Sunday, October 10, 2010

బేసెల్‌ ప్రమాణాలు - భారతదేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ

బేసెల్‌-3 ప్రమాణాల అమలుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ ఇటీవల చేసిన ప్రకటనతో, భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ యొక్క సుస్థిరత ఒక కోణంలో ఆశావహంగా కనిపిస్తున్నా, మరో కోణంలో పరిశీలించినట్లయితే బేసెల్‌ ప్రమాణాల అమలు తీరే ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ వ్యవస్థ మనుగడకు గొడ్డలి పెట్టుగా ఉంది.

బేసెల్‌-1 ప్రమాణాలు

సరళీకరణ విధానాల నేపథ్యంలో 1992లో భారత దేశంలో ఈ ప్రమాణాల అమలుకు పూనుకున్న రిజర్వు బ్యాంక్‌, 1999 నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. బేసెల్‌ కమిటీ ఈ ప్రమాణాలలో ''సముచిత మూలధన నిష్పత్తి'' (క్యాపిటల్‌ ఎడిక్వసీ రేషియో)ని 8%గా నిర్ణయించగా, రిజర్వు బ్యాంకు ఈ నిష్పత్తిని 9%గా ఖరారు చేసింది. ఈ ప్రమాణాల అమలులో ప్రభావితమైన రెండు అంశాల్ని ప్రత్యేకంగా పేర్కొనాల్సి వుంది. అవి 1. కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా రూ. 20,446 కోట్లను ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధనానికి జమ చేసి, జాతీయ బ్యాంకుల ''సముచిత మూల నిష్పత్తి''ని పెంచడం 2) మొత్తం బ్యాంకు రుణాలలో నిరర్దక ఆస్తుల (మొండిబాకీలు) శాతాన్ని 1993 మార్చి నాటికున్న 23.2 నుండి మార్చి 2004 నాటికి 7.8 కి తగ్గించడం.

ప్రభావాలు

బేసెల్‌-1 ప్రమాణాల ప్రకారం నిరర్దక ఆస్తులు పెరిగిన మేరకు బ్యాంకులు అదనపు మూలధనాన్ని పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బ్యాంకులు అనివార్యంగా నిరర్దక ఆస్తుల్ని తగ్గించాల్సి వచ్చింది. ఈ మొండి బకాయిలలో అత్యధిక శాతం సంపన్న వర్గాలు, రాజకీయ నాయకులవి. పారుబాకీ దారుల చిట్టాను బహిర్గతం చేసి, కఠిన చర్యలతో ఈ బాకీల వసూళ్ళకు ప్రభుత్వం పూనుకోవాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు గళమెత్తినా, పాలక వర్గాలు తగు రీతిలో స్పందించలేదు. వివిధ ట్రిబ్యూనల్స్‌ను, అప్పిలేట్లను సాధనంగా చేసుకొని 2003-04 నాటి స్థూల నిరర్దక ఆస్తులలో 56.6% న్ని పారుబాకీల ఖాతాకు జమ చేసి, అందులో అత్యధిక భాగాన్ని రద్దు చేసే ప్రక్రియకు ప్రభుత్వ రంగ బ్యాంకులు పూనుకోవాల్సిన స్థితి ఏర్పడింది. దీంతో జాతీయ బ్యాంకులు ఆర్జించిన విశేష లాభాలను మొండిబాకీలకు సర్దుబాటు చేయడంతోను, ప్రభుత్వం అందించిన అదనపు మూలధనంతోనూ, నిరర్దక ఆస్తుల శాతం తగ్గింది. ఆచరణలో పూర్తిస్థాయిలో బకాయిలు మాత్రం వసూలు కాలేదు. ఈ పరిణామంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలలో పడటం, వాటి ప్రయివేటీకరణకు పాలక వర్గాలు కసరత్తు చేయటం మొదలైంది. బ్యాంకుల రుణ డిపాజిట్‌ నిష్పత్తి తగ్గుముఖం పట్టింది. ప్రాధాన్యతారంగ రుణాలను ఇవ్వటానికి వాణ ిజ్య బ్యాంకులు విముఖతను చూపడంతో, వ్యవసాయ రుణాల మంజూరు తగ్గింది.

అంతర్జాతీయ సంస్థల వత్తిడితో బేసెల్‌-2 ప్రమాణాల అమలు

ఫిబ్రవరి 2005లో బేసెల్‌-2 ప్రమాణాల అమలుకు కావల్సిన మార్గదర్శకాల్ని రిజర్వు బ్యాంక్‌ నియమించిన స్టీరింగ్‌ కమిటీ విడుదల చేసింది. మొదట్లో మార్చి 31, 2007లోగా బేసెల్‌-2 ప్రమాణాల్ని అమలు చేయాలని రిజర్వ్‌ బ్యాంకు భావించింది. ఆ తరువాత తన ప్రణాళికను మార్చుకుంది. మార్చి 31, 2008లోగా దేశంలోని విదేశీ బ్యాంకులు, మార్చి 31, 2009లోగా దేశీయ వాణిజ్య బ్యాంకులు ఈ ప్రమాణాల అమలును పూర్తి చేయాలన్నది. బేసెల్‌-2 ప్రమాణాల మార్గదర్శకాల రూపకల్పన ఆరంభంలో రిజర్వ్‌ బ్యాంకు ప్రకటిస్తూ, తమ మొత్తం వాణిజ్యంలో 20%నికి మించిన విదేశీ వాణిజ్యం కలిగిన దేశీయ బ్యాంకులే బేసెల్‌-2 ప్రమాణాలను అమలు చేయాలన్నది. అప్పటికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఒక్కటే మన దేశంలో అత్యధిక వాణిజ్యాన్ని కలిగి ఉంది. అయితే అది కూడా ఆరుశాతంగానే ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ వాణిజ్య బ్యాంకులు బేసెల్‌-2 ప్రమాణాల్ని అనుసరించాల్సిన అవసరం లేదు. కానీ అంతర్జాతీయ ద్రవ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు వివిధ దేశాలలో బేసెల్‌-2 ప్రమాణాల పూర్తి అమలును ప్రోత్సహించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ కూడా తమ సభ్య దేశాలు ద్రవ్య రంగ సుస్థిరత కోసం ఈ ప్రమాణాలను అమలు చేయాలని, విదేశీ బ్యాంకుల విస్తరణకు అంగీకరించాలని, వివిధ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలలో పేర్కొంది. భారత్‌ కూడా అందులో ఒక సభ్య దేశం. ఈ నేపథ్యంలో భారత దేశంలో రిజర్వ్‌ బ్యాంకు బేసెల్‌-2 ప్రమాణాల అమలుకు సిద్ధమైంది.

ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణకు శ్రీకారం

బేసెల్‌-2 ప్రమాణాలు కొన్ని అంశాలలో రిస్క్‌ వేయిటేజీలకు మూలధన సమీకరణలో వెసులుబాటు కల్పించాయి. కార్పొరేట్‌ రుణాల కంటే రిటైల్‌ రుణాలకు, చిన్న వ్యాపార రుణాలకు రిస్క్‌ వెయిటేజీని తగ్గించాయి. ఈ రకమైన వెసులుబాటుతో అదనపు మూలధన అవసరం బ్యాంకులకు తగ్గినా, నిర్వహణ రిస్క్‌ (ఆపరేషనల్‌ రిస్క్‌)కు సంబంధించి సమీకరించాల్సిన అదనపు మూలధనం తడిసి మోపెడైంది. గత మూడు సంవత్సరాల సగటు వార్షిక స్థూల ఆదాయంలో 15 శాతాన్ని అదనపు మూలధనంగా బ్యాంకులు సమీకరించాలి. ఐ.సి.ఆర్‌.ఎ అంచనా ప్రకారం భారతదేశంలోని వాణిజ్య బ్యాంకులు నిర్వహణ రిస్క్‌ కింద రూ. 12 వేల కోట్ల మూలధనాన్ని తక్షణం సమీకరించాల్సి వచ్చింది. దీనికి తోడు భవిష్యత్తు రుణాల మంజూరుకు మధ్యస్థ కాల పరిమితిలో రూ. 18,000-20,000 కోట్లు సమీకరించాల్సి వుంది. వీటితో పాటు సమాచార సమీకరణకు, విశ్లేషణలకు కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం అత్యధిక వ్యయపూరితమైంది. అప్పటికే జాతీయ బ్యాంకులు వారి లాభాలను నిరర్దక ఆస్తుల అదుపుకు సర్దుబాటు చేయడం, ప్రభుత్వం నుండి బాండుల రూపంలో రుణం పొందటంతో అదనపు మూలధన సమీకరణకు నూతన మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ బ్యాంకులు 51%నికి మించిన ప్రభుత్వ వాటాలను రిటైల్‌ మార్కెట్లో అమ్మటానికి అనుమతించింది. ఈ చర్య ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణకు శ్రీకారం చుట్టింది. అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు బేసెల్‌-2 ప్రమాణాల అమలుకు ప్రభుత్వ వాటాల ఉపసంహరణకు పూనుకున్నాయి. ఈ ధోరణి వేగం పుంజుకొని ప్రభుత్వ ఆధీనంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటాలను 33%నికి తగ్గించాలని వత్తిడి పెరిగింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో ఈ ధోరణికి బ్రేక్‌ పడింది. ప్రయివేట్‌ బ్యాంకులు సైతం అదనపు మూలధన సమీకరణకు పెట్టుబడి మార్కెట్‌ను ఆశ్రయించాయి. ఈ సమయంలో మార్చి 2004లో ప్రయివేట్‌ రంగ బ్యాంకులలో ఆటోమేటిక్‌ మార్గంలో 74% వరకు విదేశీ పెట్టుబడిని అనుమతించటానికి ప్రభుత్వం అంగీకరించింది. కొన్ని ప్రయివేట్‌ బ్యాంకులు విదేశీ పెట్టుబడిని ఆహ్వానించి విదేశీ బ్యాంకులుగా మారాయి. ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు, హెచ్‌.డి.ఎఫ్‌.సి బ్యాంకు ఈ కోవలోవే. ఈ రకంగా బారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటీకరించటానికి, విదేశీ బ్యాంకుల విస్తరణను పెంచటానికి బేసెల్‌-2 ప్రమాణాలు సాధనాలయ్యాయి.

మూలధన సమీకరణ కోసం ఐ.యం.ఎఫ్‌ అప్పు

బేసెల్‌-2 ప్రమాణాలు ''సముచిత మూలధన నిష్పత్తి'' 8%గా ఉండాలని నిర్దేశించగా, రిజర్వ్‌ బ్యాంకు 9%గా నిర్ణయించింది కాని భారత ప్రభుత్వం ఈ నిష్పత్తి 12% ఉండాలని ఆదేశించింది. దీంతో వాణిజ్య బ్యాంకులు సమీకరించాల్సిన మూలధన పరిమాణం పెరిగింది. మూలధన సమీకరణకు నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులలో, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటా 51% గా ఉన్నందున వాటాల ఉపసంహరణకు అవకాశం లేకుండా పోయింది. విక్రయించగలిగే ప్రభుత్వ వాటాలున్న బ్యాంకులకు, వాటాల విక్రయానికి, మార్కెట్‌ అనుకూలంగా లేకుండా పోయింది. ఈ స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఈ బ్యాంకులన్నింటికి ఆర్థిక సహాయానికి పూనుకొని మూడు బిలియన్‌ డాలర్ల రుణం కోసం అంతర్జాతీయ ద్రవ్య సంస్థను ఆశ్రయించింది. దేశంలోని అభ్యుదయ కాముకులు ఈ చర్యను వ్యతిరేకించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు అప్పటికే రిజర్వ్‌ బ్యాంకు ప్రమాణాల ప్రకారం సముచిత మూలధన నిష్పత్తిని కలిగివున్నాయి. అదనపు నిష్పత్తి అమలు సాకుతో కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలనాశ్రయించడంలోని దురుద్దేశం చర్చనీయాంశమైంది. ద్రవ్య రంగ సరళీకరణను వేగవంతం చేయడం కోసం రిజర్వు బ్యాంకుపై వత్తిడిని పెంచటానికే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు పూనుకున్నదని, చైనా అనుసరించినట్లుగా విదేశీ మారక ద్రవ్య నిధులను ఈ అవసరాలకు మళ్ళించే అవకాశాన్ని ఉద్దేశ పూర్వ కంగానే కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనే విమర్శలు పెల్లుబికాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య సంస్థ నుండి రెండు బిలియన్‌ డాలర్ల మొదటి విడత రుణాన్ని బ్యాంకుల అదనపు మూలధనం సమీకరణకోసం పొందింది.

బేసెల్‌-3 ప్రమాణాలు

బేసెల్‌-2 ప్రమాణాలు బ్యాంకుల నియంత్రణను కీలకంగా తీసుకొని రూపొందించబడ్డాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో బడా బ్యాంకులు కుప్పకూలడంతో బేసెల్‌-2 ప్రమాణాల డొల్లతనం బయటపడింది. విడివిడిగా బ్యాంకుల సుస్థిరతే కాకుండా ''ద్రవ్య రంగ వ్యవస్థ మొత్తం సుస్థిరత'' ధ్యేయంగా బేసెల్‌-3 ప్రమాణాల ప్రతిపాదనలు తయారయ్యాయి. బేసెల్‌-2 ప్రమాణాల కంటే కనీస సముచిత మూలధనంలో నాణ్యతను, పరిమాణాన్ని మెరుగుపర్చాలని ఈ ప్రమాణాలు నిర్దేశిస్తున్నాయి. అలాగే నిధుల లభ్యత (లిక్విడిటీ) నిష్పత్తిపై విడివిడి దేశాలకు స్వేచ్ఛనివ్వకుండా విశ్వ ప్రామాణికమైన నిధుల లభ్యత నిష్పత్తిని ఖరారు చేయటానికి ఈ ప్రమాణాలు సిద్ధమౌతున్నాయి. నవంబర్‌లో జరిగే జి-20 దేశాల సమావేశంలో ఈ ప్రమాణాలు తుది మెరుగులు దిద్దుకుంటాయి. భారతదేశంలో ఈ ప్రమాణాల అమలు కోసం వచ్చే తొమ్మిది సంవత్సరాలలో రూ. ఆరు లక్షల కోట్ల నిధులు అవసరమౌతాయని ఐ.సి.ఆర్‌.ఎ అంచనా వేస్తున్నది. బేసెల్‌-3 ప్రమాణం ప్రకారం సముచిత మూలధన నిష్పత్తి 16శాతంగా ఉండాలి. మనదేశ సముచిత మూలధన నిష్పత్తి 13.4%గా ఉంది. అలాగే మన దేశ మొదటి అంచె మూలధనం 9.3%గా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్‌బిఐ మటుకు బేసెల్‌-3 ప్రమాణాలను అమలు చేయగల మన్న ధీమాను వ్యక్తం చేస్తున్నా, వాటిలో ఉన్న కొన్ని ఇబ్బందులను అంగీకరిస్తున్నది.

ముగింపు

భారతదేశంలో బేసెల్‌ ప్రమాణాల అమలుతో ప్రభుత్వ రంగ బ్యాంకులలో ప్రభుత్వ ఆధీనంలోని సగటు మూలధనం 61.32%నికి పడిపోయింది. బ్యాంకుల సామాజిక దృక్పథం స్థానంలో లాభాపేక్ష పెరిగింది. ప్రయివేట్‌ బ్యాంకుల ఆధిపత్యం పెరిగి విదేశీ బ్యాంకుల ప్రాబల్యం అధికమైంది. బ్యాంకుల ఏకీకరణకు రంగం సిద్ధమైనది. అయినప్పటికీ ప్రభుత్వరంగ బ్యాంకుల బలంతో మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని విజయవంతంగా ఎదుర్కొంది. బేసెల్‌-3 ప్రమాణాల అమలు ద్రవ్య రంగ సరళీకరణ వేగాన్ని పెంచడంతో పాటు, నీడనిచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకుల మొదళ్ళను పెకలించి, విదేశీ బ్యాంకుల ఆధిపత్యాన్ని పెంచనున్నది. తస్మాత్‌ జాగ్రత్త!!

No comments: