Tuesday, February 16, 2010

పెట్టుబడుల ఉపసంహరణ - ఫ్రెంచ్‌ వేలం పద్ధతి

ప్రభుత్వ రంగ సంస్థల వాటాల ఉపసంహరణ యుపిఏ రెండవ దఫా ప్రభుత్వ విధానాలలో కీలక స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచ ఆర్ధిక సంక్షోభ నేపధ్యంలో కొంత ఆలస్యమైనప్పటికి, తిరిగి ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంటున్న క్రమంలో ఈ ప్రక్రియ వేగంగా ముందుకు వస్తుంది. వాటాల ఉపసంహరణకు ప్రభుత్వం ఇంతవరకు ఇనిషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపిఒ), ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఎఫ్‌పిఒ) పద్ధతులను పాటిస్తూ వచ్చింది. తాజాగా ఫ్రెంచ్‌ ఆక్షన్‌ పద్ధతిని పాటించనున్నట్లు పెట్టుబడుల ఉపసంహరణశాఖ కార్యదర్శి ప్రకటించారు.

ఫ్రెంచ్‌ వేలం పద్ధతి: అత్యధిక ఆదాయం పొందటం లక్ష్యంగా రూపొందించిన వేలం పద్ధతి ఇది. 1960వ దశకంలో ఫ్రాన్స్‌లో ఈ పద్ధతిలో వాటాల ఉపసంహరణ ప్రక్రియ విజయంతమైంది. అప్పటి నుండి దీనిని ఫ్రెంచ్‌ వేలం పద్ధతిగా పిలుస్తున్నారు. ఇతర పద్ధతులలో లాగా బిడ్‌లకు ఆఫర్‌ చేసే వాటాధరపై, వాటాల కేటాయింపుపై ఉండే పరిమితులు ఫ్రెంచ్‌ వేలం పద్ధతిలో ఉండవు. ఇతర పద్ధతులలో షేర్‌ ధర (ప్రైస్‌ బ్యాండ్‌) అందరికి సమానంగా ఉండగా, ఫ్రెంచ్‌ పద్ధతిలో షేర్‌ ధర మదుపుదారులందరికి సమానంగా ఉండదు. విభిన్న రకాల షేర్‌ ధరలు, విభిన్న షేర్ల పరిమాణంతో బిడ్‌లు, కేటాయింపులు ఉంటాయి. అత్యధిక ధరకు బిడ్‌ వేసిన వారికి కోరినన్ని వాటాలను మంజూరు చేస్తు, అవరోహణ క్రమంలో షేర్లకు ఆఫర్‌ చేసిన బిడ్‌ ధరల ప్రాతినిధ్యంలో వాటాలు కేటాయించబడుతాయి. సమర్ధత కలిగి, కంపెనీ శక్తి సామర్ధ్యాలను సరిగ్గా అంచనా వేయగలిగే ఆర్ధిక స్ధోమత కల్గినవారికే ఫ్రెంచ్‌ వేలం పద్ధతి ఉపయుక్తంగా ఉంటుంది. అదే సందర్భంలో వాటాలను జారీచేస్తున్న కంపెనీ అత్యధిక మొత్తాలలో పెట్టుబడుల ఆదాయం పొందకల్గుతుంది.

ఫ్రెంచ్‌ వేలం పద్ధతిలో యన్‌.టి.పి.సి అనుభవం: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలలో యన్‌.టి.పి.సి నవరత్న స్ధాయి కల్గిన సంస్ధ. విద్యుదుత్పత్తి రంగంలో అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలు గడించిన దిగ్గజంగా ప్రసిద్ధికెక్కింది. 31-03-2009 నాటికి రూ. 49,000 కోట్ల రిజర్వ్‌ నిధులుండి, క్రిత సంవత్సరం నుండి రిజర్వ్‌ నిధులు రూ. 5,000 కోట్లు పెంచుకొని, రూ. 15,000 కోట్ల నగదు బ్యాంకు బాలెన్స్‌లు కలిగి ఉంది. ప్రభుత్వ విధానంలో భాగంగా యన్‌.టి.పి.సి తన వాటాలలో 5శాతాన్ని ఉపసంహరణకు ప్రకటించి అందులో భాగంగా 41.2 కోట్ల వాటాలను (షేర్లు) ఫాలోఆన్‌ ఆఫరింగ్‌ క్రింద అమ్మకానికి పెట్టింది. వీటిలో 20.4 కోట్ల వాటాలను రిటైల్‌ మదుపుదారులు, హైనెట్‌ వర్త్‌ వ్యక్తులకు, మిగిలిన వాటాలను ''క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ బయ్యర్స్‌'' (క్యూ. ఐ.బి)కు కేటాయించింది. రిటైల్‌ మదుపుదారులు హై నెట్‌వర్త్‌ వ్యక్తులకు మంత్రుల బృందం నిర్ణయించిన ఫ్లోర్‌ ధరకు అమ్మకానికి పెట్టింది. క్యూ.ఐ.బిలకు కేటాయించిన వాటాలను ఫ్రెంచ్‌ వేలం పద్ధతిలో విక్రయించటానికి నిర్ణయించింది. ఈ పరిణామాలు యన్‌.టి.పి.సి వాటాల ఉపసంహరణ పై దేశవ్యాప్తంగా పెట్టుబడి మార్కెట్‌లో తీవ్ర సంచలనాన్ని కలిగించాయి.

ఇంతటి సంస్ధ పబ్లిక్‌ ఆఫరింగ్‌కు వెళ్ళుతుండటంతో మదుపుదారులలో ఉత్సాహం,ఆసక్తి సహజంగా రేకెత్తుతాయి. డిశంబరు 2009లో ఫాలోఆన్‌ ఆఫర్‌కు సెబీలో నమోదు చేసుకొని రికార్డు సమయంలో జనవరి 2010లో పబ్లిక్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి 3-5 తేదిలలో బిడ్డింగ్‌ ప్రక్రియను సైతం పూర్తిచేసుకుంది.

కాని వివిధ అంచనాలకు భిన్నంగా రూ. 8,300 కోట్ల విలువ కలిగి, 41.2 కోట్ల షేర్లు ఆఫర్‌ చేసిన ఈ కంపెనీకి ఆచరణలో 49.36 కోట్ల షేర్లు మాత్రమే బిడ్డింగ్‌ అయ్యాయి. అంటే 1.2 రెట్లు మాత్రమే అదనపు గిరాకీ (ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌) పలికింది. యన్‌.టి.పి.సి కీర్తి ప్రతిష్టలకు ఈ స్ధాయి మదుపుదారుల స్పందన అందరిని నిరుత్సాహపర్చింది. రిటైల్‌, హైనెట్‌ వర్త్‌ వ్యక్తులకు కేటాయించిన 20.4 కోట్ల షేర్లకు గాను కేవలం 1.3 కోట్ల షేర్లు మాత్రమే బిడ్డింగ్‌(బిఎస్‌సి గణాంకాల ఆధారంగా) అయ్యాయి. క్యూ.ఐ.బి. కేటగిరి మదుపుదారులలో కూడా మొదటిరోజు ఉన్న ఉత్సాహం మిగిలిన 2 రోజులు కానరాకపోయినా యఫ్‌.పి.ఓలో నిధుల సమీకరణకు ఫ్రెంచ్‌ వేలం పద్ధతి కొంత మేరకు ఉపయోగపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ముగింపు: ఆర్ధిక సంక్షోభం మొదలైన తరువాత 85% విదేశీ సంస్ధాగత మదుపుదారుల పెట్టుబడులు ప్రైమరీ మార్కెట్లలోనే కేంద్రీకరించబడ్డాయి. విదేశీ సంస్ధాగత మదుపుదారులను ఆకర్షించి అధిక ఆదాయం పొందాలనే లక్ష్యంతో విడుదల చేసిన యన్‌.టి.పి.సి ని దేశీయ ఆర్ధిక సంస్థలైన యల్‌.ఐ.సి., బ్యాంకులు అత్యధికంగా గట్టెకించాయి. సంస్ధాగత మదుపుదారులకు, రిటైల్‌ మదుపుదారులకు మధ్య సమతుల్యతను సాధిస్తూ, అధిక ఆదాయాలను ఆర్జించాలనే లక్ష్యం పూర్తిగా నెరవేరలేదు. అలాగని నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(యన్‌.యం.డి.సి), రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పోరేషన్‌(ఆర్‌.ఇ.సి)లలో పెట్టుబడుల ఉపసంహరణపై మార్చిలోగా నిర్మించుకున్న రోడ్‌ మ్యాప్‌ నుండి ప్రభుత్వం వెనుకంజ వేసే పరిస్థతి కనిపించటంలేదు. రాబోయే బడ్జెట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను మరింత వేగవంతం చేసే సూచనలు అధికంగా ఉన్నాయి. ఫ్రెంచ్‌ పద్ధతైనా, మరొకటైనా వాటాల అమ్మకం వలన లబ్ధి పొందుతున్నది స్టాక్‌మార్కెట్‌ను నియంత్రించే ప్రధాన శక్తులే తప్ప సామాన్యులు కాదు

No comments: