Friday, April 1, 2016

సరళీకరణ విధాన యుగంలో ప్రైవేట్ థర్మల్ విద్యుత్
కన్నన్ కస్తూరి  
విద్యుత్తు చట్టం 2003 వీలు కల్పించిన  సరళీకరణ విధాన యుగం - బొగ్గు నీరు లభ్యత కలిగిన కొన్ని ప్రాంతాలలో స్థాపింపబడ్డ   కొన్ని స్వంత వినియోగ (కాప్టివ్ )థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఆకర్షణీ యమైన లాభాలను  పొందే అవకాశాన్ని  కల్పించింది.. కాని, తాము కర్మాగారాల్ని స్థాపించ వలసిన ప్రాంతాలలోని ప్రజానీకం పడే  ఇబ్బందులతో నిమిత్తం లేకుండా చాలా  ప్రతిపాదిత ప్రాజెక్ట్ లు అర్ధాంతరంగా వదలివేయబడ్డాయి . మిగిలిన వాటిలో కొన్ని పాక్షిక సామర్ధ్యంతో పనిచేస్తుంటే,  ఇతర ప్రాజెక్టులు  నిర్మాణ జాప్యాలతో  కొట్టుమిట్టాడుతూ,అజ్ఞాతంలోకి కనుమరుగవుతున్నాయి. గత దశాబ్దకాలం లో  ప్రైవేట్ థర్మల్ విద్యుత్ కేంద్రాల అభివృద్ది పై విమర్శనాత్మక విశ్లేషణ వ్యాసం ఇది..

విద్యుత్ చట్టం 2003, జాతీయ విద్యుత్ విధానం 2005 లు, ప్రైవేట్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలకు  అత్యంత మైన సరళీకరణ విధాన యుగాన్ని  తీసికొచ్చింది. లైసెన్సింగ్ తీసివేయబడింది. కేంద్ర విద్యుత్ అధారిటీ నుండి సాంకేతిక ఆర్ధిక క్లియరెన్స్ తీసికోవలసిన అవసరాన్ని  రద్దు చేసింది. స్వంత ప్రసార సమాహారానికి(ట్రాన్స్ మిషన్ నెట్ వర్క్ ) నేరుగా , కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు కొన్ని మినహాయింపులతో  బహిరంగంగా చేరుకునే వీలును థర్మల్ ఉత్పత్తి కర్మాగారాలకు  కల్పించటం జరిగింది. ఉత్పత్తి దారుల లాభాలను కుదిస్తున్న పంపిణీ కంపెనీలతో చేసికోవాల్సిన దీర్ఘ కాలిక(20-25 సం) విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు స్వస్తి చెప్పటం జరిగింది..ఉత్పత్తిదారులు తమ విద్యుత్ ను స్వల్పకాలిక ఒప్పందాల తోను, వర్తకులు,విద్యుత్ ఎక్స్చేంజి కేంద్రాలతో నేరుగా విద్యుత్ ను  బహిరంగ మార్కెట్లలో  అమ్ముకునే వీలుకల్పించారు.

ఈ సరళీకరణ విధాన యుగం ప్రైవేట్ కంపెనీల ఉత్సాహాల్లో  విస్పోటనాన్ని రేకెత్తించింది. ఈ కాలం లో  లో థర్మల్ విద్యుత్ రంగంలో చోటుచేసికున్న ప్రభావాలలోని పరిణామాలను  ఈ వ్యాసం విమర్శనాత్మకం గా విశ్లేషిస్తుంది.
డేటా సేకరించే వనరులు
ఏ ఒక్క వనరు నుండి ప్రైవేట్ థర్మల్ ప్రాజెక్ట్ లకు సంబంధించిన సమగ్ర సమాచారం దొరకటం లేదు. లైసెన్సింగ్ వ్యవస్థ అంతం కావటంతో, దాదాపుగా విద్యుత్ ఉత్పత్తికి చేరువలో వుండి,పర్యావరణ అనుమతులు పొందాల్సిన విద్యుత్ ప్రాజెక్ట్ లు మినహాయించి,మిగిలిన అన్ని ప్రాజెక్ట్ ల పర్యవేక్షణను కేంద్ర విద్యుత్ అధారిటీ ఆపి వేసింది. పర్యావరణ అనుమతులు పొందాల్సిన ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రక్రియను అడవులు,పర్యావరణ మార్పు మంత్రిత్వ శాఖలు పర్యవేక్షిస్తున్నాయి. పర్యావరణ అనుమతి పొందటానికి పూర్వమే ప్రాజెక్ట్ లు స్థాపించే ప్రాంతాలకు సంబంధించిన  రాష్ట్ర ప్రభుత్వంతో విద్యుత్ కంపెనీలు విలక్షణమైన అవగాహనా పత్రాలపై సంతకాలు చేస్తున్నాయి. అదనంగా అంతర్ రాష్ట్ర ప్రసార సమాహారం లో ప్రవేశం కోరే కంపెనీలు కేంద్ర ప్రసార యుటిలిటీ తో ప్రవేశ అభ్యర్ధనలను నమోదుచేసి కుంటాయి. ఈ నేపధ్యంలో వివిధ అభివృద్ది స్థాయిలలో వున్న ప్రాజెక్ట్ ల భిన్నమైన సమాచారాలను  ఒక చోటికి చేర్చి ఒక సమష్టి దృశ్యాన్ని పొంద వీలుకలుగుతుంది.  
పర్యావరణ, అరణ్య, పర్యావరణ మార్పు మంత్రిత్వ శాఖల నుండి పరిపూర్ణమైన సమాచారాన్ని పొందటం కష్టతరమైన కర్తవ్యం.  దేశవ్యాప్త సమాచారం  యొక్క ఉపసమూదాయానికి(సబ్ సెట్ ) పరిమితం చేస్తూ కర్తవ్యాన్ని సులభతరం చేసికోవచ్చును. ఎటువంటి ఉపసముదాయాన్ని ఎంచుకోవాలో  క్రింద వివరించబడింది.  
ఒక రీజియన్ లోని ఒక రాష్ట్రం నుండి ఉత్పత్తి అయిన విద్యుత్ ను అదే రీజియన్ లోని మరొక రాష్ట్రానికి అనుమతించే విధంగా ప్రసార మౌలిక వ్యవస్థ నిర్వచింపబడి,.విద్యుత్ ఉత్పత్తి,పంపిణీల పరంగా  దక్షిణ, ఉత్తర,పశ్చిమ, తూర్పు,ఈశాన్య ప్రాంతీయాల పేర భారత దేశం  ఐదు ప్రాంతీయాలుగా(రీజియన్లు)విడగొట్టబడింది. విద్యుత్  మొత్తంగా ఉత్పత్తి అయిన ప్రాంతీయం లోనే వినియోగింప బడుతుంది  
2008నుండి 2015మద్య కాలంలో(నూతన ప్రాంతీయంలో మొట్టమొదటి విద్యుత్ కేంద్రం నిర్వహణలోనికి వచ్చే సమయానికి ) ఛత్తీస్ ఘర్,మధ్యప్రదేశ్,గుజరాత్,మహారాష్ట్ర,గోవా రాష్ట్రాలు గల పశ్చిమప్రాంతీయం  ప్రైవేట్ థర్మల్ విద్యుత్ సామర్ధ్యంలో అత్యధిక స్థాపనను సాధించింది.వీటి ద్వారా భారత దేశంలోని మొత్తం ప్రైవేట్ థర్మల్ విద్యుత్ సామర్ధ్యానికి అదనంగా 57శాతం ప్రైవేట్ థర్మల్ విద్యుత్ సామర్ధ్యం జత అయింది.
గొప్ప థర్మల్ విద్యుత్ రద్దీ
పర్యావరణ అనుమతులకు సిద్ధంగా వున్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ ల సంఖ్యను బట్టి ప్రైవేట్ థర్మల్ ప్రాజెక్ట్ లపై  పెరుగుతున్న ఆసక్తిని అంచనా వేయవచ్చును. పర్యావరణ అనుమతులకు సిద్ధం గా వున్న ప్రైవేట్ థర్మల్ కర్మాగారాలు ప్రభుత్వ భూమి,నీరు, ఇంధన సరఫరా ప్రణాళికలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ముడిపడి వున్నాయి. తప్పనిసరిగా ప్రాజెక్ట్ ప్రాంతంలో నిర్వహించాల్సిన మరియు తరచు ప్రజల వ్యతిరేకతను చవిచూసే, “‘ప్రజా విచారణను”(పబ్లిక్ ఎంక్వైరీ ) ఆ ప్రాజెక్ట్ లు పూర్తీ చేసి వుంటాయి. అందువల్ల అంతిమంగా  అత్యంత ఆసక్తిగల ప్రాజెక్ట్ లే పర్యావరణ అనుమతిని పొందివుంటాయి(కస్తూరి 2011:10)
పశ్చిమ ప్రాంతీయం లో  లో పర్యావరణ అనుమతి పొందిన ప్రైవేట్ థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ ల గూర్చి ప్రస్తావించుకోవాల్సిన రెండు అంశాలు వున్నాయి.  
ఒకటి- కేవలం సామర్ధ్య పరిమాణాన్ని యోచించటం. 79 ప్రైవేట్ థర్మల్ ప్రాజెక్ట్ లు 92 గిగా వాట్ల సమిష్టి ఉత్పత్తి సామర్ధ్యాన్ని ప్లాన్ చేశాయి. కాని ఎనిమిదవ పంచవర్ష ప్రణాళికలో(2007-12)లో ప్రైవేట్ థర్మల్ విద్యుత్ ద్వారా అదనంగా 19గిగా వాట్ల సామర్ధ్యాన్ని, ప్లానింగ్ కమిషన్ 12వ పంచవర్ష ప్రణాళికలో(201-17) ప్రభుత్వ,ప్రైవేట్ థర్మల్ విద్యుత్ ద్వారా అదనంగా 64గిగా వాట్ల విద్యుత్ ఉత్పత్తిని అంచనా వేసి, దీని ద్వారా 9శాతం స్థూల దేశీయోత్పత్తిని సాధించగలమని భావించాయి.(ప్లానింగ్ కమిషన్ 2012:1.4.1). వీటిలో అనేక  ప్రతిపాదనలు సఫలంగావని ప్రభుత్వానికి ముందే తెలుసుననిపిస్తుంది. .
రెండవది-2006నుండి 2010 మధ్యకాలంలో గుట్టలు గుట్టలుగా పెరిగిన ప్రతిపాదనలు. ప్రాజెక్ట్ లలో తీవ్రంగా పెరిగిన ఆసక్తి కీలక దశకు చేరి,2011తర్వాత  అక్కడనుండి నెమ్మదిగా నీరిగారిపోవటం మొదలైంది . 2011నుండి పశ్చిమ ప్రాంతీయం లో ప్రైవేట్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పట్ల నూతన ఆసక్తి ఎక్కడా కానరాలేదు(అక్కడక్కడ ఒకటి,రెండు వున్నా,వాటికి ఇంతవరకు పర్యావరణ అనుమతి లేదు).గతంలో గుట్టలు గుట్టలుగా పెరిగిన ప్రాజెక్ట్ లు ఎదుర్కొన్న వ్యతిరేక పరిణామాలను తర్వాత చర్చించుదాం. థర్మల్ విద్యుత్ పట్ల తగ్గుతున్న ఆసక్తికి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంబంధించిన ఆర్ధిక అంశాలలో ఈ కాలంలో వస్తున్న తీవ్ర మార్పులతో సంబంధం వున్నది.
బహిరంగ మార్కెట్ లో విద్యుత్ ను అమ్ముకోవటానికి అనుమతి ఇవ్వడంతో, స్వంత వినియోగ విద్యుత్ ఉత్పత్తిదారులు విద్యుత్ దొరకని కాలంలో మంచి లాభాలు పొందగలిగారు. స్వంత వినియోగ విద్యుత్ ఉత్పత్తిదారుడైన జిందాల్ స్టీల్ అండ్ పవర్ కంపెనీ 2007లో థర్మల్ కర్మాగారాన్ని  ఏర్పాటుచేసి,  దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు లేకుండానే పూర్తి వర్తక విద్యుత్ సరఫరా దారుగా 2007నుండి 2010 వరకు బంపర్ లాభాలను ఆర్జించింది.(జోషీ 2009).  వర్తక ఉత్పత్తిదారులు ప్రత్యేకించి జిందాల్ కంపెనీ విజయం, థర్మల్ విద్యుత్ రంగంలోకి చాలా మంది ఔత్సాహికుల్ని విశేషంగా ఆకర్షించింది.
2010నుండి పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. బొగ్గు ఉత్పత్తి స్తంభించటం తో 2011నుండి ప్రభుత్వం దీర్ఘకాలిక బొగ్గు ఒప్పందాలను ఇవ్వటం ఆపివేసింది. 2010లో అంతర్జాతీయ బొగ్గు ధరలు పెరిగి,2011నాటికి  భారీ స్థాయికి చేరటంతో, బొగ్గును దిగుమతి చేసికోవటం లాభదాయకమైన అంశంగా కానరాలేదు. 2010నాటికి వర్తక విద్యుత్ ధరలు  తీవ్రంగా తగ్గిపోయి,2010 రెండవ అర్ధబాగానికి రేట్లు సగానికి సగం పడిపోయాయి. ఆ తర్వాత  కాలంలో పశ్చిమ ప్రాంతీయం లో విద్యుత్ రేట్లు తక్కువలోనే కొనసాగాయి. దక్షిణ ప్రాంతీయం తప్పించి, ఇతర ప్రాంతీయాలలో సైతం విద్యుత్ రేట్లు పడిపోవటం జరిగింది.
ఈ రకమైన మారిన పరిస్థితులలో చాలా థర్మల్ ప్రాజెక్ట్ లు ఆపి వేయబడ్డాయి. కొన్ని వదిలి వేయబడ్డాయి.
ఆపివేయబడ్డ,వదలివేయబడ్డ ప్రాజెక్ట్ లు
పశ్చిమప్రాంతీయం లోని ఛత్తీస్ ఘర్ నూతన విధాన యుగం యొక్క ఆగడాలను అధ్యయనం చేయటానికి ఒక ఉదాహరణ గా వుంది. ఆ రాష్ట్రం వర్ధమాన విద్యుత్ హబ్ గా, థర్మల్ విద్యుత్ లో 61 అవగాహనా పత్రాలు సంతకం చేసి, దేశంలోని ఇతర ప్రాంతాలకు  విద్యుత్ ఎగుమతిదారుని గా తనంతట తానే ప్రచారం చేసికుంది.
ప్రతిపాదిత ప్రాజెక్ట్ లలో 2/3వంతుగా వున్న40 ప్రాజెక్ట్ లకు పర్యావరణ అనుమతులకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్ట్ లన్నీ అనేక సంవత్సరాల క్రింద ప్రకటించబడినా, వాటి అభివృద్ది లో పురోగమనం లేకపోవటానికి,ఇంతకు ముందు చెప్పుకున్నట్లు థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలోని మారిన ఆర్ధిక అంశాలే ప్రధాన కారణం గా వుంది. పర్యావరణ అనుమతికి వచ్చిన 21 ప్రాజెక్ట్ లలో, 10 ప్రాజెక్ట్ లలో అత్యధిక భాగం పాక్షిక సామర్ధ్యంతో  ఉత్పత్తి లో వున్నాయి. కొద్ది ప్రాజెక్ట్ లు మాత్రం తీవ్రమైన జాప్యంతో నిర్మాణం లో వున్నాయి. కొద్ది ఇతర ప్రాజెక్ట్ లు అన్ని రకాలుగా ఆగిపోయినట్లున్నాయి. ఛత్తీస్ ఘర్ లో ప్రతిపాదించిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ లలో కేవలం నాలుగవ వంతు ప్రాజెక్ట్ లే ఉత్పత్తి లోకి  రాగలుగుతాయి.
పోటీ తత్వాన్ని ప్రతిపాదించే వారికి కొన్ని ప్రాజెక్ట్ ల వైఫల్యం పొందటం పెద్ద సమస్య  కాక పోవచ్చును. విఫలమైన ప్రాజెక్ట్ లు పెట్టుబడిదారులకే  కాకుండా,అంతకు మించి ఆ ప్రాజెక్ట్ లు స్థాపించిన వ్యవసాయ భూములసాగుదార్లకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి.  పర్యావరణ అనుమతుల దగ్గర ఆగిపోయిన అన్ని ప్రాజెక్ట్ లకు అవసరమైన భూమినంత స్వాధీనం చేయటం జరిగింది. ప్రతి వెయ్యి మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్ట్ కు 700నుండి 900 ఎకరాల భూమి అవసరమౌతుంది. పర్యావరణ అనుమతులు పొందని కనీసం 17 ప్రతిపాదిత ప్రాజెక్ట్ లకు పాక్షికంగానో లేదా పూర్తిగానో  భూమి సమీకరింప బడింది. పర్యావరణ అనుమతులు పొందేందుకై  బొగ్గు లింకేజి మంజూరు చేయటం ద్వారా తొలి రోజుల్లో  భూ సమీకరణను ప్రభుత్వమే స్వయంగా ప్రోత్సహించింది(కస్తూరి2011:11)
అసమతుల్యాన్ని తీవ్ర తరంచేస్తూ
సరళీకరణ విధాన యుగంలో విస్తరించిన ప్రైవేట్ థర్మల్ విద్యుత్ కర్మాగారాలు, స్థాపక ఉత్పత్తి సామర్ధ్యానికి మరియు విద్యుత్ అవసరాలకు మధ్య వుండే అసమతుల్యాన్ని తీవ్రతరం చేశాయి. పశ్చిమ ప్రాంతీయం  సాపేక్షంగా మిగులు సామర్ధ్యం కలిగి వుండగా, ఉత్తర, దక్షిణ ప్రాంతీయాలు  సామర్ధ్య లోటు తో ఉన్నాయి.. దేశవ్యాప్త ఉత్పత్తి సామర్ధ్యం లోని సగం వృద్ది ప్రైవేట్ థర్మల్ కర్మాగారాల  ద్వారా వుండగా,అందులోనూ 64శాతం వృద్ది పశ్చిమ ప్రాంతీయం లో వుండటం మూలకంగా,ఈ ప్రాంతీయం సాపేక్షంగా మితిమీరిన విద్యుత్ లావాదేవీలలో వుంది.
తగినంత అంతర్ ప్రాంతీయాల  ప్రసార సామర్ధ్యం( ట్రాన్స్ మిషన్ కెపాసిటీ) కలిగివుంటే, కొన్ని ప్రాంతీయాలలో  వుండే సామర్ధ్య మిగులు, మరి కొన్నిప్రాంతీయాల లోని సామర్ధ్య లోటు పెద్ద సమస్యలుగా ముందుకు రావు. 2010నుండి  పశ్చిమ ప్రాంతీయం నుండి దక్షిణ ప్రాంతీయం కు విద్యుత్ ఎగుమతి మార్కెట్ మొదలైంది. సాపేక్షంగా పశ్చిమ ప్రాంతీయం లోని విధ్యుత్ మిగులు, దక్షిణ ప్రాంతీయంలోని విద్యుత్ లోటుల లోని తేడా భారత విద్యుత్ ఎక్స్చేంజి (ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజి)దగ్గర విభిన్న ధరల రూపంలో నమోదు అయింది. పశ్చిమ ప్రాంతీయం దక్షిణ ప్రాంతీయం ఎక్స్చేంజి లు అంతర్ ప్రాంతీయాల  ప్రసార సమస్యల్ని వ్యక్తం చేశాయి.
నామమాత్ర  ప్రసార సామర్ధ్యాల పరిమితితో, 2010నుండి 2013 వరకు పశ్చిమ ప్రాంతీయం  నుండి దక్షిణ ప్రాంతీయం కు వాస్తవ దిగుమతులు పరిమితంగా  పెరిగాయి. సాంకేతిక కారణాల రీత్యా కొంత మోతాదు విద్యుత్ పక్కన పెట్టాల్సి ఉన్నందున, నామమాత్ర ప్రసార సామర్ధ్యాన్ని ఆచరణలో వినియోగించుకోలేక పోయారు.
మహారాష్ట్ర నందలి సోలాపూర్,కర్నాటక నందలి రాయచూర్ మధ్య మొదటి రెండు 2100మెగా వాట్ల లింకులు ప్రారంభ మైనందున 2014లో సామర్ధ్యాలలో పెంపుదల జరిగింది.అధికమైన నామమాత్ర ప్రసార సామర్ధ్యాలు లభ్యమైనప్పటికి, పశ్చిమం నుండి దక్షిణ ప్రాంతీయంకు బదిలీ అయిన సగటు విద్యుత్ చిన్న పరిమాణం లోనే పెరిగింది.
ఉత్పత్తి కేంద్రాలు,లోడ్ కేంద్రాల మధ్య అంచు నుండి అంచు వరకు వరకు ప్రసార సామర్ధ్యం కలిగి వుంటేనే విద్యుత్ బదిలీ సుసాధ్యం కావటం ఇందుకు కారణం. అంతర్ ప్రాంతీయాల  ప్రసార సామర్ధ్యం(ప్రాంతీయాల సరిహద్దుల మధ్య వుండే లింకుల  సామర్ధ్యం) తగినంత ఉన్నప్పటికీ, కారిడార్ లోని అంచు నుండి అంచు వరకు ఇతరత్రా అవరోధాలు వుండ వచ్చును. ప్రస్తుత అంశంలో, పశ్చిమ ప్రాంతీయం  ఉత్పత్తి క్లస్టర్లు ( ఛత్తీస్ ఘర్ లో వలే)నుండి సోలాపూర్ వరకు, రాయచూర్ నుండి దక్షిణ ప్రాంతీయం  లోడ్ కేంద్రాల వరకు ప్రసార సామర్ధ్యం లోపించింది. 2014-15లలో కేవలం 1500మెగావాట్ల సామర్ధ్య బదిలీకి సమానమైన 1172 మెగా వాట్ల విద్యుత్ ( సంవత్సరానికి దేశ వ్యాప్త ఉత్పత్తి సామర్ధ్యంలో దాదాపు 0.6 శాతం) మాత్రమె  పశ్చిమ ప్రాంతీయం నుండి దక్షిణ ప్రాంతీయం కు బదీలీ కాబడుతుంది. దక్షిణ ప్రాంతీయం అవసరాలకంటే, పశ్చిమ  ప్రాంతీయం లో లభ్య మౌతున్న మిగులు కంటే ఇది చాలా  తక్కువగా వున్నది.
ఖాళీగా వున్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు
నూతన విధాన కాలంలో స్వల్పంగా చేరుతున్న ప్రాంతీయం ఉత్పత్తి సామర్ధ్యానికి, దాని వంతు పర్యవసానా లున్నాయి. గుజరాత్ లో తప్ప మిగిలిన పశ్చిమ ప్రాంతీయం లో ప్లాంటు లోడ్ ఫ్యాక్టర్ వరుసుగా తగ్గుతున్నది. అది ప్రస్తుతం 43శాతంగా వుంది.
కొన్ని సంవత్సారాల క్రితం బొగ్గు లభ్యత కష్టంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితి అలా లేదు. గత నాలుగేళ్ల కంటే 2014-15లో బొగ్గు ఉత్పత్తి 32మిలియన్ టన్నులు పెరిగింది. రాష్ట్ర కర్మాగారాలలో బొగ్గుల నిల్వలు బాగా పెరిగాయి. అంతర్జాతీయ బొగ్గు ధరలు తగ్గాయి. ఈ విద్యుత్ ఉత్పాదకులు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ కు ఖాతాదార్లు లేకపోవటమే సమస్యగా కనిపిస్తుంది.  
పశ్చిమప్రాంతీయం లోని విద్యుత్ పంపిణీ కంపెనీలు ప్రస్తుత పరిస్థితి లో ఎక్కువ విద్యుత్ ను తీసికోకలిగేటట్లులేవు . దీనర్ధం ఈ ప్రాంతీయం లో ప్రతి ఇంటికి ఇప్పటికే విద్యుత్ ఇవ్వబడి,24గంటలు విద్యుత్ సరఫరా అవుతుందని కాదు. వారి పరిమితమైన ప్రసార సమాహారం, పంపిణీ చేయకలిగే సమర్ధత,విద్యుత్ ను కొనగలిగే ఆర్ధిక స్థితికి లోబడి  ఇంతకు ముందే పేర్కొన్న లక్ష్యాలకు  వాళ్ళు చేరారు. వర్షాలు కరువై జల విద్యుత్ కష్టాల్లో పడటం వల్ల, దక్షిణ ప్రాంతీయం  లోని కర్నాటక తీవ్రమైన విద్యుత్ కష్టాల్లో ఉన్నప్పటికీ, ప్రసార సామర్ధ్యం లేని కారణంగా విద్యుత్ ఎగుమతి సాధ్యం కావటం లేదు. ఈ విద్యుత్ ఉత్పత్తి దారులు నిస్సహాయ స్థితిలో మిగిలున్నారు.
ప్రసార వ్యవస్థ ప్రణాళిక
ఈ నూతన యుగం  ప్రారంభానికి పూర్వం, భారత దేశంలోని ప్రతి ప్రాంతీయం విద్యుత్ ఉత్పాదనలో స్వయం సమృద్ధిని సాధించటానికి ప్రణాళిక రచన చేయబడింది. దానికి లోబడే రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తికి,ప్రసారానికి అవసరమైన మౌలిక వ్యవస్థను అభివృద్ది చేసికున్నాయి.ఒక రాష్ట్రంలో నూతన ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేస్తూనే, రాష్ట్రాలకు విద్యుత్ సరఫరాను అందించేందుకు అవసరమైన అంతర్ రాష్ట్ర,అంతర్ ప్రాంతీయాల  ప్రసార వ్యవస్థను అభివృద్ది చేస్తూ, ఆ కర్మాగారాల  నుండి విద్యుత్ ను కూడా కేటాయించింది. దీనితో పాటు ప్రాంతీయాల సరిహద్దులలో నిర్దిష్టంగా విద్యుత్ ను ఇచ్చిపుచ్చు కోటానికి కొన్నిప్రసార లింకులను కూడా నిర్మించింది.
జాతీయ విద్యుత్ విధానం2005,  ప్రసార సమాహర ప్రణాళిక, అమలు వినియోగదారులతో ముందుగానే చేసికునే ఒప్పందాల ప్రాతిపదికన కాకుండా బహిరంగ మార్కెట్ అవసరాల ప్రాతిపదికన వుండాలని చెప్పుతుంది(విద్యుత్ మంత్రిత్వ శాఖ 2005:5.3. 2). విద్యుత్ ఉత్పత్తి సంస్థలు దేశంలో ఎక్కడైనా తమ ఖాతాదారులను ఎన్నుకోవచ్చుననే  భావన ఒక ప్రక్క, ప్రసార వ్యవస్థలు వ్యయ పూరితం కావటంవల్ల,వాటిని దీర్ఘకాలిక అవసరాల ప్రాతిపదికన నిర్మించాలనే భావన మరో ప్రక్క కలగాపులగంగా వుంటే, ,ప్రస్తుత పరిస్థితులలో ప్రసార వ్యవస్థను నిర్మించుకోవటం ఉహాజనిత ఆలోచనగానే వున్నది.  
ప్రసార వ్యవస్థల ప్రామాణిక పధక రచనకు ప్రతి ఉత్పత్తి సంస్థ యొక్క స్థానం,సామర్ధ్యం, అది పూర్తి చేయకలిగే సమయం, దాని ప్రతిపాదిత ఖాతాదార్ల గూర్చిన పరిజ్ఞానం పట్ల  అవగాహన కావాలి. అంతర్ రాష్ట్ర ,అంతర్ ప్రాంతీయాల సమాహారాల( అంచు నుండి అంచు వరకు అవసరమైన) ప్రసార సామర్ధ్యాలను  పెంచటానికి,బహుళ సంస్థలు సమన్వయంతో కలసి పని చేయాల్సి వుంటుంది(కేంద్ర విద్యుత్ అధారిటి 2012:7.4. 2).
విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు పంపిణీ సంస్థలతో దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసికోవాల్సిన అవసరం లేదు కాబట్టి నూతన విధానం లో ప్రసార ప్రణాళిక రచన చాలా క్లిష్టంగా మారింది. చాలా ప్రైవేట్ ఉత్పత్తి సంస్థలు ప్రసార సమాహారానికి దీర్ఘకాలిక ప్రవేశం కావాలని కోరుతున్నప్పటికీ, పంపిణీ సంస్థలతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసికోలేని కారణంగా వారి అంతిమ వినియోగదారు లెవ్వరో నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు. అందువల్ల వాళ్ళు,  వాళ్ళ కర్మాగార  స్థాపన ప్రణాళికకు జవాబుదారులు కాలేకపోతున్నారు.
ప్రస్తుతానికి వున్న ప్రసార సమాహారాలన్నీ కేంద్రానికి లేదా రాష్ట్రాలకు స్వంతం  అయివున్నాయి. పైన  పేర్కొన్న అనిశ్చితుల కారణంగా ప్రసార మౌలిక రంగంలో నూతన పెట్టుబడులు రావటం కష్టతరంగా వుంది. ఈ పరిస్థితులు  ప్రస్తుత సమాహారాల పాక్షిక వినియోగానికి  దారితీసే ప్రమాదం వుంది. మరో ప్రక్క, వర్తమానంలో  జరుగుతున్నట్లు రద్దీ కారణంగా ఉత్పత్తి సంస్థలకు ప్రసార వ్యవస్థలో ప్రవేశం తిరస్కరింప బడవచ్చును.(ప్లానింగ్ కమిషన్2012:2. 2)
ముగింపు
విద్యుత్తు చట్టం 2003 వీలు కల్పించిన  సరళీకరణ విధాన యుగం,  కొన్ని  స్వంత వినియోగ (కాప్టివ్ )థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ,ఆకర్షణీ యమైన లాభాలు పొందే అవకాశాన్ని కల్పించింది. దీనివల్ల ప్రత్యేకంగా  బొగ్గు నీరు లభ్యత కలిగిన కొన్ని ప్రాంతాలలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక ప్రైవేట్ కంపెనీలు ఆకర్షించ బడ్డాయి. థర్మల్ విద్యుత్ ఉత్పాదనలో మారుతున్న ఆర్దికాంశాలు త్వరితంగా ఆ ఉత్సాహాన్ని నీరుకార్చాయి .

చాలా  ప్రతిపాదిత ప్రాజెక్ట్ లు వాటిని స్థాపించ వలసిన ప్రాంతాలలోని ప్రజానీకం ఇబ్బందులతో నిమిత్తం లేకుండా  అర్ధాంతరంగా వదలివేయబడ్డాయి . మిగిలిన వాటిలో కొన్ని పాక్షిక సామర్ధ్యంతో పనిచేస్తుంటే,  ఇతర ప్రాజెక్టులు  నిర్మాణ జాప్యాలతో  కొట్టుమిట్టాడుతూ,అజ్ఞాతంలోకి కనుమరుగవుతున్నాయి.

పనిచేస్తున్న కర్మాగారాల  స్థాపన ప్రదేశం, గిరాకికి, ఉత్పత్తి సామర్ధ్యానికి మధ్య వుండే ప్రాంతీయ అసమతుల్యాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నది. దేశం లోవివిధ ప్రాంతాలలో విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్నప్పటికీ, స్థానికంగా సత్వర గిరాకి లేకపోవటం వల్ల లేదా విధ్యుత్ కొరత ప్రాంతాలలో తగిన ప్రసార సామర్ధ్యం లేకపోవటంవల్ల, విద్యుత్ అమ్ముకోలేక ప్రైవేట్ విద్యుత్ కంపెనీలు ఖాళీగా వుండటమో లేదా తక్కువ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ తో పనిచేయటమో జరుగుతున్నది. ప్రైవేట్ థర్మల్ విద్యుత్ రంగం అభివృద్ది మొత్తంగా చూస్తే, జాతీయ వనరుల అభిలషణీయమైన వినియోగానికి చాలా దూరంగా వుంది.  

ఈ వ్యాసం లో వివరించని విద్యుత్ రంగానికి సంబంధించిన ఇతర ప్రతికూల పర్యవసానాలు చాలా వున్నాయి. థర్మల్ కర్మాగారాల్ని నిర్మించాలనే తహతహ  యంత్ర సామాగ్రి గిరాకీని హటాత్తుగా పెంచిది. ఈ పరిస్థితిని  విదేశీ తయారీ సంస్థలు ఉపయోగించుకొని, దేశీయ తయారీ సంస్థలను నష్టపరిచాయి. కేంద్ర విద్యుత్ ఆధారిటీ సేకరించిన సమాచారం లో(సి ఇ ఎ 2015) ఈ అంశం స్పష్టంగా వుంది. విద్యుత్ ప్రాజెక్ట్ లు . ఖాయిలపడటంతో, వాటికి ఆర్ధిక సహాయం చేసిన ప్రధాన ఋణదాతలైన ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్ధక ఆస్తుల శాతం భారీగా పెరిగింది(ఆచార్య 2912). దీనితో విద్యుత్ రంగంలో నూతనంగా ప్రవేశించే ప్రాజెక్ట్ లకు బ్యాంకుల ఋణ సహాయం క్లిష్ట మైంది.

వీటిలో ప్రతి సమస్యకు సమన్వయలోపం,తగినంత జాగురతగా వుండక పోవటం లాంటి అంశాలు కారణాలుగా వున్నాయి. అన్నీ కలిపి చూస్తే, చట్టపరమైన, విధాన పరమైన చట్రం లోని బలహీనతలు కనిపిస్తున్నాయి.  ఈ చట్రం పరిశ్రమ యొక్క భారీ పెట్టుబడుల ఆవశ్యకతను, ఆర్ధిక వ్యవస్థ ను నిలబెట్టటం కోసం జాతీయ వనరుల విశిష్ట వినియోగం కోసం విద్యుత్ రంగంలో ప్రణాళికబద్ధ కృషి ఆవశ్యకతను గుర్తించింది. అయినప్పటికీ పోటీ ద్వారా సమర్ధతను సాధించాలనే సాకుతో  ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు కర్మాగారాల స్థాపనలో సమయం, స్థలం. పరిమాణాలతో నిమిత్తం లేకుండా ఆంక్షలు లేని స్వేచ్చను  అందించింది.

ప్రస్తుత ప్రభుత్వం తన కేంద్రీకరణ ను సౌర విద్యుత్ కు మార్చుకుంది. గత ప్రభుత్వం థర్మల్ విద్యుత్ కు ఇచ్చిన ప్రోత్సాహం తెలిసి కూడా,థర్మల్ విద్యుత్ అభివృద్దికి తీవ్రంగా అంతరాయం కలిగిస్తున్న సమస్యలను పరిష్కరించ కుండా,ప్రస్తుత ప్రభుత్వం సౌర విద్యుత్ సామర్ధ్యాన్ని పెంచటం కోసం మున్నెన్నడు ఎరుగని లక్ష్యాలను నిర్దేశిస్తున్నది.

స్వేచ్చానువాదం :కొండముది లక్ష్మీ ప్రసాద్




Thursday, March 3, 2016

యెమెన్ విషాదం సామ్రాజ్య వాదుల పాపం


విజయ్ ప్రసాద్


నెల రోజులు గడిస్తే, సౌదీ నాయకత్వంలో యెమెన్ పై బాంబుల దాడి జరిగి సంవత్సరమౌతుంది. దీని ద్వారా వ్యూహాత్మకంగా సాధించింది ఏమీ లేదు. 26మార్చి2015న సౌదీ బాంబుదాడి మొదలు పెట్టినప్పుడు వెన్ను విరిగిన యెమెన్ రాజకీయ చదరంగం ఎంతటి సంక్లిష్టతను ఎదుర్కోందో,ఇప్పుడూ అదే సంక్లిష్టతలో కొట్టు మిట్టాడుతున్నది.


సౌదీ దాని మిత్ర పక్షాలు యెమెన్ పై ఎందుకు బాంబుదాడి చేయాల్సి వచ్చింది? ఇంతటి తీవ్ర స్థితికి పురిగొల్పిన పరిస్థితులు ఏమిటి ? ఇంతవరకు తెలియరా లేదు. 2011లోని సంధికాలపు  ఒప్పందం జగడానికి దారితీసింది. అధ్యక్షుడైన మంసౌర్ హదీ తాను 2015లో రాజీనామా చేసిన సంవత్సరం ముందు నుండే  అతని మాట సాగడం లేదు. అనేక బృందాలు  నూతన ఒప్పందం ద్వారా అధికారం  కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సానా(యెమెన్ రాజధాని) ముట్టడి అనివార్యం కాలేదు. ఇలా జరగటం ఎవర్నీ ఆశ్చర్య పరచలేదు. సౌదీ బాంబుల దాడి కొనసాగుతూనే వుంది.  


సానాను ఎవరు స్వాధీనం చేసికొన్నారు? రెండు వైరి రాజకీయ పక్షాలు గా వున్న  హౌతీలు మరియు అలీ అబ్దుల్లా సాలెహ్ నాయకత్వంలోని జనరల్ పీపుల్స్ కాంగ్రెస్ కలిసి హదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యెమెన్ రాజధాని అయిన సానా ను స్వాధీనం చేసికున్నాయి. 2004నుండి 2010వరకు అలీ అబ్దుల్లా సాలెహ్, హౌతీలకు వ్యతిరేకంగా యుద్ధం చేశాడు.  అయిన్నప్పటికి వాళ్లిద్దరు ఈ అంశంలో ఒకటైయ్యారు.


రాజధాని సానాను స్వాధీనం చేసికున్నప్పటికీ, సానా ఉత్తర భాగంలోని రేమట్ అల్ హుమయ్ద్ లో  ఈ రెండు పక్షాల మధ్య ఘర్షణలు జరిగి, వారి మధ్య  విభేదాలు బట్ట బయలైనాయి, వాళ్ళ అంతర్గత బలహీనత బయట పడింది. కొంత కాలం గడిస్తే,  వాళ్ళమధ్య శత్రుత్వం మరింతగా  తీవ్రమయ్యేటట్లుంది.


కాని ఈ పరిస్థితిని చేరకముందే సౌదీ దాని మిత్ర పక్షాలు జరిపిన బాంబు దాడుల ఫలితంగా  వైరి పక్షాలుగా వున్నహౌతీలు,సాలెహ్ల ల మధ్య మైత్రి పటిష్టపడి, సౌదీ అరేబియా పై స్కడ్ క్షిపణులను ప్రయోగించే,అత్యంత నైపుణ్యంగల మిలిటరీ సిబ్బందిని వినియోగించుకోకలిగాయి. యెమెన్ విధ్వంస మైనప్పటికి,వాళిద్దరి మధ్య మైత్రి సౌదీ,దాని మిత్ర పక్షాల దాడిని నివారించగలిగాయి.


యెమెన్ యొక్క ఘోరమైన యుద్ధ విషాదాలలో దాని సంక్లిష్టమైన  దేశీయ రాజకీయాలు ఒకటి. ఈ రాజకీయాలు  ఇరాన్,సౌదీ అరేబియా ల మధ్య నెలకొన్న  ప్రాంతీయ భౌగోళిక రాజకీయ స్పర్ధల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఇరాన్  సాలెహ్ హౌతీలతో  అంటీ అంటని సంబంధాలనే  నిర్వహిస్తున్నది.  ఉమ్మడి షియా సంబంధాలుగా పిలువబడే వారి మధ్య సంబంధాలు  బలహీనంగా వున్నాయి. యెమెన్ కి చెందిన జైదీ షియా  ఇరాన్ యొక్క 12 షియా ఇమాముల  వారసత్వాన్ని,సిద్దాంతాన్ని అంగీకరించే వాడు కాదు.


ఇరాన్ పలుకుబడి పై సౌదీ అరేబియాకు వుండే  అనుమానాస్పద ధోరణి ఇక్కడ ప్రధాన పాత్ర వహిస్తుంది సంయుక్త రాజ్యమా లేదా వేర్పాటువాదమా,ఉత్తరం/దక్షిణం,రిపబ్లికన్ లౌకిక వాదమా లేదా ముస్లిం రాజ్యమా లాంటి యెమెన్ ఇతర సమస్యలు మరుగున పడ్డాయి. కొనసాగుతున్న ఘర్షణలో సౌదీ అరేబియా జోక్యం పరిస్థితుల్ని సంక్లిష్టపరిచి, శాంతి సామరస్య భావనను దాదాపు అసాధ్యం చేసింది.


సౌదీయులు  సాలెహ్,హైతీయుల్ని బలహీన పరచాలనుకుంటే తమవేగుల  విభాగం ద్వారా ఆ రెండు పక్షాల మధ్యనున్న అంతరంగిక విభేదాల గుట్టును చేజిక్కించుకోవాల్సి వుండేది. వాళ్ళను వేరుచేసి విడదీయటమే సౌదీయుల ముందున్న చక్కటి  సున్నితమైన మార్గం. కాని మార్చి 26 నుండి మొదలైన  బాంబుల వర్షం సాలెహ్,హైతీయుల్ని ఏకం చేసింది. సౌదీయులు ఎందుకు ఇలా చేస్తున్నారు ? వాళ్ళు  వ్యూహాత్మకంగా ఆలోచించటం లేదా?? పోనీ  ఇరాన్ మీద వాళ్ళకుండే ద్వేషంతో ఇలా చేస్తున్నారా?? సౌదీ అరేబియాలోని స్థానిక సమస్యలు వాళ్ళను యుద్ధం వైపు మళ్ళిస్తున్నాయా ?? వాళ్ళ అంతరంగం అంతు చిక్కటం లేదు.
యుద్ధానికి ముందే సల్మాన్ రాజు సింహాసనాన్ని అధిరోహించి,తన కొడుకైన మొహమ్మద్ బిన్ సల్మాన్ ను రక్షణ మంత్రిగా నియమించాడు. మొహమ్మద్ బిన్ సల్మాన్ ను స్థానికంగా ఎం బి ఎస్ గా పిలుస్తారు. బాంబింగ్ మొదలైన తర్వాత రోజున ఎం బి ఎస్ మిలిటరీ నిర్వహణ కార్యాలయంలో మ్యాపులను పరిశీలిస్తూ, పైలట్లతో ఫోనులో మాట్లాడుడతూ టెలివిజన్ లో కనిపించారు. ఆయన రక్షణ మంత్రిత్వశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు వాస్తవంగా కనపడటానికికే    యెమెన్ యుద్ధం ఒక అవకాశంగా వచ్చినట్లుంది. కాని అది ఇప్పుడు అతని మెడకు  ఉచ్చులా తయారైంది. యుద్ధాన్ని గెలవకుండా సౌదీ అరేబియా యుద్ధాన్ని విరమించలేదు. దాని రాచరికపు చట్టబద్ధత  యుద్ధంలో ఫలితం పై ఆధారపడి ఉంది. . దాని  ప్రేరేపణలకు యెమెన్ బలి అయింది.
యెమెన్ అంతర్జాతీయ క్రైసిస్ గ్రూప్  తన నూతన నివేదికలో, “శాంతి సాధ్యమా” అని శాంతి పై ఒక సముచితమైన ప్రశ్న వేస్తూనే, లోతైన అననుకూల అంచనాన్ని అందిస్తున్నది. స్థానిక,ప్రాంతీయ పరిణామాలు శాంతి  కి అనుకూలంగా లేవని ఆ బృంద రచన కర్తలు వ్రాస్తున్నారు. రియాద్,తెహ్రాన్ల మధ్య సంబంధాలు సన్నగిల్లు తున్న కొద్దీ, ప్రాంతీయ సమస్యలకు  పరిష్కారాలు మృగ్య మౌతున్నాయి. దేశంలో కూడా వివిధ పార్టీల మధ్య విశ్వాసం దెబ్బతింది. విచ్చిన్నవాద ధోరణి ఇప్పుడు ప్రబలంగా ఉంది.


1990లోని యెమెన్ ఐక్యత ముక్కలయ్యేటంతగా  ప్రమాదంలో పడింది. టైజ్ నగరం ఇద్దరి స్వాధీనంలో వుండి,రెండు శక్తులూ పాతసరిహద్దు దగ్గర కూర్చోటానికే పరిమిత మయ్యాయి. దక్షిణ ప్రతిఘటన, హౌతీల సాయుధ బలగాలు ముక్కలుగావున్న  యెమెన్ రక్షణదళమంత ప్రాధాన్యతను పొందాయి “ చారిత్రకంగా హింసకు విచ్చినవాదం చోదక శక్తి కాకపోయినప్పటికి  బహుళ ప్రచారంలో వుంద”ని కాన్ ఫ్లిక్ట్ గ్రూప్  వ్రాస్తున్నది. గతం నుండి కొనసాగుతున్న పగసాధింపు సమస్యలు విపరీతంగా పెరిగాయి. తెగల ప్రాతిపదికన పేట్రేగుతున్న కక్షలు ఘర్షణలను సజీవంగా నిలబెట్టుతున్నాయి.


ఐక్యరాజ్య సమితి ప్రక్కకు నెట్టి వేయబడింది. దానికి  ఇక్కడి సమస్యలు సిరియా సమస్యలతో సమానంగా వున్నాయి. భౌగోళిక రాజకీయ ఘర్షణలు, తుపాకి ఆధిపత్యం కారణంగా   క్షేత్రస్థాయిలో ఐక్య రాజ్య సమితి ఆద్వర్యంలో చర్చలతో సమస్యను పరిష్కరించుకునే వాతావరణం కానరావడం లేదు.క్రైసిస్ గ్రూప్ తన నివేదికలో గణనీయంగా వుండే పశ్చిమ దేశాల పాత్రనుఈ వ్యవహారాల్లో తక్కువగా చూపింది. ఘర్షణలో తటస్థ పరిశీలకుల పాత్రను నిర్వహించకుండా పశ్చిమ దేశాలు సౌదీలకు ఆయుధాలను అందిస్తూ వారిపక్షాన చేరాయి. షీలా కార్పికో సంపాదకీయంలో రాబోతున్న పుస్తకంలో యెమెన్ వ్యవహారంలో పశ్చిమ దేశాల పాత్రను వివరించటం జరిగింది. యుద్ధానికి పశ్చిమ దేశాల మద్దతు  సౌదీల అత్యాశను పెంచుతూ, అమెరికా ఆకాంక్షలను బలహీనపరుస్తుంది.


దైవ ప్రచారకుని రధం యెమెన్ చేరింది. దాని రెండు అశ్వాలలో ఒకటి యెమెన్ ను గడగడలాడిస్తున్న  కటిక  క్షామం. యెమెన్  లో క్షీణిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలతో ఐక్య రాజ్య సమితి ఏజెన్సీలు తీవ్రంగా ఆందోళన పడుతున్నాయి. ఆ దేశంలో లో సగభాగం క్షామం తో తల్లడిల్లుతుందని ప్రపంచ ఆహార కార్యక్రమం నెల రోజుల క్రితం ప్రకటించింది.  2కోట్ల 30లక్షల యెమెన్ దేశీయులలో కోటీ 40లక్షల మంది ఆహార రక్షణ కోల్పోయారని యెమెన్ లోని యూనిసెఫ్ ప్రతినిది జులిఎన్ హార్నీస్ వెల్లడించారు. దాదాపు 10లక్షలమంది  పిల్లలు నిర్వాసితులయ్యారు. 5సంవత్సరాల లోపువున్న 10లక్షల మంది పిల్లలు తీవ్రమైన పోషకాహారలేమిని అనుభవిస్తూ,శ్వాసకోస సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. 20లక్షల పిల్లలు స్కూళ్ళకు వెళ్ళ లేకున్నారు. ఈ ఘర్షణలకు పూర్వమే మధ్య ప్రాచ్యంలో కడు పేద దేశంగా వున్న యెమెన్ పై ఈ యుద్ధం యొక్క దీర్ఘకాలిక పర్యవసానాలు ఎంత తీవ్రంగా వుంటాయో ఎవరైనా వూహించ వచ్చునని హార్నీస్ అంటున్నారు.
దైవ ప్రచారకుని రెండవ అశ్వం అతివాదం.క్రైసిస్ గ్రూప్  అభిప్రాయం ప్రకారం యుద్ధం వల్ల అరేబియా ద్వీపకల్పపు  ఆల్ ఖైదా, ఇస్లామిక్ రాజ్య బృందం ప్రముఖంగా ప్రయోజనం పొందాయి. అరేబియా ద్వీపకల్పపు అల్ ఖైదా హద్రమౌంట్ ప్రాంతంలోని ముకల్లా లాంటి నగరాలపై పూర్తీ పట్టుకలిగి , ఈ యుద్ధంలో టైజ్ నగరంలోని దక్షిణ ప్రతిఘటన తదితర ప్రాంతాలలో చాలా చురుకుగా వుంది. అది సౌదీ విమాన స్థావరాల్ని గుర్తించి,దాని మూలంగా అనేక ప్రయోజనాలను పొంద కలిగింది.
ఈ మధ్యలో అరేబియా ద్వీపకల్పపు ఆల్ ఖైదా నుండి ఇస్లామిక్ రాజ్య బృందం పేర, ఒక చీలిక పక్షం బయటకు వచ్చింది. సానా  నగరం నందలి జయ్ది మసీదు దగ్గరలో 140మందిని చంప గలిగిన సామూహిక దాడితో అది తన స్థాపనను 20. 3.2015న ప్రకటించింది.


.
“మధ్య ప్రాచ్య ప్రకంపనలలో,యెమెన్ యుద్ధ తీవ్రత సాపేక్షంగా గా గుర్తింపబడలేదు.కాని 2800 మందికి  పైబడి, సామాన్య పౌరులు ఈ యుద్ధంలో మరణించారు. వీరిలొ అత్యధిక భాగం విమాన దాడులలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. వినాశకరమైన క్షామంతో ఆ దేశం మానవత సంక్షోభం తో కూనరిల్లుతుంది, శరణార్ధుల సమూహాలు ఆ ప్రాంతాన్నిమరింతగా  అతలాకుతలం చేస్తున్నాయి. “అని క్రైసిస్ గ్రూప్ భావిస్తుంది.


ఇది సముచిత మైన అంచనా. ఈ అంచనా ఎవరినన్నా మేలుకోలుపుతుందా ? అలా జరగాల్సిన అవసరం లేదు. సౌదీ అరేబియా మిత్ర పక్షమైన యునైటెడ్ ఆరబ్ ఎమెరిటస్, “ఒహోల్ అల్-రౌమి” ని తన మొదటి “అనందం” మంత్రి(మినిస్టర్ ఫర్ హపీనెస్స్)గా నియమించింది. పొరుగు దేశమైన యెమెన్ లో విషాదం తాండవిస్తుంటే, ప్రక్క దేశంలో అటువంటి మంత్రి నియామకం ఇబ్బందిగానే వుంది. బహుశా! దుబాయ్,షార్జా లాంటి భూతల స్వర్గాల లోని  మాల్స్ లలో, సానా, టైజ్ నగరాలలోని భవంతులలో బాంబుల దాడితో క్షణ క్షణం భయకంపితులౌతున్న చిన్నారులకు ఆనందం కలిగించడం కోసమన్నా ఈ నూతన మంత్రి కృషి చేస్తాడేమో చూద్దాం.

అనువాదం: కొండముది లక్ష్మీ ప్రసాద్

Tuesday, February 2, 2016

భారత ద్రవ్య స్మృతి -సంక్షిప్త పరిచయం   


2011లో  కేంద్ర ప్రభుత్వం చే  నియమింపబడిన జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో పదిమంది సభ్యులతో ఏర్పాటు చేయబడ్డ  ద్రవ్య రంగ చట్ట సంస్కరణల కమిషన్ తో భారత దేశంలో ద్రవ్యరంగ సరళీకరణ  కీలకదశకు చేరింది. అంతర్జాతీయ పోటికి నిలబడగలిగే, సమర్ధవంతమైన  అధునాతన ఆర్ధిక వ్యవస్థను నిర్మించటానికి వీలుగా   ద్రవ్యరంగ చట్ట సవరణలు ప్రతిపాదనలకోసం ఈ కమిషన్ ను నియమించినట్లు అప్పటి యుపియే ప్రభుత్వం తెలియ చేసింది. అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడి స్వేచ్చాచలనానికి కి భారత్ లోని ద్రవ్య రంగ చట్టాలు అవరోధంగా,అసమగ్రంగా  వున్నాయన్న విమర్శల నేపధ్యంలో  క్లిష్టమైన  ప్రస్తుత ద్రవ్య రంగ  చట్టాలను రెండు సంవత్సరాల పాటు  అధ్యయనం చేసి , మార్చి 2013న జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి  సమర్పించింది. ఈ నివేదిక రెండు భాగాలుగా తయారుచేయబడింది. దేశ విదేశాలలోని ఆర్ధికవేత్తలు, విధాన అధ్యయనకర్తలు,న్యాయ నిపుణులు, ప్రయోజనార్దులతో విస్తృత చర్చలు,సంప్రదింపులను జరిపి, ద్రవ్య రంగ కమిషన్ తమ ప్రతిపాదనలను,విశ్లేషణలను మొదటి భాగంలో పొందుపరిచింది. వీటి ప్రాతిపదికన రెండవ భాగంలో ద్రవ్య రంగ పటిష్టతకు ప్రస్తుతమున్న చట్టాల స్థానంలో ప్రవేశ పెట్టాల్సిన  నూతన చట్ట ముసాయిదాను  “భారత ద్రవ్య స్మృతి” గా  రూపొందించింది.


15 ద్రవ్య రంగ చట్టాలను మార్చి తయారు చేయబడ్డ భారత ద్రవ్య స్మృతి ముసాయిదా బిల్లు 450క్లాజులను,6 షెడ్యూళ్ళను కలిగి వుంది. భారత ఆర్ధిక వ్యవస్థ వచ్చే 25-30 సంవత్సరాలలో తన  ప్రస్తుత పరిమాణం కంటే 8 రెట్లు అంటే ప్రస్తుతం మున్న అమెరికా ఆర్ధిక వ్యవస్థ కంటే పెద్దదిగా పెరిగే అవకాశముందని, దానికి తగ్గట్లు భారత  ద్రవ్య స్మృతి రూపొందించబడి, భవిష్యత్ కాల పరీక్షకు తట్టుకోగలుగుతుందని ద్రవ్య రంగ చట్ట సవరణల కమిషన్ ఆశావహాన్ని వ్యక్తం చేసింది.  అత్యధిక శ్రమకోర్చి ఈ చట్టాన్ని తయారు చేసినప్పటికీ కమిషన్ కొనసాగిన కాలంలో 10 మంది సభ్యుల్లో ఇద్దరు సభ్యులు మృతి చెందగా, ఒక సభ్యుడు కమిషన్ పనిలో లేరు. మిగిలిన సభ్యులలో నలుగురు కమిషన్ ప్రతిపాదించిన వివిధ అంశాలపై తమ అసమ్మతిని తెలియచేశారు.  కమిషన్ ప్రతిపాదనలలో భారత రిజర్వు బ్యాంకు పరిధిని భారీగా కుదించటం ప్రధాన అంశంగా వుండటంతో ఈ ముసాయిదా రిజర్వు బ్యాంకు పూర్వ అధినేతలు, ద్రవ్య రంగ నిపుణుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంది.  ఈ ముసాయిదాను మానసిక వైకల్యంతో(సిజోఫ్రానిక్) రూపొందించిన ముసాయిదా గా రిజర్వు బ్యాంకు ప్రస్తుత గవర్నరు రఘురాం రాజన్ ఆనాడు వ్యాఖ్యానించారు.
                                                                                  
భారత ద్రవ్య స్మృతి-2


భారత ద్రవ్య స్మృతిని విడుదల చేసిన రెండు సంవత్సరాల తర్వాత ఆ ముసాయిదాను   మరింతగా  తాజా పరచి   ప్రజలు, ప్రయోజనార్దుల స్పందనల  కోసం 23జూలై 2015 న ఆర్ధిక మంత్రిత్వ శాఖ తన వెబ్ సైట్ లో వుంచింది. దీనినే భారత ద్రవ్య స్మృతి-2 అని అంటున్నాము.  స్పందనలను స్వీకరించటానికి  కేవలం రెండు వారాలే  గడువు పెట్టింది. ద్రవ్య రంగ చట్ట సవరణల కమిషన్ ప్రతిపాదించిన కొన్ని మౌలికాంశాలు భారత ద్రవ్య స్మృతి-2లో తీవ్రమైన మార్పులకు గురి కావటంతో తాజా పరిచిన ముసాయిదా మరింతగా వివాదాస్పద మైంది.

రిజర్వు బ్యాంకు మౌలిక  అధికారాలను, విస్తృతిని కత్తిరింఛి,సుదీర్ఘ కాలంగా  భారత ఆర్ధిక వ్యవస్థకు ఆయువుపట్టు గా నిలిచిన భారత దేశ కేంద్ర బ్యాంకును ఒక సాధారణ ద్రవ్యరంగ నియంత్రణ సంస్థగా  మార్చిన  భారత ద్రవ్య స్మృతి-2 పై  శ్రీ రంగరాజన్, శ్రీ వై వి  రెడ్డి,ఎస్. ఎస్.తారాపూర్ లాంటి మాజీ రిజర్వు బ్యాంకు గవర్నర్లు,  ఆర్ధిక వేత్తలు, న్యాయ నిపుణులు, విశ్లేషకులు, మూడి లాంటి అంతర్జాతీయ రేటింగ్ సంస్థల  తీవ్ర వ్యతిరేకతలు, నిరసనలు వ్యక్తమయ్యాయి.విశేషమేమిటంటే, జస్టిస్ శ్రీ కృష్ణ(కమిషన్ చైర్మన్) స్పందిస్తూ తాజా పరచబడిన  భారత ద్రవ్య స్మృతి ముసాయిదా(భారత ద్రవ్య స్మృతి-2)  తనది కాని, తాను నేతృత్వం వహించిన కమిషన్ ది కాని కాదని, అది భారత  ప్రభుత్వానిదని స్పష్టపరిచారు. ఆర్ధిక శాఖా కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి  ప్రకటన చేస్తూ, తమ ప్రభుత్వం కాని, ద్రవ్య రంగ చట్ట సంస్కరణల కమిషన్ కాని తాజా పరిచిన ముసాయిదా కు స్వంత దారులు కాదని, భారత  దేశ ప్రజలే  దీని స్వంతదారులని , ప్రభుత్వంగాని, కమిషన్ గాని ప్రజల అభిప్రాయాలను సంకలనం మాత్రమే చేసిందన్నారు. రాజీవ్ మెహ్రిషి, జస్టిస్ శ్రీకృష్ణ లు చేసిన పై ప్రకటనల బట్టి, ఆర్ధిక మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో ప్రజా వ్యాఖ్యల కోసం వుంచిన తాజా పరిచిన భారత ద్రవ్య స్మృతి-2 ముసాయిదాకు తల్లితండ్రులేవరో  జవాబు లేని ప్రశ్నగా మిగిలింది . ఈ నేపధ్యంలో వివాదాస్పదమైన భారత ద్రవ్య స్మృతి-2 ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిన  ఎన్డియే ప్రభుత్వ తీరుపై అందరి దృష్టి కేంద్రీకరింప బడింది.


రిజర్వు బ్యాంకు పై కేంద్ర ప్రభుత్వ అక్కసు


2008 ప్రపంచ ద్రవ్య సంక్షోభం తర్వాత పశ్చిమ దేశాలు, వారివారి కేంద్ర బ్యాంకులకు మరిన్నినూతన   అధికారాలనిచ్చి పటిష్ట పరుస్తుంటే,మన దేశంలో ప్రతిపాదింప బడ్డ నూతన ద్రవ్య స్మృతి రిజర్వు బ్యాంకు అధికారాలను బాహాటంగా కత్తిరించటానికి పూనుకోవడం వివిధ వర్గాల్ని విస్మయ పరిచింది.   ద్రవ్యపరపతి  విధానంలో బిగింపు దశ నుండి ఎప్పుడు సడలించాలనేది, దీర్ఘకాలికంగా వున్న సంశయం. అధికారంలో ఎవరున్నారన్న అంశంతో  నిమిత్తం లేకుండా వివిధ ప్రభుత్వాలు, ద్రవ్య నియంత్రణ సంస్థల  మధ్య  భేదాభిప్రాయాలు, ఘర్షణ సుదీర్ఘ  కాలంగా వున్నాయి. 1935లో రిజర్వు బ్యాంకును ఏర్పరిచేటప్పుడు,ఇది జాతీయోద్యమానికి కొమ్ముకాస్తుందేమోనన్న సంశయం బ్రిటిష్ ప్రభుత్వానికి వుండేదిట.  2004 సంవత్సరం వరకు కేంద్రానికి,కేంద్ర బ్యాంకుకు మధ్య వున్న  మనస్పర్ధలు నాలుగు గోడల మధ్య పరిష్కార మౌతుండేవి. 2004 తర్వాత ఈ భేదభావాలు బహిరంగ చర్చలుగా బయట బడి, 2008 ప్రపంచ  ద్రవ్య సంక్షోభం తర్వాత రచ్చకెక్కాయి.  కొన్ని సంవత్సరాలనుండి పెట్టుబడి ఖాతా సరళీకరణ పై రిజర్వ్ బ్యాంకు, ప్రభుత్వం మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగాయి. ఫైనాన్స్ మార్కెట్ల ఒత్తిడులతోను,వారి స్వంత ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ వర్గాలు పెట్టుబడి ఖాతాను మరింతగా  సరళీకరింఛి ఈక్విటీ,రుణ మార్కెట్లను  విస్తృత పరచాలని భావిస్తున్నాయి. ఈ దిశలో కేంద్ర బ్యాంకు వైఖరి భిన్నంగా ఉండటంతో,ఈక్విటీ,రుణ మార్కెట్ల విస్తరణకు రిజర్వ్ బ్యాంకు అడ్డుగా వుందని  భావిస్తూ   ఫైనాన్స్ మార్కెట్లు కినుకగా  వున్నాయి.   ఫైనాన్షియల్ మార్కెట్ల సరళీకరణను అతి వేగంగా జరపాలని తహతహ లాడుతున్న ప్రభుత్వానికి కూడా రిజర్వ్ బ్యాంకు ధోరణి నచ్చ లేదు.


గత కొంత కాలంగా  లక్ష్యిత ద్రవ్యోల్బణ ధ్యేయాలను సాధించాల్సిన  సందర్భాలలో బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించే విషయంలో  రిజర్వ్ బ్యాంకు అనుసరించిన వైఖరిపై కేంద్ర ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు కలసిగట్టుగా దుమ్మెత్తి పోశాయి. రిజర్వు బ్యాంకు స్వయం ప్రతిపత్తిపై తీవ్ర చర్చ నడిచింది.  ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక సంక్షోభం తదనంతర కాలంలో లక్ష్యిత ద్రవ్యోల్బణ భావనలోని డొల్లతనం కూడా బట్ట బయలైంది. లక్ష్యిత ద్రవ్యోల్బణం మరియు రిజర్వ్ బ్యాంకు స్వయంప్రతిపత్తి - రెండూ  వేరువేరు అంశాలు. లక్ష్యిత ద్రవ్యోల్బణం లో వున్న విశ్వాసం, కేంద్రబ్యాంకుకు ఇవ్వాల్సిన స్వేచ్చకు అడ్డంకి కాకూడదనేది నిపుణుల భావన. .


2010 లో ఆర్ధిక మంత్రి చైర్మన్ గా, రిజర్వు బ్యాంకు తో సహా వివిధ ద్రవ్య నియంత్రణ సంస్థల అధినేతలు సభ్యులుగా ద్రవ్య సుస్థిరత మరియు అభివృద్ది సమితి”( ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్ మెంట్ కౌన్సిల్)ఏర్పాటు చేసారు. ఈ సమితి నిర్వహించిన సమావేశాల్లో రిజర్వు బ్యాంకుతో సహా వివిధ నియంత్రణ సంస్థల అధినేతలు, సమితి పనివిధానం తమ నియంత్రణ సంస్థల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని ఆరోపించారు. సమితి పదే పదే ప్రస్తావించే ద్రవ్య రంగ అభివృద్ది,విస్తరణ తమ పని కాదని తెగేసిచెప్పారు. వీరితోపాటు ద్రవ్యరంగ సరలీకరణను వ్యతిరేకించే శక్తులు ప్రపంచ ద్రవ్య సంక్షోభం తర్వాత పెరిగాయి. వీరి వైఖరికి  సమాధానం గానే  ద్రవ్య రంగ చట్ట సంస్కరణల కమిషన్ రంగంలోకి దించారని  కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
ఈ పూర్వరంగంలో గత దశాబ్ద కాలం నుండి ప్రణాళికబద్ధ   విధాన నిర్ణయాలతో రిజర్వ్ బ్యాంకు స్వయంప్రతిపత్తిని దెబ్బతీయాలని అన్ని కేంద్ర ప్రభుత్వాలు ఉద్దేశ్యపూర్వక ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.  అంతిమంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ద్రవ్య రంగ చట్ట సవరణల కమిటీ ఏర్పాటుకు దారితీశాయి.


మారనున్న రిజర్వు బ్యాంకు రూపం


ఆసియా ద్రవ్య సంక్షోభం,ఇటీవలి ప్రపంచ ద్రవ్య సంక్షోభం నేపధ్యంలో ప్రపంచ వ్యాప్త మన్ననలు పొందిన భారత రిజర్వు బ్యాంకు పటిష్టతకు, స్వయంప్రతిపత్తికి తగిన చర్యలు ప్రతిపాదించ కుండా, భారత ద్రవ్య స్మృతి-2 ముసాయిదా రిజర్వు బ్యాంకు పై  బహు ముఖాలుగా దాడిని ఎక్కుపెట్టింది. ప్రస్తుతం రిజర్వు బ్యాంకు - ద్రవ్యపరపతి విధాన నిర్వహణ, ద్రవ్య సుస్థిరత,బ్యాంకులు మరియు బ్యాంకేతర సంస్థల నియంత్రణ/ అజమాయిషీ,విదేశీ మారకం యాజమాన్యం, ప్రభుత్వ బాండ్లు, డెరివేటివ్ మార్కెట్ల నిర్వహణ, ప్రభుత్వ అప్పు కరెన్సీ రేట్ల నిర్వహణ,డిపాజిట్ ఇన్స్యూరెన్స్ మరియు పరపతి గ్యారెంటీ కార్పోరేషన్ నిర్వహణ లను నిర్వహిస్తూ  చెల్లింపులు,పరిష్కారాల వ్యవస్థకు దేశంలోనే అత్యున్నత అదికార సంస్థగాను, ద్రవ్య పరపతి వ్యవస్థకు గుండె కాయగా వ్యవహరిస్తున్నది.


భారత ద్రవ్య స్మృతి ప్రకారం రిజర్వు బ్యాంకు భవిష్యత్ చిత్రం ఎలా వుంటుందో చూద్దాం.  భారత ద్రవ్య స్మృతి ప్రకారం రిజర్వు బ్యాంకు అధీనంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాల అమలు, షెడ్యుల్డ్ బ్యాంకుల నియంత్రణ/పర్యవేక్షణ. కరెన్సీ నిర్వహణ, చెల్లింపులు,పరిష్కారాల వ్యవస్థ నిర్వహణ మాత్రమె వుంటాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వల నిర్వహణ పై స్పష్టమైన ప్రస్తావన లేదు. బ్యాంకింగేతర సంస్థల నియంత్రణ,పర్యవేక్షణ, విదేశీ మారక ద్రవ్యం ,డెరివేటివ్, ప్రభుత్వ సెక్యురిటీ మార్కెట్ల కార్యకలాపాలను నూతనంగా ఏర్పాటు చేయబోయే “ ఫైనాన్షియల్ అధారిటీ” నియంత్రిస్తుంది. ఈ అధారిటి యే బ్యాంకింగ్,చెల్లింపు వ్యవస్థల కార్యకలాపాలు కాకుండా మిగిలిన అన్ని రకాల ద్రవ్య రంగ సేవల్ని నియంత్రిస్తుంది.  దీని నిర్వహణకు ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు నామినేట్ చేసిన సభ్యులుంటారు. ఇది ప్రధానంగా ఆర్ధిక మంత్రిత్వ శాఖ అధీనంలో వుంటుంది.డిపాజిట్ ఇన్స్యూరెన్స్ మరియు పరపతి గ్యారెంటీ కార్పోరేషన్ నిర్వహణను రిజల్యూషన్ కార్పోరేషన్ కు అప్పగిస్తారు. చివరకు రిజర్వు బ్యాంకు గవర్నర్ ను చైర్మన్ గాను,డిప్యూటి గవర్నర్లను సభ్యులుగాను మార్చాలని కమిషన్ ప్రతిపాదించింది.  


కమిషన్ ప్రతిపాదించిన సంక్షిప్త  భారత ద్రవ్య స్మృతి-ప్రభావాలు


ద్రవ్య వ్యవస్థలోని  వివిధ రంగాలను నియంత్రిస్తున్న చట్టాలనన్నింటిని కలిపి, రంగాల కతీతంగా సూత్రబద్ధంగా తయారు చేయబడ్డ చట్ట ముసాయిదాయే భారత ద్రవ్య స్మృతి. ఈ ద్రవ్య రంగ చట్టం తొమ్మిది విభాగాలను కలిగివుంది.

ద్రవ్య పరపతి  విధాన కమిటీ (మానిటరి పాలసీ కమిటీ)

 ద్రవ్య పరపతి విధానానికి చట్టపరమైన జవాబుదారీ యంత్రాంగాన్ని ఏర్పరచాలి. ఆర్ధిక మంత్రిత్వ శాఖ పరిమాణాత్మక లక్ష్యాన్ని నిర్దేశించి,పర్యవేక్షించాలి. ఈ లక్ష్యాన్ని రిజర్వు బ్యాంకు తన దగ్గర వున్న సాధనాలతో అమలు చేయాలి.   రిజర్వు బ్యాంకు అధికారాలను ఎలా అమలు చేయాలో నిర్ణయించటానికి ద్రవ్య పరపతి విధాన కార్యవర్గ కమిటీ ఏర్పాటు చేయబడుతుంది


పర్యవసానాలు  
ప్రస్తుతం భారత దేశంలో ద్రవ్య పరపతి విధాన నిర్వహణ బాధ్యతను రిజర్వు బ్యాంకు, ద్రవ్య విధాన బాధ్యతను  ఆర్ధిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నాయి. ద్రవ్య పరపతి విధాన బాధ్యతను ప్రభుత్వం రిజర్వు బ్యాంకు బోర్డు కు కట్టబెట్టినప్పటికి, బోర్డు ఈ బాధ్యతను దాదాపుగా గవర్నర్ కు అప్పచెప్పింది. కానీ నూతన ద్రవ్య స్మృతి  ఈ బాధ్యతను రిజర్వు బ్యాంకు నుండి తప్పించి, ద్రవ్య పరపతి విధాన కమిటీ కి అప్పచెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్య పరపతి విధాన బాధ్యతను ద్రవ్య పరపతి విధాన కమిటీలే నిర్వహిస్తున్నాయన్న నెపంతో  మన దేశంలో కూడాఅదే విధానాన్ని  అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు సమర్ధించు కుంటున్నాయి. వివిధ దేశాల అనుభవాలలో ద్రవ్య పరపతి విధాన బాధ్యతను కమిటీలకు అప్పచెప్పినప్పటికి, వాటి చైర్మన్ అభిప్రాయాలకే అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలుస్తుంది. భారత ద్రవ్య స్మృతి 8 సభ్యులుగల ద్రవ్యపరపతి కమిటీలో ఇద్దర్ని రిజర్వు బ్యాంకు నుండి నలుగుర్ని ప్రభుత్వం నియమించే బయట వ్యక్తులతో భర్తీ చేయాలన్నది. కాని కమిటీ చైర్మన్ గా పిలబడే గవర్నర్ కు వీటో అధికారాన్ని ఇచ్చి పరిస్థితిని కొంత మేరకు రక్షించింది.  ఆ అంశం పై ప్రభుత్వం నియమించిన ఉర్జిత్ పటేల్ కమిటీ ఐదుగురు సభ్యుల కమిటీ లో ముగ్గుర్ని రిజర్వు బ్యాంకు నుండి, ఇద్దరు  ప్రభుత్వ నియామకుల్ని బయటి నుండి తీసికోవచ్చునన్నది . గవర్నరుకు వీటో అధికారాన్ని  తొలగించింది.                                    

భారత ద్రవ్య స్మృతి -2లో పేర్కొన్న ప్రతిపాదనలో నూతన ద్రవ్య పరపతి విధాన కమిటీ లో 6గురు సభ్యులుంటారు. వీరిలో నలుగురిని కేంద్ర  ప్రభుత్వం బయట నుండి  నియమిస్తుంది.ఇద్దరిని రిజర్వు బ్యాంకునియమిస్తుంది. గవర్నరు ఈ కమిటీకి చైర్మన్ గా వుంటారు.ఈ నిర్మాణం తో  సహజంగా ప్రభుత్వ నిర్ణయాలే కమిటీ నిర్ణయాలుగా ఉంటాయి.  కమిటీ నిర్ణయాలపై గవర్నర్ కు వీటో అధికారం వుండదు.  ఇంతవరకు రిజర్వు బ్యాంకు నిర్వహిస్తున్న,వడ్డీ రేట్ల నిర్ణయంతో సహా ద్రవ్య పరపతి విధానానికి సంబంధించిన అన్ని అంశాలను ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్వహిస్తుంది.  ఈ లక్షణాలతో భారత ద్రవ్య స్మృతి -2 వివాదాస్పద మైంది. సహజంగా అధిక వృద్ది రేట్ల పై మోజు పడే ప్రభుత్వాలు వడ్డీ రేట్లు తక్కువగా వుండాలను కుంటాయి.ఈ బాధ్యతను ప్రభుత్వ అధీనంలోని ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్వహిస్తుంది.  కాని రిజర్వు బ్యాంకుకు ద్రవ్యోల్బణ నియంత్రణ బాధ్యతను అప్పచెప్పటం,పరిణామాలకు జవాబుదారీ చేయటం  జరిగింది. ద్రవ్యోల్బణం పెరిగే సందర్భాలలో దానిని నియంత్రించేందుకు సహజంగా ఉపయోగించే సాధనం వడ్డీ రేట్లను పెంచటం. వడ్డీ రేట్ల పెంపు అనివార్యంగా వృద్ది రేట్ల పై అననుకూల ప్రభావాన్ని చూపుతుంది.దీని కారణంగా ప్రభుత్వ నామినీలతో ప్రభావితమయ్యే కమిటీతో వైరుధ్యాలు తరచూ వుండే ప్రమాదముంది. కమిటీలో అత్యధిక సభ్యులు ప్రభుత్వ నామినీలు వుండటంతో స్వార్ధ పర రాజకీయాలు కమిటీ నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశముంది. ఈ పరిణామాలు స్థూల ఆర్ధిక వ్యవస్థ సుస్థిరతకు ప్రమాదకరం. అందువల్లే  ఈ అంశాన్నే అనేక మంది ఆర్ధికవేత్తలు,బ్యాంకర్లు,కేంద్ర బ్యాంకులు తీవ్రంగా వ్యతిరేకించాయి . వాళ్ళ దృష్టిలో ద్రవ్య పరపతి విధాన నిర్ణేతగా  కేవలం కేంద్ర బ్యాంకు(రిజర్వు బ్యాంకు) మాత్రమే వుండాలి.


కొసమెరుపు

ఈ తీవ్ర వ్యతిరేకతకు ఖంగుతిన్న కేంద్ర ప్రభుత్వం,రిజర్వు బ్యాంకుతో  ద్రవ్య పరపతి విధాన కమిటీ ఏర్పాటుపై ఇటీవలే ఒక అవగాహనకు వచ్చినట్లు, వివరాలు పార్లమెంటు సమావేశాల్లో ప్రకటించబడుతాయని తెలుస్తుంది. ఈ ప్రతిపాదిత కమిటీలో 5గురు సభ్యులుంటారు. ముగ్గుర్ని రిజర్వు బ్యాంకు నియమిస్తుంది. ఇద్దర్ని ప్రభుత్వం బయట నుండి నియమిస్తుంది. రిజర్వు బ్యాంకు గవర్నరు కమిటీ చైర్మన్ గా వుండి, ఏ సభ్యుడైనా హాజరు కాని సందర్భంలో క్యాస్టింగ్ ఓటు వేసే హక్కు కలిగి వుంటాడు. లక్ష్యిత ద్రవ్యోల్బణ ధ్యేయాన్ని ప్రభుత్వం రిజర్వు బ్యాంకుతో సంప్రదించి నిర్ణయించాలి.


ప్రభుత్వ ఋణ యాజమాన్య ఏజెన్సీ(పబ్లిక్ డెట్ మేనేజ్ మెంట్):

దీర్ఘకాలికంగా తక్కువ వ్యయంతో ద్రవ్యాన్ని అందించే వ్యూహంతో ప్రభుత్వ ఋణ యాజమాన్యాన్ని నైపుణ్యంగా నిర్వహించగల యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఋణ నిర్వహణకు  ఏకైక ఏజెన్సీ ఏర్పాటు చేయాలని కమీషన్ ప్రతిపాదించింది.ఇంతవరకు రిజర్వు బ్యాంకు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఋణ యాజమాన్య ప్రక్రియను దాని నుండి విడదీసి స్వతంత్ర ఋణ యాజమాన్య  ఏజెన్సీగా రూపకల్పన చేయాలని కమిషన్ ప్రతిపాదించింది. స్వతంత్ర ఋణ యాజమాన్య ఏజెన్సీ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ లక్షణాలు కలిగి వుండాలని భావించింది.  రిజర్వు బ్యాంకు ప్రస్తుతం ప్రభుత్వ బాండ్లను విక్రయిస్తూ,రెండు పరస్పర విరుద్ధమైన ధ్యేయాలను నిర్వర్తిస్తుంది. ప్రభుత్వానికి తక్కువ వడ్డీకి పెట్టుబడులను సమకూర్చాల్సి వచ్చినప్పుడు కేంద్ర బ్యాంకు తీసికోవలసిన వైఖరికి, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాల్సి వచ్చినప్పుడు  కేంద్ర బ్యాంకు తీసికునే వైఖరికి మధ్య వైరుధ్యం ఏర్పడుతున్న కారణంగా స్వతంత్ర ఋణ యాజమాన్య ఏజెన్సీ ఏర్పాటు ప్రాధాన్యతను కమిషన్ భారత ద్రవ్య స్మృతి లో నొక్కి చెప్పింది. కాని భారత ద్రవ్య స్మృతి-2లో ఈఋణ యాజమాన్య ఏజెన్సీని స్వతంత్రంగా కాకుండా ప్రభుత్వ యాజమాన్యంలో వుంచటం పై తీవ్ర మైన విమర్శలు చోటు చేసికున్నాయి. రిజర్వు బ్యాంకు నుండి స్వతంత్ర ప్రభుత్వ ఋణ ఏజెన్సీ ని వేరుచేస్తే, రిజర్వు బ్యాంకు ప్రభుత్వ బాండ్ల మార్కెట్ ను పోషించాల్సిన అవసరం వుండదు. కేంద్ర బ్యాంకు తన బహిరంగ మార్కెట్ కలాపాలను ద్రవ్య పరపతి విధానానికి అనుకూలంగా స్వతంత్రంగా నిర్వహించ కలుగుతుంది.  దీని ఫలితంగా  ప్రభుత్వ ఋణబాండ్ల పై  చెల్లించాల్సిన వడ్డీ పెరుగుతుంది. ప్రభుత్వానికి తక్కువ వడ్డీకి తగినంత ఋణలభ్యత సాధ్యం కాదు. అందువల్ల రిజర్వు బ్యాంకు నుండి ప్రభుత్వ ఋణ ఏజెన్సీ వేరు చేయటం జాతి ప్రయోజనాలకు  శ్రేయస్కరం కాదని ఎస్ ఎస్ తారాపూర్ లాంటి నిపుణులు వాదిస్తున్నారు.  .

 భారత దేశ ఆర్ధిక వ్యవస్థ సుదీర్ఘకాలంగా ద్రవ్యలోటుతోనే కొనసాగుతుంది. ఈ లోటును ప్రధానంగా  ప్రభుత్వం ఋణ బాండులు ద్వారానే భర్తీ చేస్తున్నది. అందువల్ల రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ ఎస్ ఎస్ తారాపూర్ లాంటి నిపుణుల వాదన ఏమంటే, మన ఆర్ధిక వ్యవస్థ ద్రవ్యలోటు అత్యధికంగా వున్నంత కాలం, బ్యాంకింగ్ రంగం లో అత్యధిక లావాదేవీలు ప్రభుత్వ రంగ బ్యాంకుల అధీనంలో ఉన్నంత కాలం, చట్టపరమైన లిక్విడిటీ నిష్పత్తులను బ్యాంకులు తప్పనిసరిగా అమలుచేయాల్సినంత కాలం ప్రభుత్వ ఋణయాజమాన్యం రిజర్వు బ్యాంకు   ఆధిపత్యంలోనే తప్పనిసరిగా వుండి తీరాలి. ప్రపంచ ద్రవ్య సంక్షోభం అనంతరం అనేక దేశాల్లో ప్రభుత్వ రుణ యాజమాన్య బాధ్యతను  కేంద్ర బ్యాంకులకు తరలించటం జరిగింది.

భారత ద్రవ్య స్మృతి పార్లమెంటు ఆమోదం పొందటం తో నిమిత్తం లేకుండా ఎన్డియే ప్రభుత్వం ప్రభుత్వ ఋణ ఏజెన్సీ ఏర్పాటును 2015 ద్రవ్య బిల్లులో ప్రతిపాదించారు.  రిజర్వు బ్యాంకు చట్టాన్ని సవరిస్తే కాని ప్రభుత్వ ఋణ ఏజెన్సీ ఏర్పాటు ఆచరణలో సాధ్యం కాదు. ఇందుకోసం సవరణను లోక్ సభ,రాజ్య సభ రెంటిలోనూ ప్రవేశ పెట్టాలి. ద్రవ్య బిల్లుకు  లోక్ సభ ఆమోదం తెల్పితే చాలు. తన తప్పిదాన్ని తెలిసికున్న కేంద్ర ప్రభుత్వం  చివరి క్షణంలో ఈ అంశాన్ని ద్రవ్య బిల్లు నుండి తొలగించింది.



ఉమ్మడి ఫైనాన్షియల్ అధారిటీ


నియంత్రణ సంస్థలకు స్వతంత్రత,జవాబుదారీతనం వుండాలని కమిషన్ భావిస్తుంది. ప్రభుత్వ కంపెనీనైనా, ప్రైవేట్ కంపెనీనైనా నియంత్రణ సంస్థ నిష్పాక్షికంగా వ్యవహరించాలి. ప్రస్తుతం అమలులో వున్న బహుళ రంగాల నియంత్రణల వ్యవస్థను  రెండే రెండు నియంత్రణల వ్యవస్థకు మార్చాలని కమిషన్ ప్రతిపాదించింది. అందులో ఒక నియంత్రణ సంస్థగా రిజర్వు బ్యాంకు- బ్యాంకింగ్ మరియు చెల్లింపుల వ్యవస్థను నియంత్రిస్తుంది. రెండవది ఉమ్మడి ఫైనాన్షియల్ అధారిటీ  - ప్రస్తుతం నియంత్రణ సంస్థలుగా వున్న సెబీ(సేక్యురిటీస్ ఎక్స్చేంజి బోర్డు ఆఫ్ ఇండియా),ఐ ఆర్ డి ఎ(ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అధారిటీ), పి ఎఫ్ ఆర్ డి ఎ(పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అధారిటీ),ఎఫ్ ఎం సి(ఫార్వార్డ్ మార్కెట్ కాంట్రాక్ట్ స్) లన్నింటినీ కలిపి ఉమ్మడి ఫైనాన్షియల్ అధారిటీ  సూపర్ నియంత్రణాధికారిగా మిగిలిన ద్రవ్య మార్కెట్లను నియంత్రిస్తుంది.


నియంత్రణ సంస్థలకు ఒక సాధికారమైన బోర్డు, తన సభ్యులను అన్వేషించి,నియమించుకోగలిగే అధికారం ఈ బోర్డు కు వుంటుంది. నియంత్రణ సంస్థ సభ్యులను నాలుగు కేటగిరీలుగా అంటే చైర్మన్, కార్యవర్గ సభ్యులు, కార్యవర్గేతర సభ్యులు, ప్రభుత్వ నామినీలుగా  విభజించారు. బోర్డు కు అనుబంధంగా సలహా మండళ్ళు వుంటాయి. ద్రవ్య వ్యవస్థ మొత్తం నుండి వసూలుచేసే ఫీజులు నియంత్రణ సంస్థల నిధులుగా వుంటాయి. ద్రవ్య వ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల అపీళ్ళను వినేందుకు,తీర్పులు చెప్పేందుకు ప్రస్తుత మున్న సెక్యురిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్థానంలో ద్రవ్య రంగ అప్పిలేట్ ట్రిబ్యునల్ ను కమిషన్ రూపొందించింది


ఉమ్మడి ఫైనాన్షియల్ అధారిటీ నమూనా అనేక దేశాల్లో సరిగ్గా నిర్వహింప బడటం లేదు.ఏకైక నియంత్రణ సంస్థ నియంత్రణ/పర్యవేక్షణ లలో గుణాత్మక మార్పు తీసికొని రాలేదు. భారత దేశంలో ప్రస్తుత మున్న బహుళ నియంత్రణ వ్యవస్థ కొంత అనుభవాన్ని పుంజుకుంది. భారత దేశంలోని నియంత్రణ సంస్థలలో ఎఫ్ ఎం సి (ఫార్వార్డ్ మార్కెట్ కాంట్రాక్ట్ స్)  పనితీరుపై తీవ్రమైన ఆరోపణలున్నాయి.నేషనల్ స్పాట్ ఎక్ష్చెంజ్ కుంభకోణంలో అది కూరుకు పోయివుంది. ఇటీవలే దాన్ని సెబి(సేక్యురిటీస్ ఎక్స్చేంజి బోర్డు ఆఫ్ ఇండియా)లో కలిపారు. ఇంతకు మించి ఇతర నియంత్రణ సంస్థల పనితీరు పై పెద్దగా విమర్శలు లేవు.సెబీ ప్రస్తుత స్థాయిని చేరుకోవటానికి 24 సంవత్సరాలు పట్టింది.ప్రస్తుత నియంత్రణ సంస్థల సమర్ధతలను ప్రపంచస్థాయి ప్రమాణాలతో  అభివృద్ది చేసికోవడంలో ఇబ్బందిని కమిషన్ ప్రస్తావించలేదు. నియంత్రణ సంస్థ పరిమాణం మరింతగా పెరిగిన కొద్దీ కేంద్రీకరింపబడ్డ  అధికారాలతో,  నియంత్రణ కంటే నియంతృత్వ పోకడలు పెరుగుతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు . భారత ద్రవ్య స్మృతి నిర్వచనం ప్రకారం ప్రజల నుండి డిపాజిట్ లు స్వీకరించే ద్రవ్య సేవా సంస్థలను బ్యాంకులు గా పరిగణించాలి. అటువంటప్పుడు ప్రజా డిపాజిట్లు స్వీకరిస్తున్నబ్యాంకింగేతర ద్రవ్య సంస్థలను బ్యాంకులుగా పరిగణించి, వాటి నియంత్రణను  రిజర్వు బ్యాంకు పరిధిలో వుంచాలి. కాని కమిషన్ బ్యాంకింగేతర ద్రవ్య సంస్థల నియంత్రణను ఉమ్మడి ఫైనాన్షియల్ అధారిటీకి కట్టబెట్టింది. దీని ఫలితంగా సమాంతర బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేత మౌతుందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపధ్యంలో 5-10 సంవత్సరాల తర్వాత రిజర్వు బ్యాంకు అధీనంలో వున్న బ్యాంకుల నియంత్రణను కూడా ఈ ఉమ్మడి ఫైనాన్షియల్ అధారిటీ క్రిందకు తీసికురావాలని కమిషన్ ప్రతిపాదిస్తున్నది. ఈ ప్రతిపాదన జాతి ప్రయోజనాలకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించే చర్య గా భావిస్తూ,అంతిమ ఋణదాతగా(లెండర్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్) రిజర్వుబ్యాంకు ఉన్నంతవరకు బ్యాంకింగ్ కార్యకలాపాల నియంత్రణ మొత్తం రిజర్వు బ్యాంకు ఆధీనంలోనే వుండాలని నిపుణులు కోరుతున్నారు.

అంతర్జాతీయ ద్రవ్య సంస్థ తన తాజా నివేదికలో(ద్రవ్య వ్యవస్థ సుస్థిరత అంచనా) “భారత దేశం లోని బ్యాంకులు,ఇన్స్యూరెన్స్, సెక్యూరిటీల నియంత్రణ/పర్యవేక్షణ విభాగం బాగా అభివృద్ది చెంది,దాదాపుగా  అత్యున్నతమైన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వున్నా”యని పేర్కొంది


ద్రవ్య సుస్థిరత మరియు అభివృద్ది సమితి( ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్ మెంట్ కౌన్సిల్)


ద్రవ్య వ్యవస్థ మొత్తానికి సంబంధించిన వ్యవస్థీకృత రిస్క్ ను తగ్గించటానికి నియంత్రణ సంస్థలన్నీ జోక్యం చేసుకోవాలి. ఈ వ్యవస్థీకృత రిస్క్ ను పరిమితం చేయటంలో “ద్రవ్య సుస్థిరత మరియు అభివృద్ది సమితి”( ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్ మెంట్ కౌన్సిల్) నాయకత్వ బాధ్యతనునిర్వర్తించాలని  కమిషన్ సంకల్పిస్తున్నది.


ద్రవ్య రంగ ప్రాధ్యానత గల  ఆర్ధిక వ్యవస్థలో చోటుచేసుకునే అనూహ్యమైన ముప్పు, తన ప్రాంతాన్నే కాకుండా వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసే నైజమున్నది.  2008లో సంభవించిన ప్రపంచ ద్రవ్య సంక్షోభం,ఆ  సందర్భంగా వినాశన మైన ప్రజా సంపదే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. దీన్నే వ్యవస్థీకృత రిస్క్(అపాయం) అంటున్నారు. ఇటువంటి అపాయాన్ని ఊహించేందుకు, వాటిని అదుపు చేసి, ద్రవ్య సుస్థిరతను సాధించేందుకు  వివిధ దేశాలలో ప్రత్యెక యంత్రాంగాలను తయారు చేసుకున్నారు. ఇటువంటి యంత్రాంగం భారత దేశంలో 2010 సంవత్సరంలో “ ద్రవ్య సుస్థిరత మరియు అభివృద్ది సమితి”( ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్ మెంట్ కౌన్సిల్)పేర ఏర్పాటు చేయబడింది. ఆర్ధిక మంత్రి అధ్యక్షుడుగా,వివిధ ద్రవ్య రంగ నియంత్రణ సంస్థల అధిపతులు,ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఈ సమితి ప్రస్తుతం పనిలో వుంది. అర్ధిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న పరిణామాలను విశ్లేషిస్తూ వ్యవస్థీకృత రిస్క్ కు అవకాశాలను బేరీజు వేసికొని తగిన పరిష్కార చర్యలకు పూనుకోవటం,ద్రవ్య రంగ అభివృద్దికి ప్రణాళికలు రచించటం, వివిధ నియంత్రణ సంస్థల మధ్య భేదాభిప్రాయాలను పరిష్కరించి వారి మధ్య సమన్వయాన్ని పెంచటం సమితి  కర్తవ్యాలుగాలుగా వున్నాయి.


2010లో యూనిట్ లింక్డ్ పాలసీలపై అంతిమ నిర్ణయం “సెబీ దా లేక ఐ ఆర్ డి ఎ దా”అన్న వివాదాన్ని రిజర్వ్ బ్యాంకు పరిష్కరించ లేనప్పుడు ఆర్ధిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసికొంది. ద్రవ్య రంగంలో ఇటువంటి సమస్యల పరిష్కారానికి “ద్రవ్య సుస్థిరత మరియు అభివృద్ది సమితి”లాంటి సంస్థ ప్రాధాన్యతను తెలియచేస్తూ కమిషన్ దానికి చట్టబద్దతను కల్పిస్తూ తన ప్రతిపాదనలలో చేర్చింది.     

ద్రవ్య రంగంలోని వ్యవస్థీకృత రిస్క్ ను గుర్తించి ఒడిసి  పట్టుకోవటం,ఆకాశాన్ని ఒడిసి పట్టుకోవటం లాంటిదని ద్రవ్య రంగ సంక్షోభం సందర్భంగా అనేక మంది  ఆర్ధిక వేత్తలు చెప్పారు. ద్రవ్యరంగ ప్రాధ్యానత గల పెట్టుదారీ విధానంలో ఇటువంటి తీవ్ర సంక్షోభాలకు సంస్థాగత మార్పే శాశ్వత  పరిష్కారమని మార్క్సిజం చెపుతుంది.అమెరికా, ఇంగ్లాండ్ లలో వ్యవస్థీకృత రిస్క్ నివారణ, ద్రవ్య రంగ సుస్థిరత బాధ్యతను కేంద్ర బ్యాంకుకు అప్ప చెప్పారు. ద్రవ్య పరపతి విధాన కర్త గాను, అంతిమ ఋణదాతగాను కేంద్ర బ్యాంకుకు మించిన వ్య్వస్తీకృత రిస్క్ మేనేజర్ మరొకరు ఉండరని వాళ్ళ విశ్వాసం.

ద్రవ్య రంగంలో అత్యధిక వ్యవస్థీకృత రిస్క్ కు నూతనంగా రూపొందిస్తున్న క్రెడిట్ డెరివేటివ్ స్వాప్ లాంటి నూతన ఆవిష్కరణలు తీవ్రంగా దోహద పడుతున్నాయని  ఆర్దివేత్తలు గుర్తించారు. దీనిపై బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రత్యేక పరిశోధనను చేపట్టింది. అటువంటి పరిశోధనలపై కమిషన్ దృష్టి సారించినట్లు లేదు.


పెట్టుబడి ప్రవాహాల నియంత్రణ
పెట్టుబడి ఖాతా సరళీకరణను ఎప్పుడు,ఎలా చేయాలో కమిషన్  స్పష్ట మైన ప్రణాళికను ప్రతిపాదించక పోయినప్పటికీ, ఏ పెట్టుబడుల నియంత్రణ లైన చట్ట పరమైన మంచి పునాదులపై నిర్వహింపబడాలి. దేశంలోకి ప్రవేశించే పెట్టుబడులను ఆర్ధిక మంత్రిత్వ శాఖ, దేశం నుండి నిష్క్రమించే  పెట్టుబడులను రిజర్వు బ్యాంకు నియంత్రించాలి.  పెట్టుబడుల నియంత్రణ లన్నింటిని రిజర్వు బ్యాంకు అమలు చేయాలి.


ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష ద్రవ్య పెట్టుబడి విధానాల్ని రూపొందిస్తున్నది. రిజర్వుబ్యాంకు వాటిని అమలు చేస్తుంది. పోర్ట్ పోలియో పెట్టుబడుల విధి విధానాలు కేంద్ర ప్రభుత్వం చేతిలోనే వున్నాయి. ఇతర పెట్టుబడులకు రిజర్వు బ్యాంకు విధివిధానాలను రూపొందిస్తున్నది. ఈ దేశం నుండి బయటకు తరలే ఇతరపెట్టుబడులను రిజర్వు బ్యాంకు పర్యవేక్షిస్తూ నియంత్రిస్తున్నది. ఈ ఏర్పాటు సజావుగా సాగిపోతుంది. 1991 విదేశీ ద్రవ్య మారక సంక్షోభాన్నిరిజర్వు బ్యాంకు సమర్ధవంతంగా ఎదుర్కొన్నదని అందరూ ప్రశంసించారు.  భారత ద్రవ్య స్మృతి తన నూతన ప్రతిపాదనలతో ఈ అంశాన్ని  మరింత సంక్లిష్ట పరుస్తున్నది. పెట్టుబడి ఖాతా పూర్తి కన్వర్ట బిలిటి అధికారాన్నిరిజర్వు బ్యాంకు నుండితొలగించే కుట్రలో భాగంగా ఈ ప్రతిపాదన వుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.   ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ కమిటీలోని ముగ్గురు సభ్యులు తమ అసమ్మతిని తెలియ చేశారు.


వినియోగదారుల రక్షణ(కంజ్యుమర్ ప్రొటెక్షన్)


వినియోగదారుల ప్రయోజనాల పరి రక్షణకు అవసరమైన  రక్షణలను ద్రవ్య సంస్థలు కల్పించేలా నియంత్రణ సంస్థలే  చూడాల్సివుంటుంది.  ద్రవ్య రంగ వినియోగదారులందరికి  కొన్ని ప్రాధమిక హక్కుల్నికల్పించి,  అన్ని రంగాల బాధిత వినియోగదారుల సమస్యల పరిష్కారానికి “ఏకైక ఉమ్మడి ద్రవ్య రంగ పరిష్కార ఏజెన్సీ”(సింగిల్ ఉనిఫైడ్ ఫైనాన్షియల్ రిడ్రేస్సల్ ఏజెన్సీ) ని ఈ చట్టం కల్పిస్తుంది. దీనితోపాటు  వినియోగదారుల రక్షణలో ‘కాంపిటిషన్(పోటీ) అన్న అంశం ముఖ్యమైనదిగా కమిషన్ పరిగణిస్తూ నియంత్రణ సంస్థలు , కాంపిటిషన్ కమిషన్ కు మధ్య సహకారం పెంపొందెందుకు అవసరమైన యంత్రాంగాన్ని రూపకల్పన చేస్తుంది.


వివేకవంతమైన లోతైన క్రమబద్దీకరణ(మైక్రో ప్రూడేన్షియల్ రెగ్యులేషన్)


ద్రవ్య సంస్థల వైఫల్యాలను ముందుగానే పసిగట్టి  వాటిని సమర్ధ వంతంగా అదుపు చేయకలిగేటట్లు  నియంత్రణ సంస్థల పర్యవేక్షణ వుండాలి.  ప్రవేశం లో,  రిస్క్ తీసికొనే క్రమంలో , నష్టాన్ని భరించే క్రమంలో , నిర్వహణ క్రమంలో, పర్యవేక్షణక్రమం లాంటి ఐదు సందర్భాలలో    క్రమబద్దీకరణ కు చట్ట ముసాయిదా తగిన అధికారాలను కట్ట బెట్టింది.


పరిష్కార కార్పోరేషన్ (రిజల్యూషన్ కార్పొరేషన్ )
ద్రవ్య సంస్థలు వైఫల్యం చెందినప్పుడు చిన్న ఖాతాదార్ల ప్రయోజనాలు త్వరితంగాను, తగినంతగా కాపాడబడేలా సంస్థల మూసివేతలు వుండాలి. ఒక సంస్థ వైఫల్యం తో మూతపడినట్లయితే, ఈ అంశంలో జోక్యం చేసికొనేందుకు,మరియు అనేక ద్రవ్య సంస్థలతో వ్యవహరించేందుకు ఒక ఉమ్మడి పరిష్కార కార్పోరేషన్ ను ఏర్పాటు చేయాలి. వైఫల్యాల అవకాశ ప్రాతిపదికన పరిష్కార కార్పోరేషన్ అన్ని ద్రవ్య సంస్థల నుండి కొంత ఫీజును వసూలు చేయాలి.


అభివృద్ధి మరియు పునఃపంపిణీ:  మార్కెట్ మౌలిక వసతుల అభివృద్ది మరియు నిర్వహణా బాధ్యతను నియంత్రణ సంస్థ,  పునః పంపిణీ బాధ్యతను ఆర్ధిక మంత్రిత్వ శాఖ  వహించాలి.
ఒప్పందాల మార్కెట్, ఆస్థుల మార్కెట్, సెక్యురిటీ మార్కెట్లకు సంబంధించిన మౌళిక విధి విధానాలను  కమిషన్ రూపొందిస్తుంది.   
          
భారత ద్రవ్య స్మృతి లో వినియోగ దారుల  ప్రయోజనాలను రక్షించ కలిగే నూతన యంత్రాంగం నిర్మాణం పై విమర్శలు పరిమితంగానే వున్నాయి. కాని నియంత్రణ వ్యవస్థ ఒకే సంస్థగా, కేంద్రీకరించబడిన అధికారాలతో ప్రభుత్వ విభాగంగా మారుతున్నప్పుడు, కంచే చేనును మేస్తే, వినియోగదారులకు  రక్షకు లెవరు?


పాత ద్రవ్య చట్టాల స్పూర్తికి విఘాతం


భారత ద్రవ్య స్మృతి 15 చట్టాలను సవరించమని ప్రతిపాదిస్తే, భారత ద్రవ్య స్మృతి-2, 19 చట్టాలను సవరించాలన్నది.సంప్రదాయ పద్ధతుల్ని గాలికి వదిలేసి ఒక కలం పోటుతో పాత ద్రవ్య రంగ చట్టాల్ని రద్దు చేసి వాటి స్థానంలో నూతన చట్టాన్ని చేయటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని మేధావులు తేలిగ్గా జీర్ణించుకోలేక పోతున్నారు. పాత చట్టాల్ని రద్దు చేసి కొత్త చట్టాల్ని చేసేటప్పుడు పాత చట్టాల మౌళిక స్పూర్తిని పరిరక్షించాల్సి వుంటుంది. కాని భారత ద్రవ్య స్మృతి నిర్వహించిన చర్యలు పురిటి గుడ్డలతో పాటు పురిటి శిశువును కూడా పారేసిన చందాన వుంది.  

బ్రిటిష్ ప్రభుత్వకాలంలో రిజర్వు బ్యాంకు చట్టం1934 ద్వారా1935లో రిజర్వుబ్యాంకు ఏర్పాటయింది. జాతీయోద్యమ స్పూర్తితో ఆర్ధిక వ్యవస్థలో బలమైన ప్రభుత్వ పాత్రకు వీలు కల్పిస్తూ 1960/1970లలో ద్రవ్య రంగ చట్ట రూపకల్పన చేయబడింది.  బ్యాంకులు చట్ట పరిధిలో   పనిచేయటానికి వీలుగా బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 రూపకల్పన చేయబడింది. ద్రవ్య సంస్థలు దీర్ఘకాలికంగా పనిచేయటానికి వీలుగా వివిధ చట్టాలు చేయబడ్డాయి. దీనిలో భాగంగానే భారత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చట్టం 1955, భారత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(సబ్సిడరీ బ్యాంక్స్) చట్టం 1959, 1969/1980 ల బ్యాంకుల జాతీయకరణ చట్టం, 1992లో సెబీ చట్టం అమలులోనికి వచ్చాయి. ద్రవ్య రంగంలో ప్రత్యేక  అంశాలకు సంబంధించిన వివిధ చట్టాలు అమలు లో వున్నాయి. 1991 లలో సరళీకరణ విధానాలు మొదలైనప్పటి నుండి ప్రభుత్వరంగ బ్యాంకులలో ప్రభుత్వ వాటాకు గండి కొట్టటం మొదలైంది. కాని అనేక మార్లు చట్ట సభలలో జాతీయ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా ఎటువంటి పరిస్థితులలో 51శాతానికి మించి తగ్గించ కూడదని వక్కాణించటం తోపాటు బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో ఈ అంశం పొందుపరచ బడివుంది.

ద్రవ్య రంగ చట్టాల రద్దుతో ఆవిర్భవించే భారత ద్రవ్య స్మృతి-2లో జాతీయ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 51శాతానికి మించి తగ్గించకూడదన్న వక్కాణింపు తొలగించబడింది. దీనితో10వ ప్రణాళిక సంఘం కోరినట్లు జాతీయ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాపై 51శాతం సీలింగు తొలగింపు చర్యకు మార్గం సుగమ మౌతుంది. జాతీయ వ్యవసాయ అభివృద్ది బ్యాంకు భవితవ్యం కూడా చట్టపరంగా ప్రశ్నార్ధకం కానున్నది. దీనిని గూర్చిన ప్రస్తావన కూడా నూతన ద్రవ్యరంగ చట్ట ముసాయిదాలో లేదు. ఈ అంశాల్ని పార్లమెంటు పరిశీలనలో సరిచేయాలి.

ఏకైక ఉమ్మడి ద్రవ్య రంగ పరిష్కార ఏజెన్సీ ఏర్పాటులో ఎల్ ఐ సి, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా లాంటి కార్పోరేషన్ నిర్మాణం గా కలిగిన సంస్థల్ని, సహకార రంగంలో వున్న సంస్థల్ని కంపెనీ చట్ట పరిధిలోకి తీసుకు రావటం శ్రేయస్కరమని కమిషన్ వ్యాఖ్యానించింది.

ముగింపు

ద్రవ్య రంగ చట్ట సవరణల కమిషన్ ప్రతిపాదించిన భారత ద్రవ్య స్మృతి ద్రవ్య సరళీకరణ విస్తరణకు దారులు వేస్తున్నది.

తాజా పరిచిన భారత ద్రవ్య స్మృతి పై మూడి రేటింగ్ సంస్థ స్పందిస్తూ, రిజర్వు బ్యాంకు స్వయం ప్రతిపత్తిని హరించే చర్యలు ద్రవ్యోల్బణ ధ్యేయ సాధనను దెబ్బతీస్తుందని, ద్రవ్య రంగ సుస్థిరత పై దీని ప్రభావం గణనీయంగా వుంటుందన్నది.

కమిషన్ ప్రతిపాదనల ఫలితంగా నియంత్రణ అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టినట్లుంది.“కనిష్ట ప్రభుత్వం,గరిష్ట పాలన” అనే కేంద్ర ప్రభుత్వ నినాద స్పూర్తికి ఇది వ్యతిరేకం.  

ప్రస్తుతమున్న రిజర్వు బ్యాంకు స్వరూపాన్ని మార్చాల్సిన అవసరం లేదని, నిజ ఆర్ధిక వ్యవస్థను శాసించే ద్రవ్య రంగ వ్యవస్థనే మార్చాలని కొందరు ఆర్ధిక వేత్తలు అభిప్రాయ బడుతున్నారు.

1934 నుండి వున్న చట్టాలు కాలం చెల్లినవని,వాటిని మార్చే ప్రక్రియలో కాల పరీక్షకు తట్టుకొని నిలబడ్డ చట్టాల స్పూర్తి కి భంగం కలిగేటట్లు కమిషన్  వ్యవహరించిన దృష్టాంతాలు వెలుగులోకి వచ్చాయి. అందువల్ల భారత ద్రవ్య స్మృతి ముసాయిదాను పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కి నివేదింపబండి అందులోని ప్రతి క్లాజును క్షుణ్ణంగా పరిశీలించాలని కాల పరీక్షకు నిలబడ్డ కొన్ని చట్టాల స్పూర్తిని నిలబెట్టాలని  కొంత మంది నిపుణులు అభిప్రాయ బడుతున్నారు.



‘అన్ని సంస్థలలో విధానపరమైన అంశాలలో  ప్రభుత్వం జోక్యం చేసికోవాలనే తహ తహ  యొక్క ముసుగు తొలగటం మొదలైంది. భారత ఫిలిం మరియు టెలివిజన్ సంస్థ, భారతీయ చరిత్ర పరిశోధన సమితి, రిజర్వ్ బ్యాంకు లలో చోటుచేసికుంటున్న  పరిణామాలను ఈ కోణంలోనే చూడాలి. దేశాభ్యుదయానికి వెన్నుదన్నుగా నిల్చిన సంస్థలను నాశనం చేయాలనుకునే బృహత్తర ప్రణాళికలో పై పరిణామాలు ఒక భాగం మాత్రమే. ప్రభుత్వాలకు చేతి వాటంగా వుండే సంస్థలు, వాళ్ళ కార్యాలు  చక్క దిద్దుకునే వరకు బాగానే వుంటాయి కాని జాతి సంక్షేమాన్నినిలబెట్టలేవు’.
కొండముది లక్ష్మీప్రసాద్