Saturday, July 25, 2015

గుజరాత్ కొమ్ముకాస్తూ దాచబడ్డ శిశు పౌష్టికాహార లోప సర్వే సమాచారం


-అమిత్  సేన్ గుప్తా 
వివాదాలతో, కుంభకోణాలతో గొంతు వరకు కూరుకుపోయిన ఎన్డియే ప్రభుత్వం అరుదైన మరో ఘన విజయాన్ని సాధించింది! కేంద్ర ప్రభుత్వ సహకారంతో యూనిసెఫ్(ఐక్య రాజ్య సమితి అంతర్జాతీయ శిశు అత్యవసర నిధి ) శిశుఆరోగ్యం పై నిర్వహించిన సర్వే పరిశీలనల్ని దాచటానికి ప్రభుత్వం నానా అగచాట్లు పడుతుందని ఇటీవల 'ఎకనమిస్ట్' పత్రిక మొట్టమొదటగా  ప్రచురించింది . 2013, 2014సం. లకు సంబంధించిన  శిశు పౌష్టికాహార లోపం పై సమాచారాన్ని సేకరించదంకోసం యుపియే ప్రభుత్వం శిశువుల పై రాపిడ్ సర్వేకు(రాపిడ్ సర్వే ఆన్ చిల్డ్రన్ -ఆర్ ఎస్ వొ సి ) ఆదేశించింది.

దాదాపు గత దశాబ్ద కాలంలో శిశు పౌష్టికాహారం పై మొట్ట మొదటగా నిర్వహిస్తున్న సర్వే కావటం వల్ల , సాధారణంగా విధాన నిర్ణయాలలో ఈ సర్వేసమాచారాన్ని  ఒక ముఖ్య సాధనంగా వినియోగించుకుంటాం .అప్పటివరకు 2005లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే- ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ )  పరిశీలనలు  శిశు పౌష్టికాహారం పై సమాచారం పొంద కలిగే చివరి వనరుగా వుండేవి. శిశు పౌష్టికాహార లోపంపై నిర్వహించిన యూనిసెఫ్ సర్వే  పరిశీలనల్ని దాచటంలో ఒక చమత్కారం వుంది. గత దశాబ్ద కాలంలో భారత దేశంలో పౌష్టికాహార లోపం గణనీయంగా తగ్గినట్లుగా ప్రశంసించ తగిన సమాచారాన్ని యూనిసెఫ్ సర్వే(రాపిడ్ సర్వే ఆన్ చిల్డ్రన్) తెలియచేస్తున్నది. అక్టోబర్2014 లోనే సర్వే తుది నివేదిక కేంద్ర ప్రభుత్వానికి చేరినప్పటికీ,  ఇంతవరకు ఆ నివేదికను ప్రభుత్వం బహిరంగ పరచలేదని 'ఎకనమిస్ట్' పత్రిక ఆరోపిస్తున్నది. 

శిశు పౌష్టికాహార లోపంలో తగ్గుదలను సూచిస్తున్నయూనిసెఫ్ సర్వే 
గత దశాబ్ద కాలంలోస్థూలంగా భారత దేశంలో శిశు పౌష్టికాహార లోపం గణనీయంగా తగ్గినట్లు  సర్వే తెలియచేస్తున్నది.
 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(2005) లో గిడసబారిన(స్టంటింగ్), శుష్కించిన(వేస్టింగ్), బరువుతగ్గిన(అండర్ వెయిట్)శిశువుల(5సం.లోపు)శాతం, వరుసగా 48,20,43 వుండగా, యూనిసెఫ్ సర్వే(2014) లో వరుసగా 39,15,29 గా వుంది. (మూలం: ఎకనామిస్ట్ పత్రిక )

1998-99 ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ 2 సర్వే , 2005-6 ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ సర్వే ల మధ్య తగ్గిన తగ్గుదల కంటే యూనిసెఫ్ సర్వే లో గిడసబారిన(స్టంటింగ్), శుష్కించిన(వేస్టింగ్), బరువుతగ్గిన(అండర్ వెయిట్)శిశువుల తగ్గుదల రేట్లు  వరుసగా 9,5,14 శాతం పాయింట్లగా  వుండి . 1998-99 ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ 2 సర్వే , 2005-6 ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ సర్వేలలోతగ్గుదల కంటే గణనీయంగా తగ్గాయి. ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ సర్వేలలో1998 నుండి 2005 మధ్య కాలంలో  గిడసబారిన(స్టంటింగ్) శిశువులు, బరువుతగ్గిన(అండర్ వెయిట్) శిశువుల తగ్గుదల రేట్లు  వరుసగా 6, 3 శాతం పాయింట్లు వుండగా, ఇదే కాలంలోశుష్కించిన( వేస్టింగ్) శిశువులు  వాస్తవంలో 3శాతం పాయింట్లు పెరిగారు. పైన పేర్కొన్న ఎన్ ఎఫ్ హెచ్ ఎస్ సర్వేను, యూనిసెఫ్ సర్వే(రాపిడ్ సర్వే ఆన్ చిల్డ్రన్) తో   పోల్చేటప్పుడు ఒక  హెచ్చరికను మనం గమనంలో ఉంచుకోవలసివుంది. ఈ రెండు సర్వేలు వైవిధ్యం కలిగిన  జనాభా పొందికలను,  లెక్కింపు ప్రక్రియలను కలిగి ఉన్నందున, వీటిని ఏ విధంగాను పోల్చలేము. అయినప్పటికీ యూనిసెఫ్ సర్వే సూచించిన గత దశకంలోని గణనీయమైన తగ్గుదల  పౌష్టికాహార లోపంలోని వాస్తవ తగ్గుదల రేట్లను సూచిస్తున్నది. 

గిడసబారటం(స్టంటింగ్), శుష్కించటం(వేస్టింగ్), బరువు తగ్గటం(అండర్ వెయిట్) లాంటి లక్షణాలు శిశువులలో పౌష్టికాహార లోప కొలమానాలుగా వుండి,  పౌష్టికాహార లోపం యొక్క మూలాలలోని  వివిధ అంశాల్ని వివరిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సూచికల ప్రభావాల్ని ఇలా వివరిస్తున్నది. స్టంటింగ్ అంటే గిడసబారటంగా పరిగణిస్తాము. దీనర్ధం వయస్సుకు తగ్గ ఎత్తు లేకపోవటం. శిశువుల పుట్టుక ముందు నుంచి వారిలో పేరుకున్న పౌష్టికాహార లేమిని, క్రిమిదోషకాల(ఇన్ఫెక్షన్) బారిన పడ్డ ప్రభావాన్ని, వారి తల్లులలో తీవ్రమైన పౌష్టికాహార లోపాన్ని శిశువులలో గిడసబారిన బాధితుల శాతం  తెలియచేస్తుంది.  శిశువులను పెరగనీయ కుండా దీర్ఘకాలంగా అదిమిపెట్టిన పెరుగుదల సామర్ధ్యాన్ని, కొనసాగుతున్న అధ్వాన్నపరిస్థితులకు  కొలమానంగా ఈ సూచికను పరిగణించ వచ్చును. శిశువులలో ఎత్తుకు  తగ్గ బరువు లేకపోవటాన్నిశుష్కించటం( వేస్టింగ్) అంటాము. శిశువులలో వయస్సుకు తగ్గ ఎత్తు లేకపోవటం(గిడసబారటం), ఎత్తుకు  తగ్గ బరువు లేకపోవటం  (శుష్కించటం )కలగలిసిన స్థితిని బరువు తగ్గటం(అండర్ వెయిట్) అంటాము. క్లుప్తంగా చెప్పుకుంటే, బరువు తగ్గట మంటే గిడసబారటం, శుష్కించటం ల కలగలిసిన లక్షణం. ఈ స్థితి తీవ్రమైన బరువు లోపాన్ని తెలియచేస్తుంది.'గిడసబారటం' తీవ్రమైన పౌష్టికాహార కొరతకు మెరుగైన సూచిక కాగా, ఇటీవలే తలెత్తిన ఆహార కొరత, తీవ్ర అస్వస్థల మూలంగా ఏర్పడ్డ పౌష్టికాహార లోపానికి 'శుష్కించటం' సూచికగా వుంటుంది. 


యూనిసెఫ్ నివేదిక(రాపిడ్ సర్వే ఆన్ చిల్డ్రన్)  వాస్తవానికి  విలువైన సమాచారాన్ని అందిస్తున్నది.మన దేశం  ప్రశంసించ తగ్గ ఈ స్థాయిని పొందటానికి గత దశాబ్దంగా మనం  ఎంతో కృషి చేసివున్నాము. కాని 'మనకు మనం' పొగుడుకునేముందు తగినంత అప్రమత్తంగా వుండాల్సి వుంది. మెరుగైన స్థాయిని  మనం సాధించామనుకున్నా, శిశు పోష్టికాహరంలో మన దేశం ఇప్పటికి అధ్వాన్నమైన పనితీరు  కలిగిన దేశాలలో ఒకటిగా వుంది.  శిశు పోష్టికాహరంలోఅధ్వాన్నమైన పనితీరును విస్తృతమైన వ్యవస్థీకృత  వైఫల్యాలకు  సూచికగా పరిగణిస్తారు. తగినంత ఆరోగ్య పరిరక్షణ, ప్రజారోగ్య సేవలనందించటం, రక్షిత మంచినీటి సౌకర్యం, పారిశుధ్య సేవలు కల్పించటం, వ్యవసాయ విధానం ఏర్పరచటం, పేదరికాన్ని అదుపుచేసి నిర్మూలించటం లాంటి ప్రాధమిక చర్యలలో వైఫల్యాలే వ్యవస్థీకృత  వైఫల్యాలుగా  పరిగణిస్తాము. మన పిల్లల్ని మనమే  పోషించు కోలేకపోయినప్పుడు, మన సమాజం మొత్తంగా వైఫల్యం చెందినట్లు భావించాలి. ఈ నిర్లక్ష్యం ఏ విధంగాను క్షమార్హం కాదు.
భారత దేశం లోని గిడసబారినశిశువుల స్థాయిని(శిశువులపై రాపిడ్ సర్వే ని ఆమోదించిన తర్వాత) ప్రపంచంలో అతి పేద ప్రాంతాలైన సబ్ సహారా ఆఫ్రికాలోని శిశువుల స్థాయితో పోలిస్తే గాని, మన దేశంలో కొనసాగుతున్న పౌష్టికాహారలోప తీవ్రతను అర్ధంచేసుకోలేము. ఆఫ్రికాలోని సబ్ సహారా ప్రాంతంలోఒక దేశంగా భారతదేశాన్ని పరిగణిస్తే, భారత దేశంలోని గిడసబారినశిశువుల యొక్క  రేటు(39%),సబ్ సహారా ప్రాంత సగటు రేటు(38%) కంటే ఎక్కువగా వుంటుంది. 1. 5కోట్ల జనాభా కల్గిన సబ్ సహారా ప్రాంత దేశాలలోని గిడసబారినశిశువుల రేటు( శాతం ) ఈ క్రింది విధంగా వుంది. 
ఘనా -23, కోట్ డివాయిర్-28, మాలి-28, అంగోలా -29, జింబాబ్వే-32, బుర్కినా ఫాసో-33, కామెరూన్- 33, దక్షిణ ఆఫ్రికా -33, ఉగాండా -33, కెన్యా-35,  నైజేరియా-36,  ఇండియా-39, టాంజానియా-42, డిఆర్ సి-43, మొజాంబిక్-43, ఇథియోపియా-44, నైజర్-44, జాంబియా -45, మలవి-47, మడగాస్కర్-50  (మూలం: ఉనెస్కొ రిపోర్ట్, సబ్ సహారా ఆఫ్రికా :ఓవర్ వ్యూ 2015)

పైన పేర్కొన్న సమాచారమనుసరించి, భారత దేశం సబ్ సహారా ప్రాంతం లోని 11దేశాల కంటే అధమం గాను, 8 దేశాల కంటే మెరుగ్గాను ఉంది. భారత దేశ సగటు సంపద సబ్ సహారా ప్రాంతం లోని దాదాపు అన్ని దేశాల(దక్షిణ ఆఫ్రికా, అంగోలాలను మినహాయించి) సగటు సంపద కంటే 2నుండి 5 రెట్లు వుంది. వికసిస్తున్న ఆర్ధిక వ్యవస్థలలో ఒకటిగా పరిగణింప బడుతూ , ప్రపంచంలో అత్యధికంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా(వివాదాస్పదమైన  గణాంకాలతో)  భావింప బడుతున్న  భారత దేశం, శిశువుల పోషణలో ప్రపంచంలోని అతి పేద దేశాల కంటే అధ్వాన్నంగా వున్నదన్నది తిరుగులేని వాస్తవం. 

వామపక్షాల పలుకుబడి మరియు సంక్షేమ కార్యక్రమాలు  

కాని శిశువులపై రాపిడ్ సర్వే సమాచారం సూచించినట్లు, మనం గణనీయమైన మెరుగుదలను సాధించే క్రమంలో వున్నట్లు అనిపిస్తుంది. ఈ మెరుగుదలను ఎలా  సాధించామో  గమనించటం ముఖ్యమైన అంశం. గత దశాబ్ద మంతా యూపియే ప్రభుత్వం అధికారంలో వున్న కాలం. ఈ కాలమంతా ప్రభుత్వం నయా ఉదార వాద విధానాలను అమలు జరిపి కార్పొరేట్ల, బడా వ్యాపారస్తుల ప్రయోజనాల్ని ప్రోత్సహించింది. అయినప్పటికీ, నయా ఉదార వాద సంస్కరణల దుష్ప్రభావాల నుండి ప్రజానీకాన్ని రక్షించడం కోసం ఈ కాలంలో చేపట్టిన  కొన్ని విధానాలు,కార్యక్రమాలు సామాన్య ప్రజానీకానికి  కొంత ఉపశమనాన్ని కలిగించాయి . ఈ ఉపశమనం యాదృశ్చికం గానో లేదా కాంగ్రెస్ నాయకత్వంలోని యూపియే ప్రభుత్వం యొక్క పెద్ద మనస్సుతో, దాతృత్వంతో లభించింది కాదు.  యూపియే-1 ప్రభుత్వం కాలంలో దాన్ని ప్రభావితం చేయగల వామ పక్ష పార్టీల నిరంతర ఒత్తిడి వల్లనే సాధ్యమయింది. దాని మూలకంగానే జాతీయ గ్రామీణ ఉపాధి పధకం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ లు అమలు చేయబడ్డాయి. ప్రజా పంపిణి విధానం ద్వారా ఆహార భద్రతకు గ్యారంటీ ఇవ్వడంలో తగినంతగా  కాకపోయినా కొంత ప్రగతి సాధ్యమైంది. శిశువుల పౌష్టికాహార అవసరాలను ప్రత్యక్షంగా తీర్చకలిగే సమగ్ర శిశు అభివృద్ది పధకం మరియు మధ్యాన్న భోజన పధకాలపై కొంత శ్రద్ధ చూపబడింది. వామ పక్ష పార్టీల నిష్క్రమణ తర్వాత కూడా,  యూపియే-2 ప్రభుత్వ కాలంలో అంతకు ముందున్న ప్రభావం తోను, ప్రజా ఉద్యమాల ఒత్తిదితోను ఈ పధకాలలో అత్యధిక భాగం కొనసాగాయి. ఈ స్కీములతో పాటు ఇతర సాంఘిక సంక్షేమ పధకాలకు తగినంత నిధులు అందించక పోయినా , నయా ఉదార వాద సంస్కరణల దుష్ప్రభావాల  నుండి  పేద ప్రజానీకానికి ఈ పధకాలు  కొంత ఉపశమనాన్ని కలిగించాయి.ఈ రోజు మనం చూస్తున్న శిశు పౌష్టికాహారలోపం లోని తగ్గుదల రేటు సంక్షేమ పధకాల(ప్రజాకర్షక పధకాలుగా బూర్జువా పత్రికలు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాయి) సానుకూల ప్రయోజనంగా అంగీకరించాల్సి వుంది. 

సర్వే పరిశీలనల్ని  ఎందుకు దాచాలి?

సర్వే పరిశీలనల్ని ఇంకా రహస్యంగానే వుంచారు. దేశాన్ని ప్రతికూలంగా చిత్రీకరిస్తున్న సమాచారాన్ని దాచటం వెనుక ప్రభుత్వం ఉద్దేశ్యాన్ని(మన్నించక పోయినా ) అర్ధం చేసికోవచ్చు. గత దశాబ్దాలుగా సిగ్గుతో తలదించుకొనేటట్లున్న అంశాలలో మెరుగుదలను సాధించినట్లు వివరించే సమాచారాన్ని ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగా ఎందుకు దాస్తున్నట్లు ? శిశు పౌష్టికాహార లోపంలో మెరుగుదల ప్రారంభమైన  తరుణంలో, ఆ సమాచారాన్ని రహస్యంగా ఎందుకు వుంచాలి ? దీనికి వివరణ రాష్ట్రాల వారీ శిశు పౌష్టికాహార లోపం సమాచారంలో దొరుకుతుంది. రాష్ట్రాల వారి సమాచారాన్ని పరిశీలిస్తే, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఫలితాలు వాస్తవాన్ని బట్టబయలు చేస్తాయి.తన ఉక్కు పిడికిలితో 14సంవత్సరాలు పరిపాలించిన  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వంత రాష్ట్రం(గుజరాత్), శిశు పోష్టికాహరలోప యాజమాన్య పనితీరుకు సంబంధించిన  అన్ని కొలమానాలలో జాతీయ సగటు కంటే అధ్వాన్నంగా వుంది. ఈ  రాష్ట్ర పనితీరు,  సాంప్రదాయకంగా సామాజికార్ధికంగా వెనుకపడ్డ రాష్ట్రాలతో సమానంగా, కొన్ని అంశాలలో వాటి కంటే దౌర్బాగ్యంగా వున్నది. 

శిశు పౌష్టికాహార స్థాయి(5సం.లోపు శిశువులశాతం)-ఉత్తమ పనితీరుగల రాష్ట్రాలు 
                     గిడసబారినవారు        శుష్కించినవారు         బరువు తగ్గిన వారు 
కేరళ                   19.5                       15.5                      18.5
గోవా                   21.3                      15.4                       16.2
తమిళనాడు          23.3                       19.1                       23.3
మిజోరాం              26.9                       14.3                      14.8
సిక్కిం                  28.0                        5.1                        15.8
అరుణాచల్           28.4                       17.0                       24.6
 నాగాల్యాండ్         29.1                       11.8                      19.5
ఢిల్లి                     29.2                       14.2                      19.4 
పంజాబ్                30.5                         8.7                      16.1                 
భారత్ సగటు       38.8                         15                       29.4


పౌష్టికాహార లోపం -గుజరాత్, కొన్ని రాష్టాలు 

బీహార్                   49.4                           13.1                   37.1
ఛత్తీస్ ఘర్            43                              12.9                   33.9
గుజరాత్             41.8                           18.7                   33.5
జార్ఖండ్                47.3                           15.6                    42.1
మధ్యప్రదేశ్           41.6                          17.5                     36.1
ఒడిష                  38.2                           18.3                    34.4
రాజస్థాన్              36.5                           14.2                   31.5
ఉత్తరప్రదేశ్            50.6                           10.0                   34.5
భారత్ సగటు       38.8                          15.0                   29.4
(మూలం: ఎకనామిస్ట్ పత్రిక )


స్థూల తలసరి ఆదాయ గణాంకాలలో భారత దేశంలోనే సంపన్న రాష్ట్రాలలో ఒకటిగా కీర్తింపబడుతున్న గుజరాత్ పౌష్టికాహారలోప యాజమాన్య పనితీరు(సరిగ్గా చెప్పుకోవాలంటే, పనితీరే లేకపోవటం ) ప్రత్యేకంగా కొట్టోచ్చినట్లుంది. మూడు సూచికలలో  పనితీరు రాజస్తాన్ కంటే అధమంగా వుంది. రెండు సూచికలలో మధ్యప్రదేశ్, ఒడిషా కంటే, ఒక సూచికలో బీహార్, జార్ఖండ్,ఉత్తరప్రదేశ్ ల కంటే అధమంగా వుంది. కృశించిన శిశువుల శాతంలో అది అన్ని రాష్ట్రాల కంటే అధ్వాన్నంగా వుంది. సర్వే డేటా లో ప్రజారోగ్య కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం కూడా వున్నది. మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే రోగనిరోధక శక్తి ని పెంచే(ఇమ్యునైజేషన్) కార్యక్రమాలలో  గుజరాత్ బాగా వెనుకబడి వుంది. టీకాలు వేసే(వ్యాక్సినేషన్) కార్యక్రమాలలో దేశంలో అత్యధిక డ్రాప్ ఔట్స్ గుజరాత్ లోనే వున్నారు

ఇమ్యునైజేషన్ కవరేజ్: గుజరాత్, కొన్ని రాష్ట్రాలు :12నుండి 23 నెలల శిశువులలో శాతం 
                                   పూర్తి ఇమ్యునైజ్ద్           వాక్సినేషన్ లో డ్రాప్ ఔట్స్ 
  బీహార్                                 60.4                               9.8                
  ఛత్తీస్ ఘర్                           67.2                              20.1
  గుజరాత్                            56.2                               20.8            
  జార్ఖండ్                               64.9                              12.4               
  మధ్యప్రదేశ్                           53.5                              14.8            
   ఒడిష                                62.0                               7.0               
    రాజస్థాన్                           61.0                               9.6               
   ఉత్తరప్రదేశ్                          47.0                               17.4 
   భారత్ సగటు                     65.2                               11.9                                


ఇప్పటికి పిల్లి సంచి నుండి బయట పడింది! నరేంద్ర మోడీ కీ, బిజెపి పార్టీ కి గుజరాత్ నయా ఉదార వాద ప్రచార కర్త గా వుంది. గుజరాత్ బిజెపి యొక్క  ప్రయోగశాలకూడా. గుజరాత్ తరహా అభివృద్ది నమూనాను భారత దేశం మొత్తానికి అందిస్తానని బిజెపి వాగ్దానం చేసింది. మనకు తెలిసిన నయా ఉదార వాద విధానాల తీవ్ర రూపమైన  గుజరాత్ తరహా అభివృద్ది నమూనాను, విచ్చిన్నకర సామాజిక విధానాలతో జత చేసి నమాజంలో అణగారిన ప్రజల జీవితాల్ని మరింతగా దుర్భరం చేయటానికి బిజెపి పూనుకుంది. యూనిసెఫ్ సర్వే (రాపిడ్ సర్వే ఆన్ చిల్డ్రన్) నరేంద్రమోడి నాయకత్వంలో బిజెపి పాలన దుష్ప్రభావాల్ని బహిర్గతం చేస్తున్నది. . 

నయా ఉదార వాద సంస్కరణలను ప్రశ్నిస్తున్న ఋజువును దాచే ప్రయత్నం

ప్రభుత్వానికుండే ఒత్తిళ్ళ మూలకంగా, గుజరాత్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నల నుండి ఆపటం సాధ్యంకాక పోవచ్చును. మనం ఇంతకుముందు చర్చించుకున్నట్లు, యూనిసెఫ్ సర్వే ఫలితాలు శిశు పౌష్టికాహారం లోని మెరుగుదలను సాధించటానికి దోహదపడ్డ కార్యక్రమాలను గుర్తించింది. వచ్చిన సమస్య యేమంటే, ఈ కార్యక్రమాలనే గత సంవత్సరం నుండి క్రమబద్దంగా రద్దు చేయటానికి బిజెపి ప్రభుత్వం పూనుకుని, ఇటీవలి బడ్జెట్లో సామాజిక రక్షణ, సంక్షేమానికి సహకరించే అన్ని కార్యక్రమాలపై అమానుష కోతలను విధించింది. నయా ఉదార వాద సంస్కరణల దూకుడును పునరాలోచించాల్సిన ఋజువులను సహించ కలిగే స్థితిలో బిజెపి లేదు. 

బహుశా ఎన్డియే, బిజెపి లకు దురదృష్టమెమో!  యూనిసెఫ్ సర్వే కీలక పరిశీలనలు ఇప్పటికే  ప్రజా క్షేత్రంలో అందుబాటులోకొచ్చాయి. ప్రభుత్వం ఆలస్యంగానైనా  యూనిసెఫ్ సర్వే నివేదిక వుందని అంగీకరించాల్సి వచ్చింది. రాష్ట్ర స్థాయి సమాచారంలో లెక్కించే ప్రక్రియలో సమస్యలున్న కారణంగా నివేదికను దాచాల్సి వచ్చిందని ప్రభుత్వం సమర్ధించుకుంటుంది.  సర్వేకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియలో సమస్యల పరిశీలనకు ఒక కమిటీని వేసినట్లు ప్రభుత్వం ప్రకటన కూడా చేసింది. సమర్ధించుకోలేని సమస్య సాధనకు ప్రభుత్వం ఎండమావిలో నీళ్ళు త్రాగాలనుకున్నట్లుంది.   

అనువాదం: కొండముది లక్ష్మీప్రసాద్

No comments: