Sunday, August 1, 2010

మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌-రెండవ భాగం


అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని శాసిస్తున్న కాలంలో మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమ విశిష్ట వైభవాన్ని చవిచూసింది. లాభాలు, భద్రత, కోరినప్పుడు డబ్బుగా మార్చుకోగలిగే వెసులుబాటు (లిక్విడిటీ) లాంటి లక్షణాలు పుణికిపుచ్చుకుంటాయని చెప్పుకొనే మ్యూచువల్‌ ఫండ్స్‌, మదుపరులను ఆకట్టుకోవటంలో ఈ మధ్య కాలంలో వెనుకపట్టు పట్టాయి. మన దేశంలో పారిశ్రామిక రంగానికి పెట్టుబడుల్ని సమకూర్చటం, చిన్నమదుపుదారులకు సైతం స్టాక్‌ మార్కెట్‌ ప్రయోజనాల్ని అందించడం లాంటి లక్ష్యాలతో ప్రారంభమైన మ్యూచువల్‌ ఫండ్‌ రంగ అభివృద్ధి క్రమాన్ని సంక్షిప్తంగా సమీక్షిద్దాం.
మనదేశంలో మ్యూచువల్‌ ఫండ్‌ రంగం అభివృద్ధి

మ్యూచువల్‌ ఫండ్‌ వాణిజ్యాన్ని సెబి (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా) నియంత్రిస్తుండగా, అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎ.యం.ఎఫ్‌.ఐ) మ్యూచువల్‌ ఫండ్స్‌ గురించి మదుపుదారులలోను, పంపిణిదారులలోను అవగాహనను, పరిజ్ఞానాన్ని పెంచడంకోసం కృషి చేస్తుంది. 1963లో ప్రభుత్వరంగమైన యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (యు.టి.ఐ) పేరు మీద ప్రారంభమైన మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో 1987 నాటికి జాతీయ బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు ప్రవేశించాయి. 1988 చివరికి ఈ రంగంలో ''యాజమాన్యంలోని సగటు ఆస్తుల విలువ'' (యావరేజ్‌ ఎస్సెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌ - ఎ.యు.యం) రూ. 6,700 కోట్లుగా ఉంది. 1993లో ఈ పరిశ్రమలోకి ప్రయివేట్‌ కంపెనీలు ప్రవేశించి ఎ.యు.యం రూ. 47,004 కోట్లకు చేరి, 2004 నాటికి ఈ విలువ రూ. 1,40,000 కోట్లకు పెరిగింది. 2007 ద్వితీయార్ధం నుండి 2009 ప్రథమార్ధం వరకు ప్రపంచ ఆర్థిక సంక్షోభం దెబ్బకు మ్యూచువల్‌ ఫండ్‌ రంగం చతికిల బడింది. భారత దేశంలో మొట్టమొదటగా ఆగస్టు-నవంబరు 2008 నాటికి ఈ వాణిజ్యం 26.1%నికి పడిపోయింది. కానీ మార్చి-ఆగస్టు 2009 నాటికి పరిస్థితులు మారి, వాణిజ్యం మళ్ళీ 52.1%నికి పెరిగింది. ఈ పెరుగుదల ఈక్విటీ/బ్యాలెన్స్‌డ్‌ పథకాలలో 66%, రుణ పథకాలలో 114.7%గా నమోదైంది. డిశంబర్‌ 2009 నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ ఎ.యు.యం, రూ. 7,61,626 కోట్లకు పెరిగింది. ఇందులో జాతీయ బ్యాంకులు నిర్వహించే మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు 16.28%, యల్‌.ఐ.సి. 6% ఉండగా, ప్రయివేటు రంగంలోని కంపెనీలు (స్వదేశీ, విదేశీ, సంయుక్త రంగాలు) 77.2%గా ఉన్నాయి. అంటే ప్రభుత్వ రంగంలో మొదలైన భారతీయ మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌లో ప్రస్తుతం 3/4 వంతు ప్రయివేటు రంగం హస్తగతం చేసుకుంది.
మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌ తీరుతెన్నులు

భారతదేశంలోని మ్యూచువల్‌ ఫండ్స్‌ ''యాజమాన్యంలోని సగటు ఆస్థుల విలువ (ఎ.యు.యం) లో అత్యధిక భాగం రుణపథకాల (డెట్‌ స్కీమ్స్‌) లోనే ఉంది. ఈక్విటీ పథకాలలో కేవలం 20% (సుమారు) మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నారు. రుణ పధకాలలో అత్యధిక భాగం సంస్థాగత మదుపు దారుల పెట్టుబడులు కాగా, గ్రోత్‌ ఫండ్‌, బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌ పధకాలలో అత్యధికంగా రిటైల్‌ మదుపుదారులు పెట్టుబడులు పెడుతున్నారు. అంటే ఈ వాణిజ్యంలో వ్యక్తిగత మదుపుదారుల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. ఈ పరిశ్రమ, దేశంలో 150 నగరాలకు విస్తరించగా, ఎ.యు.యంలో 85%, 10 మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైంది. అంటే ఈ వాణిజ్యంలో అత్యధిక భాగం నగరాలకే లక్ష్యమైంది. సి.యం.ఐ.ఇ (సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమి) అంచనాల ప్రకారం డిసెంబర్‌-2009 నాటికి భారతదేశ జనాభాలో 8 కోట్ల 76 లక్షల కుటుంబాలు బంగారంలోను, 5 కోట్ల 97 లక్షల కుటుంబాలు జీవిత భీమా లోను, 4 కోట్ల 60 లక్షల కుటుంబాలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల లోను, 9 లక్షల 20 వేల కుటుంబాలు స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతుండగా, మ్యూచువల్‌ ఫండ్‌లో కోటి మంది లోపు కుటుంబాలు పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తుంది. భారతదేశంలోని దేశీయ పొదుపులో మ్యూచువల్‌ ఫండ్స్‌ అతి తక్కువ భాగంగా ఉంది.
కలవర పెడుతున్న ఈక్విటీ మదుపరుల నిష్క్రమణ

మార్చి-జూన్‌ 2010 మధ్య కాలంలో మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌లో 7.5 లక్షల ఈక్విటీ ఆధారిత గ్రోత్‌/బ్యాలెన్స్‌ ఫండ్‌ పథకాలలోని ఖాతాలు (ఫోలియోలు) విరమించుకోవడం జరిగింది. ఇదే కాలంలో 1.9 లక్షల నూతన రుణపథకాల ఖాతాలు చేరినా, ఖాతాల భారీ విరమణలు మ్యూచువల్‌ ఫండ్‌ వర్గాల్నికలవరపెటుతున్నాయి. ఎ.యం.ఎఫ్‌.ఐ గణాంకాల ప్రకారం జూన్‌ 2010 నాటికి భారతదేశంలోని మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ 3,578 పథకాలతో, 4,79,41,250 ఖాతాలతో (ఫోలియోలు), 6.7 లక్షల కోట్ల ఎ.యు.యంతో నమోదైయింది. వీటిలో 4కోట్ల 35 లక్షల ఖాతాలు గ్రోత్‌/బ్యాలెన్స్‌డ్‌ ఫండ్స్‌కు సంబంధించినవి. ఇదే సమయంలో రిలయన్స్‌ మ్యూచువల్‌ ఫండ్‌ రూ. 1 కోటి 1 లక్ష ఎ.యు.యం తోనూ, యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌ 1 కోటి ఖాతాలు (ఫోలియోలు) కలిగి ప్రథమస్థానంలో ఉన్నాయి. ఈ సమయంలో సెన్సెక్స్‌ పెరుగుదల నిలకడగా ఉన్నా, మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో దాదాపు 4 లక్షల ఖాతాల పతనంపై మార్కెట్‌ వర్గాలు, సెబీ మల్లగుల్లలు పడుతున్నాయి.
ఎందుకిలా జరిగింది?

భారతదేశంలోని మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లు ఆకర్షణీయంగా లేవన్న విమర్శలు సర్వత్రా ఉన్నాయి. మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లో చేరేటప్పుడు ఎంట్రీ లోడ్‌ క్రింద 2.5% గతంలో కట్టించుకునేవారు. ఈ సొమ్ము, స్కీమ్‌ సొమ్ముతో పాటు వసూలు చేయబడేది. ఇలా వసూలు చేసిన సొమ్ము మ్యూచువల్‌ ఫండ్‌ పంపిణీదారులకు (ఏజెంట్‌లు/మధ్యవర్తులు) కమీషన్‌ కింద చెల్లింపబడేది. ఆగస్టు 2009లో సెబీ ఈ ఎంట్రీ లోడును రద్దు చేసి, కమీషన్‌ను నేరుగా మదుపుదారుల నుండే వసూలు చేసుకోమని ఆదేశించింది. ఈ చర్యకు వ్యతిరేకంగా పంపిణీదారులు సెబీ కార్యాలయం ముందు తీవ్ర నిరసనలు వ్యక్తం చేసిన ప్రయోజనం లేకపోయింది. దీనితో పంపిణిదారులు మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్ని ప్రచారం చేయడం, మదుపుదారులను చేర్పించడం మానేసారు. ఇదే సమయంలో ''యూలిప్‌'' (యూనిట్‌ లింక్డ్‌ ఇన్యూరెన్స్‌ పధకం) లలో ఆకర్షణీయమైన కమీషన్‌లు చెల్లిస్తున్న కారణంగా మ్యూచువల్‌ ఫండ్‌లకు ఆదరణ తగ్గి ''యూలిప్‌'' మార్కెట్‌ పెరిగినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ కారణంగానే సెబీ, ''యూలిప్‌'' పథకాలు, మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల పోలికలతో ఉన్నందున వాటిపై నియంత్రణ తమదేనంటూ వివాదానికి దిగటం, అంతిమంగా కేంద్ర ప్రభుత్వం సెబీ అభ్యంతరాల్ని తోసిపుచ్చడం జరిగింది. సెబీ, మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌ మదుపుదారుల ఆదరణను తిరిగి పొందటం కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలు ఏ మేరకు జయప్రదం అవుతాయో కాలమే తేల్చాలి. ''మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల నిర్మాణం సంక్లిష్టమైనందున, వివరించి నచ్చచెప్పే పంపిణీదారుల ఆవశ్యకత అనివార్యమని, అందువల్లే ఎంట్రిలోడ్‌ రద్దు మదుపుదారులకు ప్రయోజనకరమైనప్పటికి, వారిపై ఏ విధమైన ప్రభావాన్ని కల్గించలేకపోయిందని'' మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎంట్రీలోడ్‌ పునరుద్ధరణ, సమర్థవంతమైన ఫండ్‌ మేనేజర్ల ఏర్పాటు జరగనంతకాలం మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీల కష్టాలు తీరేటట్లు లేవు.
ముగింపు

అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి అవసరాలకు అనుగుణంగా వినియోగింపబడుతున్న ద్రవ్య సాధనాలలో ఒకటిగా ''మ్యూచువల్‌ ఫండ్స్‌''ను చూడాలి. 1993 తదనంతర కాలంలో మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌, స్టాక్‌ మార్కెట్‌ అడుగుజాడలలో నడుస్తున్నది. 1993 నుండి 2007 వరకు ఈ రంగం విదేశీ సంస్థాగత మదుపుదారుల పెట్టుబడులతో అప్రతిహతంగా కొనసాగింది. 2007-2009 మధ్య కాలంలో ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో వెనక్కు మళ్ళిన విదేశీ సంస్థాగత పెట్టుబడులతో ఈ రంగం కూడా కుప్పకూలింది. దేశీయ పరిస్థితులతో పాటు విదేశీ పెట్టుబడుల ప్రాబల్యం ఈ రంగంపై గణనీయంగా ఉంటుందని గమనించాలి. అదే సందర్భంలో యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా విశిష్ట ఉత్పాదన అయిన యు.యస్‌-64 (భారతదేశంలోని మొదటి మ్యూచువల్‌ ఫండ్‌) 1998లో భారీ స్కాంలో కూరుకుపోవడంతో మదుపుదారుల విశ్వాసం భారీగా దెబ్బతిన్నది

ఈ స్కాం ప్రభావంతో నష్టపోయిన లక్షలాది మదుపుదారుల ఆక్రందనలతో 2001లో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రిని పార్లమెంట్‌లో నిలదీయాల్సిన పరిస్థితులు దాపురించాయి. మదుపుదారులకు గ్యారంటీ, వస్తూత్పత్తి రంగానికి వనరులు సమకూర్చే లక్ష్యాలతో ప్రారంభమైన భారతదేశ మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌ ప్రపంచీకరణ విధానాలతో సెకండరీ మార్కెట్‌ పెట్టుబడులతో అస్థిరతకు, అభద్రతకు గురికావల్సి వచ్చింది. అందువల్ల మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో మదుపుదారులకు, ఫండ్‌ కంపెనీలకు ద్రవ్య పెట్టుబడి ఆటుపోట్లు అనివార్యాలు.


No comments: