Sunday, June 28, 2015

మోడీ పాలనలో- సంతోష పెట్టేదేమీ లేదు

మోడీ పాలనలో- సంతోష పెట్టేదేమీ లేదు 
సి.పి. చంద్ర శేఖర్ 
దేశం ఎదుర్కుంటున్న ఆర్ధిక సమస్యల పరిష్కారంలో సమర్ధవంతమైన కాల్పనికత కొరవడటం వల్ల మోడీ ప్రభుత్వ తొలి సంవత్సర పాలన తప్పడడుగుల క్రమంగా అభివర్ణించ బడుతున్నది. దొర్లిన తప్పుల్ని సవరించుకునే ఛాయలు కానరావడంలేదు. 

ఆర్ధిక రంగంలో ఏదో సాదిస్తామంటూ గంపెడాశల్ని కల్పించి అధికారానికొచ్చిన మోడీ ప్రభుత్వం తొలి సంవత్సరం  ముగించుకొని, నిరుత్సాహాన్ని, విచారాన్ని మిగిల్చింది. నిరుత్సాహ మెందుకంటే, తాను సృస్టించిన ప్రచార హోరుకు  తగట్టు ఆర్ధిక వృద్ది రంగంలో నైనా మోడీ ప్రభుత్వం ఈ కాలంలో తాను సాధించింది ఏమిటో చెప్పుకోలేక పోతున్నది. విచార మెందుకంటే, ప్రస్తుత విడివడిన ఆర్ధిక వ్యవస్థ పరిధిలో నూతన ప్రభుత్వం అనుసరించిన విధానాలు పరిస్థితుల్ని పెనం నుండి పొయ్యిలోకి నెట్టుతున్నాయి. 

దీనితో పాటు సృజనాత్మక మైన  ద్రవ్య విధానాలతో  గాడి తప్పిన పాలనను సరి చేయకుండా,  వ్యయాన్ని ప్రత్యేకించి సామాజిక వ్యయాన్ని కత్తిరించ పూనుకుంది. క్లిష్ట సమయంలో  ద్రవ్య లోటును అదుపు చేయటం కోసమే  వ్యయాన్ని కుదించాల్సి వచ్చిందని పైపెచ్చు  సమర్ధించుకుంటుంది.  "వినాశనకరమైన నయా ఉదార వాద తీవ్ర రూపానికి తాను కట్టుబడివున్నానని" మోడీ ప్రభుత్వంచేసే ప్రకటనగా ఈ సమర్దనను చూడాల్సి వుంది. 

అటువంటి    ప్రకటన చేయాలనే ఉద్దేశ్యానికి మూడు పర్యవసానాలు కారణమైయ్యాయి. . మొదటిది మోడీ ప్రభుత్వం వ్యయాన్ని పూర్తిగా కుదించింది. దీని ప్రభావంగా ఈ మధ్యనే కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసిన కేంద్ర బడ్జెట్ వాస్తవ గణాంకాలలో 2014-15 సం. లో స్థూలదేశీయోత్పత్తిలో వ్యయం 13శాతం గా వుండగా, బడ్జెట్ సమర్పించినప్పుడు సవరించిన అంచనాలలో ఈ శాతం 13. 3 గా వుండటం గమనించాలి. దీనర్ధం   2012-13లో 14.1శాతం నుండి 2013-14 లో13. 8 శాతానికి తగ్గిన స్థూలదేశీయోత్పత్తిలో కేంద్ర ప్రభుత్వ వ్యయం మోడీ ప్రభుత్వ తొలి సంవత్సరం2014-15 లోనే 13శాతానికి పడిపోయింది.  ఆశ్చర్య పడాల్సిన అవసరం  లేకుండానే అనేక ముఖ్య మంత్రుల తోపాటు, ఎన్డియే ప్రభుత్వంలోని కేంద్ర మహిళా,శిశు అభివృద్ధి శాఖా మంత్రిణి శ్రీమతి మేనకా గాంధీ కూడా ఈ అంశంపై తమ ఆక్షేపణల్ని ఆర్ధిక మంత్రి కి వ్రాత పూర్వకంగా తెలిపినట్లు తెలుస్తుంది.

రెండవది.  స్థూల దేశీయోత్పత్తి లో కేంద్ర ప్రభుత్వ స్థూల పన్నుల రెవిన్యూ 10శాతం నుండి 9.8 శాతానికి పతనమైన కారణంగా తన ద్రవ్యలోటు లక్ష్య సాధనకు ప్రభుత్వం అదనంగా ప్రభుత్వ రంగ వాటాల ఉపసంహరణ ( ఋణేతర పెట్టుబడి ఆదాయంగా పరిగణింప బడింది ) లాంటి ప్రత్యామ్నాయ వనరుల కోసం చూడవలసి వచ్చింది. కాని ప్రభుత్వం తాను కోరుకున్నట్లు ఇక్కడకూడా సఫలం కాలేక పోయింది. 2014-15 సం. బడ్జెట్లో   ప్రభుత్వ రంగ వాటాల ఉపసంహరణ ద్వారా రూ.58,425 కోట్ల ఆదాయం ప్రతిపాదింపబడగా, వాస్తవంగా రూ. 26,353 కోట్లు మాత్రమే సాధించబడిందని 2015-16 సం. బడ్జెట్ పత్రాల్లో ప్రస్తావించ బడింది. ఇదికూడా అంతకు ముందు సంవత్సరంలో సాధించిన రూ.24,362 కోట్ల కంటే అంత ఎక్కువేమీ కాదు. పార్లమెంట్ దిగువ సభలో తనకున్న మంద బలంతో సంస్కరణలను ముందుకు తీసికొని వెళ్ళే సమర్ధత వున్నా, వాటాల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా అదనపు వనరులను సమీకరించాలన్న మోడీ ప్రభుత్వ మొండి పట్టుదల జయప్రదం కాలేకపోయింది.దీని కారణంగానే మోడీ ప్రభుత్వం వ్యయకుదింపు ప్రక్రియపై అంతగా ఆధారపడాల్సి వచ్చింది. మూడవది.  క్షేత్ర స్థాయిలో ఈ రకమైన వైఫల్యాలు ఎదురుకావటంతో, ప్రభుత్వం తన సంస్కరణల అనుకూల  ముద్రను నిలబెట్టుకునేందుకు గాను కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడం, అనేక రాష్ట్రాలు అభ్యంతర పెట్టినా సరుకుల సేవల పన్ను బిల్లును ఆమోదింపచేసికోవడం, అన్నింటికి మించి కార్పోరేట్ రంగానికి స్పష్టంగా మేలు కల్గించే భూ సేకరణ బిల్లును ఆమోదింప చేసుకోవటం లాంటి దుశ్చర్యలకు  తెగబడింది. 

2014 ఎన్నికల సందర్భంగా, కార్పోరేట్, బడా వాణిజ్య వర్గాల బహిరంగ మద్దతుతోనే, ప్రధాన మంత్రి పదవికి జరిగిన పోటీలో మోడీ  ఎన్నికల ముందే పాక్షికంగా విజయం సాధించారు. వాళ్ళు కోరిన వరాల నందిస్తానాని పెట్టుబడిదారీ వర్గాలను ఒప్పించి తన విజయాన్ని సుగమం చేసికున్నారు.  గుజరాత్ రాష్ట్రంలో కార్పోరేట్ వర్గాలకు రాయితీలను వెదజల్లి వాళ్ళను ప్రసన్నంచేసికునే మోడీ అధికారాన్ని   హస్తగతం చేసికున్నారు. ఫోర్బెస్ ఏషియా సమాచారం ప్రకారం గుజరాత్ ప్రభుత్వం అదాని గ్రూప్ కు ముంద్రాలో 7,350 హెక్టార్ల భూమిని చదరపు మీటర్ కు ఒకటి నుండి 45 అమెరికన్ సెంట్ల అద్దెపై 30సంవత్సరాల లీజుకు ఇచ్చినట్లు తెలుస్తుంది. దీనిలో కొంత భాగాన్ని ఓడరేవు, విద్యుత్ కేంద్రం మరియు ప్రత్యేక ఆర్ధిక మండలాలకి వినియోగిస్తూ, మరి కొంత భాగాన్ని ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ కు చదరపు మీటరు 11 అమెరికన్ డాలర్లకు సబ్ లీజుకు ఇచ్చినట్లు సమాచారం. భారత దేశంలో ఇతర ప్రాంతం నుండి గుజరాత్ కు నానో ప్లాంటును తరలించడం కోసం టాటా మోటార్స్ కు రూ. 30,000 కోట్ల రాయితీలు ఇచ్చినట్లు చెప్తున్నారు.   గుజరాత్ ప్రభుత్వం మరియు ఆ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలు కలిసి  రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎస్సార్ స్టీల్ మరియు అదాని పవర్ లిమిటెడ్ లాంటి పెద్ద పారిశ్రామిక దిగ్గజాలకు అర్హత లేకుండా ఇచ్చిన రాయితీల మూలంగా ఒక్క సంవత్సరంలోనే ప్రభుత్వ ఖజానాకు     రూ. 750 కోట్ల నస్టం వాటిల్లినదని 2012-13 సం  సంబందించిన కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ నివేదిక తెలుపుతున్నది. 

ఈ రకమైన చరిత్ర ప్రైవేట్ రంగంలో అనేక అత్యాశలను రేపింది. ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం  పైస్థాయిలో రాయితీలను ప్రైవేట్ రంగంలో అందించడంలో విఫలమైన కారణంగా అనేక మందిని  నిరాశకుగురిచేసింది. ఈ సందర్భంగా వెల్లువెత్తిన విమర్శలకు మోడీ అనుకూల పారిశ్రామిక వర్గాలు సమాధానం చెప్పుకోవలసి వచ్చింది. ప్రధాన మంత్రికి మరింత సమయం ఇవ్వాల్సివుందని స్వయంగా రతన్ టాటా తన సహచరులను అభ్యర్ధించాడు. మోడీ ప్రభుత్వం కార్పోరేట్ అనుకూల విధానాలు అనుసరిస్తుందని ఘాటుగా విమర్శిస్తున్న రాహుల్ గాంధిని, బైకన్  కంపెనీ   చైర్  పర్సన్ , కిరణ్ మజుందార్ అడ్డుకోవలసి వచ్చింది.   

కనీసం ఆర్ధిక వృద్ది లో నైనా తన వాగ్దానాలను నిలబెట్టుకోలేక పోయిన మోడీ ప్రభుత్వం తన తొలి సంవత్సర పరిపాలనలో పై సంఘటనలతో ఇబ్బందులలో పడింది. ఈ వైఫల్యాలను అనేక గణాంకాలు రూఢీ చేస్తున్నాయి. మోడీ పాలన మొదటి 6నెలల కాలంలోనే(మే నుండి అక్టోబర్2014) పారిశ్రామిక ఉత్పాదన  సూచీ తో లెక్కింపబడే నెలవారీ పారిశ్రామిక వృద్ది రేటు 5. 9 శాతం నుండి -5. 6 శాతానికి పడిపోయింది.  2014లో 4. 7శాతానికి పుంజుకున్నా, అది తిరోగమిస్తూ మార్చి2015 నాటికీ 2. 2శాతానికి(తాత్కాలికం ) చేరింది. దాగుడు మూత లాడుతున్న వర్షపాతం మరియు ప్రభుత్వ అసమర్ధతలు  కలగలిసిన  కారణంగా  వ్యవసాయ రంగం  మరింత దుర్భరంగా వుంటుందని ఊహిస్తున్నారు. ఉదాహరణకు 2014-15 పంట సంవత్సరం (జూలై నుండి జూన్ వరకు) లో  ఆహార ధాన్యాల ఉత్పత్తి కి సంబంధించిన మూడవ అధికార ముందస్తు అంచనాల ప్రకారం ఆహార ధాన్యాల దిగుబడి 5. 3శాతం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. గత రెండు సంవత్సరాల ఆహారోత్పత్తి ఆశాజనకంగా లేని కారణంగా, ఈ పరిణామం పరిస్థితుల్ని  మరింతగా దిగజార్చేటట్లుంది. ఇంతలో అకాల వర్షాలమూలంగా పంటలు పోగొట్టుకొని గొంతు వరకు ఋణాలలో కూరుకున్న రైతుల ఆత్మహత్యలు వార్తా పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా వచ్చాయి. 

ఈ అధమమైన ఆర్ధికవృద్ది పనితీరు సహజ దృశ్యాన్ని రెండు అంశాలు గందరగోళ పరుస్తున్నాయి.  కేంద్ర గణాంక సంస్థ నూతన డేటా వనరులను కూర్చుకొని 2011-12 బేస్ సంవత్సరంగా జాతీయ ఆదాయ నూతన సిరీస్ గణాంకాల నిర్మాణంలో ఎంచుకున్న నూతన లెక్కింపు ప్రక్రియ ఈ  అంశాలలో మొదటిది. ఈ ప్రక్రియలో ఉద్భవించిన 2011-12నుండి 2013-14 మధ్యనున్న స్థూల దేశీయోత్పత్తి గణాంకాలు 2004-05 బేస్ సం. గా వున్న పాత సిరీస్ గణాంకాలతో సమానంగానో లేదా తక్కువగానో వున్నాయి. కాని 2012-13,2013-14సం.లలో పాత సిరీస్ ప్రకారం స్థూల దేశీయోత్పత్తి వృద్ది రేటు 4.7శాతం నుండి 5. 0 శాతానికి పెరుగగా, నూతన సిరీస్ లో ఈ వృద్ది రేటు 5.1శాతం నుండి 6.9శాతానికి పెరిగింది. ఈ వృద్ది రేటులోని పెరుగుదల యూపియే ప్రభుత్వ కాలానికి సంబంధించి నందువల్ల, దీన్ని ఎన్డియే విజయంగా కీర్తించ నవసరంలేదు. కాని 2014-15 సం. సంబందించిన స్థూల దేశీయోత్పత్తి వృద్ది రేటు ముందస్తు అంచనాలు సాపేక్షంగా అధికంగా వున్న 7.5 శాతాన్ని ఎన్డియే పనితీరు ఖాతాకు జమచేయాల్సి వుంటుంది. కానీ ఈ గణాంకాలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయని ఎవ్వరూ నమ్మడం లేదు. గందరగోళ పరుస్తున్న రెండవ అంశం గత సంవత్సర కాలమంతా తన ఆధిపత్యాన్ని  కొనసాగించి,   సెన్సెక్స్ ను రికార్డు స్థాయికి  తీసికెళ్ళిన స్టాక్ మార్కెట్ బుల్ రన్ కు సంబందించినది. దీన్ని అదనుగా  తీసికొని ప్రభుత్వ పనితీరు ఎలాగున్నా, మోడీ ప్రభుత్వం 'మదుపుదారుల విశ్వాసాన్ని పునరుధ్ధరించ కలిగించిందనే'  ముమ్మర ప్రచారానికి మీడియా పూనుకుంది. మార్చి2015 నాటికి సెన్సెక్స్ ప్రప్రధమంగా 30,000పాయింట్లను  చేరుకోవటం వాస్తవ విషయమే. కానీ అప్పటి నుండి సెన్సెక్స్ పతనమయ్యే సంకేతాలున్నాయి. అందువల్ల మే7 నాటికి బిఎస్ఇ సెన్సెక్స్ 26,599 పాయింట్ల దగ్గర ముగిసింది. జనవరి 2014 ప్రారంభం నాటికి సాపేక్షంగా అనేక కారణాల రీత్యా సెన్సెక్స్ అధిక  స్థాయిలో ఉన్నప్పటికీ, ఈ పతనం 'సులభంగా సొమ్ము చేసికోవటానికి' అలవాటు పడ్డ  అనేక మంది  మదుపుదార్లను ఇబ్బందులకు గురిచేసింది. మే 7నాటికి వున్న సెన్సెక్స్ సాపేక్షంగా అధిక స్థాయిలో ఉన్నప్పటికీ, ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంతగా రెండు నెలల క్రితం ఎగబ్రాకిన 30,000 పాయింట్ల తో  పోల్చుకుంటే సెన్సెక్స్ లో పతనం 10శాతానికి మించి వుంది. 

ఈ పతనం ఒక అంశాన్ని ముందుకు తెస్తున్నది. తమ దేశాల్లో చౌకగా లభ్యమౌతున్న నిధులతో వర్ధమాన దేశాల మార్కెట్లను చేజిక్కించుకోవాలన్న తపనతో, మూడు సంవత్సరాల క్రితం అంటే మే 2012 నాటికి  సెన్సెక్స్ 16000 పాయింట్లకు పైబడి  తచ్చాడుతున్న సమయం నుండి విదేశీ సంస్థాగత మదుపుదార్లు ఈ స్టాక్ మార్కెట్ల బుల్ రన్ కు సారధ్యం వహిస్తునారన్న అంశంలో మార్కెట్ పరిశీలకుల్లో ఏ భేదభావం లేదు. కాబట్టి ఈ స్టాక్ మార్కెట్ విజ్రుంభణ(బూమ్)  స్పెక్యులేషన్ జ్వరం ఫలితంగా సృష్టింపబడి,. మాంద్యం తో కొట్టుమిట్టాడుతున్న అభివృద్ది చెందిన దేశాలలో చౌకగా లభించే నిధులతో ప్రోత్సహింపబడుతున్నట్లుంది.  ఇటీవలి కాలంలో సెన్సెక్స్ ఎగబ్రాకిన దశ 2014 తొలి మాసాల్లో ప్రారంభమై 2015 ఆరంభం వరకు కొనసాగి,. ఒక సంవత్సరంలోనే  సెన్సెక్స్ 20,000 నుండి 30,000 పాయింట్లకు ఎగబ్రాకింది. మార్కెట్లో అనిశ్చితి(ఒలటాలిటీ) తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ సెన్సెక్స్ గణనీయంగా 50శాతం పెరిగింది. అయినప్పటికీ ఆర్ధిక వృద్ది అన్ని విధాలుగా మందంగా వున్న కాలంలో మదుపరుల అత్యుత్సాహంతో ఈ విజ్రుంభణ(బూమ్)సృష్టింప బడింది. దీనర్ధమేమంటే  ఈ అత్యుత్సాహం అన్ని విధాలుగా అశాస్త్రీయమైనది. ఎక్కుపెట్టిన ఈ విజ్రుంభణ(బూమ్) అంతం కావలసిందే. అదే  జరిగినప్పుడు,  అనేక అర్ధం లేని భయాందోళనలను రేకెత్తిస్తున్న అమెరికన్ ఫెడరల్ 'టేపర్ తంత్రానికి' మించిన తీవ్ర పతనాన్ని చవిచూడాల్సి వస్తుంది. గత సంవత్సరం అంతర్జాతీయ చమురు ధరల పతనం   గాలివాటంగా కలసొచ్చినప్పటికి. ఎన్డియే ప్రభుత్వ మొదటి సంవత్సర పాలనలో ఆర్ధిక వృద్ధి పనితీరు నిర్లక్ష్యంగా, అధమంగా వుంది.   ఉదాహరణకు బ్రెంట్ క్రూడ్ ధర జూన్ 2014నాటికి బ్యారల్ 115 డాలర్లు వుండగా జనవరి 2015 నాటికి 50 డాలర్లకు అంటే సగానికి సగం పడిపోయింది. 

చమురు  ధరలలో పతనం నాలుగు విధాల ప్రభావాన్ని కలిగించాయి. మొదటిది. రిటైల్ ధరలలో గణనీయమైన పతనాన్ని నిలువరించి, పెట్రోలియం ఉత్పత్తులపై  అదనపు పన్నులను విధించటానికి వీలుకల్పిస్తూ ప్రభుత్వానికి  అదనపు రెవిన్యూ వనరులను సమకూర్చింది. ప్రభుత్వానికి రూ.10,000కోట్ల అదనపురెవిన్యూ ను అందించటం కోసం, అతి తక్కువ కాల పరిమితిలోనే  పెట్రోలు,డీజిల్ పై ఎక్షైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం వెంట వెంటనే మూడు సార్లు(నవంబర్ 12,డిసెంబర్ 2,జనవరి 1) పెంచింది. రెండవది. చౌక చమురు ధరల మూలకంగా   ప్రత్యక్ష ప్రభావంగాను, ఉత్పదకాలు గా వినియోగించే హైడ్రో కార్బన్ల  ధరలు తగ్గి, ఉత్పాదితాల వ్యయం, ధరలు  తగ్గిన నందువల్లనూ, ద్రవ్యోల్బణం అదుపు చేయబడింది. మూడవది. ఈ రకంగా ధరలు తగ్గడం మూలంగా పెట్రోలియం ఉత్పత్తులపై ఇవ్వాల్సిన సబ్సిడీ వ్యయం తగ్గి, అంతిమంగా బడ్జెట్లో వ్యయం తగ్గింది.  బంగారం దిగుమతులపై సుంకాల్ని,పరిణామాత్మక ఆంక్షల్ని తగ్గించు కోవటానికి విదేశీ మారకాన్ని దుబారా చేసినా,  చమురు ధరల పతనం వాణిజ్య, కరెంట్ ఖాతాల లోటును తగ్గించటానికి దోహద పడింది. దీని ఫలితంగా నడమంత్రంగా కలిసొచ్చిన ద్రవ్యోల్బణ అదుపు, విదేశీ మారక సమతుల్యత సాధనలను  ప్రభుత్వం తాను స్వంతంగా సాధించిన విజయాలుగా చెప్పుకుంటుంది. 

అయినప్పటికీ పెరుగుతున్న ఆర్ధిక పనితీరురాహిత్య భావనను ప్రభుత్వం  అడ్డుకోవాలనుకున్నా సాధ్యం కాలేదు.  మోడీ కేంద్రంగా బిజెపి ఎన్నికల ప్రచారంలో చూపిన  అత్యాశలకు అనుగుణంగా  ఆచరణలో ప్రయోజనాలు పొందలేకపోవడంతో మోడీకి గట్టి మద్దతుదారులైన మధ్యతరగతి, సంపన్న వర్గాలు సైతం అసంతృప్తి చెందాయి. ప్రచార హోరు కొనసాగినప్పటికీ, అది అంత ప్రభావాన్ని కల్గించలేక పోయింది. ఈ పరిస్థితులలో మోడీ ఉద్దేశపూర్వకంగానో,మరోరకంగానో మౌలిక రంగాలకు అవసరమైన పెట్టుబడులను రాబట్టేందుకూ, ప్రపంచ మార్కెట్ ఉత్పత్తికి కేంద్రంగా  భారత దేశాన్నిమలిచేందుకు అవసరమైన విదేశీ పెట్టుబడులను ఆకర్షించే విధానాలను నొక్కిచేప్పే "భారతదేశంలో తయారీ"ఎజండా కేంద్రీకరణకు పూనుకున్నాడు.  ఏ ఇతర ప్రధాని చేయనంతగా తన పదవీ కాల మొదటి సంవత్సరంలోనే భారత దేశాన్ని వదలి మోడీ  విదేశీ పర్యటనలలో  వుండటం ఈ వాస్తవాన్ని వివరిస్తుందనుకుంటాను. దురదృష్ట వశాత్తు మోడీ  చేపట్టిన ఈ  చర్య విశేషంగా ఉంటుదనుకోవటానికి స్పష్టమైన సంకేతాలేమి లేవు.  
(ఫ్రంట్ లైన్ 12. 6. 2015 సంచిక లో ప్రచురింప బడింది) 
అనువాదం: కొండముది  లక్ష్మీప్రసాద్  

No comments: