Thursday, October 17, 2013

ఔషధ ప్రయోగార్ధుల పరిరక్షణ సాధ్యమేనా?

మన దేశంలొ ఔషధ ప్రయోగ బాధితులకు నష్టపరిహారం చెల్లించడానికి వీలుకల్పించే నిర్దిష్టమైన నియమ నిబంధనలు 2012 వరకు అమలులో లేవు. దీని పర్యవసానంగా నష్ట పరిహారం చెల్లించే తంతు కాంట్రాక్ట్ పరిశోధనా సంస్థల ఇష్టా రాజ్యమైంది. దీనికి వ్యతిరేకంగా ఔషధ ప్రయోగ బాధితులకు సక్రమమైన న్యాయం జరిపించటానికి గాను దేశంలోని అనేక సామాజిక సంస్థలు,కార్యకర్తలు,ప్రజా సంఘాలు,మేధావులు అనేక పద్ధతులలొ అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.దీని ఫలితంగా బాధితులకు నష్ట పరిహారం చెల్లించే దిశలొ కొద్ది పురోగతి లభించింది.కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లించేందుకు కొన్ని మార్గదర్శకాలను ప్రతిపాదించింది. నష్ట పరిహారాన్ని లెక్కించేందుకు బాధితుడి వయస్సు,ఆదాయం, బాధితుడి అస్వస్థత తీవ్రతలను ప్రధానంగా పరిగణలొనికి తీసికొని ఒక ఫార్ములాను రూపొందించింది.

ఔషధ ప్రయోగ సంస్థల ఆగడాలను అరికట్టటానికై సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారించబడుతుంది.ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీం కొర్టుకు సమర్పించిన అఫిడవిట్ లొ ఆసక్తి కలిగించే అనేక అంశాల్ని పేర్కొంది.2005నుండి2012 మధ్య కాలంలొ నూతన ఔషధాల ఆవిష్కరణలకై 475 ఔషధ ప్రయోగాలు ఆమోదింపబడ్డాయని, వీటి కారణంగా 11,972మంది(చనిపోయినవారు కాకుండా) అనేక ప్రతికూల పరిణామాలకు గురైనారని,అందులో 506మంది ప్రత్యక్షంగా ఔషధ ప్రయోగాలతో తీవ్రమైన ఇబ్బందులు అనుభవించారని అందులొ పేర్కొనడం జరిగింది.ఇదే కాలంలో 2644 మంది ప్రయోగాల ఫలితంగా హానికి గురికావటమో లేదా మరణించడమో జరిగితే,అందులో 44 మందికి మాత్రమే  నష్ట పరిహారం చెల్లించబడిందని కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్ లో తెలియచేసింది. ఇది ఇలావుండగా, చెల్లించిన నష్ట పరిహారం సగటున  రూ.2.2లక్షలకు మించి లేదు.అరుదైన సందర్భాలలో చెల్లించిన పరిహారం గరిష్టంగా రూ.20లక్షల లొపే వుంది. రికార్డులకు నమోదుకాకుండా ఔషధ ప్రయోగాలలో మరణించిన వారు లేదా తీవ్ర అస్వస్థతకు గురై నరక యాతనలు అనుభవించినవారి సంఖ్య అనేక రెట్లు వుంటుంది.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ చే నియమింపబడ్డ ప్రొఫెసర్ రంజిత్ రాయ్ చౌదురి నాయకత్వం లోని నిపుణుల కమిటీ,హద్దూఅపు లేకుండా సాగుతున్న ఔషధ ప్రయోగాలను నియంత్రిస్తూ నియమనిబంధనల నియమావళిని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఔషధ ప్రయోగ కెంద్రాలు, వాటిని పర్యవేక్షించే ఎథిక్స్ కమిటీలు తప్పనిసరిగా ప్రభుత్వం నుండి ప్రత్యేక గుర్తింపు పొందాలని,ప్రయోగార్ధుల నుండి "పూర్తి అవగాహన సమ్మతి"(ఇన్ ఫాండ్ కన్సెంట్)ని స్వీకరించే ప్రక్రియను ఆడియో వీడియోల ద్వారా రికార్డు చేయాలని స్పష్టపరిచింది. ఔషధ ప్రయోగ బాధితుడికి ఏ విధమైన ఆరోగ్యపరమైన హాని జరిగినా లెదా మరణం సంభవించినా ఆ బాధితుడి గ్రూపు స్వభావంతో నిమిత్తం లేకుండా అనివార్యంగా నష్ట పరిహారం చెల్లించాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది.ఈ పరిహారాన్నిస్పాన్సర్డ్ కంపెనీ పూర్తిగా భరించాల్సివుంటుంది. ఔషధ ప్రయోగాలతో సంబంధం లేకుందా సంభవించే ఆరోగ్యహాని/మరణాలకు పరిహారం చెల్లించాల్సిన అవసరం లెదని నిపుణుల కమిటీ తేల్చిచెప్పింది.

మరోవైపు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పరిశీలనలొ వున్న సమయంలొ నిపుణుల కమిటీ సిఫార్సులపై పారిశ్రామిక వర్గాలు ధ్వజమెత్తుతున్నాయి.ఈ సిఫార్సులు ఆచరణయోగ్యం కావని,ఇవి అమెరికా,యూరప్ దెశాలలొని నిబంధనల కంటే కఠినంగా వున్నాయని,వీటి అమలుకు ప్రయత్నిస్తే 500మిలియన్ డాలర్ల ఔషధ ప్రయోగ వాణిజ్యం భారిగా దెబ్బతింటుందని,భవిష్యత్తులొ వచ్చే సంక్లిష్టమైన వ్యాధులకు అవసరమైన ఔషధాల అవిష్కరణలు ముందడుగు వేయలేక  ఆరోగ్య పరిరక్షణలొ మనదేశం వెనుకపడుతుందని హెచ్చరిస్తున్నాయి. నయావుదారవాద విధానాలు,పేటెంట్ చట్ట సవరణల నేపధ్యంలో ఔషధ ప్రయోగాలపై వున్న అనేక నియంత్రణలను ఎత్తివేయటం, సున్నితమైన ఈ రంగంలో ప్రైవేట్ రంగ ఆధిపత్యం పెంచడంతో లాభార్జనకు పెద్దపీట వేయబడింది. గినియా పందుల కంటే హీనంగా ఔషధ ప్రయోగార్ధుల ప్రాణాలతో చెలగాటమాడిన కొన్ని కాంట్రాక్ట్ ఔషధ ప్రయోగ సంస్థల ఆగడాలు మరువలేనివి. ఔషధ ప్రయోగాలపై,బాధితుల ఆవేదనలపై అధ్యయనానికి నియమింప బడ్డ పార్లమెంటరీ కమిటీ ఈ వాస్తవాల్ని రూఢీ చెసింది. ఔషధ రంగంలో నూతన ఆవిష్కరణలు అత్యావశ్యకమన్న వాదన అర్ధవంతమైనదే. అందుకు విక్షణా రహితంగా ప్రజల విలువైన ప్రాణాల్ని పణంగా పెట్టలేము. విదేశీ మారక ద్రవ్యార్జన ధ్యేయంగా నియంత్రణలు లెని ఔషధ ప్రయోగాల్ని కొనసాగించలేం. ప్రజల ఒత్తిడి,ప్రజా సంస్థల సహకారం లేకుంటే ప్రయోగార్ధుల పరిరక్షణ ప్రశ్నార్ధకమే.