Saturday, February 21, 2015

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పైనే ఆధారపడితే------

విదేశీ  ప్రత్యక్ష పెట్టుబడుల పైనే  ఆధారపడితే------
-సి. పి. చంద్ర శేఖర్  
పారిశ్రామిక ప్రగతిలో బ్రెజిల్, దక్షిణ కొరియా లాంటి దేశాల కంటే వెనకబడి ఉన్నామన్న  వాస్తవాన్ని గుర్తించిన ఎన్డియే ప్రభుత్వం తన ఆర్ధిక వ్యూహానికి కేంద్రంగా తయారీ రంగ పునరుద్దరణను ఎన్నుకుంది. ఈ గమ్యాన్ని సాధించటానికి అనుసరించాల్సిన విధానం 'భారత్ తయారి' నినాదంగా రూపొందింప బడి, భారత్ వచ్చి,విదేశి మార్కెట్ల కోసంగా ఎగుమతుల్ని భారత్ లో తయారు చేయడానికి గాను అవసరమైన  పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశ్యంగా ప్రతిపాదింప బడింది . ఈ విధానం విజయవంత మైతే,  ప్రభుత్వ పాత్ర  'విధానవాతావరణాన్ని' మలిచేందుకు, ఆ రకంగా వచ్చే పెట్టుబడులకు అవసరమైన మౌలిక పరిస్థితుల కల్పన మేరకే   పరిమితమౌతుంది. 

ఈ వ్యూహంలో నూతనత్వం ఏమి లేదు . గత నాలుగు దశాబ్దాలుగా అనేక వర్ధమాన దేశాలలో ప్రయోగాత్మకంగా నిర్వహింప బడుతున్నప్రక్రియే ఇది. . అందులో కొన్నిదేశాలు  తప్పించి , అత్యధిక దేశాలలో ప్రయోగాలు విఫలమైనవే. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న తరుణం లో  పై విధాన ప్రకటన లోని విజ్ఞత ప్రశ్నార్ధకమే. ఇంకా చెప్పుకుంటే, మన  దేశీయ మార్కెట్టు పై పూర్తి అవగాహన వుంటే, విదేశి పెట్టుబడి దారులు మన దేశం వస్తే,  వాళ్ళు ఎగుమతుల మార్కెట్ల కంటే దేశీయ మార్కెట్లలోనే పెట్టుబడులు పెట్టె  అవకాశాలు మెరుగ్గా వున్నాయని గ్రహించ కలుగుతాం. 

భారత దేశ గత అనుభవాన్నే పరిశీలిద్దాం. భారత దేశం లో నమోదు కాబడ్డ వివిధ కంపెనీల ఆస్తులూ అప్పులు మరియు మన దేశంలో నిర్వహంపబడుతున్న విదేశి ప్రత్యక్ష పెట్టుబడుల ఆర్ధిక లావాదేవీల వివరాలను రిజర్వు బ్యాంకు ఈ మధ్యకాలంలో తెప్పించుకుంది. 2011 నుండి అన్ని కంపెనీలు తాము పొందుతున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, అలాగే తాము విదేశాలలో పెట్టుతున్న పెట్టుబడులకు  సంబందించిన ఆస్తులు అప్పుల  వివరాలను రిజర్వుబ్యాంకు కు సమర్పించవలసి వున్నది. ఈ వివరాలను విశ్లేషిస్తే విదేశీ పెట్టుబడుల రంగంలో విదేశి కంపెనీల ఆధిపత్యం గణనీయంగా పెరిగిపోతున్నట్లు అర్ధమౌతున్నది..ఫైనాన్సు కంపెనీల ఈక్విటీ షేర్లలలో 63.9 శాతం. ఫైనాన్సేతర కంపెనీల ఈక్వీటీ షేర్లలలో 74.5 శాతం విదేశి ఆధిపత్యంలో  వున్నట్లు తెలుస్తున్నది. 

తయారీ రంగంలో మార్చి 2013 అంతానికి అప్పులు తీసివేయగా మిగిలిన మూల పెట్టుబడుల మొత్తం విలువలో (మార్కెట్ విలువ )విదేశి ప్రత్యక్ష పెట్టుబడుల ఈక్విటీ షేర్ల విలువ 59. 4 శాతంగా వున్నది . అత్యధికంగా వున్న ఈ విదేశి పెట్టుబడుల ఆధిపత్యం స్టాక్ మార్కెట్ లో ప్రమాదకరమైన  ఆస్తుల ధరల ద్రవ్యోల్బణానికి దారితీసే పరిణామం  పొంచి వుంది. విదేశి మదుపుదారులు, ఈక్విటీ లలో ఆధిపత్యం కలిగి వుండటమే కాకుండా కంపెనీల ఆస్తులపై యాజమాన్య నియత్రణ  హక్కులు పొందగలుగు తున్నారు. 

 విదేశీ కంపెనీలను భారత్ కు వచ్చి తమ పెట్టుబడులతో ఈ దేశాన్ని తయారి రంగ కేంద్రం గా మలచమని భారత ప్రభుత్వం వాళ్ళకు మోకరిల్లుతున్న నేపధ్యంలో ఇప్పటికే ఈ కంపెనీలు భారత్ తయారి రంగంలో పొందిన అనుభవాల్నిసమీక్షించుకుంటె ఉపయుక్తంగా వుంటుంది.  మన దేశంలో విదేశీ పెట్టుబడులు  తయారీ, సేవా రంగాలలో స్పష్టంగా ఆధిపత్యాన్ని కలిగి వున్నాయి. తయారీ రంగం ఈక్విటిలో లో ప్రస్తుత మార్కెట్ ధరల్లో  విదేశీ పెట్టుబడులు 50శాతం దాకా వుండగా, సేవా రంగంలో ప్రత్యేకించి ఫైనాన్షియల్ మరియు వ్యాపార సేవల్లో 40శాతం దాక ఆధిపత్యం కలిగివున్నాయి.  తక్కువ వేతనాలతో, నైపుణ్యం మరియు ఇంగ్లీష్ మాట్లాడ గలిగే కార్మిక వర్గం వున్న రంగాలలోకి విదేశీ కంపెనీలు రాగలగడం సహజంగా భారత్ కు ప్రయోజనకరంగా వుంటుందని ప్రభుత్వం భావిస్తుంది.   

సరళీకరణ విధానాలు దేశీయ కంపెనీలను, వాటి సామర్ధ్యాలను అంతర్జాతీయ స్థాయి కి ప్రదర్శించి వాటిని అంతర్జాతీయ పోటికి తగ్గట్టు నిలబెడతాయని ప్రచారం జరిగినప్పటికీ, భారత దేశంలోని తయారి  రంగంలో వున్న విదేశీ  సబ్సిడరీ కంపెనీలు భారత్ ను  ఎగుమతుల ప్రధాన వేదికగా వాడటంలేదు . మొత్తం ఎగుమతులలో విదేశీ కంపెనీల ఎగుమతులు 32శాతంగా వున్నాయి. ఇదికూడా సమాచార పౌర సంబంధ రంగం ఈ కంపెనీలలో 17శాతం వుండి, వాటి అమ్మకాలలో 70శాతం ఎగుమతులు వున్నందు వల్ల సాధ్యమైంది. తయారీ రంగంలో వున్న అత్యధిక విదేశీ కంపెనీలు దేశీయ మార్కెట్లలోనే పెట్టుబడులు పెడుతున్నాయి. చెల్లింపుల సమతుల్యతా దృక్పధం  నుండి ఈ పరిణామాల్ని పరిశీలిస్తే ఆసక్తి  కరంగానే వుంటుంది. 

ప్రభుత్వేతర, ఫైనాన్సు యేతర 917 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కంపెనీల వ్యాపార గణాంకాలు 2015 జనవరిలో విడుదల చేయబడ్డాయి. వీటిని పరిశీలిస్తే 2010-11నుండి 2012-13 వరకు మూడు సంవత్సరాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి కంపెనీలు సగటున 22శాతం విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి లేని కంపెనీలు 26శాతం  విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించాయి. విదేశీ పెట్టుబడి కంపెనీల కంటే విదేశీ పెట్టుబడి లేని కంపెనీలే ఎగుమతుల రంగంలో ముందువున్నాయ్. 

భారత తయారీ రంగం లో పెట్టుబడి పెడుతున్న విదేశీ కంపెనీల ప్రవర్తనలో మౌలిక మార్పు తేగలిగే విధానాలను ప్రభుత్వం అనుసరించక పొతే ఎగుమతి ఆధారిత ఆర్ధిక విజయం అసాధ్యమే. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మాంద్యం నుండి బయట పడినా, ఈ వాస్తవంలో మార్పు వుండదు. 

(4.. 2. 2015 'హిందూ' పత్రిక లోని వ్యాసానికి తెలుగు అనువాదం )