Saturday, October 31, 2015

రూపాయిని కదిలించే దెవరు?
లోకేశ్వరి ఎస్ కె   
విదేశీ మదుపుదారు’లని వెంటనే మీరనవచ్చు. “వాణిజ్య సమతుల్యత” రూపాయిని అంతకు మించి ప్రభావితం చేస్తుంది.  
ఈ సంవత్సరం ఆగస్టు నెలలో రూపాయి విలువ  ప్రతి వారిని ఉత్కంటకు గురిచేసింది. ఆగస్టు 2013 లో అతి కనిష్టం గా వున్న డాలరుకు రూపాయి విలువ  68 రూపాయలకు జారి పోతుందోనన్న అందోళనను కల్గిస్తూ, పతనం 67రూపాయిల దగ్గర పతనం  ఆగింది. .
పై రెండు సందర్భాలలో పైకి మాత్రం  ప్రపంచవ్యాప్త ఆర్ధిక వ్యవస్థలలొని ఇబ్బందుల వల్ల ఈదుస్థితి ఏర్పడిందనిపిస్తుంది.  అమెరికా ఫెడరల్ రిజర్వు తన పరిమాణాత్మక సడలింపు కార్యక్రమంలో భాగంగా  వడ్డీ రేటును పెంచుతానని 2013నుండి చేస్తున్న బెదిరింపు అందులో ఒకటి. దీనికి తోడు చైనా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రపంచవ్యాప్త ఆర్ధిక మందగమనం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
అంతర్జాతీయ మదుపుదారులు ప్రపంచవ్యాప్త పరిణామాలకు అనుగుణంగా మార్కెట్లో అంతర్జాతీయ రాగాలతో తమ పెట్టుబడుల క్రీడలో  రూపాయిని నర్తింపచేస్తున్నట్లు అనిపిస్తుంది. కాని వాస్తవంలో అది సరి కాదు. రూపాయి చలనానికి,విదేశీ పెట్టుబడుల మధ్య వున్న సంబంధాన్ని విశ్లేషిస్తే, రూపాయివిలువను దీర్ఘకాలికంగా ప్రభావితం చేయటంలో విదేశీ పెట్టుబడులకు  దీర్ఘకాలిక పాత్ర లేదని బోధపడుతుంది. వాస్తవంలో రూపాయివిలువపై చమురుదిగుమతి ధరల్లో హెచ్చుతగ్గులు, ఎగుమతులవృద్ది లాంటి వాణిజ్య సమతుల్యత కు సంబంధించిన  అంశాలు  అత్యధిక ప్రభావాన్ని కలిగిస్తాయి.
రూపాయి, విదేశీ పెట్టుబడులు
రూపాయివిలువ, సెన్సెక్స్ ల భవితవ్యాన్ని నిర్ణయించేది విదేశీ పెట్టుబడులని కూడా గట్టిగా నమ్ముతుంటారు. కాని ఇది నిజం కాదు. స్వల్పకాలికంగా కరెన్సీ మార్కెట్ సెంటిమెంటు పై విదేశీ నిధుల ప్రభావం వున్నా, వాటిపై దీర్ఘకాలిక ప్రభావం వుండదు. విదేశీ మదు పుదారులైన విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడిదారులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి దారులు, ప్రవాస భారతీయులు గత 5 సంవత్సరాలుగా మన దేశంలోకి గణనీయమైన విదేశీ నిధుల్ని చొప్పిస్తున్నారు. కాని వీటన్నింటి ప్రభావంతో రూపాయి దక్షిణం దిక్కుకే నడుస్తున్నది. 2009 నుండి అనేక సంవత్సరాలలో విదేశీ నిధుల ప్రవేశం భారీగా వుంది. దీని కారణంగా సెన్సెక్స్ భారీగా విజ్రుంభించింది కాని, ఈ కాలంలో రూపాయి విలువ పడి పోయింది.
2014 సంవత్సరంలో మనదేశం అత్యధికంగా విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడుల క్రింద రూ4200కోట్ల డాలర్లు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల క్రింద రూ3400కోట్ల డాలర్లు, ప్రవాస భారతీయుల బ్యాంకు డిపాజిట్ల ద్వారా రూ1100కోట్ల డాలర్ల నిధుల్ని పొంద కలిగింది. సెన్సెక్స్ అత్యధిక స్థాయికి ఎగబ్రాకి, గత సంవత్సరం కంటే 29శాతం వృద్దిని సాధించింది. కాని రూపాయి దాని విదేశీ మారక విలువలో 2.7 శాతం విలువను కోల్పోయింది. 2009 సంవత్సరంలో 1800కోట్ల డాలర్ల విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడులు భారత ఈక్విటీ షేర్ ధరలను అతి తక్కువ స్థాయి నుండి పైకి పెంచ కలిగితే,రూపాయి దాని  విలువలో 4శాతానికి మించి పెరగలేదు.       .    
2014లో రూపాయి విదేశీ మారక విలవకు, సెన్సెక్స్ కు మధ్య వున్న సంబంధం +0.01 కాగా,అది 2013లో నెగటివ్ విలువకు దిగజారింది. సెన్సెక్స్,రూపాయి విలువలు రెండూ  పరస్పర ఆధారితాలు కావాని మనం గమనించాలి. విదేశీ నిధులు,రూపాయి విలువల మధ్య వున్న బంధం చాలా బలహీనమైంది.
విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడులకు, రూపాయికి మధ్య వున్న సహ సంబంధం 2014, 2013 లలో 0.5 కంటే తక్కువగానే వుంది. దీనర్ధం- భారత దేశం తన ఆర్ధిక వృద్ది, ఆకర్షణీయమైన నిజ వడ్డీ రేట్ల మూలకంగా విదేశీ పోర్ట్ పోలియో పెట్టుబడులకు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రీతికరమైన గమ్యస్థలంగా  మనగలుగుతున్నది కాని, ఇవేమీ రూపాయివిలువను పెంచేందుకు  దోహదపడటం లేదు. .  
రూపాయి,వాణిజ్య లోటు
అందువల్ల రూపాయి విలువకుకి వచ్చే రోగాలన్నింటిని విదేశీ పెట్టుబడులే నయం చేస్తాయని భావించరాదు. మనం 50సంవత్సరాల రూపాయి చరిత్రను పరిశీలిస్తే అది వ్యవస్థీకృతంగా పతనధోరణిలోవుండి, నికరంగా తక్కువ స్థాయి లోనే కొనసాగు తున్నది.  1973లో 7. రూపాయలకు అమెరికన్ డాలరు ను కొనకలిగేవారం. ఆ రోజుల్లో మార్కెట్లోని గిరాకి సరఫరా లకు అనుగుణంగా రూపాయివిలువను మారనిచ్చే వాళ్ళు కాదు . 90లలో భారత ఆర్ధిక వ్యవస్థను బాహ్య ప్రపంచానికి తలుపులు తెరిచినప్పటి నుండి రూపాయి విలువ భారీ పతనానికి లోనైంది. భారత దేశం యొక్క  వాణిజ్య లోటు నికరంగా కొనసాగటమే, రూపాయివిలువ యొక్క వ్యవస్థీకృత బలహీనతకు ప్రధాన కారణమైంది. వాణిజ్య లోటు లోని మూడు పార్శ్వాలు  రూపాయి విలువలో కదలికను ప్రభావితం చేస్తున్నాయి. అవి 1.చమురు ధరలు  2.బంగారం దిగుమతులు 3. భారీగా పెరుగుతున్న నికర దిగుమతులు.
1. అందులో చమురు ధరలలో మార్పు  గురించి ముందుగా చెప్పుకోవాలి. మన దిగుమతులలో చమురు మూడవ వంతును ఆక్రమిస్తుంది. దీనికి తోడు మనదేశంలో చమురు గిరాకి నికరంగా తగ్గక పోవటం, చమురు ధరలలో భారీగా ఏర్పడుతున్న హెచ్చుతగ్గులు రూపాయి విలువను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
2008-09లో ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరిగిన కారణంగా చమురు దిగుమతుల విలువ 17శాతం పెరిగిన కారణంగా రూపాయి విలువ భారీ పతనాలల్లో ఒక రికార్డ్ ను  నమోదుచేసింది. 2011-12 లో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు 46 శాతం పెరిగినప్పుడు, రూపాయి విలువ 6.4 శాతం పతనమైంది. మరోప్రక్క 2013-14నుండి చమురు ధరల్లో సవరణల కారణంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు తగ్గినందువల్ల రూపాయి విలువలో పతనం కట్టడిచేయబడింది. పెట్రోలియం,వాటి ఉత్పత్తుల ధరలు 2009లో 93 డాలర్ల నుండి ఇటీవలి 2015 లో 138 డాలర్లకు పెరిగి, రూపాయివిలువ పై మళ్ళీ వత్తిడిని పెంచినాయి.
2. మనదేశ విదేశీ వాణిజ్యంలో బంగారం ధరలు రూపాయి విలువను ప్రభావితం చేయకలుగుతాయి. 2008 సంక్షోభం ఫలితంగా బ్యాంకు డిపాజిట్లు మరియు స్థిర ఆదాయ మదుపులపై  పై తిరోగమన   ఆదాయాలు  రావడంతో, భారతీయులు తమ మదుపును బంగారం లాంటి భౌతిక ఆస్తులల్లో పెట్టుబడులు పెట్టడం మొదలెట్టారు. దీని ఫలితంగా భారతదేశ బంగారం దిగుమతులు 2008-09 లో 2100కోట్ల డాలర్ల నుండి 2012-13లో 5700కోట్ల డాలర్లకు పెరిగాయి. ఈ కాలంలో అత్యధికంగా పెరిగిన  బంగారంరేట్లు దిగుమతుల విలువలను పెంచేశాయి.
2013 కరెన్సీ సంక్షోభం రగలటానికిగల 2012లో 5600 కోట్లకు తీవ్రంగా పెరిగిన బంగారం దిగుమతులు, భారీగా పతనమైన రూపాయి విలువ లు కూడా దోహదపడ్డాయి. పెట్రోల్ కంటే బంగారం వినియోగాన్ని కట్టడి చేయటం తేలికైనందున, 2013లో ప్రభుత్వం బంగారం దిగుమతుల నియంత్రణకు సత్వరం పూనుకోకలిగింది. మళ్ళీ బంగారం దిగుమతుల పై ఆంక్షలు సడలించటంతో,మళ్ళీ బంగారం దిగుమతులు ఊపందుకుంటున్నాయి.
3. ఆర్ధిక సంస్కరణల తొలి సంవత్సరాలలో పెరుగుతున్న దిగుమతుల్ని,ఎగుమతులు కొంతమేరకు సర్దుబాటు చేయకలిగేవి. ఎగుమతుల వృద్ది మందగించటంతో ఈ మధ్య కాలంలో ఇది సాధ్యం కావటం లేదు. వాణిజ్య ఎగుమతుల వృద్ది 2010-11లో వున్న 40శాతం నుండి పడిపోతూనే వుంది. 2015-16లో ఇప్పటివరకు వాణిజ్య ఎగుమతుల విలువ కుంచించుకు పోతున్నది. సర్విస్ రంగంలోని ఎగుమతులు కూడా ఇదే ధోరణిలో వుండి గత 3 సంవత్సరాల మందగమనం తర్వాత 2015-16లలోమరింత  కుంచించుకు పోతున్నాయి. చమురు,బంగారం ధరల్లో కొంత ఉపశమనం వున్నా, గత రెండు సంవత్సరాలుగా రూపాయి విలువ నత్త నడక నడుస్తునేవుంది . విధాన కర్తలు,’భారత్ లో తయారి ‘ప్రచారకులకు  ఈ పరిణామాల పర్యవసానాల ప్రభావం  తీవ్రంగా వుంటుంది. .
ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలో  కొనసాగుతున్న మందగమన ప్రభావం మన ఎగుమతుల వృద్ది పై తీవ్రంగా వున్నది. భారత  దేశం యొక్క వాణిజ్య ఎగుమతుల్ని పెంచేందుకు ఎంతో చేయాల్సి వుంది.
చమురు,బంగారం ధరలను నియంత్రించ కలిగే అవకాశం వున్నప్పుడు,రూపాయికి కొంత ఉపశమనం వుంటుంది. ఎగుమతుల వేగం తగ్గటం రూపాయి కి బలహీనత గానే భావించాలి. ద్రవ్యోల్బణ దీర్ఘకాలిక చలనం రూపాయి విలువపై ప్రభావాన్ని కలిగి వుంటుంది.టోకు ధరల సూచీ రెండు సంవత్సరాల క్రితం వరకు ప్రభావాన్ని కల్గిస్తునే వుంది. ఈ సూచికి సంబంధించి అనేక సంవత్సరాల సమాచారాన్ని కలిగి ఉన్నాము.టోకు ధరల సూచీ ప్రాతిపదికన ద్రవ్యొల్బణం లో పెరుగుదల  90లలో 20శాతం వద్ద వున్నా, తదనంతర కాలంలో అంతకంటే తక్కువ స్థాయిలోనే  నిర్వహింపబడుతున్నది. 2008,2010లలో సూచీ 19శాతాన్ని తాకినా,అప్పటి నుండి తక్కువ స్థాయిలో వుంటూ,ఒక దశలో ‘0.’కి పతనమై, 2015 లో ప్రతి ద్రవ్యోల్బణ దిశకు చేరేటట్లుంది.అత్యధిక ద్రవ్యోల్బణం కరెన్సీ పోటీతత్వాన్ని దెబ్బతీస్తుంది. రూపాయిని పటిష్టపరిచే అంశాలలో పతనమవుతున్న ద్రవ్యోల్బణ మొకటి.కరెన్సీ వాణిజ్య పోటీలో ద్రవ్యోల్బణ పతనం రూపాయి విలువను పెంచింది. ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసి, విదేశీ కరెన్సీ తో పోల్చి కొలిచే రూపాయి విలువను ‘వాస్తవంగా ప్రభావితమయిన విదేశీ మారక రేటు(రియల్ ఎఫెక్టివ్ ఎక్ష్చెంజ్ రేటు)’అంటాము. దీన్ని రిజర్వ్ బ్యాంకు నిర్ణయిస్తుంది. సెప్టెంబర్ ఆఖరుకు దీని విలువ 110. ప్రస్తుతానికి  10శాతం రూపాయి విలువ పెరిగిందని దీనర్ధం. కాని వాస్తవంగా’ ప్రభావితమయిన విదేశీ మారక రేటు(రియల్ ఎఫెక్టివ్ ఎక్ష్చెంజ్ రేటు)ను, రూపాయి పోటితత్వాన్ని టోకు ధరల సూచీ ప్రాతిపదికన కొలుస్తారు. అందువల్ల దీన్నిప్రామాణికమైన  కొలమానం గా పరిగణించ లేము.  
డాలర్ బంధం
రూపాయి విలువ కదలికల్ని నిర్దేశించే అంశాలలో డాలర్ పటిష్టత మరొక ముఖ్యమైన అంశం. రూపాయి విలువకు సంబందించిన ఇటీవలి చరిత్రను పరిశీలిస్తే జూలై 2011 నుండి రూపాయి విలువలో తీవ్రమైన తాజా తరుగుదల మొదలైంది. ఈ తరుగుదల, ఎస్ అండ్ పి రేటింగ్ సంస్థ  అమెరికా క్రెడిట్ రేటింగ్ ను ఎఎఎ కంటే దిగువకు తగ్గించి, డాలర్ సూచీ  73 కు పతనమైన సమయంలో సంభవించింది. యూరోజోన్  సభ్యులు బలహీన పడటం వల్ల యూరో బలహీనంగా ఉండటం, అమెరికా ఆర్ధిక వ్యవస్థ వృద్ది లో మెరుగుదల సాధించటంతో డాలర్ మళ్ళీ పుంజుకుంది.అమెరికాలోని  ‘దాదాపు సున్న ‘వడ్డీ రేటు డాలర్ రుణాలకు గిరికీని పెంచింది. ఫలితంగాఅమెరికా మదుపు దారులు  ఇతర దేశాలలో ఆస్తులు కొనడం మొదలెట్టారు ఆగస్టు 2011 తొలినాళ్ళలో డాలర్ సూచీ 30శాతం పుంజుకోగా, ఈ సమయంలో డాలరుకు రూపాయి విలువ  44నుండి 65శాతం వరకు పోగొట్టుకుంది. డాలర్ విలువ పుంజుకోవటం,రూపాయి విలువ తరుగుదలను ప్రభావితం చేస్తుంది.
ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్లను పెంచటం మొదలెట్టితే డాలర్ అత్యధిక విలువను పొందటం వల్ల రూపాయి మరింతగా విలువను పోగ్గొట్టుకునే ప్రమాదం వుంది
విదేశీ పెట్టుబడుల దిశ నిర్దేశం లో రూపాయి చలనాన్ని అంచనా వేయటం వృధా ప్రయాస. ఈ పరిణామాల దృష్ట్యా ఆస్తుల ధరల్లో తాత్కాలిక ఒడుదుడుకు లున్నప్పటికీ, కరెన్సీ విలువలు ప్రధానంగా విదేశీ వాణిజ్య గణాంకాల పై, ప్రధాన సరుకుల దిగుమతులపై  అత్యధికంగా ప్రభావిత మౌతుంటాయి.
చమురు ఉత్పత్తి దిగ్గజాలు రకరకాల ఎజెండాలతో వున్నకారణంగా కొంత కాలంపాటు చమురు ధరలు మందంగానే వుండవచ్చు. దీనివల్ల రూపాయి కొంత ఉపశమనం పొందాలి. ఈ సంవత్సరంలో తట్టుకోగలిగిన కరెన్సీలలో రూపాయి ఒకటిగా వుంది. చమురు ధరల పతనం వల్ల పొందిన ప్రయోజనంతోనే ఇది సాధ్యమైంది. ఈ కాలంలో బంగారం యొక్క గిరాకి కూడా తగ్గింది. భారత దేశంలో నగలబంగారం గిరాకి పై నిరంతర నిఘా ఉంచాల్సినప్పటికి, బంగారం ధరలు పెరిగే అవకాశాలు అంతగా లేవు. అదుపులో వున్న ద్రవ్యోల్బణం రూపాయికి అనుకూలంగా వుండి ,దాన్ని పటిష్ట పరుస్తుంది కాని, కొనసాగుతున్న ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ మందగమనం వల్ల ప్రభావితమయ్యే మన ఎగుమతులు  ప్రస్తుతానికి రూపాయికి ఇబ్బంది కరంగానే వుంటాయి.
అంతర్జాతీయ వాణిజ్యం లో మనం మనలేని పరిస్థితులు ఏర్పడి, అమెరికా ఫెడరల్ రిజర్వు  వడ్డీ రేటు పెంపు ప్రతిపాదనలు అమలైతే , దేశంలోని విదేశీ పెట్టుబడులు భద్రమైన అమెరికన్ డాలరు తో అనుసంధానమైన ఆస్తులకు భారీగా మళ్ళినప్పుడు  రూపాయి ఎదుర్కొనే ఇబ్బందుల్ని సర్దుబాటు చేసికోవటం పెద్ద సవాలుగా వుంటుంది. . అటువంటి స్థితిలో డాలరుకు రూపాయి విలువ  72- 75 కు పడిపోయే ప్రమాదముంది. అదృష్ట వశాత్తు ఇది సంభవించక పోతే, వచ్చే సంవత్సరంలో డాలరుకు రూపాయి విలువ 60-70 మధ్య వుండవచ్చు .  
  (బిజినెస్ లైన్ 18,10.2015 సంచిక నుండి స్వీకరణ)

స్వేచ్చానువాదం :కొండముది లక్ష్మీప్రసాద్  

No comments: