Sunday, March 22, 2015

అంకెల మాయాజాలంలో ఆర్థిక వ్యవస్థ

ప్రభుత్వం చెపుతున్నట్లు ఆర్థికాభివృద్ధి 7 శాతానికిమించితే తదనుగుణంగా ఆర్థిక వ్యవస్థలో లావాదేవీలుపెరగాలి. బ్యాంకు రుణాలు 2013-14లో 9. 7 శాతం ఉండగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతానికి మించలేదు. కీలకమైన మౌలికవసతుల కల్పన రంగం - జాతీయ రహదారులు, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు, ప్రత్యేక పారిశ్రామిక వాడలు వంటి రంగాల్లో ఉన్న కంపెనీలకు రుణాలు ఇవ్వవద్దని రిజర్వు బ్యాంకు ఆదేశించింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుకు అనుగుణంగానే పన్నుల ఆదాయాలు పెరగాలి. కానీ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోయిందని బడ్జెట్‌ 
పత్రాల్లో ఆర్థిక మంత్రి పార్లమెంట్‌కు నివేదించారు.
                    ''అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభంలో భాగంగా నాలుగేళ్ల పాటు నత్తనడక సాగించిన భారత ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా ఉరుకులు పరుగులు తీయనారంభించింది.'' 2015-16 బడ్జెట్‌ ప్రతిపాదిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్‌లో చేసిన ప్రసంగపాఠం ఇది. కేంద్ర గణాంకాల సంస్థ తాజాగా వెలువరించిన నూతన గణాంకాలు దీనికి ప్రాతిపదిక అని కూడా ఆయన ప్రకటించారు. ఈ నూతన గణాంకాల ఆధారంగానే దేశ ఆర్థిక ప్రగతి చైనాతో పోటీ పడే స్థాయిలో ఉందన్న విశ్లేషణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్ర గణాంకాలు, ఆర్థికవ్యవస్థ ప్రగతిని కొలవటంలో దాని అంచనాల పాత్ర, వాటి ప్రాసంగికత వంటి అంశాలపై మరోమారు చర్చ మొదలైంది. ఏ ఆర్థిక వ్యవస్థ విశ్లేషణకైనా ఆయా దేశాల్లోని ప్రజల స్థితిగతుల్లో వచ్చిన మార్పులు పరిశీలించటం ప్రమాణం. ఈ మార్పులను జాతీయ స్థాయిలోనో, రాష్ట్రాల స్థాయిలోనో పరిశీలించేటప్పుడు అంకెల్లో అంచనాలకు రావటం పరిపాటి. అయితే ఈ అంచనాలు జనజీవితాల్లో కనిపించే వాస్తవికతకు దగ్గరగా లేకపోతే కేవలం అంకెల గారడీగానే మిగిలిపోతాయి. 2015 జనవరిలో కేంద్ర గణాంకాల సంస్థ విడుదల చేసిన తాజా అంచనాలు, అందుకు అనుసరించిన ప్రమాణాలు ఇటువంటి గారడీకి పాల్పడ్డాయా అన్న సందేహం రిజర్వు బ్యాంకు గవర్నర్‌తో సహా పలువురు వ్యక్తం చేస్తున్నారు. 
                  జాతీయ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను అంకెల్లో బంధించి ప్రపంచం ముందుంచటానికి అన్ని ప్రభుత్వాల ఆధీనంలో గణాంక సంస్థలు పని చేస్తాయి. భారతదేశంలో దీనికోసం ఏకంగా ఒక మంత్రిత్వశాఖే పని చేస్తోంది. ఈ శాఖ ఆధీనంలోనే కేంద్ర గణాంకాల సంస్థ, జాతీయ నమూనా సర్వే సంస్థ వంటి కీలకమైన విభాగాలు ఉన్నాయి. కేంద్ర గణాంకాల సంస్థ ప్రభుత్వ విభాగాలు, ప్రైవేటు పారిశ్రామిక సంస్థల నుండి ప్రతి నెలా గణాంకాలు సేకరించి వాటి ఆధారంగా జాతీయ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను అంచనా వేస్తుంది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విధి విధానాలు రూపొందించటంలో ఈ అంచనాలే ప్రభుత్వాలకు మౌలికమైన ఆధారాలుగా పని చేస్తాయి. కార్మికులకు డిఎ పెంచాలన్నా, వేతన కమిషన్‌ సిఫార్సులు అమలు జరపాలన్నా, వేతన పెంపు నిలుపుదల చేయాలన్నా, కొత్త పన్నులు విధానాలు ప్రతిపాదించాలన్నా అన్నింటికీ ఈ గణాంక సంస్థ అంచనాలే కీలకం. ఈ గణాంక సంస్థలు విడుదలచేసే పారిశ్రామికోత్పత్తి సూచిక (ఇండెక్స్‌ ఆఫ్‌ ఇండిస్టియల్‌ ప్రొడక్షన్‌) ప్రభుత్వాలు అనుసరించే పారిశ్రామిక విధానాలకు దిశా నిర్దేశం చేస్తుంది. ప్రపంచీకరణ యుగంలో వాస్తవాలకతీతంగా అంచనాలు విడుదలచేయటం ఆనవాయితీగా మారింది. 
                2004-05 ఆర్థిక సంవత్సరం ప్రాతిపదికన ఇప్పటి వరకు భారత ఆర్థిక వ్యవస్థను అంచనా వేస్తూ వచ్చారు. అంటే 2004-05 నాటికి అన్ని గణాంకాలు 100గా ఉన్నాయనుకుంటే తర్వాతి సంవత్సరాల్లో ఆయా గణాంకాలు 100 కంటే ఎంత ఎక్కువ ఉన్నాయి, ఎంత తక్కువ ఉన్నాయి అన్నదాన్ని బట్టి ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోందా, తిరోగమిస్తోందా, స్థబ్ధతలో ఉందా అన్న నిర్ధారణకు వస్తుంటారు. ఈ అంచనాల ఆధారంగానే యుపిఎ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో విఫలం అయ్యిందనే ప్రచారం హోరెత్తింది. అంతిమంగా కాంగ్రెస్‌ను అంపశయ్యపైకి చేర్చి బిజెపి అధికారానికి వచ్చింది. కుర్చీలో కూర్చున్నాకగానీ అయ్యవార్లకు అసలు విషయం అంతుబట్టలేదు. ఆర్థిక విధానాలు గాడిలో పెట్టామని బిజెపి ఎంతగా డంభాలు పలికినా ఆచరణలో పారిశ్రామికోత్పత్తి సహా అన్ని ఆర్థికాభివృద్ధి సూచికలు నేల చూపు కొనసాగించాయి. ఆర్థిక వ్యవస్థను నడిపించే లాభాపేక్షకు జేబులో మిగులు పోగుపడిందా లేదా అన్నదే ప్రధానం తప్ప ప్రభుత్వంలో బిజెపి ఉందా కాంగ్రెస్‌ ఉందా అన్నది పెట్టుబడికి సంబంధం లేని విషయం. అందువల్లే మోడీ మాటల మంత్రదండం పని చేయలేదు. గోబెల్స్‌ ప్రచారంలో ప్రావీణ్యం సాధించిన బిజెపి ఏకంగా ఆర్థిక అంచనాల ప్రాతిపదిక సంవత్సరాన్ని 2004-05 నుండి 2011-12కు మార్చింది. దాంతో ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా అంగలుపంగలు మీద పరుగులెత్తుతున్నట్లు కనిపించింది. ఈ పరిణామం హేతుబద్దంగా ఆలోచించే మేధావుల ముందు పలు ప్రశ్నలు లేవనెత్తింది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇటువంటి అంకెల మాయాజాలాన్ని బాగా అర్థం చేసుకుని ఇప్పుడు రిజర్వు బ్యాంకు గవర్నర్‌ హోదాలో పని చేస్తున్న రఘురాం రాజన్‌ వంటివారే తాజా అంచనాల్లో ద్రవ్యోల్బణానికి సంబంధించిన అంచనాలు తప్ప మరేవీ నమ్మశక్యంగా లేవని ప్రకటించారు. 
                     ఈ గణాంకాల ప్రాతిపదికను, పొందికను మార్చటానికి ఐక్యరాజ్యసమితి గణాంకాల సంస్థ సూచనలు కారణమని ప్రభుత్వం సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది ఈ తాజా కసరత్తు. గణాంకాల సూచికలు ఐక్యరాజ్యసమితి సూచనల మేరకు ఉన్నాయని భావించినా వాటిని దేశానికి వర్తింపచేసుకోవటంలో ప్రభుత్వం, ఉదారవాద మేధావులు అనుసరించిన మతలబుతో కుంటి గుర్రంలా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ ఏకంగా కుందేలులాగా కుప్పిగంతులు వేయనారంభించింది. అందుకే అనుభవజ్ఞుల అంకెలు నందిని పందిగాను, పందిని నందిగానూ నిరూపిస్తాయని విమర్శిస్తుంటారు. సాధారణంగా ప్రభుత్వం విడుదలచేసే వివిధ గణాంకాల మధ్య పోల్చి విశ్లేషకులు లోతుపాతులు వ్యాఖ్యానించటం ఆనవాయితీ. విశ్లేషణ కోసం పోల్చాలన్నా సూచికలు ఒకే విధంగాఉండాలి. కానీ ప్రభుత్వం విడుదల చేసిన తాజా అంచనాల్లో అటువంటి కీలక సూచికల్లో కూడా మార్పులు చేయటంతో ఈ అంచనాలను విమర్శనాత్మకంగా విశ్లేషించటానికి, పోల్చి తప్పొప్పులు చూపటానికి, విధానపరమైన నిర్ధారణలకు రావటానికి అవకాశం లేకపోయింది. నయాఉదారవాదం ప్రత్యామ్నాయ దృక్ఫధాన్ని, ఆలోచనలను, విశ్లేషణా సామర్ధ్యాన్ని ఎలా నియంత్రిస్తుందో తెలియచెప్పేందుకు ఇది ఒక తాజా ఉదాహరణ. 
ప్రభుత్వం చెపుతున్నట్లు ఆర్థికాభివృద్ధి 7 శాతానికి మించితే తదనుగుణంగా ఆర్థిక వ్యవస్థలో లావాదేవీలు పెరగాలి. లావాదేవీలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగాలి. కానీ ప్రభుత్వ అంచనాల్లోనే ద్రవ్యోల్బణం రికార్డుస్థాయిలో తగ్గిపోయింది. పారిశ్రామికోత్పత్తి పుంజుకుంటే ఆయా కంపెనీల షేర్లు అమ్మకాలు పెరగాలి. కానీ ఈ గత సంవత్సర కాలంగా విదేశీ మదుపరులను మినహాయిస్తే దేశీయ పారిశ్రామిక సంస్థల షేర్ల అమ్మకాలు స్థబ్దతకు లోనయ్యాయి. 2014 ఏప్రిల్‌ - డిశంబరు వరకు తొమ్మిది నెల్లపాటు 2.1 శాతంగా ఉన్న పారిశ్రామికోత్పత్తుల సూచి ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి 6.7 శాతంగా ఉంటుందని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఫిబ్రవరి వరకు విడుదల అయిన ఈ సూచి లెక్కలు కూడా అంచనాలు తప్పే అని చెపుతున్నాయి. బ్యాంకు రుణాలు 2013-14లో 9. 7 శాతం ఉండగా 2014 -15 ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతానికి మించలేదు. కీలకమైన మౌలికవసతుల కల్పన రంగం-జాతీయ రహదా రులు, విద్యుదుత్పత్తి ప్రాజెక్టులు, ప్రత్యేక పారిశ్రామిక వాడలు వంటి రంగాల్లో ఉన్న కంపెనీలకు రుణాలు ఇవ్వవద్దని రిజర్వు బ్యాంకు ఆదేశించింది. ఆర్థిక వ్యవస్థలో ఉపద్రవం స్థాయికి చేరనున్న సంక్షోభానికి ఇవి సూచనలు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటుకు అనుగుణంగానే పన్నుల ఆదాయాలు పెరగాలి. కానీ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పడిపోయిందని బడ్జెట్‌ పత్రాల్లో ఆర్థిక మంత్రి పార్లమెంట్‌కు నివేదించారు. ఈ వివరాలన్నీ ప్రభుత్వం విడుదల చేస్తున్న అంచనాలకు, ఆర్థిక వ్యవస్థ వాస్తవిక స్థితికి మధ్య పొంతనలేని వైనాన్ని తెలియ చేస్తుంది. 
                   ప్రభుత్వాల ఆర్థిక అంచనాలన్నీ ఏదో ఒక సంవత్సరం వాస్తవిక లెక్కలు ఆధారం చేసుకుని (స్థిర ధరల ప్రాతిపదికన) సాగుతుంటాయి. అటువంటి ఆధారిత సంవత్సరాన్ని గణాంకాల పరిభాషలో బేస్‌ ఇయర్‌ అంటారు. ఈ బేస్‌ ఇయర్‌ ప్రతి పదేళ్లకొకసారి మారుతుంది. స్వాతంత్వ్రానంతరం 1948-49 ఆర్థిక సంవత్సరాన్ని బేస్‌ ఇయర్‌గా తీసుకుని నాటి స్థిర ధరల ప్రాతిపదికన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంచనాలు లెక్కగట్టటం ప్రారంభం అయ్యింది. అప్పటి వరకు ఆర్థిక వ్యవస్థ ఇంగ్లాండ్‌ పార్లమెంట్‌ కనుసన్నల్లో ఉండేది. దాంతో దేశీయంగా అన్ని వివరాలు అందుబాటులో లేని పరిస్థితి తలెత్తింది. కాల క్రమంలో దేశీయ ఆర్థిక వ్యవస్థ కేంద్రం ఢిల్లీకి మారటం, గణాంకాల్లో తగు మార్పులు చేసుకోవటం, మార్పులుకు అనుగుగణంగా వివరాలు సేకరణ ప్రారంభం కావటంతో 1967 నాటికి గణాంకాల సేకరణ గాడిలో పడింది. దాంతో 1960-61 ఆర్థిక సంవత్సరం బేస్‌ ఇయర్‌గా తీసుకుని 1967 సంవత్సరపు ఆర్థిక అంచనాలు రూపొదించబడ్డాయి. క్రమంగా 1978లో ఆర్థిక అంచనాలకు 1960-61 సంవత్సరాన్ని, 1988 సంవత్సరానికి 1970-71 సంవత్సరాన్ని, ఆధారిత సంవత్సరాలుగా పరిగణించటం, ఆమేరకు ఆర్థిక అంచనాలు లెక్కకట్టడం జరిగింది. 1998 వచ్చేసరికి ఆధారిత సంవత్సరం ప్రమాణాలు మారిపోయాయి. 1999లో ఆర్థిక వ్యవస్థ అంచనాలు రూపొందించటానికి 1993-94 సంవత్సరాన్ని ఆధారిత సంవత్సరంగా మార్చారు. 1991 వరకు దేశీయ ఆర్థిక అంచనాలు ప్రధానంగా దేశీయ ప్రజల ప్రయోజనాలు, అందుకవసరమైన విధానాల రూపకల్పన లక్ష్యంతో సూచికలను నిర్ధారించుకునేవి. 1991కు ముందు వివిధ దేశాలు విడుదలచేసిన ఆర్థిక అంచనాలను పున:పరిశీలించటానికి, మదింపు చేయటానికి, విదేశీ పెట్టుబడుల ప్రయోజనాల దృష్ట్యా విశ్లేషించటానికి విదేశీ పెట్టుబడుల కేంద్ర స్థానాలు ప్రత్యేక అధ్యయనాలు చేసేవి. 
                        1991 తర్వాత అంతర్జాతీయ మార్కెట్‌లో మన దేశ ఆర్థిక వ్యవస్థ శక్తిని ప్రదర్శించటం కూడా ఒక లక్ష్యంగా మారింది. అంతిమంగా దేశీయంగా రూపొందించే ఆర్థిక అంచనాలు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడిని ఆకర్షించేలా రూపొందించటం ఒక ముఖ్యమైన లక్ష్యంగా మారింది. దాంతో దేశీయ గణాంకాల అధ్యయనం తీరుతెన్నులు కూడా పర్యవేక్షించటం, అవరమైన శిక్షణ ఇవ్వటం ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వంటి సంస్థల కార్యకలాపాల్లో అంతర్భాగం అయ్యాయి. దానికనుగుణంగా మన దేశంలో కూడా గణాంక అధ్యయనాల దశ, దిశల్లో మార్పులు వచ్చాయి. ఉద్దేశ్యాలు కూడా మారిపోయాయి. అందువల్లనే 1999 నుండి ఆధారిత సంవత్సరాన్ని పదేళ్ల నుండి ఐదేళ్లకు తగ్గించారు. అందువల్లనే 1999 ఆర్థిక సంవత్సరం అంచనాలుకు 1993-94 ప్రాతిపదిక అయ్యింది. 2006 అంచనాలకు 2004-05 అంచనాలు ప్రాతిపదిక అయ్యాయి. ఈ కోవలోనే తాజా అంచనాలకు 2011-12ను ఆధారిత సంవత్సరంగా పరిగణించారు. 2011-12 ఆర్థిక సంవత్సరం నాటికి ఆర్థికాభివృద్ధి రేటుపై ప్రపంచ ఆర్ధిక సంక్షోభం ప్రభావం ఉంది. వృద్ధి రేటు వేగం తగ్గిపోయింది. ఎక్కువ వృద్ధి రేటు ఉన్న సంవత్సరం ప్రాతిపదికగా తీసుకుంటే తాజా సంవత్సరంలో అంతకంటే వృద్ధి రేటు పెరిగితేనే ఆర్థికాభివృద్ధి జరిగినట్లు అర్థమవుతుంది. తక్కువ వృద్ధి రేటు ఉన్న సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే ఈ సమస్య ఉండదు. ఎంత పెరిగినా పెరిగినట్లే కనిపిస్తుంది. దీనినే బేస్‌ ఇయర్‌ ఎఫెక్ట్‌ అంటారు. ఆర్థిక వ్యవస్థలో నిజమైన వృద్ధి రేటు ప్రాతిపదికన అంచనాలు, విధానాలు రూపొందించటానికి బదులు అటువంటి బేస్‌ ఇయర్‌ ఎఫెక్ట్‌పై ఆధారపడి అంచనాలు, విధానాలు రూపొందించే ప్రయత్నం చేయటం తాజా అంచనాల పర్యవసానం. అంటే ముతక భాషలో చెప్పాలంటే బలుపు ఆధారంగా అంచనాకు రావటం పక్కన పెట్టి వాపు ఆధారంగా అంచనాకు రావటం ప్రారంభమైంది. 
                     ప్రైవేటు కార్పొరేట్‌ వర్గపు మదుపు రేట్లు, పెట్టుబడి రేట్లు పాత అంచనాల ప్రకారం ఈ మదుపు రేట్లు 30 శాతానికి మించి లేవు. కానీ కొత్త అంచనాల ప్రకారం మదుపు రేట్లు 40 శాతానికి పెరిగాయి. ఇక్కడే మరో ప్రశ్న తలెత్తుతుంది. జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కంటే ప్రైవేటు కంపెనీల వద్ద పోగుపడే లాభాల రేటు ఎక్కువగా ఉన్నపుడు వారికి మరిన్ని రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి అన్న ప్రశ్న అది. పెరిగిన వృద్ధి రేటును కొనసాగించగల సామర్ధ్యం ప్రైవేటు కార్పొరేట్‌ వర్గానికి ఉన్నపుడు బడ్జెట్‌లో మూడో వంతు ఆదాయాన్ని వారికి రాయితీల రూపంలో కట్టుబెట్టాల్సిన అవసరం ఏమిటి? ఈ అంచనాలే విధానాల రూపకల్పనకు ప్రాతిపదికన అనుకున్నపుడు సాధారణ ప్రజల చేతుల్లో మదుపు 72 శాతం నుండి 59 శాతానికి పడిపోయింది. అంటే ప్రభుత్వ విధానాల లక్ష్యం సాధారణ చేతుల్లో మదుపు సామర్థ్యం పెంచేదిగా ఉండాలి. కానీ బడ్జెట్‌లో అనుసరించిన పరోక్ష పన్నుల విధానం ఈ ప్రజల మదుపు సామర్ధ్యాన్ని మరింత కుంగదీసేదిగా ఉంది. 
                        స్థూలంగా చూసినప్పుడు మనం కొన్ని నిర్ధారణలకు రావచ్చు. ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు ఆర్థిక వ్యవస్థ వాస్తవిక చిత్రాన్ని ప్రతిబింబించటం లేదు. అంతర్జాతీయ ద్రవ్యమార్కెట్‌లో ఈ అంచనాలతో తమ పరిపాలన సామర్ద్యానికి మెప్పు పొందే ప్రయత్నమే ఇది. ఇటువంటి కపటవాస్తవాలు కళ్ల ముందు పెట్టి విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రయత్నించటం ఎండమావిలో దప్పిక తీర్చుకునే ప్రయత్నం తప్ప మరోటి కాదు. యుపిఎ హయాంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్న బిజెపి ప్రచారం తప్పుడు ప్రచారమని ఈ అంచనాలు నిరూపిస్తున్నాయని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విమర్శించటం ఇందులో కొసమెరుపు. ఇటువంటి అనుమానాస్పద అంచనాలు ఆధారం చేసుకుని విధానాలు రూపొందించటం అంటే రోగాన్ని గుర్తించకుండా మందులు వేయటమే అవుతుంది.
-కె. లక్ష్మీప్రసాద్‌

No comments: