Monday, December 21, 2015

'పారిస్‌' మన కొంప ముంచింది

 మేక్‌ ఇన్‌ ఇండియా కోసం ... దేశానికి హాని తెచ్చారు
- విజయం అమెరికాదే.. పేద దేశాలపైనే పెను భారం
- పారిస్‌ ఒప్పందంపై నీటి వనరుల సంరక్షకుడు, మెగాసెసే గ్రహీత రాజేంద్ర సింగ్‌ తీవ్ర అసంతృప్తి
 ప్రపంచ దేశాలను విపరీతంగా భయపెడుతున్న భూ తాపం, పర్యావరణ కాలుష్యం సమస్యలపై ఇటీవల ముగిసిన పారిస్‌ సదస్సులో కుదిరిన ఒప్పందంపై మన దేశంలో నీటి సంరక్షణ దీక్ష వహించిన రాజేంద్ర సింగ్‌ నిప్పులు కురిపించారు. నీటి నిల్వలను కాపాడే విషయంలో ఆయన చేసిన నిర్విరామ కృషికి గుర్తింపుగా మెగాసెసే అవార్డు రాజేందర్‌ సింగ్‌ను వరించిన విషయం తెలిసిందే. పారిస్‌ ఒప్పందం వల్ల కాలుష్య ప్రమాదం కన్నా అందుకు ప్రధాన కారణమైన అమెరికాకు మాత్రం చాలా ఎక్కువ ప్రయోజనాలనే సాధించిపెట్టిందని ఆయన ఆరోపించారు. నిజానికి వాతావరణం ఇంత ప్రమాదకరంగా తయారుకావడానికి ప్రధాన బాధ్యత అమెరికాదే, అయినా, ఆ సమస్య పరిష్కారానికి పేద దేశాలతో సహా అన్ని ఇతర దేశాలను ఈ సదస్సు ఒకే స్థాయిలో పరిగణించిందని, బాధ్యతల బరువును అందరి నెత్తిన పడేసిందని ఆయన ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం పారిస్‌ ఒప్పందం అమెరికాకు ఘన విజయాన్నీ, భారత దేశానికి ఘోర పరాజయాన్ని కట్టబెట్టింది. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, నీటిని పవిత్రమైనదిగాను, అమూల్యమైనదిగాను ప్రేమించి, గౌరవించడం మన సంస్కృతి అన్న వాస్తవాన్ని ప్రభుత్వం విస్మరించిందని తప్పుపట్టారు. 


ఈ సదస్సు జరుగుతున్న సమయంలో పారిస్‌లోనే ఉన్న రాజేందర్‌ సింగ్‌ సదస్సు జరిగిన తీరును పరిశీలించి, గతంలో రియో డీ జెనీరియో, కోపన్‌హాగన్‌, క్యోటో సదస్సుల స్ఫూర్తికి విరుద్ధంగా సాగిందని ఆన్నారు. అమెరికా తన నేరానికి ప్రాయశ్చిత్తంగా దాని పరిష్కారంలో ప్రధాన జవాబుదారీ బాధ్యతను స్వీకరిస్తుందని అందరూ ఆశించారు. కాని ఆ బరువు బాధ్యతలు చివరికి పేద దేశాల నెత్తిన కూడా పడింది. 


దాదాపు 40 వేల మంది పాల్గొన్న సదస్సులో పర్యావరణం గురించి మాట్లాడింది తక్కువ, వ్యాపారపరమైన అంశాలపై జరిగిన చర్చలే ఎక్కువ అని ఆయన అన్నారు. గట్టిగా 400 మంది కూడా లేని ప్రత్యేక బృందం అందరి తరఫున నిర్ణయాలు తీసేసుకుందని రాజేందర్‌ సింగ్‌ ఆరోపించారు. ఇక ఇండియా విషయానికి వస్తే మన దేశంలోని పారిశ్రామిక రంగానికి చాలా ప్రధానమైన ఇంధనం కోసం బొగ్గు వినియోగానికి అనుమతి సంపాదించడమే లక్ష్యంగా చర్చల్లో పాల్గొన్నదని ఆయన ఎద్దేవా చేశారు. భూసారం గురించి కాని, నీటి వనరుల భద్రత గురించి కాని అక్కడ ప్రధానంగా చర్చ జరగనే లేదని ఆయన అన్నారు. ఇలా విద్యుత్‌ కోసం బొగ్గు వాడకం ప్రమాదకరం అనే విషయంలో ప్రపంచమంతా ఏకాభిప్రాయంతో ఉన్నా మన పాలకులు దానికోసమే ఈ ఒప్పందంపై సంతకాలు చేశారని ఆయన విమర్శించారు.

(21.12.2015 నవ తెలంగాణ పత్రిక నుండి స్వీకరణ)

Tuesday, December 15, 2015

పారిస్‌ ఒప్పందం

పారిస్‌లో నవంబరు29న ప్రారంభమై డిసెంబరు12న ముగిసిన ప్రపంచ వాతావరణ సమావేశం ఒక ఒప్పందాన్ని ఆమోదించింది. దాని ప్రకారం 196 సభ్య దేశాలు ఏ ఒక్క కార్యాచరణకూ కట్టుబడనవసరం లేదు. ప్రతి దేశం తను విడుదల చేస్తున్న ఉద్గారాల నియంత్రణ గురించి స్వచ్ఛందంగా నివేదించేలా కట్టుబడనవసరంలేని లక్ష్యాలను నిర్దేశించారు. పెరుగుతున్న సముద్ర నీటిమట్టాలతో మునక ప్రమాదాన్ని, తీవ్రస్థాయిలో చెలరేగుతున్న తుపానులతో పెను విధ్వంసాలను ఎదుర్కొంటున్న పసిఫిక్‌ మహాసముద్రంలోని 20 ద్వీప దేశాలను, అదనంగా నిధులను ఏర్పాటుచేసి మోసపుచ్చారు. పారిస్‌ వాతావరణ ఒప్పందంలో నియంత్రించ వలసిన తాపం పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు బదులు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గించాలని గత సమావేశాలలో చేసిన ఈ దేశాల డిమాండ్‌ను చర్చల చివరి దశలో విస్మరించారు. 

పారిస్‌ వాతావరణ సమావేశం ప్రకటించిన ఒప్పందాన్ని సామ్రాజ్యవాద దేశాల నాయకులు అతిగా కీర్తిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కార్పొరేట్‌ మీడియా బాకా వూదుతోంది. చారిత్రకంగా భూగోళాన్ని కాలుష్యంతో నింపింది ఈ దేశాలే. అమెరికా అధ్యక్షుడు ఒబామా పారిస్‌ ఒప్పందాన్ని ఒక గొప్ప 'మలుపు'గా అభివర్ణించాడు. 'భూగోళం చరిత్రలో డిసెంబర్‌ 12, 2015 ఒక గొప్ప దినంగా మిగులుతుంది. అనేక శతాబ్దాల కాలంలో పారిస్‌లో అనేక విప్లవాలు జరిగాయి. ఈ రోజు వాతావరణ మార్పుకోసం సంభవించిన విప్లవం అన్నింటికంటే సుందరమైనది, అన్నిటికంటే శాంతియుతమైనది' అని ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఫ్రాన్సిస్‌ హోల్లాండ్‌ పేర్కొన్నాడు. ఒకవైపు 'శాంతియుత విప్లవం' గురించి మాట్లాడుతూనే మరోవైపు పర్యావరణ నిరసనకారులపై పోలీసు, మిలిటరీ బలగాలను ఉపయోగించి హోల్లాండ్‌ తన ఉక్కుపాదం మోపాడు.

'ఆపరేషన్‌ విజయవంతంగా జరిగింది. కానీ రోగి మరణించాడు' అన్నచందంగా పారిస్‌లో రెండు వారాలపాటు వాతావరణ సదస్సు జరిగిందని చెప్పవచ్చు. హోల్లాండ్‌, ఒబామా, ఇతర పెట్టుబడిదారీ దేశాల నాయకులు పారిస్‌ సమావేశాన్ని రాజకీయంగా నిర్వహించినతీరు గొప్పగా విజయవంతం అయింది. 'మనకున్న ఒకేఒక గ్రహం' భవిష్యత్తు కోసం శ్రమించే పర్యావరణ వాదులుగా ఈ దేశాల నాయకులు పోజుపెట్టటానికి పారిస్‌ సమావేశం ఉపయోగపడింది. అయితే రోగగ్రస్తమైన భూగ్రహం భవిష్యత్తు, ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో బందీగా ఉన్నంతకాలం ఆందోళనకరంగానే వుంటుంది. ప్రధాన దేశాల నాయకులకు ఏమి కావాలో అది పారిస్‌ సమావేశంలో దొరికింది. ప్రపంచ వాతావరణ క్షీణతను ఏమాత్రం అరికట్టకుండా కొంచెం ఖర్చుతోనే వాతావరణాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నట్టుగా నటించే అవకాశం ఈ సమావేశం కల్పించింది. స్థూలంగా చెప్పాలంటే పారిస్‌ వాతావరణ సదస్సు ప్రకటించిన ఒప్పందం వాతావరణ మార్పును, భూతాపాన్ని అరికట్టేందుకు చేసింది చాలా స్వల్పం. అనివార్యంగా తీసుకోవలసిన చర్యల గురించి దీనిలో ఆదేశాలు ఏమీలేవు. ఏ ప్రభుత్వమైనా, ఏ కంపెనీ అయినా తప్పనిసరిగా చేయవలసింది ఏమీలేదు.

పారిస్‌ వాతావరణ సదస్సు సాధించిన 'విజయం' ఏమంటే అది 2009లో జరిగిన కోపెన్‌హాగెన్‌ వాతావరణ సమావేశంలాగా బహిరంగంగా విఫలం కాకపోవటమే. అప్పటి సదస్సులో సామ్రాజ్యవాద దేశాలకు, చైనా, ఇండియా, బ్రెజిల్‌ వంటి వర్ధమాన దేశాలకు మధ్య ఏర్పడిన విభేదాలవల్ల అది పూర్తిగా విఫలమైంది. కోపెన్‌హాగెన్‌లో నేర్చుకున్న 'పాఠం'తో సామ్రాజ్యవాద దేశాలు ఇతర దేశాల ఆకాంక్షలను ముందుగానే పసిగట్టి ఎంత బలహీనమైనదైనప్పటికీ ఒక ఒప్పందాన్ని రూపొందించి దానిని ఒక పెద్ద ముందడుగుగా ప్రకటించింది. ఉద్గారాల విడుదలను తగ్గించుకునేందుకు సభ్యదేశాల స్వయం ప్రకటిత లక్ష్యాల ఆధారంగా ఒబామా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఒప్పందాన్ని రూపొందించారు. దీని 'అమలు'కు గల ఏకైక యంత్రాంగం ప్రపంచ ప్రజాభిప్రాయమే.

పారిస్‌ ఒప్పందానికి కట్టుబడనవసరంలేని స్వచ్ఛంద స్వభావం వుండటం సానుకూల అంశం అనే అభిప్రాయం కొందరిలో ఉన్నది. ఎందుకంటే అది ప్రయివేటు పెట్టుబడిని, ప్రయివేటు వాతావరణ పరిరక్షణా ప్రయత్నాలను ప్రోత్సహిస్తుంది గనుక. వాతావరణం నుంచి కార్బన్‌డైఆక్సైడ్‌ను తొలగించగలిగే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటానికి సహకరిస్తామని మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ వంటి బిలియనీర్స్‌ చేసిన వాగ్దానాన్ని ఒబామా ప్రభుత్వం ప్రశంసించింది. 'మానవ విజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో విడుదల చేసేందుకు మార్కెట్లకు ఈ ఒప్పందం ఒక సూచికవంటిది'అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ-మూన్‌ వ్యాఖ్యానించాడు.
నిజానికి పెట్టుబడిదారీ లాభాల వ్యవస్థకు మారుపేరైన 'మార్కెట్లు' మానవ ప్రగతికి ప్రధాన అడ్డంకిగా వున్నాయి. విధ్వంసకర 'అభివృద్ధి' ద్వారా భూతాపాన్ని ప్రమాదకర స్థాయికి తెచ్చిన అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలే ప్రపంచ సంపదంతా కొద్దిమంది పెట్టుబడిదారీ బిలియనీర్ల చేతుల్లో పోగేసి పెట్టాయి. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు పారిశ్రామికీకరణ కోసం చేసే ప్రతి ప్రయత్నాన్నీ ధనిక దేశాలు భూతాపం పేరుతో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. భూతాపాన్ని పెంచిన దేశాలే ఇప్పుడు తగ్గించేందుకు ప్రధాన బాధ్యత తీసుకోవాలి. ఇందుకు ప్రజల నుండి వత్తిడి పెంచటం తప్ప మరో మార్గం లేదు.


(నవతెలంగాణ -16.12. 2015 తేదీ సంపాదకీయం)

Friday, December 4, 2015

చైనాలో గూగుల్‌ మనగలుగుతుందా?

-(డా.కొండూరి రవీంద్రబాబు)
ప్రస్తుతం చైనాలో విజయం అన్నది ఏ ఒక్కరి సొంతం కాదు. గత కొన్ని దశాబ్దాలుగా లాభార్జనలో వున్న పశ్చిమదేశాల కంపెనీలు ఇప్పుడు వేగంగా మారు తున్న చైనా వాణిజ్య వాతావరణంలో మనుగడకోసం నానా తంటాలుపడుతున్నా యి. గతంలో మాదిరిగా విదేశీ పెట్టుబడిదారులకు తలుపులు తెరచి వుంచేందుకు చైనా ఇప్పుడు సిద్ధంగా లేదు. గతంలో చైనా తన సమాజాభివృద్ధి కోసం అవసర మైన సాంకేతిక పరిజ్ఞానం కోసం అర్రులు చాస్తున్న రోజుల్లో ఎవరైనా సరే చైనా ప్రభుత్వ విశ్వాసం చూరగొంటే వారికి లాభాల పంట పండిందన్న మాటే. ప్రస్తు తం పరిస్థితి మారింది. వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సంతృప్తికరంగా అందిం చని విదేశీ కంపెనీలు చైనా మార్కెట్‌ నుండి లాభాలను ఆర్జించటానికి ఆయన ఏ మాత్రం అంగీకరించటం లేదు. అనేక అమెరికన్‌ కార్పొరేట్‌ కంపెనీలు అండర్‌కవ ర్‌ ఏజెంట్లుగా వ్యవహరించేందుకు విఫలప్రయత్నం చేశాయి. గూగుల్‌ ఎనలిటిక్స్‌ మినహా ఇతర గూగుల్‌ అప్లికేషన్స్‌ అన్నింటిని చైనా ప్రధాన భూభాగంలో నిలిపివేసింది. గూగుల్‌ అనలిటిక్స్‌ చైనాతో సహా ప్రపంచవ్యాప్తంగా వున్న వెబ్‌సై ట్‌ ఆపరేటర్లందరికీ ఉచిత సేవలను అందిస్తుండటంతో అది మాత్రం మనుగడ కొనసాగించగలుగుతోంది. ప్రపంచంలోనే అతిపెద్దదైన చైనా మార్కెట్‌ను చేజి క్కించుకునే ప్రయత్నంలో గూగుల్‌ 2006లో చైనీస్‌ సెర్చ్‌ వ్యాపారం ప్రారంభిం చిన నాటినుండి అక్కడి కమ్యూనిస్టు సిద్ధాంతాలను వంటపట్టించుకునేందుకు అత్యధికంగా శ్రమించింది. ఈ ప్రయత్నంలోనే చైనా చట్టాలకు వ్యతిరేకమైన అనేక అక్రమాలకు తెరతీసింది. అశ్లీలత, ఇతర నిషిద్ధాంశాలతో కూడిన పశ్చిమదేశాల సంస్కృతిని చైనాలో ప్రవేశపెట్టటం లేదా గూఢచర్యానికి పాల్పడటం వంటి కార్యకలాపాలను చైనా చట్టాలు పూర్తిగా నిషేధించాయి. ఈ అక్రమాలకు తెరతీసిన గూగుల్‌ సెర్చ్‌ ఇంజన్‌ కనీసం స్థానికంగా అయి నా సెన్సారింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవటంలో విఫలమైంది. ఇన్ని వైఫల్యాల నేపథ్యంలో 2010లో గూగుల్‌ చైనా నుండి నిష్క్రమించింది. 2010లో గూగుల్‌ మార్కెట్‌ షేర్‌ బైదు కన్నా దిగువ స్థాయిలోనేవుంది. 2006 నుండి 2010 మధ్య కాలంలో ఘోర తప్పిదాలకు పాల్పడి చైనా నుండి తప్పుకున్న గూగుల్‌ మరోసారి చైనా భూభాగంలో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నదన్న వార్తలు వెలువడుతున్నా యి. 2013లో అమెరికా జాతీయ భద్రతా వ్యవస్థ (ఎన్‌ఎస్‌ఎ) చేపట్టిన మూకు మ్మడి నిఘా కుంభకోణం గుట్టు రట్టయిన నాటి నుండి ఐరోపాలో నియంత్రణ కట్టుదిట్టం కావటంతో గూగుల్‌ సంస్థ ఆదాయం మందగించింది. దీనితో 2016లో మరోసారి చైనా మార్కెట్‌లో ప్రవేశించేందుకు ఈ సెర్చ్‌ ఇంజన్‌ ప్రయత్నిస్తోందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి.
గూఢచర్యానికి నో ఛాన్స్‌!
చైనాలో గూగుల్‌ ఎనలిటిక్స్‌ ఇప్పటికీ మనుగడ సాగిస్తూ తన వ్యూహాత్మక విలువను పెంపొందించుకోవటం గూగుల్‌ పున్ణప్రవేశానికి కీలకంగా మారు తోంది. చైనా మార్కెట్‌లో ప్రవేశానికి సన్నాహక చర్యలుగా గూగుల్‌ సంస్థ గత ఏడాది చైనాలో చివర .సిఎన్‌ అన్న సంకేతంతో 18 డొమెయిన్‌ పేర్లను గత ఏడాది రిజిస్టర్‌ చేసింది.
(ప్రజాశక్తి 03/12/2015 సంచిక నుండి స్వీకరణ) 

Thursday, December 3, 2015

మోడీ సిలికాన్ పర్యటన, డిజిటల్ ఇండియా


డిబెన్ దాస్ 
ప్రపంచప్రఖ్యాత శాస్త్రసాంకేతిక కేంద్రంమైన  సిలికాన్ వ్యాలీలో  మోడీ పర్యటన, ఆ సందర్భంగా ఆయన ఐటి దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ కంపెనీలను కలవటం లాంటి అంశాలకు మీడియా విపరీతమైన ప్రచార హోరును  కల్పించాయి. ఈ పర్యటనతోనే మోడి భారతదేశ శాస్త్రసాంకేతిక పురోగతిని ఉన్నతసోపానాల నెక్కించినట్లు కార్పోరేట్ మీడియా చిత్రీకరించింది. భవిష్యత్తులో భారతీయులు మరిన్ని స్మార్ట్ ఫోన్లు, అత్యధిక సాంకేతికతపరిజ్ఞానంగల కార్లు, పరికరాలు వాడగలగడం లో సందేహంలేదు. దీనర్ధం భారత దేశం  శాస్త్ర సాంకేతిక రంగంలో పురోగతిని సాధించినట్లు కాదు. ఇక్కడ ప్రశ్న, ఈ అత్యాధునిక సాంకేతిక ఉత్పత్తులలో( సాఫ్ట్ వేర్ మరియు  హార్డ్ వేర్ రెండూ కలిపి)భారత్ లో తయారవుతున్న ఉత్పత్తులు ఎన్ని?- అని? దాదాపుగా ఏమీ లేదన్నది తక్షణ సమాధానం. ఈ దిశలో మోడీ పర్యటన వల్ల కించిత్తు ప్రయోజనం కలగటంలేదు.


సిలికాన్ వ్యాలీ గా పిలువబడే అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో దక్షిణ భాగం, ప్రపంచంలోనే అతి పెద్ద అత్యాధునిక సాంకేతిక కార్పోరేషన్లకు పుట్టినిల్లుగా ప్రసిద్ధి చెందింది. అత్యధిక సంఖ్యలో పేరుగాంచిన సిలికాన్ చిప్ ఆవిష్కర్తలు, తయారీదార్ల ప్రాముఖ్యత తోనే ఆ ప్రాంతం సిలికాన్ వ్యాలీగా పేరుగాంచింది.  స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల కృషితో ఆవిష్కృతమైన నూతన ఉత్పత్తులు, వెంచర్ పెట్టుబడులు, అమెరికా రక్షణ శాఖ వ్యయాలు లాంటి అనేక అంశాలు కలగలిసి ఆ ప్రాంత ఉద్భావనకు కారణాలయ్యాయి. వేలాది శాస్త్ర సాంకేతిక అంకుర పరిశ్రమలు ప్రపంచంలో నూతన ఆవిష్కరణలకు పురుడు పోసికొని  ఇక్కడి నుండే తమ ప్రయాణాన్ని మొదలెట్టాయి. ప్రపంచంలో అత్యాధునిక సాంకేతిక శ్రమజీవులు అత్యధికంగా కేంద్రీకరింపబడిన ప్రాంతం ఇదేనెమో! మోడి తన ఉపన్యాసాన్ని శ్రోతలను దృష్టిలో వుంచుకునే మాట్లాడతారన్న అంశం సిలికాన్ వ్యాలి లో ఆయన చేసిన ప్రసంగాన్ని బట్టి విదిత మౌతుంది. సాంకేతిక మేధావులు హాజరైన ఆ సమావేశంలో ఆయన తనుగాని,తన పార్టీ గాని, ఆర్ఎస్ఎస్ గాని సామాన్యంగా బహిరంగ సభల్లో  మాట్లాడుతున్నట్లు మాట్లాడలేకపోయారు. ఉదాహరణకు జనవరి 3,2014లో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్నపుడు  అహమ్మదాబాద్ లో జరిగిన గ్లోబల్ హెల్త్ కేర్ సమిట్ ప్రారంభోత్సవ సమయంలో ప్రస్తావించిన అంశాలను మోడీ ఇక్కడ ప్రస్తావించలేదు. ఆయన అక్కడ ఇలా చెప్పారు,”మనం వినాయకుడిని పూజిస్తుంటాం. వినాయకుడి కాలంలో  మనిషి దేహానికి ఏనుగు తలను అతికించగల ప్లాసిక్ సర్జన్, తన వృత్తిని నిర్వహిస్తూ వుండి తీరాలి. కర్ణుడు తన తల్లి ఉదరం నుండి జన్మించలేదని మహాభారతం చెపుతుంది. అంటే జన్యు శాస్త్రం ఆ కాలానికే అభివృద్ది అయిందని అర్ధం’. విశ్వవ్యాప్తంగా శాస్త్ర సాంకేతిక రంగాలు సాధించిన పురోగతిని అపహాస్యం చేస్తూ, మోడీ బృందం ఈ శాస్త్ర సాంకేతిక పురోగతి వేదకాలం నాడే వుందని నమ్మబలుకుతున్నారు. అందుకోసమే తమ ప్రభుత్వం వేదశాస్త్రం,జ్యోతిష్య శాస్త్రాల అభివృద్ధికి నిధులను సమకూరుస్తుందని సమర్ధించుకున్నారు .


కాని సిలికాన్ వ్యాలిలో చేసిన ప్రసంగంలో మోడీ ఈ అంశాలను ఏమీ ప్రస్తావించ లేదు. వేదకాలం నాటి శాస్త్ర సాంకేతిక పురోగమనాన్ని పోల్చుకుంటే, ఆధునిక శాస్త్రసాంకేతికరంగం సాధించలేని ఆవిష్కరణల వేటిని  ప్రస్తావించ లేకపోయారు. దానికి బదులు ఆయన ఇలా అన్నారు,”నూతన ఆలోచనలు ఇక్కడే(సిలికాన్ వ్యాలీలో)తొలి వెలుగును చూడకలిగాయి.” ఒక ప్రక్క, చరిత్రను వక్రీకరిస్తూ, పుక్కిటి పురాణాలను వాస్తవాలుగా చిత్రీకరిస్తూ, ప్రజల్లో మత ఛాందసానలను  రెచ్చకొడుతూ,వేద కాలాన్ని కీర్తిస్తూ మోడీ తన దేశ ప్రజల చైతన్య స్థాయిని పురాతన కాలానికి చేర్చదలిచారు. మరోప్రక్క, అత్యాధునిక శాస్త్ర సాంకేతికపరిజ్ఞానం ద్వారా  ప్రజాసమూహాల్ని  సులువుగా చేరుకోగలగడంలో దాని ప్రాధాన్యతను గూర్చి ఆయన ప్రస్తుతిస్తారు.  


మౌలికరంగ ఆవశ్యకత
మోడీ తన ప్రసంగం లో భారత దేశాన్ని డిజిటలైజ్  చేయటంలో తన దార్శనికతను వ్యక్తపరిచారు. “125కోట్ల నా  దేశ పౌరులు   డిజిటల్ గా  అనుసంధిపబడాలని నేను కోరుతున్నాను.” భారత దేశంలో 25 కోట్ల ప్రజలు ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారు. భారత జనాభాతో పోల్చుకుంటే దేశంలో ఇంటర్నెట్ వినియోగం తక్కువైనప్పటికీ(19శాతం) సంఖ్యా పరంగా చూస్తే అది అత్యధికంగా వుంది. ప్రపంచ దేశాల ఇంటర్నెట్ వినియోగంలో చైనా,అమెరికాల  తర్వాత భారత దేశం మూడవ స్థానంలో వుంది. చైనాలో 64కోట్ల ప్రజలు ఇంటర్నెట్ వినియోగిస్తూ, వాళ్ళ జనాభాలో 46 శాతంగా వున్నారు. ప్రపంచ దేశాల మొబైల్ ఫోన్ల వినియోగంలో భారత దేశం చైనా తర్వాత రెండవ స్థానంలో వుంది. 125కోట్ల భారతీయులలో 96కోట్ల మంది పిడికిళ్ళలో మొబైల్ ఫోన్లు వుండగా, 137కోట్ల చైనీయులలో 127కోట్ల మంది పిడికిళ్ళలో మొబైల్ ఫోన్లు వున్నాయి. భారత దేశంలోని ప్రతివారికి మొబైల్ ఫోను, ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి తేవాలంటే, మొదటగా మనకు  దేశ వ్యాప్తంగా విస్తరింపబడ్డ ఫైబర్ఆప్టిక్ సమాహారం,ఫోన్లను అనుసంధించటానికి  కొన్ని టవర్లు లాంటి  మౌలిక సదుపాయాలు కావాలి. ఈ సమాహారం సాధారణ రవాణా వ్యవస్థను పోలివుంటుంది. మనదేశంలో హైవేలు, రోడ్లు, లేన్లు, రైల్వే లైన్లు లాంటి వాటి ద్వారా బస్సులు, కార్లు,ట్రక్కులు, రైళ్ళు, వాహనాలుగా ఉపయోగపడుతూ  ప్రజలను ఒకచోటి నుండి మరోచోటికి చేరుస్తున్నాయి. అదే రకంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్ లు డేటాను/సమాచారాన్ని ఒక చోట నుండి మరోచోటకు చేర్చగలిగే వాహకాలుగా వున్నాయి. . హైవేలను నిర్మించటానికి ఎవ్వరూ కార్ల కంపెనీనిగాని, బస్సులకంపెనీనిగాని ఆశ్రయించరు. హైవేలను  నిర్మించితే,వాహనాలు వాటంతటవే తప్పనిసరిగా వస్తాయి. గూగుల్,ఫేస్ బుక్, మైక్రో సాఫ్ట్, యాపిల్ లాంటి కంపెనీలు ఖచ్చితంగా బ్రాడ్ బ్యాండ్ హైవేలను నిర్మించవు. అదేకాకుండా మౌలిక సదుపాయాల నిర్మాణం వాళ్ళ వృత్తి కాదు. టాటా మోటార్స్, మారుతి కంపెనీలు రోడ్లను నిర్మిస్తాయా? ఈ మౌలిక సదుపాయాలను భారతదేశం దానంటతదే నిర్మించు కోవాలి. మరెవ్వరు చేయరు.
జపాన్,జర్మనీ దేశాల్లో 86శాతం మంది ఇంటర్నెట్ ను వినియోగిస్తున్నారు. అలాగని ఆ దేశాదినేతలందరూ ఈ కంపెనీలను కలువలేదు. మొబైల్ ఫోన్లు,ఇంటర్ నెట్ వినియోగదారులలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో వున్న చైనా, తమ దేశాన్ని డిజిటల్ చైనాగా మార్చటంకోసం గూగుల్,ఫేస్ బుక్, మైక్రో సాఫ్ట్ కంపెనీలను ఆశ్రయించలేదు. గూగుల్,ఫేస్ బుక్,యు ట్యూబ్,ట్విట్టర్ లాంటి  కంపెనీలను తమ దేశం లోకి అనుమతించక పోవటమే కాకుండా, గూగుల్ కు బదులుగా ఇతర సెర్చ్ ఇంజెన్ లను చైనీయులు వాడుతున్నారు. చైనా ప్రజలు వినియోగిస్తున్న ఇంటర్నెట్,ఇ-మెయిళ్ల సమాచారాన్ని చైనా యేతర ప్రపంచానికి  గూగుల్ అందజేస్తుందనేది చైనా లేవనెత్తుతున్న ప్రధాన అభ్యంతరం. స్నోడెన్ అమెరికా సమాచార వ్యవస్థ బండారాల్ని బయట పెట్టిన తర్వాత గూగుల్, ఫేస్ బుక్, మైక్రిసాఫ్ట్ సేవలను పొందుతున్న ప్రజానీకం పై నిఘా వుంచేందుకు, వారి సమాచారం మొత్తాన్ని అమెరికా జాతీయ సెక్యూరిటీ ఏజెన్సీకి అందించేందుకు ఆయా కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. గూగుల్, ఫేస్ బుక్, యూట్యూబ్ , ట్విట్టర్ లను వినియోగించకుండా డిజిటల్ ప్రపంచంలో చైనా ఎలా నెగ్గుకు రాగలుగుతుందన్నది- అందరి ముందున్న పెద్ద ప్రశ్న? గణాంకాలరీత్యా ఈ రంగంలో చైనా పనితీరు చాలా బాగున్నది. సామాజిక మాధ్య  వినియోగదారులలో  అమెరికాలో  ఉత్పత్తి అవుతున్న ఫేస్ బుక్ కు 118కోట్ల వినియోగదారులు కలిగి మొదటి స్థానంలో వున్నది. క్యూక్యూ 83కోట్ల వినియోదారులు కలిగి రెండవ స్థానంలో, క్యూ జోన్ 63కోట్ల వినియోగదారులు కలిగి మూడవ స్థానంలో వున్నాయి. ఈ రెండుసంస్థలు చైనాలో ఉత్పత్తి చేయబడి ప్రధానంగా చైనాప్రజలచే వినియోగింపబడుతున్నాయి. చైనా ఇంటర్నెట్ వినియోగదారులు సగటున రోజుకు 2.7 గంటలు ఆన్ లైన్ లో వుంటారని, ఈ సంఖ్య అమెరికా యేతర అభివృద్ది చెందుతున్న దేశాలకంటే  ఎక్కువగాను, అమెరికా జపాన్ లతో సమానంగానో లేదా ఎక్కువగానో వున్నట్లు ఒక బోస్టన్ కన్సల్టేన్సి బృందం అధ్యనంలో తేలింది.  మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ లకు మౌలిక సదుపాయాల కల్పనకు ఈ కంపెనీలతో అవసరం లేదన్న విషయం మోడీ కి బాగా తెలుసు. కాని ఆయన కార్యాన్ని ఆయన సాధించుకున్నారు. ఆయన మీడియా ప్రచారాన్ని చేజిక్కించుకొని, ఈ ప్రఖ్యాత కంపెనీల సాయంతో తాను ప్రఖ్యాత భారతదేశాన్ని నిర్మిస్తున్నానని కొందరిని నమ్మబలుకుతున్నారు. మౌలిక సదుపాయ కల్పనలో కొంత భాగాన్నిఅందిస్తామని ఆ కంపెనీల ద్వారా చెప్పిస్తున్నారు. మొత్తం దేశానికిఅవసరమైన  మౌలిక సదుపాయ కల్పనలో ఈ కంపెనీలు చివరి అంచున కల్పించే మౌలిక సదుపాయ కల్పన అరకొర లాంటిది. ఈ కంపెనీలు వాగ్దానం చేసిన అంశాల్ని రేఖా మాత్రంగా చూద్దాము. వాళ్ళు చేస్తున్నది వాగ్దానం మాత్రమే,అదికూడా ఖచ్చితంగా ఖరీదు కట్టే వుంటుంది.  


సిలికాన్ వ్యాలిలో ఆయన పర్యటన సందర్భంగా గూగుల్ భారత దేశంలో 500 రైల్వే స్టేషన్లను దత్తత తీసికొని వైఫై సౌకర్యాన్ని కల్పిస్తానని, ఇందుకోసం కొంత మౌలిక సదుపాయ కల్పన చేస్తామని ప్రకటించింది. దీన్ని గూగుల్ ఎలా చేస్తుంది?అని పరిశీలిస్తే, రైల్వేలలో ఇప్పటికే అందుబాటలో వున్న” రైల్ టెల్ “ ఆప్టిక్ ఫైబర్ సమాహారాన్ని తప్పనిసరిగా వినియోగించుకుంటుంది. పెద్ద హైవేల సమీపంలో వుండే ఇళ్ళకు చేరటానికి  కలిపే చిన్న రోడ్లతో ఈ పరిస్ధితిని పోల్చ వచ్చును. అదేకాకుండా గూగుల్ వైఫై పరిజ్ఞానంలో నిష్ణాతులేమీకాదు. వైఫై పరిజ్ఞానంలో నిపుణులైన ఇతర కంపెనీలు చాలా వున్నాయి. మన దేశంలోని కొన్ని విమానాశ్రయాలలో ఉచితంగా వైఫై సదుపాయాన్ని అందిస్తున్నారు. అవి చాలా బాగా పనిచేస్తున్నాయి. భారత దేశంలో వైఫై కల్పించే కంపెనీలు చాలా వున్నాయి. సాధారణంగా వైఫై  కల్పనకు ఎవ్వరూ గూగుల్ని పిలవరు. ఎందుకంటే అది వాళ్ళ పని కాదుగాబట్టి. భారత దేశ గ్రామాలన్నింటికి  టెలివిజన్ ప్రసార మయ్యేటట్లు వీలుకల్పించటానికి, మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ సుముఖతను వ్యక్తంచేసింది. పెట్టుబడులు పెట్టడమంటే భారత ప్రభుత్వ మద్దతుతో  మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల విక్రయాల వ్యాపారం చేయటమని అర్ధం. మైక్రోసాఫ్ట్  యాజమాన్య సాఫ్ట్ వేర్ మరింతగా వాడటం మూలకంగా మనం లెక్కకుమించిన వ్యయాన్ని ఖర్చు పెట్టాల్సిన విష వలయంలో పడతాము. మైక్రోసాఫ్ట్ కూడా మన దేశంలో డేటా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. అది అమెరికా జాతీయ సెక్యురిటి ఏజెన్సీ తో ఒప్పందం కలిగివున్నందున,ఈ డేటా సెంటర్లలో పోగుపడిన సమా చారాన్ని అనివార్యంగా అమెరికా జాతీయ సెక్యురిటి ఏజెన్సీకి తెలియ చేస్తుంది. ఫేస్ బుక్ కూడా తన ఇంటర్నెట్ ను మనకు అందించటానికి తన సంసిద్ధతను వ్యక్త పరిచింది.  దాని ఇంటర్నెట్ పరిమితమైన ఇంటర్నెట్ గానే గుర్తించాలి. ఇంటర్నెట్ లో మనం ఏమి చూడాలో ఫేస్ బుక్ నిర్ణయిస్తుంది. “”తటస్థ నెట్ విధానానికి ఇది వ్యతిరేకం. ఈ కంపెనీ లేమీ మనదేశంలో  చెప్పుకోదగ్గ ఉద్యోగాల్నికల్పించలేవు. కల్పించగలమని వాళ్ళూ చెప్పడం లేదు.  


డిజిటల్ ప్రపంచంపై గుత్తాధిపత్యం
సిలికాన్ వ్యాలికి మోడి సందర్శనను ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టి వి మోహన్ దాస్ పాయ్  ప్రస్తుతిస్తూ,”మొత్తం ప్రపంచాన్ని డిజిటల్ గా స్వంతం చేసికోవటం కోసం మైక్రోసాఫ్ట్,ఫేస్ బుక్, గూగుల్ మరియు యాపిల్ లు  కన్నకలలకు మోడీలో సమాధానం దొరికింది.”అని ఆయన సరిగ్గానే చెప్పారు. ఆయన మాటల్లో రెండు సత్యాలున్నాయి. ఒకటి.ఈ కంపెనీలన్నీ డిజిటల్ ప్రపంచం మొత్తాన్ని తమ గుత్తాధిపత్యంలోకి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాయి. ఇందుకోసంగా వాళ్ళు ఇతరులెవరిని  ఈరంగంలోకి అడుగు పెట్టనివ్వరు. కాని ఈ స్వప్నాన్ని నిజం చేసికోవటానికి వాళ్ళు ఎన్నో అవరోధాలను ఎదుర్కోవలసివుంది. ప్రపంచం లో అతి పెద్ద మార్కెట్ కలిగిన చైనా ఇతరులను  తమ దేశంలోకి అడుగు పెట్టనీయటం లేదు. కొన్ని దేశాల్లో యాజమాన్య సాఫ్ట్ వేర్ వినియోగానికి బదులుగా ఫ్రీ సాఫ్ట్ వేర్,  స్వేచ్చా సాఫ్ట్ వేర్ వినియోగం పెరిగింది. చైనా తర్వాత భారతదేశం రెండవ అతి పెద్ద మార్కెట్ గా వున్నది.అందువల్ల బహుళ జాతి కంపెనీలు ఈ మార్కెట్ పై ఆసక్తిగా వున్నాయి. బహుళజాతి ఐటికంపెనీలు మన దేశంలో వ్యాపారం చేయటం వల్ల అనేక ప్రయోజనాలు పొంద కలుగుతున్నాయి.  మొదటగా భారతదేశం యాజమాన్య సాఫ్ట్ వేర్ వినియోగంలో ఆధిపత్యం కలిగివుంది. ఆచరణలో ప్రభుత్వం, ఐటి దిగ్గజాలు యాజమాన్య సాఫ్టవేర్ కు ఇచ్చినంత ప్రాధాన్యతను   స్వేచ్చా/ఫ్రీ సాఫ్ట్ వేర్ లకు  ఇవ్వటం లేదు.  రెండవ అంశం. భారతదేశంలోని అతి పెద్ద ఐటి కంపెనీలకు అత్యధిక ఆదాయం అవుట్ సోర్సింగ్ ద్వారానే వస్తుంది. అందువల్ల సాధారణంగా వాళ్ళకు దేశీయ మార్కెట్ పై ఆసక్తి వుండదు. అయినప్పటికీ  అవుట్ సోర్సింగ్ కు వినియోగించే సాఫ్ట్ వేర్ నిర్మాణం అనేక సందర్భాలలో అంత తేలికైన పని కాదు. భారతీయ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల కే ఆ నైపుణ్యం వుంది.కాని మనదేశంలో  నూతన  ఉత్పత్తుల నిర్మాణానికి పెద్ద ప్రోత్సాహం లేదు. బయట నుండి ఎగుమతి అవుతున్న సాఫ్ట్ వేర్  ఉత్పత్తుల స్థానంలో భారతదేశ సాఫ్ట్ వేర్ ఉత్పత్తులకు స్థానం కల్పించాలన్న సంకల్పం భారత ప్రభుత్వానికి లేదు.అవుట్ సోర్సింగ్ ద్వారా పొందకలిగే సత్వర ఆదాయాన్ని   ప్రైవేట్ ఐటి కంపెనీలు నూతన ఉత్పత్తుల ద్వారా పొందలేక పోవటం మూలంగా వాటి ఉత్పత్తిలో ఆసక్తి కనబరచటం లేదు. మూడవ అంశం.ఇతర దేశాల లాగా కాకుండా, బహుళజాతి సాఫ్ట్ వేర్ దిగ్గజాల సహకారంతో  అమెరికా సాగిస్తున్న నిఘా చర్యల్ని స్నోడేన్ బట్టబయలు చేసినప్పటికీ, భారత దేశం వాటినేమీ పట్టించు కోవడం లేదు. చివరి అంశం. భారత ప్రస్తుత  ప్రధాన మంత్రి,  పర్యవసానాలేమైనా భారత మార్కెట్ ను సాధ్యమైనంత త్వరగా బహుళజాతి సంస్థలకు అప్పచెప్పటానికి సిద్దమయ్యారు. బహుళజాతి ఐటి కంపెనీలకు భారత మార్కెట్, భారత ప్రధాన మంత్రి ప్రీతి పాత్రమైయ్యాయి. అమెరికన్ బహుళజాతి ఐటి కంపెనీల కలలకు మోడీ లో సమాధానం చూడ కలిగారన్న మోహన్ దాస్ పాయ్ ప్రకటనలో రెండవ సత్యం ఇక్కడ దొరుకుతుంది. అమెరికన్ కంపెనీల ప్రయోజనాలకు కొమ్ముగాస్తున్నాయి.  మోడీని అమెరికన్ మీడియా ఆనందంతో కీర్తించటం సర్వ సాధారణమైనది. మోడీ సిలికాన్ వ్యాలీ పర్యటనలో అదే జరిగింది. కాని మోడీ తన పర్యటనలో ఏమి చేసి ఉండాల్సింది ? దానికి బదులు ఆయన  అనంతమైన  విజ్ఞానాన్ని అందించకలిగే విద్యా సంస్థలు, అపారసంపదను పెట్టుబడిగాపెట్టగలిగే వెంచర్ పెట్టుబడిసంస్థలు,కేంద్రీకరింపబడ్డ నైపుణ్యసమూహాలన్నింటి  పరస్పర సమన్వయంతో అంకుర పరిశ్రమలు వారి ఆవిష్కరణలతో  సిలికాన్ వ్యాలిలో ఎలా వృద్ది కాగలిగాయో అధ్యయనం చేసి వుండాల్సింది. ఆయన సిలికాన్ వ్యాలీ చరిత్రను పరిశీలించి వుంటే, ఆ ప్రాంతాన్ని అభివృద్ది చేయటంలో అమెరికా ప్రభుత్వం నిర్వహించిన పాత్ర తెలిసి వుండేది. సాధారణంగా భారత కంపెనీలు నూతన ఆవిష్కరణలకు విముఖంగా వున్న ప్రాంతంలో  నూతన ఉత్పత్తుల నిర్మాణంలో ప్రభుత్వం నిర్వహించాల్సిన అదనపు పాత్రకు తగిన ప్రణాళికను మోడీ రచించకలిగే వారు. ఆ దిశలో మోడీ ఏమీ చేయటం లేదు. అనేక సందర్భాలలో మోడీ “భారత్ లో తయారీ”పై ప్రసంగిస్తుండే వారు. అనేక ఆవిష్కరణలు సిలికాన్ వ్యాలిలో చిన్నచిన్న  అంకుర పరిశ్రమల ద్వారానే సాధ్యమైందన్న వాస్తవాన్ని ఆయన అధ్యయనం చేస్తే అర్ధమయ్యేది. “భారత్ లో తయారీ” ప్రణాళిక విజయసాధనకు అటువంటి అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వవలసి వుంది. ఆ రకమైన ప్రోత్సాహాన్ని అందించటానికి తగిన ప్రభుత్వం విధానాలను ఆయన రూపొందించ వలసివుంది.  భారత దేశ ఐటి పరిశ్రమలలో మనం చూస్తున్న అభివృద్ది, సాఫ్ట్ వేర్ పార్క్ ఆఫ్ ఇండియా ద్వారా ఉద్భవించిన ఐటి పరిశ్రమ అనుకూల భారత ప్రభుత్వ పన్నుల విధానం ద్వారానే సంభవించింది.సాఫ్ట్ వేర్ పార్క్ ఆఫ్ ఇండియా క్రింద నమోదైన ఐటి కంపెనీ, అది చిన్నదైనా పెద్దదైనా, భారత్ లో వున్నా లేక పోయిన,అది ఎగుమతులు చేయకలిగితే పన్ను రాయితీలకు అర్హమైవుంటుంది. ఈ విధానం ద్వారా ప్రయోజనం పొందిన అనేక చిన్న కంపెనీలు భారీ కంపెనీలుగా పరిణామం చెందాయి( ఉదాహరణకు టి సి ఎస్, విప్రో, ఇన్ఫోసిస్ మొదలైనవి). గత యుపియే ప్రభుత్వం ఈ పన్ను రాయితీలను ఉపసంహరించుకుంది. ఈ పరిణామం చిన్న ఐటి కంపెనీలపై అధిక పన్ను భారాన్ని మోపుతూ అసమాన పోటీకి దారితీస్తుండగా, పెద్ద ఐటికంపెనీలు  అధిక పన్ను మినహాయిపులు,అనేక ఇతరరాయితీలను  అందిస్తున్న “ప్రత్యేక ఆర్ధిక మండళ్ళకు” తరలిపోయి అధిక ప్రయోజనాలు పొందకలుగు తున్నాయి.   ఒక్క చిన్న కంపెనీ కూడా ప్రత్యేక ఆర్ధిక మండలిలో 25 ఎకరాల కనిష్ఠ భూమిని కొనకలిగే స్థితిలో లేదు.డి ఎల్ ఎఫ్, షాపూర్జి పల్లోంజీ లాంటి  పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రత్యేక ఆర్ధిక మండళ్లలో కొంత స్థలం అద్దెలకు ఇస్తున్న, వారు డిమాండు చేస్తున్న అత్యధిక అద్దెలు భరించే స్థితిలో చిన్న కంపెనీలు లేవు. ఈ నేపధ్యంలో మోడీ ప్రభుత్వం గత యుపియే ప్రభుత్వం తీసికున్న చర్యలను రద్దు చేసి అంతకు ముందున్న స్థితిని పునరుద్దరిస్తుందా? లేదా భారీ, చిన్న కంపెనీలకు ఒకే రకమైన ప్రభుత్వ రాయితీలను పొందేటట్లు విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తుందా?? లేదు ఆయన అలా చేయరు. కాంగ్రెస్, బిజెపి లది ఒకే రకమైన ఆర్ధిక విధానం. బిజెపికి ఎన్నికలనిధి ఇవ్వకలిగే స్తోమత చిన్న కంపెనీలకు లేదు. అందువల్ల బిజెపి చిన్న కంపెనీలను ప్రోత్సహించే ప్రశ్నే ఉదయించదు. మోడీ ప్రకటించిన “భారత్ లో తయారీ” నినాదం ఆయన ప్రసంగాలలో తప్ప ఆచరణలో లేదు.


మోడీ సిలికాన్ వ్యాలి పర్యటన ఒక ఇచ్చి పుచ్చుకునే ప్రణాళిక. ప్రభుత్వ మద్దతుతో భారత దేశంలో తమ వ్యాపారాన్ని చేసికోమని బహుళజాతి ఐటి కంపెనీలకు మోడీ ఆహ్వానించారు. వాళ్ళు ఆయనకు అత్యధిక ప్రచార హోరును కల్పిస్తున్నారు. ఈ కంపెనీలన్నీ తమ దగ్గరున్న డేటాను/సమాచారాన్ని అమెరికా జాతీయ నిఘా సంస్థకుఎప్పడికప్పుడు అందచేస్తున్నారు. దానికి ప్రతిఫలంగా మోడీకి  ఇంటర్నెట్ లో సామాజిక మాధ్యమంలో అత్యధిక ప్రచారాన్ని ఇస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా జరిగే ప్రచారాన్ని అడ్డుకోవటం లేదా  ఆలస్యం చేయటం చేస్తున్నారు( తమకు కావలసినది 8 సెకండ్లలో రాక పోతే వినియగాదారులు మరో సైట్ కు మరలిపోతారు).  భారత దేశ  భారీఐటి కంపెనీలకు భారత్ మార్కెట్ కంటే అవుట్ సోర్సింగ్ పై  ఆసక్తితో ఉన్నందున, వాళ్ళు విదేశీ కంపెనీలతో సంబంధ బాంధవ్యాలను పెంచుకొని మనదేశం వెలుపల వారి మార్కెట్ ను విస్తరించుకుంటున్నారు. తమకు సంబంధబాంధవ్యాలున్న బహుళజాతి కంపెనీలను  మోడీ  భారతమార్కెట్ కు ఆహ్వానించటం సహజంగా భారతదేశ  భారీఐటికంపెనీలకు ఆనందంగా ఉంటుంది. ఇందుకోసం భారతదేశంలోకార్పొరేట్లు,కార్పోరేట్ మీడియా ల మద్దతు పొందటంలో మోడీ కి ఎటువంటి సమస్యా లేదు. నరేంద్ర మోడీ కి స్వంత ప్రచారానికి మించి, మన దేశం యొక్క నిజమైన అభివృద్ది సాధన ఆయన ఎజెండాలో వుండే ప్రశ్నే లేదు.

స్వేచ్చానువాదం : కొండముది లక్ష్మీ ప్రసాద్
డిసెంబర్ 2015 మార్కిస్టు సంచికలో ప్రచురింప బడింది