Friday, March 5, 2010

బడ్జెట్‌ - పాలక వర్గాలు

ఆర్థిక వ్యవస్థపై బడ్జెట్‌ ప్రభావం గణనీయంగా ఉంటుంది. అందువల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలో బడ్జెట్‌ రూపకల్పన ప్రజాతంత్రయుతంగా నిర్వహింపబడాలి. సామాన్య ప్రజల ఆకాంక్షలకు, అభీష్టాలకు అనుగుణంగా ''ప్రజా బడ్జెట్‌'' రూపొందింపబడాలి. స్వతంత్ర భారతంలో ''ప్రజా బడ్జెట్‌''గా మన్ననలు పొందిన బడ్జెట్లు అరుదైనవే. మన దేశంలో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులే పాలక పక్షాలుగా చలామణి అవుతున్నారు. బడ్జెట్‌ పై పాలక వర్గాల ప్రభావం ఏమిటి? కొన్ని అంశాలను పరిశీలిద్దాం.పాలక వర్గాలు : అధికారం, ఆధిపత్యం ఉన్న రాజకీయ పార్టీలనే పాలక పక్షాలు, పాలక వర్గాలుగా సాధారణంగా పరిగణిస్తున్నారు. పెట్టుబడిదారి విధానంలో ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం, ఆధిపత్యం ఉన్న వర్గాలను పాలక వర్గాలుగా మార్క్సిజం సూత్రీకరిస్తుంది. బడ్జెట్‌పై సంప్రదింపులు-సంపన్న వర్గాలు : బడ్జెట్‌ రూపకల్పన విస్తృతమైన కసరత్తుతో కూడుకొని వుంది. వివిధ మంత్రిత్వ శాఖల ప్రతిపాదనలు, సమీక్షల నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వివిధ డిపార్టుమెంట్‌లు బడ్జెట్‌ ప్రతిపాదనలు తయారు చేయడంలో కీలక పాత్రను నిర్వహిస్తాయి. దీనితో పాటు బడ్జెట్‌ సమర్పణకు ముందు వివిధ సెక్షన్ల వత్తిడి బడ్జెట్‌పై కొంత ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అందులో సంపన్న వర్గాల లాబీలు ప్రధాన భూమికను పోషిస్తాయి. వీరికి బడ్జెట్‌ పై సంప్రదింపులలో ఆర్థిక మంత్రి ప్రత్యేక సమయాన్ని కేటాయించి చర్చలకు ఆహ్వానిస్తారు.
వీరిలో పారిశ్రామికాధిపతులు, పారిశ్రామిక సంఘాలు, వ్యాపార వాణిజ్య మండలులు, కార్పోరేట్‌ రంగ నిపుణులు, వీరి ఆకాంక్షలను ఆశలను సమర్థించే ఆర్థిక నిపుణులు తదితరులు ప్రముఖంగా ఉంటారు. ఆర్థిక వ్యవస్థ రథసారథులుగా వీరి ప్రాబల్యం ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్ణయాలపై తీవ్రమైన ప్రభావాన్ని కల్గివుంటుంది. దీనితో పాటు వీరి సంక్షేమమే జాతి సంక్షేమంగా, వీరి ప్రయోజనమే ప్రజల ప్రయోజనంగా టీవి ఛానళ్ళు, పత్రికా కథనాలు, వివిధ నిపుణల నివేదికలు ప్రచారం చేస్తుంటాయి. ఈ తతంగమంతా ఈ సంవత్సరం కూడా బడ్జెట్‌ సందర్భంగా కొనసాగింది
.

బడ్జెట్‌-సామాన్య ప్రజలు : భారతదేశాన్ని సంపన్న దేశాల సరసన నిలబెట్టాలనే తపనతో అమలు పరిచిన సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు సృష్టించిన అసమానతలు, సమాజంలోని అట్టడుగువర్గాల జీవితాలను ఛిద్రంచేసాయి. పారిశ్రామిక సంస్థలపై నియమించిన జాతీయ కమీషన్‌ పరిశీలనలో దేశ జనాభాలో 76.7% పేదలు, దుర్భరులు ఉన్నారు. వీరి రోజువారి ఆదాయం రూ.20 లకంటే తక్కువగా ఉన్నది. వీరిలో అత్యధికులు దళితులు, గిరిజనులు. దళిత గిరిజనులలో 1% మాత్రమే అధిక ఆదాయం కలవారుగాను, 11.2% మధ్యస్ధ ఆదాయం కలవారుగాను, మిగిలిన 87.8% అల్పాదాయ వర్గాలుగాను ఉన్నారు. అగ్రకులాలలో 45.2% అధిక మధ్యస్ధ ఆదాయాలు కలిగి వుండగా 54.8% అల్పాదాయ వర్గాలుగా ఉన్నారు. ఇదంతా నయా ఉదారవాద విధానాల అమలు పుణ్యమే.

అయినప్పటికీ ఈ వాస్తవాలను కార్పొరేట్‌ రంగం అంగీకరించదు. ఈ వర్గాల సమగ్రాభివృద్ధే దేశాభివృద్ధిగాను, ధనిక వర్గాల సంపదకు ఈ వర్గాల స్వేదమే పునాదన్న సత్యాన్ని ఆర్థిక మంత్రి బడ్జెట్‌ రూపకల్పనలో గుర్తించరు. బడ్జెట్‌ ప్రతిపాదనలను తయారు చేసే సమయంలో ఆర్థిక మంత్రి ఈ పేదవర్గాలను కాని, వారి ప్రతినిధులను కాని సంప్రదింపులకు ఆహ్వానించరు. వారి అభిప్రాయాలను స్వీకరించరు. గతంలో కేంద్ర కార్మిక సంఘాలను బడ్జెట్‌ సందర్భంగా సంప్రదింపులకు పిలిచేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని గాలికి వదిలేసారు.

బడ్జెట్‌ లో కేటాయించిన సామాజికరంగ నిధులు ఆచరణలో ఖర్చుపెట్టబడక మురిగిపోతున్నాయి. గత ఏడాది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద కేటాయించిన నిధులలో సగానికి సగం వినియోగింపబడలేదు. మన రాష్ట్రంలో ఖర్చు పెట్టిన నిధులలో కనీసం 10శాతం అవినీతితో దుర్వినియోగమయ్యాయని అధికారిక సర్వేలు తెలియచేస్తున్నాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా ఈ పథకం కింద 14.48 శాతం మందికి మాత్రమే పూర్తి స్థాయి పనులు కల్పించారు. పేదరిక నిర్మూలనకు గత 4 ఏళ్ళుగా లక్షన్నర కోట్ల రూపాయలు కేటాయించామని ప్రభుత్వం చెప్పుకుంటున్నా, ఆచరణలో సాధారణ ప్రజనీకానికి అందింది అతి స్వల్పం. వెనుకబడిన ప్రజల అభ్యున్నతికి వారి జనాభా దామాషా పద్ధతిలో బడ్జెట్‌ నిధుల కేటాయింపు ఉండాలని, వాటిని పూర్తిగా ఖర్చు చేయాలనే రాజ్యాంగ నిబంధనలను నిర్లక్ష్యం చేస్తున్నారు.

గత బడ్జెట్‌లో నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైబడిన రాయితీలను సంపన్న వర్గాలకిచ్చిన సందర్భంగా, అధిక ధరల నియంత్రణకై సార్వత్రిక ప్రజా పంపిణీ వ్యవస్ధకు 94 వేల కోట్ల రూపాయలు కేటాయించమన్న నిపుణుల సిపార్సులను, ప్రజాసంఘాల అభ్యర్థనలను అర్థిక మంత్రి త్రోసిపుచ్చారు. ఈ సంవత్సరం బడ్జెట్‌ సందర్భంగా అధిక ధరల నియంత్రణకు చర్యలు లేకపోగా నిత్యావసర వస్తువుల ధరలను మండిరచే పెట్రోలియం ఉత్పత్తుల ధరలను పెంచేసారు.దళితులలో 2.8 శాతం, గిరిజనులలో 1.4 శాతం మాత్రమే సాంప్రదాయ నైపుణ్యాలను కలిగి ఉన్నారు. వీరిలో నైపుణ్యాన్ని పెంచటానికి అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయటంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుంది. బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లు 2022 నాటికి 50 కోట్ల నైపుణ్యంగల ప్రజలను తయారు చేయటమన్నది సుదూర స్వప్నమే. ముగింపు : నయా ఉదారవాద విధానాల అమలును వేగవంతం చేసే బడ్జెట్‌ ప్రజల జీవన స్థితిగతులను మరింత అస్థిర పరుస్తుంది. సంపన్న వర్గాలకు బాధ్యతగా బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు చేస్తూ, సామాన్య ప్రజలకిచ్చే అరకొర కేటాయింపులను ఔదార్యంగా ఇస్తున్న ట్లుగా ఉన్నది ఆర్ధిక మంత్రి ధోరణి. బడ్జెట్‌ సమ యాన అర్ధిక మంత్రికి సంపన్న వర్గాల స్వరం తప్ప సామాన్య ప్రజల ఆక్రందనలు వినబడటం లేదు. చట్ట సభలలలోని అత్యధికులైన ప్రజా ప్రతినిధుల చర్యలు సంపన్న వర్గాల ప్రయోజనాలతో అంటకాగుతున్నాయి. అధికారంలో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా వీరంతా పాలక వర్గాలే.

2 comments:

V.Sambireddy, President, M.V.Anjaneyulu, Secretary, Tax Payer's Association said...

maintaing the blog is good idea. But launguage should be more easy and it should be in activbe voice.

Briefact said...

మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. భాషలో మార్పుకు ప్రయత్నించగలను