Monday, November 17, 2014

నిజమైన లౌకిక వాది నెహ్రూ

నిజమైన లౌకికవాది నెహ్రూ..ప్రొ.కె.నాగేశ్వర్


భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శాస్త్రీయధృక్పథం ఉన్న నాయకుడని, నిజమైన లౌకిక వాది అని, దేశం ఆర్ధిక స్వావలంబన సాధించాలని ఆకాంక్షించేవాడని 'గుడ్ మార్నింగ్ నాగేశ్వర్' కార్యక్రమంలో పాల్గొన్న విశ్లేషకులు, ఎమ్మెల్సీ, ప్రొ.కె.నాగేశ్వర్ అన్నారు. ప్రస్తుతం జవహర్ లాల్ నెహ్రూ ఆర్ధిక విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని చెప్పారు. నెహ్రూ ఆర్ధిక, విదేశాంగ విధానాలపై కార్పొరేట్ మీడియా దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. దేశంలో రాజకీయ స్వాతంత్రం, ఆర్ధిక స్వాతంత్రం పెరగాలని నెహ్రూ చెప్పేవారని గుర్తుచేశారు. సంపద కేంద్రీకరణను నెహ్రూ వ్యతిరేకించినా దాన్ని నిరోధించలేకపోయారన్నారు.
పారిశ్రామికాభివృద్ధికి పునాదులు...
నెహ్రూ ప్రభుత్వం తీసుకున్న ఆర్ధిక విధానాలు భారత దేశాన్ని ఆర్ధిక స్వావలంబన పైపుకు తీసుకెళ్లాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో హెచ్ఎంటీ, బిహెఇఎల్, ఐడిపిఎల్, హెఎఎల్ వంటి ప్రభుత్వరంగ సంస్ధలు ఏర్పడిన తరువాతే అభివృద్ధి జరిగిందని చెప్పారు. హైదరాబాద్, విశాఖపట్నంలో జిడిపి ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మనదేశంలోనే వస్తువుల ఉత్పత్తి పెంచుకుంటూ దిగుమతులను తక్కువ చేసుకుంటే ఆర్ధిక ప్రగతి సాధ్యమవుతుందని చెప్పారు. అయితే నెహ్రూ ఆర్ధిక విధానంలో పరిమితులున్నాయని చెప్పారు. ఆర్ధిక శక్తులను నెహ్రూ పూర్తిగా నాశనం చేయలేదని తెలిపారు. ప్రణాళికా బద్ధమైన ఆర్ధిక ప్రణాళిక నెహ్రూ హయాం నుంచే మొదలైందని చెప్పారు. ప్రభుత్వరంగ గుత్తాధిపత్యానికి పరిష్కారం ప్రైవేటురంగ గుత్తాధిపత్యం కాదని వివరించారు.
విదేశాంగ విధానం..
అలీనోద్యమాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది నెహ్రూయేనని అన్నారు. ప్రపంచంలో ఆధిపత్య దేశాలకు ఎదురొడ్డి నిలవాలని ఆయన ఆకాంక్షించారని తెలిపారు. నెహ్రూ ఆర్ధిక, విదేశాంగ విధానాలను కాంగ్రెస్ పార్టీ సైతం మర్చిపోయిందని చెప్పారు. ప్రస్తుతం పేటెంట్ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కారని అన్నారు.
రక్షణ రంగంలో..
నెహ్రూ హయాంలో రక్షణ, శాస్త్రసాంకేతిక రంగం అభివృద్ధికి పునాదులు పడ్డాయని తెలిపారు. 1956-64 ప్రాంతంలో దేశంలో అణుశక్తి శాఖ ఏర్పాటు, అణు రియాక్టర్ ల నిర్మాణం జరిగాయని చెప్పారు. 1960 లోనే తొలి రాకెట్ ను కేరళ నుంచి ప్రయోగించామని గుర్తుచేశారు. శాస్త్రీయంగా, వైజ్ఞానికంగా ఆలోచించడం ద్వారానే భారత్ ముందడుగు వేస్తుందని నెహ్రూ చెప్పారని అన్నారు.
నెహ్రూ నిజమైన లౌకిక వాది..
నెహ్రూ వ్యక్తిగతంగా లౌకికవాది అని చెప్పారు. రాజ్యవ్యవస్ధకు మతం దూరంగా ఉండాలని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారన్నారు. భిన్న మతాల సమాహారమైన భారతదేశం లౌకిక దేశంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారని చెప్పారు. భారత దేశం మూఢత్వం వదిలి శాస్త్రీయ ధృక్పథం వైపు నడవాలని ఆయన సూచించారన్నారు. నెహ్రూ ఆలోచనలను, ఆశయాలను ప్రస్తుత పరిస్ధితులకు అన్వయించుకుంటూ అనుసరించాలని సూచించారు.

No comments: