Monday, February 22, 2010

బడ్జెట్‌ పై అవగాహన - పరిచయం

సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల బడ్జెట్‌ పై ఉత్కంఠకు నెలవైంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి చివరి వారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్‌లను ప్రవేశపెడుతుంటాయి. ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ ఫిబ్రవరి 26 న సమర్పింపబడనున్నది. కేంద్ర బడ్జెట్‌ లోని కొన్ని అంశాలను స్ధూలంగా అర్ధంచేసుకోవటానికి ప్రయత్నిద్దాం

అంచనాలు :- ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించి బడ్జెట్‌లో మూడు రకాల అంచనాలు తారసపడుతాయి. 1. బడ్జెట్‌ అంచనాలు 2. సవరించిన అంచనాలు 3. వాస్తవ లేదా తుది అంచనాలు. ''బడ్జెట్‌ అంచనాలు'' రాబోయే సంవత్సరానికి అంటే 2010-2011కు సంబంధించినవి. బడ్జెట్‌ సమర్పించే సమయానికి పూర్తి సంవత్సరపు వాస్తవ వివరాలు అందుబాటులో వుండని కారణంగా జనవరి 2010 వరకు వాస్తవ లెక్కలకు రాబోయే 2 నెలల కాలానికి సంబంధించిన అంచనాలను కలుపుకొని ''సవరించిన అంచనాలు'' తయారుచేస్తారు. అంటే ఇవి 2009-2010 సం||కు సంబంధించినవి. ''వాస్తవ లేదా తుది అంచనాలు'' 2008-2009 సం||రానికి సంబంధించినవి అంటే క్రిందటి సం||రానికి సంబంధించిన వివిధ ఖాతాల వాస్తవ గణాంకాలు. చట్టసభలు కేవలం బడ్జెట్‌ అంచనాలను మాత్రమే చర్చించి, ఆమోదిస్తాయి.

గమనించాల్సిన అంశాలు :- 1. బడ్జెట్‌ అంచనాలను సవరించిన అంచనాలతోగాని, తుది అంచనాలతో గాని పోల్చకూడదు. సామాన్యంగా ఏ ప్రభుత్వాలైనా బడ్జెట్‌ లో కేటాయించబడ్డ అంచనాల మేరకు పూర్తిగా ఖర్చుపెట్టరు. అందువల్ల ప్రస్తుత బడ్జెట్‌ అంచనాలను, క్రితం సం|| సమర్పించిన బడ్జెట్‌ అంచనాలతోనే పోల్చాలి. సాధారణంగా పాలక వర్గాలు బడ్జెట్‌ అంచనాలను సవరించిన అంచనాలతోగాని, తుది అంచనాలతో గాని పోల్చుతూ బడ్జెట్‌ భ్రమల్ని సృష్టిస్తుంటాయి. 2. ప్రస్తుత బడ్జెట్‌ అంచనాలను గత సం|| బడ్జెట్‌ అంచనాలతో పోల్చేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని లెక్కలోనికి తీసుకొని విశ్లేషించాలి. 3. పెరిగిన అవసరాలు, ప్రాధాన్యతలకు తగ్గట్టు కేటాయింపులు ఉండాలికాని కేవలం గత సం|| కేటాయింపుల కంటే ఈ సం|| కేటాయింపులలో పెరుగుదలను, బడ్జెట్‌లో పెరుగుదలగా భావించకూడదు. 4. ప్రతియేడాది ప్రభుత్వ ఆదాయం సహజంగా పెరుగుతూనే ఉంటుంది. అందువల్ల కేటాయింపులలోను, రాబడిలోను ఈ పెరుగుదల తప్పనిసరిగా ప్రతిబింబింపబడాలి 5. ప్రభుత్వ ఆదాయ వ్యయాలను స్ధూలదేశీయోత్పత్తిలో శాతంగా చూడాలి. అదే సందర్భంలో మొత్తం ఆదాయ వ్యయాయలలో ప్రతి పద్దు యొక్క ఆదాయ వ్యయాలు ఎంత శాతం ఉన్నాయో విశ్లేషించి పోల్చుకోవాలి. 6. అత్యధికంగా ఉండే ప్రభుత్వ ఆదాయ వ్యయాలు సమాజంలోని ప్రజలపై సహజంగా గణనీయమైన ప్రభావాన్ని కల్గిస్తాయి. ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందనే దాని కంటే ఎలా ఖర్చు పెడుతున్నదో పరిశీలించడం ప్రధానమైనది. అందువలన ప్రభుత్వ వ్యయం పెరిగిందంటే ఎందుకు పెరిగిందో విశ్లేషించాలి. ప్రభుత్వ ఆదాయం పెరిగినా ఏఏ మార్గాల ద్వారా, ఏఏ ఖాతాలలో పెరిగిందో తెలుసుకోవటం కీలకమైంది.

ప్రభుత్వ ఆదాయాలు - పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయాలుగా ప్రభుత్వ ఆదాయాలను వర్గీకరించారు. పన్నుల ఆదాయం - ప్రత్యక్ష పన్నులు (సంపన్న వర్గాలపై విధించేవి - ఆదాయం పన్ను కార్పొరేట్‌ పన్ను వగైరా), పరోక్ష పన్నులు (సామాన్యులపై ప్రభావం కలిగించేవి - ఎక్సైజ్‌ సుంకం, కస్టమ్స్‌ సుంకం వగైరా) గా విభజించబడ్డాయి. పన్నేతర ఆదాయం - గ్రాంట్లు, వడ్డీలు, ప్రభుత్వ రంగ సంస్ధల ఆదాయం, యూజర్‌ చార్జీలు, సర్వీసు చార్జీలుగా ఉన్నాయి. యూజర్‌ చార్జీలు, సర్వీసు చార్జీలు పన్నుల భారం కంటే ఎక్కువగా ఉంటున్నది. సామాన్యంగా పన్నేతర ఆదాయం కంటే, పన్నుల ఆదాయాన్ని పరిశీలిస్తారు. ప్రస్తుతం పన్నేతర ఆదాయాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది.

ప్రభుత్వ ఆదాయం ఎంత పెరిగింది అనే దాని కంటే రావాల్సిన ఆదాయం ఎంత పోయింది అనే అంశాన్ని పరిశీలించాలి ప్రభుత్వ ఆదాయంలో ప్రత్యక్ష పరోక్ష పన్నుల నిష్పత్తి చూస్తారు. ఇది సామాన్యంగా 70:30 గా ఉంటుంది. విశ్లేషించాలి పన్నులు పెంచినంత మాత్రాన తప్పని, తగ్గించినంత మాత్రాన భేష్‌ అని మెచ్చుకోలేము. సామాన్యుడి దృష్ఠిలో పన్నుల ప్రభావాన్ని పరిశీలించాలి. ఇదే గీటురాయి.

రెవిన్యూ, మూలధన ఖాతాలు :- ఈ రెండు ఖాతాలలో ఆదాయం, వ్యయం రెండు ఉంటాయి.

1. ప్రభుత్వం ఇప్పటికే కల్పిస్తున్న సదుపాయాలను కొనసాగించటానికి అయ్యే వ్యయం రెవిన్యూ వ్యయంగాను, అదనంగా కల్పించే సదుపాయాలకు అయ్యే వ్యయాన్ని మూలధన వ్యయంగాను పరిగణిస్తారు. 2. పన్నులు,పన్నేతర మార్గాల ద్వారా వచ్చేది రెవిన్యూ ఆదాయం అంటారు. మూల ధన ఆదాయంలోని రాబడి దాదాపు 90% ప్రభుత్వం తీసుకొనే అప్పుల ద్వారా సమీకరించబడుతుంది. మిగతా 10% ఆదాయం ప్రభుత్వం తానుగా అప్పుయిచ్చిన వారినుండి తిరిగి వచ్చే చెల్లింపులు, ప్రభుత్వరంగ సంస్ధల వాటాల ద్వారా వచ్చే రాబడి. అప్పులు, పెట్టుబడి ఉపసంహరణ విధానాలు ప్రధానంగా ఉండే బడ్జెట్‌ లో మూలధన ఖాతా ఆదాయ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. రెవిన్యూ ఆదాయానికి మించిన వ్యయాన్ని రెవిన్యూ లోటని, మూల ధన ఖాతా ఆదాయం కంటే పెరిగిన వ్యయాన్ని మూల ధన లోటని, మొత్తం ఆదాయాలకు మించిన వ్యయాన్ని మొత్తం లోటని అంటారు. 1980 వరకు రెవిన్యూ లోటు అధిక ప్రాధాన్యతను పొందేది. ఆ కాలంలో ప్రభుత్వ లోటు పెరిగితే ప్రభుత్వమే దివాళా అనుకునేవారు. 1997 వరకు బడ్జెట్‌ లోటు భావన ప్రధానంగా ఉంది. ఆ తరువాత కాలంలో ద్రవ్యలోటు అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తం రెవిన్యూ, మూల ధన వ్యయాలకు, ఋణాలు మినహాయించిన మొత్తం రెవిన్యూ మూల ధన ఆదాయాల మధ్య ఉండే తేడాను స్ధూలద్రవ్య లోటు అంటారు. గత సం|| మునపటి వరకు ద్రవ్యలోటు ఆర్ధిక వ్యవస్ధకు గుదిబండగా వ్యవహరించేవారు. కాని ప్రపంచ ఆర్ధిక సంక్షోభ నేపధ్యంలో గత సంవత్సర బడ్జెట్‌లో ఈ ద్రవ్యలోటే ఆర్ధిక వ్యవస్ధ రక్షణకు కల్పతరువైంది.

అభివృద్ధి, అభివృద్దేతర వ్యయాలు :- ప్రభుత్వ వ్యయాన్ని రెవిన్యూ వ్యయం మూలధన వ్యయంగా కాకుండానే అభివృద్ధి వ్యయం, అభివృద్ధేతర వ్యయంగా కూడా వర్గీకరిస్తున్నారు. ఆర్ధిక వ్యవస్ధలో ఉత్పత్తిని, ఆదాయాలను ఉత్పాదకతను పెంచేవ్యయాన్ని అభివృద్ధి వ్యయం అంటారు. ప్రజల సంక్షేమానికి, పేదరిక నిర్మూలనకు ఉపయోగపడి, ప్రత్యక్షంగా ఉత్పత్తికి దోహదం చేయని ఖర్చును అభివృద్ధేతర వ్యయం అంటారు. సబ్సిడిలన్నీ అభివృద్దేతర వ్యయం కాదు. సబ్సిడి బియ్యం పై ఖర్చును అభివృద్ధేతర వ్యయంగా వర్గీకరిస్తారు. కాని ఎరువులపై సబ్సిడిని అభివృద్ధి వ్యయంగా పరిగణిస్తారు.

ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలు :- కేంద్ర ప్రభుత్వ వ్యయంలో అధిక భాగం ప్రణాళికేతర వ్యయంగా ఉంటుంది. ఈ ప్రణాళికేతర వ్యయంలో అత్యధిక భాగం వడ్డీల చెల్లింపులు. ఆ తరువాత స్ధానంలో రక్షణ , సబ్సిడి వ్యయాలుంటాయి. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయానికి ఖచ్చితమైన నిర్వచనం లేదు. ప్రభుత్వ అవగాహన ప్రకారం ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలు మారుతుంటాయి. ప్రభుత్వం అతి ప్రధానంగా భావించే అంశానికి పెట్టే వ్యయాన్ని ప్రణాళిక వ్యయంగా చూపుతారు. అత్యధిక ప్రాధాన్యత లేని వ్యయం ప్రణాళికేతర వ్యయం. ఎయిడ్స్‌ పై ఖర్చు ఒక సంవత్సరం ప్రణాళికా వ్యయం అవుతుండగా మరో సంవత్సరం ప్రణాళికేతర వ్యయంగా మారవచ్చు. బడ్జెట్‌ లో చూపే ప్రణాళిక వ్యయం మాత్రమే ప్రణాళిక కేటాయింపులు కాదు. ప్రభుత్వ రంగ సంస్ధకు బడ్జెట్‌లో 1000 కోట్లు కేటాయించబడి, ఆ ప్రభుత్వ రంగ సంస్ధ తన సొంత వనరుల నుండి 500 కోట్లు కేటాయిస్తే మొత్తం ప్రణాళికా కేటాయింపు 1500 కోట్లు అవుతుంది. ప్రణాళిక వ్యయానికి, ప్రణాళిక కేటాయింపులకు మధ్య ఉన్న తేడాను గమనించాలి.


Tuesday, February 16, 2010

పెట్టుబడుల ఉపసంహరణ - ఫ్రెంచ్‌ వేలం పద్ధతి

ప్రభుత్వ రంగ సంస్థల వాటాల ఉపసంహరణ యుపిఏ రెండవ దఫా ప్రభుత్వ విధానాలలో కీలక స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచ ఆర్ధిక సంక్షోభ నేపధ్యంలో కొంత ఆలస్యమైనప్పటికి, తిరిగి ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంటున్న క్రమంలో ఈ ప్రక్రియ వేగంగా ముందుకు వస్తుంది. వాటాల ఉపసంహరణకు ప్రభుత్వం ఇంతవరకు ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపిఒ), ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఎఫ్‌పిఒ) పద్ధతులను పాటిస్తూ వచ్చింది. తాజాగా ఫ్రెంచ్‌ ఆక్షన్‌ పద్ధతిని పాటించనున్నట్లు పెట్టుబడుల ఉపసంహరణశాఖ కార్యదర్శి ప్రకటించారు.

ఫ్రెంచ్‌ వేలం పద్ధతి: అత్యధిక ఆదాయం పొందటం లక్ష్యంగా రూపొందించిన వేలం పద్ధతి ఇది. 1960వ దశకంలో ఫ్రాన్స్‌లో ఈ పద్ధతిలో వాటాల ఉపసంహరణ ప్రక్రియ విజయంతమైంది. అప్పటి నుండి దీనిని ఫ్రెంచ్‌ వేలం పద్ధతిగా పిలుస్తున్నారు. ఇతర పద్ధతులలో లాగా బిడ్‌లకు ఆఫర్‌ చేసే వాటాధరపై, వాటాల కేటాయింపుపై ఉండే పరిమితులు ఫ్రెంచ్‌ వేలం పద్ధతిలో ఉండవు. ఇతర పద్ధతులలో షేర్‌ ధర (ప్రైస్‌ బ్యాండ్‌) అందరికి సమానంగా ఉండగా, ఫ్రెంచ్‌ పద్ధతిలో షేర్‌ ధర మదుపుదారులందరికి సమానంగా ఉండదు. విభిన్న రకాల షేర్‌ ధరలు, విభిన్న షేర్ల పరిమాణంతో బిడ్‌లు, కేటాయింపులు ఉంటాయి. అత్యధిక ధరకు బిడ్‌ వేసిన వారికి కోరినన్ని వాటాలను మంజూరు చేస్తు, అవరోహణ క్రమంలో షేర్లకు ఆఫర్‌ చేసిన బిడ్‌ ధరల ప్రాతినిధ్యంలో వాటాలు కేటాయించబడుతాయి. సమర్ధత కలిగి, కంపెనీ శక్తి సామర్ధ్యాలను సరిగ్గా అంచనా వేయగలిగే ఆర్ధిక స్ధోమత కల్గినవారికే ఫ్రెంచ్‌ వేలం పద్ధతి ఉపయుక్తంగా ఉంటుంది. అదే సందర్భంలో వాటాలను జారీచేస్తున్న కంపెనీ అత్యధిక మొత్తాలలో పెట్టుబడుల ఆదాయం పొందకల్గుతుంది.

ఫ్రెంచ్‌ వేలం పద్ధతిలో యన్‌.టి.పి.సి అనుభవం: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలలో యన్‌.టి.పి.సి నవరత్న స్ధాయి కల్గిన సంస్ధ. విద్యుదుత్పత్తి రంగంలో అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలు గడించిన దిగ్గజంగా ప్రసిద్ధికెక్కింది. 31-03-2009 నాటికి రూ. 49,000 కోట్ల రిజర్వ్‌ నిధులుండి, క్రిత సంవత్సరం నుండి రిజర్వ్‌ నిధులు రూ. 5,000 కోట్లు పెంచుకొని, రూ. 15,000 కోట్ల నగదు బ్యాంకు బాలెన్స్‌లు కలిగి ఉంది. ప్రభుత్వ విధానంలో భాగంగా యన్‌.టి.పి.సి తన వాటాలలో 5శాతాన్ని ఉపసంహరణకు ప్రకటించి అందులో భాగంగా 41.2 కోట్ల వాటాలను (షేర్లు) ఫాలోఆన్‌ ఆఫరింగ్‌ క్రింద అమ్మకానికి పెట్టింది. వీటిలో 20.4 కోట్ల వాటాలను రిటైల్‌ మదుపుదారులు, హైనెట్‌ వర్త్‌ వ్యక్తులకు, మిగిలిన వాటాలను ''క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ బయ్యర్స్‌'' (క్యూ. ఐ.బి)కు కేటాయించింది. రిటైల్‌ మదుపుదారులు హై నెట్‌వర్త్‌ వ్యక్తులకు మంత్రుల బృందం నిర్ణయించిన ఫ్లోర్‌ ధరకు అమ్మకానికి పెట్టింది. క్యూ.ఐ.బిలకు కేటాయించిన వాటాలను ఫ్రెంచ్‌ వేలం పద్ధతిలో విక్రయించటానికి నిర్ణయించింది. ఈ పరిణామాలు యన్‌.టి.పి.సి వాటాల ఉపసంహరణ పై దేశవ్యాప్తంగా పెట్టుబడి మార్కెట్‌లో తీవ్ర సంచలనాన్ని కలిగించాయి.

ఇంతటి సంస్ధ పబ్లిక్‌ ఆఫరింగ్‌కు వెళ్ళుతుండటంతో మదుపుదారులలో ఉత్సాహం,ఆసక్తి సహజంగా రేకెత్తుతాయి. డిశంబరు 2009లో ఫాలోఆన్‌ ఆఫర్‌కు సెబీలో నమోదు చేసుకొని రికార్డు సమయంలో జనవరి 2010లో పబ్లిక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి 3-5 తేదిలలో బిడ్డింగ్‌ ప్రక్రియను సైతం పూర్తిచేసుకుంది.

కాని వివిధ అంచనాలకు భిన్నంగా రూ. 8,300 కోట్ల విలువ కలిగి, 41.2 కోట్ల షేర్లు ఆఫర్‌ చేసిన ఈ కంపెనీకి ఆచరణలో 49.36 కోట్ల షేర్లు మాత్రమే బిడ్డింగ్‌ అయ్యాయి. అంటే 1.2 రెట్లు మాత్రమే అదనపు గిరాకీ (ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌) పలికింది. యన్‌.టి.పి.సి కీర్తి ప్రతిష్టలకు ఈ స్ధాయి మదుపుదారుల స్పందన అందరిని నిరుత్సాహపర్చింది. రిటైల్‌, హైనెట్‌ వర్త్‌ వ్యక్తులకు కేటాయించిన 20.4 కోట్ల షేర్లకు గాను కేవలం 1.3 కోట్ల షేర్లు మాత్రమే బిడ్డింగ్‌(బిఎస్‌సి గణాంకాల ఆధారంగా) అయ్యాయి. క్యూ.ఐ.బి. కేటగిరి మదుపుదారులలో కూడా మొదటిరోజు ఉన్న ఉత్సాహం మిగిలిన 2 రోజులు కానరాకపోయినా యఫ్‌.పి.ఓలో నిధుల సమీకరణకు ఫ్రెంచ్‌ వేలం పద్ధతి కొంత మేరకు ఉపయోగపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ముగింపు: ఆర్ధిక సంక్షోభం మొదలైన తరువాత 85% విదేశీ సంస్ధాగత మదుపుదారుల పెట్టుబడులు ప్రైమరీ మార్కెట్లలోనే కేంద్రీకరించబడ్డాయి. విదేశీ సంస్ధాగత మదుపుదారులను ఆకర్షించి అధిక ఆదాయం పొందాలనే లక్ష్యంతో విడుదల చేసిన యన్‌.టి.పి.సి ని దేశీయ ఆర్ధిక సంస్థలైన యల్‌.ఐ.సి., బ్యాంకులు అత్యధికంగా గట్టెకించాయి. సంస్ధాగత మదుపుదారులకు, రిటైల్‌ మదుపుదారులకు మధ్య సమతుల్యతను సాధిస్తూ, అధిక ఆదాయాలను ఆర్జించాలనే లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. అలాగని నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(యన్‌.యం.డి.సి), రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పోరేషన్‌(ఆర్‌.ఇ.సి)లలో పెట్టుబడుల ఉపసంహరణపై మార్చిలోగా నిర్మించుకున్న రోడ్‌ మ్యాప్‌ నుండి ప్రభుత్వం వెనుకంజ వేసే పరిస్థతి కనిపించటంలేదు. రాబోయే బడ్జెట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసే సూచనలు అధికంగా ఉన్నాయి. ఫ్రెంచ్‌ పద్ధతైనా, మరొకటైనా వాటాల అమ్మకం వలన లబ్ధి పొందుతున్నది స్టాక్‌మార్కెట్‌ను నియంత్రించే ప్రధాన శక్తులే తప్ప సామాన్యులు కాదు

Friday, February 5, 2010

ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌- ఒక పరిశీలన

సామ్రాజ్యవాద ప్రపంచీ కరణ, సంక్షోభంలో కూరుకు పోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ బ్యాంకింగ్‌ గురించిన చర్చ తెరమీదకు వచ్చింది. ఈ చర్చలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కాలంలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు విస్తరించింది. ప్రపంచ ప్రఖ్యాత బ్యాంకులు సైతం ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ డివిజన్లను ఏర్పాటు చేశాయి. కాని పిడుగులా మీదపడ్డ దుబారువరల్డ్‌ ఉదంతంతో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ మనుగడపై కారుమబ్బులు కమ్ముకున్నాయి.

ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ఆవిర్భావం: ముస్లిం మత సూత్రాల ప్రాతిపదికన నిర్వహించబడే ఇస్లామిక్‌ ఆర్థిక వ్యవస్థలో భాగంగా ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ఉనికి లోనికి వచ్చింది. 1200 సంవత్సరాల క్రితం బాగ్దాద్‌, డెమస్కస్‌, ఫెజ్‌ మరియు కోర్డోబాలలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాలు జరిగిన ఆధారాలు ఉన్నాయి. మొదటి తరహా ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ సంస్థలు 1960లో పిలిగ్రిమ్స్‌ ఫండ్స్‌ రూపంలో మలేషియాలోనూ, మిట్‌ఖమర్‌ సేవింగ్‌ బ్యాంక్‌గా ఈజిప్టులోనూ వెలిశాయి. 1970లలో సంభవించిన ''మొదటి చమురు సంక్షోభం'' పరిణామాలతో చమురు ఉత్పత్తి చేసే అరబ్‌ దేశాలు నడమంత్రపు సిరులని చేజిక్కించుకోవటంతో ఇస్లామిక్‌ ఫైనాన్స్‌, ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థలు విస్తరించాయి. 1974లో దుబారు ఇస్లామిక్‌ బ్యాంక్‌ ఆవిర్భవించింది. 1974లో ఏర్పాటు చేయబడ్డ ఇస్లామిక్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ వివిధ దేశాలలోని ఇస్లామిక్‌ బ్యాంక్‌ల కార్యకలాపాలను అనుసంధానం చేస్తూ 1976 నుండి తన కార్యక్రమాలను విస్తృత పరచింది.

ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ లక్షణాలు: ముస్లీం మతాచారాలను నిర్దేశిస్తున్న షరియత్‌ సూత్రాలననుసరించి వడ్డీ(రిబా) నిషేధంతో ఆ స్థానంలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ రంగంలో ప్రత్యామ్నాయ పద్ధతులు సృష్టించబడ్డాయి. ప్రపంచంలోనే అన్ని ఇస్లామిక్‌ బ్యాంకులు వడ్డీరహిత సూత్రాన్ని విధిగా పాటిస్తున్నాయి. వివిధ దేశాలలోని చట్టాలు, బ్యాంకుల పరిమాణం, బ్యాంకుల లక్ష్యాలు, విదేశీ బ్యాంకుల పోటీ తట్టుకోవటంలాంటి పరిస్థితులలో రకరకాలుగా ఇస్లామిక్‌ బ్యాంక్‌ తీరుతెన్నులు మారుతున్నాయి. వడ్డీరహిత ఇస్లామిక్‌ బ్యాంకులలో అనుసరిస్తున్న కొన్ని సర్వసామాన్య అంశాల్ని పరిశీలిద్దాం.

1) కరెంట్‌ ఎకౌంట్‌ ఖాతాలు సాంప్రదాయ బ్యాంకులలోలాగా ఉండి, సేవింగ్స్‌ బ్యాంక్‌ల ఎకౌంట్లో మాత్రం స్థిరమైన లాభానికి హామీ ఇవ్వటం లేదు. డిపాజిట్‌దారుల అనుమతితో వారి సొమ్మును ఇతర రంగాలలో పెట్టుబడులు పెడుతుంది. పెట్టుబడి తిరిగిచ్చే గ్యారెంటీ ఉండదు కానీ తక్కువ రిస్కు కలిగిన ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టి నష్టాల భారాన్ని సాధ్యమైనంతగా అదుపు చేస్తున్నారు. లాభాలు వస్తే పంచుతున్నారు.

2) ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌లో అత్యధిక ప్రాచుర్యం కలిగినవి ఇస్లామిక్‌ బాండ్‌లు. వీటిని సుకుక్‌లు అని అంటారు. మామూలు బాండ్‌లలో నిర్ణీత సమయంలో అసలు, వడ్డీ ఇచ్చే ఏర్పాటు ఉంటుంది. కాని సుకుక్‌లలో పెట్టుబడి సొమ్ము ఖచ్ఛితంగా తిరిగి ఇచ్చే గ్యారెంటీ ఉండదు. ఆ సొమ్మును ఒక ఆస్తిలోనూ, వ్యాపారంలోనూ, పరిశ్రమలోనూ బ్యాంక్‌ అజమాయిషీతో పెట్టుబడి పెట్టటం జరుగుతుంది. డిపాజిట్‌దారులు ఆ సంస్థలలో వాటాదారులుగా ఉంటారు. సంవత్సరాంతానికి వచ్చిన లాభనష్టాలను డిపాజిట్‌దారులకు పెట్టుబడి నిష్పత్తిలో పంచుతారు. అందువల్ల లాభనష్టాలని డిపాజిట్‌దారులు విధిగా భరించాల్సి ఉంటుంది. షరియత్‌ సూత్రాలననుసరించి పెట్టుబడులను అత్యధిక రిస్కు కలిగిన విధంగా వినియోగించకూడదన్న షరియత్‌ సూత్రంతో కనీస రిస్కు కలిగిన రియల్‌ఎస్టేట్‌లలో ఈ పెట్టుబడులను పెడుతున్నారు. సుకుక్‌దారుల పెట్టుబడులు సురక్షితంగానూ, లాభదాయకంగానూ ఉంటాయనేది మదుపుదారుల అనుభవం, విశ్వాసం.

3) లీజింగ్‌ పద్ధతి: శక్తివంతమైన ఋణ గ్రహీతకు అతనికి కావలసిన ఆస్తులని/వస్తువులని కొని ఒక నిర్ణీత సమయానికి బ్యాంకు లీజుకిస్తుంది. ఋణ గ్రహీత నుండి వాయిదాలలో లీజు మొత్తాన్ని వసూలు చేస్తుంది. నిర్ణీత సమయం పూర్తిఅయినాక అంగీకరించిన మొత్తాన్ని వసూలు చేసుకున్నాక హక్కుని లీజుదారునికి బదలాయిస్తారు. సాంప్రదాయ బ్యాంకింగ్‌లో డబ్బును ఋణ గ్రహీతకు ఇవ్వటంలా కాకుండా ఆస్థిని ఏర్పరచటం ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ ప్రత్యేక లక్షణంగా చెపుతారు.

4) ముషరకా: ఇదొక జాయింట్‌ వెంచర్‌లాంటిది. వ్యాపార సంస్థతో బ్యాంక్‌ భాగస్వామ్యం కుదుర్చుకొని పెట్టుబడిని పెట్టి, ఆ వ్యాపార లాభాల నుండి పెట్టుబడిని, కొంత లాభాన్ని సంపాదించిన తరువాత బ్యాంకు ఒప్పందం నుండి నిష్క్రమిస్తుంది.

5) ముదరభా: ఈ పద్ధతిలో సాంకేతిక పరిజ్ఞానం, వనరుల కార్మికుల యాజమాన్యం, నైపుణ్యాలను వ్యాపార సంస్థ ఏర్పాటు చేస్తుంది. పూర్తి ఆర్థిక మద్ధతును బ్యాంకు అందిస్తుంది. లాభాల భాగస్వామ్యం ముందే నిర్ణయించబడుతుంది. నష్టాలు వస్తే బ్యాంకు భరిస్తుంది.

6) ఇవి కాక ఆధునిక బ్యాంకింగ్‌ పద్ధతులైన లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌, హైర్‌ పర్చేజ్‌, సేల్‌ అండ్‌ బై బ్యాక్‌ లాంటి ప్రక్రియలను ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌లో అమలు చేస్తున్నారు. వడ్డీ స్థానంలో లాభాలలో వాటాలను పొందుతున్నారు. ఇవే కాకుండా సర్వీస్‌ ఛార్జీలు విధిస్తూ వ్యక్తిగత ఋణాలను అందిస్తున్నారు. చిన్న వ్యాపారులు, వ్యవసాయదారులు, మత్స్య వృత్తిలోని అణగారిన ప్రజానీకంలోని కొందరికి సర్వీసు ఛార్జీలు లేకుండా వివిధ ఋణాల్ని విధిగా ఇస్లామిక్‌ బ్యాంకులు ఇవ్వాల్సి ఉంటుంది.

7) షరియత్‌ సూత్రాలననుసరించి జూద ప్రవృత్తి గల రంగాలలో పెట్టుబడులు నిషేధించిన కారణంగా బ్యాంకింగ్‌ పెట్టుబడులు డెరివేటీవ్‌లాంటి అత్యధిక రిస్కు కలిగిన రంగాలకు విస్తరించకపోవటం ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌కు రక్షణగా ఉంది.

8) ద్రవ్యమంతా(డబ్బు) ఆస్తులలో మార్చటం మూలకంగా ఇస్లామిక్‌ ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదక పెట్టుబడికి పెద్దపీట వేయటం జరిగింది. దీని కారణంగా అంతర్జాతీయ ఫైనాన్స్‌ పెట్టుబడి నీలినీడలు ఈ వ్యవస్థపై పరిమితంగా పడ్డాయి.

ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ అభివృద్ధి: 2008, 2009 ప్రథమార్ధంలో ప్రపంచవ్యాప్త ద్రవ్య సంక్షోభ తుపానుకు ఇస్లామిక్‌ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినకుండా ఉన్నాయని విశ్లేషకులు భావించారు. 2009 బ్యాంకు సర్వేలో 500 ఇస్లామిక్‌ ఫైనాన్షియల్‌ సంస్థల ఆస్తులు 2008 కంటే 28.6% అభివృద్ధిని సాధించాయి. ఈ పెరుగుదల గత 3 సంవత్సరాలుగా నికరంగా సాధించబడుతున్నది. అదే సందర్భంలో ప్రపంచంలోని వెయ్యి అతిపెద్ద బ్యాంకులు 2008లో 21.6% అభివృద్ధి చెంది 2009లో 6.8 శాతమే అభివృద్ధి నమోదు చేసుకున్నాయి. 3 సంవత్సరాల పాటు నికరంగా సాగిన ఇస్లామిక్‌ బ్యాంకుల ప్రగతిలో షరియత్‌ చట్ట పరిధిలో సృజనాత్మకంగా సృష్టించిన కొన్ని సాధనాలు ఉపయోగపడగా వాటి ఆవిష్కరణలో ఇస్లామిక్‌ మేధావుల పాత్ర కూడా ఉంది. ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ పెట్టుబడులు ఒక ట్రిలియన్‌ డాలర్ల స్థాయిని మించినా ప్రపంచ బ్యాంకింగ్‌ వ్యవస్థలో దీని పాత్ర స్వల్పమైంది. ఎక్కువ భాగం ముస్లిం దేశాలకు పరిమితమైంది.ఇరాన్‌, సౌదీ అరేబియా, మలేషియా ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌లో ముందుండగా కువైట్‌, బెహ్రాన్‌, మలేషియా ఇస్లామిక్‌ ఫైనాన్షియల్‌ సంస్థల నిర్వహణలో ప్రాధాన్యతను వహిస్తున్నాయి.

నయా ఉదారవాద విధానాల ప్రభావాలు: ఆధునిక బ్యాంకింగ్‌ వ్యవస్థలో స్పెక్యులేషన్‌, జూద ప్రవృత్తి అధికంగా ఉంటున్నది. ఈ ధోరణలు ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌లో అంతగా కనబడటంలేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో రియల్‌ఎస్టేట్‌ రంగం కూడా అత్యధిక స్పెక్యులేషన్‌కు గురికావటంతో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌పై నయా ఉదారవాద విధానాల ప్రాబల్యం పడింది. దుబారు అనుసరించిన ఆర్థిక నమూనా ఈ చక్రబంధంలో చిక్కుకొని దుబారు వరల్డ్‌ సంస్థ 26 బిలియన్‌ డాలర్ల అప్పును తిరిగి చెల్లించటాన్ని వాయిదా వేసింది. వీటిలో 3.52 బిలియన్‌ డాలర్ల సుకుక్‌ బాండ్‌ల విలువలపై చెల్లించాల్సిన 4.5 బిలియన్‌ డాలర్ల అప్పు ఇరుక్కు పోయింది. సురక్షితంగానూ, లాభదాయకంగానూ ఇంతకాలం ఉన్న సుకుక్‌ల మనుగడ ప్రశ్నార్థకమవటంతో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ భవితవ్యం సందేహాల సుడిగుండంలోకి నెట్టబడింది. అదే సందర్భంలో సుకుక్‌ల నిర్మాణంలోనూ షరియత్‌ చట్టాల ఉల్లంఘన ఉన్నట్లు అనేక నివేదికలు బహిర్గతమయ్యాయి. ప్రముఖ షరియత్‌ మేధావి షేక్‌ మహమ్మద్‌ తఖి ఉస్మాని సుకుక్‌లలో 85% షరియత్‌ చట్టాలకు కట్టుబడి లేవని విమర్శించారు. అదే సందర్భంలో పశ్చిమ ఆసియాలోని ఇస్లామిక్‌ అధినేతలు తమ పెట్టుబడుల్ని లండన్‌లాంటి మెట్రో సెంటర్లకు తరలించటం కూడా వింటున్నాము. ప్రపంచ ద్రవ్య సంక్షోభంతో కుదేలైన బ్యాంకులు సైతం ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ డివిజన్‌లను ఏర్పాటు చేసి ఆయిల్‌ సొమ్మును హస్తగతం చేసుకోవటానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ భవితవ్యం ప్రశ్నార్థకమైంది.