Tuesday, December 15, 2015

పారిస్‌ ఒప్పందం

పారిస్‌లో నవంబరు29న ప్రారంభమై డిసెంబరు12న ముగిసిన ప్రపంచ వాతావరణ సమావేశం ఒక ఒప్పందాన్ని ఆమోదించింది. దాని ప్రకారం 196 సభ్య దేశాలు ఏ ఒక్క కార్యాచరణకూ కట్టుబడనవసరం లేదు. ప్రతి దేశం తను విడుదల చేస్తున్న ఉద్గారాల నియంత్రణ గురించి స్వచ్ఛందంగా నివేదించేలా కట్టుబడనవసరంలేని లక్ష్యాలను నిర్దేశించారు. పెరుగుతున్న సముద్ర నీటిమట్టాలతో మునక ప్రమాదాన్ని, తీవ్రస్థాయిలో చెలరేగుతున్న తుపానులతో పెను విధ్వంసాలను ఎదుర్కొంటున్న పసిఫిక్‌ మహాసముద్రంలోని 20 ద్వీప దేశాలను, అదనంగా నిధులను ఏర్పాటుచేసి మోసపుచ్చారు. పారిస్‌ వాతావరణ ఒప్పందంలో నియంత్రించ వలసిన తాపం పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు బదులు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గించాలని గత సమావేశాలలో చేసిన ఈ దేశాల డిమాండ్‌ను చర్చల చివరి దశలో విస్మరించారు. 

పారిస్‌ వాతావరణ సమావేశం ప్రకటించిన ఒప్పందాన్ని సామ్రాజ్యవాద దేశాల నాయకులు అతిగా కీర్తిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కార్పొరేట్‌ మీడియా బాకా వూదుతోంది. చారిత్రకంగా భూగోళాన్ని కాలుష్యంతో నింపింది ఈ దేశాలే. అమెరికా అధ్యక్షుడు ఒబామా పారిస్‌ ఒప్పందాన్ని ఒక గొప్ప 'మలుపు'గా అభివర్ణించాడు. 'భూగోళం చరిత్రలో డిసెంబర్‌ 12, 2015 ఒక గొప్ప దినంగా మిగులుతుంది. అనేక శతాబ్దాల కాలంలో పారిస్‌లో అనేక విప్లవాలు జరిగాయి. ఈ రోజు వాతావరణ మార్పుకోసం సంభవించిన విప్లవం అన్నింటికంటే సుందరమైనది, అన్నిటికంటే శాంతియుతమైనది' అని ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఫ్రాన్సిస్‌ హోల్లాండ్‌ పేర్కొన్నాడు. ఒకవైపు 'శాంతియుత విప్లవం' గురించి మాట్లాడుతూనే మరోవైపు పర్యావరణ నిరసనకారులపై పోలీసు, మిలిటరీ బలగాలను ఉపయోగించి హోల్లాండ్‌ తన ఉక్కుపాదం మోపాడు.

'ఆపరేషన్‌ విజయవంతంగా జరిగింది. కానీ రోగి మరణించాడు' అన్నచందంగా పారిస్‌లో రెండు వారాలపాటు వాతావరణ సదస్సు జరిగిందని చెప్పవచ్చు. హోల్లాండ్‌, ఒబామా, ఇతర పెట్టుబడిదారీ దేశాల నాయకులు పారిస్‌ సమావేశాన్ని రాజకీయంగా నిర్వహించినతీరు గొప్పగా విజయవంతం అయింది. 'మనకున్న ఒకేఒక గ్రహం' భవిష్యత్తు కోసం శ్రమించే పర్యావరణ వాదులుగా ఈ దేశాల నాయకులు పోజుపెట్టటానికి పారిస్‌ సమావేశం ఉపయోగపడింది. అయితే రోగగ్రస్తమైన భూగ్రహం భవిష్యత్తు, ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థలో బందీగా ఉన్నంతకాలం ఆందోళనకరంగానే వుంటుంది. ప్రధాన దేశాల నాయకులకు ఏమి కావాలో అది పారిస్‌ సమావేశంలో దొరికింది. ప్రపంచ వాతావరణ క్షీణతను ఏమాత్రం అరికట్టకుండా కొంచెం ఖర్చుతోనే వాతావరణాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నట్టుగా నటించే అవకాశం ఈ సమావేశం కల్పించింది. స్థూలంగా చెప్పాలంటే పారిస్‌ వాతావరణ సదస్సు ప్రకటించిన ఒప్పందం వాతావరణ మార్పును, భూతాపాన్ని అరికట్టేందుకు చేసింది చాలా స్వల్పం. అనివార్యంగా తీసుకోవలసిన చర్యల గురించి దీనిలో ఆదేశాలు ఏమీలేవు. ఏ ప్రభుత్వమైనా, ఏ కంపెనీ అయినా తప్పనిసరిగా చేయవలసింది ఏమీలేదు.

పారిస్‌ వాతావరణ సదస్సు సాధించిన 'విజయం' ఏమంటే అది 2009లో జరిగిన కోపెన్‌హాగెన్‌ వాతావరణ సమావేశంలాగా బహిరంగంగా విఫలం కాకపోవటమే. అప్పటి సదస్సులో సామ్రాజ్యవాద దేశాలకు, చైనా, ఇండియా, బ్రెజిల్‌ వంటి వర్ధమాన దేశాలకు మధ్య ఏర్పడిన విభేదాలవల్ల అది పూర్తిగా విఫలమైంది. కోపెన్‌హాగెన్‌లో నేర్చుకున్న 'పాఠం'తో సామ్రాజ్యవాద దేశాలు ఇతర దేశాల ఆకాంక్షలను ముందుగానే పసిగట్టి ఎంత బలహీనమైనదైనప్పటికీ ఒక ఒప్పందాన్ని రూపొందించి దానిని ఒక పెద్ద ముందడుగుగా ప్రకటించింది. ఉద్గారాల విడుదలను తగ్గించుకునేందుకు సభ్యదేశాల స్వయం ప్రకటిత లక్ష్యాల ఆధారంగా ఒబామా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఒప్పందాన్ని రూపొందించారు. దీని 'అమలు'కు గల ఏకైక యంత్రాంగం ప్రపంచ ప్రజాభిప్రాయమే.

పారిస్‌ ఒప్పందానికి కట్టుబడనవసరంలేని స్వచ్ఛంద స్వభావం వుండటం సానుకూల అంశం అనే అభిప్రాయం కొందరిలో ఉన్నది. ఎందుకంటే అది ప్రయివేటు పెట్టుబడిని, ప్రయివేటు వాతావరణ పరిరక్షణా ప్రయత్నాలను ప్రోత్సహిస్తుంది గనుక. వాతావరణం నుంచి కార్బన్‌డైఆక్సైడ్‌ను తొలగించగలిగే నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటానికి సహకరిస్తామని మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ వంటి బిలియనీర్స్‌ చేసిన వాగ్దానాన్ని ఒబామా ప్రభుత్వం ప్రశంసించింది. 'మానవ విజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో విడుదల చేసేందుకు మార్కెట్లకు ఈ ఒప్పందం ఒక సూచికవంటిది'అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ బాన్‌ కీ-మూన్‌ వ్యాఖ్యానించాడు.
నిజానికి పెట్టుబడిదారీ లాభాల వ్యవస్థకు మారుపేరైన 'మార్కెట్లు' మానవ ప్రగతికి ప్రధాన అడ్డంకిగా వున్నాయి. విధ్వంసకర 'అభివృద్ధి' ద్వారా భూతాపాన్ని ప్రమాదకర స్థాయికి తెచ్చిన అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలే ప్రపంచ సంపదంతా కొద్దిమంది పెట్టుబడిదారీ బిలియనీర్ల చేతుల్లో పోగేసి పెట్టాయి. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలు పారిశ్రామికీకరణ కోసం చేసే ప్రతి ప్రయత్నాన్నీ ధనిక దేశాలు భూతాపం పేరుతో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. భూతాపాన్ని పెంచిన దేశాలే ఇప్పుడు తగ్గించేందుకు ప్రధాన బాధ్యత తీసుకోవాలి. ఇందుకు ప్రజల నుండి వత్తిడి పెంచటం తప్ప మరో మార్గం లేదు.


(నవతెలంగాణ -16.12. 2015 తేదీ సంపాదకీయం)

No comments: