Sunday, April 11, 2010

యూరోపియన్‌ ఆర్థిక ద్రవ్యసంఘం పరిచయం

యూరోపియన్‌ ఆర్థిక ద్రవ్యసంఘం పరిచయం రెండో భాగం

యూరోపియన్‌ యూనియన్‌ స్థాపనకు, యూరోపియన్‌ ఆర్థిక ద్రవ్య సంఘ నిర్మాణానికి, యూరో(యూరోపియన్‌ యూనియన్‌ ఏకీకృత కరెన్సీ) ఆవిర్భావానికి మాస్ట్రిచ్ట్‌ ఒప్పందం (1991) అతికీలకమైనది. ఈ ఒప్పందం ఆర్థిక ద్రవ్య సంఘాన్ని (ఇ.యం.యు) మూడు దశలలో నిర్మించదలచింది. మొదటి దశ 1990 జులై 1 నుండి ప్రారంభమై యూరోపియన్‌ సభ్య దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యాన్ని సుగమం చేయగలిగే స్వేచ్ఛా పెట్టుబడుల చలనాన్ని ఆవిష్కరించింది. యూరోపియన్‌ యూనియన్‌ ఏర్పాటు ఒప్పందం (1993)లో అతి ముఖ్యమైన అంశంగా దీన్ని పరిగణించారు. 1994 నుండి మొదలైన రెండవ దశలో యూరోపియన్‌ యూనియన్‌ సభ్యదేశాలలో ఆర్ధిక ద్రవ్య సంఘానికి సంబంధించిన చట్ట పరమైన ఏర్పాట్లను పూర్తి చేసారు. 1999 జనవరి 1 నుండి ''ఆర్థిక ద్రవ్య సంఘం'' పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చింది. ఆర్థిక ద్రవ్య సంఘ లక్ష్యాలు ఈ విధంగా ఉన్నాయి. 1. సభ్య దేశాల మధ్య ఆర్థిక విధివిధానాలలో సమన్వయ సాధన. 2.ప్రభుత్వ ఋణం, ద్రవ్య లోటులపై పరిమితులు విధించే ద్రవ్య విధానాలలో (ఫిస్కల్‌ పాలసీలు) సమన్వయ సాధన. 3. యూరోపియన్‌ కేంద్ర బ్యాంకు (ఇ.సి.బి) ఆధ్వర్యంలో సభ్య దేశాలలో స్వతంత్య్ర మార్కెట్‌ మానిటరీ విధాన అమలు సాధన. 4. ఆర్థిక ద్రవ్య సంఘ సభ్య దేశాలలో ఏకీకృత కరెన్సీ ఏర్పాటు. 5. యూరోపియన్‌ యూనియన్‌ మొత్తాన్ని ఏకీకృత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటం.

యూరో ఆవిర్భావం- యూరోపియన్‌ దేశాలలో బాస్కెట్‌ ఆఫ్‌ కరెన్సీల ప్రాతిపదికన నిర్ణయించబడ్డ యూరోపియన్‌ కరెన్సీ యూనిట్‌ (ఇ.సి.యు) స్థానంలో 1999 జనవరి 1 నుండి ''యూరో'' అమలులోకి వచ్చింది. ఆర్థిక ద్రవ్య సంఘ ఏకీకృత కరెన్సీల యూరో చలామణి అవుతుంది. యూరోపియన్‌ యూనియన్‌ దేశాలన్నీ ఆర్థిక ద్రవ్య సంఘ దేశాలైనప్పటికీ వాటిలో (27 దేశాలలో), 16 దేశాలు మాత్రమే యూరో అమలు దేశాలుగా ఉన్నాయి. ధరల స్థిరీకరణ, ప్రభుత్వ ఋణం (జి.డి.పిలో 60%), ద్రవ్య లోటు (జి.డి.పిలో 3%), కరెంట్‌ ఎకౌంటు ఖాతా లోటు (జి.డి.పిలో 4%)లపై నిర్దిష్ట పరిమితులు పాటించి ఆర్థిక వ్యవస్థ క్రమశిక్షణా ప్రమాణాలకు కట్టుబడగలిగిన యూరోపియన్‌ యూనియన్‌ దేశాలలో యూరో అమలు చేయబడింది. సభ్య దేశాలలో యూరో అమలు అర్హతను యూరోపియన్‌ కౌన్సిల్‌ నిర్ణయిస్తుంది. 1999లో బెల్జియం, జర్మనీ, ఐర్లాండ్‌, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, లుగ్జెమ్‌బర్గ్‌, నెదర్లాండ్స్‌, ఆస్ట్రియా, పోర్చుగల్‌, ఫిన్‌లాండ్‌, 2001లో గ్రీసు, 2007లో స్లొవెనియా, 2008లో సైప్రస్‌, మాల్టా, 2009లో స్లొవాకియా దేశాలు యూరోను ఉమ్మడి కరెన్సీగా అంగీకరించాయి. బ్రిటన్‌, డెన్మార్క్‌ దేశాలు నిర్దిష్ట ఆర్థిక ప్రమాణాలు కలిగివున్నా వారివారి దేశీయ కరెన్సీలను అమలు చేసుకుంటూ యూరో చలామణిని అంగీకరించి ఆఫ్షన్‌ దేశాలుగా ఉన్నాయి. మిగిలిన 9 యూరప్‌ దేశాలు యూరో అమలు కాని నాన్‌ యూరోదేశాలుగా ఉన్నాయి. 1999 జనవరి 1 నుండి యూరో అమలులోకి వచ్చినా, అది 2001 డిశంబర్‌ 31 వరకు ''బుక్‌ కరెన్సీ''గానే చలామణి అయ్యింది. 2002 జనవరి 1 వ తేదీ నుండి యూరో నోట్లు, నాణాలు చలామణిలోకి వచ్చాయి. యూరో పూర్తి స్థాయిలో కరెన్సీగా రంగంలోకి దిగింది.

యూరోజోన్‌- ఆర్థిక ద్రవ్య సంఘంలో యూరోను ఏకీకృత కరెన్సీగా అంగీకరించిన 16 దేశాలను 'యూరోజోన్‌' అని, ఈ ప్రాంతాన్ని 'యూరో ఏరియా' అని అంటారు. యూరోపియన్‌ యూనియన్‌ దేశాలన్నింటిలోను యూరో ఆమోదయోగ్యమైన కరెన్సీగా చలామణి అవుతుంది. యూరోజోన్‌ 329 మిలియన్ల ప్రజల్ని ప్రభావితం చేస్తున్నది. యూరోజోన్‌ దేశాలలో ప్రభుత్వ ఋణ విముక్తి కోసం బెయిల్‌ అవుట్‌ పథకాలు ఏదేశానికాదేశం అమలు చేయకూడదు. కరెన్సీ విలువను తగ్గించకూడదు. ఆర్థిక, ద్రవ్య వ్యవహారాలకు సంబంధించిన అన్ని కీలక నిర్ణయాలు ఉమ్మడిగానే జరగాలి.

యూరోప్రాబల్యం - అవిచ్ఛిన్నంగా సాగుతున్న డాలర్‌ ఆధిపత్యానికి యూరో ఆవిర్భావం కొంత మేరకు అడ్డుకట్ట వేసింది.యూరో ప్రాంతానికే పరిమితం కాకుండా, అంతర్జాతీయ కరెన్సీగా అమెరికన్‌ డాలర్‌ తరువాత రెండవ స్థానాన్ని యూరో అతి తక్కువ సమయంలో సాధించగలిగింది. 2006 మార్చి నాటికి అంతర్జాతీయ ఋణ మార్కెట్‌ లావాదేవీలలో అమెరికన్‌ డాలర్‌ 44% ఉండగా యూరో 33 శాతాన్ని, విదేశీ మారక ద్రవ్య మార్కెట్‌ లావాదేవీలలో యూరో 40 శాతాన్ని కలిగి ఉంది. ప్రపంచంలోనే విదేశీ మారక నిల్వలలో యూరో నాల్గవ వంతు పొంది, వర్ధమాన దేశాల నిల్వలలో 30% కల్గివుంది. అమెరికా, ఇరాక్‌ మధ్య తలెత్తిన సంక్షోభం సందర్భంగా చమురు వాణిజ్యాన్ని డాలర్‌కు బదులు యూరోలో నెరుపుతానన్న సద్దాం హుస్సేన్‌ బెదిరింపు అమెరికాకు గంగవెర్రులెత్తించింది. ఇటీవలి ప్రపంచ ఆర్థిక సంక్షోభ ప్రథమార్ధంలో యూరో ప్రాబల్యం అనూహ్యంగా పెరిగింది. అమెరికన్‌ డాలర్‌ను తలదన్ని యూరో అంతర్జాతీయ ప్రత్యామ్నాయ కరెన్సీ హోదాకు పరిశీలించగలిగిన స్థాయికి ఎదిగింది. కాని ద్వితీయార్ధంలో యూరోజోన్‌ ఎదుర్కొంటున్న కష్టాలు అనేకం. యూరోజోన్‌ చక్రబంధంలో గ్రీస్‌ తదితర యూరో దేశాలు ఇరుక్కుపోయి, సార్వభౌమ ఋణ సంక్షోభంలో పడ్డాయి. యూరోపియన్‌ యూనియన్‌ను ఏకీకృత ఆర్థిక వ్యవస్థగా మలచి మహత్తర శక్తిగా నిలబెట్టడం కోసం ఏర్పడ్డ యూరోపియన్‌ ఆర్థిక ద్రవ్య సంఘం గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నది.

No comments: