేసిన 5.8శాతం కంటే ఇది తగ్గినట్లుగా కనిపిస్తుంది. ఈ కాలంలో ద్రవ్యలోటు తగ్గటానికి సంపన్నులపై పన్నులేవి విధించబడలేదు. పైపెచ్చు సామాజిక వ్యయం, బడ్జెట్‌ అంచనాల కంటె చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వ చర్యలతో నిమిత్తం లేకుండా, కేవలం పెరిగిన ద్రవ్యోల్బణం మూలకంగా తగ్గిన ద్రవ్యలోటు రేటును ఆర్థిక మంత్రి తన సొంత విజయంగా చెప్పుకుంటున్నారు. ద్రవ్య లోటయిన నాలుగు లక్షల కోట్ల రూపాయలతో, ద్రవ్యోల్బణం అసలేమీ లేదనుకొని గత సంవత్సరం అంచనా వేయబడ్డ రూ.69.35 లక్షల కోట్ల నామమాత్ర జి.డి.పి తో గణిస్తే ద్రవ్యలోటు రేటు 5.8% అవుతుంది. అంటే అంచనా కంటే ఆచరణలో ద్రవ్యలోటు పెరిగినట్లు భావించాలి.

విచిత్రమేమంటే ఆర్థిక మంత్రి ప్రసంగంలో ఏమున్నా, బడ్జెట్‌ పత్రాలకు జతచేయబడిన ''మధ్యస్థ కాల ద్రవ్య విధాన ప్రకటన''లో జి.డి.పి లోని అత్యధిక నామమాత్ర పెరుగుదలే (ద్రవ్యోల్బణం) ద్రవ్యలోటును తగ్గించిందని అంగీకరించటం కొసమెరుపు. అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు లెక్కించే ద్రవ్యలోటు రేట్లు అసంబద్ధమైనవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్లో వాస్తవ పరిస్థితులతో నిమిత్తం లేని అంకెల గారడీతో ఎంతకాలం పాలక వర్గాలు సామాన్య ప్రజలను మోసగించగల్గుతారు? పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాల నుండి పాలకులు గుణపాఠాలు నేర్చుకోకపోతే, ఆ దుస్థితే మన దేశంలో పునరావృతం కాకమానదు.