Sunday, October 31, 2010

మైక్రోఫైనాన్స్‌ సంస్థల పరిణామం - సవాళ్ళు


పేదరిక నిర్మూలనకు కీలక సాధనాలుగాను, పట్టణ, గ్రామీణ పేదలకు పట్టుకొమ్మలుగాను అంతర్జాతీయంగా కీర్తింపబడ్డ మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు, ఇటివలి కాలంలో బీదల రక్తాన్ని పీలుస్తూ, వారి మాన ప్రాణాలను హరించే కిరాతకులుగా తెగనాడబడుతున్నాయి. మైక్రో రుణ సంస్థల రాక్షసత్వానికి ఆంధ్రప్రదేశ్‌లో 57 మందికి పైగా సమిధలు కాగా, అందులో 20 మంది మహిళలు కావటం ఆందోళకరమైన అంశం. ప్రచారానికందని మైక్రో ఫైనాన్స్‌ దురాగతాలు కోకొల్లలుగా ఉన్నాయి. మైక్రో ఫైనాన్స్‌ సంస్థల పనితీరుపై, రుణ గ్రహీతలు గురైన దురాగతాలపై అనేక నిజ నిర్ధారణలు, ప్రముఖుల ప్రకటనలు, నిపుణుల విశ్లేషణలు వెలువడ్డాయి. మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు విధిస్తున్న వడ్డీ రేట్లను, బాకీలు వసూలు చేసుకోవడంలో వివిధ సంస్థలు అనుసరిస్తున్న అనాగరిక పద్ధతులను ఇవి తూర్పారాబట్టాయి. ఈ ఆగడాలపై రాష్ట్ర వ్యాప్తంగా పెల్లుబికిన ఆగ్రహం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థల్ని నియంత్రించేందుకు ప్రత్యేక ఆర్డివెన్స్‌ తెచ్చినా వాటిలోని పలు అంశాలు వివాదాస్పదమయ్యాయి. కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులతో ఇప్పట్లో వీటిపై శిక్షలు పడే అవకాశం కూడా లేదు. మైక్రోఫైనాన్స్‌పై పాలకవర్గాలు వేస్తున్న పిల్లిమొగ్గలను అర్థం చేసుకోవాలంటే మైక్రోఫైనాన్స్‌ పుట్టుక, ఫైనాన్స్‌ పెట్టుబడి ప్రపంచీకరణ ప్రభావాలను మనం పరిశీలించాల్సి ఉంటుంది.
మైక్రో ఫైనాన్స్‌ పుట్టు పూర్వోత్తరాలు

17వ శతాబ్దం మధ్య కాలంలో విశాండర్‌ స్పూనర్‌ అనే సిద్ధాంత వేత్త చిన్న రైతులు, చిన్న వ్యాపారులకు తక్కువపాటి రుణాలనందిచడం ద్వారా వారి పేదరికాన్ని తగ్గించవచ్చనే భావనతో పరిశోధన చేసాడు. రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలంలో యూరప్‌ దేశాల పునరుద్ధరణకు వెలువడిన ''మార్షల్‌ ప్లాన్‌''తో ఈ భావన ప్రాధాన్యతను సంతరించుకొంది వివిధ దేశాలలో పొదుపును ప్రోత్సహిస్తూ స్థానిక పొదుపు సంఘాలు, రుణ సంఘాలు, సహకార సంఘాలు, చిట్‌ ఫండ్‌ సంఘాలు రూపుదాల్చాయి. 1960లలో వీటి సంఖ్య విపరీతంగా పెరిగింది. 1970లలో పాకిస్థాన్‌ ఆర్థికవేత్త అఖ్త్‌ర్‌ హమీద్‌ ఖాన్‌, బంగ్లాదేశ్‌ ఆర్థిక వేత్త మహమ్మద్‌ యూనస్‌లు చిన్న మొత్తాల పొదుపు, రుణాల అనుభవాల్ని ముందుకు తీసుకెళ్ళి ''సూక్ష్మ రుణ విధానాన్ని'' (మైక్రో క్రెడిట్‌) ఒక భావనగా అభివృద్ధి చేశారు. అప్పటికే కొన్ని దేశాలలో ప్రపంచీకరణ విధానాలు మొదలయ్యాయి. వాణిజ్య బ్యాంకుల రుణ వితరణలో పేదల్ని ఇముడ్చుకోలేని దశలో ''సూక్ష్మ రుణ భావన'' ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఈ భావనకు ఆచరణరూపమిస్తూ 1976లో మహమ్మద్‌ యూనస్‌ బంగ్లాదేశ్‌లోని జోబ్రా గ్రామంలో గ్రామీణ్‌ బ్యాంకు ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు. 1983 నాటికి బంగ్లాదేశ్‌లో ప్రత్యేక చట్టం ద్వారా అది గ్రామీణ్‌ బ్యాంకు హౌదాను పొంది, సూక్ష్మ రుణ సంస్థలలో అంతర్జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకున్నది. 2006లో మహమ్మద్‌ యూనస్‌కు, ఆయన స్థాపించిన గ్రామీణ్‌ బ్యాంకుకు సంయుక్తంగా నోబెల్‌ బహుమతి లభించి, సూక్ష్మరుణ విధానం అంతర్జాతీయ గౌరవాన్ని పొందింది.

సూక్ష్మ రుణ భావన

ఈ భావన స్వేచ్ఛా మార్కెట్‌ సూత్రాల పునాదులపై నిర్మింపబడింది. పెట్టుబడిదారి విధానంలో కేవలం లాభాపేక్షతో నిర్వహించే వ్యాపారాలతో పాటు, సామాజిక దృక్పథం కలిగిన (లాభాలతో నిమిత్తం లేకుండా) సామాజిక వ్యాపారాల్ని నిర్వహించవచ్చుననేది మహమ్మద్‌ యూనస్‌ ప్రగాఢ విశ్వాసం. మరో ప్రత్యామ్నాయంతో పనిలేకుండా పేదలకు బహుముఖ ప్రయోజనాల్ని సమకూర్చగలిగే సామర్ధ్యం, ప్రపంచీకరణకు, స్వేచ్ఛా మార్కెట్‌ విధానాలకు ఉందని ఆయన గట్టిగా వాదిస్తారు. సక్రమమైన బాహ్య వాతావరణాన్ని సృష్టించగలిగితే, వారంతట వారే అభివృద్ధి కాగల అంతర్గత సామర్థ్యం పేదలు కలిగియున్నారని ఆయన అభిప్రాయ పడతారు. ఈ కార్యసాధనలో మహిళలు కీలక పాత్ర వహించాల్సి వుంటుందని, గ్రామీణ్‌ బ్యాంకుకు గుత్తాధిపత్యం ఉండకూడదని, పోటి ఉండాలని, అప్పుడే వినియోగదారులకు ప్రయోజనం సమకూరుతుందని ఆయన సూత్రికరిస్తారు.

అంతర్జాతీయ సంస్థల విధానంగా మైక్రో ఫైనాన్స్‌

ప్రపంచీకరణ విధానాల నేపధ్యంలో వివిధ దేశాలలో సామాజిక వ్యయం తగ్గటం మూలంగా, అట్టడుగు వర్గాల ప్రజల జీవన స్థితిగతులు అగమ్యంగా తయారయ్యాయి. ప్రభుత్వ బాధ్యత, సబ్సిడీలతో నిమిత్తం లేకుండా పేదల అభివృద్ధిని పేదలే చూసుకోవాల్సిన ''సూక్ష్మ రుణ పద్ధతి'' పాలక వర్గాలకు, అంతర్జాతీయ సంస్థలకు ఆకర్షణీయంగా ఉంది. ఈ నేపథ్యంలో 1995లో బీజింగ్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళల సాధికారిక సదస్సులో అప్పటి ఐక్యరాజ్య సమితి అధ్యక్షులు కోఫి అన్నన్‌, ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షులు జేమ్స్‌ ఉల్ఫ్‌న్సన్‌, మహిళలలో ఆర్థిక సాధికారికతను పెంచే సూక్ష్మ రుణ విధాన భావనను పరిచయం చేశారు. ఆ తరువాత 1997లో పేదరిక నిర్మూలన సాధనంగా సూక్ష్మ రుణ భావనను ఆచరణలో అమలు చేయడం కోసం అమెరికాలో ప్రపంచ శిఖరాగ్ర సదస్సు నిర్వహింపబడింది. ఈ సదస్సులో 2005సం|| నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల పేదలకు సూక్ష్మ రుణ విధానాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఐక్యరాజ్య సమితి 2005 సంవత్సరాన్ని ''అంతర్జాతీయ సూక్ష్మ రుణ సంవత్సరం''గా ప్రకటించింది. ఈ ప్రకటనతో సూక్ష్మ రుణ భావనకు ప్రపంచ వ్యాప్తంగా నైతికత పెరిగింది. ప్రపంచ బ్యాంక్‌ ప్రపంచ వ్యాప్తంగా మైక్రో ఫైనాన్స్‌ అభివృద్ధి బాధ్యతను సి.జి.ఏ.పి (కన్సల్టేటివ్‌ గ్రూప్‌ టు అసిస్ట్‌ ది పూర్‌)కి అప్పజెప్పింది.

భారతదేశంలో మైక్రో ఫైనాన్స్‌ విస్తరించిన తీరు

1991 సరళీకరణ విధానాల అమలుతో జాతీయ బ్యాంకుల ప్రాధాన్యత కుంచించబడింది. సామాజిక రంగానికి ప్రాధాన్యత తగ్గి, లాభాల రేటు ప్రాధాన్యత పెరిగింది. నరసింహన్‌ కమిటి సిఫార్సులు, బేసెల్‌ కమిటి ప్రమాణాలతో వ్యవసాయరంగానికి ఇచ్చే ప్రాధాన్యతా రుణాలు నిరర్ధక ఆస్తులు(పారు బాకీలు)గా భావించబడి వాటి మంజూరు తగ్గుముఖం పట్టింది. గ్రామీణ ప్రజానీకం ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. 1993, 1999 జాతీయ శాంపిల్‌ సర్వే గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాలలో 72% కుటుంబాలు ప్రభుత్వేతర వనరుల దగ్గర రుణాలు పొంది వున్నారు. వీరిలో 22% వడ్డీ వ్యాపారుల దగ్గర, 21% పాన్‌ బ్రోకర్ల దగ్గర అధిక వడ్డీకి రుణాలు పొందారు. సరిగ్గా ఈ సమయంలోనే ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయసంస్థల ప్రేరణతో స్వయం సహాయక బృందాల ద్వారా సూక్ష్మ రుణ ప్రక్రియకు భారత ప్రభుత్వ అంగీకరించింది.

సూక్ష్మ రుణ ప్రక్రియ కోసం 15-20 మంది మహిళలు ఉండే బృందాలు ఏర్పడ్డాయి. ఈ బృందాలు కొన్ని చోట్ల ప్రభుత్వేతర సంస్థల ఆధ్వర్యంలోను, కొన్ని చోట్ల రాజకీయ పార్టీల కార్యకర్తల నాయకత్వంలోను ఏర్పాట య్యాయి. ఒక స్థాయి వరకు పొదుపు చేసిన తరువాత బ్యాంకులతో అనుసంధానం చేసి, రుణాలను ఇప్పిస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. బ్యాంకు రుణాలతో పాటు సబ్సిడీ రుణాలు అందిస్తామని చెప్పడంతో ఈ బృందాలు అనేక ఆశలు పెంచుకున్నాయి. దేశంలో 60లక్షల బృందాలు ఏర్పడి, రూ. 54.47కోట్ల డిపాజిట్లను ప్రోగుచేశాయి.

కానీ, బ్యాంకులు ఈ బృందాలకు రుణాలివ్వటానికి విముఖంగా ఉన్నాయి. ఆ దశలో సంయుక్త బాధ్యత (జాయింట్‌ లయబులిటి) బృందాలతో మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. సూక్ష్మ రుణ విధానంలో మహిళలు ప్రధాన భూమికను వహిస్తూ రుణాల్ని తిరిగి చెల్లించడంలో విధేయంగా ఉండటం, మహిళలు కావటం వలన వాళ్ళపై వత్తిడిని పెంచి సులువుగా రుణ వసూళ్ళు చేసుకొనే అవకాశం ఉండటంతో రుణ రికవరీ 90%నికి మించింది. ఈ శాతం సంప్రదాయ బ్యాంకుల రుణ రికవరీ కంటే అత్యధికంగా ఉంది. ఈ పరిణామంతో ఆకర్షించబడి నాబార్డ్‌, చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు ప్రాధాన్యతా రుణాలను మైక్రో ఫైనాన్స్‌ నిర్వహించే బ్యాంకేతర ఫైనాన్స్‌ సంస్థలకు (ఎన్‌బిఎఫ్‌సి) అందించటానికి అంగీకరించి మార్గదర్శకాలను రూపొందించాయి.

ప్రాధాన్యతా రుణాలు పొందే వెసులుబాటు ఉండటంతో అనేక నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు మైక్రో ఫైనాన్స్‌ రంగంలో ప్రవేశించి ఆ వ్యాపారంలో 80% హస్తగతం చేసుకున్నాయి. ఈ సంస్థల అధీనంలోని జాయింట్‌ లయబిలిటి గ్రూపులకు బ్యాంకు రుణాలివ్వడంతో, స్వయం సహాయక బృందాలు ఈ సంస్థలకు బదిలీ అయ్యాయి. భారతదేశంలోని మైక్రో ఫైనాన్స్‌ రంగంలో రెండు విభిన్న లక్ష్యాలు గల సూక్ష్మ రుణ సంస్థలు వెలిశాయి. పేదల సాధికారికత, శిక్షణ, ఆరోగ్యరక్షణ లాంటి మౌళిక సామాజిక చర్యలతో మహిళలు, పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కొన్నింటి లక్ష్యమైంది. పేదల అభ్యున్నతిపేర లాభాలు దండుకోవడం మిగిలినవాటి లక్ష్యంగా ఉంది. భారతదేశంలో రెండవ లక్ష్యంగల సంస్థలు పై చేయి సాధించి, మైక్రో ఫైనాన్స్‌ రంగంపై ఆధిపత్యాన్ని పెంచుకుంటున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో మైక్రో ఫైనాన్స్‌

మన దేశంలో ఎనిమిది వందల మైక్రో ఫైనాన్స్‌ సంస్థలున్నాయి. అందులో 70% ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, తమిళనాడులో ఉన్నట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్‌లో వీటి విస్తరణ మరింత ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో స్వయం సహాయక బృందాలు డ్వాక్రా గ్రూపులుగా చెలామణి అవుతున్నాయి. 1994లో 10 వేల గ్రూపులుగా ఉన్న డ్వాక్రా గ్రూపులు 2001 నాటికి 3 లక్షల 50 వేలకు పెరిగాయి. కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ కింద 2000 సంవత్సరం నాటికి ఈ స్వయం సహాయక బృందాలు ప్రపంచ బ్యాంకు రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించి ఇచ్చే రుణానికి అర్హతను సాధించాయి. రోజుకు రూ.1/- పొదుపును సాధించాల్సిన ఈ గ్రూపులకు 9-12% వడ్డీ రేటుకు రుణాలు ఇవ్వవలసి వుంది. ఇంత హడావుడిగా ఏర్పాటుచేసిన డ్వాక్రా గ్రూపులకు ఇచ్చిన రుణాలు మొత్తం బ్యాంకుల రుణాలలో 0.6% నికి కూడా మించలేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం వల్ల స్వయం సహాయక గ్రూపులు బ్యాంకింగేతర పైనాన్స్‌ సంస్థల వైపుకు రుణాలకోసం మళ్ళాయి. మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు విపరీతమైన వడ్డీ రేట్లతో రుణ కార్యక్రమాన్ని మొదలెట్టాయి.

ఒక అంచనా ప్రకారం 2008-2009 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 2 కోట్ల మైక్రో ఫైనాన్స్‌ రుణ గ్రహీతలు (స్వయం సహాయక బృందాలు, జాయింట్‌ లయబిలిటి బృందాలు కలుపుకొని) రూ.12,300 కోట్ల రుణం కలిగివున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 1 కోటి 60 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అంటే 125% కుటుంబాలకు మైక్రో ఫైనాన్స్‌ రుణం కల్గివుందని భావించాలి. ఈ రుణాలు పొందేది ఎక్కువగా పేదలే. మన రాష్ట్రంలో మొత్తం కుటుంబాల్లో 40 శాతం పేద కుటుంబాలున్నాయని ఒక అంచనా. ఈ లెక్కన మైక్రో ఫైనాన్స్‌ కింద ఒక్కో పేద కుటుంబానికి ఎనిమిదేసి సార్లు రుణం అందించబడింది. దీంతో వీరి సగటు కుటుంబపు రుణం రూ.49,000లుగా ఉంది. దేశవ్యాప్తంగా మైక్రోఫైనాన్స్‌ సంస్థలు అందించిన సగటు కుటుంబ రుణానికి ఇది ఎనిమిదిరెట్లు కాగా, స్వయం సహాయక గ్రూపులు పొందిన సగటు కుటుంబ రుణం కంటే 11రెట్లు ఎక్కువ. పై గణాంకాలు ఆంధ్రప్రదేశ్‌లో మైక్రో ఫైనాన్స్‌ సంస్థల కేంద్రీకరణను తెలియజేస్తున్నాయి. ఈ గణాంకాల ప్రకారం ఒక్కొక్క కుటుంబానికి బహుళ సంఖ్యలో రుణాలు మంజూరు చేసినట్లు తేలుతుంది. మైక్రో ఫైనాన్స్‌ సంస్థల మధ్య రుణాలివ్వడంలో పోటీ ఎక్కువైనప్పటికీ, అధిక వడ్డీరేట్ల విషయంలో ఇవన్నీ సిండికేట్‌గానే వ్యవహరిస్తున్నాయి. దీంతో పేదలకు ప్రయోజనాలు కలుగక పోగా అనర్ధాలు ఎక్కువయ్యాయి.

ప్రభుత్వ జోక్యానికి బ్రేకులేసిన ప్రపంచబ్యాంకు

ప్రపంచబ్యాంకు ఏర్పాటు చేసిన సి.జి.ఏ.పి వివిధ దేశాలలో మైక్రో పైనాన్స్‌ అమలుకు కొన్ని మార్గదర్శకాల్ని రూపొందించింది. అవి 1) వడ్డీరేట్లపై పరిమితుల్ని విధించే రుణ వ్యాపార చట్టాల్ని రద్దు చేయాలి. వడ్డీ రేట్లపై ఎటువంటి ఆంక్షలు ఉండకూడదు. 2) పేదలకిచ్చే అన్ని రకాల సబ్సిడీలు రద్దు చేయాలి.3) సూక్ష్మ రుణ సంస్థలను ప్రయివేటీకరించాలి. 4) కఠినమైన రుణ వసూళ్ళ చర్యలు, చట్టాలు రూపొందించాలి. వాస్తవానికి వీటిని మార్గదర్శకాలు అనడం కంటే షరతులు అని పేర్కొనాలి. ఫైనాన్స్‌పెట్టుబడి ప్రపంచీకరణ నేపథ్యంలో ఆర్థిక రంగంలో ప్రభుత్వ జోక్యాన్ని నివారించేందుకు, నయా ఉదారవాద విధానాలకు ఢోకా లేకుండా ఉండేందుకు ప్రపంచబ్యాంకు ఈ షరతులను విధించింది. నయా ఉదారవాద విధానాలను అమలు చేస్తున్న ఏ దేశమైనా వీటిని అమలు చేయాల్సిందే. భారతదేశంలో గ్రామీణ మహిళా అభివృద్ధి, సాధికారిక ప్రాజక్ట్‌ క్రింద ప్రపంచ బ్యాంకు మంజూరు చేసిన రుణం ఈ నిబంధనలకు లోబడి వుంది. దీని కారణంగానే ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలపై ప్రభుత్వాలు ఉదాసీనంగా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ అనుభవాలు - నేర్పుతున్న పాఠాలు

1) మహమ్మద్‌ యూనస్‌ సూత్రీకరించినట్లు స్వేచ్ఛా మార్కెట్‌ విధానాలపై నిర్మితమైన సూక్ష్మరుణ విధానం పేదల పేదరిక నిర్మూలనకు దోహదపడక పోగా, పెనం నుండి పొయ్యిలో పడ్డట్లు పేదలను నిరుపేదలుగాను, బానిసలు గానూ మారు స్తున్నాయి.

2) పేదరిక నిర్మూలనలో సూక్ష్మరుణ విధానం ఒక సహయకారి మాత్రమే కాని పేదరిక నిర్మూలనకు దివ్య ఔషదం కాదు అందువల్ల మైక్రో ఫైనాన్స్‌ విధానానికి విశేష ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం లేదు

.3) సరళీకరణ విధానాలతో విద్య, ఆరోగ్యం, నివాసం వంటి సౌకర్యాలు అందుబాటులో లేకుండా పోయాయి. ఉపాధి, ఉద్యోగభద్రత కరువైంది. ఆర్థిక, సామాజిక అంతరాలూ పెరిగాయి. వీటన్నింటి వల్ల జీవన వ్యయం పెరిగింది. అందుకే పేదలు సూక్ష్మ రుణాలను వస్తూత్పత్తికి ఉపయోగించకుండా నిత్యావసర జీవనానికి, అప్పటికే ఉన్న అప్పులు తీర్చడానికి వాడుతున్నారు. దీంతో అప్పుల భారం తడిసిమోపడైపోయింది. పేదల జీవన స్థితిగతుల్ని మెరుగుపర్చకుండా, కేవలం సూక్షరుణాలతోనే సరిపడితే వీరి బతుకులు బాగుపడవు.

4) వ్యవస్థలో వేతనంతో కూడిన ఏ ఉపాధీ దొరకని స్థితిలో, ఆఖరి చర్యగా పేదలు స్వయం ఉపాధిని ఎంచుకుంటారు. కొన్ని వస్తువులు ఉత్పత్తిచేస్తున్నారు. మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ప్రపంచీకరణ విధానాల వల్ల మార్కెట్లో బహుళ జాతి ఉత్పత్తులు వెల్లువగా వస్తున్నాయి. వాటికి ప్రచార బలమూ మెండు గా ఉంది. బడా కార్పొరేట్‌ మాళ్లను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. ఈ పోటీలో నిలదొక్కు కోవాలంటే ప్రభుత్వం స్వయం ఉపాధి ఉత్పత్తులకు రక్షణ కల్పించాలి. కానీ అలా చేయకపోవడంతో స్వయం సహాయక బృందాల జీవనం అస్తవ్యస్తమ య్యింది.

5) అధిక వడ్డీరేట్లకు, కిరాతక చర్యలకు ప్రపంచ బ్యాంకు షరతులే మైక్రో ఫైనాన్స్‌ సంస్థలకు అండగా నిలుస్తున్నాయి. ఆర్‌బిఐ సైతం తన మార్గదర్శక సూత్రాలలో వడ్డీ రేటు నిర్ణయం మైక్రో ఫైనాన్స్‌ సంస్థలదేనన్నది. ఈ షరతులకు తలొగ్గే ప్రభు త్వాలు ఉన్నంత కాలం పేదలపాలిట మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు విషపు గుళికలే.

6) లాభాపేక్ష ధ్యేయంగా ఉండే పెట్టుబడిదారీ వర్గం ప్రపంచ వ్యాప్తంగా లాభాలు దొరకనప్పుడు లాభాల కోసం పేదల రక్తాన్ని పీల్చటానికి వెనుకాడవన్న వాస్తవాన్ని ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. పేదరిక నిర్మూలనలో కార్పోరేట్ల భాగస్వామ్యం పనికిరాదని దీంతో రుజువైంది.

7) స్వేచ్ఛా మార్కెట్‌ విధానాలలో పోటి వినియోగదారుడికి మేలుచేస్తుందని ప్రచారం చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మైక్రో ఫైనాన్స్‌ సంస్థల పోటి నిర్వహణ ఖర్చుల్ని తగ్గించక పోగా తీవ్రంగా పెంచింది.

8) ఆంధ్రప్రదేశ్‌లో మరణించిన పేదలలో 17 మంది యస్‌.కె.యస్‌. మైక్రో ఫైనాన్స్‌ నుంచి అప్పులు తీసుకున్నవారే. ఈ సంస్థ ఇటీవలనే ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపిఓ) ఉపక్రమించింది. పబ్లిక్‌ ఆఫర్‌ కు వెళ్ళబోయేముందు తన వాటాలలో గణనీయమైన భాగాన్ని హెడ్జ్‌ ఫండ్స్‌ అమ్ముకున్నట్లు, దాని ద్వారా 12 రెట్ల లాభాన్ని పొందినట్లు వార్తలు వస్తున్నాయి. పేదల జీవితాలతో ముడిపడ్డ మైక్రో ఫైనాన్స్‌ రంగంలో హెడ్జ్‌ ఫండ్ల ప్రవేశం ప్రమాదకరమైంది.

9) వడ్డీరేటును నియంత్రించకుండా మైక్రో ఫైనాన్స్‌ సంస్థల పూర్తి నియంత్రణ సందేహాస్పదమే. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ ఎందుకూ కొరగాకుండా పోయే ప్రమాదం ఏర్పడింది.

.

Sunday, October 10, 2010

బేసెల్‌ ప్రమాణాలు - భారతదేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ

బేసెల్‌-3 ప్రమాణాల అమలుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఇటీవల చేసిన ప్రకటనతో, భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ యొక్క సుస్థిరత ఒక కోణంలో ఆశావహంగా కనిపిస్తున్నా, మరో కోణంలో పరిశీలించినట్లయితే బేసెల్‌ ప్రమాణాల అమలు తీరే ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థ మనుగడకు గొడ్డలి పెట్టుగా ఉంది.

బేసెల్‌-1 ప్రమాణాలు

సరళీకరణ విధానాల నేపథ్యంలో 1992లో భారత దేశంలో ఈ ప్రమాణాల అమలుకు పూనుకున్న రిజర్వు బ్యాంక్‌, 1999 నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. బేసెల్‌ కమిటీ ఈ ప్రమాణాలలో ''సముచిత మూలధన నిష్పత్తి'' (క్యాపిటల్‌ ఎడిక్వసీ రేషియో)ని 8%గా నిర్ణయించగా, రిజర్వు బ్యాంకు ఈ నిష్పత్తిని 9%గా ఖరారు చేసింది. ఈ ప్రమాణాల అమలులో ప్రభావితమైన రెండు అంశాల్ని ప్రత్యేకంగా పేర్కొనాల్సి వుంది. అవి 1. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా రూ. 20,446 కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధనానికి జమ చేసి, జాతీయ బ్యాంకుల ''సముచిత మూల నిష్పత్తి''ని పెంచడం 2) మొత్తం బ్యాంకు రుణాలలో నిరర్దక ఆస్తుల (మొండిబాకీలు) శాతాన్ని 1993 మార్చి నాటికున్న 23.2 నుండి మార్చి 2004 నాటికి 7.8 కి తగ్గించడం.

ప్రభావాలు

బేసెల్‌-1 ప్రమాణాల ప్రకారం నిరర్దక ఆస్తులు పెరిగిన మేరకు బ్యాంకులు అదనపు మూలధనాన్ని పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బ్యాంకులు అనివార్యంగా నిరర్దక ఆస్తుల్ని తగ్గించాల్సి వచ్చింది. ఈ మొండి బకాయిలలో అత్యధిక శాతం సంపన్న వర్గాలు, రాజకీయ నాయకులవి. పారుబాకీ దారుల చిట్టాను బహిర్గతం చేసి, కఠిన చర్యలతో ఈ బాకీల వసూళ్ళకు ప్రభుత్వం పూనుకోవాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు గళమెత్తినా, పాలక వర్గాలు తగు రీతిలో స్పందించలేదు. వివిధ ట్రిబ్యూనల్స్‌ను, అప్పిలేట్లను సాధనంగా చేసుకొని 2003-04 నాటి స్థూల నిరర్దక ఆస్తులలో 56.6% న్ని పారుబాకీల ఖాతాకు జమ చేసి, అందులో అత్యధిక భాగాన్ని రద్దు చేసే ప్రక్రియకు ప్రభుత్వ రంగ బ్యాంకులు పూనుకోవాల్సిన స్థితి ఏర్పడింది. దీంతో జాతీయ బ్యాంకులు ఆర్జించిన విశేష లాభాలను మొండిబాకీలకు సర్దుబాటు చేయడంతోను, ప్రభుత్వం అందించిన అదనపు మూలధనంతోనూ, నిరర్దక ఆస్తుల శాతం తగ్గింది. ఆచరణలో పూర్తిస్థాయిలో బకాయిలు మాత్రం వసూలు కాలేదు. ఈ పరిణామంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలలో పడటం, వాటి ప్రయివేటీకరణకు పాలక వర్గాలు కసరత్తు చేయటం మొదలైంది. బ్యాంకుల రుణ డిపాజిట్‌ నిష్పత్తి తగ్గుముఖం పట్టింది. ప్రాధాన్యతారంగ రుణాలను ఇవ్వటానికి వాణ ిజ్య బ్యాంకులు విముఖతను చూపడంతో, వ్యవసాయ రుణాల మంజూరు తగ్గింది.

అంతర్జాతీయ సంస్థల వత్తిడితో బేసెల్‌-2 ప్రమాణాల అమలు

ఫిబ్రవరి 2005లో బేసెల్‌-2 ప్రమాణాల అమలుకు కావల్సిన మార్గదర్శకాల్ని రిజర్వు బ్యాంక్‌ నియమించిన స్టీరింగ్‌ కమిటీ విడుదల చేసింది. మొదట్లో మార్చి 31, 2007లోగా బేసెల్‌-2 ప్రమాణాల్ని అమలు చేయాలని రిజర్వ్‌ బ్యాంకు భావించింది. ఆ తరువాత తన ప్రణాళికను మార్చుకుంది. మార్చి 31, 2008లోగా దేశంలోని విదేశీ బ్యాంకులు, మార్చి 31, 2009లోగా దేశీయ వాణిజ్య బ్యాంకులు ఈ ప్రమాణాల అమలును పూర్తి చేయాలన్నది. బేసెల్‌-2 ప్రమాణాల మార్గదర్శకాల రూపకల్పన ఆరంభంలో రిజర్వ్‌ బ్యాంకు ప్రకటిస్తూ, తమ మొత్తం వాణిజ్యంలో 20%నికి మించిన విదేశీ వాణిజ్యం కలిగిన దేశీయ బ్యాంకులే బేసెల్‌-2 ప్రమాణాలను అమలు చేయాలన్నది. అప్పటికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒక్కటే మన దేశంలో అత్యధిక వాణిజ్యాన్ని కలిగి ఉంది. అయితే అది కూడా ఆరుశాతంగానే ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ వాణిజ్య బ్యాంకులు బేసెల్‌-2 ప్రమాణాల్ని అనుసరించాల్సిన అవసరం లేదు. కానీ అంతర్జాతీయ ద్రవ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు వివిధ దేశాలలో బేసెల్‌-2 ప్రమాణాల పూర్తి అమలును ప్రోత్సహించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ కూడా తమ సభ్య దేశాలు ద్రవ్య రంగ సుస్థిరత కోసం ఈ ప్రమాణాలను అమలు చేయాలని, విదేశీ బ్యాంకుల విస్తరణకు అంగీకరించాలని, వివిధ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలలో పేర్కొంది. భారత్‌ కూడా అందులో ఒక సభ్య దేశం. ఈ నేపథ్యంలో భారత దేశంలో రిజర్వ్‌ బ్యాంకు బేసెల్‌-2 ప్రమాణాల అమలుకు సిద్ధమైంది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణకు శ్రీకారం

బేసెల్‌-2 ప్రమాణాలు కొన్ని అంశాలలో రిస్క్‌ వేయిటేజీలకు మూలధన సమీకరణలో వెసులుబాటు కల్పించాయి. కార్పొరేట్‌ రుణాల కంటే రిటైల్‌ రుణాలకు, చిన్న వ్యాపార రుణాలకు రిస్క్‌ వెయిటేజీని తగ్గించాయి. ఈ రకమైన వెసులుబాటుతో అదనపు మూలధన అవసరం బ్యాంకులకు తగ్గినా, నిర్వహణ రిస్క్‌ (ఆపరేషనల్‌ రిస్క్‌)కు సంబంధించి సమీకరించాల్సిన అదనపు మూలధనం తడిసి మోపెడైంది. గత మూడు సంవత్సరాల సగటు వార్షిక స్థూల ఆదాయంలో 15 శాతాన్ని అదనపు మూలధనంగా బ్యాంకులు సమీకరించాలి. ఐ.సి.ఆర్‌.ఎ అంచనా ప్రకారం భారతదేశంలోని వాణిజ్య బ్యాంకులు నిర్వహణ రిస్క్‌ కింద రూ. 12 వేల కోట్ల మూలధనాన్ని తక్షణం సమీకరించాల్సి వచ్చింది. దీనికి తోడు భవిష్యత్తు రుణాల మంజూరుకు మధ్యస్థ కాల పరిమితిలో రూ. 18,000-20,000 కోట్లు సమీకరించాల్సి వుంది. వీటితో పాటు సమాచార సమీకరణకు, విశ్లేషణలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం అత్యధిక వ్యయపూరితమైంది. అప్పటికే జాతీయ బ్యాంకులు వారి లాభాలను నిరర్దక ఆస్తుల అదుపుకు సర్దుబాటు చేయడం, ప్రభుత్వం నుండి బాండుల రూపంలో రుణం పొందటంతో అదనపు మూలధన సమీకరణకు నూతన మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ బ్యాంకులు 51%నికి మించిన ప్రభుత్వ వాటాలను రిటైల్‌ మార్కెట్లో అమ్మటానికి అనుమతించింది. ఈ చర్య ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణకు శ్రీకారం చుట్టింది. అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు బేసెల్‌-2 ప్రమాణాల అమలుకు ప్రభుత్వ వాటాల ఉపసంహరణకు పూనుకున్నాయి. ఈ ధోరణి వేగం పుంజుకొని ప్రభుత్వ ఆధీనంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటాలను 33%నికి తగ్గించాలని వత్తిడి పెరిగింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో ఈ ధోరణికి బ్రేక్‌ పడింది. ప్రయివేట్‌ బ్యాంకులు సైతం అదనపు మూలధన సమీకరణకు పెట్టుబడి మార్కెట్‌ను ఆశ్రయించాయి. ఈ సమయంలో మార్చి 2004లో ప్రయివేట్‌ రంగ బ్యాంకులలో ఆటోమేటిక్‌ మార్గంలో 74% వరకు విదేశీ పెట్టుబడిని అనుమతించటానికి ప్రభుత్వం అంగీకరించింది. కొన్ని ప్రయివేట్‌ బ్యాంకులు విదేశీ పెట్టుబడిని ఆహ్వానించి విదేశీ బ్యాంకులుగా మారాయి. ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు, హెచ్‌.డి.ఎఫ్‌.సి బ్యాంకు ఈ కోవలోవే. ఈ రకంగా బారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటీకరించటానికి, విదేశీ బ్యాంకుల విస్తరణను పెంచటానికి బేసెల్‌-2 ప్రమాణాలు సాధనాలయ్యాయి.

మూలధన సమీకరణ కోసం ఐ.యం.ఎఫ్‌ అప్పు

బేసెల్‌-2 ప్రమాణాలు ''సముచిత మూలధన నిష్పత్తి'' 8%గా ఉండాలని నిర్దేశించగా, రిజర్వ్‌ బ్యాంకు 9%గా నిర్ణయించింది కాని భారత ప్రభుత్వం ఈ నిష్పత్తి 12% ఉండాలని ఆదేశించింది. దీంతో వాణిజ్య బ్యాంకులు సమీకరించాల్సిన మూలధన పరిమాణం పెరిగింది. మూలధన సమీకరణకు నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులలో, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటా 51% గా ఉన్నందున వాటాల ఉపసంహరణకు అవకాశం లేకుండా పోయింది. విక్రయించగలిగే ప్రభుత్వ వాటాలున్న బ్యాంకులకు, వాటాల విక్రయానికి, మార్కెట్‌ అనుకూలంగా లేకుండా పోయింది. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఈ బ్యాంకులన్నింటికి ఆర్థిక సహాయానికి పూనుకొని మూడు బిలియన్‌ డాలర్ల రుణం కోసం అంతర్జాతీయ ద్రవ్య సంస్థను ఆశ్రయించింది. దేశంలోని అభ్యుదయ కాముకులు ఈ చర్యను వ్యతిరేకించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు అప్పటికే రిజర్వ్‌ బ్యాంకు ప్రమాణాల ప్రకారం సముచిత మూలధన నిష్పత్తిని కలిగివున్నాయి. అదనపు నిష్పత్తి అమలు సాకుతో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలనాశ్రయించడంలోని దురుద్దేశం చర్చనీయాంశమైంది. ద్రవ్య రంగ సరళీకరణను వేగవంతం చేయడం కోసం రిజర్వు బ్యాంకుపై వత్తిడిని పెంచటానికే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు పూనుకున్నదని, చైనా అనుసరించినట్లుగా విదేశీ మారక ద్రవ్య నిధులను ఈ అవసరాలకు మళ్ళించే అవకాశాన్ని ఉద్దేశ పూర్వ కంగానే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనే విమర్శలు పెల్లుబికాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య సంస్థ నుండి రెండు బిలియన్‌ డాలర్ల మొదటి విడత రుణాన్ని బ్యాంకుల అదనపు మూలధనం సమీకరణకోసం పొందింది.

బేసెల్‌-3 ప్రమాణాలు

బేసెల్‌-2 ప్రమాణాలు బ్యాంకుల నియంత్రణను కీలకంగా తీసుకొని రూపొందించబడ్డాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో బడా బ్యాంకులు కుప్పకూలడంతో బేసెల్‌-2 ప్రమాణాల డొల్లతనం బయటపడింది. విడివిడిగా బ్యాంకుల సుస్థిరతే కాకుండా ''ద్రవ్య రంగ వ్యవస్థ మొత్తం సుస్థిరత'' ధ్యేయంగా బేసెల్‌-3 ప్రమాణాల ప్రతిపాదనలు తయారయ్యాయి. బేసెల్‌-2 ప్రమాణాల కంటే కనీస సముచిత మూలధనంలో నాణ్యతను, పరిమాణాన్ని మెరుగుపర్చాలని ఈ ప్రమాణాలు నిర్దేశిస్తున్నాయి. అలాగే నిధుల లభ్యత (లిక్విడిటీ) నిష్పత్తిపై విడివిడి దేశాలకు స్వేచ్ఛనివ్వకుండా విశ్వ ప్రామాణికమైన నిధుల లభ్యత నిష్పత్తిని ఖరారు చేయటానికి ఈ ప్రమాణాలు సిద్ధమౌతున్నాయి. నవంబర్‌లో జరిగే జి-20 దేశాల సమావేశంలో ఈ ప్రమాణాలు తుది మెరుగులు దిద్దుకుంటాయి. భారతదేశంలో ఈ ప్రమాణాల అమలు కోసం వచ్చే తొమ్మిది సంవత్సరాలలో రూ. ఆరు లక్షల కోట్ల నిధులు అవసరమౌతాయని ఐ.సి.ఆర్‌.ఎ అంచనా వేస్తున్నది. బేసెల్‌-3 ప్రమాణం ప్రకారం సముచిత మూలధన నిష్పత్తి 16శాతంగా ఉండాలి. మనదేశ సముచిత మూలధన నిష్పత్తి 13.4%గా ఉంది. అలాగే మన దేశ మొదటి అంచె మూలధనం 9.3%గా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్‌బిఐ మటుకు బేసెల్‌-3 ప్రమాణాలను అమలు చేయగల మన్న ధీమాను వ్యక్తం చేస్తున్నా, వాటిలో ఉన్న కొన్ని ఇబ్బందులను అంగీకరిస్తున్నది.

ముగింపు

భారతదేశంలో బేసెల్‌ ప్రమాణాల అమలుతో ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రభుత్వ ఆధీనంలోని సగటు మూలధనం 61.32%నికి పడిపోయింది. బ్యాంకుల సామాజిక దృక్పథం స్థానంలో లాభాపేక్ష పెరిగింది. ప్రయివేట్‌ బ్యాంకుల ఆధిపత్యం పెరిగి విదేశీ బ్యాంకుల ప్రాబల్యం అధికమైంది. బ్యాంకుల ఏకీకరణకు రంగం సిద్ధమైనది. అయినప్పటికీ ప్రభుత్వరంగ బ్యాంకుల బలంతో మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని విజయవంతంగా ఎదుర్కొంది. బేసెల్‌-3 ప్రమాణాల అమలు ద్రవ్య రంగ సరళీకరణ వేగాన్ని పెంచడంతో పాటు, నీడనిచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకుల మొదళ్ళను పెకలించి, విదేశీ బ్యాంకుల ఆధిపత్యాన్ని పెంచనున్నది. తస్మాత్‌ జాగ్రత్త!!

Tuesday, October 5, 2010

బేసెల్‌ -2 ప్రమాణాలు - బ్యాంకింగ్‌ వ్యవస్థ


అంతర్జాతీయ బ్యాంకుల సుస్థిర మనుగడకు అమలు చేయాల్సిన మార్గదర్శకాలు బేసెల్‌ ప్రమాణాలుగా రూపొందించబడ్డాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు ఈ ప్రమాణాలను జాతీయ బ్యాంకులకు కూడా వర్తింపజేశాయి. ఈ క్రమంలో మొదటి విడతగా విడుదలైన బేసెల్‌-1 ప్రమాణాలు బ్యాంకులు అందించే రుణాలలో ఇమిడివున్న ''రిస్క్‌''ను ఎదుర్కోవడానికి అవసరమైన మూలధన పరిమాణాన్ని, ''రిస్క్‌'' నాణ్యతను బట్టి నిర్ణయించాయి. దీనినే ''సముచిత మూలధన నిష్పత్తి''(క్యాపిటల్‌ ఎడిక్వసీ రేషియో) అన్నారు. ఈ నిష్పత్తి ''రిస్క్‌''ను ఎదుర్కోగలిగే బ్యాంకుల సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఈ ప్రమాణాల తదనంతర కాలంలో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యరంగంలో నెలకొన్న వివిధ పరిణామాల నేపధ్యంలో బేసెల్‌-2 ప్రమాణాలు రూపొందించబడ్డాయి.
బేసెల్‌-2 ప్రమాణాల పూర్వరంగం

బేసెల్‌-1 ప్రమాణాలలో ''సముచిత మూలధన నిష్పత్తి'' గుండుగుత్తగా వివిధ దేశాలలోని బ్యాంకులన్నింటికి ఒకే విధంగా ఉంది. ఈ కారణంగా వివిధ దేశాల ద్రవ్య వ్యవస్థల్లో నెలకొన్న నూతన పరిణామాలతో ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించడంలో బేసెల్‌-1 ప్రమాణాలు విజయవంతం కాలేకపోయాయి. ప్రపంచీకరణ స్వరూప స్వభావాలలో నెలకొన్న మార్పులతో ద్రవ్య మార్కెట్‌లో వినూత్న ద్రవ్య ఉత్పత్తులు (ఫైనాన్షియల్‌ ఇన్నోవేషన్స్‌) రంగం మీదకొచ్చాయి. ఈ ద్రవ్య ఉత్పత్తుల్లో స్పెక్యులేషన్‌ తీవ్రత భారీగా ఉంది. రుణ రంగ ప్రాధాన్యత పెరిగి, రుణ డెరివేటీవ్‌ ల్లాంటి అత్యధిక రిస్క్‌ కలిగిన ద్రవ్య ఉత్పత్తుల ప్రవేశంతో మార్కెట్‌ రిస్క్‌ అపరిమితంగా పెరిగింది. దీని తట్టుకోగలిగే ''రిస్క్‌'' యాజమాన్య పద్ధతులు బేసెల్‌-1 ప్రమాణాలలో లేకపోవడం బ్యాంకులకు పెను సవాలుగా మారింది. బేసెల్‌-1 ప్రమాణాలు అంచనా కట్టిన రుణ రిస్క్‌ పరిధికి మించిన పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని అదునుగా తీసుకున్న కొన్ని అంతర్జాతీయ బ్యాంకులు వారి వారి బ్యాలెన్స్‌ షీట్లను తమ్మినిబమ్మిని చేశాయి. నూతన ద్రవ్య ఉత్పత్తుల మూలకంగా నెలకొన్న అదనపు రిస్క్‌కు అనుగుణంగా అదనపు మూలధన సమీకరణ ప్రమాణాలు లేకుండా పోయాయి. అధిక నాణ్యత కలిగిన రుణాలపై బ్యాంకు ఆర్జించే లాభాల కంటే నాసిరక రుణాలు/పెట్టుబడులు అత్యధిక లాభాల్ని ఆర్జించడంతో, అంతర్జాతీయ బ్యాంకులు నాణ్యత కలిగిన రుణాల మంజూరును నిర్లక్ష్యం చేయడం మొదలైంది. బ్యాంకులు అంతర్గతంగా అనుసరిస్తున్న పద్ధతుల్లో పారదర్శకత లోపించింది. 1990లలో బేసెల్‌-1 ప్రమాణాలను తు.చ తప్పకుండా అమలు చేసిన థారులాండ్‌, ఇండోనేషియా, మలేషియా లాంటి ఆసియా దేశాలలోని ద్రవ్య వ్యవస్థలు ద్రవ్య సంక్షోభంతో తల్లక్రిందులైనాయి. అనేక బ్యాంకులు మూతబడ్డాయి. ఈ సవాళ్ళను అధిగమించడానికి బేసెల్‌ కమిటి జూన్‌-2004లో బేసెల్‌-2 ప్రమాణాల పేర నూతన మార్గదర్శకాల్ని రూపొందించింది. ఈ ప్రమాణాలు బేసెల్‌-1 ప్రమాణాల కంటే మెరుగ్గా ఉన్నా, సంక్లిష్టంగా ఉన్నాయి.

బేసెల్‌-2 ప్రమాణాలు

కనీసం మూలధన పరిమాణం, పర్యవేక్షణ సమీక్ష, మార్కెట్‌ క్రమశిక్షణ అనే మూడు స్తంభాలపై (పిల్లర్స్‌) బేసెల్‌-2 ప్రమాణాలు నిర్మింపబడ్డాయి.

1). కనీస మూలధన ప్రమాణాలు

బ్యాంకులు ఎదుర్కొనే రిస్క్‌ను బేసెల్‌-2 ప్రమాణాలు 3 రకాలుగా వర్గీకరించాయి. అవి రుణాల రిస్క్‌, మార్కెట్‌ రిస్క్‌, నిర్వహణ రిస్క్‌లు

రుణాల రిస్క్‌ : సకాలంలో రుణాలను, వాటిపై వడ్డీలను తిరిగి చెల్లించటంలో రుణ గ్రహీతలలో అనేక తారతమ్యాలు వుంటాయి. వీటిలో ఇమిడి వున్న రిస్క్‌ను రుణాల రిస్క్‌ అంటారు. ఈ రిస్క్‌ కూడా ఒక్కొక్క రుణ గ్రహీతకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. బ్యాంకులు సాధారణంగా అంచనా వేయగలిగే నష్టాలను బట్టి వడ్డీ రేటు నిర్ణయించబడుతుంది. కానీ వీటికి భిన్నంగా ఆర్థిక వ్యవస్థలో నెలకొనే ఒడుదుడుకులతో బ్యాంకులెదుర్కొనే నష్టాలను ''ఊహించని నష్టాలు'' అంటారు. రుణాల రిస్క్‌, ఊహించని నష్టాల రిస్క్‌లకు అనుగుణంగా అదనపు మూలధన పరిమాణాన్ని బ్యాంకులు సమకూర్చుకోవాలి.

మార్కెట్‌ రిస్క్‌ : బ్యాంకులు ''చట్టబద్ధమైన లిక్విడిటీ నిష్పత్తి''ని (స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో-యస్‌.యల్‌.ఆర్‌) అమలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను తమ నిధులలో లిక్విడ్‌ ఆస్థులైన నగదు, బంగారం, అనుమతించిన ప్రభుత్వ/ఇతర బాండులలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. (భారతదేశంలో గరిష్ట చట్టబద్ధ లిక్విడిటీ నిష్పత్తి 40%గా ఉంది). ప్రపంచీకరణ విధానాల నేపధ్యంలో వీటి విలువలు అనిశ్చితికి గురౌతున్నాయి. మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ మూలకంగా, వడ్డీ రేట్లు, విదేశ మారక ద్రవ్యం, షేర్‌లు, సరుకుల ధరలలో సంభవించే మార్పులు ఈ అనిశ్చితికి కారణమౌతున్నాయి. ఈ రిస్క్‌ను మార్కెట్‌ రిస్క్‌ అంటారు.

నిర్వహణ రిస్క్‌ : బ్యాంకులు నిర్వహించే ఆంతరంగిక యాజమాన్య పద్ధతులు, ప్రక్రియలు, వాటిని నిర్వహించే వ్యక్తుల సమర్ధతతోపాటు, బాహ్య కారణాలు కూడా బ్యాంకుల అస్థిరతకు కారణమౌతున్నాయి. వీటినే ''నిర్వహణ రిస్క్‌'' అంటారు. పైన పేర్కొన్న రిస్క్‌ల పరిమాణాన్ని అంచనా వేయటానికి అందుకు అవసరమైన మూలధనాన్ని గణించటానికి కావలసిన మార్గదర్శకాలను మొదటి స్తంభం (ఫస్ట్‌ పిల్లర్‌) సమకూరుస్తుంది. బేసెల్‌-1 ప్రమాణాలలో రిస్క్‌ వెయిటేజ్‌లను, కావలసిన మూలధన పరిమాణాన్ని నియంత్రణ సంస్థలు ముందే నిర్ణయిస్తాయి. కానీ బేసెల్‌-2 ప్రమాణాలలో అనుమతి పొందిన రేటింగ్‌ ఏజెన్సీల రేటింగ్‌లపై ఆధారపడి బ్యాంకులు వారివారి రిస్క్‌ వెయిటేజ్‌లపై అంతర్గత రేటింగ్‌లను అభివృద్ధి చేసుకొనే అవకాశం మొదటి స్థంభం కలిగించింది.

2) పర్యవేక్షణ సమీక్ష

కేవలం సముచిత మూలధనం సమకూర్చుకోవడంతోనే బ్యాంకుల మనుగడకు సుస్థిరత రాదని బేసెల్‌-2 ప్రమాణాలు భావిస్తున్నాయి. దానితోపాటు బ్యాంకుల రిస్క్‌ను అదుపు చేయటానికి అవసరమైన, మెరుగైన రిస్క్‌ యాజమాన్య పద్ధతుల్ని బ్యాంకులు కలిగివుండాలని బేసెల్‌-2 ప్రమాణాలు నిర్దేశిస్తున్నాయి. బేసెల్‌-2 నందు రెండవ స్తంభం పర్యవేక్షణ పద్ధతులకు, సమీక్షకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. చట్టా వ్యాపారాలు, రుణ డెరివేటివ్‌లకు సంబంధం ఉన్న బ్యాంకులు ఈ ప్రమాణాల క్రింద అనేక నియంత్రణలను, మార్గదర్శకాలను ఆచరించాల్సి వుంటుంది. పర్యవేక్షకులు బ్యాంకులు అనుసరించాల్సిన నియంత్రణలు, అంతర్గత గణాంక పద్ధతుల్ని ప్రమాణీకరించడం, అమలుచేయాల్సిన బాధ్యతను కల్గివుంటాయి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రెండవ స్తంభం అందిస్తుంది.

3) మార్కెట్‌ క్రమశిక్షణ

బేసెల్‌-2 ప్రమాణాలలో మూడవ స్తంభంగా మార్కెట్‌ క్రమశిక్షణ ఉంది. బ్యాంకుల లావాదేవీలలో పర్యవేక్షకులు, నియంత్రణ సంస్థలు, రేటింగ్‌ ఏజెన్సీలు, డిపాజిట్‌దారులు, మదుపు దారులకు పూర్తి పారదర్శకత ను మార్కెట్‌ క్రమశిక్షణ కోరుతున్నది. బ్యాంకులు ఎదుర్కొంటున్న రిస్క్‌ను గూర్చిన పూర్తి సమాచారాన్ని పై తరగతులకు ఎప్పటికప్పుడు తెలియజేయాల్సి వుంది. ఇందుకోసంగా మూడవ స్తంభం ఆచరించాల్సిన ప్రమాణాలను రూపకల్పన చేసింది.

బేసెల్‌-2 ప్రభావాలు

1. బ్యాంకులు ఎదుర్కొనే రిస్క్‌ ఆధారంగా వివిధ రుణాలపై వడ్డీరేట్లు నిర్ణయింపబడతాయి. 2. బేసెల్‌-2 ప్రమాణాల రూపకల్పనకు అత్యధిక స్థాయిలో గణాంక వివరాలు కావల్సి వుంది. వివిధ స్థాయిలలో రిస్క్‌ను గణించటానికి అత్యధిక స్థాయి టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ల అవసరంవుంది. దీనికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందటానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరమౌతాయి. 3. ఇంత భారీస్థాయి పెట్టుబడులు, సేకరించాల్సిన అదనపు మూలధనం పెద్ద బ్యాంకులకే సాధ్యమవటం వల్ల, చిన్న బ్యాంకులు ఈ రంగంలోకి అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రమాణాలు అమలు జాతీయ బ్యాంకులకు అనివార్యమైతే, బ్యాంకుల విలీనాలు, ఏకీకరణలకు బేసెల్‌-2 ప్రమాణాలు సారధులుగా పనిచేస్తాయి.

4. అత్యధిక మూలధన అవసరాల కోసం బ్యాంకులు విదేశీ పెట్టుబడులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. 5. ద్రవ్య సంక్షోభ సమయాలలో కార్పోరేట్ల రుణ రేటింగ్‌ పడిపోతుంది. దీని కారణంగా బేసెల్‌-2 ప్రమాణాల ప్రభావంతో అవసరమైన కాలంలో రుణాల లభ్యత పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. అదే సందర్భంలో ఆర్థిక విజృంభణ (బూమ్‌) కాలం లో కార్పొరేట్ల రుణ రేటింగ్‌లు మెరుగై, బ్యాంకుల అధిక నిధుల లభ్యతతో రుణాల మంజూరు వేగవంతమవుతుంది. దీని కారణంగా రుణ సంక్షోభాలకు దారి తీసే ప్రమాదం ఉంది. బ్యాంకుల సుస్థిరతకు పకడ్భం దీగా రూపొం దించ బడ్డాయనుకున్న బేసెల్‌-2 ప్రమాణాలు, ఇటీవలి కాలంలో సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని, బ్యాంకుల దివాళాలను ఆపలేకపోయాయి.