Wednesday, December 29, 2010

ద్రవ్య సరఫరా విధానం- ధ్యేయాలు , మార్గాలు

డబ్బు (కరెన్సీ) సరఫరాను, నిధుల లభ్యతను, దాన్ని ప్రభావితం చేసే వడ్డీ రేట్లను, మారకపు ద్రవ్య విలువలను ద్రవ్య సరఫరా విధానం ప్రభావితం చేస్తుందని, ఈ విధానం డబ్బు చలామణి, సరఫరాలను నియంత్రిస్తుందని చెప్పుకున్నాం. ద్రవ్య సరఫరా విధానంలో ప్రధానంగా మూడు ప్రాథమిక అంశాలున్నాయి. అవి 1. ద్రవ్య సరఫరా విధాన ధ్యేయాలు, 2) ద్రవ్య సరఫరా ప్రసార మార్గాలు, 3) నిర్వహణ పద్ధతులు - లక్ష్యాలు, సాధనాలు.

1) ద్రవ్య సరఫరా విధాన ధ్యేయాలు

ధరల స్థిరీకరణ, ఆర్థిక వృద్ధి సంప్రదాయ ధ్యేయాలుగా ప్రపంచంలోని వివిధ కేంద్ర బ్యాంకులు కలిగిఉన్నాయి. వీటి సాధనలో మారకపు రేటు స్థిరీకరణ, ద్రవ్య వ్యవస్థ స్థిరీకరణల పాత్ర ప్రముఖంగా ముందుకొస్తుంది. ఈ ధ్యేయాలన్నింటిని అన్ని కాలాలలో సాధించడం, నిర్వహించటం సాధ్యమయ్యే పని కాదు. ఈ ద్రవ్య సరఫరా విధాన ధ్యేయాలు దేనికవి స్వతంత్రంగా లేవు. ఒకదానితో మరొకటి పెనవేసుకొని ఉన్నాయి. ఉదాహరణకు అభివృద్ధి చెందే ఆర్ధిక వ్యవస్థలలో అతిస్వల్ప ద్రవ్యోల్బణం(తక్కువ ధరలు), అతి స్వల్ప నిరుద్యోగ రేటు(అత్యధిక ఉద్యోగాలు) ఉండాలని సాధారణంగా భావిస్తార. కానీ కొందరు నిపుణుల అభిప్రాయంలో అతి స్వల్ప ద్రవ్యోల్బణం, అతి స్వల్ప నిరుద్యోగ రేటు కలిసి సహజీవనం చేయలేవని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని కుదించే చర్యలలో భాగంగా వేతనాల తగ్గింపు, ఉపాధి కుదింపుతో నిరుద్యోగ రేటు పెరగటం అనివార్యమైందని వారి అభిప్రాయం. అదే సందర్భంలో ఉపాధి పెంపు మార్కెట్‌లో డబ్బు చలామణిని పెంచుతూ, సరుకుల ధరలను పెంచుతుందని, ఇది అధిక ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని వారు వాదిస్తున్నారు. అందువల్ల ద్రవ్య సరఫరా సుస్థిరతకు పాటించాల్సిన వివిధ చర్యలలో రాజీ అనివార్యమౌతుంది. దీన్ని, పెట్టుబడిదారీ వ్యవస్థలో ద్రవ్య సరఫరా విధానం ప్రత్యేక లక్షణంగా చూడాల్సి ఉంటుంది. ద్రవ్య సరఫరా విధాన ధ్యేయాలన్నింటిని ఏక కాలంలో సాధించాలనే ప్రయత్నాలలో ఎదురౌవుతున్న అనేక అవరోధాల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు ''ధరల స్థిరీకరణ'' ధ్యేయంపై ఏకాభిప్రాయాన్ని కలిగివున్నాయి. ప్రపంచంలో ప్రధాన కేంద్ర బ్యాంకులైన యూరోపియన్‌ కేంద్ర బ్యాంకు, బ్యాంకు ఆఫ్‌ ఇంగ్లాండ్‌, బ్యాంకు ఆఫ్‌ జపాన్‌లు ధరల స్థిరీకరణను ద్రవ్య సరఫరా విధానంలో ఏకైక ధ్యేయంగా పెట్టుకున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంకు అయిన ఫెడరల్‌ రిజర్వ్‌ బహుముఖ ధ్యేయాలను కలిగివుంది. అవి 1) ధరల స్థిరీకరణ 2) గరిష్ట ఉపాధి రేటు 3) దీర్ఘ కాలం కొనసాగగలిగే అతి స్వల్ప వడ్డీ రేట్ల నిర్వహణ. 1990సం|| తరువాత కాలంలో వివిధ దేశాలలో ఎదురైన వివిధ ద్రవ్య సంక్షోభాల అనుభవంతో ప్రపంచ దేశాలన్నింటిలోని కేంద్ర బ్యాంకులకు ''ద్రవ్య వ్యవస్థ సుస్థిరత''ను సాధించడం పెనుసవాలైంది.

2). ద్రవ్య సరఫరా ప్రసార మార్గాలు (మానిటరీ ట్రాన్స్‌మిషన్‌ ఛానల్స్‌) - ద్రవ్యోల్బణ అదుపు, ఆర్థిక వృద్ధిని సాధించేందుకు ద్రవ్య సరఫరా విధానంలో చేయాల్సిన మార్పుల మార్గాలను ద్రవ్య సరఫరా ప్రసార మార్గాలు అంటారు. అవి 1) పరిమాణ మార్గం (డబ్బు సరఫరా, రుణాలు) 2) వడ్డీరేట్ల మార్గం 3) మారకపు రేట్ల మార్గం. ఒక ఆర్థిక వ్యవస్థలో పై మార్గాలు ఏ పద్ధతిలో పనిచేస్తాయన్నది ఆ వ్యవస్థ అభివృద్ధి స్థాయిపై, ద్రవ్య వ్యవస్థ నిర్మాణ పటిమపై ఆధారపడి ఉంటుంది.

1) పరిమాణ మార్గం (క్వాంటం ఛానల్‌) - అధిక ధరలను అదుపు చేయాల్సి వచ్చినప్పుడు నిధుల లభ్యతను, బ్యాంకు రుణాలను తగ్గించాల్సి ఉంటుంది. ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు డబ్బుల లభ్యతను పెంచాల్సి ఉంటుంది. ఇందుకోసం నిధుల లభ్యతను, రుణాలను ముమ్మరం చేయాల్సి ఉంటుంది.

2) వడ్డీరేట్ల మార్గం (ఇంటరెస్ట్‌ రేట్‌ ఛానల్‌) - ద్రవ్యోల్భణ అదుపుకు వడ్డీ రేట్లు పెంచడం, ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులలో వడ్డీ రేటు తగ్గించడం ఇందుకు ఉదాహరణ. బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రధాన వనరుగా ఉన్న ఆర్థిక వ్యవస్థలలో రుణ పాత్ర కీలకంగా ఉంటూనే, వడ్డీ రేట్ల మార్గం అందుకు తోడవుతుంది. ఇటీవల అమెరికాలో నెలకొన్న గృహరుణ బుడగలో వడ్డీరేట్ల మార్గం కీలక పాత్ర వహించింది. 9/11 తీవ్రవాదుల చర్యలకు కకావికలైన ఆర్థిక వ్యవస్థ రక్షించుకోవడం కోసం అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల తగ్గింపుకు పూనుకోవడం, గృహ రుణ విజృంభణకు బాటలు వేయడం, అంతిమంగా అమెరికా ద్రవ్య సంక్షోభానికి దారితీయటం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవడం సముచితంగా ఉంటుంది.

3) మారకపు రేట్ల మార్గం (ఎక్సేంజ్‌ రేట్‌ ఛానల్‌)

ప్రపంచీకరణ నేపథ్యంలో స్వేచ్ఛా ఆర్థిక వ్యవస్థలలో మారకపు రేట్ల మార్గం కీలకంగా మారింది. మహామాంద్యం నుండి బయట పడటానికి, విదేశాలకు ఎగుమతులు పెంచుకోవటానికి మారకపు రేటు ప్రాముఖ్యత పెరిగింది. ప్రస్తుతం అమెరికా, వివిధ దేశాలతో నెరుపుతున్న కరెన్సీ యుద్ధంలో మారకపురేట్ల మార్గం పాత్ర కీలకమైంది.

పై మార్గాలన్నీ సర్వకాల సర్వావస్థలలో విశిష్టమైనవేవి కావు. అత్యుత్తమంగా భావిస్తున్న మార్గాలు అతి స్వల్ప కాలంలో అవరోధంగా మారవచ్చు. వాటి పని తీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ, సవరణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అందుకోసం కేంద్ర బ్యాంకుల త్రైమాసిక సమీక్షలు అధిక ప్రాధాన్యతను కల్గివున్నాయి. ద్రవ్య సరఫరా విధాన ధ్యేయాలనన్నింటిని కేంద్ర బ్యాంకులు నేరుగా ఏకబిగిని సాధించలేవు. అందుకోసం మధ్యకాల లక్ష్యాల్ని నిర్దేశించుకోవల్సివుంటుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ వై.వి.రెడ్డి వివరిస్తూ, ''చిన్న ఆర్థిక వ్యవస్థలలో స్వల్ప ద్రవ్యోల్బణ సాధన కంటే మారకపు రేటును మధ్య కాల లక్ష్యంగా ఎంచుకోవచ్చు. కానీ ఈ ప్రక్రియ స్వతంత్ర వడ్డీ రేట్ల విధానాన్ని హరిస్తుంది. ద్రవ్య సరఫరా విధానంలో స్థిర మారకపు రేటు, బహిరంగ పెట్టుబడి ఖాతా, స్వతంత్ర ద్రవ్య సరఫరా విధానం కలసి మనలేవు'' అని అన్నారు. ఆయన పరిశీలనలో ద్రవ్య సరఫరా విధానంలోని వైరుధ్యాలు తేటతెల్లమవుతున్నాయి.

ముగింపు

1990ల నుండి ద్రవ్య సరఫరా విధానంలో పారదర్శకతకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పెరిగింది. దీనిలో భాగంగా ప్రపంచ దేశాలలో స్వల్ప ద్రవ్యోల్భణ లక్ష్యాన్ని నిర్దేశించుకొనే ధోరణి కూడా పెరిగింది. ఇది మధ్య కాల లక్ష్యంగాను, అంతిమ లక్ష్యంగాను మారినప్పుడు, ద్రవ్యోల్బణ అంచనాల తయారి ప్రాముఖ్యతను పొందింది. ద్రవ్యోల్బణ అదుపు లక్ష్యాన్ని చేరాలంటే కేంద్ర బ్యాంకులకు నిర్వహణ స్వేచ్ఛను గాని, స్వతంత్ర ప్రతిపత్తిని గాని ఇవ్వాల్సి ఉంటుంది. దీనితోపాటు అస్థిర విదేశీ మారకపు రేట్ల పరిస్థితులను కల్పిస్తూ, అభివృద్ధి అయిన ద్రవ్య వ్యవస్థ మార్కెట్‌లను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. దీని కొనసాగింపుగా ద్రవ్య విధాన(ఫిస్కల్‌ పాలసీ) ఆధిపత్యాన్ని తొలగింపు అనివార్యమౌతుంది. అంతిమంగా ఈ చర్యలన్నీ ఆర్థిక వ్యవస్థలపై అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యాన్ని పెంచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Sunday, December 19, 2010

ద్రవ్య సరఫరా విధానం పరిచయం - చారిత్రక నేపధ్యం


సమకాలీనకాలంలో స్థూలఆర్థికవ్యవస్థ నిర్వహణకు ''ద్రవ్య సరఫరా విధానం''(మానిటరీ పాలసీ) ప్రధాన సాధనమైంది. ద్రవ్య (డబ్బు) ఆర్థిక వ్యవస్థ అభివృద్ధితో పాటుగా శతాబ్దాలుగా ద్రవ్య సరఫరా విధానం వివిధ దశలలో పరిణామం చెందింది. ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యం పెరిగిన మేరకు ఆర్థిక వ్యవస్థలలో ద్రవ్య సరఫరా విధాన పాత్ర కీలకమైంది. ఇదే సందర్భంలో ఈ మధ్య కాలంలో సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభం తదననంతరం అనేక దేశాలలో సంక్షోభ పరిష్కారానికి ద్రవ్య సరఫరా చర్యలు చేపట్టటం చూస్తున్నాం. ఉద్దీపన పథకాలు, నిధుల లభ్యత (లిక్విడిటి) చర్యలు అందులో భాగమే. రిజర్వ్‌ బ్యాంకు ప్రకటించిన రూ. 48 వేల కోట్ల నిధుల లభ్యత విధానం తాజా ఉదాహరణ.

ద్రవ్య విధానం, ద్రవ్య సరఫరా విధానం

ఆర్థిక వ్యవస్థ నిర్వహణకు ద్రవ్య విధానం (ఫిస్కల్‌ పాలసీ), ద్రవ్య సరఫరా విధానం (మోనెటరీ పాలసీ) విభిన్న కోణాలలో ప్రధాన భూమికలను నిర్వహిస్తున్నాయి. ద్రవ్య విధానం ప్రభుత్వ వ్యయ అంచనాలను, వసూలు చేయాల్సిన పన్నుల అంచనాలను నిర్ణయిస్తూ, ప్రభుత్వ రుణాల అంచనాలను ప్రభావితం చేస్తున్నది. ఇది అంతిమంగా డబ్బు గిరాకిని నియంత్రిస్తున్నది. ద్రవ్య సరఫరా విధానం డబ్బు (కరెన్సీ) సరఫరాను, నిధుల లభ్యతను, దాన్ని ప్రభావితం చేసే వడ్డీ రేట్లను, మారకపు ద్రవ్య విలువలను ప్రభావితం చేస్తున్నది. ఈ విధానం డబ్బు చలామణి, సరఫరాలను నియంత్రిస్తుంది. ద్రవ్య విధానం, ద్రవ్య సరఫరా విధానాలలో ఏది ముఖ్యమైనదన్న అంశంపై అనేక వాదోపవాదాలు కొనసాగుతున్నాయి.

కరెన్సీ ఆవిర్భావం

మార్కెట్‌లతో పాటుగా డబ్బు (కరెన్సీ) ఆవిర్భవించింది. వాణిజ్య కార్యకలాపాలను వేగవంతం చేయడంలో డబ్బు పాత్ర కీలకమైనది. ఈ డబ్బు బంగారం, వెండి లాంటి అతి విలువైన లోహాల రూపంలో ఉండేది. వీటి చలామణి, ప్రాచుర్యం పెరగడంతో అధిక మొత్తాలలో నాణేలను ఉత్పత్తి చేయడం కోసం వీటిని కల్తీ చేసి (డిబేస్‌మెంట్‌), మిశ్రమ లోహాలతో నాణేలు తయారీ మొదలైంది. ఆ తరువాత నాణేల స్థానంలో ఆయా దేశాల బంగారం, వెండి నిల్వలతో సమానమైన అధికారిక కాగితపు డబ్బు (ఫియెట్‌ మనీ) అములులోనికి వచ్చింది. 17వ శతాబ్ద నుండి సామ్రాజ్యవాద దేశాలైన ఫ్రాన్స్‌, బ్రిటన్‌, అమెరికా లాంటి దేశాలలో యుద్ధ అవసరాలకోసం బంగారం, వెండి నిల్వలతో నిమిత్తం లేని అధికారిక కాగితపు డబ్బు ముద్రణ అధికమైంది. ఈ విధానం ఆయా ప్రభుత్వాల ఆధీనంలో ఉండేది.

కేంద్ర బ్యాంకుల ఏర్పాటు

ద్రవ్య సరఫరా విధానం వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల అధీనంలో ఉంటుందని సాధారణంగా అనుకుంటుంటాం. కాని 20వ శతాబ్దం వరకు అనేక దేశాలలో ఈ బాధ్యతను అయా దేశాల కోశాగారాలు (ట్రెజరీలు) నిర్వహించేవి. ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌లలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకులకు ఈ బాధ్యత అప్పచెప్పబడింది. మొదటి తరం కేంద్ర బ్యాంకులు స్వీడన్‌లో 1664, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ 1694, ఫ్రాన్స్‌లో 1800, నెదర్లాండ్స్‌లో 1818లలో ఆవిర్భవించాయి. మార్కెట్‌ల రుణాలు, ప్రభుత్వ రుణాల కొనుగోలు కోసం, వాణిజ్య అవసరాల మద్దతు కోసం కొద్ది మంది ప్రయివేటు పెట్టుబడిదారులతో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ ఏర్పాటు చేయబడింది. తొలిరోజుల్లో ద్రవ్య వ్యవస్థ అభివృద్ధికి ఈ బ్యాంకు స్థాపన పునాదులు వేసింది. ఈ బ్యాంకు ఇతర వాణిజ్య బ్యాంకుల నుండి డిపాజిట్లను స్వీకరించటం, రుణాలనివ్వటం నిర్వహించింది. దాని దగ్గర అతి పెద్ద సంఖ్యలో పోగైన బంగారం నిల్వలతో పాటు బ్యాంకింగ్‌ రంగంలో అది పెంచుకున్న గుత్తాధిపత్యంతో అంతిమ రుణదాతగా (లెండర్‌ ఆఫ్‌ ల్యాస్ట్‌ రిసార్ట్‌) పరిణామం చెంది అనేక ఆర్థిక కల్లోలాలలో నిధుల లభ్యతను అందించింది. ప్రస్తుత కాలంలో అనుసరిస్తున్న ద్రవ్య సరఫరా విధాన సాధనమైన ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్‌లు (బహిరంగ మార్కెట్‌ కార్యకలాపాలు) - ఒ.యం.యు.ను బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ అప్పట్లోనే చేపట్టింది. ప్రభుత్వ రుణ పత్రాలను, ఇతర ఆర్థిక సంస్థల రుణ పత్రాలను హామీగా ఉంచుకొని వాటికి రుణాలను అందించేది. దీనిపై వడ్డీని వసూలు చేసేది. ఈ వడ్డీ రేటును కొన్ని దేశాలలో డిస్కౌంట్‌ రేటుగా పిలుస్తున్నారు.

ఈ రకమైన వడ్డీ రేటును నియంత్రిస్తు బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ బ్రిటీష్‌ రుణ వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేయగలిగింది. అదే సందర్భంలో స్వల్ప కాలిక నిధులను ఆకర్షిస్తూ, అందించేందుకు ప్రతిపాదిస్తూ వివిధ దేశాల రుణ వ్యవస్థలను ఆ కాలంలో ప్రభావితం చేసింది. రెండవ తరం కేంద్ర బ్యాంకులుగా స్విట్జర్లాండ్‌లో 1907, అమెరికాలో ఫెడరల్‌ రిజర్వ్‌ పేర 1913లలో ఏర్పడ్డాయి. అభివృద్ధి చెందిన దేశాల బాటలో బ్రిటీష్‌ వలస దేశాలలో, మధ్య ఐరోపా దేశాలలో, లాటిన్‌ అమెరికా దేశాలలో కేంద్ర బ్యాంకులు విస్తరించాయి.

ఆనాటి కేంద్ర బ్యాంకుల అనుభవాలు

బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ లాంటి కేంద్ర బ్యాంకులు ప్రజల అవసరాలతో నిమిత్తం లేకుండా వాణిజ్య దృక్పథంతో వ్యవహరించే క్రమంలో ప్రజల నుంచి పెరిగిన వత్తిడి మేరకు ప్రజా అవసరాల దృక్పథాల్ని పెంచుకోవాల్సి వచ్చింది. 19వ శతాబ్దం చివరి దశకం నుండి 20వ శతాబ్ద రెండవ దశకం వరకు కేంద్ర బ్యాంకులు బంగారం ప్రమాణాన్ని పాటించేవి. 18,19 శతాబ్ధాలలో బంగారం, వెండి నిల్వలతో నిమిత్తం లేని డబ్బు చెలామణితో పెరిగిన అత్యధిక స్థాయి ద్రవ్యోల్బణంతో ఈ చర్య అనివార్యమైంది. ఒక దేశంలోని డబ్బు చలామణి విలువ మొత్తం, ఆ దేశంలోని బంగారం నిల్వలతో సమానంగా ఉండటమే బంగారం ప్రమాణం అంటారు. ఇది వలసవాదం నాటి ''బంగారం ప్రమాణం'' గా పరిగణించాలి.

1913లో అమెరికాలో ఫెడరల్‌ రిజర్వ్‌ ఏర్పడిన తరువాత వివిధ ఆర్ధిక ఒడుదుడుకులు సందర్భంగా ఆ బ్యాంకు చేపట్టిన ద్రవ్య సరఫరా చర్యలు వికటించి, అంతిమంగా మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఏర్పడ్డ మహామాంద్యం కాలంలో అనేక బ్యాంకులు దివాళా తీసిన క్రమంలో, ఫెడరల్‌ రిజర్వ్‌ ద్రవ్య సరఫరా విధాన బాధ్యతను అమెరికా ట్రెజరీకి అప్పచెప్పింది. మళ్ళీ 1951 వరకు తిరిగి ఆ బాధ్యతను పొందలేకపోయింది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా స్థాపన

బ్రిటీష్‌ వలస రాజ్యంగా ఉన్న భారతదేశంలో ద్రవ్య వ్యవస్థ సుస్థిరత కోసం, 1935లో భారత కేంద్ర బ్యాంకుగా ''రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా'' ప్రయివేట్‌ రంగంలో ఆవిర్భవించింది. అప్పటి వరకు ద్రవ్య సరఫరా విధాన అవసరాలలో కొన్నింటిని బ్రిటీష్‌ సామ్రాజ్యవాద నేతృత్వంలోని ఇంపీరియల్‌ బ్యాంక్‌ తీరుస్తుండేది. కరెన్సీ ముద్రణ బాధ్యతతో పాటు, బ్యాంకులకు బ్యాంకుగాను, ప్రభుత్వానికి బ్యాంకు గాను వ్యవహరించేటట్లు భారత రిజర్వ్‌ బ్యాంకును స్థాపించారు. దీనితో పాటు వ్యవసాయ పరపతి, సహకార రంగాల్ని అభివృద్ధి చేసే బాధ్యతను కూడా దీనికి అప్పచెప్పారు. వలస రాజ్యం అధీనంలో ఉండే రిజర్వ్‌ బ్యాంక్‌ ''నిర్వహణ స్వేచ్ఛ'' పై అనేక పరిమితులు ఉండేవి. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలోని అవసరాలను తీర్చడం కోసం బ్రిటీష్‌ వలస వాదులు భారత రిజర్వ్‌ బ్యాంకును వాడుకున్నారు. స్వతంత్ర భారతం ఆవిర్భవించిన తరువాత 1949లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జాతీయం చేయబడింది.

ముగింపు

తొలి శతాబ్ధాలలో ద్రవ్య సరఫరా విధాన ఛాయలు గోచరించినా, 19వ శతాబ్ధ తొలి దశలోనే ద్రవ్య సరఫరా విధాన పరిణామం మొదలైంది. 1914 ముందుకాలంలో ఈ విధానానికి సంబంధించిన సూత్రాలు, సాధనాలు ఆనాటి అవసరాల మేరకు అభివృద్ధి అయిన, 1914 తరువాత కాలంలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో ''ద్రవ్య సరఫరా విధాన'' పాత్ర ప్రముఖంగా ముందుకొచ్చింది.