Saturday, July 25, 2015

గుజరాత్ కొమ్ముకాస్తూ దాచబడ్డ శిశు పౌష్టికాహార లోప సర్వే సమాచారం


-అమిత్  సేన్ గుప్తా 
వివాదాలతో, కుంభకోణాలతో గొంతు వరకు కూరుకుపోయిన ఎన్డియే ప్రభుత్వం అరుదైన మరో ఘన విజయాన్ని సాధించింది! కేంద్ర ప్రభుత్వ సహకారంతో యూనిసెఫ్(ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ శిశు అత్యవసర నిధి ) శిశుఆరోగ్యం పై నిర్వహించిన సర్వే పరిశీలనల్ని దాచటానికి ప్రభుత్వం నానా అగచాట్లు పడుతుందని ఇటీవల 'ఎకనమిస్ట్' పత్రిక మొట్టమొదటగా  ప్రచురించింది . 2013, 2014సం. లకు సంబంధించిన  శిశు పౌష్టికాహార లోపం పై సమాచారాన్ని సేకరించదంకోసం యుపియే ప్రభుత్వం శిశువుల పై రాపిడ్ సర్వేకు(రాపిడ్ సర్వే ఆన్ చిల్డ్రన్ -ఆర్ ఎస్ వొ సి ) ఆదేశించింది.

దాదాపు గత దశాబ్ద కాలంలో శిశు పౌష్టికాహారం పై మొట్ట మొదటగా నిర్వహిస్తున్న సర్వే కావటం వల్ల , సాధారణంగా విధాన నిర్ణయాలలో ఈ సర్వేసమాచారాన్ని  ఒక ముఖ్య సాధనంగా వినియోగించుకుంటాం .అప్పటివరకు 2005లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే- ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ )  పరిశీలనలు  శిశు పౌష్టికాహారం పై సమాచారం పొంద కలిగే చివరి వనరుగా వుండేవి. శిశు పౌష్టికాహార లోపంపై నిర్వహించిన యూనిసెఫ్ సర్వే  పరిశీలనల్ని దాచటంలో ఒక చమత్కారం వుంది. గత దశాబ్ద కాలంలో భారత దేశంలో పౌష్టికాహార లోపం గణనీయంగా తగ్గినట్లుగా ప్రశంసించ తగిన సమాచారాన్ని యూనిసెఫ్ సర్వే(రాపిడ్ సర్వే ఆన్ చిల్డ్రన్) తెలియచేస్తున్నది. అక్టోబర్2014 లోనే సర్వే తుది నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరినప్పటికీ,  ఇంతవరకు ఆ నివేదికను ప్రభుత్వం బహిరంగ పరచలేదని 'ఎకనమిస్ట్' పత్రిక ఆరోపిస్తున్నది. 

శిశు పౌష్టికాహార లోపంలో తగ్గుదలను సూచిస్తున్నయూనిసెఫ్ సర్వే 
గత దశాబ్ద కాలంలోస్థూలంగా భారత దేశంలో శిశు పౌష్టికాహార లోపం గణనీయంగా తగ్గినట్లు  సర్వే తెలియచేస్తున్నది.
 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(2005) లో గిడసబారిన(స్టంటింగ్), శుష్కించిన(వేస్టింగ్), బరువుతగ్గిన(అండర్ వెయిట్)శిశువుల(5సం.లోపు)శాతం, వరుసగా 48,20,43 వుండగా, యూనిసెఫ్ సర్వే(2014) లో వరుసగా 39,15,29 గా వుంది. (మూలం: ఎకనామిస్ట్ పత్రిక )

1998-99 ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ 2 సర్వే , 2005-6 ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ సర్వే ల మధ్య తగ్గిన తగ్గుదల కంటే యూనిసెఫ్ సర్వే లో గిడసబారిన(స్టంటింగ్), శుష్కించిన(వేస్టింగ్), బరువుతగ్గిన(అండర్ వెయిట్)శిశువుల తగ్గుదల రేట్లు  వరుసగా 9,5,14 శాతం పాయింట్లగా  వుండి . 1998-99 ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ 2 సర్వే , 2005-6 ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ సర్వేలలోతగ్గుదల కంటే గణనీయంగా తగ్గాయి. ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ సర్వేలలో1998 నుండి 2005 మధ్య కాలంలో  గిడసబారిన(స్టంటింగ్) శిశువులు, బరువుతగ్గిన(అండర్ వెయిట్) శిశువుల తగ్గుదల రేట్లు  వరుసగా 6, 3 శాతం పాయింట్లు వుండగా, ఇదే కాలంలోశుష్కించిన( వేస్టింగ్) శిశువులు  వాస్తవంలో 3శాతం పాయింట్లు పెరిగారు. పైన పేర్కొన్న ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ సర్వేను, యూనిసెఫ్ సర్వే(రాపిడ్ సర్వే ఆన్ చిల్డ్రన్) తో   పోల్చేటప్పుడు ఒక  హెచ్చరికను మనం గమనంలో ఉంచుకోవలసివుంది. ఈ రెండు సర్వేలు వైవిధ్యం కలిగిన  జనాభా పొందికలను,  లెక్కింపు ప్రక్రియలను కలిగి ఉన్నందున, వీటిని ఏ విధంగాను పోల్చలేము. అయినప్పటికీ యూనిసెఫ్ సర్వే సూచించిన గత దశకంలోని గణనీయమైన తగ్గుదల  పౌష్టికాహార లోపంలోని వాస్తవ తగ్గుదల రేట్లను సూచిస్తున్నది. 

గిడసబారటం(స్టంటింగ్), శుష్కించటం(వేస్టింగ్), బరువు తగ్గటం(అండర్ వెయిట్) లాంటి లక్షణాలు శిశువులలో పౌష్టికాహార లోప కొలమానాలుగా వుండి,  పౌష్టికాహార లోపం యొక్క మూలాలలోని  వివిధ అంశాల్ని వివరిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సూచికల ప్రభావాల్ని ఇలా వివరిస్తున్నది. స్టంటింగ్ అంటే గిడసబారటంగా పరిగణిస్తాము. దీనర్ధం వయస్సుకు తగ్గ ఎత్తు లేకపోవటం. శిశువుల పుట్టుక ముందు నుంచి వారిలో పేరుకున్న పౌష్టికాహార లేమిని, క్రిమిదోషకాల(ఇన్ఫెక్షన్) బారిన పడ్డ ప్రభావాన్ని, వారి తల్లులలో తీవ్రమైన పౌష్టికాహార లోపాన్ని శిశువులలో గిడసబారిన బాధితుల శాతం  తెలియచేస్తుంది.  శిశువులను పెరగనీయ కుండా దీర్ఘకాలంగా అదిమిపెట్టిన పెరుగుదల సామర్ధ్యాన్ని, కొనసాగుతున్న అధ్వాన్నపరిస్థితులకు  కొలమానంగా ఈ సూచికను పరిగణించ వచ్చును. శిశువులలో ఎత్తుకు  తగ్గ బరువు లేకపోవటాన్నిశుష్కించటం( వేస్టింగ్) అంటాము. శిశువులలో వయస్సుకు తగ్గ ఎత్తు లేకపోవటం(గిడసబారటం), ఎత్తుకు  తగ్గ బరువు లేకపోవటం  (శుష్కించటం )కలగలిసిన స్థితిని బరువు తగ్గటం(అండర్ వెయిట్) అంటాము. క్లుప్తంగా చెప్పుకుంటే, బరువు తగ్గట మంటే గిడసబారటం, శుష్కించటం ల కలగలిసిన లక్షణం. ఈ స్థితి తీవ్రమైన బరువు లోపాన్ని తెలియచేస్తుంది.'గిడసబారటం' తీవ్రమైన పౌష్టికాహార కొరతకు మెరుగైన సూచిక కాగా, ఇటీవలే తలెత్తిన ఆహార కొరత, తీవ్ర అస్వస్థల మూలంగా ఏర్పడ్డ పౌష్టికాహార లోపానికి 'శుష్కించటం' సూచికగా వుంటుంది.