Saturday, April 24, 2010

యూరోజోన్‌ చక్రబంధంలో గ్రీస్‌

నయాఉదారవాద విధానాల అమలుతో తీవ్రంగా రుణగ్రస్తమై, అనేక ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొన్న మెక్సికో, అర్జెంటినా లాంటి అబివృద్ధి చెందుతున్న దేశాల అనుభవాలు గతంలో చూశాం. అమెరికా ద్రవ్య సంక్షోభ తదనంతర పరిణామాలలో భాగంగా అబివృద్ధి చెందిన దేశాలైయుండి, యూరోజోన్‌ ఆర్థిక క్రమ శిక్షణతో పరిపుష్టతను పెంచుకున్న పోర్చుగల్‌, ఇటలీ, ఐర్లాండ్‌, గ్రీస్‌, స్పెయిన్‌ లాంటి యూరో దేశాలు సార్వభౌమ రుణ సంక్షోభంలో కూరుకుపోవడం, వాటిలో గ్రీస్‌ ఆర్థిక దుస్ధితి మరింత దిగజారటం ప్రపంచవ్యాప్త చర్చ అయింది.

గ్రీసు వైభవం - 2001లో గ్రీస్‌ పట్టుబట్టి యూరోజోన్‌లో సభ్యదేశమైంది. ప్రపంచ వాణిజ్య సంస్థ, నల్ల సముద్ర ఆర్థిక సహకార సంఘం, ఆర్థిక సహకార, అభివృద్ధి సంఘం (ఒ.ఇ.సి.డి)లలోను సభ్య దేశంగా ఉంది. 1 కోటి 10 లక్షల జనాభా గలిగిన గ్రీస్‌లో 49 లక్షల మంది కార్మిక వర్గంగా ఉన్నారు. గ్రీసు స్థూల దేశీయోత్పత్తి (జి.డి.పి) లో సేవారంగం 75.7%, పారిశ్రామిక రంగం 20.6%, వ్యవసాయరంగం 3.7% గా ఉండి, ప్రభుత్వ రంగం 40% గా ఉంది. వివిధ ఏజెన్సీల అంచనాల ప్రకారం (2008) జి.డి.పి ప్రాతిపదికన ప్రపంచంలో 27వ అతి పెద్ద సంపన్న దేశంగాను, తలసరి జి.డి.పిలో 26వ దేశంగాను, అత్యధిక మానవాభివృద్ధి సూచిలో 25వ దేశంగాను, నాణ్యత గల జీవనప్రమాణాలు సూచిలో 22వ దేశంగాను గ్రీస్‌ ప్రసిద్ధికెక్కింది. గ్రీస్‌ ఎగుమతి, దిగుమతులలో దాదాపు 50% యూరోజోన్‌ దేశాలతోనే పరిమితమయ్యాయి. గ్రీస్‌ ఆర్థిక వ్యవస్థలో టూరిజం, షిప్పింగ్‌ రంగాలు ప్రధానమైనవి. చైనా, ఆస్ట్రియా దేశీయులకు గ్రీస్‌ అత్యంత సందర్శనీయమైనది. యూరోపియన్‌ యూనియన్‌ సగటు జి.డి.పిలో గ్రీస్‌ 95% కలిగియున్నా, యూరోజోన్‌ దేశాల మొత్తం జి.డి.పిలో గ్రీస్‌ జి.డి.పి 3%నికి మించదు.

ఇంతటి ఆర్థిక పరిపుష్టి కలిగి సంపన్న దేశంగా చలామణి అవుతున్న గ్రీసు అతి స్వల్పకాలంలోనే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడులకు ''అత్యంత ప్రీతి పాత్రమైన గమ్యదేశం''గా పరిణితి పొందింది. వేలాది కోట్ల డాలర్ల అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడులు గ్రీస్‌ను ముంచేసాయి. ఆర్థిక ద్రవ్య సంఘంలోను, యూరోజోన్‌లోను సభ్య దేశంగా ఉన్నందున గ్రీస్‌ కు చెల్లించే రుణాలకు పూర్తి గ్యారంటీ ఉంటుందనే విశ్వాసంతో విదేశీ బ్యాంకులు, పెట్టుబడిదారులు అతి తక్కువ వడ్డీకి (2.25%) గ్రీస్‌ రుణ బాండులను కొన్నారు. ఈ రుణ బాండులను గ్యారంటీ చేయటానికి ''రుణ చెల్లింపు వైఫల్య పరిహార సాధనాలు'' (సి.డి.యస్‌) లాంటి డెరివేటివ్‌లు గ్రీస్‌ అర్థిక వ్యవస్థను కైవశం చేసుకున్నాయి (అమెరికా ద్రవ్య సంక్షోభానికి సి.డి.యస్‌.లు ఒక ముఖ్య కారణం). అమెరికా ఆర్థిక నమూనా తరహాలో పొదుపు కంటే వినియోగానికి ప్రాధాన్యతనిస్తూ, వినియోగం పెరగటానికి రుణాల్ని పెంచారు. దీనితో ప్రభుత్వ వ్యయం అదుపులేకుండా పోయింది. అమెరికా ద్రవ్య సంక్షోభ తదనంతర కాలంలో గ్రీస్‌లో విదేశీ పెట్టుబడుల ప్రవాహం తగ్గింది. అందుచేత ఆర్థిక వ్యవస్థను మాంద్యం నుండి రక్షించటానికి గాను ప్రభుత్వ వ్యయం మరింత పెరిగి, ద్రవ్య లోటు జి.డి.పిలో 12.7%నికి (2009) (యూరోజోన్‌ ప్రమాణం 3%) చేరటంతో గ్రీస్‌ ఆర్థిక వ్యవస్థలో ప్రమాదఘటికలు మ్రోగాయి.

రుణ సంక్షోభంలో గ్రీస్‌ - ఈ నేపథ్యంలో జరిగిన గ్రీస్‌ సాధారణ ఎన్నికలలో ''జార్జి పాపస్‌ డ్య్రూ'' నాయకత్వంలోని సోషలిస్ట్‌ పాసక్‌ పార్టి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడతామనే ప్రధాన వాగ్దానంతో విజయం సాధించి, అధికార పగ్గాలను చేజిక్కించుకున్నది (నవంబరు,2009). దివాళా చేరువకు చేరిన గ్రీస్‌ ఆర్థిక వ్యవస్థను రక్షించటం కోసం ద్రవ్య లోటును 8.7%కి తగ్గించటానికి పూనుకొంది. అదే సందర్భంలో గ్రీస్‌ రుణ భారం జి.డి.పిలో 113.4% నుండి 121% (యూరోజోన్‌ ప్రమాణం 60%) చేరటం ప్రభుత్వానికి ఆందోళన కల్గించింది. గత ప్రభుత్వం చేసిన నిర్వాకాలను బహిరంగపర్చింది. గత ప్రభుత్వం గోల్డ్‌మ్యాన్‌ శాక్‌ లాంటి పెట్టుబడి బ్యాంకులతో కుమ్మక్కై ''రుణ చెల్లింపు వైఫల్య పరిహార సాధనాల'' (క్రెడిట్‌ డిఫాల్ట్‌ శ్వాప్‌) చాటున అత్యధిక ప్రభుత్వ రుణాన్ని, ద్రవ్య లోటును కప్పి పుచ్చి, పెట్టుబడిదారులను తప్పుత్రోవ పట్టించిన వార్తలు, అవినీతి కార్యకలాపాల కథనాలు గుప్పుమన్నాయి. ప్రభుత్వ పారదర్శకత, విశ్వాసనీయత, రిస్క్‌లపై కారుమబ్బులు కమ్ముకున్నాయి. దీనితో అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీలు గ్రీస్‌ రుణ బాండులపై విశ్వాసనీయ రేటింగ్‌ను తీవ్రంగా కుదించాయి. దీని ప్రభావంతో కొత్తగా వేలం వేసే రుణ బాండులతో పాటు పాత ఖాతాలపై కూడా చెల్లించాల్సిన వడ్డీ, రుణ వ్యయం, సి.డి.యస్‌లపై చెల్లించాల్సిన ప్రీమియం రెట్టింపై ఆర్థిక భారాన్ని తీవ్రంగా పెంచాయి. ద్రవ్య రేటు మరింత పెరిగింది. ఈ స్థితిలో విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. విదేశీ మారక విలువలుఅడుగంటి కరెన్సీ కరెంటు ఎకౌంట్‌ లోటు (యూరోజోన్‌ ప్రమాణం 4%) విపరీతంగా పెరిగింది. 2010లో గ్రీస్‌ చెల్లించాల్సిన 50 బిలియన్‌ యూరోల రుణం తిరిగి చెల్లించలేని స్థితికి దిగజారింది. అంతర్జాతీయ ద్రవ్య సంస్థ గ్రీస్‌ ఆర్థిక దుస్థితిని తీవ్రంగా పరిగణించింది.

యూరోజోన్‌ చక్రబంధంలో గ్రీస్‌ - ఈ పరిస్థితి నుండి బయటపడటానికి ప్రతి దేశానికి స్వతంత్రంగా అమలు చేయగల ద్రవ్య విధానాలు కావాలి. ఎగుమతులు పెంచుకోవటం కోసం కరెన్సీ విలువను తగ్గించుకోవాలి. కాని గ్రీస్‌ విషయంలో కధ అడ్డం తిరిగింది. యూరో విలువను తగ్గించటానికి యూరోజోన్‌ ఏకాభిప్రాయం కావాలి. ఇతర దేశాలనుండి ఆర్థిక సహాయం పొందటానికి యూరోజోన్‌ అంగీకారం కావాలి. ఇవన్నీ యూరో జోన్‌ పరిధిలో అసాధ్యాలు. గ్రీస్‌ లో జరిగిన ఆర్థిక అవకతవకలతో జర్మనీ, ఫ్రాన్స్‌ లాంటి యూరో దేశాలు ఆగ్రహించాయి. గ్రీస్‌కు సహాయమందిస్తే, ఇతర రుణ గ్రస్త యూరో దేశాలకూ ఆర్థిక సహాయమందించాల్సిన బాధ్యత మీద పడుతుందని, ఫలితంగా తమ ఆర్థిక వ్యవస్థలపై భారాలు పెరిగి తమ దేశాలు సైతం ప్రమాదపుటంచులకు లాగబడతాయని భయపడ్డాయి. సహాయం చేయకపోతే యూరోజోన్‌ భవితవ్యం ప్రశ్నార్ధకమౌతుందనే డోలాయమానం ఆ దేశాలను ఆవహించింది. ఆర్థిక సహాయం పొందాలంటే గ్రీస్‌ తన ద్రవ్య లోటును జి.డి.పిలో 3%నికి తగ్గించాలని యూరో దేశాలు షరతు పెట్టాయి. ద్రవ్య లోటు అదుపులో భాగంగా గ్రీస్‌, ప్రభుత్వ వ్యయాన్ని భారీగా తగ్గించి, ప్రభుత్వ రంగ ఉద్యోగుల వేతనాలపై, సదుపాయాలపై తీవ్రమైన కోతను విధించాయి. ప్రజాగ్రహం మిన్ను ముట్టింది. తన సందిగ్ధ స్థితిలో యూరోజోన్‌ గ్రీస్‌ను సత్వరం ఆదుకోవటానికి ముందుకు రాలేదు. గ్రీస్‌ కష్టాలు మరింత పెరిగాయి. యూరోపియన్‌ ఆర్థిక వ్యవస్థ ఏకీకరణ అంతిమ లక్ష్యంగా ఏర్పడిన యూరోపియన్‌ ఆర్థిక ద్రవ్య సంఘం, యూరోజోన్‌లకు క్లిష్టసమయాల్లో యూరోపియన్‌ యూనియన్‌ రాజకీయ మద్దతు లేకపోవటంతోనూ, సంక్లిష్ట పరిస్థితులలో ఉమ్మడి బాధ్యతలతో పాటు ద్రవ్య విధానాలలో స్వతంత్ర కార్యాచరణకు వెసులుబాటు లేకపోవటంతోనూ గ్రీస్‌ ఒంటరి పాలుకావటంతో, యూరోజోన్‌ మనుగడ ప్రశ్నార్ధకమైంది. యూరోజోన్‌ ఆర్థిక ప్రగతికి ఊపిరిలూదిన ఉమ్మడి కరెన్సీ భావన నయాఉదారవాద విధానాల నేపధ్యంలో గ్రీస్‌ ఆర్థిక సంక్లిష్టతను మరింతగా పెంచింది.

ముగింపు - తాజాగా యూరోజోన్‌ దేశాలు, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ సంయుక్తంగా గ్రీస్‌కు రుణ సహాయాన్ని అందించటానికి సిద్ధమౌతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అర్జెంటినా రుణ సంక్షోభ సమయాన అంతర్జాతీయ ద్రవ్య సంస్థ పన్నిన కుయుక్తులు ఆ దేశాన్ని మరింత కష్టాల్లోకి దించింది. యూరోజోన్‌ ఆర్థిక సమస్యలలో, అంతర్జాతీయ ద్రవ్య సంస్థ జోక్యం, యూరోజోన్‌లో కొత్త సమస్యలను సృష్టించనున్నది. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి జీవనాధారంగా గల ఆర్థిక వ్యవస్థల తీరుతెన్నులు దినదిన గండాలే.

Sunday, April 11, 2010

యూరోపియన్‌ ఆర్థిక ద్రవ్యసంఘం పరిచయం

యూరోపియన్‌ ఆర్థిక ద్రవ్యసంఘం పరిచయం రెండో భాగం

యూరోపియన్‌ యూనియన్‌ స్థాపనకు, యూరోపియన్‌ ఆర్థిక ద్రవ్య సంఘ నిర్మాణానికి, యూరో(యూరోపియన్‌ యూనియన్‌ ఏకీకృత కరెన్సీ) ఆవిర్భావానికి మాస్ట్రిచ్ట్‌ ఒప్పందం (1991) అతికీలకమైనది. ఈ ఒప్పందం ఆర్థిక ద్రవ్య సంఘాన్ని (ఇ.యం.యు) మూడు దశలలో నిర్మించదలచింది. మొదటి దశ 1990 జులై 1 నుండి ప్రారంభమై యూరోపియన్‌ సభ్య దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యాన్ని సుగమం చేయగలిగే స్వేచ్ఛా పెట్టుబడుల చలనాన్ని ఆవిష్కరించింది. యూరోపియన్‌ యూనియన్‌ ఏర్పాటు ఒప్పందం (1993)లో అతి ముఖ్యమైన అంశంగా దీన్ని పరిగణించారు. 1994 నుండి మొదలైన రెండవ దశలో యూరోపియన్‌ యూనియన్‌ సభ్యదేశాలలో ఆర్ధిక ద్రవ్య సంఘానికి సంబంధించిన చట్ట పరమైన ఏర్పాట్లను పూర్తి చేసారు. 1999 జనవరి 1 నుండి ''ఆర్థిక ద్రవ్య సంఘం'' పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చింది. ఆర్థిక ద్రవ్య సంఘ లక్ష్యాలు ఈ విధంగా ఉన్నాయి. 1. సభ్య దేశాల మధ్య ఆర్థిక విధివిధానాలలో సమన్వయ సాధన. 2.ప్రభుత్వ ఋణం, ద్రవ్య లోటులపై పరిమితులు విధించే ద్రవ్య విధానాలలో (ఫిస్కల్‌ పాలసీలు) సమన్వయ సాధన. 3. యూరోపియన్‌ కేంద్ర బ్యాంకు (ఇ.సి.బి) ఆధ్వర్యంలో సభ్య దేశాలలో స్వతంత్య్ర మార్కెట్‌ మానిటరీ విధాన అమలు సాధన. 4. ఆర్థిక ద్రవ్య సంఘ సభ్య దేశాలలో ఏకీకృత కరెన్సీ ఏర్పాటు. 5. యూరోపియన్‌ యూనియన్‌ మొత్తాన్ని ఏకీకృత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటం.

యూరో ఆవిర్భావం- యూరోపియన్‌ దేశాలలో బాస్కెట్‌ ఆఫ్‌ కరెన్సీల ప్రాతిపదికన నిర్ణయించబడ్డ యూరోపియన్‌ కరెన్సీ యూనిట్‌ (ఇ.సి.యు) స్థానంలో 1999 జనవరి 1 నుండి ''యూరో'' అమలులోకి వచ్చింది. ఆర్థిక ద్రవ్య సంఘ ఏకీకృత కరెన్సీల యూరో చలామణి అవుతుంది. యూరోపియన్‌ యూనియన్‌ దేశాలన్నీ ఆర్థిక ద్రవ్య సంఘ దేశాలైనప్పటికీ వాటిలో (27 దేశాలలో), 16 దేశాలు మాత్రమే యూరో అమలు దేశాలుగా ఉన్నాయి. ధరల స్థిరీకరణ, ప్రభుత్వ ఋణం (జి.డి.పిలో 60%), ద్రవ్య లోటు (జి.డి.పిలో 3%), కరెంట్‌ ఎకౌంటు ఖాతా లోటు (జి.డి.పిలో 4%)లపై నిర్దిష్ట పరిమితులు పాటించి ఆర్థిక వ్యవస్థ క్రమశిక్షణా ప్రమాణాలకు కట్టుబడగలిగిన యూరోపియన్‌ యూనియన్‌ దేశాలలో యూరో అమలు చేయబడింది. సభ్య దేశాలలో యూరో అమలు అర్హతను యూరోపియన్‌ కౌన్సిల్‌ నిర్ణయిస్తుంది. 1999లో బెల్జియం, జర్మనీ, ఐర్లాండ్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, లుగ్జెమ్‌బర్గ్‌, నెదర్లాండ్స్‌, ఆస్ట్రియా, పోర్చుగల్‌, ఫిన్‌లాండ్‌, 2001లో గ్రీసు, 2007లో స్లొవెనియా, 2008లో సైప్రస్‌, మాల్టా, 2009లో స్లొవాకియా దేశాలు యూరోను ఉమ్మడి కరెన్సీగా అంగీకరించాయి. బ్రిటన్‌, డెన్మార్క్‌ దేశాలు నిర్దిష్ట ఆర్థిక ప్రమాణాలు కలిగివున్నా వారివారి దేశీయ కరెన్సీలను అమలు చేసుకుంటూ యూరో చలామణిని అంగీకరించి ఆఫ్షన్‌ దేశాలుగా ఉన్నాయి. మిగిలిన 9 యూరప్‌ దేశాలు యూరో అమలు కాని నాన్‌ యూరోదేశాలుగా ఉన్నాయి. 1999 జనవరి 1 నుండి యూరో అమలులోకి వచ్చినా, అది 2001 డిశంబర్‌ 31 వరకు ''బుక్‌ కరెన్సీ''గానే చలామణి అయ్యింది. 2002 జనవరి 1 వ తేదీ నుండి యూరో నోట్లు, నాణాలు చలామణిలోకి వచ్చాయి. యూరో పూర్తి స్థాయిలో కరెన్సీగా రంగంలోకి దిగింది.

యూరోజోన్‌- ఆర్థిక ద్రవ్య సంఘంలో యూరోను ఏకీకృత కరెన్సీగా అంగీకరించిన 16 దేశాలను 'యూరోజోన్‌' అని, ఈ ప్రాంతాన్ని 'యూరో ఏరియా' అని అంటారు. యూరోపియన్‌ యూనియన్‌ దేశాలన్నింటిలోను యూరో ఆమోదయోగ్యమైన కరెన్సీగా చలామణి అవుతుంది. యూరోజోన్‌ 329 మిలియన్ల ప్రజల్ని ప్రభావితం చేస్తున్నది. యూరోజోన్‌ దేశాలలో ప్రభుత్వ ఋణ విముక్తి కోసం బెయిల్‌ అవుట్‌ పథకాలు ఏదేశానికాదేశం అమలు చేయకూడదు. కరెన్సీ విలువను తగ్గించకూడదు. ఆర్థిక, ద్రవ్య వ్యవహారాలకు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు ఉమ్మడిగానే జరగాలి.

యూరోప్రాబల్యం - అవిచ్ఛిన్నంగా సాగుతున్న డాలర్‌ ఆధిపత్యానికి యూరో ఆవిర్భావం కొంత మేరకు అడ్డుకట్ట వేసింది.యూరో ప్రాంతానికే పరిమితం కాకుండా, అంతర్జాతీయ కరెన్సీగా అమెరికన్‌ డాలర్‌ తరువాత రెండవ స్థానాన్ని యూరో అతి తక్కువ సమయంలో సాధించగలిగింది. 2006 మార్చి నాటికి అంతర్జాతీయ ఋణ మార్కెట్‌ లావాదేవీలలో అమెరికన్‌ డాలర్‌ 44% ఉండగా యూరో 33 శాతాన్ని, విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌ లావాదేవీలలో యూరో 40 శాతాన్ని కలిగి ఉంది. ప్రపంచంలోనే విదేశీ మారక నిల్వలలో యూరో నాల్గవ వంతు పొంది, వర్ధమాన దేశాల నిల్వలలో 30% కల్గివుంది. అమెరికా, ఇరాక్‌ మధ్య తలెత్తిన సంక్షోభం సందర్భంగా చమురు వాణిజ్యాన్ని డాలర్‌కు బదులు యూరోలో నెరుపుతానన్న సద్దాం హుస్సేన్‌ బెదిరింపు అమెరికాకు గంగవెర్రులెత్తించింది. ఇటీవలి ప్రపంచ ఆర్థిక సంక్షోభ ప్రథమార్ధంలో యూరో ప్రాబల్యం అనూహ్యంగా పెరిగింది. అమెరికన్‌ డాలర్‌ను తలదన్ని యూరో అంతర్జాతీయ ప్రత్యామ్నాయ కరెన్సీ హోదాకు పరిశీలించగలిగిన స్థాయికి ఎదిగింది. కాని ద్వితీయార్ధంలో యూరోజోన్‌ ఎదుర్కొంటున్న కష్టాలు అనేకం. యూరోజోన్‌ చక్రబంధంలో గ్రీస్‌ తదితర యూరో దేశాలు ఇరుక్కుపోయి, సార్వభౌమ ఋణ సంక్షోభంలో పడ్డాయి. యూరోపియన్‌ యూనియన్‌ను ఏకీకృత ఆర్థిక వ్యవస్థగా మలచి మహత్తర శక్తిగా నిలబెట్టడం కోసం ఏర్పడ్డ యూరోపియన్‌ ఆర్థిక ద్రవ్య సంఘం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నది.

Friday, April 9, 2010

ఆర్థిక ద్రవ్యసంఘం పరిచయం

ఆర్థిక ద్రవ్యసంఘం పరిచయం -

ఇటీవలి ప్రపంచ ఆర్థిక సంక్షోభ ధాటికి యూరోపియన్‌ యూనియన్‌ దేశమైన గ్రీసు కుప్పకూలటం అందరికీ తెలిసిన విషయమే. ఈ దేశం 300 బిలియన్‌ యూరోల సార్వభౌమ ఋణ చెల్లింపు వైఫల్యాల సుడిగుండంలో ఇరుక్కున్నది. ఫలితంగా యూరోపియన్‌ యూనియన్‌ ఐక్యత, యూరో కరెన్సీ మనుగడ, ఆర్థిక ద్రవ్య సంఘ అస్థిత్వాలపై తీవ్రమైన విమర్శలు, చర్చలు చెలరేగుతున్నాయి.

యూరోపియన్‌ సంఘం (యూరోపియన్‌ యూనియన్‌-ఇ.యు)- మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలతో చవిచూసిన అపార నష్టాలనుండి రక్షించుకోవడం కోసం, ఆర్థిక పరిపుష్టిని పెంచుకొని ప్రపంచ వాణిజ్యంలో గణనీయమైన శక్తిగా యూరోపియన్‌ దేశాలు ఎదగడం కోసం యూరోపియన్‌ యూనియన్‌ ఆవిర్భవించింది. 1951లో పారిస్‌లో యూరప్‌ దేశాల ఐక్యతకు శ్రీకారం చుట్టబడి, 1952లో యూరోపియన్‌ బొగ్గు, ఉక్కు సమాజం పేర (యూరోపియన్‌ కోల్‌ Ê స్టీల్‌ కమ్యూనిటి) ఫ్రాన్స్‌, ఇటలీ, నెదర్లాండ్స్‌, బెల్జియం, పశ్చిమ జర్మనీ, లుగ్జెంబర్గ్‌ దేశాల మద్య కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యంతో యూరోపియన్‌ యూనియన్‌ స్థాపనకు పునాదులు పడ్డాయి. 1957 సం||లో ఈ దేశాలు యూరోపియన్‌ ఆర్థిక సమాజం (యూరోపియన్‌ ఎకనామిక్‌ కమ్యూనిటి - ఇ.ఇ.సి) పేర ఒక కష్టమ్స్‌ యూనియన్‌ గాను, అణుశక్తిని అభివృద్ధి చేయటానికి యూరోపియన్‌ అణుశక్తి సమాజం (యూరోపియన్‌ అటామిక్‌ ఎనర్జీ కమ్యూనిటి) గాను ఏర్పడ్డాయి. 1967లో మెర్జర్‌ ఒప్పందం ద్వారా యూరోపియన్‌ సమాజం (యూరోపియన్‌ కమ్యూనిటి - ఇ.సి) ఏర్పడి, 1973లో అంతిమంగా మాస్ట్రీచ్ట్‌ ఒప్పందం ద్వారా యూరోపియన్‌ సమాజం (యూరోపియన్‌ యునియన్‌) ఆవిర్భవించింది. దీనిలో 27 యూరప్‌ దేశాలు సభ్య దేశాలుగా ఉండి 500 మిలియన్ల పౌరుల్ని కలిగివుంది. యూరప్‌ దేశాలలో ఏకీకృత మార్కెట్‌ వ్యవస్థను ఏర్పాటు చేసి, తమ సభ్య దేశాలలోని ప్రజలు, సరుకులు, సేవలు, పెట్టుబడిరంగాలలో స్వేచ్ఛా చలనాన్ని యూరోపియన్‌ యూనియన్‌ ఏర్పరిచింది. ఫలితంగా స్థూల ప్రపంచ ఉత్పత్తిలో యూరోపియన్‌ యూనియన్‌ 30% వాటాని కలిగివుంది. యూరోపియన్‌ యూనియన్‌లో ఏ దేశాని కా దేశం అభివృద్ధి అవుతూ, యూరోపియన్‌ యూనియన్‌ సమగ్రాభివృద్ధికి దోహదపడుతున్నది. రాజకీయంగా యూరోపియన్‌ యూనియన్‌ ప్రపంచ చరిత్రలో మహత్తర శక్తిగా ఎదిగింది.


మొదటి భాగం

ఆర్థిక ద్రవ్య సంఘం(ఎకనామిక్‌ మానిటరీ యూనియన్‌ - ఇ.యం.యు)- యూరప్‌ దేశాల ఆర్థిక వ్యవస్థలు పటిష్టమై, ప్రపంచ వాణిజ్యంలో బలమైన శక్తిగా ఎదగటానికి సాధనంగా ''ఆర్థిక ద్రవ్య సంఘం భావన'' ఆవిర్భవించింది. యూరప్‌ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని ఏకీకృతం చేసే సాధనమే ఆర్థిక ద్రవ్య సంఘం. యూరోపేతర దేశాలతో పటిష్టమైన వాణిజ్యాన్ని నెరపడం కోసం, ఆర్థిక సంక్షోభాలనుండి ఆర్థిక వ్యవస్థల్ని రక్షించుకోవడం కోసం యూరప్‌ దేశాల ఆర్థిక వ్యవస్ధల మధ్య అంతర్గత ఆర్థిక ద్రవ్య సమన్వయముండాలని 1969లో బర్‌ నివేదిక పేర్కొంది. ఈ కార్య సాధనకు ఆర్థిక ద్రవ్య సంఘం ఉండాలని భావించి అక్టోబర్‌ 1970 నాటికి వార్నర్‌ ప్రణాళిక పేర కార్యాచరణ బ్లూప్రింట్‌ తయారుచేయబడింది. అంతర్జాతీయ కరెన్సీ ప్రమాణంగా బంగారం స్థానంలో డాలర్‌ను అమెరికా ఏక పక్షంగా రుద్దిన సంక్షోభ ఫలితంగాను, 1972లో చమురు సంక్షోభంతో పెరిగిన ధరల మూలకంగాను ఈ ప్రణాళిక అమలుకు నోచుకోలేకపోయింది. కాని ఈ సంక్షోభం నుండి బయటపడటానికి 1973లో ''యూరోపియన్‌ ద్రవ్య సహకారనిధి'' ఏర్పాటు చేయబడింది. యూరప్‌ దేశాల సంఘీభావం నిలబెట్టబడింది. 1979లో ఏర్పడ్డ చమురు సంక్షోభంలో ఆర్థిక ద్రవ్య సంఘ భావన కంటె, ఏకీకృత మార్కెట్‌ భావన ప్రముఖంగా ముందుకొచ్చింది. 1987లో ఏర్పడ్డ ఏకీకృత మార్కెట్‌ చట్టం అమలుతో వివిధ యూరప్‌ దేశాల మద్య పన్నుల విధింపులో సామరస్యం, ఆరోగ్యకర పోటీ ఆవశ్యకతలు అనివార్యమయ్యాయి. వీటికి కొనసాగింపుగా ఏకీకృత మార్కెట్‌కు, ఏకీకృత కరెన్సీ దోహదపడుతూ పుష్కలంగా మార్కెట్లను చేజిక్కించుకోగలమనే విశ్వాసం యూరప్‌ దేశాలలో పెరిగింది