Sunday, August 8, 2010

బ్యాంకులకు ఒత్తిడి పరీక్షలు-ఒక పరిశీలన

గుండె నొప్పి అంటూ వచ్చిన రోగికి, గుండె పటిష్టత అంచనా కట్టేందుకు డాక్టర్‌ నిర్వహించే ఒత్తిడి పరీక్షల (స్ట్రెస్‌ టెస్టులు) వలె, ఇటీవల యూరోపియన్‌ యూనియన్‌ బ్యాంకుల పటిష్టతను అంచనా వేసేందుకు యూరోపియన్‌ యూనియన్‌ బ్యాంకింగ్‌ సూపర్‌ వైజర్స్‌ కమిటి ఒత్తిడి పరీక్షలను నిర్వహించింది. యూరోజోన్‌ ఎదుర్కొన్న సార్వభౌమ రుణ చెల్లింపు వైఫల్య సంక్షోభంతో శృంగభంగమైన 91 యూరోపియన్‌ బ్యాంకులలో, 7 బ్యాంకులు ఒత్తిడి పరీక్షలలో నెగ్గలేదని ఆ కమిటీ ప్రకటించింది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భారతీయ రిజర్వ్‌ బ్యాంకు, ప్రపంచ ఆర్థిక సంక్షోభ తదనంతర కాలంలో తామూ, రుణాలు, వడ్డీ రేట్ల సంకటాలను (రిస్క్‌) తట్టుకోకలిగే స్తోమతపై భారతీయ బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఒత్తిడి పరీక్షలు నిర్వహించామని, భారతీయ బ్యాంకులు పటిష్టంగా ఉన్నాయన్నారు. రానున్న కాలంలో దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ విశ్వాసనీయతను పెంచేందుకు, మరిన్ని అధునాతనమైన ఒత్తిడి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోగల విశిష్టమైన వ్యవస్థగా భారతీయ బ్యాంకింగ్‌ ప్రపంచ వ్యాప్తంగా కీర్తింపబడుతున్న కాలంలో, రిజర్వ్‌ బ్యాంకు ప్రకటన విస్మయాన్ని కల్గిస్తుంది.

ఒత్తిడి పరీక్షలు - ఏమిటి, ఎందుకు?

అనూహ్యమైన సంక్లిష్ట పరిస్థితుల ప్రభావాల నుండి తట్టుకోవటానికి అవసరమైన నికర సంపద (పెట్టుబడి) ఒక బ్యాంకు కలిగి ఉందా, లేదా అనే అంశాన్ని లోతుగా పరిశీలించే పరీక్షలు ఒత్తిడి పరీక్షలుగా చెప్తున్నారు. సామాన్యంగా ప్రతి బ్యాంకు స్వీయ పరిశీలనగా ఈ పరీక్షలు నిర్వహిస్తాయి. స్థూలంగా బ్యాంకింగ్‌ వ్యవస్థను అస్థిర పరిచే పరిస్థితులు తలెత్తినా, లేదా అటువంటి పరిస్థితులకు అవకాశం ఉన్నా, ఆ దేశ కేంద్ర బ్యాంకు, ప్రభుత్వం ఇలాంటి పరీక్షలు నిర్వహించుకుంటాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో వస్తుత్పత్తి రంగంపై, ద్రవ్య ఆర్థిక వ్యవస్థ(ద్రవ్య పెట్టుబడి) అపరిమితమైన ఆధిపత్యాన్ని చలాయిస్తున్న కాలంలో అనిశ్చితి (రిస్క్‌) వ్యవస్థీకృతమైంది, విశ్వవ్యాప్తమైంది. ఒత్తిడి పరిస్థితుల అవసరాలు ఈ నేపథ్యంలో బ్యాంకింగ్‌ వ్యవస్థలో నిత్య కృత్యమయ్యాయి.

వివిధ బ్యాంకింగ్‌ రిస్క్‌లు

సామాన్యంగా బ్యాంకింగ్‌ వ్యవస్థను దెబ్బతీసే సంకటాలు (రిస్క్‌లు) 1. రుణ సంకటాలు (క్రెడిట్‌ రిస్క్‌) 2. మార్కెట్‌ సంకటాలు(మార్కెట్‌ రిస్క్‌) 3. నిధుల లభ్యత సంకటాలు (లిక్విడిటీ రిస్క్‌).

రుణ సంకటాలు

బ్యాంకులు అందించే వివిధ రుణాల ద్వారా ఉద్భవించే సంకటాలు రుణ సంకటాలు. సరియైన హామీ లేకపోవటం లేదా చెల్లించే స్థోమత లేకపోవటం లాంటివి వీటికి సాధరణమైన కారణాలుగా ఉంటాయి. పారు బాకీలు, నిరర్ధక ఆస్థులు ఇందులో భాగాలు. అమెరికాలో గృహ రుణ సంక్షోభం ఇందుకు తాజా ఉదాహరణ.

మార్కెట్‌ సంకటాలు

ద్రవ్య మారకపు విలువలు, వడ్డీ రేట్లు, ఈక్విటీలు, బాండులు, డెరివేటివ్‌లు లాంటి నూతన ద్రవ్య ఉత్పత్తుల ధరలలోని అనిశ్ఛితితో ఏర్పడేవి మార్కెట్‌ సంకటాలు. యూరోజోన్‌ సార్వభౌమ రుణ చెల్లింపు వైఫల్య సంక్షోభం ఇందుకు ఉదాహరణ.

నిధుల లభ్యత సంకటం

లెహమాన్‌ బ్రదర్స్‌ దివాళాకు ముందుకాలంలో అంతర్జాతీయంగా నిధుల లభ్యత బ్యాంకులకు పెద్ద సమస్యగా ముందుకు రాలేదు. లెహమాన్‌ బ్రదర్స్‌ దివాళా ఉదంతంతో రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ సూత్రాలు తల్లక్రిందులైనాయి. 2008 సం|| బ్యాంకింగ్‌ రంగంలో సృష్టించిన నిధుల లభ్యత(లిక్విడిటీ) కొరత, భయోత్పాతంతో బెంబేలెత్తిన బ్యాంకేతర ద్రవ్య సంస్థలైన మనీ మార్కెట్‌లు బ్యాంకులకు పెట్టుబడులు పెట్టటానికి నిరాకరించాయి. సముచితమైన వడ్డీరేట్లకు నిధులు దొరకక, ఆస్తులు అమ్మి నిధులు సమకూర్చాలన్నా ఆస్తులు విలువలు లేక, డిపాజిట్‌ దారుల డిమాండ్‌ మేరకు నిధులు అందించలేక బ్యాంకులు తల్లడిల్లాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుల ఆర్థిక పటిష్టతను బేరీజు వేసుకొని, ఉపద్రవ నివారణా చర్యలకు సమాయత్తం కావడం కోసం నిర్వహించే ఒత్తిడి పరీక్షలు ఆహ్వానించ దగ్గవే. కానీ ఈ సంకటాలకు మూలమైన విధానాల సవరణలకు కాక బ్యాంకులలో జరిగే వివిధ వ్యవస్థీకృత సవరణలే ఆందోళనను కల్గిస్తున్నాయి.

అమెరికాలో ఒత్తిడి పరీక్షలు

2009 ప్రథమార్థంలో అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో అతి పెద్ద 19 బ్యాంకులపై నిర్వహించిన ఒత్తిడి పరీక్షలలో 10 బ్యాంకులు ఉత్తీర్ణతను సాధించలేక పోయాయి. ఈ 10 బ్యాంకులలో 74.6 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి కొరత కావడమే వైఫల్యాలకు కారణంగా నిర్వాహకులు పేర్కొన్నారు. వైఫల్యమైన బ్యాంకులు పెట్టుబడి కొరతను పూడ్చుకొనే మార్గాలను వివరించారు. ఈ ఫలితాల ప్రచార హోరుతో అమెరికాలోని స్టాక్‌ మార్కెట్‌ 7 నెలలో 36% పుంజుకుంది.

యూరోపియన్‌ యూనియన్‌ లో ఒత్తిడి పరీక్షలు

జూలైలో యూరోపియన్‌ యూనియన్‌లు 91 బ్యాంకులకు ఒత్తిడి పరీక్షలు నిర్వహించగా, 7 బ్యాంకులు 3.5 బిలియన్‌ యూరోల పెట్టుబడి కొరత కారణంగా పరీక్షలలో విజయవంతం కాలేదని నిర్వాహకులు తెలియజేసారు. వీటిలో స్పెయిన్‌ దేశంలో 5 బ్యాంకులు, జర్మనీ, గ్రీస్‌లలో ఒక్కొక్క బ్యాంకు ఉన్నాయి. అంటే మిగిలిన బ్యాంకుల ఆర్థిక పటిష్టత బాగున్నట్లే లెక్క. నిరుజ్యోగం 6%, జి.డి.పిలో తగ్గుదల 3%, షేర్‌ మార్కెట్‌ పతనం 20%, మార్కెట్‌ వడ్డీ రేట్ల పెరుగుదల 6% సంభవించిన పరిస్థితులలో నెలకొనే పరిణామాలకు తట్టుకోగలిగే పెట్టుబడి పరిపూర్ణత కలిగిన బ్యాంకులను పరీక్షలలో విజేతలుగా సూత్రీకరించారు. ఈ ఫలితాలతో మార్కెట్‌ వర్గాలు ఊపిరి పీల్చుకొని, ఆర్థిక వ్యవస్థలు గాడిలో పడతాయని, అమెరికాలో మాదిరిగా ఫైనాన్షియల్‌ మార్కెట్‌ జోరుగా ఊపందుకుంటుందని కొండంత ఆశతో యూరోపియన్‌ యూనియన్‌ ఉంది. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌లలో జరిపిన ఒత్తిడి పరీక్షల విశ్వాసనీయతపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముగింపు

ప్రపంచీకరణ నేపథ్యంలో బ్యాంకుల పై పెరిగిన ఒత్తిడి విధానపరమైంది నిజమైన ఒత్తిడి పరీక్షలు పాలక వర్గ ఆర్థిక, ద్రవ్య విధానాలపై ఉండాలి. అందుకు భిన్నంగా అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ లలో నిర్వహించిన పరీక్షలు కేవలం మార్కెట్ల విశ్వాసాన్ని పొందటానికి చేసిన జిమ్మిక్కులే. వీటి ఫలితాలు స్వల్పకాలికాలు. భారతదేశంలో బ్యాంకింగ్‌ రంగంపై నిర్వహింపబడుతున్న ఒత్తిడి పరీక్షల తీరు వేరుగా ఉంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం నుండి మన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన జాతీయ బ్యాంకింగ్‌ రంగాన్ని భూస్థాపితం చేసి, ఈ రంగాన్ని సంక్షోభానికి కారకులైన విదేశీ బ్యాంకులకు ధారాదత్తం చేయటానికి ఒత్తిడి పరీక్షలను సాధనాలుగా వినియోగిస్తున్నారు. రిజర్వ్‌ బ్యాంకు తాజా ప్రకటన ఇందులో భాగమే. దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సిన ఒత్తిడి పరీక్షల స్థానంలో, సర్వజనీనమైన, ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తించే విధంగా ఈ పరీక్షల ప్రమాణాలను అంతర్జాతీయ సంస్థలు రూపొందిస్తున్నాయి. ఇది జాతీయ ఆర్థిక సార్వభౌమాధికారానికి, స్వావలంబనకు విఘాతం కల్గిస్తుంది.

1 comment:

king said...

good post
Can u explain wats the reason for ups and downs in exchange rates?

&

Does huge exchange of currency lower the conversion rate?