Monday, March 29, 2010

ధరల స్థిరీకరణ నిధి-పరిచయం

ధరలు ఆకాశాన్నంటుతూ, రెండంకెల ఆహార ద్రవ్యోల్భణం ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నది. మూలిగే నక్కపై తాటికాయలా కిరిట్‌ పారిఖ్‌ కమిటీ నివేదిక పెట్రోలియం ఉత్పత్తుల ధరలను సరళీకరించమంటూ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు అమలైతే పెట్రోలియం ఉత్పత్తులపై ఇప్పుడున్న సబ్సిడి తొలగింపబడి వంటగ్యాస్‌ ధర రూ. 100 లు, కిరోసిన్‌ లీటర్‌కు రూ. 6 లు, పెట్రోల్‌ లీటరుకు రూ. 3 లు, డీజిల్‌ లీటర్‌కు రూ. 3-4 లు పెరిగే అవకాశం ఉంది. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం తన బడ్జెట్‌లో పెట్రోలు, డీజిల్‌ ధరలపై పెంచిన పన్ను ప్రతిపాదనలు మండే ధరల అగ్నికి ఆజ్యం పోశాయి. ఈ నేపధ్యంలో ధరల అదుపు చర్యల పై చర్చిస్తున్న వివిధ ప్రత్యామ్నాయాలలో ''ధరల స్ధిరీకరణ నిధి'' ముఖ్యమైన అంశంగా ముందుకొచ్చింది. వామపక్ష పార్టీలు ఈ ప్రతిపాదనకు సూత్రధారులుగా నిలబడ్డాయి.

ధరల స్థిరీకరణ నిధి(ప్రైసెస్‌ స్టెబిలైజెషన్‌ ఫండ్‌)

16వ శతాబ్దంలో సముద్రయాన అంతర్జాతీయ వాణిజ్యం అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంటున్న కారణంగా ప్రాథమిక సరుకులైన వ్యవసాయోత్పత్తుల ఎగుమతుల ధరలు తీవ్రమైన అనిశ్చితికి గురౌతుండేవి. ''అంతర్జాతీయ వాణిజ్యంలో సరుకుల ధరలలోని అనిశ్ఛితి, గొప్ప దురాచారంగా'' ఆ రోజుల్లో కీన్స్‌ వర్ణించారు. ఆ దశలో ''ధరల స్థిరీకరణ నిధి'' ప్రక్రియ ముందుకొచ్చింది. వాణిజ్యం ఉత్సాహంగా ఉండి ఎగుమతులు ఊపుగా ఉన్న సమయంలో, సరుకు ధరలలో కొంత భాగాన్ని ఈ నిధికి జమకట్టేవారు. వాణిజ్యం మందకొడిగా ఉండి, ఎగుమతుల ధరలు గిట్టుబాటుకాని రోజుల్లో ఈ స్థిరీకరణ నిధి నుండి కొంత భాగాన్ని నష్టపరిహారంగా ఎగుమతిదారులకు ముట్టజెప్పేవారు. ఈ ప్రక్రియ అంతిమంగా ఎగుమతి దారులు/ఉత్పత్తి దారుల ప్రయోజనాల్ని కాపాడటానికి వినియోగింపబడేది.

ధరల స్థిరీకరణ నిధి రూపంలో ఆయిల్‌ పూల్‌ ఖాతా

1970 దశకంలో నెలకొన్న చమురుషాక్‌కు గురైన వివిధ దేశాలలో నెలకొన్న పెట్రోలియం ధరల అనిశ్చితి నుండి ఆర్థిక వ్యవస్ధను కాపాడుకోవటానికి ధరల స్థిరీకరణ నిధి రూపంలో ఆయిల్‌ పూల్‌ ఖాతాను ఏర్పాటు చేసుకున్నారు. ప్రారంభంలో ఈ నిధికి కొంత ప్రభుత్వ సొమ్మును కేటాయించుకొని, అంతర్జాతీయ పెట్రోలియం ధరలు తగ్గినప్పుడు, తగ్గిన మేరకు సొమ్మును ఈ నిధికి జమ చేసేవారు. ధరలు పెరిగినప్పుడు నిధిలోని సొమ్ముతో పెరిగిన ధరలను స్థిరీకరించుకొని మార్కెట్‌ వడిదుడుకులతో నిమిత్తం లేకుండా చమురు ధరలు నియంత్రించుకొనేవారు. ఈ ఆయిల్‌ పూల్‌ ఖాతాకు అనుసంధానంగా నియంత్రిత ధరల యంత్రాంగం (అడ్మినిస్ట్రేటివ్‌ ప్రైస్‌ మెకానిజం) ఉండేది. ఈ రెండు స్తంభాలపై దశాబ్దాల పాటు వినియోగదారుల ప్రయోజనాలను రక్షిస్తూ పెట్రోలియం ధరలుండేవి.

నయాఉదారవాద విధానాల నీడలో పెట్రోలియం ధరలు-

1997 నుండి హైస్పీడ్‌ డీజిల్‌, విమాన టర్బైన్‌ చమురును, 2002 నుండి పెట్రోలును నియంత్రిత యంత్రాంగం నుండి తొలగించారు. అదే సందర్భంలో ఆయిల్‌ పూల్‌ ఎకౌంట్‌ లోని మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వ కన్‌సాలిడేటెడ్‌ ఫండ్‌కు జమచేసారు. ఈ చర్యలకు ఉపక్రమించిన ఆనాటి ఎన్డీయే ప్రభుత్వం ఆయిల్‌ పూల్‌ ఎకౌంట్‌ పరిధి నుండి వంట గ్యాస్‌, కిరోసిన్‌, డీజిల్‌, పెట్రోల్‌లను తొలగించింది. పెట్రోల్‌ డీజిల్‌ ధరలను మార్కెట్‌ శక్తులకు వదిలేసి, కిరోసిన్‌ వంటగ్యాస్‌ ధరలను ప్రభుత్వమే నిర్ణయిస్తున్నది. వీటిపై వచ్చే నష్టాలను చమురు మార్కెటింగ్‌ కంపెనీలకు అప్పచెప్పింది. ప్రస్తుతం చమురు కంపెనీలను నష్టాలనుండి బయట పడవేయటమనే నెపంతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను సరళీకరించటానికి కేంద్ర ప్రభుత్వం పూనుకొంది.

ఈ నేపథ్యంలో 2005 వ సం||లో వామపక్ష పార్టీల ప్రోద్బలంతో పెట్రోలియం మంత్రిత్వ శాఖకు అనుబంధమైన స్టాండింగ్‌ కమిటీ పెట్రోలియం ధరల నియంత్రణపై సిఫార్సులు చేసింది. అందులో కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. 1.క్రూడ్‌ఆయిల్‌ పై విధిస్తున్న సెస్‌ను భారతదేశ కన్సాలిడేటెడ్‌ ఫండ్‌కు జమచేయరాదు. ఆ సొమ్ముతో ''ప్రత్యేక ధరల స్థిరీకరణ నిధిని'' ఏర్పాటు చేసి, దీని ద్వారా పెట్రోలు, డీజిల్‌, వంట గ్యాస్‌, కిరోసిన్‌ ధరలను నియంత్రించాలి. ప్రతి సంవత్సరం క్రూడ్‌ ఆయిల్‌పై వసూలు చేస్తున్న సెస్‌ను ఈ నిధికి అనివార్యంగా జమచేయాలి. 2. సామాన్యుడి ప్రయోజనం కోసం ప్రజా పంపిణి లోని కిరోసిన్‌, గృహవినియోగ వంట గ్యాస్‌ పై పూర్తి సబ్సిడీలను కొనసాగించాలి. 3. సామాన్యుడి జీవన ప్రమాణాలను నిర్దేశించే చమురు రంగం నుండి పన్నుల రూపంలో విచక్షణా రహితంగా రెవిన్యూను వసూలు చేయరాదు.

మార్చి 2004 నాటికి క్రూడాయిల్‌ పై రూ. 51,007 కోట్ల సెస్‌ వసూలు చేసినట్లు, ఇందులో ఆయిల్‌ డెవలప్‌మెంట్‌ బోర్డుకు రూ. 902 కోట్లు ఖర్చు చేసినట్లు స్టాండింగ్‌ కమిటి నిర్ధారించింది. ఈ సొమ్ముకు తదుపరి సంవత్సరాలలో పోగుపడే క్రూడాయిల్‌ సెస్‌ను కలుపుకుంటే పెరిగిన పెట్రోలియం ధరలను సమర్థవంతంగా నియంత్రించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి సంవత్సరము సుమారు రూ.7500 కోట్ల క్రూడాయిల్‌ సెస్‌ వసూలు చేయబడుతున్నది.

ముగింపు

అనేక ఎగుమతి ఆధారిత రంగాలలో ధరల స్ధిరీకరణ నిధి ఏర్పాటు చేయబడింది. కొలంబియా, చిలీ, రష్యన్‌ ఫెడరేషన్‌ లాంటి దేశాలలో వివిధ సందర్భాలలో ఈ ప్రక్రియను ఈ మధ్య కాలంలో వినియోగించుకున్నారు. ఈ భావం ఆవిర్భావం నుండి మార్కెట్‌ ఒడుదుడుకుల నుండి ఉత్పత్తి దారుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా ధరల స్థిరీకరణ నిధి అమలు జరిగింది. ప్రపంచీకరణ కారణంగా సామాన్య ప్రజానీకం పై పెరుగుతున్న భారాల నుండి విముక్తి కోసం చమురు రంగంలో ధరల స్థిరీకరణ నిధి వినియోగదారుల ప్రయోజనాల రక్షణకు ఉపయోగపడింది. కాని చమురు ధరల నియంత్రణలో ధరల స్థిరీకరణ నిధి ప్రక్రియ ప్రయివేట్‌ పెట్టుబడుల లాభార్జనకు అడ్డంకిగా తయారయినందున ప్రయివేటీకరణ విధానాలతో మన దేశంలో ఈ వ్యవస్థను ధ్వంసం చేయపూనుకున్నారు.

No comments: