Tuesday, February 2, 2016

భారత ద్రవ్య స్మృతి -సంక్షిప్త పరిచయం   


2011లో  కేంద్ర ప్రభుత్వం చే  నియమింపబడిన జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో పదిమంది సభ్యులతో ఏర్పాటు చేయబడ్డ  ద్రవ్య రంగ చట్ట సంస్కరణల కమిషన్ తో భారత దేశంలో ద్రవ్యరంగ సరళీకరణ  కీలకదశకు చేరింది. అంతర్జాతీయ పోటికి నిలబడగలిగే, సమర్ధవంతమైన  అధునాతన ఆర్ధిక వ్యవస్థను నిర్మించటానికి వీలుగా   ద్రవ్యరంగ చట్ట సవరణలు ప్రతిపాదనలకోసం ఈ కమిషన్ ను నియమించినట్లు అప్పటి యుపియే ప్రభుత్వం తెలియ చేసింది. అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడి స్వేచ్చాచలనానికి కి భారత్ లోని ద్రవ్య రంగ చట్టాలు అవరోధంగా,అసమగ్రంగా  వున్నాయన్న విమర్శల నేపధ్యంలో  క్లిష్టమైన  ప్రస్తుత ద్రవ్య రంగ  చట్టాలను రెండు సంవత్సరాల పాటు  అధ్యయనం చేసి , మార్చి 2013న జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి  సమర్పించింది. ఈ నివేదిక రెండు భాగాలుగా తయారుచేయబడింది. దేశ విదేశాలలోని ఆర్ధికవేత్తలు, విధాన అధ్యయనకర్తలు,న్యాయ నిపుణులు, ప్రయోజనార్దులతో విస్తృత చర్చలు,సంప్రదింపులను జరిపి, ద్రవ్య రంగ కమిషన్ తమ ప్రతిపాదనలను,విశ్లేషణలను మొదటి భాగంలో పొందుపరిచింది. వీటి ప్రాతిపదికన రెండవ భాగంలో ద్రవ్య రంగ పటిష్టతకు ప్రస్తుతమున్న చట్టాల స్థానంలో ప్రవేశ పెట్టాల్సిన  నూతన చట్ట ముసాయిదాను  “భారత ద్రవ్య స్మృతి” గా  రూపొందించింది.


15 ద్రవ్య రంగ చట్టాలను మార్చి తయారు చేయబడ్డ భారత ద్రవ్య స్మృతి ముసాయిదా బిల్లు 450క్లాజులను,6 షెడ్యూళ్ళను కలిగి వుంది. భారత ఆర్ధిక వ్యవస్థ వచ్చే 25-30 సంవత్సరాలలో తన  ప్రస్తుత పరిమాణం కంటే 8 రెట్లు అంటే ప్రస్తుతం మున్న అమెరికా ఆర్ధిక వ్యవస్థ కంటే పెద్దదిగా పెరిగే అవకాశముందని, దానికి తగ్గట్లు భారత  ద్రవ్య స్మృతి రూపొందించబడి, భవిష్యత్ కాల పరీక్షకు తట్టుకోగలుగుతుందని ద్రవ్య రంగ చట్ట సవరణల కమిషన్ ఆశావహాన్ని వ్యక్తం చేసింది.  అత్యధిక శ్రమకోర్చి ఈ చట్టాన్ని తయారు చేసినప్పటికీ కమిషన్ కొనసాగిన కాలంలో 10 మంది సభ్యుల్లో ఇద్దరు సభ్యులు మృతి చెందగా, ఒక సభ్యుడు కమిషన్ పనిలో లేరు. మిగిలిన సభ్యులలో నలుగురు కమిషన్ ప్రతిపాదించిన వివిధ అంశాలపై తమ అసమ్మతిని తెలియచేశారు.  కమిషన్ ప్రతిపాదనలలో భారత రిజర్వు బ్యాంకు పరిధిని భారీగా కుదించటం ప్రధాన అంశంగా వుండటంతో ఈ ముసాయిదా రిజర్వు బ్యాంకు పూర్వ అధినేతలు, ద్రవ్య రంగ నిపుణుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంది.  ఈ ముసాయిదాను మానసిక వైకల్యంతో(సిజోఫ్రానిక్) రూపొందించిన ముసాయిదా గా రిజర్వు బ్యాంకు ప్రస్తుత గవర్నరు రఘురాం రాజన్ ఆనాడు వ్యాఖ్యానించారు.
                                                                                  
భారత ద్రవ్య స్మృతి-2


భారత ద్రవ్య స్మృతిని విడుదల చేసిన రెండు సంవత్సరాల తర్వాత ఆ ముసాయిదాను   మరింతగా  తాజా పరచి   ప్రజలు, ప్రయోజనార్దుల స్పందనల  కోసం 23జూలై 2015 న ఆర్ధిక మంత్రిత్వ శాఖ తన వెబ్ సైట్ లో వుంచింది. దీనినే భారత ద్రవ్య స్మృతి-2 అని అంటున్నాము.  స్పందనలను స్వీకరించటానికి  కేవలం రెండు వారాలే  గడువు పెట్టింది. ద్రవ్య రంగ చట్ట సవరణల కమిషన్ ప్రతిపాదించిన కొన్ని మౌలికాంశాలు భారత ద్రవ్య స్మృతి-2లో తీవ్రమైన మార్పులకు గురి కావటంతో తాజా పరిచిన ముసాయిదా మరింతగా వివాదాస్పద మైంది.

రిజర్వు బ్యాంకు మౌలిక  అధికారాలను, విస్తృతిని కత్తిరింఛి,సుదీర్ఘ కాలంగా  భారత ఆర్ధిక వ్యవస్థకు ఆయువుపట్టు గా నిలిచిన భారత దేశ కేంద్ర బ్యాంకును ఒక సాధారణ ద్రవ్యరంగ నియంత్రణ సంస్థగా  మార్చిన  భారత ద్రవ్య స్మృతి-2 పై  శ్రీ రంగరాజన్, శ్రీ వై వి  రెడ్డి,ఎస్. ఎస్.తారాపూర్ లాంటి మాజీ రిజర్వు బ్యాంకు గవర్నర్లు,  ఆర్ధిక వేత్తలు, న్యాయ నిపుణులు, విశ్లేషకులు, మూడి లాంటి అంతర్జాతీయ రేటింగ్ సంస్థల  తీవ్ర వ్యతిరేకతలు, నిరసనలు వ్యక్తమయ్యాయి.విశేషమేమిటంటే, జస్టిస్ శ్రీ కృష్ణ(కమిషన్ చైర్మన్) స్పందిస్తూ తాజా పరచబడిన  భారత ద్రవ్య స్మృతి ముసాయిదా(భారత ద్రవ్య స్మృతి-2)  తనది కాని, తాను నేతృత్వం వహించిన కమిషన్ ది కాని కాదని, అది భారత  ప్రభుత్వానిదని స్పష్టపరిచారు. ఆర్ధిక శాఖా కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి  ప్రకటన చేస్తూ, తమ ప్రభుత్వం కాని, ద్రవ్య రంగ చట్ట సంస్కరణల కమిషన్ కాని తాజా పరిచిన ముసాయిదా కు స్వంత దారులు కాదని, భారత  దేశ ప్రజలే  దీని స్వంతదారులని , ప్రభుత్వంగాని, కమిషన్ గాని ప్రజల అభిప్రాయాలను సంకలనం మాత్రమే చేసిందన్నారు. రాజీవ్ మెహ్రిషి, జస్టిస్ శ్రీకృష్ణ లు చేసిన పై ప్రకటనల బట్టి, ఆర్ధిక మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో ప్రజా వ్యాఖ్యల కోసం వుంచిన తాజా పరిచిన భారత ద్రవ్య స్మృతి-2 ముసాయిదాకు తల్లితండ్రులేవరో  జవాబు లేని ప్రశ్నగా మిగిలింది . ఈ నేపధ్యంలో వివాదాస్పదమైన భారత ద్రవ్య స్మృతి-2 ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిన  ఎన్డియే ప్రభుత్వ తీరుపై అందరి దృష్టి కేంద్రీకరింప బడింది.


రిజర్వు బ్యాంకు పై కేంద్ర ప్రభుత్వ అక్కసు


2008 ప్రపంచ ద్రవ్య సంక్షోభం తర్వాత పశ్చిమ దేశాలు, వారివారి కేంద్ర బ్యాంకులకు మరిన్నినూతన   అధికారాలనిచ్చి పటిష్ట పరుస్తుంటే,మన దేశంలో ప్రతిపాదింప బడ్డ నూతన ద్రవ్య స్మృతి రిజర్వు బ్యాంకు అధికారాలను బాహాటంగా కత్తిరించటానికి పూనుకోవడం వివిధ వర్గాల్ని విస్మయ పరిచింది.   ద్రవ్యపరపతి  విధానంలో బిగింపు దశ నుండి ఎప్పుడు సడలించాలనేది, దీర్ఘకాలికంగా వున్న సంశయం. అధికారంలో ఎవరున్నారన్న అంశంతో  నిమిత్తం లేకుండా వివిధ ప్రభుత్వాలు, ద్రవ్య నియంత్రణ సంస్థల  మధ్య  భేదాభిప్రాయాలు, ఘర్షణ సుదీర్ఘ  కాలంగా వున్నాయి. 1935లో రిజర్వు బ్యాంకును ఏర్పరిచేటప్పుడు,ఇది జాతీయోద్యమానికి కొమ్ముకాస్తుందేమోనన్న సంశయం బ్రిటిష్ ప్రభుత్వానికి వుండేదిట.  2004 సంవత్సరం వరకు కేంద్రానికి,కేంద్ర బ్యాంకుకు మధ్య వున్న  మనస్పర్ధలు నాలుగు గోడల మధ్య పరిష్కార మౌతుండేవి. 2004 తర్వాత ఈ భేదభావాలు బహిరంగ చర్చలుగా బయట బడి, 2008 ప్రపంచ  ద్రవ్య సంక్షోభం తర్వాత రచ్చకెక్కాయి.  కొన్ని సంవత్సరాలనుండి పెట్టుబడి ఖాతా సరళీకరణ పై రిజర్వ్ బ్యాంకు, ప్రభుత్వం మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగాయి. ఫైనాన్స్ మార్కెట్ల ఒత్తిడులతోను,వారి స్వంత ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వ వర్గాలు పెట్టుబడి ఖాతాను మరింతగా  సరళీకరింఛి ఈక్విటీ,రుణ మార్కెట్లను  విస్తృత పరచాలని భావిస్తున్నాయి. ఈ దిశలో కేంద్ర బ్యాంకు వైఖరి భిన్నంగా ఉండటంతో,ఈక్విటీ,రుణ మార్కెట్ల విస్తరణకు రిజర్వ్ బ్యాంకు అడ్డుగా వుందని  భావిస్తూ   ఫైనాన్స్ మార్కెట్లు కినుకగా  వున్నాయి.   ఫైనాన్షియల్ మార్కెట్ల సరళీకరణను అతి వేగంగా జరపాలని తహతహ లాడుతున్న ప్రభుత్వానికి కూడా రిజర్వ్ బ్యాంకు ధోరణి నచ్చ లేదు.


గత కొంత కాలంగా  లక్ష్యిత ద్రవ్యోల్బణ ధ్యేయాలను సాధించాల్సిన  సందర్భాలలో బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించే విషయంలో  రిజర్వ్ బ్యాంకు అనుసరించిన వైఖరిపై కేంద్ర ప్రభుత్వం, పారిశ్రామిక వర్గాలు కలసిగట్టుగా దుమ్మెత్తి పోశాయి. రిజర్వు బ్యాంకు స్వయం ప్రతిపత్తిపై తీవ్ర చర్చ నడిచింది.  ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక సంక్షోభం తదనంతర కాలంలో లక్ష్యిత ద్రవ్యోల్బణ భావనలోని డొల్లతనం కూడా బట్ట బయలైంది. లక్ష్యిత ద్రవ్యోల్బణం మరియు రిజర్వ్ బ్యాంకు స్వయంప్రతిపత్తి - రెండూ  వేరువేరు అంశాలు. లక్ష్యిత ద్రవ్యోల్బణం లో వున్న విశ్వాసం, కేంద్రబ్యాంకుకు ఇవ్వాల్సిన స్వేచ్చకు అడ్డంకి కాకూడదనేది నిపుణుల భావన. .


2010 లో ఆర్ధిక మంత్రి చైర్మన్ గా, రిజర్వు బ్యాంకు తో సహా వివిధ ద్రవ్య నియంత్రణ సంస్థల అధినేతలు సభ్యులుగా ద్రవ్య సుస్థిరత మరియు అభివృద్ది సమితి”( ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్ మెంట్ కౌన్సిల్)ఏర్పాటు చేసారు. ఈ సమితి నిర్వహించిన సమావేశాల్లో రిజర్వు బ్యాంకుతో సహా వివిధ నియంత్రణ సంస్థల అధినేతలు, సమితి పనివిధానం తమ నియంత్రణ సంస్థల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని ఆరోపించారు. సమితి పదే పదే ప్రస్తావించే ద్రవ్య రంగ అభివృద్ది,విస్తరణ తమ పని కాదని తెగేసిచెప్పారు. వీరితోపాటు ద్రవ్యరంగ సరలీకరణను వ్యతిరేకించే శక్తులు ప్రపంచ ద్రవ్య సంక్షోభం తర్వాత పెరిగాయి. వీరి వైఖరికి  సమాధానం గానే  ద్రవ్య రంగ చట్ట సంస్కరణల కమిషన్ రంగంలోకి దించారని  కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
ఈ పూర్వరంగంలో గత దశాబ్ద కాలం నుండి ప్రణాళికబద్ధ   విధాన నిర్ణయాలతో రిజర్వ్ బ్యాంకు స్వయంప్రతిపత్తిని దెబ్బతీయాలని అన్ని కేంద్ర ప్రభుత్వాలు ఉద్దేశ్యపూర్వక ప్రయత్నాలను ముమ్మరం చేశాయి.  అంతిమంగా కేంద్ర ప్రభుత్వ చర్యలు ద్రవ్య రంగ చట్ట సవరణల కమిటీ ఏర్పాటుకు దారితీశాయి.


మారనున్న రిజర్వు బ్యాంకు రూపం


ఆసియా ద్రవ్య సంక్షోభం,ఇటీవలి ప్రపంచ ద్రవ్య సంక్షోభం నేపధ్యంలో ప్రపంచ వ్యాప్త మన్ననలు పొందిన భారత రిజర్వు బ్యాంకు పటిష్టతకు, స్వయంప్రతిపత్తికి తగిన చర్యలు ప్రతిపాదించ కుండా, భారత ద్రవ్య స్మృతి-2 ముసాయిదా రిజర్వు బ్యాంకు పై  బహు ముఖాలుగా దాడిని ఎక్కుపెట్టింది. ప్రస్తుతం రిజర్వు బ్యాంకు - ద్రవ్యపరపతి విధాన నిర్వహణ, ద్రవ్య సుస్థిరత,బ్యాంకులు మరియు బ్యాంకేతర సంస్థల నియంత్రణ/ అజమాయిషీ,విదేశీ మారకం యాజమాన్యం, ప్రభుత్వ బాండ్లు, డెరివేటివ్ మార్కెట్ల నిర్వహణ, ప్రభుత్వ అప్పు కరెన్సీ రేట్ల నిర్వహణ,డిపాజిట్ ఇన్స్యూరెన్స్ మరియు పరపతి గ్యారెంటీ కార్పోరేషన్ నిర్వహణ లను నిర్వహిస్తూ  చెల్లింపులు,పరిష్కారాల వ్యవస్థకు దేశంలోనే అత్యున్నత అదికార సంస్థగాను, ద్రవ్య పరపతి వ్యవస్థకు గుండె కాయగా వ్యవహరిస్తున్నది.


భారత ద్రవ్య స్మృతి ప్రకారం రిజర్వు బ్యాంకు భవిష్యత్ చిత్రం ఎలా వుంటుందో చూద్దాం.  భారత ద్రవ్య స్మృతి ప్రకారం రిజర్వు బ్యాంకు అధీనంలో ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాల అమలు, షెడ్యుల్డ్ బ్యాంకుల నియంత్రణ/పర్యవేక్షణ. కరెన్సీ నిర్వహణ, చెల్లింపులు,పరిష్కారాల వ్యవస్థ నిర్వహణ మాత్రమె వుంటాయి. విదేశీ మారక ద్రవ్య నిల్వల నిర్వహణ పై స్పష్టమైన ప్రస్తావన లేదు. బ్యాంకింగేతర సంస్థల నియంత్రణ,పర్యవేక్షణ, విదేశీ మారక ద్రవ్యం ,డెరివేటివ్, ప్రభుత్వ సెక్యురిటీ మార్కెట్ల కార్యకలాపాలను నూతనంగా ఏర్పాటు చేయబోయే “ ఫైనాన్షియల్ అధారిటీ” నియంత్రిస్తుంది. ఈ అధారిటి యే బ్యాంకింగ్,చెల్లింపు వ్యవస్థల కార్యకలాపాలు కాకుండా మిగిలిన అన్ని రకాల ద్రవ్య రంగ సేవల్ని నియంత్రిస్తుంది.  దీని నిర్వహణకు ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు నామినేట్ చేసిన సభ్యులుంటారు. ఇది ప్రధానంగా ఆర్ధిక మంత్రిత్వ శాఖ అధీనంలో వుంటుంది.డిపాజిట్ ఇన్స్యూరెన్స్ మరియు పరపతి గ్యారెంటీ కార్పోరేషన్ నిర్వహణను రిజల్యూషన్ కార్పోరేషన్ కు అప్పగిస్తారు. చివరకు రిజర్వు బ్యాంకు గవర్నర్ ను చైర్మన్ గాను,డిప్యూటి గవర్నర్లను సభ్యులుగాను మార్చాలని కమిషన్ ప్రతిపాదించింది.  


కమిషన్ ప్రతిపాదించిన సంక్షిప్త  భారత ద్రవ్య స్మృతి-ప్రభావాలు


ద్రవ్య వ్యవస్థలోని  వివిధ రంగాలను నియంత్రిస్తున్న చట్టాలనన్నింటిని కలిపి, రంగాల కతీతంగా సూత్రబద్ధంగా తయారు చేయబడ్డ చట్ట ముసాయిదాయే భారత ద్రవ్య స్మృతి. ఈ ద్రవ్య రంగ చట్టం తొమ్మిది విభాగాలను కలిగివుంది.

ద్రవ్య పరపతి  విధాన కమిటీ (మానిటరి పాలసీ కమిటీ)

 ద్రవ్య పరపతి విధానానికి చట్టపరమైన జవాబుదారీ యంత్రాంగాన్ని ఏర్పరచాలి. ఆర్ధిక మంత్రిత్వ శాఖ పరిమాణాత్మక లక్ష్యాన్ని నిర్దేశించి,పర్యవేక్షించాలి. ఈ లక్ష్యాన్ని రిజర్వు బ్యాంకు తన దగ్గర వున్న సాధనాలతో అమలు చేయాలి.   రిజర్వు బ్యాంకు అధికారాలను ఎలా అమలు చేయాలో నిర్ణయించటానికి ద్రవ్య పరపతి విధాన కార్యవర్గ కమిటీ ఏర్పాటు చేయబడుతుంది


పర్యవసానాలు  
ప్రస్తుతం భారత దేశంలో ద్రవ్య పరపతి విధాన నిర్వహణ బాధ్యతను రిజర్వు బ్యాంకు, ద్రవ్య విధాన బాధ్యతను  ఆర్ధిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నాయి. ద్రవ్య పరపతి విధాన బాధ్యతను ప్రభుత్వం రిజర్వు బ్యాంకు బోర్డు కు కట్టబెట్టినప్పటికి, బోర్డు ఈ బాధ్యతను దాదాపుగా గవర్నర్ కు అప్పచెప్పింది. కానీ నూతన ద్రవ్య స్మృతి  ఈ బాధ్యతను రిజర్వు బ్యాంకు నుండి తప్పించి, ద్రవ్య పరపతి విధాన కమిటీ కి అప్పచెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్య పరపతి విధాన బాధ్యతను ద్రవ్య పరపతి విధాన కమిటీలే నిర్వహిస్తున్నాయన్న నెపంతో  మన దేశంలో కూడాఅదే విధానాన్ని  అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు సమర్ధించు కుంటున్నాయి. వివిధ దేశాల అనుభవాలలో ద్రవ్య పరపతి విధాన బాధ్యతను కమిటీలకు అప్పచెప్పినప్పటికి, వాటి చైర్మన్ అభిప్రాయాలకే అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు తెలుస్తుంది. భారత ద్రవ్య స్మృతి 8 సభ్యులుగల ద్రవ్యపరపతి కమిటీలో ఇద్దర్ని రిజర్వు బ్యాంకు నుండి నలుగుర్ని ప్రభుత్వం నియమించే బయట వ్యక్తులతో భర్తీ చేయాలన్నది. కాని కమిటీ చైర్మన్ గా పిలబడే గవర్నర్ కు వీటో అధికారాన్ని ఇచ్చి పరిస్థితిని కొంత మేరకు రక్షించింది.  ఆ అంశం పై ప్రభుత్వం నియమించిన ఉర్జిత్ పటేల్ కమిటీ ఐదుగురు సభ్యుల కమిటీ లో ముగ్గుర్ని రిజర్వు బ్యాంకు నుండి, ఇద్దరు  ప్రభుత్వ నియామకుల్ని బయటి నుండి తీసికోవచ్చునన్నది . గవర్నరుకు వీటో అధికారాన్ని  తొలగించింది.                                    

భారత ద్రవ్య స్మృతి -2లో పేర్కొన్న ప్రతిపాదనలో నూతన ద్రవ్య పరపతి విధాన కమిటీ లో 6గురు సభ్యులుంటారు. వీరిలో నలుగురిని కేంద్ర  ప్రభుత్వం బయట నుండి  నియమిస్తుంది.ఇద్దరిని రిజర్వు బ్యాంకునియమిస్తుంది. గవర్నరు ఈ కమిటీకి చైర్మన్ గా వుంటారు.ఈ నిర్మాణం తో  సహజంగా ప్రభుత్వ నిర్ణయాలే కమిటీ నిర్ణయాలుగా ఉంటాయి.  కమిటీ నిర్ణయాలపై గవర్నర్ కు వీటో అధికారం వుండదు.  ఇంతవరకు రిజర్వు బ్యాంకు నిర్వహిస్తున్న,వడ్డీ రేట్ల నిర్ణయంతో సహా ద్రవ్య పరపతి విధానానికి సంబంధించిన అన్ని అంశాలను ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్వహిస్తుంది.  ఈ లక్షణాలతో భారత ద్రవ్య స్మృతి -2 వివాదాస్పద మైంది. సహజంగా అధిక వృద్ది రేట్ల పై మోజు పడే ప్రభుత్వాలు వడ్డీ రేట్లు తక్కువగా వుండాలను కుంటాయి.ఈ బాధ్యతను ప్రభుత్వ అధీనంలోని ద్రవ్యపరపతి విధాన కమిటీ నిర్వహిస్తుంది.  కాని రిజర్వు బ్యాంకుకు ద్రవ్యోల్బణ నియంత్రణ బాధ్యతను అప్పచెప్పటం,పరిణామాలకు జవాబుదారీ చేయటం  జరిగింది. ద్రవ్యోల్బణం పెరిగే సందర్భాలలో దానిని నియంత్రించేందుకు సహజంగా ఉపయోగించే సాధనం వడ్డీ రేట్లను పెంచటం. వడ్డీ రేట్ల పెంపు అనివార్యంగా వృద్ది రేట్ల పై అననుకూల ప్రభావాన్ని చూపుతుంది.దీని కారణంగా ప్రభుత్వ నామినీలతో ప్రభావితమయ్యే కమిటీతో వైరుధ్యాలు తరచూ వుండే ప్రమాదముంది. కమిటీలో అత్యధిక సభ్యులు ప్రభుత్వ నామినీలు వుండటంతో స్వార్ధ పర రాజకీయాలు కమిటీ నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశముంది. ఈ పరిణామాలు స్థూల ఆర్ధిక వ్యవస్థ సుస్థిరతకు ప్రమాదకరం. అందువల్లే  ఈ అంశాన్నే అనేక మంది ఆర్ధికవేత్తలు,బ్యాంకర్లు,కేంద్ర బ్యాంకులు తీవ్రంగా వ్యతిరేకించాయి . వాళ్ళ దృష్టిలో ద్రవ్య పరపతి విధాన నిర్ణేతగా  కేవలం కేంద్ర బ్యాంకు(రిజర్వు బ్యాంకు) మాత్రమే వుండాలి.


కొసమెరుపు

ఈ తీవ్ర వ్యతిరేకతకు ఖంగుతిన్న కేంద్ర ప్రభుత్వం,రిజర్వు బ్యాంకుతో  ద్రవ్య పరపతి విధాన కమిటీ ఏర్పాటుపై ఇటీవలే ఒక అవగాహనకు వచ్చినట్లు, వివరాలు పార్లమెంటు సమావేశాల్లో ప్రకటించబడుతాయని తెలుస్తుంది. ఈ ప్రతిపాదిత కమిటీలో 5గురు సభ్యులుంటారు. ముగ్గుర్ని రిజర్వు బ్యాంకు నియమిస్తుంది. ఇద్దర్ని ప్రభుత్వం బయట నుండి నియమిస్తుంది. రిజర్వు బ్యాంకు గవర్నరు కమిటీ చైర్మన్ గా వుండి, ఏ సభ్యుడైనా హాజరు కాని సందర్భంలో క్యాస్టింగ్ ఓటు వేసే హక్కు కలిగి వుంటాడు. లక్ష్యిత ద్రవ్యోల్బణ ధ్యేయాన్ని ప్రభుత్వం రిజర్వు బ్యాంకుతో సంప్రదించి నిర్ణయించాలి.


ప్రభుత్వ ఋణ యాజమాన్య ఏజెన్సీ(పబ్లిక్ డెట్ మేనేజ్ మెంట్):

దీర్ఘకాలికంగా తక్కువ వ్యయంతో ద్రవ్యాన్ని అందించే వ్యూహంతో ప్రభుత్వ ఋణ యాజమాన్యాన్ని నైపుణ్యంగా నిర్వహించగల యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ ఋణ నిర్వహణకు  ఏకైక ఏజెన్సీ ఏర్పాటు చేయాలని కమీషన్ ప్రతిపాదించింది.ఇంతవరకు రిజర్వు బ్యాంకు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఋణ యాజమాన్య ప్రక్రియను దాని నుండి విడదీసి స్వతంత్ర ఋణ యాజమాన్య  ఏజెన్సీగా రూపకల్పన చేయాలని కమిషన్ ప్రతిపాదించింది. స్వతంత్ర ఋణ యాజమాన్య ఏజెన్సీ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ లక్షణాలు కలిగి వుండాలని భావించింది.  రిజర్వు బ్యాంకు ప్రస్తుతం ప్రభుత్వ బాండ్లను విక్రయిస్తూ,రెండు పరస్పర విరుద్ధమైన ధ్యేయాలను నిర్వర్తిస్తుంది. ప్రభుత్వానికి తక్కువ వడ్డీకి పెట్టుబడులను సమకూర్చాల్సి వచ్చినప్పుడు కేంద్ర బ్యాంకు తీసికోవలసిన వైఖరికి, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయాల్సి వచ్చినప్పుడు  కేంద్ర బ్యాంకు తీసికునే వైఖరికి మధ్య వైరుధ్యం ఏర్పడుతున్న కారణంగా స్వతంత్ర ఋణ యాజమాన్య ఏజెన్సీ ఏర్పాటు ప్రాధాన్యతను కమిషన్ భారత ద్రవ్య స్మృతి లో నొక్కి చెప్పింది. కాని భారత ద్రవ్య స్మృతి-2లో ఈఋణ యాజమాన్య ఏజెన్సీని స్వతంత్రంగా కాకుండా ప్రభుత్వ యాజమాన్యంలో వుంచటం పై తీవ్ర మైన విమర్శలు చోటు చేసికున్నాయి. రిజర్వు బ్యాంకు నుండి స్వతంత్ర ప్రభుత్వ ఋణ ఏజెన్సీ ని వేరుచేస్తే, రిజర్వు బ్యాంకు ప్రభుత్వ బాండ్ల మార్కెట్ ను పోషించాల్సిన అవసరం వుండదు. కేంద్ర బ్యాంకు తన బహిరంగ మార్కెట్ కలాపాలను ద్రవ్య పరపతి విధానానికి అనుకూలంగా స్వతంత్రంగా నిర్వహించ కలుగుతుంది.  దీని ఫలితంగా  ప్రభుత్వ ఋణబాండ్ల పై  చెల్లించాల్సిన వడ్డీ పెరుగుతుంది. ప్రభుత్వానికి తక్కువ వడ్డీకి తగినంత ఋణలభ్యత సాధ్యం కాదు. అందువల్ల రిజర్వు బ్యాంకు నుండి ప్రభుత్వ ఋణ ఏజెన్సీ వేరు చేయటం జాతి ప్రయోజనాలకు  శ్రేయస్కరం కాదని ఎస్ ఎస్ తారాపూర్ లాంటి నిపుణులు వాదిస్తున్నారు.  .

 భారత దేశ ఆర్ధిక వ్యవస్థ సుదీర్ఘకాలంగా ద్రవ్యలోటుతోనే కొనసాగుతుంది. ఈ లోటును ప్రధానంగా  ప్రభుత్వం ఋణ బాండులు ద్వారానే భర్తీ చేస్తున్నది. అందువల్ల రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ ఎస్ ఎస్ తారాపూర్ లాంటి నిపుణుల వాదన ఏమంటే, మన ఆర్ధిక వ్యవస్థ ద్రవ్యలోటు అత్యధికంగా వున్నంత కాలం, బ్యాంకింగ్ రంగం లో అత్యధిక లావాదేవీలు ప్రభుత్వ రంగ బ్యాంకుల అధీనంలో ఉన్నంత కాలం, చట్టపరమైన లిక్విడిటీ నిష్పత్తులను బ్యాంకులు తప్పనిసరిగా అమలుచేయాల్సినంత కాలం ప్రభుత్వ ఋణయాజమాన్యం రిజర్వు బ్యాంకు   ఆధిపత్యంలోనే తప్పనిసరిగా వుండి తీరాలి. ప్రపంచ ద్రవ్య సంక్షోభం అనంతరం అనేక దేశాల్లో ప్రభుత్వ రుణ యాజమాన్య బాధ్యతను  కేంద్ర బ్యాంకులకు తరలించటం జరిగింది.

భారత ద్రవ్య స్మృతి పార్లమెంటు ఆమోదం పొందటం తో నిమిత్తం లేకుండా ఎన్డియే ప్రభుత్వం ప్రభుత్వ ఋణ ఏజెన్సీ ఏర్పాటును 2015 ద్రవ్య బిల్లులో ప్రతిపాదించారు.  రిజర్వు బ్యాంకు చట్టాన్ని సవరిస్తే కాని ప్రభుత్వ ఋణ ఏజెన్సీ ఏర్పాటు ఆచరణలో సాధ్యం కాదు. ఇందుకోసం సవరణను లోక్ సభ,రాజ్య సభ రెంటిలోనూ ప్రవేశ పెట్టాలి. ద్రవ్య బిల్లుకు  లోక్ సభ ఆమోదం తెల్పితే చాలు. తన తప్పిదాన్ని తెలిసికున్న కేంద్ర ప్రభుత్వం  చివరి క్షణంలో ఈ అంశాన్ని ద్రవ్య బిల్లు నుండి తొలగించింది.



ఉమ్మడి ఫైనాన్షియల్ అధారిటీ


నియంత్రణ సంస్థలకు స్వతంత్రత,జవాబుదారీతనం వుండాలని కమిషన్ భావిస్తుంది. ప్రభుత్వ కంపెనీనైనా, ప్రైవేట్ కంపెనీనైనా నియంత్రణ సంస్థ నిష్పాక్షికంగా వ్యవహరించాలి. ప్రస్తుతం అమలులో వున్న బహుళ రంగాల నియంత్రణల వ్యవస్థను  రెండే రెండు నియంత్రణల వ్యవస్థకు మార్చాలని కమిషన్ ప్రతిపాదించింది. అందులో ఒక నియంత్రణ సంస్థగా రిజర్వు బ్యాంకు- బ్యాంకింగ్ మరియు చెల్లింపుల వ్యవస్థను నియంత్రిస్తుంది. రెండవది ఉమ్మడి ఫైనాన్షియల్ అధారిటీ  - ప్రస్తుతం నియంత్రణ సంస్థలుగా వున్న సెబీ(సేక్యురిటీస్ ఎక్స్చేంజి బోర్డు ఆఫ్ ఇండియా),ఐ ఆర్ డి ఎ(ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అధారిటీ), పి ఎఫ్ ఆర్ డి ఎ(పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అధారిటీ),ఎఫ్ ఎం సి(ఫార్వార్డ్ మార్కెట్ కాంట్రాక్ట్ స్) లన్నింటినీ కలిపి ఉమ్మడి ఫైనాన్షియల్ అధారిటీ  సూపర్ నియంత్రణాధికారిగా మిగిలిన ద్రవ్య మార్కెట్లను నియంత్రిస్తుంది.


నియంత్రణ సంస్థలకు ఒక సాధికారమైన బోర్డు, తన సభ్యులను అన్వేషించి,నియమించుకోగలిగే అధికారం ఈ బోర్డు కు వుంటుంది. నియంత్రణ సంస్థ సభ్యులను నాలుగు కేటగిరీలుగా అంటే చైర్మన్, కార్యవర్గ సభ్యులు, కార్యవర్గేతర సభ్యులు, ప్రభుత్వ నామినీలుగా  విభజించారు. బోర్డు కు అనుబంధంగా సలహా మండళ్ళు వుంటాయి. ద్రవ్య వ్యవస్థ మొత్తం నుండి వసూలుచేసే ఫీజులు నియంత్రణ సంస్థల నిధులుగా వుంటాయి. ద్రవ్య వ్యవస్థకు సంబంధించిన అన్ని రకాల అపీళ్ళను వినేందుకు,తీర్పులు చెప్పేందుకు ప్రస్తుత మున్న సెక్యురిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్థానంలో ద్రవ్య రంగ అప్పిలేట్ ట్రిబ్యునల్ ను కమిషన్ రూపొందించింది


ఉమ్మడి ఫైనాన్షియల్ అధారిటీ నమూనా అనేక దేశాల్లో సరిగ్గా నిర్వహింప బడటం లేదు.ఏకైక నియంత్రణ సంస్థ నియంత్రణ/పర్యవేక్షణ లలో గుణాత్మక మార్పు తీసికొని రాలేదు. భారత దేశంలో ప్రస్తుత మున్న బహుళ నియంత్రణ వ్యవస్థ కొంత అనుభవాన్ని పుంజుకుంది. భారత దేశంలోని నియంత్రణ సంస్థలలో ఎఫ్ ఎం సి (ఫార్వార్డ్ మార్కెట్ కాంట్రాక్ట్ స్)  పనితీరుపై తీవ్రమైన ఆరోపణలున్నాయి.నేషనల్ స్పాట్ ఎక్ష్చెంజ్ కుంభకోణంలో అది కూరుకు పోయివుంది. ఇటీవలే దాన్ని సెబి(సేక్యురిటీస్ ఎక్స్చేంజి బోర్డు ఆఫ్ ఇండియా)లో కలిపారు. ఇంతకు మించి ఇతర నియంత్రణ సంస్థల పనితీరు పై పెద్దగా విమర్శలు లేవు.సెబీ ప్రస్తుత స్థాయిని చేరుకోవటానికి 24 సంవత్సరాలు పట్టింది.ప్రస్తుత నియంత్రణ సంస్థల సమర్ధతలను ప్రపంచస్థాయి ప్రమాణాలతో  అభివృద్ది చేసికోవడంలో ఇబ్బందిని కమిషన్ ప్రస్తావించలేదు. నియంత్రణ సంస్థ పరిమాణం మరింతగా పెరిగిన కొద్దీ కేంద్రీకరింపబడ్డ  అధికారాలతో,  నియంత్రణ కంటే నియంతృత్వ పోకడలు పెరుగుతాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు . భారత ద్రవ్య స్మృతి నిర్వచనం ప్రకారం ప్రజల నుండి డిపాజిట్ లు స్వీకరించే ద్రవ్య సేవా సంస్థలను బ్యాంకులు గా పరిగణించాలి. అటువంటప్పుడు ప్రజా డిపాజిట్లు స్వీకరిస్తున్నబ్యాంకింగేతర ద్రవ్య సంస్థలను బ్యాంకులుగా పరిగణించి, వాటి నియంత్రణను  రిజర్వు బ్యాంకు పరిధిలో వుంచాలి. కాని కమిషన్ బ్యాంకింగేతర ద్రవ్య సంస్థల నియంత్రణను ఉమ్మడి ఫైనాన్షియల్ అధారిటీకి కట్టబెట్టింది. దీని ఫలితంగా సమాంతర బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేత మౌతుందనే ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపధ్యంలో 5-10 సంవత్సరాల తర్వాత రిజర్వు బ్యాంకు అధీనంలో వున్న బ్యాంకుల నియంత్రణను కూడా ఈ ఉమ్మడి ఫైనాన్షియల్ అధారిటీ క్రిందకు తీసికురావాలని కమిషన్ ప్రతిపాదిస్తున్నది. ఈ ప్రతిపాదన జాతి ప్రయోజనాలకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించే చర్య గా భావిస్తూ,అంతిమ ఋణదాతగా(లెండర్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్) రిజర్వుబ్యాంకు ఉన్నంతవరకు బ్యాంకింగ్ కార్యకలాపాల నియంత్రణ మొత్తం రిజర్వు బ్యాంకు ఆధీనంలోనే వుండాలని నిపుణులు కోరుతున్నారు.

అంతర్జాతీయ ద్రవ్య సంస్థ తన తాజా నివేదికలో(ద్రవ్య వ్యవస్థ సుస్థిరత అంచనా) “భారత దేశం లోని బ్యాంకులు,ఇన్స్యూరెన్స్, సెక్యూరిటీల నియంత్రణ/పర్యవేక్షణ విభాగం బాగా అభివృద్ది చెంది,దాదాపుగా  అత్యున్నతమైన అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వున్నా”యని పేర్కొంది


ద్రవ్య సుస్థిరత మరియు అభివృద్ది సమితి( ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్ మెంట్ కౌన్సిల్)


ద్రవ్య వ్యవస్థ మొత్తానికి సంబంధించిన వ్యవస్థీకృత రిస్క్ ను తగ్గించటానికి నియంత్రణ సంస్థలన్నీ జోక్యం చేసుకోవాలి. ఈ వ్యవస్థీకృత రిస్క్ ను పరిమితం చేయటంలో “ద్రవ్య సుస్థిరత మరియు అభివృద్ది సమితి”( ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్ మెంట్ కౌన్సిల్) నాయకత్వ బాధ్యతనునిర్వర్తించాలని  కమిషన్ సంకల్పిస్తున్నది.


ద్రవ్య రంగ ప్రాధ్యానత గల  ఆర్ధిక వ్యవస్థలో చోటుచేసుకునే అనూహ్యమైన ముప్పు, తన ప్రాంతాన్నే కాకుండా వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసే నైజమున్నది.  2008లో సంభవించిన ప్రపంచ ద్రవ్య సంక్షోభం,ఆ  సందర్భంగా వినాశన మైన ప్రజా సంపదే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం. దీన్నే వ్యవస్థీకృత రిస్క్(అపాయం) అంటున్నారు. ఇటువంటి అపాయాన్ని ఊహించేందుకు, వాటిని అదుపు చేసి, ద్రవ్య సుస్థిరతను సాధించేందుకు  వివిధ దేశాలలో ప్రత్యెక యంత్రాంగాలను తయారు చేసుకున్నారు. ఇటువంటి యంత్రాంగం భారత దేశంలో 2010 సంవత్సరంలో “ ద్రవ్య సుస్థిరత మరియు అభివృద్ది సమితి”( ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ డెవలప్ మెంట్ కౌన్సిల్)పేర ఏర్పాటు చేయబడింది. ఆర్ధిక మంత్రి అధ్యక్షుడుగా,వివిధ ద్రవ్య రంగ నియంత్రణ సంస్థల అధిపతులు,ఆర్ధిక మంత్రిత్వ శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఈ సమితి ప్రస్తుతం పనిలో వుంది. అర్ధిక వ్యవస్థలో చోటుచేసుకుంటున్న పరిణామాలను విశ్లేషిస్తూ వ్యవస్థీకృత రిస్క్ కు అవకాశాలను బేరీజు వేసికొని తగిన పరిష్కార చర్యలకు పూనుకోవటం,ద్రవ్య రంగ అభివృద్దికి ప్రణాళికలు రచించటం, వివిధ నియంత్రణ సంస్థల మధ్య భేదాభిప్రాయాలను పరిష్కరించి వారి మధ్య సమన్వయాన్ని పెంచటం సమితి  కర్తవ్యాలుగాలుగా వున్నాయి.


2010లో యూనిట్ లింక్డ్ పాలసీలపై అంతిమ నిర్ణయం “సెబీ దా లేక ఐ ఆర్ డి ఎ దా”అన్న వివాదాన్ని రిజర్వ్ బ్యాంకు పరిష్కరించ లేనప్పుడు ఆర్ధిక మంత్రిత్వ శాఖ జోక్యం చేసికొంది. ద్రవ్య రంగంలో ఇటువంటి సమస్యల పరిష్కారానికి “ద్రవ్య సుస్థిరత మరియు అభివృద్ది సమితి”లాంటి సంస్థ ప్రాధాన్యతను తెలియచేస్తూ కమిషన్ దానికి చట్టబద్దతను కల్పిస్తూ తన ప్రతిపాదనలలో చేర్చింది.     

ద్రవ్య రంగంలోని వ్యవస్థీకృత రిస్క్ ను గుర్తించి ఒడిసి  పట్టుకోవటం,ఆకాశాన్ని ఒడిసి పట్టుకోవటం లాంటిదని ద్రవ్య రంగ సంక్షోభం సందర్భంగా అనేక మంది  ఆర్ధిక వేత్తలు చెప్పారు. ద్రవ్యరంగ ప్రాధ్యానత గల పెట్టుదారీ విధానంలో ఇటువంటి తీవ్ర సంక్షోభాలకు సంస్థాగత మార్పే శాశ్వత  పరిష్కారమని మార్క్సిజం చెపుతుంది.అమెరికా, ఇంగ్లాండ్ లలో వ్యవస్థీకృత రిస్క్ నివారణ, ద్రవ్య రంగ సుస్థిరత బాధ్యతను కేంద్ర బ్యాంకుకు అప్ప చెప్పారు. ద్రవ్య పరపతి విధాన కర్త గాను, అంతిమ ఋణదాతగాను కేంద్ర బ్యాంకుకు మించిన వ్య్వస్తీకృత రిస్క్ మేనేజర్ మరొకరు ఉండరని వాళ్ళ విశ్వాసం.

ద్రవ్య రంగంలో అత్యధిక వ్యవస్థీకృత రిస్క్ కు నూతనంగా రూపొందిస్తున్న క్రెడిట్ డెరివేటివ్ స్వాప్ లాంటి నూతన ఆవిష్కరణలు తీవ్రంగా దోహద పడుతున్నాయని  ఆర్దివేత్తలు గుర్తించారు. దీనిపై బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్రత్యేక పరిశోధనను చేపట్టింది. అటువంటి పరిశోధనలపై కమిషన్ దృష్టి సారించినట్లు లేదు.


పెట్టుబడి ప్రవాహాల నియంత్రణ
పెట్టుబడి ఖాతా సరళీకరణను ఎప్పుడు,ఎలా చేయాలో కమిషన్  స్పష్ట మైన ప్రణాళికను ప్రతిపాదించక పోయినప్పటికీ, ఏ పెట్టుబడుల నియంత్రణ లైన చట్ట పరమైన మంచి పునాదులపై నిర్వహింపబడాలి. దేశంలోకి ప్రవేశించే పెట్టుబడులను ఆర్ధిక మంత్రిత్వ శాఖ, దేశం నుండి నిష్క్రమించే  పెట్టుబడులను రిజర్వు బ్యాంకు నియంత్రించాలి.  పెట్టుబడుల నియంత్రణ లన్నింటిని రిజర్వు బ్యాంకు అమలు చేయాలి.


ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష ద్రవ్య పెట్టుబడి విధానాల్ని రూపొందిస్తున్నది. రిజర్వుబ్యాంకు వాటిని అమలు చేస్తుంది. పోర్ట్ పోలియో పెట్టుబడుల విధి విధానాలు కేంద్ర ప్రభుత్వం చేతిలోనే వున్నాయి. ఇతర పెట్టుబడులకు రిజర్వు బ్యాంకు విధివిధానాలను రూపొందిస్తున్నది. ఈ దేశం నుండి బయటకు తరలే ఇతరపెట్టుబడులను రిజర్వు బ్యాంకు పర్యవేక్షిస్తూ నియంత్రిస్తున్నది. ఈ ఏర్పాటు సజావుగా సాగిపోతుంది. 1991 విదేశీ ద్రవ్య మారక సంక్షోభాన్నిరిజర్వు బ్యాంకు సమర్ధవంతంగా ఎదుర్కొన్నదని అందరూ ప్రశంసించారు.  భారత ద్రవ్య స్మృతి తన నూతన ప్రతిపాదనలతో ఈ అంశాన్ని  మరింత సంక్లిష్ట పరుస్తున్నది. పెట్టుబడి ఖాతా పూర్తి కన్వర్ట బిలిటి అధికారాన్నిరిజర్వు బ్యాంకు నుండితొలగించే కుట్రలో భాగంగా ఈ ప్రతిపాదన వుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.   ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ కమిటీలోని ముగ్గురు సభ్యులు తమ అసమ్మతిని తెలియ చేశారు.


వినియోగదారుల రక్షణ(కంజ్యుమర్ ప్రొటెక్షన్)


వినియోగదారుల ప్రయోజనాల పరి రక్షణకు అవసరమైన  రక్షణలను ద్రవ్య సంస్థలు కల్పించేలా నియంత్రణ సంస్థలే  చూడాల్సివుంటుంది.  ద్రవ్య రంగ వినియోగదారులందరికి  కొన్ని ప్రాధమిక హక్కుల్నికల్పించి,  అన్ని రంగాల బాధిత వినియోగదారుల సమస్యల పరిష్కారానికి “ఏకైక ఉమ్మడి ద్రవ్య రంగ పరిష్కార ఏజెన్సీ”(సింగిల్ ఉనిఫైడ్ ఫైనాన్షియల్ రిడ్రేస్సల్ ఏజెన్సీ) ని ఈ చట్టం కల్పిస్తుంది. దీనితోపాటు  వినియోగదారుల రక్షణలో ‘కాంపిటిషన్(పోటీ) అన్న అంశం ముఖ్యమైనదిగా కమిషన్ పరిగణిస్తూ నియంత్రణ సంస్థలు , కాంపిటిషన్ కమిషన్ కు మధ్య సహకారం పెంపొందెందుకు అవసరమైన యంత్రాంగాన్ని రూపకల్పన చేస్తుంది.


వివేకవంతమైన లోతైన క్రమబద్దీకరణ(మైక్రో ప్రూడేన్షియల్ రెగ్యులేషన్)


ద్రవ్య సంస్థల వైఫల్యాలను ముందుగానే పసిగట్టి  వాటిని సమర్ధ వంతంగా అదుపు చేయకలిగేటట్లు  నియంత్రణ సంస్థల పర్యవేక్షణ వుండాలి.  ప్రవేశం లో,  రిస్క్ తీసికొనే క్రమంలో , నష్టాన్ని భరించే క్రమంలో , నిర్వహణ క్రమంలో, పర్యవేక్షణక్రమం లాంటి ఐదు సందర్భాలలో    క్రమబద్దీకరణ కు చట్ట ముసాయిదా తగిన అధికారాలను కట్ట బెట్టింది.


పరిష్కార కార్పోరేషన్ (రిజల్యూషన్ కార్పొరేషన్ )
ద్రవ్య సంస్థలు వైఫల్యం చెందినప్పుడు చిన్న ఖాతాదార్ల ప్రయోజనాలు త్వరితంగాను, తగినంతగా కాపాడబడేలా సంస్థల మూసివేతలు వుండాలి. ఒక సంస్థ వైఫల్యం తో మూతపడినట్లయితే, ఈ అంశంలో జోక్యం చేసికొనేందుకు,మరియు అనేక ద్రవ్య సంస్థలతో వ్యవహరించేందుకు ఒక ఉమ్మడి పరిష్కార కార్పోరేషన్ ను ఏర్పాటు చేయాలి. వైఫల్యాల అవకాశ ప్రాతిపదికన పరిష్కార కార్పోరేషన్ అన్ని ద్రవ్య సంస్థల నుండి కొంత ఫీజును వసూలు చేయాలి.


అభివృద్ధి మరియు పునఃపంపిణీ:  మార్కెట్ మౌలిక వసతుల అభివృద్ది మరియు నిర్వహణా బాధ్యతను నియంత్రణ సంస్థ,  పునః పంపిణీ బాధ్యతను ఆర్ధిక మంత్రిత్వ శాఖ  వహించాలి.
ఒప్పందాల మార్కెట్, ఆస్థుల మార్కెట్, సెక్యురిటీ మార్కెట్లకు సంబంధించిన మౌళిక విధి విధానాలను  కమిషన్ రూపొందిస్తుంది.   
          
భారత ద్రవ్య స్మృతి లో వినియోగ దారుల  ప్రయోజనాలను రక్షించ కలిగే నూతన యంత్రాంగం నిర్మాణం పై విమర్శలు పరిమితంగానే వున్నాయి. కాని నియంత్రణ వ్యవస్థ ఒకే సంస్థగా, కేంద్రీకరించబడిన అధికారాలతో ప్రభుత్వ విభాగంగా మారుతున్నప్పుడు, కంచే చేనును మేస్తే, వినియోగదారులకు  రక్షకు లెవరు?


పాత ద్రవ్య చట్టాల స్పూర్తికి విఘాతం


భారత ద్రవ్య స్మృతి 15 చట్టాలను సవరించమని ప్రతిపాదిస్తే, భారత ద్రవ్య స్మృతి-2, 19 చట్టాలను సవరించాలన్నది.సంప్రదాయ పద్ధతుల్ని గాలికి వదిలేసి ఒక కలం పోటుతో పాత ద్రవ్య రంగ చట్టాల్ని రద్దు చేసి వాటి స్థానంలో నూతన చట్టాన్ని చేయటానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని మేధావులు తేలిగ్గా జీర్ణించుకోలేక పోతున్నారు. పాత చట్టాల్ని రద్దు చేసి కొత్త చట్టాల్ని చేసేటప్పుడు పాత చట్టాల మౌళిక స్పూర్తిని పరిరక్షించాల్సి వుంటుంది. కాని భారత ద్రవ్య స్మృతి నిర్వహించిన చర్యలు పురిటి గుడ్డలతో పాటు పురిటి శిశువును కూడా పారేసిన చందాన వుంది.  

బ్రిటిష్ ప్రభుత్వకాలంలో రిజర్వు బ్యాంకు చట్టం1934 ద్వారా1935లో రిజర్వుబ్యాంకు ఏర్పాటయింది. జాతీయోద్యమ స్పూర్తితో ఆర్ధిక వ్యవస్థలో బలమైన ప్రభుత్వ పాత్రకు వీలు కల్పిస్తూ 1960/1970లలో ద్రవ్య రంగ చట్ట రూపకల్పన చేయబడింది.  బ్యాంకులు చట్ట పరిధిలో   పనిచేయటానికి వీలుగా బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 రూపకల్పన చేయబడింది. ద్రవ్య సంస్థలు దీర్ఘకాలికంగా పనిచేయటానికి వీలుగా వివిధ చట్టాలు చేయబడ్డాయి. దీనిలో భాగంగానే భారత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా చట్టం 1955, భారత స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(సబ్సిడరీ బ్యాంక్స్) చట్టం 1959, 1969/1980 ల బ్యాంకుల జాతీయకరణ చట్టం, 1992లో సెబీ చట్టం అమలులోనికి వచ్చాయి. ద్రవ్య రంగంలో ప్రత్యేక  అంశాలకు సంబంధించిన వివిధ చట్టాలు అమలు లో వున్నాయి. 1991 లలో సరళీకరణ విధానాలు మొదలైనప్పటి నుండి ప్రభుత్వరంగ బ్యాంకులలో ప్రభుత్వ వాటాకు గండి కొట్టటం మొదలైంది. కాని అనేక మార్లు చట్ట సభలలో జాతీయ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా ఎటువంటి పరిస్థితులలో 51శాతానికి మించి తగ్గించ కూడదని వక్కాణించటం తోపాటు బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో ఈ అంశం పొందుపరచ బడివుంది.

ద్రవ్య రంగ చట్టాల రద్దుతో ఆవిర్భవించే భారత ద్రవ్య స్మృతి-2లో జాతీయ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటా 51శాతానికి మించి తగ్గించకూడదన్న వక్కాణింపు తొలగించబడింది. దీనితో10వ ప్రణాళిక సంఘం కోరినట్లు జాతీయ బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాపై 51శాతం సీలింగు తొలగింపు చర్యకు మార్గం సుగమ మౌతుంది. జాతీయ వ్యవసాయ అభివృద్ది బ్యాంకు భవితవ్యం కూడా చట్టపరంగా ప్రశ్నార్ధకం కానున్నది. దీనిని గూర్చిన ప్రస్తావన కూడా నూతన ద్రవ్యరంగ చట్ట ముసాయిదాలో లేదు. ఈ అంశాల్ని పార్లమెంటు పరిశీలనలో సరిచేయాలి.

ఏకైక ఉమ్మడి ద్రవ్య రంగ పరిష్కార ఏజెన్సీ ఏర్పాటులో ఎల్ ఐ సి, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా లాంటి కార్పోరేషన్ నిర్మాణం గా కలిగిన సంస్థల్ని, సహకార రంగంలో వున్న సంస్థల్ని కంపెనీ చట్ట పరిధిలోకి తీసుకు రావటం శ్రేయస్కరమని కమిషన్ వ్యాఖ్యానించింది.

ముగింపు

ద్రవ్య రంగ చట్ట సవరణల కమిషన్ ప్రతిపాదించిన భారత ద్రవ్య స్మృతి ద్రవ్య సరళీకరణ విస్తరణకు దారులు వేస్తున్నది.

తాజా పరిచిన భారత ద్రవ్య స్మృతి పై మూడి రేటింగ్ సంస్థ స్పందిస్తూ, రిజర్వు బ్యాంకు స్వయం ప్రతిపత్తిని హరించే చర్యలు ద్రవ్యోల్బణ ధ్యేయ సాధనను దెబ్బతీస్తుందని, ద్రవ్య రంగ సుస్థిరత పై దీని ప్రభావం గణనీయంగా వుంటుందన్నది.

కమిషన్ ప్రతిపాదనల ఫలితంగా నియంత్రణ అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి కట్టబెట్టినట్లుంది.“కనిష్ట ప్రభుత్వం,గరిష్ట పాలన” అనే కేంద్ర ప్రభుత్వ నినాద స్పూర్తికి ఇది వ్యతిరేకం.  

ప్రస్తుతమున్న రిజర్వు బ్యాంకు స్వరూపాన్ని మార్చాల్సిన అవసరం లేదని, నిజ ఆర్ధిక వ్యవస్థను శాసించే ద్రవ్య రంగ వ్యవస్థనే మార్చాలని కొందరు ఆర్ధిక వేత్తలు అభిప్రాయ బడుతున్నారు.

1934 నుండి వున్న చట్టాలు కాలం చెల్లినవని,వాటిని మార్చే ప్రక్రియలో కాల పరీక్షకు తట్టుకొని నిలబడ్డ చట్టాల స్పూర్తి కి భంగం కలిగేటట్లు కమిషన్  వ్యవహరించిన దృష్టాంతాలు వెలుగులోకి వచ్చాయి. అందువల్ల భారత ద్రవ్య స్మృతి ముసాయిదాను పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కి నివేదింపబండి అందులోని ప్రతి క్లాజును క్షుణ్ణంగా పరిశీలించాలని కాల పరీక్షకు నిలబడ్డ కొన్ని చట్టాల స్పూర్తిని నిలబెట్టాలని  కొంత మంది నిపుణులు అభిప్రాయ బడుతున్నారు.



‘అన్ని సంస్థలలో విధానపరమైన అంశాలలో  ప్రభుత్వం జోక్యం చేసికోవాలనే తహ తహ  యొక్క ముసుగు తొలగటం మొదలైంది. భారత ఫిలిం మరియు టెలివిజన్ సంస్థ, భారతీయ చరిత్ర పరిశోధన సమితి, రిజర్వ్ బ్యాంకు లలో చోటుచేసికుంటున్న  పరిణామాలను ఈ కోణంలోనే చూడాలి. దేశాభ్యుదయానికి వెన్నుదన్నుగా నిల్చిన సంస్థలను నాశనం చేయాలనుకునే బృహత్తర ప్రణాళికలో పై పరిణామాలు ఒక భాగం మాత్రమే. ప్రభుత్వాలకు చేతి వాటంగా వుండే సంస్థలు, వాళ్ళ కార్యాలు  చక్క దిద్దుకునే వరకు బాగానే వుంటాయి కాని జాతి సంక్షేమాన్నినిలబెట్టలేవు’.
కొండముది లక్ష్మీప్రసాద్


               

Monday, February 1, 2016

ఆర్థిక లావాదేవీలపై పన్ను కోసం

- ప్రభాత్‌ పట్నాయక్‌
ద్రవ్యపెట్టుబడికి చట్టా వ్యాపారంపైనే ఆసక్తి వుండటం ఇక్కడ సమస్య. వాస్తవ ఆర్థిక వ్యవస్థపై చట్టా వ్యాపార ప్రభావాన్ని పరిమితంచేసే ప్రయత్నం ఎలాంటిదైనా అది చట్టా వ్యాపారాన్ని నియంత్రిస్తుంది. అందుకని చట్టా వ్యాపారంపై ఎటువంటి పరిమితి విధించినా ద్రవ్య పెట్టుబడి వ్యతిరేకిస్తుంది. ఆర్థిక లావాదేవీలపై పన్ను వేయటానికి ద్రవ్య పెట్టుబడి ఎందుకు వ్యతిరేకిస్తున్నదో ఇది తెలియజేస్తుంది.

రాబోయే అమెరికన్‌ అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిత్వానికి ప్రయత్నిస్తున్న బెర్నీ శాండర్స్‌ తనకుతాను 'సోషలిస్టు'నని ప్రకటించుకున్నాడు. ప్రభుత్వ విద్యాసంస్థలలో ఉచితవిద్య అందించేందుకు ఆర్థిక లావాదేవీలపై పన్ను విధించాలని ఆయన ప్రతిపాదిస్తున్నాడు. డెమోక్రాటిక్‌ పార్టీలో జరుగుతున్న చర్చ ఈసారి వాల్‌స్ట్రీట్‌ (అమెరికాలో ఆర్థిక లావాదేవీలు జరిపే బ్యాంకులు కేంద్రీకృతమైన ప్రాంతం పేరు)ను నియంత్రించటంపై దృష్టి సారించింది. దానితో వాల్‌ స్ట్రీట్‌ను ప్రత్యక్షంగా ప్రభావితంచేసే శాండర్స్‌ ప్రతిపాదనకు ఎనలేని ప్రాధాన్యత వచ్చింది.

'ద్రవ్య సరుకుల(ఫైనాన్షియల్‌ ఎస్సెట్స్‌)'పై ఆర్థిక లావాదేవీల పన్నువేయటమనేది అమ్మకం పన్ను వేయటంలాంటిదే. బ్యాంకింగ్‌ సేవల నుంచి విదేశీ మారకద్రవ్య లావాదేవీలదాకా, ఈక్విటీ నుంచి డెరివేటివ్స్‌, కమ్మోడిటి 'ప్యూచర్స్‌' లావాదేవీలదాకా ఆర్థిక లావాదేవీల పన్ను పరిధిలోకి వస్తాయి. వీటిలో స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు కరెన్సీ లావాదేవీలతో సహా మిగిలిన లావాదేవీలకంటే భిన్నమైనవి. చట్టా కార్యకలాపాలను పరిమితం చేయటానికి ఈ ఇతర లావాదేవీలపై పన్ను విధించాలని గతంలో ప్రముఖ ఆర్థికవేత్త జేమ్స్‌ టోబిన్‌ సూచించాడు. ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచగలిగే అవకాశమున్నందున ఈ సూచన ప్రస్తుతం అందరి దృష్టీ ఆకర్షిస్తున్నది. దీనిని గురించే నేను ఇకపై ప్రస్తావించదలిచాను.

ఆర్థిక లావాదేవీలపై వచ్చిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి వ్యయం చేయాలనే ఆలోచన ఎప్పటినుంచో వున్నది. అయితే కేవలం ప్రభుత్వ ఆదాయాన్ని పెంచగలిగే శక్తి వుండటంవల్లనే ఆర్థిక లావాదేవీల పన్నును విధించటాన్ని సమర్థించటం లేదు. స్టాక్‌ మార్కెట్‌లో వస్తున్న విపరీతమైన ఒడిదుడుకులను తగ్గించటానికి, అనేక స్వల్ప కాల ట్రేడ్స్‌ను తొలగించటానికి కూడా ఈ పన్ను అవసరం వుంటుంది. ఆ విధంగా సమకాలీన పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలలో వాస్తవ ఆర్థిక వ్యవస్థ కంటే సాపేక్షంగా కృత్రిమంగా ఎన్నోరెట్లు పెరుగుతూవున్న ద్రవ్యరంగ పరిమాణాన్ని కుదించటం కూడా దీనితో సాధ్యపడుతుంది. అలా కృత్రిమంగా అతిగా పెంచబడిన ద్రవ్య రంగం వాస్తవ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటుకు గుదిబండలా తయారవుతుందని అంతర్జాతీయ ద్రవ్య సంస్థ(ఐఎమ్‌ఎఫ్‌) కూడా భావిస్తున్నది. దీని పరిమాణాన్ని సాపేక్షంగా కుదించటం అవసరమని ఈ సంస్థ కోరుతున్నది. ఈ లక్ష్యం సాధించటానికి ఆర్థిక లావాదేవీలపై పన్ను విధించటం ఒక సాధనంగా వుంటుంది.

పన్ను ప్రతిపాదన వ్యతిరేకిస్తున్న కార్పొరేట్‌-ద్రవ్య పెట్టుబడిదారీ వర్గం

ఊహించినట్టుగానే అలాంటి పన్ను ప్రతిపాదనను ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్‌-ద్రవ్య పెట్టుబడిదారీ వర్గాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. భారతదేశంలో ఈక్విటీ లావాదేవీలపైన నామమాత్ర పన్ను విధిస్తున్నారు. అయితే దానిని కూడా ఇంకా తగ్గించాలనే డిమాండ్‌ ముందుకొస్తున్నది. అమెరికాలో కూడా కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులు తప్పుడు లెక్కలతో అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు అలాంటి పన్నుతో ఎంతగా దెబ్బతింటున్నదో వివరిస్తూ శాండర్స్‌ ప్రతిపాదనను ఖండిస్తున్నారు.

అలాంటి అతిశయోక్తులను పక్కనబెట్టి ఆర్థిక లావాదేవీలపై పన్ను వేయటాన్ని వ్యతిరేకించేవారి వాదన ప్రధానంగా ఇలా వుంటుంది. పన్నువల్ల ఆదాయం పెరుగుతుందని చేసే వాదన 'సుస్థిర పరిచే ప్రభావం' వుంటుందనే వాదనతో విభేదిస్తుంది. ఒకవేళ చట్టా వ్యాపారాన్ని వాస్తవంలో పన్ను పరిమితం చేయగలిగి, వ్యవస్థలో స్థిరత్వాన్ని తేగలిగినప్పుడు ఆదాయం అంతగా రాదు. దీనికి కారణం ఇప్పుడున్న లావాదేవీల సంఖ్య పరిమితం చేయటంద్వారానే స్థిరత్వం వస్తుంది. అయితే లావాదేవీల సంఖ్య తగ్గించటమే జరిగితే దానికి అనుగుణంగా పన్ను పునాది కూడా తగ్గుతుంది. అలాగే పన్నుతో వచ్చే ఆదాయం కూడా తగ్గుతుంది. కాబట్టి ఈ పన్ను ప్రతిపాదించేవారు దానితోవచ్చే లాభాలను ఎక్కువచేసి చెబుతున్నారు. ఒక్కసారి ఈ వాస్తవాన్ని గుర్తిస్తే ఈ పన్నును వారు చెబుతున్న లాభాలు ఎంత పరిమితంగా వుంటాయో గమనించగలుగుతాం. ఆ తరువాత పెట్టుబడిదారుల తపన(జంతు ఉరవడి లేక యానిమల్‌ స్పిరిట్స్‌)పై దుష్ప్రభావం వుంటుంది గనుక అలాంటి పన్ను వేయటం అర్థరహితమైన చర్యగా మిగిలిపోతుంది.

ఈ వాదన సరుకులపైవేసే పరోక్ష పన్నుల విషయంలో చేసే వాదనను పోలి వున్నది. అదేమంటే ఒకవేళ ఒక సరుకు వినియోగాన్ని తగ్గించటం కోసం పరోక్షపన్ను రేటు పెంచి ఆపైన అదే సమయంలో దాన్ని ఆదాయం పెంచే చర్యగా సమర్థించటం సాధ్యపడదు.

అయితే ఈ వాదన ఒక కుతర్కం ఆధారంగా జరుగుతున్నది. అమెరికాకు సంబంధించిన అంచనాలాగా ఫైనాన్షియల్‌ కమ్మోడిటీస్‌ డిమాండ్‌కి చెందిన ధర వ్యాకోచంలో ఐక్యత వుంటుంది. అంటే ఒకవేళ ఫైనాన్షియల్‌ లావాదేవీల వ్యయం రెండు రెట్లయితే మొత్తం లావాదేవీల విలువ మారకుండా లావాదేవీల పరిమాణం సగం అవుతుంది. ఉదాహరణకు ఆర్థిక లావాదేవీల పన్నువల్ల ఆర్థిక లావాదేవీల వ్యయం రెట్టింపవుతుందని అనుకుందాం. అంటే గతంలో ఒక్కోటి 100 రూపాయల విలువగల 100ఫైనాన్షియల్‌ ఆస్తి యూనిట్లను అమ్మేవారనుకుంటే మొత్తం అమ్మకాల విలువ 10,000 రూపాయలవుతుంది. ఇప్పుడు పన్ను పెరగటంవల్ల ఒక్కో ఆస్తి విలువలో పెరుగుదల 200 ఉంటుంది. దానితో లావాదేవీలు జరిగిన ఆస్తుల పరిమాణం 50కి తగ్గుతుంది. అయినప్పటికీ మొత్తం అమ్మకాల విలువ అంతకుముందు వున్నట్టుగానే 10,000రూపాయలుంటుంది. అయితే ఈ నూతన పరిస్థితిలో కూడా పన్నుపై ఆదాయం 5,000 రూపాయలు వస్తుంది(50సార్లు 100రూపాయల చొప్పున). అంటే లావాదేవీల పరిమాణం గణనీయంగా తగ్గినప్పటికీ పన్నుపై వస్తున్న ఆదాయం పెరిగింది.

నేను ఇంతకుముందు చెప్పిన కుతర్కం మూలాలు ఒక గందరగోళంలో వున్నాయి. అదేమంటే పన్ను రేటుకు సంబంధించిన డిమాండ్‌ వ్యాకోచానికి, ఒక ఫైనాన్షియల్‌ కమ్మోడిటీ ధరకు సంబంధించిన డిమాండ్‌ వ్యాకోచానికి మధ్యగల తేడా గుర్తించక పోవటంవల్ల ఈ గందరగోళం ఏర్పడింది. రెండవది యూనిటి అయినప్పటికీ మొదటిది కాదు. ఎందుకంటే పన్ను ఒకేఒక భాగం. అదీ మొత్తం ధరలో పన్ను ఒక చిన్న భాగం మాత్రమే. కాబట్టి ఒక పన్నువల్ల పెరిగిన ధరతో పడిపోయే డిమాండ్‌ పరిమాణం సమ నిష్పత్తికి అనుగుణంగా వుంటుంది. పెరిగిన పన్నురేటుతో పోల్చినప్పుడు అది సమ నిష్పత్తికంటే తక్కువగా వుంటుంది. అందుకనే పన్ను రేటు పెరిగినప్పుడు పన్నుతోవచ్చే ఆదాయం పరిమాణం పెరుగుతుంది.

దీనితో అర్థమయ్యేదేమంటే ఆర్థిక లావాదేవీలపై పన్ను వేయటాన్ని సహేతుకమైన కారణాలతో ద్రవ్య పెట్టుబడిదారీ వర్గం వ్యతిరేకించటంలేదు. ఏ కారణాలతో అయితే కరెన్సీ లావాదేవీల పన్నును లేక టోబిన్‌ పన్నును వ్యతిరేకించిందో అవే కారణాలతో దీనిని కూడా వ్యతిరేకిస్తున్నది. ఆ కారణాలు చట్టా వ్యాపారంలో తనకున్న ఆసక్తిలో వున్నాయి. ఈ పన్నులన్నీ ఆ చట్టా వ్యాపారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో వేసేవే.

'ఎంటర్‌ప్రైస్‌'కి, 'చట్టా వ్యాపారానికి' మధ్య తేడా గ్రహించగలిగే శక్తి అంతర్లీనంగా పెట్టుబడిదారీ మార్కెట్‌కు వుండదని ప్రముఖ బ్రిటిష్‌ ఆర్థికవేత్త జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌ వాదించాడు. ఒక ఆస్తిని 'ఉంచుకునేందుకు' కొనటానికి, తరువాత కాలంలో అమ్మటానికి కొనటానికి మధ్యగల తేడాగా ఆయన నిర్వచించాడు. ఈ అశక్తతతే మార్కెట్‌ వైఫల్యంగా వుంటుందని కీన్స్‌ అన్నాడు. ఆర్థిక కార్యకలాపాలపై చట్టా ప్రభావాన్ని తగ్గించే చర్యలను ఆయన సమర్థించాడు. అయితే సమస్యేమిటంటే ద్రవ్య పెట్టుబడికి చట్టా వ్యాపారంపై ఆసక్తి వుంటుంది. వాస్తవ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే చట్టా వ్యాపారంపై వేసే కళ్లేలు స్వాభావికంగా చట్టా వ్యాపారానికి కళ్లేలుగా మారతాయి కాబట్టి అలాంటి చర్యలను ఏకంగా ద్రవ్య పెట్టుబడి వ్యతిరేకిస్తుంది. ఆర్థిక లావాదేవీల పన్ను వేయటాన్ని ఇది ఎందుకు వ్యతిరేకిస్తున్నదో దీనినిబట్టి మనకు అర్థమవుతున్నది.

సంక్షేమ వ్యయానికి ఉపయోగపడుతుంది
భారతదేశంలో ఈ పన్నుపై వచ్చే ఆదాయం సంక్షేమ వ్యయానికి ఉపయోగపడుతుందని గతంలో ఒకసారి రాశాను. ఆ వాదన ఒకసారి గుర్తు చేసుకుందాం. గతంలో ప్రణాళికా సంఘంచే నియమించబడిన ఒక నిష్ణాతుల కమిటీని అనుసరించి భారతదేశంలో ప్రజలందరికీ సార్వజనీన ఆరోగ్య సంరక్షణ అందించటానికి స్థూల జాతీయోత్పత్తిలో 1.8శాతం అదనపు నిధులు అవసరమౌతాయి. గత కొద్ది కాలంగా భారతదేశంలోని స్టాక్‌ మార్కెట్‌లో ప్రతి దినం లావాదేవీల విలువ 2లక్షల కోట్లు. అంటే స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలపై 0.37శాతం పన్ను విధిస్తే భారతదేశంలో సార్వజనీన ఆరోగ్య సంరక్షణ అందించటానికి సరిపోతుంది. ఇది జేమ్స్‌ టోబిన్‌ సూచించిన 0.5శాతం కంటే తక్కువ.

అమెరికాలో శాండర్స్‌ సూచించినట్టుగానే భారతదేశంలో కూడా కోట్లాది పేదలకు అత్యంతగా ఉపయోగపడే ఈ ప్రణాళికను కార్పొరేట్‌-ఫైనాన్షియల్‌ పెట్టుబడిదారీ వర్గం వ్యతిరేకిస్తున్నది. ఇది చాలా తేలిగ్గా ఊహించగలిగే విషయమే. పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రజలకు మేలు చేస్తున్న సంక్షేమ పథకాలకు చెందిన సంస్కరణలను 'శాంతియుతం'గా రద్దు చేయగలుగుతున్నప్పుడు వ్యవస్థను అధిగమించటం (ట్రాన్‌సెండింగ్‌) అనే అవసరం ఊసే వుండదు. ప్రస్తుతం ఐరోపా ఖండంలో అస్తిత్వంలోగల సంక్షేమ కార్యక్రమాలను రద్దుచేసి 'పొదుపు చర్యల'ను ప్రవేశపెడుతున్నట్టుగా పెట్టుబడిదారీ వ్యవస్థను వ్యతిరేకించేవారు దానిని 'సంక్షేమ పెట్టుబడిదారీ వ్యవస్థ'గా మార్చాలనే పగటికలను కంటున్న స్థితిలో పెట్టుబడిదారీ వ్యవస్థను అధిగమించవలసిన అవసరం ఏర్పడుతుంది.
ఉచిత ప్రభుత్వ విద్యను అందించటానికి ఆర్థిక లావాదేవీలపై పన్ను విధించాలని శాండర్స్‌ చేస్తున్న డిమాండ్‌వంటి వాటికి చాలా ప్రాధాన్యత వుంది. ఈ డిమాండ్‌లో ఏ కొంచెం వాస్తవ రూపం దాల్చినా చాలా మేలు జరుగుతుంది. దీనిలో ఎంతయితే వాస్తవ రూపం దాల్చదో అంతవరకు అది లెనినిస్టు అర్థంలో 'పరివర్తనకాల డిమాండ్‌' పాత్రను పోషిస్తుంది. దానితో ఒకవైపు కొందరు భోగభాగ్యాలలో ఓలలాడుతుండగా మరోవైపు దుర్భర దారిద్య్రంలో, అజ్ఞానంలో, అనారోగ్యంలో తాము మగ్గటానికి గల అసలు కారణాన్ని ప్రజలు గ్రహించగలుగుతారు.

అనువాదం: నెల్లూరు నరసింహారావు