Monday, June 29, 2015

బేసెల్ ప్రమాణాల అడకత్తెరలో భారత జాతీయ బ్యాంకులు

బేసెల్ ప్రమాణాల అడకత్తెరలో భారత జాతీయ బ్యాంకులు 
-కొండముది లక్ష్మీ ప్రసాద్ 
ప్రపంచ ఆర్ధిక సంక్షోభ ధాటి నుండి ప్రపంచ బ్యాంకింగ్ వ్యవస్థను రక్షించడం కోసం బాసెల్ 3 ప్రమాణాలు రూపకల్పన చేయబడ్డాయి. ప్రపంచీకరణ నేపధ్యంలో భారత ఆర్ధిక వ్యవస్థ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థతో అనుసంధానించిన కారణంగా భారత రిజర్వ్ బ్యాంక్ 1.4.2013 నుండి భారత దేశంలోని జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు బేసెల్ 3 ప్రమాణాలను అమలుచేయాలని ఆదేశించింది. ఈ ప్రమాణాల అమలుతో  బ్యాంకుల పరిరక్షణ ఎలాగున్నా, అదనపు మూలధన సమీకరణలో జాతీయ బ్యాంకులు జీవన్మరణ పోరాటం జరుపుతూ అంతిమంగా  ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయాల్సిన దుర్భర పరిస్థితులను నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్.డి.ఎ ప్రభుత్వం కల్పిస్తున్నది.

బేసెల్ ప్రమాణాల నేపధ్యం 
నయా ఉదారవాద విధానాలు అమలౌతున్న దేశాలలో ద్రవ్య రంగంలో స్పెక్యులేషన్ ధోరణులు మితిమీరడంతో ఆర్ధిక వ్యవస్థలలో ఒడుదుడుకులు సర్వసామాన్య మయ్యాయి. వీటి నీలినీడలు  బ్యాంకింగ్ రంగంపై పడి బ్యాంకుల మనుగడే ప్రశ్నార్ధక మయ్యింది. ఈ క్లిష్ట పరిస్థితుల్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడం కోసం "అంతర్జాతీయ పరిష్కారాల బ్యాంకు"(బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ) పర్యవేక్షణలో, స్విజర్లాండ్ నందలి బేసెల్ నగరంలో బ్యాంకింగ్ పర్యవేక్షణ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీయే తదనంతర కాలంలో బేసెల్ కమిటీ గా ప్రాచుర్యం పొందింది. బ్యాంకుల పరిరక్షణకు బేసెల్ కమిటీ నిర్దేశించిన విధానాలను బేసెల్ నారమ్స్‌ లేదా  బేసెల్ ప్రమాణాలుగా పిలువబడుతున్నాయి. 
బేసెల్1 ప్రమాణాలు 
జులై, 1988లో అంతర్జాతీయ బ్యాంకులకు కావల్సిన కనీస స్థాయి మూలధన అవసరాలపై బేసెల్‌ కమిటి కొన్ని ప్రమాణాలను రూపొందించింది.  బ్యాంకింగ్‌ రంగ సుస్థిరతపై మొట్టమొదటిగా రూపొందించిన ఈ ప్రమాణాలను బేసెల్‌-1 ప్రమాణాలు లేదా బేసెల్‌ నారమ్స్‌గా ప్రసిద్ధికెక్కాయి. ఈ ప్రమాణాల ప్రకారం బ్యాంకు మంజూరు చేసిన ''రిస్క్‌''తో కూడిన రుణాల మొత్తంలో 8%తో సమానమైన మూలధనాన్ని ఆ బ్యాంకు అదనంగా కలిగి ఉండాలి. దీన్నే సముచిత మూలధన నిష్పత్తి (క్యాపిటల్‌ ఎడిక్వసీ రేషియో)  అని అన్నారు.  దీన్ని లెక్కించడం కోసంగా వివిధ రుణాలకు, వాటిలో ఇమిడివున్న రిస్క్‌ను బట్టి వెయిటేజ్‌లను నిర్ణయించారు. రుణాల నాణ్యతను బట్టి రుణ మొత్తంలో  పేర్కొన్న వెయిటేజ్‌ శాతం మేరకు ''సముచిత మూలధన నిష్పత్తి''ని బ్యాంకులు అమలు చేయాల్సి వుంటుంది.
బేసెల్1 ప్రభావాలు 
బ్యాంకులలో ''తగినంత మూలధన సమీకరణ''లో బేసెల్‌-1 ప్రమాణాలు విజయవంతమైనాయి. బేసెల్‌-1 ప్రమాణాలు ప్రధానంగా రుణాలలో ఇమిడి ఉన్న రిస్క్‌ పరిమాణంపై కేంద్రీకరించాయి. రుణాలలోని రిస్క్‌ విశ్లేషణ వర్గీకరణతో, అంతవరకు సామాజిక బాధ్యతగా అందించబడుతున్న రుణాలు అధిక రిస్క్‌ కలిగినవిగా భావించబడ్డాయి. దీనితో వాటి కేటాయింపులు తగ్గించడం మొదలైంది. ఫలితంగా వివిధ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రాధాన్యత రుణాల కేటాయింపు తగ్గిపోయింది. వసూలు కాని రుణాలను నిరర్ధక ఆస్థులు (నాన్‌ పర్‌ఫార్మింగ్‌ ఎస్సెట్స్‌)గా పరిగణించారు. బ్యాంకుల మొత్తం రుణాలలో నిరర్ధక ఆస్థుల నిష్పత్తిపై పరిమితి విధింపబడింది. ఈ పరిమితిని అమలు చేయటానికి అనేక బ్యాంకులు మొండి బకాయిలను తమ లాభాల్లో సర్దుబాటు చేసుకోవడంతో అవి నష్టాల బారిన పడి, మూలధన కొరతను ఎదుర్కొన్నాయి. బేసెల్‌-1 తదనంతర కాలంలో ద్రవ్య రంగంలో నెలకొన్న మౌళిక మార్పుల కారణంగా ఉత్పన్నమైన సమస్యల్ని పరిష్కరించడంలో బేసెల్‌-1 ప్రమాణాలు వైఫల్యం చెందాయి. అందువల్ల వాటిని సవరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బేసెల్‌-2 ప్రమాణాలకు రూపకల్పన జరిగింది. 
బేసెల్2 ప్రమాణాలు 
 ప్రపంచీకరణ స్వరూప స్వభావాలలో నెలకొన్న మార్పులతో ద్రవ్య మార్కెట్‌లో వినూత్న ద్రవ్య ఉత్పత్తులు (ఫైనాన్షియల్‌ ఇన్నోవేషన్స్‌) రంగం మీదకొచ్చాయి. ఈ ద్రవ్య ఉత్పత్తుల్లో స్పెక్యులేషన్‌ తీవ్రత భారీగా ఉంది. రుణ రంగ ప్రాధాన్యత పెరిగి, రుణ డెరివేటీవ్‌ ల్లాంటి అత్యధిక రిస్క్‌ కలిగిన ద్రవ్య ఉత్పత్తుల ప్రవేశంతో మార్కెట్‌ రిస్క్‌ అపరిమితంగా పెరిగింది. దీని తట్టుకోగలిగే ''రిస్క్‌'' యాజమాన్య పద్ధతులు బేసెల్‌-1 ప్రమాణాలలో లేకపోవడం బ్యాంకులకు పెను సవాలుగా మారింది. బేసెల్‌-1 ప్రమాణాలు అంచనా కట్టిన రుణ రిస్క్‌ పరిధికి మించిన పరిస్థితులు నెలకొన్నాయి. దీన్ని అదునుగా తీసుకున్న కొన్ని అంతర్జాతీయ బ్యాంకులు వారి వారి బ్యాలెన్స్‌ షీట్లను తమ్మినిబమ్మిని చేశాయి. నూతన ద్రవ్య ఉత్పత్తుల మూలకంగా నెలకొన్న అదనపు రిస్క్‌కు అనుగుణంగా అదనపు మూలధన సమీకరణ ప్రమాణాలు లేకుండా పోయాయి. అధిక నాణ్యత కలిగిన రుణాలపై బ్యాంకు ఆర్జించే లాభాల కంటే నాసిరక రుణాలు/పెట్టుబడులు అత్యధిక లాభాల్ని ఆర్జించడంతో, అంతర్జాతీయ బ్యాంకులు నాణ్యత కలిగిన రుణాల మంజూరును నిర్లక్ష్యం చేయడం మొదలైంది. బ్యాంకులు అంతర్గతంగా అనుసరిస్తున్న పద్ధతుల్లో పారదర్శకత లోపించింది. 1990లలో బేసెల్‌-1 ప్రమాణాలను తు.చ తప్పకుండా అమలు చేసిన థాయ్లాండ్‌, ఇండోనేషియా, మలేషియా లాంటి ఆసియా దేశాలలోని ద్రవ్య వ్యవస్థలు ద్రవ్య సంక్షోభంతో తల్లక్రిందులైనాయి. అనేక బ్యాంకులు మూతబడ్డాయి. ఈ సవాళ్ళను అధిగమించడానికి బేసెల్‌ కమిటి జూన్‌-2004లో బేసెల్‌-2 ప్రమాణాల పేర నూతన మార్గదర్శకాల్ని రూపొందించింది. ఈ ప్రమాణాలు బేసెల్‌-1 ప్రమాణాల కంటే మెరుగ్గా ఉన్నా, సంక్లిష్టంగా ఉన్నాయి. కనీసం మూలధన పరిమాణం, పర్యవేక్షణ సమీక్ష, మార్కెట్‌ క్రమశిక్షణ అనే మూడు స్తంభాలపై (పిల్లర్స్‌) బేసెల్‌-2 ప్రమాణాలు నిర్మింపబడ్డాయి.బ్యాంకులు  ఎదుర్కొనే రిస్క్‌ను బేసెల్‌-2 ప్రమాణాలు  రుణాల రిస్క్‌, మార్కెట్‌ రిస్క్‌, నిర్వహణ రిస్క్‌లుగా వర్గీకరించాయి.  
బేసెల్‌-2 ప్రభావాలు
 1. బ్యాంకులు ఎదుర్కొనే రిస్క్‌ ఆధారంగా వివిధ రుణాలపై వడ్డీరేట్లు నిర్ణయింపబడ్డాయి. 2. బేసెల్‌-2 ప్రమాణాల రూపకల్పనకు అత్యధిక స్థాయిలో గణాంక వివరాలు కావల్సి వచ్చింది. వివిధ స్థాయిలలో రిస్క్‌ను గణించటానికి అత్యధిక స్థాయి టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ల అవసరంవుంది. దీనికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందటానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరమయ్యాయి .3. ఇంత భారీస్థాయి పెట్టుబడులు, సేకరించాల్సిన అదనపు మూలధనం పెద్ద బ్యాంకులకే సాధ్యమవటం వల్ల, చిన్న బ్యాంకులు ఈ రంగంలోకి అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది.   బ్యాంకుల విలీనాలు, ఏకీకరణలకు బేసెల్‌-2 ప్రమాణాలు సారధులుగా పనిచేశాయి. 4. అత్యధిక మూలధన అవసరాల కోసం బ్యాంకులు విదేశీ పెట్టుబడులపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి . 5. ద్రవ్య సంక్షోభ సమయాలలో కార్పోరేట్ల రుణ రేటింగ్‌ పడిపోయింది . దీని కారణంగా బేసెల్‌-2 ప్రమాణాల ప్రభావంతో అవసరమైన కాలంలో రుణాల లభ్యత పొందలేని పరిస్థితి ఏర్పడింది. అదే సందర్భంలో ఆర్థిక విజృంభణ (బూమ్‌) కాలం లో కార్పొరేట్ల రుణ రేటింగ్‌లు మెరుగై, బ్యాంకుల అధిక నిధుల లభ్యతతో రుణాల మంజూరు వేగవంతమయ్యాయి . దీని కారణంగా రుణ సంక్షోభాలకు దారి తీసి,  బ్యాంకుల సుస్థిరతకు పకడ్భం దీగా  బేసెల్‌-2 ప్రమాణాలురూపకల్పన  జరిగింద నుకొన్నప్పటికీ , 2007/2008 లో  సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని, బ్యాంకుల దివాళాలను అవి  ఆపలేకపోయాయి.
బేసెల్ ప్రమాణాలు -భారత దేశం 
సరళీకరణ విధానాల నేపథ్యంలో 1992లో భారత దేశంలో ఈ ప్రమాణాల అమలుకు పూనుకున్న రిజర్వు బ్యాంక్‌, 1999 నాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసింది. బేసెల్‌ కమిటీ ఈ ప్రమాణాలలో ''సముచిత మూలధన నిష్పత్తి'' (క్యాపిటల్‌ ఎడిక్వసీ రేషియో)ని 8%గా నిర్ణయించగా, రిజర్వు బ్యాంకు ఈ నిష్పత్తిని 9%గా ఖరారు చేసింది.బేసెల్‌-1 ప్రమాణాల ప్రకారం నిరర్దక ఆస్తులు పెరిగిన మేరకు బ్యాంకులు అదనపు మూలధనాన్ని పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బ్యాంకులు అనివార్యంగా నిరర్దక ఆస్తుల్ని తగ్గించాల్సి వచ్చింది. జాతీయ బ్యాంకులు ఆర్జించిన విశేష లాభాలను మొండిబాకీలకు సర్దుబాటు చేయడంతోను, ప్రభుత్వం అందించిన అదనపు మూలధనంతోనూ, నిరర్దక ఆస్తుల శాతం తగ్గింది. ఈ పరిణామంతో ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టాలలో పడటం, వాటి ప్రయివేటీకరణకు పాలక వర్గాలు కసరత్తు చేయటం మొదలైంది. బ్యాంకుల రుణ డిపాజిట్‌ నిష్పత్తి తగ్గుముఖం పట్టింది. ప్రాధాన్యతారంగ రుణాలను ఇవ్వటానికి వాణిజ్య బ్యాంకులు విముఖతను చూపడంతో, వ్యవసాయ రుణాల మంజూరు తగ్గింది.
ఫిబ్రవరి 2005లో బేసెల్‌-2 ప్రమాణాల అమలుకు కావల్సిన మార్గదర్శకాల్ని రిజర్వు బ్యాంక్‌ నియమించిన స్టీరింగ్‌ కమిటీ విడుదల చేసింది. వీటి ప్రకారం  భారతీయ వాణిజ్య బ్యాంకులు బేసెల్‌-2 ప్రమాణాల్ని అనుసరించాల్సిన అవసరం లేదు.  అంతర్జాతీయ ద్రవ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు వివిధ దేశాలలో బేసెల్‌-2 ప్రమాణాల పూర్తి అమలును ప్రోత్సహించాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ కూడా తమ సభ్య దేశాలు ద్రవ్య రంగ సుస్థిరత కోసం ఈ ప్రమాణాలను అమలు చేయాలని, విదేశీ బ్యాంకుల విస్తరణకు అంగీకరించాలని, వివిధ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలలో పేర్కొంది. భారత్‌ కూడా అందులో ఒక సభ్య దేశం. ఈ నేపథ్యంలో భారత దేశంలో రిజర్వ్‌ బ్యాంకు బేసెల్‌-2 ప్రమాణాల అమలుకు సిద్ధమైంది. బేసెల్ 2 ప్రమాణాల అమలుకు కావలసిన  నిధుల పరిమాణం మరింతగా పెరిగింది. జాతీయ బ్యాంకులు వారి లాభాలను  అంతకు ముందు నిరర్దక ఆస్తుల అదుపుకు సర్దుబాటు చేయడం, ప్రభుత్వం నుండి బాండుల రూపంలో రుణం పొందటంతో అదనపు మూలధన సమీకరణకు నూతన మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ బ్యాంకులు 51%నికి మించిన ప్రభుత్వ వాటాలను రిటైల్‌ మార్కెట్లో అమ్మటానికి అనుమతించింది. ఈ చర్య ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రయివేటీకరణకు శ్రీకారం చుట్టింది. అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు బేసెల్‌-2 ప్రమాణాల అమలుకు ప్రభుత్వ వాటాల ఉపసంహరణకు పూనుకున్నాయి. ఈ ధోరణి వేగం పుంజుకొని ప్రభుత్వ ఆధీనంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటాలను 33%నికి తగ్గించాలని వత్తిడి పెరిగింది. బ్యాంకు ఉద్యోగ, అధికార సంఘాల వ్యతిరేకత, 2007/2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో ఈ ధోరణికి బ్రేక్‌ పడింది. ప్రయివేట్‌ బ్యాంకులు సైతం అదనపు మూలధన సమీకరణకు పెట్టుబడి మార్కెట్‌ను ఆశ్రయించాయి. ఈ సమయంలో మార్చి 2004లో ప్రయివేట్‌ రంగ బ్యాంకులలో ఆటోమేటిక్‌ మార్గంలో 74% వరకు విదేశీ పెట్టుబడిని అనుమతించటానికి ప్రభుత్వం అంగీకరించింది. కొన్ని ప్రయివేట్‌ బ్యాంకులు విదేశీ పెట్టుబడిని ఆహ్వానించి విదేశీ బ్యాంకులుగా మారాయి. ఐ.సి.ఐ.సి.ఐ బ్యాంకు, హెచ్‌.డి.ఎఫ్‌.సి బ్యాంకు ఈ కోవలోవే. ఈ రకంగా బారతదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రయివేటీకరించటానికి, విదేశీ బ్యాంకుల విస్తరణను పెంచటానికి బేసెల్‌-2 ప్రమాణాలు సాధనాలయ్యాయి. బేసెల్‌-2 ప్రమాణాలు ''సముచిత మూలధన నిష్పత్తి'' 8%గా ఉండాలని నిర్దేశించగా, రిజర్వ్‌ బ్యాంకు 9%గా నిర్ణయించింది కాని భారత ప్రభుత్వం ఈ నిష్పత్తి 12% ఉండాలని ఆదేశించింది. దీంతో వాణిజ్య బ్యాంకులు సమీకరించాల్సిన మూలధన పరిమాణం అనూహ్యంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య సంస్థ నుండి రెండు బిలియన్‌ డాలర్ల మొదటి విడత రుణాన్ని బ్యాంకుల అదనపు మూలధనం సమీకరణకోసం పొందింది.
బేసెల్‌-3 ప్రమాణాలు
 అత్యధిక లాభాల వేటలో నిజ ఆర్ధిక వ్యవస్థను లక్ష్య పెట్టకుండా ద్రవ్య పెట్టుబడి చేపట్టిన వికృత చేష్టలు 2007/2008 ప్రపంచ ఆర్ధిక సంక్షోభానికి కారణభూతం కాగా, వాటిని అరికట్టే చర్యలేమి చేపట్టకుండా,  ఇటువంటి సంక్షోభాల నుండి బ్యాంకులను, ద్రవ్య వ్యవస్థలను పరిరక్షించే కర్తవ్యాన్ని బేసెల్ 3 ప్రమాణాలు నెత్తికెత్తుకున్నాయి. అమితమైన నిధులలభ్య త(లిక్విడిటి), అత్యధికమైన అప్పులు/మూలధన నిష్పత్తి(లివరేజ్ రేషియో), అతి తక్కువ మూలధనం, చాలీచాలని నిధుల లభ్యత బఫర్లు- 2008 ద్రవ్య సంక్షోభానికి ప్రధాన కారణాలుగా బేసెల్ కమిటీ భావించింది. వీటితో పాటు రిస్క్ యాజమాన్యం, కార్పోరేట్ పాలన, మార్కెట్ పారదర్శకత మరియు పర్యవేక్షణ నాణ్యతలు లోపభూయిష్టంగా వున్నట్లు అభిప్రాయపడింది. బేసెల్‌-2 ప్రమాణాలు బ్యాంకుల నియంత్రణను కీలకంగా తీసుకొని రూపొందించబడ్డాయి. విడివిడిగా బ్యాంకుల సుస్థిరతే కాకుండా ''ద్రవ్య రంగ వ్యవస్థ మొత్తం సుస్థిరత'' ధ్యేయంగా బేసెల్‌-3 ప్రమాణాల ప్రతిపాదనలు తయారయ్యాయి. బేసెల్‌-2 ప్రమాణాల కంటే కనీస సముచిత మూలధనంలో మెరుగైన  నాణ్యతను, గణనీయమైన పరిమాణాన్ని ఈ ప్రమాణాలు నిర్దేశిస్తున్నాయి. అలాగే నిధుల లభ్యత (లిక్విడిటీ) నిష్పత్తిపై విడివిడి దేశాలకు స్వేచ్ఛనివ్వకుండా విశ్వ ప్రామాణికమైన నిధుల లభ్యత నిష్పత్తిని ఖరారు చేయటానికి ఈ ప్రమాణాలు సిద్ధమయ్యాయి.
భారత దేశంలో బేసెల్ 3 ప్రమాణాల అమలు ఎందుకు?
భారత ఆర్ధిక వ్యవస్థ ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తో అనుసంధానం కావడం, ప్రపంచంలో అభివృద్ది చెందుతున్న ఒక ప్రధాన ఆర్ధిక వ్యవస్థ గా భారత దేశం పరిణామం చెందే దిశలో  వుండటం ప్రధాన కారణాలుగా  భారత రిజర్వ్ బ్యాంకు  బేసెల్ 3 ప్రమాణాల అమలుకు అంగీకరించింది. మొదట్లో ఈ ప్రమాణాలను భారత దేశంలో జనవరి1,2013 నుండి అమలుచేయాలనుకున్నప్పటికి, ఏప్రియల్ 1,2013 నుండి మొదలై  ఈ ప్రక్రియ 31మార్చి2019 నాటికి అన్ని విధాలుగా పూర్తి  కావాలని  రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించింది. 
బేసెల్3 ప్రమాణాల అమలు ఖరీదెంత 
ఈ ప్రమాణాల అమలుకు భారతీయ బ్యాంకులు ప్రత్యేకించి జాతీయ బ్యాంకులు భారీ స్థాయిలో నిధుల్ని సేకరించాల్సి వుంది. ఈ నిధుల్ని మొదటి అంచె (టైర్ 1)మూలధనం, రెండవ అంచె(టైర్ 2) మూలధనం గా వర్గీకరించారు.  మొదటి అంచె మూలధనం క్రింద బ్యాంకు వాటాదారుల నుండి సేకరించే అదనపు మూలధనం, బ్యాంకుల అంతర్గత నిదులైన లాభాలు, రిజర్వ్ నిధులు, బ్యాంకు వాటాలు అమ్మడంద్వారా ఒనకుడే మూలధనం, మరియు మొదటి అంచె హైబ్రిడ్ బాండుల అమ్మకం ద్వారా సేకరించిన నిధులు వున్నాయి. రెండవ అంచె మూలధనం  క్రింద రెండవ అంచె బాండుల విక్రయం ద్వారా పొంద కలిగే నిధులు వున్నాయి. 
ఈ ప్రమాణాల ప్రకారం మొత్తం మూలధన నిష్పత్తి 31. 3. 2014 నాటికి 9శాతం తో మొదలై, 31. 3. 2018 నాటికీ 11. 5శాతానికి చేరుకోవాలి.  వివిధ రేటింగ్ సంస్థల అంచనాలలో,  భారత జాతీయ బ్యాంకుల్లోవచ్చే 4 సంవత్సరాలో అదనంగా 4,60,120 కోట్ల రూపాయలు పెట్టుబడి  కనీసంగా  సమీకరించ వలసివుంది. ఇందులో మొదటి అంచె(టైర్1)మూలధన ఈక్విటీ  రూపంలో రూ. 2,39,720 కోట్లు, మొదటి అంచె(టైర్1) మూలధన  హైబ్రిడ్ బాండుల  రూపంలో రూ. 1,55,900కోట్లు, రెండవ అంచె(టైర్2) పెట్టుబడి బాండుల రూపంలో రూ. 64,500కోట్లు సమీకరించాలి. మొదటి అంచె(టైర్1) మూలధన  హైబ్రిడ్ బాండులు,రెండవ అంచె(టైర్2) పెట్టుబడి బాండులను సంస్థలు, వ్యక్తుల నుండి సమీకరించ వచ్చును.  కాని మొదటి అంచె(టైర్1)మూలధనాన్ని జాతీయ బ్యాంకుల ఈక్విటీ వాటాల  విక్రయం ద్వారా,బ్యాంకుల అంతర్గత వనరులైన లాభాలు , రిజర్వ్ నిధులు ద్వారా  కాని  సమీకరించాలి. 
నిధుల సమీకరణలో కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ 
ఇంతటి భారీ నిధులు స్వంతంగా సమీకరించ కలిగే శక్తి జాతీయ బ్యాంకులకు  లేని కారణంగా, జాతీయ బ్యాంకుల అత్యధిక వాటాల హక్కుదారుడైన కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను అందించ వలసి వున్నది. గతంలో బేసెల్ 1,బేసెల్ 2 ప్రమాణాలు అమలు సందర్భంగా  అవసరమైన మూలధనం లో కొంత భాగాన్ని కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్ కేటాయింపులా ద్వారా సమకూర్చింది. 2000-01నుండి 2014-15 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం రూ. 80,200కోట్ల పెట్టుబడిని జాతీయ బ్యాంకులకు సమకూర్చింది . ఇందులో రూ. 58,600 కోట్లు 2010-11 నుండి 2013-14 మధ్య కాలంలో సమకూర్చినవే. కాని మోడీ నాయకత్వంలోని ఎన్డియే ప్రభుత్వం 2014-15 సం. లో  జాతీయ బ్యాంకుల  మూలధన  సమీకరణకు  రూ. 11,200కోట్ల బడ్జెట్ కేటాయింపు వుండగా వాస్తవంలో రూ.6900కోట్లు మాత్రమే అందించింది.కుదించిన ఈ మొత్తం కేవలం 9 జాతీయ బ్యాంకులకు వాటి పనితీరును బట్టి  ప్రభుత్వం నిర్దిష్టంగా  కేటాయించింది. మిగిలిన బ్యాంకులకు నిధుల కేటాయింపు శేష ప్రశ్నగానే మిగిలివుంది. దీనికి కొనసాగింపుగా 2015-16 సం. నికి బడ్జెట్ కేటాయింపును అరకొరగా రూ. 7940కోట్లకు తగ్గించింది . కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ఒంటెద్దు పోకడలు జాతీయ బ్యాంకులకు  మూలధనం అందించడంలో తమ వ్యతిరేకతను తెలియ జేస్తున్నాయి. 
ముందస్తు వ్యూహంలో ఎన్డియే ప్రభుత్వం .
ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మూలధన సమీకరణ విషయంలో జాతీయ బ్యాంకులకిస్తున్న సందేశం సుస్పష్టంగానే వున్నది. ద్రవ్య  సుస్థిరత (ఫిస్కల్ కన్సొలిడేషన్)మిషతో, జాతీయ బ్యాంకులకు మూలధనం క్రింద జరిపే బడ్జెట్ కేటాయింపులు  ద్రవ్య లోటును భారీగా పెంచుతుందని, భారత ఆర్ధిక వ్యవస్థ ఈ లోటును భరించే స్థితిలో లేదని కేంద్ర ప్రభుత్వం వాదిస్తుంది. పారిశ్రామిక ప్రగతి పేరుతో లక్షల కోట్ల రూపాయలను బడా పారిశ్రామిక వేత్తలకు రాయితీలు కట్టబెట్టినప్పుడు స్పురణకు రాని ద్రవ్య లోటు, ఆర్ధిక వ్యవస్థకు పట్టుగొమ్మలుగా  ఆపార సేవలందించిన జాతీయ బ్యాంకుల మనుగడను నిలబెట్టేందుకు అందించాల్సిన నిధులు ప్రభుత్వానికి తలకు మించిన భారం కావడం కేంద్ర ప్రభుత్వ వర్గ దృక్పధాన్ని తేటతెల్లం చేస్తున్నది. జాతీయ బ్యాంకులు మూలధన సమీకరణకు అవసరమైన నిధుల్ని వాటంతటవే వివిధ సృజనాత్మక పద్ధతులలో ఏర్పరచుకోవాలని,  బ్యాంకుల మూలధన సమీకరణ కేంద్ర బడ్జెట్ కు మరింత భారం కాకూడదన్న  వాదనను మనం కూడా అంగీకరిస్తే, సృజనాత్మక ద్రవ్య ఆవిష్కరణలతో నిధులను సమీకరించే ప్రక్రియకు రిజర్వ్ బ్యాంకు సహాయం చేయవలసి వుంటుంది .  కానీ  దానితోనే  ఈ సమస్య పరిష్కారం కాదు. ద్రవ్య సుస్థిరత చర్యలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకుల మూల ధన సమీకరణ బాధ్యత నుండి తప్పించుకుంటే, జాతీయ బ్యాంకులకు  ప్రభుత్వ  వాటాల విక్రయం ద్వారానే నిధులను  సేకరించు కోవటం అనివార్యమౌతుంది.  52శాతానికి తగ్గకుండా జాతీయ బ్యాంకులు ప్రభుత్వ ఈక్విటీ హోల్డింగ్ ను తగ్గించుకోవచ్చునని  మార్చి 2015 లో  కేంద్ర ప్రభుత్వ సహాయ ఆర్ధిక మంత్రి జయంత్ సిన్హా పార్లమెంట్ లో చేసిన ప్రకటనను ఈ పరిణామాలలో భాగంగా చూడాల్సి వుంది. 
దొడ్డి త్రోవన జాతీయ బ్యాంకుల ప్రయివేటీకరణకు కుట్ర 
రిజర్వ్ బ్యాంకు బేసెల్3 ప్రమాణాల అమలుకు నిర్యయం తీసికున్నప్పుడు ప్రభుత్వ అంచనాలు ఇలా వున్నాయి. వచ్చే నాలుగేళ్ళలో జాతీయ బ్యాంకులలో ప్రభుత్వ వాటా 52శాతం తగ్గకుండా, ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా  రూ. 1,60,825 కోట్లు, మొదటి అంచె, రెండవ అంచె బాండుల మార్కెట్  విక్రయం ద్వారా రూ. 2,20,400 కోట్లు, బడ్జెట్ కేటాయింపుల ద్వారా 78,895 కోట్లు మూలధనాన్ని సమీకరించాలి.  ఈ కాలంలో జాతీయ బ్యాంకుల నుండి డివిడెండ్ల రూపంలో రూ. 34500కోట్లు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం నికరంగా భరించాల్సిన భారం రూ. 44395 కోట్లు అవుతుంది. అంటే సంవత్సరానికి రూ. 11000 కోట్లు సరిపోతాయి. ఈ అంచనాలు చూడటానికి, వినడానికి సాధ్యమైనవిగా తోచిన, ఆచరణలో అవి అంత సులువుగా సుసాధ్యాలు కావని నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జాతీయ బ్యాంకులలోప్రభుత్వ ఈక్విటీ,  43శాతం బ్యాంకులలో 51-61శాతంగా, 24శాతం బ్యాంకులలో 62-71 శాతంగా, 19శాతం బ్యాంకులలో 72-81 శాతంగా, 14శాతం బ్యాంకులలో 82శాతంగా వున్నది. సెన్సెక్స్ గరిష్టంగా 29000 పాయింట్ల స్థాయికి పెరిగిందనుకొని,  ప్రస్తుత జాతీయ బ్యాంకుల వాటాల బుక్ చేసే ధరకు , జాతీయ బ్యాంకుల లోని 52శాతానికి పైబడ్డ వాటాలనన్నింటిని విక్రయించినా,  రూ.1,00,000 కోట్లకు మించి మూలధన సమీకరణ సాధ్యం కాదని స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. . ప్రభుత్వ విధానం- జాతీయ బ్యాంకుల మూలధన సమీకరణ కేవలం ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారానే జరగాలంటే , రూ.1,60,825 కోట్ల సమీకరణకు, జాతీయ బ్యాంకులలో 52శాతం కంటే తక్కువగా ప్రభుత్వ  ఈక్విటీని పెద్ద మొత్తంలో  తగ్గించవలసి వుంటుంది. దీని పర్యవసానంగా  జాతీయ బ్యాంకులలో కేంద్ర ప్రభుత్వం తమ యాజమాన్యాన్నే వదులుకోవలసి వస్తుంది. ఈ అంచనాను రూఢీ  చేస్తున్నట్లు, కలకత్తాలో రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఆర్. గాంధి  పత్రికా సమావేశంలో మాట్లాడుతూ జాతీయ బ్యాంకులలో 52శాతానికి మించిన ప్రభుత్వ వాటాల విక్రయంతోనే బేసేల్3 ప్రమాణాల అవసరాలు తీరవన్నారు. .
ప్రగతే వినాశకారి 
 మూలధన అవసరాలను అంచనా వేసేటప్పుడు, ఈ గణాంకాలు ఎలా వచ్చాయో కూడా అవగాహన చేసికొనవలసివుంది. జాతీయ బ్యాంకుల ఆర్ధిక స్థాయిని బట్టి,  భవిష్యత్తులో నిర్వహించబోయే వ్యాపారాన్ని బట్టి మూలధన పరిమాణం నిర్ణయించబడుతుంది. శీఘ్రంగా డిపాజిట్లు వసూలుచేసి,రుణాలు మంజూరు చేసినట్లయితే వాటిలో రిస్క్ తో కూడిన  ఆస్తులూ పెరుగుతాయి. బేసెల్ 3 ప్రమాణాల నిబంధనల ప్రకారం రిస్క్ తో   కూడిన ఆస్థులు పెరిగితే, ఆస్థుల పరిమాణం, అందులోవున్న రిస్క్ మోతాదును బట్టి  అవసరమైన మూలధన పరిమాణం పెరుగుతుంది. ఉదాహరణకు ఒక బ్యాంకు ఒక రంగంలో రూ. 1000 కోట్ల రుణాలు మంజూరు చేయాలనీ లక్ష్యం గా పెట్టుకుంటే కనీసం రూ. 90 కోట్ల మూలధనం సమకూర్చు కుంటే కాని రుణాల మంజూరుకు రిజర్వ్ బ్యాంకు అనుమతి నివ్వదు.  బేసెల్ 3 ప్రమాణాల అమలు ఐచ్చిక మైనా, భారత దేశంలో ఒక బ్యాంకు ఈ ప్రమాణాల ప్రకారం మూలధన నిధుల్ని ఏర్పరచుకోక పోతే, ఆ బ్యాంకు కార్యకలాపాల నిర్వహణను రిజర్వ్ బ్యాంకు అనుమతించదు  మూడీ రేటింగు సంస్థ వాదనల ప్రకారం, భారత దేశంలో బ్యాంకుల వ్యాపారాభివృద్ధి మోస్తరుగా వుండి, బ్యాంకుల నిరర్ధక ఆస్థులు తగ్గుముఖంలో వుంటే, బ్యాంకు ఋణ వితరణలో 62శాతంగా వున్న 11 జాతీయ బ్యాంకులు 2015 నుండి  2019 ఆర్ధిక సంవత్సరం వరకు కనీసం  రూ.1,50,000నుండి రూ.2,40,000 కోట్ల మూలధనం సమీకరించాల్సి వుంటుంది. మూడీ రేటింగ్ సంస్థ కు భారత దేశ అసోసియేట్ సంస్థ అయిన "ఇక్రా"2010లో అంచనా వేస్తూ 2019లోగా  భారత దేశంలో జాతీయ, ప్రైవేట్ బ్యాంకులు కలసి 6 లక్షల కోట్లు మూలధనం క్రింద సేకరించు కోవాల్సి వుంటుదన్నారు.
ఇంతటి భారి నిధుల సమీకరణ తో జాతీయ బ్యాంకులు బతికి బట్టకట్టేనా ? 
పెట్టుబడులపై అధిక ఆదాయం(రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ మెంట్). రావాలంటే అధికంగా వ్యాపారం చేయాలి. అధికంగా వ్యాపారం చేయాలంటే అధికంగా అదనపు మూలధనం సమీకరించాలి. ఈ మూలధనాన్ని మార్కెట్లో  మొదటి అంచె(టైర్1) మూలధన బాండుల రూపంలో సమీకరిస్తే 5 సంవత్సరాలపాటు వడ్డీ , తర్వాత ఆ బాండు దారునికి ఈక్విటీ వాటాలు విక్రయించాలి. అంటే క్రమంగా ప్రైవేట్ బాగస్వామ్యాన్ని అధిక వ్యాపారం చేసి పెంచడమే అవుతుంది.రెండవ అంచె  బాండుల విక్రయం మొదటి అంచెబాండుల విక్రయంకు మించి ఉండకూడదు   రెండవ అంచె  బాండుల విక్రయంతో మూలధనాన్ని సమీకరించాలంటే దాదాపు 11.5 శాతం వడ్డీ చెల్లించాలి. ఇది ఖర్చును పెంచి  లాభాలను కుదిస్తుంది. ఇది ఈక్విటీ పై ఆదాయాన్ని తగ్గిస్తుంది. ఫలితంగా వాటాల మార్కెట్ విలువ తగ్గుతుంది. టైర్1 మూలధన సమీకరణకు  అధిక పరిమాణంలో బ్యాంకు వాటాలను అమ్మాల్సి వస్తుంది. ఈ ప్రక్రియ కూడా జాతీయ బ్యాంకులలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచేదే. దీనర్ధం ప్రభుత్వం, జాతీయ బ్యాంకులలో  తేడా చూడకుండా  మూలధన వనరులను అందించక పొతే అవి మనుగడ ప్రశ్నార్ధకమే. 
అంత్య క్రియలకు రంగం సిద్ధం 
బేసెల్ ప్రమాణాల పరిణామ క్రమాన్ని పరిశీలిస్తే, అవి ఆచరణలో అన్ని విధాలుగా జాతీయ బ్యాంకుల మనుగడకు విఘాతంగా వున్నాయి. దీనికి తోడు జాతీయ బ్యాంకుల పనితీరుపై కేంద్ర ప్రభుత్వం జనవరి 20,2014న పి. జె.. నాయక్ సారధ్యంలో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ మే 12. 2014 న తన నివేదికను అందించింది. జాతీయ బ్యాంకుల పనితీరు లోపభూయిష్టంగా వుండి, ప్రభుత్వానికి గుదిబండగా వున్న కారణంగా జాతీయ బ్యాంకులలో ప్రభుత్వ వాటాలను 50శాతం కంటే తక్కువకు కుదించి వాటి పని తీరులో  తీవ్ర మార్పుల్ని చేపట్టాలని సిఫార్సుచేసింది. బేసెల్ 3 ప్రమాణాల అమలుతో ఉత్పన్నమయ్యే  పరిణామాలను వినియోగించుకొని జాతీయ బ్యాంకులను ప్రైవేట్ పరం చేయటానికి బాటలు వేయటమే ఈ సిఫార్సుల లక్ష్యం గా వుంది. ఈ సిఫార్సులను సూత్రప్రాయంగా ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తున్నది. 2015 జనవరి 2,3 తేదీలలో పూనా లో జ్ఞాన్ సంగం పేర జాతీయ బ్యాంకుల అధినేతలతో సమావేశం ఏర్పాటు చేయబడింది. ఈ సమావేశానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిధి గా హాజరయ్యారు. ఈ సమావేశం జాతీయ బ్యాంకులను ప్రైవేటు పరం చేసే రోడ్  మ్యాప్ ను చర్చించి నట్లు తెలుస్తుంది.  
 ప్రత్యామ్నాయం ఏమిటి ?
అదనపు మూలధన అవసర పరిమాణాలు  చాలా వింతగా వున్నాయి. బేసెల్ల్3 ప్రమాణాల రూపకల్పన ముందు అంతర్జాతీయ ప్రమాణాల కంటే భారత దేశ బ్యాంకింగ్ రంగంలో సముచిత మూలధన నిష్పత్తి  చాలా ఆరోగ్యకరంగా  వుంది.  వాస్తవంలో బ్యాంకింగ్ వ్యవస్థ  పనితీరు స్థానిక ప్రమాణాల కంటే మెరుగ్గా వుంది. బేసెల్ 2 ప్రమాణాల ప్రకారం సాధారణ టైర్ 1 మూలధన నిష్పత్తి 2 శాతం ఉండాల్సి వుండగా  భారత దేశ ప్రమాణం 3.6 శాతం గా వుంది. బేసెల్ 2 ప్రమాణాల ప్రకారం మొత్తం మూలధన నిష్పత్తి 8 శాతం కాగా, భారత దేశ ప్రమాణాలలో అది 9శాతంగా వుంది. 
ప్రాధమికంగా ఇటువంటి అనుకూల పరిస్థితులున్నప్పటికి, మూలధన అంచనాలు ఈ క్రింది   కారణాల రీత్యా  భారీగా వున్నాయని నిపుణులు భావిస్తూ, జాతీయ బ్యాంకుల పరిరక్షణకు క్రింది సూచనలు చేస్తున్నారు  
. 1. బ్యాంకింగ్ వ్యాపారం లో భారత దేశం భారీగా విస్తరింప బడుతుందని అంచనా వేయబడింది. 1990లలో షెడ్యుల్డ్ బ్యాంకుల  స్థూల దేశీయోత్పత్తిలో రుణాల శాతం 20-22 వుండగా, 2003-04 నాటికి 55శాతానికి చేరింది. ఈ అనుభవంతో రుణాల బూమ్ యధాతధంగా కొనసాగుతుందని అంచనా వేశారు. కాని 2000 సం. లలో విదేశీ నిధులు భారీగా భారత దేశంలో ప్రవేశించి తేలిక గా  నిధుల లభ్యత కలిగిన ఆర్ధిక పరిస్థితులలో ఋణాల బూమ్ ఏర్పడింది. బ్యాంకింగ్ రంగంలో చొరబడిన సరళీకరణ మూలకంగా విస్తారమైన రుణ గ్రహీతలతో అప్పులు చెల్లించని వారి సంఖ్యను కూడా పెంచింది. ఫలితంగా  స్థూల నిరర్ధక ఆస్తులు పెరిగాయి . అందువల్ల భారత దేశంలో అపరిమితంగా పెరిగిన  బ్యాంకింగ్ వ్యాపార విస్తరణ ఆరోగ్య ఫలితాల్ని ఇవ్వనందున, అటువంటి వ్యాపారంపై ఆధారపడ్డ  భవిష్యత్తు అంచనాలు సమంజసం కాదు. ఈ అంచనాల్ని తిరిగి సమీక్షించాలి. 
2.  ఈ మధ్య సంవత్సరాలలో గణనీయంగా పెరిగి డిసెంబర్ 2014 నాటికి 5. 6 శాతంగా వున్న స్థూల నిరర్ధక ఆస్తుల స్థాయి ఇంకా పెరుగుతుందని అంచనా వేయబడింది. దీని పర్యవసానంగా కూడా అదనపు మూలధన పరిమాణ అంచనాను పెంచారు.  మొండి బాకీలలో అత్యధిక శాతం సంపన్న వర్గాలు, రాజకీయ నాయకులవి. పారుబాకీల చిట్టాను బహిర్గతం చేసి కఠిన చర్యలతో, చట్టాలతో బా వసూళ్ళకు పూనుకోవడంలో  పాలక వర్గాలు తగు రీతిలో స్పందించలేదు. డిశంబర్2014 నాటికి జాతీయ బ్యాంకులలో నిరర్ధక ఆస్తుల క్రింద రూ. 2,73,000 కోట్లు, పునర్నిర్మాణం చేయబడ్డ కార్పోరేట్ల బకాయిలు రూ. 2,72,000 కోట్లు పేరుకుపోయి జాతీయ బ్యాంకులకు గుదిబండలుగా మారాయి. నిరర్ధక ఆస్థులలొ బకాయి పడ్డ మొదటి 30 సంస్థల  బకాయీలు  మొత్తం నిరర్ధక ఆస్థులలొ 37శాతంగా వున్నాయి. పునర్నిర్మాణం చేయబడ్డ కార్పొరేట్ల బకాయిలలో 64శాతం మౌలిక రంగాలకు సంబందించిన సంస్థలవే. నయా ఉదారవాద విధానాలలో భాగంగా  మౌలిక రంగంలో ప్రైవేటు భాగస్వామ్యం పెంచాలనే ఉబలాటంలో ప్రభుత్వాలు జాతీయ బ్యాంకులను  ఒత్తిడి చేసి ప్రైవేటు సంస్థలకు,పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య సంస్థలకు ఇప్పించిన అప్పులు ఇవి.  వీటి రికవరీ బాధ్యతా ప్రభుత్వానిదే.  
3.   బేసెల్ 3 ప్రమాణాలు ప్రపంచ ద్రవ్య సంక్షోభానికి కారణమైన బ్యాంకుల సమస్యల నుద్దేశింఛి రూపకల్పన చేయబడినవి. భారత దేశంలో జాతీయ బ్యాంకులు ద్రవ్య సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదురుకోవడమే కాకుండా విస్తృతమైన సామాజిక బాధ్యతలను నిర్వహిస్తున్నాయి.  అందువల్ల బేసెల్ 3 ప్రమాణాలను యధాతధంగా  అమలు చేసి జాతీయ బ్యాంకులను బలిచేయటం  సమంజసం కాదు. 
3. బేసెల్3 ప్రమాణాల అమలులో అత్యుత్సాహం జాతి ప్రయోజనాలకే నష్టదాయకం . బేసెల్3 ప్రమాణాల అమలు తుది గడువు మార్చలేని శిలాశాసనం కాదు ఇప్పటికే 31. 3. 2018 నుండి     31. 3. 2019 మార్చారు. ఈ తుది గడువును మరో 4 సంవత్సరాలు పెంచి జాతీయ బ్యాంకుల అదనపు మూలధన అవసరాలను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు ద్వారానే జరపాలి.  
4. . ప్రపంచ  దేశాలలో బ్యాంకులు, నియంత్రణ సంస్థలు బేసెల్  3 ప్రమాణాలను నిర్ణీత గడువు లోపు పూర్తిగా అమలు చేస్తారా లేదా అనే అంశం ఇంకా  తేలాల్సి వుంది. బెసేల్ ప్రమాణాల అమలు వర్ధమాన దేశాల మనుగడకు నష్టదాయకమనే భావన సర్వత్రా వ్యాపించివుంది. 
5. జాతీయ బ్యాంకుల మనుగడకు ముప్పు కలిగించే నాయక్ కమిటీ సిఫార్సులను అమలు చేయరాదు. జాతీయ బ్యాంకులలో తేడ లేకుండా అన్నింటికి అవసరమైన అదనపు మూలధనం ప్రభుత్వం అందించిన తరువాతే వాటి పనితీరును సమీక్షించాలి. వాటి పనితీరు మెరుగుపరిచేందుకు ఉద్యోగ, అదికార సంఘాలతో చర్చించాలి. 
6. అవసరమైతే జాతీయ బ్యాంకుల పరిరక్షణకు దేశ వ్యాప్త ఉద్యమానికి పిలుపునివ్వాలి   

(మార్క్సిస్టు జూన్ 2015 సంచికలో ప్రచురింపబడింది) 


No comments: