Thursday, August 26, 2010

ద్రవ్య పునాది విస్తరణ

(ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌)

bpl11వ పంచవర్ష ప్రణాళికలో 'సమ్మిళిత అభివృద్ధి'(ఇన్‌క్లూజివ్‌ డెవలప్‌మెంట్‌)ని లక్ష్యంగా కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు ముఖ్యమైన సాధనంగా ద్రవ్య, బ్యాంకింగ్‌ సేవల పునాది విస్తరణ ఉపయోగపడుతుందని భావించింది. ఈ అవగాహనను ముందుకు తీసుకెళ్ళడం కోసం 2006 సం|| బడ్జెట్‌ ప్రసంగంలో అప్పటి ఆర్థిక మంత్రి, ''ద్రవ్య పునాది విస్తరణ (పైనాన్షియల్‌ ఇక్లూజన్‌)''కు సంబంధించిన భావనను పరిచయం చేసి, ఈ దిశలో భారతదేశ పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం రంగరాజన్‌ కమిటీని నియమించారు. ఆ కమిటీ 04.01.2008న తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ''అసంఖ్యాకమైన భారత ప్రజానీకం ద్రవ్య సేవల ప్రయోజనాలను పొందలేక పోతున్నారని, ఆ లోపాన్ని పూడ్చకుండా ఆర్థిక వృద్ధి ఫలితాలు వారికందవ''ని చెబుతూనే, అందుకు చేపట్టాల్సిన చర్యలను కమిటీ సిఫార్సు చేసింది. 2010 బడ్జెట్‌ ప్రసంగం వరకు చడీచప్పుడు చేయని కేంద్ర ప్రభుత్వం గత కొద్ది నెలలుగా ఈ భావనను, దాని ద్వారా కలిగే ప్రయోజనాల గురించి ఊదరగొడ్తోంది. ఈ భావనల ప్రచారానికి ప్రభుత్వ విధానాల ప్రకటనలు, ప్రజా ప్రాతినిధ్యం వహించే సంస్థలను వేదికలు చేసుకొని కాకుండా సి.ఐ.ఐ (ఛాంబర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండిస్టీ), జి-20 సమావేశాలలో, ప్రభుత్వ రంగ బ్యాంకు అధిపతులు, గ్రామీణ బ్యాంకు అధిపతుల సమావేశాలను ఎంచుకోవటం జరిగింది. ఈ నేపధ్యంలో ద్రవ్య పునాది విస్తరణ అంటే ఏమిటో, దాన్ని సాధించటానికి ఎంచుకున్న మార్గాలు, ప్రయత్నాలను పరిశీలిద్దాం.

ద్రవ్య పునాది విస్తరణ

వస్తూత్పత్తి రంగాన్ని నిజ ఆర్థిక వ్యవస్థగా పరిగణిస్తాం. నిజ ఆర్థిక వ్యవస్థకు ద్రవ్య ఆర్థిక వ్యవస్థ గుండెకాయలాంటిది. నిజ ఆర్థిక వ్యవస్థకు కావలసిన ద్రవ్య వనరులన్నింటినీ ద్రవ్య ఆర్థిక వ్యవస్థ తగినంత సమకూర్చినప్పుడు ఆర్థిక వృద్ధి సజావుగా సాగుతుంది. ద్రవ్య వ్యవస్థలో ద్రవ్య (డబ్బు) లావాదేవీలన్నింటికీ బ్యాంకింగ్‌ వ్యవస్థ వాహకంగా ఉంటుంది. అందువల్ల నిజ ఆర్థిక వ్యవస్థకు, ద్రవ్య ఆర్థిక వ్యవస్థ దోస్తీగా ఉండటం ప్రజాజీవనానికి ఎల్లవేళలా శ్రేయస్కరమైనది. ప్రపంచీకరణ క్రమంలో ద్రవ్య ఆర్థిక వ్యవస్థ ప్రాధాన్యత పెరిగి, నిజ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం వహించడం మనం చూస్తున్నాం. ఈ విధానాలతో సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమై, ఆర్థిక అసమానతలు పెరిగాయి. అనేక దేశాలలో ద్రవ్య సేవలు (ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌) అసంఖ్యాకమైన అణగారిన ప్రజానీకానికి చేరలేక పోవడమే ఈ అసమానతల కారణంగా వాదనలు మొదలయ్యాయి. ద్రవ్య సేవలంటే, డిపాజిట్లు, రుణాలు, నగదుబదిలీలులాంటి బ్యాంకింగ్‌ కార్యకలాపాలు, మైక్రోఫైనాన్స్‌, ఇన్సూరెన్స్‌, స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు మొదలైనవి. ఈ సేవల్ని అణగారిన, అల్పాదాయ వర్గాలకు అందించడమే ద్రవ్య పునాది విస్తరణగా నిర్వచిస్తున్నారు. ఈ ప్రజానీకం ద్రవ్య వ్యవస్థతో అనుసంధానమైతే, ఆ ద్రవ్య వ్యవస్థ అందించే ఫలితాలు పొందగలుగుతారన్నది వారి భావన.

బ్యాంకింగ్‌ పునాది విస్తరణ(ఇన్‌క్లూజివ్‌ బ్యాంకింగ్‌)

ద్రవ్య సేవలకు వాహకమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ, బ్యాంకింగ్‌ సేవలను, అది అందుబాటులో లేని ప్రాంతాలకు, ప్రజానీకానికి విస్తరింపజేయటమే ''బ్యాంకింగ్‌ పునాది విస్తరణ''గా చెప్పబడుతుంది.

అంతర్జాతీయ అనుభవం

అభివృద్ది చెందిన దేశాలైన డెన్మార్క్‌లో 99%, జర్మనీలో 91%, ఫ్రాన్స్‌లో 96% ప్రజలకు ద్రవ్య సేవలు అందుబాటులో ఉండగా, అభివృద్ధి చెందుతున్న దేశాలలో 20% నుంచి 30% వరకు ప్రజానీకానికి మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఈ దేశాలలో అత్యధిక ప్రజలు గ్రామాలలో అల్పదాయ వర్గాలుగా ఉండటం, గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళి, అక్కడి పట్టణ పేదరికాన్ని పెంచడం జరుగుతోంది.

భారతదేశంలో ద్రవ్య సేవల లభ్యత

మన దేశంలోని 6 లక్షల గ్రామాలలో 30 వేల గ్రామాలలో మాత్రమే వాణిజ్య బ్యాంకుల శాఖలున్నాయి. దేశ జనాభాలో 34% మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలున్నాయి. అంతర్జాతీయంగా 100 దేశాలలో ''ద్రవ్య, బ్యాంకింగ్‌ సేవల లభ్యత సూచి''లో మన దేశం 50వ స్థానంలో ఉంది. ఈశాన్య రాష్ట్రాలలో బ్యాంకింగ్‌ రంగ విస్తరణ మరింత తక్కువగా ఉంది. అదే సందర్భంలో భారతదేశంలోని జనాభాలో 10% జీవిత బీమాను, 0.6% సాధారణ బీమాను, 13% డెబిట్‌ కార్డులను, 2% క్రెడిట్‌ కార్డులను కలిగి ఉన్నారని ఒక సర్వేలో తేలింది. జాతీయ శాంపిల్‌ సర్వే ప్రకారం 8 కోట్ల 93 లక్షల వ్యవసాయ కుటుంబాలలో 51%మంది బ్యాంకులతో ఏ విధమైన లావాదేవీలు లేనివారుగా ఉన్నారు.

బ్యాంకింగ్‌ రంగ విస్తరణలో జాతీయ బ్యాంకుల పాత్ర

1969 వరకు కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బ్యాంకింగ్‌ రంగం, జాతీయకరణతో డిపాజిట్ల సేకరణలోను, రుణాల పంపిణీలోను అసాధారణ పాత్రను నిర్వహించింది. 1951లో వాణిజ్య బ్యాంకులు, కో-ఆపరేటివ్‌ సొసైటీల ద్వారా 7.3% వనరులు పంపిణీ కాగా 1991 నాటికి అది 66.3% అయ్యింది. 1969 జూన్‌ నాటికి 8,262 గా ఉన్న బ్యాంకు శాఖలు మార్చి 2006 నాటికి 69,471 కి పెరిగాయి. జూన్‌ 1969లో 64 వేల మంది ప్రజలకు ఒక బ్యాంకు శాఖ ఉండగా, 2006 నాటికి 16 వేల మంది ప్రజలకు ఒక బ్యాంకు శాఖ ఉన్నది. బ్యాంకు శాఖలలో జూన్‌ 1969 నాటికి గ్రామీణ శాఖలు 22.2% గా ఉండగా, మార్చి 98 నాటికి అది 51% అయ్యింది. ప్రాంతీయ గ్రామీణబ్యాంకు శాఖలు మారుమూల గ్రామాలకు విస్తరించడం, పోలీస్‌ స్టేషన్లు పెట్టలేని చోట్ల కూడ గ్రామీణ బ్యాంకు శాఖలను ఏర్పాటు చేసి సేవలనందిస్తున్నాయి. కాని ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాక జాతీయ బ్యాంకులు తీవ్రమైన ఒత్తిడి పరీక్షలు ఎదుర్కొంటున్నాయి. సేవాదృక్పథం స్థానంలో లాభాల ధ్యేయం చోటుచేసుకున్నాయి. కష్టమర్ల ఛార్జీలు భారీగా పెరిగాయి. సాంకేతికాభివృద్ధితో మెరుగైన సేవలను ప్రజానీకం ఆహ్వానిస్తున్నా, 2004-2009 కాలంలో జాతీయ బ్యాంకులలో ప్రభుత్వ మూల ధన వాటాలు తగ్గటం, ప్రయివేటు విదేశీ బ్యాంకుల ప్రవేశంతో శాఖల విస్తరణ మెట్రోనగరాలకు, పట్టణ ప్రాంతాలకు పరిమితమయ్యాయి. నష్టాలొస్తున్నాయన్న సాకుతో అనేక గ్రామాలలో బ్యాంకు శాఖలు మూసివేయబడటమో లేదా దగ్గరి పట్టణానికి తరలించడమో జరిగింది. గ్రామీణ బ్యాంకులు కూడా వాణిజ్య బ్యాంకుల పద్ధతిలో సేవలనందిచడం, బ్యాంకు సిబ్బంది కొరతతో వాటి లక్ష్యాలకు దూరమౌతున్నాయి. ఆర్థిక సంక్షోభం నుండి భారత ఆర్థిక వ్యవస్థను రక్షించిన జాతీయ బ్యాంకింగ్‌ రంగాన్ని బ్యాంకింగ్‌ సంస్కరణలు దెబ్బతీస్తున్నాయి.

Sunday, August 8, 2010

బ్యాంకులకు ఒత్తిడి పరీక్షలు-ఒక పరిశీలన

గుండె నొప్పి అంటూ వచ్చిన రోగికి, గుండె పటిష్టత అంచనా కట్టేందుకు డాక్టర్‌ నిర్వహించే ఒత్తిడి పరీక్షల (స్ట్రెస్‌ టెస్టులు) వలె, ఇటీవల యూరోపియన్‌ యూనియన్‌ బ్యాంకుల పటిష్టతను అంచనా వేసేందుకు యూరోపియన్‌ యూనియన్‌ బ్యాంకింగ్‌ సూపర్‌ వైజర్స్‌ కమిటి ఒత్తిడి పరీక్షలను నిర్వహించింది. యూరోజోన్‌ ఎదుర్కొన్న సార్వభౌమ రుణ చెల్లింపు వైఫల్య సంక్షోభంతో శృంగభంగమైన 91 యూరోపియన్‌ బ్యాంకులలో, 7 బ్యాంకులు ఒత్తిడి పరీక్షలలో నెగ్గలేదని ఆ కమిటీ ప్రకటించింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భారతీయ రిజర్వ్‌ బ్యాంకు, ప్రపంచ ఆర్థిక సంక్షోభ తదనంతర కాలంలో తామూ, రుణాలు, వడ్డీ రేట్ల సంకటాలను (రిస్క్‌) తట్టుకోకలిగే స్తోమతపై భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఒత్తిడి పరీక్షలు నిర్వహించామని, భారతీయ బ్యాంకులు పటిష్టంగా ఉన్నాయన్నారు. రానున్న కాలంలో దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ విశ్వాసనీయతను పెంచేందుకు, మరిన్ని అధునాతనమైన ఒత్తిడి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోగల విశిష్టమైన వ్యవస్థగా భారతీయ బ్యాంకింగ్‌ ప్రపంచ వ్యాప్తంగా కీర్తింపబడుతున్న కాలంలో, రిజర్వ్‌ బ్యాంకు ప్రకటన విస్మయాన్ని కల్గిస్తుంది.

ఒత్తిడి పరీక్షలు - ఏమిటి, ఎందుకు?

అనూహ్యమైన సంక్లిష్ట పరిస్థితుల ప్రభావాల నుండి తట్టుకోవటానికి అవసరమైన నికర సంపద (పెట్టుబడి) ఒక బ్యాంకు కలిగి ఉందా, లేదా అనే అంశాన్ని లోతుగా పరిశీలించే పరీక్షలు ఒత్తిడి పరీక్షలుగా చెప్తున్నారు. సామాన్యంగా ప్రతి బ్యాంకు స్వీయ పరిశీలనగా ఈ పరీక్షలు నిర్వహిస్తాయి. స్థూలంగా బ్యాంకింగ్‌ వ్యవస్థను అస్థిర పరిచే పరిస్థితులు తలెత్తినా, లేదా అటువంటి పరిస్థితులకు అవకాశం ఉన్నా, ఆ దేశ కేంద్ర బ్యాంకు, ప్రభుత్వం ఇలాంటి పరీక్షలు నిర్వహించుకుంటాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తుత్పత్తి రంగంపై, ద్రవ్య ఆర్థిక వ్యవస్థ(ద్రవ్య పెట్టుబడి) అపరిమితమైన ఆధిపత్యాన్ని చలాయిస్తున్న కాలంలో అనిశ్చితి (రిస్క్‌) వ్యవస్థీకృతమైంది, విశ్వవ్యాప్తమైంది. ఒత్తిడి పరిస్థితుల అవసరాలు ఈ నేపథ్యంలో బ్యాంకింగ్‌ వ్యవస్థలో నిత్య కృత్యమయ్యాయి.

వివిధ బ్యాంకింగ్‌ రిస్క్‌లు

సామాన్యంగా బ్యాంకింగ్‌ వ్యవస్థను దెబ్బతీసే సంకటాలు (రిస్క్‌లు) 1. రుణ సంకటాలు (క్రెడిట్‌ రిస్క్‌) 2. మార్కెట్‌ సంకటాలు(మార్కెట్‌ రిస్క్‌) 3. నిధుల లభ్యత సంకటాలు (లిక్విడిటీ రిస్క్‌).

రుణ సంకటాలు

బ్యాంకులు అందించే వివిధ రుణాల ద్వారా ఉద్భవించే సంకటాలు రుణ సంకటాలు. సరియైన హామీ లేకపోవటం లేదా చెల్లించే స్థోమత లేకపోవటం లాంటివి వీటికి సాధరణమైన కారణాలుగా ఉంటాయి. పారు బాకీలు, నిరర్ధక ఆస్థులు ఇందులో భాగాలు. అమెరికాలో గృహ రుణ సంక్షోభం ఇందుకు తాజా ఉదాహరణ.

మార్కెట్‌ సంకటాలు

ద్రవ్య మారకపు విలువలు, వడ్డీ రేట్లు, ఈక్విటీలు, బాండులు, డెరివేటివ్‌లు లాంటి నూతన ద్రవ్య ఉత్పత్తుల ధరలలోని అనిశ్ఛితితో ఏర్పడేవి మార్కెట్‌ సంకటాలు. యూరోజోన్‌ సార్వభౌమ రుణ చెల్లింపు వైఫల్య సంక్షోభం ఇందుకు ఉదాహరణ.

నిధుల లభ్యత సంకటం

లెహమాన్‌ బ్రదర్స్‌ దివాళాకు ముందుకాలంలో అంతర్జాతీయంగా నిధుల లభ్యత బ్యాంకులకు పెద్ద సమస్యగా ముందుకు రాలేదు. లెహమాన్‌ బ్రదర్స్‌ దివాళా ఉదంతంతో రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ సూత్రాలు తల్లక్రిందులైనాయి. 2008 సం|| బ్యాంకింగ్‌ రంగంలో సృష్టించిన నిధుల లభ్యత(లిక్విడిటీ) కొరత, భయోత్పాతంతో బెంబేలెత్తిన బ్యాంకేతర ద్రవ్య సంస్థలైన మనీ మార్కెట్‌లు బ్యాంకులకు పెట్టుబడులు పెట్టటానికి నిరాకరించాయి. సముచితమైన వడ్డీరేట్లకు నిధులు దొరకక, ఆస్తులు అమ్మి నిధులు సమకూర్చాలన్నా ఆస్తులు విలువలు లేక, డిపాజిట్‌ దారుల డిమాండ్‌ మేరకు నిధులు అందించలేక బ్యాంకులు తల్లడిల్లాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల ఆర్థిక పటిష్టతను బేరీజు వేసుకొని, ఉపద్రవ నివారణా చర్యలకు సమాయత్తం కావడం కోసం నిర్వహించే ఒత్తిడి పరీక్షలు ఆహ్వానించ దగ్గవే. కానీ ఈ సంకటాలకు మూలమైన విధానాల సవరణలకు కాక బ్యాంకులలో జరిగే వివిధ వ్యవస్థీకృత సవరణలే ఆందోళనను కల్గిస్తున్నాయి.

అమెరికాలో ఒత్తిడి పరీక్షలు

2009 ప్రథమార్థంలో అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో అతి పెద్ద 19 బ్యాంకులపై నిర్వహించిన ఒత్తిడి పరీక్షలలో 10 బ్యాంకులు ఉత్తీర్ణతను సాధించలేక పోయాయి. ఈ 10 బ్యాంకులలో 74.6 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి కొరత కావడమే వైఫల్యాలకు కారణంగా నిర్వాహకులు పేర్కొన్నారు. వైఫల్యమైన బ్యాంకులు పెట్టుబడి కొరతను పూడ్చుకొనే మార్గాలను వివరించారు. ఈ ఫలితాల ప్రచార హోరుతో అమెరికాలోని స్టాక్‌ మార్కెట్‌ 7 నెలలో 36% పుంజుకుంది.

యూరోపియన్‌ యూనియన్‌ లో ఒత్తిడి పరీక్షలు

జూలైలో యూరోపియన్‌ యూనియన్‌లు 91 బ్యాంకులకు ఒత్తిడి పరీక్షలు నిర్వహించగా, 7 బ్యాంకులు 3.5 బిలియన్‌ యూరోల పెట్టుబడి కొరత కారణంగా పరీక్షలలో విజయవంతం కాలేదని నిర్వాహకులు తెలియజేసారు. వీటిలో స్పెయిన్‌ దేశంలో 5 బ్యాంకులు, జర్మనీ, గ్రీస్‌లలో ఒక్కొక్క బ్యాంకు ఉన్నాయి. అంటే మిగిలిన బ్యాంకుల ఆర్థిక పటిష్టత బాగున్నట్లే లెక్క. నిరుజ్యోగం 6%, జి.డి.పిలో తగ్గుదల 3%, షేర్‌ మార్కెట్‌ పతనం 20%, మార్కెట్‌ వడ్డీ రేట్ల పెరుగుదల 6% సంభవించిన పరిస్థితులలో నెలకొనే పరిణామాలకు తట్టుకోగలిగే పెట్టుబడి పరిపూర్ణత కలిగిన బ్యాంకులను పరీక్షలలో విజేతలుగా సూత్రీకరించారు. ఈ ఫలితాలతో మార్కెట్‌ వర్గాలు ఊపిరి పీల్చుకొని, ఆర్థిక వ్యవస్థలు గాడిలో పడతాయని, అమెరికాలో మాదిరిగా ఫైనాన్షియల్‌ మార్కెట్‌ జోరుగా ఊపందుకుంటుందని కొండంత ఆశతో యూరోపియన్‌ యూనియన్‌ ఉంది. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌లలో జరిపిన ఒత్తిడి పరీక్షల విశ్వాసనీయతపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముగింపు

ప్రపంచీకరణ నేపథ్యంలో బ్యాంకుల పై పెరిగిన ఒత్తిడి విధానపరమైంది నిజమైన ఒత్తిడి పరీక్షలు పాలక వర్గ ఆర్థిక, ద్రవ్య విధానాలపై ఉండాలి. అందుకు భిన్నంగా అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ లలో నిర్వహించిన పరీక్షలు కేవలం మార్కెట్ల విశ్వాసాన్ని పొందటానికి చేసిన జిమ్మిక్కులే. వీటి ఫలితాలు స్వల్పకాలికాలు. భారతదేశంలో బ్యాంకింగ్‌ రంగంపై నిర్వహింపబడుతున్న ఒత్తిడి పరీక్షల తీరు వేరుగా ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుండి మన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన జాతీయ బ్యాంకింగ్‌ రంగాన్ని భూస్థాపితం చేసి, ఈ రంగాన్ని సంక్షోభానికి కారకులైన విదేశీ బ్యాంకులకు ధారాదత్తం చేయటానికి ఒత్తిడి పరీక్షలను సాధనాలుగా వినియోగిస్తున్నారు. రిజర్వ్‌ బ్యాంకు తాజా ప్రకటన ఇందులో భాగమే. దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సిన ఒత్తిడి పరీక్షల స్థానంలో, సర్వజనీనమైన, ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తించే విధంగా ఈ పరీక్షల ప్రమాణాలను అంతర్జాతీయ సంస్థలు రూపొందిస్తున్నాయి. ఇది జాతీయ ఆర్థిక సార్వభౌమాధికారానికి, స్వావలంబనకు విఘాతం కల్గిస్తుంది.

Sunday, August 1, 2010

మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌-రెండవ భాగం


అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని శాసిస్తున్న కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ విశిష్ట వైభవాన్ని చవిచూసింది. లాభాలు, భద్రత, కోరినప్పుడు డబ్బుగా మార్చుకోగలిగే వెసులుబాటు (లిక్విడిటీ) లాంటి లక్షణాలు పుణికిపుచ్చుకుంటాయని చెప్పుకొనే మ్యూచువల్‌ ఫండ్స్‌, మదుపరులను ఆకట్టుకోవటంలో ఈ మధ్య కాలంలో వెనుకపట్టు పట్టాయి. మన దేశంలో పారిశ్రామిక రంగానికి పెట్టుబడుల్ని సమకూర్చటం, చిన్నమదుపుదారులకు సైతం స్టాక్‌ మార్కెట్‌ ప్రయోజనాల్ని అందించడం లాంటి లక్ష్యాలతో ప్రారంభమైన మ్యూచువల్‌ ఫండ్‌ రంగ అభివృద్ధి క్రమాన్ని సంక్షిప్తంగా సమీక్షిద్దాం.
మనదేశంలో మ్యూచువల్‌ ఫండ్‌ రంగం అభివృద్ధి

మ్యూచువల్‌ ఫండ్‌ వాణిజ్యాన్ని సెబి (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా) నియంత్రిస్తుండగా, అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎ.యం.ఎఫ్‌.ఐ) మ్యూచువల్‌ ఫండ్స్‌ గురించి మదుపుదారులలోను, పంపిణిదారులలోను అవగాహనను, పరిజ్ఞానాన్ని పెంచడంకోసం కృషి చేస్తుంది. 1963లో ప్రభుత్వరంగమైన యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (యు.టి.ఐ) పేరు మీద ప్రారంభమైన మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో 1987 నాటికి జాతీయ బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు ప్రవేశించాయి. 1988 చివరికి ఈ రంగంలో ''యాజమాన్యంలోని సగటు ఆస్తుల విలువ'' (యావరేజ్‌ ఎస్సెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ - ఎ.యు.యం) రూ. 6,700 కోట్లుగా ఉంది. 1993లో ఈ పరిశ్రమలోకి ప్రయివేట్‌ కంపెనీలు ప్రవేశించి ఎ.యు.యం రూ. 47,004 కోట్లకు చేరి, 2004 నాటికి ఈ విలువ రూ. 1,40,000 కోట్లకు పెరిగింది. 2007 ద్వితీయార్ధం నుండి 2009 ప్రథమార్ధం వరకు ప్రపంచ ఆర్థిక సంక్షోభం దెబ్బకు మ్యూచువల్‌ ఫండ్‌ రంగం చతికిల బడింది. భారత దేశంలో మొట్టమొదటగా ఆగస్టు-నవంబరు 2008 నాటికి ఈ వాణిజ్యం 26.1%నికి పడిపోయింది. కానీ మార్చి-ఆగస్టు 2009 నాటికి పరిస్థితులు మారి, వాణిజ్యం మళ్ళీ 52.1%నికి పెరిగింది. ఈ పెరుగుదల ఈక్విటీ/బ్యాలెన్స్‌డ్‌ పథకాలలో 66%, రుణ పథకాలలో 114.7%గా నమోదైంది. డిశంబర్‌ 2009 నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎ.యు.యం, రూ. 7,61,626 కోట్లకు పెరిగింది. ఇందులో జాతీయ బ్యాంకులు నిర్వహించే మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు 16.28%, యల్‌.ఐ.సి. 6% ఉండగా, ప్రయివేటు రంగంలోని కంపెనీలు (స్వదేశీ, విదేశీ, సంయుక్త రంగాలు) 77.2%గా ఉన్నాయి. అంటే ప్రభుత్వ రంగంలో మొదలైన భారతీయ మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌లో ప్రస్తుతం 3/4 వంతు ప్రయివేటు రంగం హస్తగతం చేసుకుంది.
మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌ తీరుతెన్నులు

భారతదేశంలోని మ్యూచువల్‌ ఫండ్స్‌ ''యాజమాన్యంలోని సగటు ఆస్థుల విలువ (ఎ.యు.యం) లో అత్యధిక భాగం రుణపథకాల (డెట్‌ స్కీమ్స్‌) లోనే ఉంది. ఈక్విటీ పథకాలలో కేవలం 20% (సుమారు) మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నారు. రుణ పధకాలలో అత్యధిక భాగం సంస్థాగత మదుపు దారుల పెట్టుబడులు కాగా, గ్రోత్‌ ఫండ్‌, బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌ పధకాలలో అత్యధికంగా రిటైల్‌ మదుపుదారులు పెట్టుబడులు పెడుతున్నారు. అంటే ఈ వాణిజ్యంలో వ్యక్తిగత మదుపుదారుల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. ఈ పరిశ్రమ, దేశంలో 150 నగరాలకు విస్తరించగా, ఎ.యు.యంలో 85%, 10 మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైంది. అంటే ఈ వాణిజ్యంలో అత్యధిక భాగం నగరాలకే లక్ష్యమైంది. సి.యం.ఐ.ఇ (సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమి) అంచనాల ప్రకారం డిసెంబర్‌-2009 నాటికి భారతదేశ జనాభాలో 8 కోట్ల 76 లక్షల కుటుంబాలు బంగారంలోను, 5 కోట్ల 97 లక్షల కుటుంబాలు జీవిత భీమా లోను, 4 కోట్ల 60 లక్షల కుటుంబాలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల లోను, 9 లక్షల 20 వేల కుటుంబాలు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతుండగా, మ్యూచువల్‌ ఫండ్‌లో కోటి మంది లోపు కుటుంబాలు పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తుంది. భారతదేశంలోని దేశీయ పొదుపులో మ్యూచువల్‌ ఫండ్స్‌ అతి తక్కువ భాగంగా ఉంది.
కలవర పెడుతున్న ఈక్విటీ మదుపరుల నిష్క్రమణ

మార్చి-జూన్‌ 2010 మధ్య కాలంలో మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌లో 7.5 లక్షల ఈక్విటీ ఆధారిత గ్రోత్‌/బ్యాలెన్స్‌ ఫండ్‌ పథకాలలోని ఖాతాలు (ఫోలియోలు) విరమించుకోవడం జరిగింది. ఇదే కాలంలో 1.9 లక్షల నూతన రుణపథకాల ఖాతాలు చేరినా, ఖాతాల భారీ విరమణలు మ్యూచువల్‌ ఫండ్‌ వర్గాల్నికలవరపెటుతున్నాయి. ఎ.యం.ఎఫ్‌.ఐ గణాంకాల ప్రకారం జూన్‌ 2010 నాటికి భారతదేశంలోని మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ 3,578 పథకాలతో, 4,79,41,250 ఖాతాలతో (ఫోలియోలు), 6.7 లక్షల కోట్ల ఎ.యు.యంతో నమోదైయింది. వీటిలో 4కోట్ల 35 లక్షల ఖాతాలు గ్రోత్‌/బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌కు సంబంధించినవి. ఇదే సమయంలో రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ రూ. 1 కోటి 1 లక్ష ఎ.యు.యం తోనూ, యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ 1 కోటి ఖాతాలు (ఫోలియోలు) కలిగి ప్రథమస్థానంలో ఉన్నాయి. ఈ సమయంలో సెన్సెక్స్‌ పెరుగుదల నిలకడగా ఉన్నా, మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో దాదాపు 4 లక్షల ఖాతాల పతనంపై మార్కెట్‌ వర్గాలు, సెబీ మల్లగుల్లలు పడుతున్నాయి.
ఎందుకిలా జరిగింది?

భారతదేశంలోని మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లు ఆకర్షణీయంగా లేవన్న విమర్శలు సర్వత్రా ఉన్నాయి. మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లో చేరేటప్పుడు ఎంట్రీ లోడ్‌ క్రింద 2.5% గతంలో కట్టించుకునేవారు. ఈ సొమ్ము, స్కీమ్‌ సొమ్ముతో పాటు వసూలు చేయబడేది. ఇలా వసూలు చేసిన సొమ్ము మ్యూచువల్‌ ఫండ్‌ పంపిణీదారులకు (ఏజెంట్‌లు/మధ్యవర్తులు) కమీషన్‌ కింద చెల్లింపబడేది. ఆగస్టు 2009లో సెబీ ఈ ఎంట్రీ లోడును రద్దు చేసి, కమీషన్‌ను నేరుగా మదుపుదారుల నుండే వసూలు చేసుకోమని ఆదేశించింది. ఈ చర్యకు వ్యతిరేకంగా పంపిణీదారులు సెబీ కార్యాలయం ముందు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసిన ప్రయోజనం లేకపోయింది. దీనితో పంపిణిదారులు మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్ని ప్రచారం చేయడం, మదుపుదారులను చేర్పించడం మానేసారు. ఇదే సమయంలో ''యూలిప్‌'' (యూనిట్‌ లింక్డ్‌ ఇన్యూరెన్స్‌ పధకం) లలో ఆకర్షణీయమైన కమీషన్‌లు చెల్లిస్తున్న కారణంగా మ్యూచువల్‌ ఫండ్‌లకు ఆదరణ తగ్గి ''యూలిప్‌'' మార్కెట్‌ పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కారణంగానే సెబీ, ''యూలిప్‌'' పథకాలు, మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల పోలికలతో ఉన్నందున వాటిపై నియంత్రణ తమదేనంటూ వివాదానికి దిగటం, అంతిమంగా కేంద్ర ప్రభుత్వం సెబీ అభ్యంతరాల్ని తోసిపుచ్చడం జరిగింది. సెబీ, మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌ మదుపుదారుల ఆదరణను తిరిగి పొందటం కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలు ఏ మేరకు జయప్రదం అవుతాయో కాలమే తేల్చాలి. ''మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల నిర్మాణం సంక్లిష్టమైనందున, వివరించి నచ్చచెప్పే పంపిణీదారుల ఆవశ్యకత అనివార్యమని, అందువల్లే ఎంట్రిలోడ్‌ రద్దు మదుపుదారులకు ప్రయోజనకరమైనప్పటికి, వారిపై ఏ విధమైన ప్రభావాన్ని కల్గించలేకపోయిందని'' మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎంట్రీలోడ్‌ పునరుద్ధరణ, సమర్థవంతమైన ఫండ్‌ మేనేజర్ల ఏర్పాటు జరగనంతకాలం మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీల కష్టాలు తీరేటట్లు లేవు.
ముగింపు

అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అవసరాలకు అనుగుణంగా వినియోగింపబడుతున్న ద్రవ్య సాధనాలలో ఒకటిగా ''మ్యూచువల్‌ ఫండ్స్‌''ను చూడాలి. 1993 తదనంతర కాలంలో మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌, స్టాక్‌ మార్కెట్‌ అడుగుజాడలలో నడుస్తున్నది. 1993 నుండి 2007 వరకు ఈ రంగం విదేశీ సంస్థాగత మదుపుదారుల పెట్టుబడులతో అప్రతిహతంగా కొనసాగింది. 2007-2009 మధ్య కాలంలో ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో వెనక్కు మళ్ళిన విదేశీ సంస్థాగత పెట్టుబడులతో ఈ రంగం కూడా కుప్పకూలింది. దేశీయ పరిస్థితులతో పాటు విదేశీ పెట్టుబడుల ప్రాబల్యం ఈ రంగంపై గణనీయంగా ఉంటుందని గమనించాలి. అదే సందర్భంలో యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా విశిష్ట ఉత్పాదన అయిన యు.యస్‌-64 (భారతదేశంలోని మొదటి మ్యూచువల్‌ ఫండ్‌) 1998లో భారీ స్కాంలో కూరుకుపోవడంతో మదుపుదారుల విశ్వాసం భారీగా దెబ్బతిన్నది

ఈ స్కాం ప్రభావంతో నష్టపోయిన లక్షలాది మదుపుదారుల ఆక్రందనలతో 2001లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రిని పార్లమెంట్‌లో నిలదీయాల్సిన పరిస్థితులు దాపురించాయి. మదుపుదారులకు గ్యారంటీ, వస్తూత్పత్తి రంగానికి వనరులు సమకూర్చే లక్ష్యాలతో ప్రారంభమైన భారతదేశ మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌ ప్రపంచీకరణ విధానాలతో సెకండరీ మార్కెట్‌ పెట్టుబడులతో అస్థిరతకు, అభద్రతకు గురికావల్సి వచ్చింది. అందువల్ల మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో మదుపుదారులకు, ఫండ్‌ కంపెనీలకు ద్రవ్య పెట్టుబడి ఆటుపోట్లు అనివార్యాలు.