Monday, February 22, 2010

బడ్జెట్‌ పై అవగాహన - పరిచయం

సాధారణంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల బడ్జెట్‌ పై ఉత్కంఠకు నెలవైంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి చివరి వారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వార్షిక బడ్జెట్‌లను ప్రవేశపెడుతుంటాయి. ఈ సంవత్సరం కేంద్ర బడ్జెట్‌ ఫిబ్రవరి 26 న సమర్పింపబడనున్నది. కేంద్ర బడ్జెట్‌ లోని కొన్ని అంశాలను స్ధూలంగా అర్ధంచేసుకోవటానికి ప్రయత్నిద్దాం

అంచనాలు :- ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించి బడ్జెట్‌లో మూడు రకాల అంచనాలు తారసపడుతాయి. 1. బడ్జెట్‌ అంచనాలు 2. సవరించిన అంచనాలు 3. వాస్తవ లేదా తుది అంచనాలు. ''బడ్జెట్‌ అంచనాలు'' రాబోయే సంవత్సరానికి అంటే 2010-2011కు సంబంధించినవి. బడ్జెట్‌ సమర్పించే సమయానికి పూర్తి సంవత్సరపు వాస్తవ వివరాలు అందుబాటులో వుండని కారణంగా జనవరి 2010 వరకు వాస్తవ లెక్కలకు రాబోయే 2 నెలల కాలానికి సంబంధించిన అంచనాలను కలుపుకొని ''సవరించిన అంచనాలు'' తయారుచేస్తారు. అంటే ఇవి 2009-2010 సం||కు సంబంధించినవి. ''వాస్తవ లేదా తుది అంచనాలు'' 2008-2009 సం||రానికి సంబంధించినవి అంటే క్రిందటి సం||రానికి సంబంధించిన వివిధ ఖాతాల వాస్తవ గణాంకాలు. చట్టసభలు కేవలం బడ్జెట్‌ అంచనాలను మాత్రమే చర్చించి, ఆమోదిస్తాయి.

గమనించాల్సిన అంశాలు :- 1. బడ్జెట్‌ అంచనాలను సవరించిన అంచనాలతోగాని, తుది అంచనాలతో గాని పోల్చకూడదు. సామాన్యంగా ఏ ప్రభుత్వాలైనా బడ్జెట్‌ లో కేటాయించబడ్డ అంచనాల మేరకు పూర్తిగా ఖర్చుపెట్టరు. అందువల్ల ప్రస్తుత బడ్జెట్‌ అంచనాలను, క్రితం సం|| సమర్పించిన బడ్జెట్‌ అంచనాలతోనే పోల్చాలి. సాధారణంగా పాలక వర్గాలు బడ్జెట్‌ అంచనాలను సవరించిన అంచనాలతోగాని, తుది అంచనాలతో గాని పోల్చుతూ బడ్జెట్‌ భ్రమల్ని సృష్టిస్తుంటాయి. 2. ప్రస్తుత బడ్జెట్‌ అంచనాలను గత సం|| బడ్జెట్‌ అంచనాలతో పోల్చేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని లెక్కలోనికి తీసుకొని విశ్లేషించాలి. 3. పెరిగిన అవసరాలు, ప్రాధాన్యతలకు తగ్గట్టు కేటాయింపులు ఉండాలికాని కేవలం గత సం|| కేటాయింపుల కంటే ఈ సం|| కేటాయింపులలో పెరుగుదలను, బడ్జెట్‌లో పెరుగుదలగా భావించకూడదు. 4. ప్రతియేడాది ప్రభుత్వ ఆదాయం సహజంగా పెరుగుతూనే ఉంటుంది. అందువల్ల కేటాయింపులలోను, రాబడిలోను ఈ పెరుగుదల తప్పనిసరిగా ప్రతిబింబింపబడాలి 5. ప్రభుత్వ ఆదాయ వ్యయాలను స్ధూలదేశీయోత్పత్తిలో శాతంగా చూడాలి. అదే సందర్భంలో మొత్తం ఆదాయ వ్యయాయలలో ప్రతి పద్దు యొక్క ఆదాయ వ్యయాలు ఎంత శాతం ఉన్నాయో విశ్లేషించి పోల్చుకోవాలి. 6. అత్యధికంగా ఉండే ప్రభుత్వ ఆదాయ వ్యయాలు సమాజంలోని ప్రజలపై సహజంగా గణనీయమైన ప్రభావాన్ని కల్గిస్తాయి. ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందనే దాని కంటే ఎలా ఖర్చు పెడుతున్నదో పరిశీలించడం ప్రధానమైనది. అందువలన ప్రభుత్వ వ్యయం పెరిగిందంటే ఎందుకు పెరిగిందో విశ్లేషించాలి. ప్రభుత్వ ఆదాయం పెరిగినా ఏఏ మార్గాల ద్వారా, ఏఏ ఖాతాలలో పెరిగిందో తెలుసుకోవటం కీలకమైంది.

ప్రభుత్వ ఆదాయాలు - పన్నుల ఆదాయం, పన్నేతర ఆదాయాలుగా ప్రభుత్వ ఆదాయాలను వర్గీకరించారు. పన్నుల ఆదాయం - ప్రత్యక్ష పన్నులు (సంపన్న వర్గాలపై విధించేవి - ఆదాయం పన్ను కార్పొరేట్‌ పన్ను వగైరా), పరోక్ష పన్నులు (సామాన్యులపై ప్రభావం కలిగించేవి - ఎక్సైజ్‌ సుంకం, కస్టమ్స్‌ సుంకం వగైరా) గా విభజించబడ్డాయి. పన్నేతర ఆదాయం - గ్రాంట్లు, వడ్డీలు, ప్రభుత్వ రంగ సంస్ధల ఆదాయం, యూజర్‌ చార్జీలు, సర్వీసు చార్జీలుగా ఉన్నాయి. యూజర్‌ చార్జీలు, సర్వీసు చార్జీలు పన్నుల భారం కంటే ఎక్కువగా ఉంటున్నది. సామాన్యంగా పన్నేతర ఆదాయం కంటే, పన్నుల ఆదాయాన్ని పరిశీలిస్తారు. ప్రస్తుతం పన్నేతర ఆదాయాన్ని కూడా పరిశీలించాల్సి ఉంది.

ప్రభుత్వ ఆదాయం ఎంత పెరిగింది అనే దాని కంటే రావాల్సిన ఆదాయం ఎంత పోయింది అనే అంశాన్ని పరిశీలించాలి ప్రభుత్వ ఆదాయంలో ప్రత్యక్ష పరోక్ష పన్నుల నిష్పత్తి చూస్తారు. ఇది సామాన్యంగా 70:30 గా ఉంటుంది. విశ్లేషించాలి పన్నులు పెంచినంత మాత్రాన తప్పని, తగ్గించినంత మాత్రాన భేష్‌ అని మెచ్చుకోలేము. సామాన్యుడి దృష్ఠిలో పన్నుల ప్రభావాన్ని పరిశీలించాలి. ఇదే గీటురాయి.

రెవిన్యూ, మూలధన ఖాతాలు :- ఈ రెండు ఖాతాలలో ఆదాయం, వ్యయం రెండు ఉంటాయి.

1. ప్రభుత్వం ఇప్పటికే కల్పిస్తున్న సదుపాయాలను కొనసాగించటానికి అయ్యే వ్యయం రెవిన్యూ వ్యయంగాను, అదనంగా కల్పించే సదుపాయాలకు అయ్యే వ్యయాన్ని మూలధన వ్యయంగాను పరిగణిస్తారు. 2. పన్నులు,పన్నేతర మార్గాల ద్వారా వచ్చేది రెవిన్యూ ఆదాయం అంటారు. మూల ధన ఆదాయంలోని రాబడి దాదాపు 90% ప్రభుత్వం తీసుకొనే అప్పుల ద్వారా సమీకరించబడుతుంది. మిగతా 10% ఆదాయం ప్రభుత్వం తానుగా అప్పుయిచ్చిన వారినుండి తిరిగి వచ్చే చెల్లింపులు, ప్రభుత్వరంగ సంస్ధల వాటాల ద్వారా వచ్చే రాబడి. అప్పులు, పెట్టుబడి ఉపసంహరణ విధానాలు ప్రధానంగా ఉండే బడ్జెట్‌ లో మూలధన ఖాతా ఆదాయ ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. రెవిన్యూ ఆదాయానికి మించిన వ్యయాన్ని రెవిన్యూ లోటని, మూల ధన ఖాతా ఆదాయం కంటే పెరిగిన వ్యయాన్ని మూల ధన లోటని, మొత్తం ఆదాయాలకు మించిన వ్యయాన్ని మొత్తం లోటని అంటారు. 1980 వరకు రెవిన్యూ లోటు అధిక ప్రాధాన్యతను పొందేది. ఆ కాలంలో ప్రభుత్వ లోటు పెరిగితే ప్రభుత్వమే దివాళా అనుకునేవారు. 1997 వరకు బడ్జెట్‌ లోటు భావన ప్రధానంగా ఉంది. ఆ తరువాత కాలంలో ద్రవ్యలోటు అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. మొత్తం రెవిన్యూ, మూల ధన వ్యయాలకు, ఋణాలు మినహాయించిన మొత్తం రెవిన్యూ మూల ధన ఆదాయాల మధ్య ఉండే తేడాను స్ధూలద్రవ్య లోటు అంటారు. గత సం|| మునపటి వరకు ద్రవ్యలోటు ఆర్ధిక వ్యవస్ధకు గుదిబండగా వ్యవహరించేవారు. కాని ప్రపంచ ఆర్ధిక సంక్షోభ నేపధ్యంలో గత సంవత్సర బడ్జెట్‌లో ఈ ద్రవ్యలోటే ఆర్ధిక వ్యవస్ధ రక్షణకు కల్పతరువైంది.

అభివృద్ధి, అభివృద్దేతర వ్యయాలు :- ప్రభుత్వ వ్యయాన్ని రెవిన్యూ వ్యయం మూలధన వ్యయంగా కాకుండానే అభివృద్ధి వ్యయం, అభివృద్ధేతర వ్యయంగా కూడా వర్గీకరిస్తున్నారు. ఆర్ధిక వ్యవస్ధలో ఉత్పత్తిని, ఆదాయాలను ఉత్పాదకతను పెంచేవ్యయాన్ని అభివృద్ధి వ్యయం అంటారు. ప్రజల సంక్షేమానికి, పేదరిక నిర్మూలనకు ఉపయోగపడి, ప్రత్యక్షంగా ఉత్పత్తికి దోహదం చేయని ఖర్చును అభివృద్ధేతర వ్యయం అంటారు. సబ్సిడిలన్నీ అభివృద్దేతర వ్యయం కాదు. సబ్సిడి బియ్యం పై ఖర్చును అభివృద్ధేతర వ్యయంగా వర్గీకరిస్తారు. కాని ఎరువులపై సబ్సిడిని అభివృద్ధి వ్యయంగా పరిగణిస్తారు.

ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలు :- కేంద్ర ప్రభుత్వ వ్యయంలో అధిక భాగం ప్రణాళికేతర వ్యయంగా ఉంటుంది. ఈ ప్రణాళికేతర వ్యయంలో అత్యధిక భాగం వడ్డీల చెల్లింపులు. ఆ తరువాత స్ధానంలో రక్షణ , సబ్సిడి వ్యయాలుంటాయి. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయానికి ఖచ్చితమైన నిర్వచనం లేదు. ప్రభుత్వ అవగాహన ప్రకారం ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాలు మారుతుంటాయి. ప్రభుత్వం అతి ప్రధానంగా భావించే అంశానికి పెట్టే వ్యయాన్ని ప్రణాళిక వ్యయంగా చూపుతారు. అత్యధిక ప్రాధాన్యత లేని వ్యయం ప్రణాళికేతర వ్యయం. ఎయిడ్స్‌ పై ఖర్చు ఒక సంవత్సరం ప్రణాళికా వ్యయం అవుతుండగా మరో సంవత్సరం ప్రణాళికేతర వ్యయంగా మారవచ్చు. బడ్జెట్‌ లో చూపే ప్రణాళిక వ్యయం మాత్రమే ప్రణాళిక కేటాయింపులు కాదు. ప్రభుత్వ రంగ సంస్ధకు బడ్జెట్‌లో 1000 కోట్లు కేటాయించబడి, ఆ ప్రభుత్వ రంగ సంస్ధ తన సొంత వనరుల నుండి 500 కోట్లు కేటాయిస్తే మొత్తం ప్రణాళికా కేటాయింపు 1500 కోట్లు అవుతుంది. ప్రణాళిక వ్యయానికి, ప్రణాళిక కేటాయింపులకు మధ్య ఉన్న తేడాను గమనించాలి.


No comments: