Monday, December 21, 2015

'పారిస్‌' మన కొంప ముంచింది

 మేక్‌ ఇన్‌ ఇండియా కోసం ... దేశానికి హాని తెచ్చారు
- విజయం అమెరికాదే.. పేద దేశాలపైనే పెను భారం
- పారిస్‌ ఒప్పందంపై నీటి వనరుల సంరక్షకుడు, మెగాసెసే గ్రహీత రాజేంద్ర సింగ్‌ తీవ్ర అసంతృప్తి
 ప్రపంచ దేశాలను విపరీతంగా భయపెడుతున్న భూ తాపం, పర్యావరణ కాలుష్యం సమస్యలపై ఇటీవల ముగిసిన పారిస్‌ సదస్సులో కుదిరిన ఒప్పందంపై మన దేశంలో నీటి సంరక్షణ దీక్ష వహించిన రాజేంద్ర సింగ్‌ నిప్పులు కురిపించారు. నీటి నిల్వలను కాపాడే విషయంలో ఆయన చేసిన నిర్విరామ కృషికి గుర్తింపుగా మెగాసెసే అవార్డు రాజేందర్‌ సింగ్‌ను వరించిన విషయం తెలిసిందే. పారిస్‌ ఒప్పందం వల్ల కాలుష్య ప్రమాదం కన్నా అందుకు ప్రధాన కారణమైన అమెరికాకు మాత్రం చాలా ఎక్కువ ప్రయోజనాలనే సాధించిపెట్టిందని ఆయన ఆరోపించారు. నిజానికి వాతావరణం ఇంత ప్రమాదకరంగా తయారుకావడానికి ప్రధాన బాధ్యత అమెరికాదే, అయినా, ఆ సమస్య పరిష్కారానికి పేద దేశాలతో సహా అన్ని ఇతర దేశాలను ఈ సదస్సు ఒకే స్థాయిలో పరిగణించిందని, బాధ్యతల బరువును అందరి నెత్తిన పడేసిందని ఆయన ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అభిప్రాయం ప్రకారం పారిస్‌ ఒప్పందం అమెరికాకు ఘన విజయాన్నీ, భారత దేశానికి ఘోర పరాజయాన్ని కట్టబెట్టింది. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, నీటిని పవిత్రమైనదిగాను, అమూల్యమైనదిగాను ప్రేమించి, గౌరవించడం మన సంస్కృతి అన్న వాస్తవాన్ని ప్రభుత్వం విస్మరించిందని తప్పుపట్టారు. 


ఈ సదస్సు జరుగుతున్న సమయంలో పారిస్‌లోనే ఉన్న రాజేందర్‌ సింగ్‌ సదస్సు జరిగిన తీరును పరిశీలించి, గతంలో రియో డీ జెనీరియో, కోపన్‌హాగన్‌, క్యోటో సదస్సుల స్ఫూర్తికి విరుద్ధంగా సాగిందని ఆన్నారు. అమెరికా తన నేరానికి ప్రాయశ్చిత్తంగా దాని పరిష్కారంలో ప్రధాన జవాబుదారీ బాధ్యతను స్వీకరిస్తుందని అందరూ ఆశించారు. కాని ఆ బరువు బాధ్యతలు చివరికి పేద దేశాల నెత్తిన కూడా పడింది. 


దాదాపు 40 వేల మంది పాల్గొన్న సదస్సులో పర్యావరణం గురించి మాట్లాడింది తక్కువ, వ్యాపారపరమైన అంశాలపై జరిగిన చర్చలే ఎక్కువ అని ఆయన అన్నారు. గట్టిగా 400 మంది కూడా లేని ప్రత్యేక బృందం అందరి తరఫున నిర్ణయాలు తీసేసుకుందని రాజేందర్‌ సింగ్‌ ఆరోపించారు. ఇక ఇండియా విషయానికి వస్తే మన దేశంలోని పారిశ్రామిక రంగానికి చాలా ప్రధానమైన ఇంధనం కోసం బొగ్గు వినియోగానికి అనుమతి సంపాదించడమే లక్ష్యంగా చర్చల్లో పాల్గొన్నదని ఆయన ఎద్దేవా చేశారు. భూసారం గురించి కాని, నీటి వనరుల భద్రత గురించి కాని అక్కడ ప్రధానంగా చర్చ జరగనే లేదని ఆయన అన్నారు. ఇలా విద్యుత్‌ కోసం బొగ్గు వాడకం ప్రమాదకరం అనే విషయంలో ప్రపంచమంతా ఏకాభిప్రాయంతో ఉన్నా మన పాలకులు దానికోసమే ఈ ఒప్పందంపై సంతకాలు చేశారని ఆయన విమర్శించారు.

(21.12.2015 నవ తెలంగాణ పత్రిక నుండి స్వీకరణ)

No comments: