Monday, March 29, 2010

ధరల స్థిరీకరణ నిధి-పరిచయం

ధరలు ఆకాశాన్నంటుతూ, రెండంకెల ఆహార ద్రవ్యోల్భణం ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నది. మూలిగే నక్కపై తాటికాయలా కిరిట్‌ పారిఖ్‌ కమిటీ నివేదిక పెట్రోలియం ఉత్పత్తుల ధరలను సరళీకరించమంటూ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు అమలైతే పెట్రోలియం ఉత్పత్తులపై ఇప్పుడున్న సబ్సిడి తొలగింపబడి వంటగ్యాస్‌ ధర రూ. 100 లు, కిరోసిన్‌ లీటర్‌కు రూ. 6 లు, పెట్రోల్‌ లీటరుకు రూ. 3 లు, డీజిల్‌ లీటర్‌కు రూ. 3-4 లు పెరిగే అవకాశం ఉంది. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం తన బడ్జెట్‌లో పెట్రోలు, డీజిల్‌ ధరలపై పెంచిన పన్ను ప్రతిపాదనలు మండే ధరల అగ్నికి ఆజ్యం పోశాయి. ఈ నేపధ్యంలో ధరల అదుపు చర్యల పై చర్చిస్తున్న వివిధ ప్రత్యామ్నాయాలలో ''ధరల స్ధిరీకరణ నిధి'' ముఖ్యమైన అంశంగా ముందుకొచ్చింది. వామపక్ష పార్టీలు ఈ ప్రతిపాదనకు సూత్రధారులుగా నిలబడ్డాయి.

ధరల స్థిరీకరణ నిధి(ప్రైసెస్‌ స్టెబిలైజెషన్‌ ఫండ్‌)

16వ శతాబ్దంలో సముద్రయాన అంతర్జాతీయ వాణిజ్యం అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంటున్న కారణంగా ప్రాథమిక సరుకులైన వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల ధరలు తీవ్రమైన అనిశ్చితికి గురౌతుండేవి. ''అంతర్జాతీయ వాణిజ్యంలో సరుకుల ధరలలోని అనిశ్ఛితి, గొప్ప దురాచారంగా'' ఆ రోజుల్లో కీన్స్‌ వర్ణించారు. ఆ దశలో ''ధరల స్థిరీకరణ నిధి'' ప్రక్రియ ముందుకొచ్చింది. వాణిజ్యం ఉత్సాహంగా ఉండి ఎగుమతులు ఊపుగా ఉన్న సమయంలో, సరుకు ధరలలో కొంత భాగాన్ని ఈ నిధికి జమకట్టేవారు. వాణిజ్యం మందకొడిగా ఉండి, ఎగుమతుల ధరలు గిట్టుబాటుకాని రోజుల్లో ఈ స్థిరీకరణ నిధి నుండి కొంత భాగాన్ని నష్టపరిహారంగా ఎగుమతిదారులకు ముట్టజెప్పేవారు. ఈ ప్రక్రియ అంతిమంగా ఎగుమతి దారులు/ఉత్పత్తి దారుల ప్రయోజనాల్ని కాపాడటానికి వినియోగింపబడేది.

ధరల స్థిరీకరణ నిధి రూపంలో ఆయిల్‌ పూల్‌ ఖాతా

1970 దశకంలో నెలకొన్న చమురుషాక్‌కు గురైన వివిధ దేశాలలో నెలకొన్న పెట్రోలియం ధరల అనిశ్చితి నుండి ఆర్థిక వ్యవస్ధను కాపాడుకోవటానికి ధరల స్థిరీకరణ నిధి రూపంలో ఆయిల్‌ పూల్‌ ఖాతాను ఏర్పాటు చేసుకున్నారు. ప్రారంభంలో ఈ నిధికి కొంత ప్రభుత్వ సొమ్మును కేటాయించుకొని, అంతర్జాతీయ పెట్రోలియం ధరలు తగ్గినప్పుడు, తగ్గిన మేరకు సొమ్మును ఈ నిధికి జమ చేసేవారు. ధరలు పెరిగినప్పుడు నిధిలోని సొమ్ముతో పెరిగిన ధరలను స్థిరీకరించుకొని మార్కెట్‌ వడిదుడుకులతో నిమిత్తం లేకుండా చమురు ధరలు నియంత్రించుకొనేవారు. ఈ ఆయిల్‌ పూల్‌ ఖాతాకు అనుసంధానంగా నియంత్రిత ధరల యంత్రాంగం (అడ్మినిస్ట్రేటివ్‌ ప్రైస్‌ మెకానిజం) ఉండేది. ఈ రెండు స్తంభాలపై దశాబ్దాల పాటు వినియోగదారుల ప్రయోజనాలను రక్షిస్తూ పెట్రోలియం ధరలుండేవి.

నయాఉదారవాద విధానాల నీడలో పెట్రోలియం ధరలు-

1997 నుండి హైస్పీడ్‌ డీజిల్‌, విమాన టర్బైన్‌ చమురును, 2002 నుండి పెట్రోలును నియంత్రిత యంత్రాంగం నుండి తొలగించారు. అదే సందర్భంలో ఆయిల్‌ పూల్‌ ఎకౌంట్‌ లోని మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ కన్‌సాలిడేటెడ్‌ ఫండ్‌కు జమచేసారు. ఈ చర్యలకు ఉపక్రమించిన ఆనాటి ఎన్డీయే ప్రభుత్వం ఆయిల్‌ పూల్‌ ఎకౌంట్‌ పరిధి నుండి వంట గ్యాస్‌, కిరోసిన్‌, డీజిల్‌, పెట్రోల్‌లను తొలగించింది. పెట్రోల్‌ డీజిల్‌ ధరలను మార్కెట్‌ శక్తులకు వదిలేసి, కిరోసిన్‌ వంటగ్యాస్‌ ధరలను ప్రభుత్వమే నిర్ణయిస్తున్నది. వీటిపై వచ్చే నష్టాలను చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు అప్పచెప్పింది. ప్రస్తుతం చమురు కంపెనీలను నష్టాలనుండి బయట పడవేయటమనే నెపంతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను సరళీకరించటానికి కేంద్ర ప్రభుత్వం పూనుకొంది.

ఈ నేపథ్యంలో 2005 వ సం||లో వామపక్ష పార్టీల ప్రోద్బలంతో పెట్రోలియం మంత్రిత్వ శాఖకు అనుబంధమైన స్టాండింగ్‌ కమిటీ పెట్రోలియం ధరల నియంత్రణపై సిఫార్సులు చేసింది. అందులో కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. 1.క్రూడ్‌ఆయిల్‌ పై విధిస్తున్న సెస్‌ను భారతదేశ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌కు జమచేయరాదు. ఆ సొమ్ముతో ''ప్రత్యేక ధరల స్థిరీకరణ నిధిని'' ఏర్పాటు చేసి, దీని ద్వారా పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌, కిరోసిన్‌ ధరలను నియంత్రించాలి. ప్రతి సంవత్సరం క్రూడ్‌ ఆయిల్‌పై వసూలు చేస్తున్న సెస్‌ను ఈ నిధికి అనివార్యంగా జమచేయాలి. 2. సామాన్యుడి ప్రయోజనం కోసం ప్రజా పంపిణి లోని కిరోసిన్‌, గృహవినియోగ వంట గ్యాస్‌ పై పూర్తి సబ్సిడీలను కొనసాగించాలి. 3. సామాన్యుడి జీవన ప్రమాణాలను నిర్దేశించే చమురు రంగం నుండి పన్నుల రూపంలో విచక్షణా రహితంగా రెవిన్యూను వసూలు చేయరాదు.

మార్చి 2004 నాటికి క్రూడాయిల్‌ పై రూ. 51,007 కోట్ల సెస్‌ వసూలు చేసినట్లు, ఇందులో ఆయిల్‌ డెవలప్‌మెంట్‌ బోర్డుకు రూ. 902 కోట్లు ఖర్చు చేసినట్లు స్టాండింగ్‌ కమిటి నిర్ధారించింది. ఈ సొమ్ముకు తదుపరి సంవత్సరాలలో పోగుపడే క్రూడాయిల్‌ సెస్‌ను కలుపుకుంటే పెరిగిన పెట్రోలియం ధరలను సమర్థవంతంగా నియంత్రించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి సంవత్సరము సుమారు రూ.7500 కోట్ల క్రూడాయిల్‌ సెస్‌ వసూలు చేయబడుతున్నది.

ముగింపు

అనేక ఎగుమతి ఆధారిత రంగాలలో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు చేయబడింది. కొలంబియా, చిలీ, రష్యన్‌ ఫెడరేషన్‌ లాంటి దేశాలలో వివిధ సందర్భాలలో ఈ ప్రక్రియను ఈ మధ్య కాలంలో వినియోగించుకున్నారు. ఈ భావం ఆవిర్భావం నుండి మార్కెట్‌ ఒడుదుడుకుల నుండి ఉత్పత్తి దారుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ధరల స్థిరీకరణ నిధి అమలు జరిగింది. ప్రపంచీకరణ కారణంగా సామాన్య ప్రజానీకం పై పెరుగుతున్న భారాల నుండి విముక్తి కోసం చమురు రంగంలో ధరల స్థిరీకరణ నిధి వినియోగదారుల ప్రయోజనాల రక్షణకు ఉపయోగపడింది. కాని చమురు ధరల నియంత్రణలో ధరల స్థిరీకరణ నిధి ప్రక్రియ ప్రయివేట్‌ పెట్టుబడుల లాభార్జనకు అడ్డంకిగా తయారయినందున ప్రయివేటీకరణ విధానాలతో మన దేశంలో ఈ వ్యవస్థను ధ్వంసం చేయపూనుకున్నారు.

Sunday, March 21, 2010

సార్వభౌమ రుణం - సంపన్న దేశాలు

దుబాయ్ తో మొదలై గ్రీస్‌ తదితర యూరోపియన్‌ యూనియన్‌ దేశాలలో నెలకొన్న తీవ్ర ఆర్థిక పరిణామాల నేపథó్యంలో ''సార్వభౌమ రుణం'' (సావరిన్‌ డెట్‌), దాని ప్రభావాల పై ప్రపంచ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతున్నది.

సార్వభౌమ రుణం అంటే - యుద్ధాల కోసం ఆర్థిక వనరులు, ఆర్ధికాభివృద్ధి కోసం పెట్టుబడులు, రోజువారి ప్రభుత్వ నిర్వహణ ఖర్చుల కోసం వివిధ ప్రభుత్వాలు రుణ మార్గాన్ని ఎంచుకోవటం సర్వసాధారణమైనది. ఈ రుణ సేకరణలో దేశీయ వనరుల నుండి దేశీయ కరెన్సీలో పొందే రుణాల్ని ప్రభుత్వ రుణం (గవర్నమెంటు డెట్‌) అంటారు. ఈ ప్రభుత్వ రుణాన్ని బాండులు, సెక్యూరిటీలు తదితర సాధనాల ద్వారా సమీకరిస్తారు. ఈ రుణ సాధనాలు దేశీయ కరెన్సీలోనే చలామణి అవుతాయి. విదేశాలనుండి పొందే ఋణాలకు, కొన్ని దేశాలలో నెలకొనే అదుపు లేని ద్రవ్యోల్బణం, అనిశ్చిత మైన విదేశీ మారక విలువల కారణంగా స్ధిరమైన విదేశీ కరెన్సీలలోనే ఈ విదేశీ రుణ బాండులను జారీ చేస్తారు. వీటిని సార్వభౌమ బాండులు (సావరిన్‌ బాండ్‌లు) అంటారు. 1980లలో వీటికి మంచి గిరాకీ ఉండేది. ఈ సార్వభౌమ బాండులపై చెల్లించాల్సిన రుణ మొత్తాన్ని (సావరిన్‌ డెట్‌) ''సార్వభౌమ రుణం'' అంటారు. క్లుప్తంగా చెప్పుకోవాలంటే జాతీయ ప్రభుత్వాలు, విదేశీ ప్రభుత్వాలు/సంస్ధల నుండి పొంది విదేశీ మారక ద్రవ్యంలో చలామణి అయ్యే రుణం ఇది. దీంతో పాటు వివిధ ప్రభుత్వాలు, ప్రవేట్‌ పెట్టుబడికి విదేశాలు/సంస్ధలనుండి పొందే రుణాలకు గ్యారంటీని స్తున్నాయి. ఇటువంటి రుణాల్ని కూడా సార్వభౌమ రుణాలుగా పరిగణిస్తారు. సార్వభౌమ బాండులపై అసలు గాని వడ్డీని గాని నిర్ణీత తేదిన తిరిగి చెల్లించలేక పోవటాన్ని సార్వభౌమ రుణ చెల్లింపు వైఫల్యం (సావరిన్‌ డిఫాల్ట్‌) అని అంటారు. సార్వభౌమ రుణ చెల్లింపు వైఫల్యాలు సార్వభౌమ రుణ సంక్షోభాలుగా పరిమాణం చెంది, అంతిమంగా ఆర్థిక సంక్షోభా లకు దారి తీయొచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో రుణ చెల్లింపు వైఫల్యాలు సాధారణ అంశంగా కూడా పరిగణించ బడుతున్నాయి.

సార్వభౌమ రుణ లక్షణాలు - 1. సార్వభౌమ రుణాలకు ప్రభుత్వ హామి ఉన్నందున, రుణాల తిరిగి చెల్లింపుపై రుణ దాతలకు అత్యంత విశ్వాసం ఉన్న కారణంగా రుణాలు సురక్షితాలుగా భావింపబడతాయి. దీని వల్ల రుణాలు పొందాల్సిన దేశాలకు రుణ సమీకరణ సులభతరమవుతుంది. 2. వ్యక్తులు, సంస్థలకు ఇచ్చిన రుణాలు సక్రమంగా తిరిగి చెల్లింపబడనట్లయితే, రుణాన్ని రాబట్టుకోవడం కోసం కోర్టుల నాశ్రయించడం లేదా ఆస్తుల జప్తులాంటి చర్యలకు పాల్పడ టానికి వీలుంటుంది. కాని సార్వభౌమ రుణాలను సక్రమంగా చెల్లించని దేశాలపై ఇటువంటి చర్యలు చేపట్టటం సాధ్యపడక, రుణాల్ని రీ షెడ్యూల్‌ చేయడం గాని లేదా మాఫి చేయడం గాని అనివార్యమవుతుంది. అందువల్లే అంతర్జాతీయ ద్రవ్య సంస్ధలు రుణాలని ఇచ్చేటప్పుడు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థ లను గుప్పెట్లో పెట్టుకొనే చర్యలకు పూనుకుంటాయి.3. ఒక దేశ రుణాన్ని స్థూల దేశీయోత్పత్తిలో (జి.డి.పి) శాతంగా కొలు స్తారు. యూరోపియన్‌ యూనియన్‌ ప్రమాణాలలో యూరప్‌ దేశాల సాధారణ రుణం (దేశీయ, విదేశీ రుణం) జి.డి.పిలో 60% మించితే ఆ దేశ ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో పడిన ట్లుగా భావిస్తారు. గతంలో రుణ సంక్షోభంలో చిక్కుకున్న వివిధ దేశాల అనుభవాల ఆధారంగా, ఒక దేశం సార్వభౌమ రుణం ఆ దేశ స్థూలదేశీయోత్పత్తిలో 49.7 % మించితే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ రుణ సంక్షోభంలో పడినట్లు నిపుణులు విశ్లేషి స్తున్నారు. 4. 1980లలో లాటిన్‌ అమెరికా దేశాలలో రుణాలు అందించే బూమ్‌ పూర్తయినాకా రుణాల చెల్లింపు వైఫల్యాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు సర్వేలు తెలియచేస్తున్నాయి.

5. 1980లలో కొన్ని దేశాలలో రుణ సంక్షోభాలు విదేశీ మారక నిల్వల కరెంటు అకౌంటు ఖాతా అమితంగా పెరుగుతున్న కారణంగా ఏర్పడ్డాయి. కాని 1990లలో విదేశీ మారక నిల్వల పెట్టుబడి ఖాతా లోటు పెరుగుతున్న కారణంగా కూడా సార్వభౌమ రుణ సంక్షోభాలు నెలకొంటున్నట్లు ఆర్థిక నిపుణు లు గుర్తించారు. 6. ఇంత వరకు నెలకొన్న రుణ సంక్షో భాలలో అత్యధిక శాతం, కరెన్సీ సంక్షోభాలు మొదలైన తరువాత సార్వభౌమ రుణ సంక్షోభాలు తీవ్రమయ్యాయి. నయా ఉదార వాద విధానాల ప్రభావంగా పెట్టుబడుల ప్రవాహాలలోని అనిశ్చితి మాలకంగా కరెన్సీ విలువలు తీవ్ర అనిశ్చితికి గురి కావటం ఇందుకు ప్రధాన కారణంగా కొందరు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.7.ఇంత వరకు రుణ చెల్లింపుల వైఫ ల్యాలు వర్ధమాన దేశాలకే పరిమితమయ్యాయి 1824-2004 వరకు రుణ చెల్లింపు వైఫల్యాలలో అత్యధికంగా 126 చెల్లిం పుల వైఫల్యాలు గల చరిత్ర లాటిన్‌ అమెరికాకు దక్కింది. ఆ తరువాత ఆఫ్రికా 63 వైఫల్యాలతో 2వ స్థానంలో ఉంది.8.రుణాల రీ షెడ్యూలింగ్‌ తో వర్ధమాన దేశాల రుణ రేటిం గులు పడిపోయిన కారణంగా ఆయా దేశాలు సార్వభౌమ రుణాలను తీసుకోవడంలో ప్రత్యేక జాగ్రత్తలు వహించాయి. గత దశకంలో మార్కెట్‌లో పెరిగిన లిక్విడిటితో అభివృద్ధి చెం దిన దేశాల ప్రభుత్వాలకే రుణాలు అత్యధికంగా లభించాయి 9. వివిధ దేశాల ఆర్థిక స్థితిగతుల్ని అధ్యయనం చేస్తూ సార్వ భౌమ రుణ ప్రభావాలపై అంతర్జాతీయంగా 3 ప్రధాన రేటింగ్‌ ఏజెన్సీలైన స్టాండర్డ్‌ అండ్‌ పూర్‌, మూడీ, పిట్చ్‌ తమ రేటిం గ్‌లను ప్రకటిస్తున్నాయి. సుదీర్ఘకాల పరిశీలనలో అభివృద్ధి చెందిన దేశాల రుణ రేటింగ్‌లు చాలా స్థిరంగా ఉన్నాయి.

మంచి రేటింగ్‌ పొందిన ఏ సంపన్న దేశం గత 15 సంవ త్సరాల కాలంలో రుణ చెల్లింపు వైఫల్యాలకు (డెట్‌ డిఫాల్ట్‌) పాల్పడలేదు. కాని ప్రస్తుత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. 10. 2007 వ సంవత్సరంలో జీ-20 ధనిక దేశాల ఆర్థిక వ్యవస్థలలో సగటు ప్రభుత్వ రుణం సగటు జి.డి.పి లో 80% ఉండి వర్ధమానదేశాల రుణ నిష్పత్తి కంటే రెట్టింపు ఉన్నది. 2014 నాటికి జి-20 ధనిక దేశాల సగటు ప్రభుత్వ రుణం జి.డి.పిలో 120% ఉండొచ్చునని అంచనా వేస్తు న్నారు. సంపన్న దేశాల సాధారణ రుణం తీవ్రంగా పెరిగి పోతున్నది. జపాన్‌ అనేక సంవత్సరాలుగా అత్యధిక రుణ భారంతో కొనసాగుతున్నది. అమెరికా, బ్రిటన్‌ ప్రపంచ అత్యధిక రుణ గ్రస్థ దేశాల జాబితాలో చేరాయి. 11. ఈ దేశాలలో నూతనంగా జన్మించేవారి రేటు గణనీయంగా పడి పోయి, వృద్ధులలో పెరుగుదల అత్యధికమవుతున్నది. దీనిపై వెచ్చించాల్సిన వ్యయం కూడా గణనీయంగా పెరుగుతున్నది. 12. ఈ సంపన్న దేశాల రుణ విధానంలో మౌళిక మార్పులు చేపట్టకపోతే, వీరి రుణ పరిమాణం సమీప భవిష్యత్త్‌లో 3 రెట్లకు పైబడి పెరిగే ప్రమాదముందని రేటింగ్‌ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

ముగింపు - విదేశీ రుణాలతో 1960 లలో వర్ధమాన దేశాలలో సంక్షేమ ఆర్థిక నమూనా అమలు చేయబడి వివిధ దేశాలు ఆర్థికాబివృద్ధిని సాధించాయి. 1970లలో ప్రపంచాన్ని కుదిపేసిన చమురు సంక్షోభంతో నెలకొన్న ఆర్థిక దుస్థితి నుండి పేద వర్ధమాన దేశాలను గట్టెక్కించడానికి పశ్చిమ దేశాల బ్యాంకింగ్‌ రుణాలు సహాయపడి, అంతిమంగా వర్ధమాన దేశాలను 1980లలో ''రుణ ఊబి'' లోకి దించాయి. అప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయబడ్డ ప్రపంచీకరణ విధానాలు పేద వర్ధమాన దేశాలను మరింత రుణ గ్రస్తం చేశాయి. 20వ శతాబ్దం చివరి నుండి సంపన్న దేశాలు తమ తమ దేశాలలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాల్ని అధిగ మించడం కోసం అందుబాటులోకి వచ్చిన సార్వభౌమ రుణాలను వినియోగించుకొని ప్రపంచంలోనే అత్యధిక రుణ గ్రస్త దేశాలుగా తయారయ్యాయి.

వివిధ దేశాల రుణ భారాలు పెరుగుతున్న కొద్దీ, రుణ చెల్లింపు వైఫల్యాలు పెరుగుతున్నాయి. నూతన రుణాలు దొరకని స్థితిలో వివిధ ప్రభుత్వాలు ఈ రుణ భారాల్ని సామాన్య ప్రజానీకంపై రుద్దుతున్నాయి. సామాన్య ప్రజానీకం అనుభవిస్తున్న సంక్షేమ పధకాల కత్తిరింపులకు పూనుకుం టున్నాయి. ఉద్యోగ, ఉపాధి భద్రతపై దాడులు పెరుగుతు న్నాయి. నిరుద్యోగం, దారిద్య్రం సంపన్న దేశాలలో అంతు లేకుండా పెరుగుతున్నది.

2008లో తలెత్తిన ప్రపంచ ఆర్థిక సంక్షోభ పర్యావసనంగా సార్వభౌమ రుణ సంక్షోభం తీవ్రమైం ది. ఈ ఆర్థిక సంక్షోభ నివారణకు వివిధ ప్రభుత్వాలు రించిన బ్యాంకుల నష్టాలు, సంపన్న వర్గాలకు కల్పించిన రాయితీలతో కూడిన ఉద్దీపన చర్యలు రుణ సమస్యను మరింత జటిలం చేశాయి. గ్రీస్‌ తదితర యూరప్‌ దేశాలలో నెలకొన్న పరిస్థితులే ఇందుకు తాజా ఉదాహరణ.

Friday, March 5, 2010

బడ్జెట్‌ - పాలక వర్గాలు

ఆర్థిక వ్యవస్థపై బడ్జెట్‌ ప్రభావం గణనీయంగా ఉంటుంది. అందువల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో బడ్జెట్‌ రూపకల్పన ప్రజాతంత్రయుతంగా నిర్వహింపబడాలి. సామాన్య ప్రజల ఆకాంక్షలకు, అభీష్టాలకు అనుగుణంగా ''ప్రజా బడ్జెట్‌'' రూపొందింపబడాలి. స్వతంత్ర భారతంలో ''ప్రజా బడ్జెట్‌''గా మన్ననలు పొందిన బడ్జెట్లు అరుదైనవే. మన దేశంలో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులే పాలక పక్షాలుగా చలామణి అవుతున్నారు. బడ్జెట్‌ పై పాలక వర్గాల ప్రభావం ఏమిటి? కొన్ని అంశాలను పరిశీలిద్దాం.పాలక వర్గాలు : అధికారం, ఆధిపత్యం ఉన్న రాజకీయ పార్టీలనే పాలక పక్షాలు, పాలక వర్గాలుగా సాధారణంగా పరిగణిస్తున్నారు. పెట్టుబడిదారి విధానంలో ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం, ఆధిపత్యం ఉన్న వర్గాలను పాలక వర్గాలుగా మార్క్సిజం సూత్రీకరిస్తుంది. బడ్జెట్‌పై సంప్రదింపులు-సంపన్న వర్గాలు : బడ్జెట్‌ రూపకల్పన విస్తృతమైన కసరత్తుతో కూడుకొని వుంది. వివిధ మంత్రిత్వ శాఖల ప్రతిపాదనలు, సమీక్షల నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వివిధ డిపార్టుమెంట్‌లు బడ్జెట్‌ ప్రతిపాదనలు తయారు చేయడంలో కీలక పాత్రను నిర్వహిస్తాయి. దీనితో పాటు బడ్జెట్‌ సమర్పణకు ముందు వివిధ సెక్షన్ల వత్తిడి బడ్జెట్‌పై కొంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందులో సంపన్న వర్గాల లాబీలు ప్రధాన భూమికను పోషిస్తాయి. వీరికి బడ్జెట్‌ పై సంప్రదింపులలో ఆర్థిక మంత్రి ప్రత్యేక సమయాన్ని కేటాయించి చర్చలకు ఆహ్వానిస్తారు.
వీరిలో పారిశ్రామికాధిపతులు, పారిశ్రామిక సంఘాలు, వ్యాపార వాణిజ్య మండలులు, కార్పోరేట్‌ రంగ నిపుణులు, వీరి ఆకాంక్షలను ఆశలను సమర్థించే ఆర్థిక నిపుణులు తదితరులు ప్రముఖంగా ఉంటారు. ఆర్థిక వ్యవస్థ రథసారథులుగా వీరి ప్రాబల్యం ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్ణయాలపై తీవ్రమైన ప్రభావాన్ని కల్గివుంటుంది. దీనితో పాటు వీరి సంక్షేమమే జాతి సంక్షేమంగా, వీరి ప్రయోజనమే ప్రజల ప్రయోజనంగా టీవి ఛానళ్ళు, పత్రికా కథనాలు, వివిధ నిపుణల నివేదికలు ప్రచారం చేస్తుంటాయి. ఈ తతంగమంతా ఈ సంవత్సరం కూడా బడ్జెట్‌ సందర్భంగా కొనసాగింది
.

బడ్జెట్‌-సామాన్య ప్రజలు : భారతదేశాన్ని సంపన్న దేశాల సరసన నిలబెట్టాలనే తపనతో అమలు పరిచిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు సృష్టించిన అసమానతలు, సమాజంలోని అట్టడుగువర్గాల జీవితాలను ఛిద్రంచేసాయి. పారిశ్రామిక సంస్థలపై నియమించిన జాతీయ కమీషన్‌ పరిశీలనలో దేశ జనాభాలో 76.7% పేదలు, దుర్భరులు ఉన్నారు. వీరి రోజువారి ఆదాయం రూ.20 లకంటే తక్కువగా ఉన్నది. వీరిలో అత్యధికులు దళితులు, గిరిజనులు. దళిత గిరిజనులలో 1% మాత్రమే అధిక ఆదాయం కలవారుగాను, 11.2% మధ్యస్ధ ఆదాయం కలవారుగాను, మిగిలిన 87.8% అల్పాదాయ వర్గాలుగాను ఉన్నారు. అగ్రకులాలలో 45.2% అధిక మధ్యస్ధ ఆదాయాలు కలిగి వుండగా 54.8% అల్పాదాయ వర్గాలుగా ఉన్నారు. ఇదంతా నయా ఉదారవాద విధానాల అమలు పుణ్యమే.

అయినప్పటికీ ఈ వాస్తవాలను కార్పొరేట్‌ రంగం అంగీకరించదు. ఈ వర్గాల సమగ్రాభివృద్ధే దేశాభివృద్ధిగాను, ధనిక వర్గాల సంపదకు ఈ వర్గాల స్వేదమే పునాదన్న సత్యాన్ని ఆర్థిక మంత్రి బడ్జెట్‌ రూపకల్పనలో గుర్తించరు. బడ్జెట్‌ ప్రతిపాదనలను తయారు చేసే సమయంలో ఆర్థిక మంత్రి ఈ పేదవర్గాలను కాని, వారి ప్రతినిధులను కాని సంప్రదింపులకు ఆహ్వానించరు. వారి అభిప్రాయాలను స్వీకరించరు. గతంలో కేంద్ర కార్మిక సంఘాలను బడ్జెట్‌ సందర్భంగా సంప్రదింపులకు పిలిచేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని గాలికి వదిలేసారు.

బడ్జెట్‌ లో కేటాయించిన సామాజికరంగ నిధులు ఆచరణలో ఖర్చుపెట్టబడక మురిగిపోతున్నాయి. గత ఏడాది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద కేటాయించిన నిధులలో సగానికి సగం వినియోగింపబడలేదు. మన రాష్ట్రంలో ఖర్చు పెట్టిన నిధులలో కనీసం 10శాతం అవినీతితో దుర్వినియోగమయ్యాయని అధికారిక సర్వేలు తెలియచేస్తున్నాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా ఈ పథకం కింద 14.48 శాతం మందికి మాత్రమే పూర్తి స్థాయి పనులు కల్పించారు. పేదరిక నిర్మూలనకు గత 4 ఏళ్ళుగా లక్షన్నర కోట్ల రూపాయలు కేటాయించామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా, ఆచరణలో సాధారణ ప్రజనీకానికి అందింది అతి స్వల్పం. వెనుకబడిన ప్రజల అభ్యున్నతికి వారి జనాభా దామాషా పద్ధతిలో బడ్జెట్‌ నిధుల కేటాయింపు ఉండాలని, వాటిని పూర్తిగా ఖర్చు చేయాలనే రాజ్యాంగ నిబంధనలను నిర్లక్ష్యం చేస్తున్నారు.

గత బడ్జెట్‌లో నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైబడిన రాయితీలను సంపన్న వర్గాలకిచ్చిన సందర్భంగా, అధిక ధరల నియంత్రణకై సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్ధకు 94 వేల కోట్ల రూపాయలు కేటాయించమన్న నిపుణుల సిపార్సులను, ప్రజాసంఘాల అభ్యర్థనలను అర్థిక మంత్రి త్రోసిపుచ్చారు. ఈ సంవత్సరం బడ్జెట్‌ సందర్భంగా అధిక ధరల నియంత్రణకు చర్యలు లేకపోగా నిత్యావసర వస్తువుల ధరలను మండిరచే పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచేసారు.దళితులలో 2.8 శాతం, గిరిజనులలో 1.4 శాతం మాత్రమే సాంప్రదాయ నైపుణ్యాలను కలిగి ఉన్నారు. వీరిలో నైపుణ్యాన్ని పెంచటానికి అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయటంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లు 2022 నాటికి 50 కోట్ల నైపుణ్యంగల ప్రజలను తయారు చేయటమన్నది సుదూర స్వప్నమే. ముగింపు : నయా ఉదారవాద విధానాల అమలును వేగవంతం చేసే బడ్జెట్‌ ప్రజల జీవన స్థితిగతులను మరింత అస్థిర పరుస్తుంది. సంపన్న వర్గాలకు బాధ్యతగా బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు చేస్తూ, సామాన్య ప్రజలకిచ్చే అరకొర కేటాయింపులను ఔదార్యంగా ఇస్తున్న ట్లుగా ఉన్నది ఆర్ధిక మంత్రి ధోరణి. బడ్జెట్‌ సమ యాన అర్ధిక మంత్రికి సంపన్న వర్గాల స్వరం తప్ప సామాన్య ప్రజల ఆక్రందనలు వినబడటం లేదు. చట్ట సభలలలోని అత్యధికులైన ప్రజా ప్రతినిధుల చర్యలు సంపన్న వర్గాల ప్రయోజనాలతో అంటకాగుతున్నాయి. అధికారంలో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా వీరంతా పాలక వర్గాలే.