Friday, November 28, 2014

ఉపాధి హామీపై ఉదారవాద దాడి

ఉపాధి హామీపై ఉదారవాద దాడి

ఉపాధి హామీ పరి రక్షణకై దేశవ్యాప్త ఉద్యమం సాగుతోంది. గత రెండేళ్లుగా ఉపాధి హామీ ప్రయోజనాలను తక్కువ చేసి చూపే ప్రయత్నం ప్రారంభమైనా తాజా పార్లమెం టు ఎన్నికల తర్వాత ఈ ప్రయత్నాలు రాజకీయ దాడి రూపం తీసుకున్నాయి. ఎన్నికలకు ముందే స్వేచ్ఛా మార్కెట్‌ సిద్ధాంతకర్తలు ఈ చట్టాన్ని సవరించాలని పెద్దఎత్తున ప్రచారం ప్రారంభించారు. ఈ తరహా విశ్లేషకులు, సంస్కరణల అనుకూలురు లెవనెత్తిన అంశాలను సమర్థించే బిజెపి అధికారానికి రావటంతో ఈ ప్రచారానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఏకంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నితిన్‌ గడ్కరి, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజె సింధియా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి వారు ఉపాధి హామీ చట్టాన్ని తొలుత నిర్వీర్యం చేయటానికి, కాలక్రమంలో కేవలం ఒక పథకం స్థాయికి పరిమితం చేయటానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ దాడి రూపమే విస్తృత భాగస్వామ్య ప్రణాళికా కసరత్తు. ఈ చట్టంపై జరుగుతున్న దాడిని ఎదుర్కోవటానికి, చట్టాన్ని పరిరక్షించుకోవటానికి శ్రామిక శక్తులు ఏకమవుతున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరింపజేయాలని, అటువంటి ప్రయత్నానికి ఉపాధి హామీ చట్టం ప్రధాన సాధనంకానున్నదని నమ్ముతున్న ఆర్థికవేత్తలు, విశ్లేషకులు, మేధావులు ఈ ప్రయత్నాలను సమర్థించి ముందుకొస్తున్నారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు కూడా రెండుగా చీలిపోయాయి. కేంద్ర ప్రభుత్వం వందలాది పథకాలు అమలు పరుస్తుండగా ఉదారవాదులు ఈ ఒక్క చట్టం ఆధారిత పథకాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవటం వెనకగల కారణాలు ఏమిటి?
                     ఉపాధి హామీ చట్టం ప్రాధాన్యత గురించి సరిగ్గా అర్థం చేసుకోవాలంటే గత రెండు దశాబ్దాల ఆర్థిక సంస్కరణల దుష్ప్రభావాలను కూడా అర్థం చేసుకోవాలి. 1991లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు గ్రామీణ భారతాన్ని కుంగదీశాయి. గ్రామీణ భారతానికి ఆయువుపట్టుగా ఉన్న వ్యవసాయాన్ని సంక్షోభ భరితం చేశాయి. లక్షలాది మంది రైతులు ఆత్మహత్యల పాలైనా సంస్కరణల మత్తులో జోగుతున్న ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయి. 2000 సంవత్సరం తర్వాత గానీ ఈ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న సంక్షోభం నిర్దిష్ట రాజకీయ రూపం తీసుకోవటం ప్రారంభం కాలేదు. ఫలితంగా 2004 ఎన్నికల నాటికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించటం ప్రధాన రాజకీయ పార్టీల ఎజెండాలో అంతర్భాగం అయ్యింది. అంతకు ముందే ప్రణాళికా సంఘం వంటి పలు కీలక ప్రభుత్వ విభాగాలు చితికిపోతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గుర్తించి దానికి తగిన పరిష్కారాలు ప్రతిపాదించటం ప్రారంభించాయి. ప్రణాళికా సంఘం రూపొందించిన 11వ పంచవర్ష ప్రణాళిక దిశా నిర్దేశ పత్రంలో గ్రామీణ ఆర్థిక సంక్షోభానికి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కనుమరుగవటం కీలక అంశంగా భావించి గ్రామీణ ఉపాధి పరిరక్షణ ఒక్కటే ఈ సంక్షోభం నుంచి దేశాన్ని బయట పడేయగలదని నిర్ధారించింది. తదనుగుణంగా రూపొందిందే గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ప్రస్తుతం ఈ చట్టం ఆవశ్యకత, ప్రాసంగికతపై సందేహాలు లేవనెత్తుతున్న శక్తులు, వ్యక్తులే నాడు ఈ చట్టం అవసరాన్ని కూడా ప్రశ్నిస్తూ వచ్చిన విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఉపాధి హామీ చట్టం అవసరం లేదన్న వాదన ముందుకు తేవటం అంటే ఆర్థిక సంస్కరణలు ఫలప్రదం అయ్యాయన్న మార్కెట్‌ ఛాందసవాదుల ప్రచారాన్ని ధృవీకరించటమే కాక గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న వాస్తవిక స్థితిని గుర్తించ నిరాకరించటమే అవుతుంది. నిజానికి ఈ చట్టం చిన్న సన్నకారు రైతాంగానికి, కౌలు రైతాంగానికి ఉపాధి అవకాశాలు కల్పించింది. తద్వారా వ్యవసాయ కార్మికులు, రైతాంగంలోని దిగువ తరగతుల మధ్య ఐక్యతకు పునాదులు వేసింది. ఈ చట్టం ద్వారా చేపట్టిన అనేక పనులు దీర్ఘకాలంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచటానికి దారితీసిందని స్వయంగా ఎన్‌ఎస్‌ఎస్‌ఒ వంటి సంస్థలతో పాటు ప్రణాళికా సంఘం ఆధీనంలో పని చేసే అనేక మేధో సంస్థలు ధృవీకరించాయి. ఇప్పటికే 10 లక్షల ఎకరాలకు పైగా అదనపు నీటి వనరులు ఈ చట్టం ద్వారా అందుబాటులోకి తెచ్చామని గ్రామీణాభివృద్ధి శాఖ నివేదికే స్పష్టం చేస్తోంది. ఈ ఐక్యత దీర్ఘకాలంలో ఆర్థిక సంస్కరణలపై జరిగే పోరాటానికి కొత్త ఊపిరులూదనుంది. ఉపాధి హామీ చట్టం వల్ల వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోయిందన్న వాదన ముందుకు తేవటం ద్వారా వ్యవసాయ సంక్షోభానికి కారణమవుతున్న ప్రభుత్వ విధానాలు, ఆర్థిక సంస్కరణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించటానికి ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రయత్నంలో కార్పొరేట్‌ మీడియా కూడా తనవంతు సహకారం అందిస్తోంది.
            ఈ చట్టం ఆశించిన ప్రయోజనాలు చేకూర్చలేదని, లక్షల కోట్ల రూపాయలు వృథా అయ్యాయన్నది వీరు ముందుకు తెస్తున్న మరో వాదన. ఈ చట్టం 2005లో ప్రారంభమైన నాటి నుంచి 2013-2014 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఉపాధి హామీ కోసం కేంద్ర ప్రభుత్వం వెచ్చించిన వ్యయం రూ.2,38,500 కోట్లు. మొత్తంగా జాతీయ ఆర్థిక వ్యవస్థను ఇటువంటి కేటాయింపులు సంక్షోభంలోకి నెడుతున్నాయని సంస్కరణవాదులు ప్రచారం చేస్తున్నారు. ఇది జిడిపిలో కేవలం 0.5 శాతం. మొత్తం జాతీయ ఆర్థిక వ్యవస్థ కేవలం 0.5 శాతం కేటాయింపుల వల్ల సంక్షోభంలో పడిందని తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్లు కార్పొరేట్‌ వర్గాలకు కేటాయించిన రూ.34 లక్షల కోట్ల గురించి ఎందుకు నోరెత్తటం లేదు? ఉపాధి హామీ చట్టం అమలుకు కేటాయించిన నిధుల్లో 65 శాతం అంటే రూ.1,55,000 కోట్లు నేరుగా వ్యవసాయ కార్మికులకు వేతనాల రూపంలో వారికి చేరింది. రూ.35 కోట్ల కుటుంబాలకు నేరుగా ఆర్థిక ప్రయోజనం చేకూరింది. 1,575 కోట్ల పనిదినాలు సృష్టించబడ్డాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరిగింది. ప్రజలు ప్రత్యేకించి వ్యవసాయ కార్మికులు విద్య, వైద్యం వంటి ప్రాథమిక అవసరాలు తీర్చుకోగలుగుతున్నారని పలు పరిశోధనల్లో రుజువు అయ్యింది. ఆ మేరకు వ్యవసాయ కార్మికులు గ్రామీణ పెత్తందారుల ఆధిపత్యం నుంచి విముక్తి పొందారు. ఊపిరి తీసుకున్నారు. కానీ సంస్కరణవాదులకు ఇదంతా 'వృథా వ్యయం', 'బూడిదలో పోసిన పన్నీరు'లాగా కనిపిస్తోంది. నితిన్‌ గడ్కరి వంటి వారికి ఇదంతా కేవలం రాజకీయ పక్షపాతం కోసం ప్రభుత్వ నిధుల దుర్వినియోగంలా మాత్రమే కనిపిస్తోంది.
                        బిజెపి అధికారానికి వచ్చాక అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి లావాదేవీలు పెరిగాయి. రానున్న కాలంలో భారతదేశాన్ని అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడికి క్రీడాస్థలంగా మార్చే విధానాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఉపాధి హామీ చట్టం వల్ల కాస్తో కూస్తో గ్రామీణ శ్రమశక్తి విలువ పెరిగింది. వేతనాలు పెరిగాయి. వ్యవసాయ కార్మికులు, గ్రామీణ ప్రాంతాల్లోని సంఘటిత, అసంఘటిత కార్మికులు, నైపుణ్యం కలిగిన, నైపుణ్యం లేని కార్మికుల ముందు ఒక ప్రత్యామ్నాయం ఉంది. గతిలేని పరిస్థితుల్లో నామమాత్రపు వేతనాలకు గొడ్డుచాకిరీ చేసే స్థితి నుంచి గ్రామీణ కార్మికులు కాస్తంట ఊరట పొందారు. మరోవైపున ఉపాధి హామీ వేతనాల నేపథ్యంలో భవన నిర్మాణం, ప్రత్యేక ఆర్థిక మండళ్ల నిర్మాణం, పారిశ్రామిక క్లస్టర్లలో పని చేసే కార్మికుల వేతనాలు ఎంతో కొంత పెంచాల్సి వచ్చింది. ఈ మేరకు పెట్టుబడి లాభాల్లో కోత పడుతోంది. గతంలో కారుచౌకగా దొరికే శ్రమశక్తి ఇప్పుడు దొరకటం లేదు. గ్రామీణ కార్మికులు తమ కాళ్ల మీద తాము నిలబడే అవకాశాలు వస్తే అంతిమంగా తమ లాభాల్లో కోతపడుతుందని గుర్తించింది పెట్టుదారీ వర్గం. అందువల్లనే దేశీయ గుత్తపెట్టుబడిదారీ వర్గం, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడితో కుమ్మక్కై వ్యవసాయ కార్మికులకు, చిన్న సన్నకారు రైతాంగానికి, గ్రామీణ కార్మికవర్గానికి ఊతమిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయాలన్న దాడిని ఉధృతం చేస్తోంది.

- కొండూరి వీరయ్య 

Monday, November 17, 2014

నిజమైన లౌకిక వాది నెహ్రూ

నిజమైన లౌకికవాది నెహ్రూ..ప్రొ.కె.నాగేశ్వర్


భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శాస్త్రీయధృక్పథం ఉన్న నాయకుడని, నిజమైన లౌకిక వాది అని, దేశం ఆర్ధిక స్వావలంబన సాధించాలని ఆకాంక్షించేవాడని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో పాల్గొన్న విశ్లేషకులు, ఎమ్మెల్సీ, ప్రొ.కె.నాగేశ్వర్ అన్నారు. ప్రస్తుతం జవహర్ లాల్ నెహ్రూ ఆర్ధిక విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని చెప్పారు. నెహ్రూ ఆర్ధిక, విదేశాంగ విధానాలపై కార్పొరేట్ మీడియా దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. దేశంలో రాజకీయ స్వాతంత్రం, ఆర్ధిక స్వాతంత్రం పెరగాలని నెహ్రూ చెప్పేవారని గుర్తుచేశారు. సంపద కేంద్రీకరణను నెహ్రూ వ్యతిరేకించినా దాన్ని నిరోధించలేకపోయారన్నారు.
పారిశ్రామికాభివృద్ధికి పునాదులు...
నెహ్రూ ప్రభుత్వం తీసుకున్న ఆర్ధిక విధానాలు భారత దేశాన్ని ఆర్ధిక స్వావలంబన పైపుకు తీసుకెళ్లాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో హెచ్ఎంటీ, బిహెఇఎల్, ఐడిపిఎల్, హెఎఎల్ వంటి ప్రభుత్వరంగ సంస్ధలు ఏర్పడిన తరువాతే అభివృద్ధి జరిగిందని చెప్పారు. హైదరాబాద్, విశాఖపట్నంలో జిడిపి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మనదేశంలోనే వస్తువుల ఉత్పత్తి పెంచుకుంటూ దిగుమతులను తక్కువ చేసుకుంటే ఆర్ధిక ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు. అయితే నెహ్రూ ఆర్ధిక విధానంలో పరిమితులున్నాయని చెప్పారు. ఆర్ధిక శక్తులను నెహ్రూ పూర్తిగా నాశనం చేయలేదని తెలిపారు. ప్రణాళికా బద్ధమైన ఆర్ధిక ప్రణాళిక నెహ్రూ హయాం నుంచే మొదలైందని చెప్పారు. ప్రభుత్వరంగ గుత్తాధిపత్యానికి పరిష్కారం ప్రైవేటురంగ గుత్తాధిపత్యం కాదని వివరించారు.
విదేశాంగ విధానం..
అలీనోద్యమాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది నెహ్రూయేనని అన్నారు. ప్రపంచంలో ఆధిపత్య దేశాలకు ఎదురొడ్డి నిలవాలని ఆయన ఆకాంక్షించారని తెలిపారు. నెహ్రూ ఆర్ధిక, విదేశాంగ విధానాలను కాంగ్రెస్ పార్టీ సైతం మర్చిపోయిందని చెప్పారు. ప్రస్తుతం పేటెంట్ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కారని అన్నారు.
రక్షణ రంగంలో..
నెహ్రూ హయాంలో రక్షణ, శాస్త్రసాంకేతిక రంగం అభివృద్ధికి పునాదులు పడ్డాయని తెలిపారు. 1956-64 ప్రాంతంలో దేశంలో అణుశక్తి శాఖ ఏర్పాటు, అణు రియాక్టర్ ల నిర్మాణం జరిగాయని చెప్పారు. 1960 లోనే తొలి రాకెట్ ను కేరళ నుంచి ప్రయోగించామని గుర్తుచేశారు. శాస్త్రీయంగా, వైజ్ఞానికంగా ఆలోచించడం ద్వారానే భారత్ ముందడుగు వేస్తుందని నెహ్రూ చెప్పారని అన్నారు.
నెహ్రూ నిజమైన లౌకిక వాది..
నెహ్రూ వ్యక్తిగతంగా లౌకికవాది అని చెప్పారు. రాజ్యవ్యవస్ధకు మతం దూరంగా ఉండాలని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారన్నారు. భిన్న మతాల సమాహారమైన భారతదేశం లౌకిక దేశంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారని చెప్పారు. భారత దేశం మూఢత్వం వదిలి శాస్త్రీయ ధృక్పథం వైపు నడవాలని ఆయన సూచించారన్నారు. నెహ్రూ ఆలోచనలను, ఆశయాలను ప్రస్తుత పరిస్ధితులకు అన్వయించుకుంటూ అనుసరించాలని సూచించారు.