Sunday, September 26, 2010

బేసెల్‌ ప్రమాణాలు - బ్యాంకింగ్‌ వ్యవస్థ - పరిచయం


ప్రపంచీకరణ నేపథ్యంలో ద్రవ్య రంగ సుస్థిరత లక్ష్యంగా రూపొందించిన ''బేసెల్‌ ప్రమాణాలు'' (బేసెల్‌ నారమ్స్‌) బ్యాంకింగ్‌ వ్యవస్థలో పలు మౌళిక మార్పులకు కారణమవడమే కాకుండా, జాతీయ బ్యాంకుల రూపురేఖల్ని మారుస్తున్నాయి. సెప్టెంబర్‌ 12న బేసెల్‌ కమిటి ప్రతిపాదించిన బేసెల్‌-3 ప్రమాణాల అమలుకు, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ సంసిద్ధతను వ్యక్తం చేసింది. మౌళికంగా బ్యాంకింగ్‌ యాజమాన్యాల్ని ఉద్దేశించి రూపొందించిన ఈ ప్రమాణాలలో సాంకేతికత ఎక్కువగా ఉన్నా, ఇవి ప్రత్యక్షంగా దైనందిన బ్యాంకింగ్‌ నిర్వహణను నియంత్రిస్తూనే పరోక్షంగా డిపాజిట్‌దారులు, రుణగ్రహీతల ప్రయోజనాల్ని ప్రభావితం చేస్తున్నాయి. సాంకేతిక పదజాలంతో సంక్లిష్టంగా ఉండే బేసెల్‌ ప్రమాణాలు, వాటి పూర్వరంగాల్ని చర్చించుకుందాం.

బ్యాంకుల మనుగడ-మూలధన పరిమాణం

ప్రజల నుండి డిపాజిట్లు స్వీకరించడం, రుణాలు మంజూరు చేయడం బ్యాంకుల సాధారణ కార్యకలాపాలుగా మనకు తెలుసు. రుణాలపై వచ్చే వడ్డీ నుండే డిపాజిట్‌దార్ల సొమ్ముపై బ్యాంకులు వడ్డీ చెల్లిస్తుంటాయి. రుణాలపై తిరిగి రావలసిన అసలు, వడ్డీ చెల్లింపులు అనిశ్చితికి గురైనప్పుడు, డిపాజిట్లపై వడ్డీలను కూడా చెల్లించలేని స్థితిలో బ్యాంకులుంటాయి. అలాంటప్పుడు డిపాజిట్‌దార్లకు చెల్లించాల్సిన అసలు ఫాయిదాల్ని బ్యాంకుల మూలధనం నుండి చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన రుణాలు మొండి బాకీలైతే, మూలధనం తగినంత లేకుంటే బ్యాంకులే మూతపడే పరిస్థితి ఏర్పడతాయి. అందువలన బ్యాంకుల రుణాల్లో ఇమిడివున్న ''రిస్క్‌''ను బట్టి, బ్యాంకుల మనుగడకు అవసరమైన మూలధన పరిమాణం ఆధారపడి ఉంది. ఈ ప్రాథమిక సూత్రమే బేసెల్‌ ప్రమాణాల రూపకల్పనకు పునాదిగా నిల్చింది.

బేసెల్‌ కమిటి పూర్వరంగం

రెండవ ప్రపంచ యుద్ధానంతరం జాతీయ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్య సంస్కృతి మమేకమయ్యాయి. మొదటి చమురు సంక్షోభం తదనంతర కాలంలో తెరమీదకు వచ్చిన ప్రపంచీకరణ విధానాల నేపథ్యంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ, జాతీయ ఆర్థిక వ్యవస్థల అవసరాలను ప్రమాణంగా తీసుకోవాలా లేక వేగంగా ముందుకొస్తున్న ప్రపంచీకరణ ధోరణులకు ప్రాతినిథ్యం వహించాలా అన్న సవాళ్ళను ఎదుర్కొంది. ఈ సవాళ్ళకు సమాధానంగా ఆవిర్భవించిన బేసెల్‌ ప్రమాణాల నేపథ్యంలో బ్యాంకింగ్‌ వ్యవస్థకు, జాతీయ ఆర్థిక వ్యవస్థకు మధ్య సంబంధాలు బలహీన పడి, అంతిమంగా బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రపంచీకరణ ధోరణులకు లొంగిపోయింది.

బేసెల్‌ కమిటి ఆవిర్భావం

1970లలో తక్కువ మూలధనంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక బ్యాంకులు నిర్వహింపబడేవి. ప్రపంచీకరణ ప్రక్రియ ఊపందుకున్న మేరకు వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రమైన అస్థిరతకు గురౌతుండేవి. వీటి ప్రభావంతో అంతర్జాతీయ, జాతీయ బ్యాంకుల వైఫల్యాల పరిమాణం పెరుగుతుండేది. దీనితో పాటు ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ బ్యాంకుల విస్తరణ పెరిగింది. వివిధ దేశాల్లో బ్యాంకుల మూలధన పరిమాణంలో అనేక వ్యత్యాసాలుండేవి. 1974లో జర్మనీ బ్యాంకు ''హెడ్‌స్టట్‌'' వైఫల్యంతో జి-10 దేశాలైన అమెరికా, బ్రిటన్‌, బెల్జియం, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, నెదర్లాండ్స్‌, స్విజర్లాండ్‌ లు ''తక్కువ మూలధన సమీకరణ కల్గిన బ్యాంకుల నమూనా పై, సక్రమమైన బ్యాంకింగ్‌ నియంత్రణల కొరత''పై లోతైన అధ్యయనానికి సిద్ధమైయ్యాయి. ఈ దేశాలన్ని 1974లో ''అంతర్జాతీయ పరిష్కారాల బ్యాంకు'' (బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ - బి.ఐ.యస్‌) పర్యవేక్షణలో స్విజర్లాండ్‌ నందలి బేసెల్‌ నగరంలో ''బ్యాంకింగ్‌ పర్యవేక్షణ కమిటి''గా ఏర్పడ్డాయి. ఈ కమిటియే తదనంతర కాలంలో ''బేసెల్‌ కమిటి'' గా ప్రాచుర్యం పొందింది. అంతర్జాతీయ పరిష్కారాల బ్యాంకు 1930లో బేసెల్‌ నగరంలో ఏర్పడ్డ అతి పురాతనమైన ఫైనాన్షియల్‌ సంస్థ. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులను సమన్వయ పరచడంలోనూ, వాటి సహకారాల్ని కూడకట్టడంలోనూ ఈ సంస్థ విశేషంగా కృషి చేస్తున్నది.

బేసెల్‌ -1 ప్రమాణాలు

జులై, 1988లో అంతర్జాతీయ బ్యాంకులకు కావల్సిన కనీస స్థాయి మూలధన అవసరాలపై బేసెల్‌ కమిటి కొన్ని ప్రమాణాలను రూపొందించింది. ఈ ప్రమాణాల్ని సభ్య దేశాలు అనివార్యంగా అమలు చేయాల్సిన అగత్యం లేకపోయినా, వారి వారి ఆర్థిక వ్యవస్థలకు ఈ ప్రమాణాలను అన్వయించుకొని 100కు పైగా దేశాల కేంద్ర బ్యాంకులు ఈ ప్రమాణాల అమలుకు సిద్ధమయ్యాయి. బ్యాంకింగ్‌ రంగ సుస్థిరతపై మొట్టమొదటిగా రూపొందించిన ఈ ప్రమాణాలను బేసెల్‌-1 ప్రమాణాలు లేదా బేసెల్‌ నారమ్స్‌గా ప్రసిద్ధికెక్కాయి. ఈ ప్రమాణాల ప్రకారం బ్యాంకు మంజూరు చేసిన ''రిస్క్‌''తో కూడిన రుణాల మొత్తంలో 8%తో సమానమైన మూలధనాన్ని ఆ బ్యాంకు అదనంగా కలిగి ఉండాలి. దీన్నే సముచిత మూలధన నిష్పత్తి (క్యాపిటల్‌ ఎడిక్వసీ రేషియో) లేదా మూలధన, రిస్క్‌తో కూడిన ఆస్థుల నిష్పత్తి (కేపిటల్‌ రిస్క్‌ రిలేటెడ్‌ ఎసెట్స్‌ రేషియో) అని అంటారు. దీన్ని లెక్కించడం కోసంగా వివిధ రుణాలకు, వాటిలో ఇమిడివున్న రిస్క్‌ను బట్టి వెయిటేజ్‌లను నిర్ణయించారు. గవర్నమెంట్‌ బాండ్‌లు 0% రిస్క్‌ వెయిటేజ్‌ గాను, ఇతర బ్యాంకులచే గ్యారంటీ చేయబడ్డ రుణాలకు 20%, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలచే గ్యారంటీ చేయబడ్డ రుణాలకు 40%, కార్పొరేట్‌ రుణాలతోపాటు ఇతర అన్ని రకాల రుణాలు (సిబ్బంది రుణాల మినహా) 100%గా రిస్క్‌ వెయిటేజ్‌ను నిర్ణయించబడ్డాయి. రుణాల నాణ్యతను బట్టి రుణ మొత్తంలో పైన పేర్కొన్న వెయిటేజ్‌ శాతం మేరకు ''సముచిత మూలధన నిష్పత్తి''ని బ్యాంకులు అమలు చేయాల్సి వుంటుంది.

బేసెల్‌ కమిటి వివిధ రకాల మూలధనాలకు ప్రామాణిక నిర్వచనాల్ని అందించింది. మూలధనాన్ని మొదటి అంచె (టైర్‌-1), రెండవ అంచె (టైర్‌-2) గా వర్గీకరించింది. ఈక్విటీ (మూల షేర్‌ ధనం) మొదటి అంచె మూలధనంగాను, అప్పుల ద్వారా సేకరించిన సహాయమూలధనాన్ని రెండవ అంచె మూలధనంగాను బేసెల్‌ కమిటి పేర్కొంది. ఈ ప్రమాణాల అమలు సరళంగా ఉన్నందున వీటిని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు స్వచ్ఛందంగా శీఘ్రగతిని అమలు చేసాయి. నయాఉదారవాద విధానాలు అమలవుతున్న దేశాలలో ద్రవ్య రంగంలో స్పెక్యులేషన్‌ ధోరణలు మితిమీరడంతో ఆర్థిక వ్యవస్థలలో పెరుగుతున్న ఒడిదుడుకుల కారణంగా ఈ ప్రమాణాలను వివిధ దేశాలు అంగీకరించాల్సి వచ్చింది.

బేసెల్‌-1 ప్రమాణాల ప్రభావాలు

బ్యాంకులలో ''తగినంత మూలధన సమీకరణ''లో బేసెల్‌-1 ప్రమాణాలు విజయవంతమైనాయి. బేసెల్‌-1 ప్రమాణాలు ప్రధానంగా రుణాలలో ఇమిడి ఉన్న రిస్క్‌ పరిమాణంపై కేంద్రీకరించాయి. రుణాలలోని రిస్క్‌ విశ్లేషణ వర్గీకరణతో, అంతవరకు సామాజిక బాధ్యతగా అందించబడుతున్న రుణాలు అధిక రిస్క్‌ కలిగినవిగా భావించబడ్డాయి. దీనితో వాటి కేటాయింపులు తగ్గించడం మొదలైంది. ఫలితంగా వివిధ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రాధాన్యత రుణాల కేటాయింపు తగ్గిపోయింది. వసూలు కాని రుణాలను నిరర్ధక ఆస్థులు (నాన్‌ పర్‌ఫార్మింగ్‌ ఎస్సెట్స్‌)గా పరిగణించారు. బ్యాంకుల మొత్తం రుణాలలో నిరర్ధక ఆస్థుల నిష్పత్తిపై పరిమితి విధింపబడింది. ఈ పరిమితిని అమలు చేయటానికి అనేక బ్యాంకులు మొండి బకాయిలను తమ లాభాల్లో సర్దుబాటు చేసుకోవడంతో అవి నష్టాల బారిన పడ్డాయి. బేసెల్‌-1 తదనంతర కాలంలో ద్రవ్య రంగంలో నెలకొన్న మౌళిక మార్పుల కారణంగా ఉత్పన్నమైన సమస్యల్ని పరిష్కరించడంలో బేసెల్‌-1 ప్రమాణాలు వైఫల్యం చెందాయి. అందువల్ల వాటిని సవరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బేసెల్‌-2 ప్రమాణాలకు రూపకల్పన జరిగింది

Sunday, September 19, 2010

నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశం ఎవరి కోసం ?


నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశంపై రిజర్వుబ్యాంకు విడుదల చేసిన చర్చా పత్రంపై దేశ వ్యాపితంగా రకరకాల స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్‌.బి.ఐ ప్రతిపాదించిన అంశాలపై కార్పొరేట్‌ వర్గాలకు కొన్ని పరిమితులున్నా, అవి స్థూలంగా నూతన ప్రైయివేటు బ్యాంకుల ప్రవేశాన్ని ఆహ్వానిస్తున్నాయి. . ''రిజర్వుబ్యాంకు నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశంపై పెద్ద ఆసక్తిని కనపర్చటం లేదని, సున్నితమైన ఈ అంశంపై ఆచితూచి అడుగులు వేస్తుందని'' కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ''వివాదాస్పదమైన వివిధ అంశాలపై వివిధ కోణాలలో చర్చను పురిగొల్పుతూ, దేశంలోని వివిధ వర్గాల ఆంక్షల మేరకే నూతన మార్గదర్శకాలను ప్రజాతంత్ర పద్ధతులలో రిజర్వుబ్యాంకు రూపకల్పన చేస్తుందనే భావన కలిగించే రీతిలో చర్చా పత్రం ఉందని'' మరికొందరు అభినందిస్తున్నారు.

రిజర్వుబ్యాంకు అంతరంగమేమిటి?

విస్తరణలో కీలకమైనవి నూతన బ్యాంకులా లేదా బ్యాంకు శాఖలా అన్న అంశం కూడా చర్చలో లేదు. అందువలన తీవ్ర నిర్లక్ష్యానికి గురైన అణగారిన అట్టడుగు వర్గాల ప్రజలు, వెనుకబడిన ప్రాంతాలకు బ్యాంకింగ్‌ సేవల్ని చేరవేయాలనే లక్ష్య సాధనలో నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశానికి మార్గదర్శక సూత్రాలు ఎలా ఉండాలి? అనే అంశంపై రిజర్వుబ్యాంకు చర్చా పత్రం విడుదలయ్యింది కాని, ద్రవ్య పునాది విస్తరణలో భారతదేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ అనుసరించాల్సిన మార్గాల గురించి కాదు. అందులోనూ నూతన ప్రయివేటు బ్యాంకుల పాత్ర ఎలా ఉండాలి అనే అంశం కంటే ప్రయివేటు బ్యాంకుల సాధారణ అంగ నిర్మాణంపై చర్చ మొత్తం కేంద్రీకరించబడింది. చర్చా పత్రం ఉద్దేశ్యం పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించిన నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశం తప్ప ద్రవ్య పునాది విస్తరణ కాదన్న అంశం సుస్పష్టమైంది. ఆర్‌బిఐ, నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశంపై అన్యమనస్కంగా వ్యవహరిస్తూ ఆచితూచి అడుగులు వేస్తుందన్న ప్రచారంలో నిజం లేదు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రయివేటు, విదేశీ బ్యాంకుల పట్ల పెరిగిన వ్యతిరేక భావనల నేపథ్యంలో హడావుడి, అత్యుత్సాహం ప్రతికూల స్పందనలకు దారితీసే ప్రమాదం ఉన్నందున నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశాన్ని సుగమం చేయటానికి రిజర్వు బ్యాంకు జాగురూకతతో వ్యవహరిస్తున్నట్లుంది. ద్రవ్య పునాది విస్తరణే రిజర్వుబ్యాంకు ప్రధాన ధ్యేయమైతే, చర్చను నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశానికి పరిమితం చేయాల్సిన అవసరం లేదు.

పెద్ద బ్యాంకుల ప్రోత్సాహమే రిజర్వుబ్యాంకు ధ్యేయం

రఘురాం రంజన్‌ కమిటీ, ''చిన్న బ్యాంకులు సృజనాత్మకతను పెంచి, స్థానిక అవసరాలకు తగ్గట్లు నూతన ఉత్పత్తులను సృష్టించగలవని, అందువల్ల చిన్న బ్యాంకులను ప్రోత్సహించాలని'' సిఫార్సు చేసింది. ఏనుగుల్లాంటి బ్యాంకులు పీనుగులైన అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభ అనుభవాలు మన కళ్ళముందున్నాయి. బ్యాంకుల పరిరక్షణకు పటిష్టమైన ఆర్థిక, ద్రవ్య విధానాలు అవసరం కాని, బ్యాంకుల పరిమాణం కాదన్నది సుస్పష్టమైంది. అందువల్లే స్థూల దేశీయోత్పత్తిలో సాధారణ బ్యాంకు పరిమాణం నాలుగు శాతానికి, పెట్టుబడి బ్యాంకు పరిమాణం రెండు శాతానికి మించి ఉండటం శ్రేయస్కరం కాదన్న అంతర్జాతీయ పాఠాల్ని రిజర్వుబ్యాంకు పట్టించుకోవటం లేదు. ఆసియా ద్రవ్య సంక్షోభం ధాటికి తట్టుకొని నిలబడ్డ ఇండోనేషియాలోని బ్యాంకు నిప్స్‌(ఎన్‌ఐఎస్‌పి) లాంటి ఉదాహరణలు ఎన్ని ఉన్నా, ద్రవ్య పునాది విస్తరణ అవసరం లేని దేశాలలోని బ్యాంకుల అనుభవాలు, నిర్మాణాన్ని రిజర్వుబ్యాంకు ప్రస్తావిస్తున్నది. అందుకోసమే నూతన ప్రయివేటు బ్యాంకుల మూలధనం రూ|| 500 కోట్లకు మించి ఉండాలనే అభిప్రాయాన్ని ప్రోత్సహించే దిశలో చర్చా పత్రం ఉంది.

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు పెద్ద పీట

సమర్థవంతంగా నిర్వహింపబడుతూ, ఆర్థిక వనరులు కలిగిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు గ్రామీణ ప్రాంతాలలో సూక్ష్మ రుణ విస్తరణలో కీలక పాత్ర వహిస్తున్నాయని, వాటి నిరర్ధకాస్తుల శాతం పరిమితంగా ఉంటుందని చర్చా పత్రం ప్రస్తావించింది. దీనితో, వాటి నిర్వహణ వ్యయం అత్యధికమైనా, వాటిని ప్రజా డిపాజిట్లకు అనుమతిస్తే, తక్కువ నిర్వహణ వ్యయంతో ఆ సంస్థలు గ్రామీణ ప్రాంతాలలో కార్యకలాపాలు నిర్వహించగలుగుతాయనే చర్చను అందిపుచ్చుకొని కార్పోరేట్‌ వర్గాలు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్ని వాణిజ్య బ్యాంకులుగా మార్చటం కాని లేదా వాటికి బ్యాంకింగ్‌ రంగంలో ప్రవేశం కల్పించటం కాని చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అత్యధిక వ్యయంతో గ్రామీణ పేదల మూలుగులు పీలుస్తున్న సూక్ష్మ రుణ సంస్థల వలయంలో చిక్కుకున్న గ్రామీణ పేద మహిళలు రుణ చెల్లింపుకోసం వ్యభిచారానికి దిగజారుతూ, కొన్ని సందర్భాలలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న దీనగాథలు చర్చా పత్రంలో చోటు చేసుకోలేదు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు స్వీకరించే గ్రామీణ డిపాజిట్ల భద్రతకు రిజర్వుబ్యాంకు నియంత్రణ తప్ప మరో గ్యారెంటీ ఏమిటన్న అంశాన్ని చర్చా పత్రం స్పష్టపర్చలేదు.

బ్యాంకులు, పారిశ్రామిక సంస్థల మధ్య కుమ్మక్కు

1969 బ్యాంకుల జాతీయకరణకు ముందు పారిశ్రామిక సంస్థల ఆధ్వర్యంలోని ప్రయివేటు బ్యాంకులు ప్రజల డిపాజిట్లను వారి వారి అవసరాల కోసం దిగమింగి, సామాన్య ప్రజానీకానికి, వ్యవసాయానికి రుణాలను అందించక, డిపాజిట్‌దార్ల సొమ్ముకు భద్రత లేని తరుణంలో 1969 ఫిబ్రవరిలో బ్యాంకులపై సామాజిక నియంత్రణను అమలు చేసే చట్టాన్ని చేయాల్సి వచ్చింది. ఆ తరువాత కొద్ది నెలల్లో 14 ప్రయివేటు బ్యాంకుల్ని జాతీయం చేయటం అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో పారిశ్రామిక సంస్థలకు బ్యాంకు లైసెన్సులను మంజూరు చేయటం అనర్థదాయకమన్నది జగమెరిగిన సత్యం. దీనిపై చర్చ చేయాల్సిన పని లేదు. కాని ఈ చర్చా పత్రంపై చర్చ సందర్భంగా కొన్ని వాదనలు ముందుకొస్తున్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, టెలికం, విద్యుత్‌, రక్షణ మరియు మౌలిక రంగాలలో ప్రయివేటు పారిశ్రామిక సంస్థలను అనుమతిస్తున్న కాలంలో బ్యాంకింగ్‌ రంగంలో అనుమతించటానికి అభ్యంతరాలెందుకని ఎస్‌.ఎస్‌.తారాపూర్‌ లాంటి ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు.రక్తం మరిగిన పులి, పిల్లిలా పాలుమాత్రమే తాగుతుందనేది వారి వాదనల సారాంశం. కొన్ని నియంత్రణలు, పరిమితులతోనైనా పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల లైసెన్సులు ఇవ్వాలని మీడియా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో సి.ఎన్‌.బి.సి టివి18కి, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు అధినేత దీపక్‌ పరేఖ్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశాన్ని స్వాగతిస్తూనే ''ప్రయివేటు నిర్వాహకులు నియంత్రణ సంస్థల కంటే తెలివిగా ఉన్నారని, ఒక సంస్థలోని అవకతవకలు వెలుగు చూడటానికి దీర్ఘకాలం పడుతుందని, వాటిని తెలుసుకొని నియంత్రణ సంస్థలు అదుపు చేసే లోపు జరగాల్సింది జరిగిపోతుంద''న్నారు. నియంత్రణ సంస్థల పరిమితుల్ని ఆయన ఈ సందర్భంగా ఎత్తిచూపుతున్నారు. బ్యాంకు లైసెన్సు మంజూరుకు ముందు నష్టాల్లో ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్ని కార్పొరేట్‌, పారిశ్రామిక సంస్థలకు అప్పచెప్పాలన్నది చర్చా పత్రంలోని మరో అంశం. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో సగ భాగం కేంద్ర ప్రభుత్వం, పావు వంతు రాష్ట్ర ప్రభుత్వం, మిగిలినది దత్తత తీసుకున్న బ్యాంకు కలిగి ఉంటుంది. నష్టాలు వస్తున్న గ్రామీణ బ్యాంకుల్లో నష్టాలకు భౌగోళిక, ప్రభుత్వపరమైన విధానాల పాత్ర ఎక్కువ. ఈ వ్యవస్థలో పారిశ్రామిక సంస్థలు చేయగలిగేదేమి ఉండదు. వాటి మనుగడకు పరిష్కారాలు వేరు. పారిశ్రామిక సంస్థలను మళ్ళీ బ్యాంకింగ్‌ రంగంలో చొప్పించటంపై చర్చను రేపటమే చర్చా పత్రం ముఖ్యఉద్దేశ్యం.

విదేశీ పెట్టుబడుల కుదింపు

నూతన ప్రయివేటు బ్యాంకులలో 10 సం||ల పాటు విదేశీ పెట్టుబడుల్ని 50 శాతానికి కుదించటం మార్కెట్‌ వర్గాలకు విస్మయం కలిగిస్తుంది. బ్యాంకింగ్‌ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టటం ఫలితంగా నాణ్యమైన సత్వర సేవలు లభించటాన్ని విశేషంగా ప్రస్తావిస్తున్నారు. విదేశీ ప్రయివేటు బ్యాంకుల్లో ప్రవేశం ఉన్నత మధ్యతరగతి, సంపన్నులకే అన్న అంశం అందరూ అంగీకరించేదే. ఒక పక్క 74 శాతం మేరకు విదేశీ పెట్టుబడుల్ని బ్యాంకుల్లో అంగీకరించే అవకాశం ఉన్న నేపథ్యంలో, 50 శాతం పరిమితి సాధారణంగా అర్థం లేనిది. కాకుంటే 50 శాతానికి మించిన విదేశీ పెట్టుబడులున్న బ్యాంకులకు విదేశీ బ్యాంకులనే ముద్ర ఉంటుంది. స్వదేశీ బ్యాంకుగా చెలామణి కావటానికి 50 శాతం పరిమితి ఉపయోగపడుతుంది. చర్చా పత్రం ప్రకారం ఈ పరిమితి శాశ్వతం కాదు. ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో నెలకొన్న విదేశీ బ్యాంకులపై ఉండే వ్యతిరేక ప్రభావాల నుండి దృష్టి మళ్ళించటం కోసమే ఈ చర్యగా భావించాల్సి ఉంటుంది. పాలకవర్గాలు బ్యాంకింగ్‌ రంగంలో దేశీయ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధిపై దృష్టి మళ్ళించకుండా, విదేశీ బ్యాంకులపై ఆధారపడటం సముచితం కాదు.

జాతీయీకరణ, సరళీకరణ కాలాల్లో గ్రామీణ సేవల లభ్యతలో తేడాలు

భారతదేశంలో 1969లో మొదలైన వాణిజ్య బ్యాంకుల జాతీయీకరణ ప్రస్థానం 1991 వరకు కొనసాగింది. గ్రామీణ ప్రాంతాలకు నిజమైన బ్యాంకింగ్‌ సేవల విస్తరణ ఈ కాలంలోనే జరిగింది. ద్రవ్య పునాది విస్తరణకు కేంద్ర ప్రభుత్వం, రిజర్వుబ్యాంకు చిత్తశుద్ధితో కట్టుబడి ఉండేటట్లయితే వారు తప్పకుండా అనుసరించాల్సిన అనుభవాలివి. చర్చా పత్రం ఈ అనుభవాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. 1991 నుండి సరళీకరణ దుష్ప్రభావాలు బ్యాంకింగ్‌ రంగంపై తీవ్రంగా పడ్డాయి. 1969 నుండి 1991 మధ్య కాలంలో ప్రయివేటు బ్యాంకుల ఊసే లేకపోగా, 1993 నుండి నూతన ప్రయివేటు బ్యాంకులు ప్రవేశించాయి. గ్రామీణ డిపాజిట్లు 1972లో 6.5 శాతం వృద్ధి కాగా, 1989 నాటికి ఈ వృద్ధి 15 శాతానికి పెరిగింది. అదే కాలంలో మెట్రోపాలిటన్‌ నగరాలలో డిపాజిట్లు 46.2 శాతం నుండి 38.6 శాతానికి పడిపోయాయి. గ్రామీణ రుణం ఇదే కాలంలో 4.6 శాతం నుండి 16.3 శాతానికి పెరగగా, మెట్రోపాలిటన్‌ నగరాలలో రుణం 60.2 శాతం నుండి 43.5 శాతానికి తగ్గింది. 1969లో 8,127గా ఉన్న బ్యాంక్‌ శాఖలు 1990 నాటికి 59,752 అయ్యాయి. 1969లో మొత్తం బ్యాంకు శాఖల్లో గ్రామీణ శాఖలు 17.6 శాతం ఉండగా, 1990 నాటికి 58.2 శాతానికి వృద్ధి చెంది అత్యద్భుత ప్రగతిని సాధించాయి. ఈ ఫలితాలు జాతీయీకరణ పటిష్టంగా ఉన్న కాలానివి. 1991లో ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాక మార్చి 2009నాటికి మొత్తం బ్యాంకు డిపాజిట్లలో గ్రామీణ డిపాజిట్లు 9.3 శాతానికి పడిపోయాయి. ఇదే కాలంలో మెట్రోపాలిటన్‌ నగరాలలో డిపాజిట్ల వృద్ధి 56.2 శాతానికి పెరిగింది.1998 నాటికి గ్రామీణ రుణం మొత్తం రుణంలో 10.7 శాతానికి పడిపోయింది. నేటికీ 50,376 బ్యాంకు శాఖల్లో 31,684 శాఖలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.

జాతీయ బ్యాంకు శాఖల మొత్తంలో 65.57 శాతం గ్రామీణ శాఖలుగా ఉండగా ప్రయివేటు విదేశీ బ్యాంకులలో ఇది కేవలం 29.71 శాతంగా ఉంది. మొత్తం గ్రామీణ బ్యాంకు శాఖలలో జాతీయబ్యాంకు శాఖలు 30,567గా ఉండి, 96.47 శాతంగా ఉంది. 1977లో ప్రతి 4 గ్రామీణ బ్యాంకు శాఖలకు ఒక మెట్రో, ఒక పట్టణ శాఖకు రిజర్వుబ్యాంకు అనుమతినిచ్చేది. దీనర్థం ప్రతి బ్యాంకు తాను ప్రారంభించే శాఖల్లో 66.6 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించాల్సి ఉంది. ప్రతి ప్రయివేటు బ్యాంకు తమ శాఖల్లో కనీసం 25 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించాలని ప్రభుత్వం షరతు పెట్టినా దాన్ని అనేక ప్రయివేటు బ్యాంకులు అమలు చేయటం లేదు. అలాగే ప్రాధాన్యతా రంగాల్లో రుణాలు అందించటంలోనూ ప్రయివేటు బ్యాంకులు నిర్లక్ష్యం చేస్తున్నాయి. వాటిపై రిజర్వు బ్యాంకు నియంత్రణ అంతంతమాత్రంగానే ఉంది. పైన పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే ద్రవ్య పునాది విస్తరణకు నిజమైన పరి ష్కారం బ్యాంకుల జాతీయీకరణలోనే ఉందన్నది స్పష్టమౌతుంది.

Sunday, September 12, 2010

నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశం


ఆర్‌బిఐ చర్చా పత్రం

భారతదేశ బ్యాంకింగ్‌ రంగంలో నూతన ప్రైవేట్‌ బ్యాంకుల ప్రవేశానికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనపై రిజర్వ్‌బ్యాంక్‌ ఆగస్టు 11న చర్చా పత్రాన్ని విడుదల చేసింది. సెప్టెంబర్‌ 30 లోగా అభిప్రాయాలు తెలియచేయాలని ప్రజానీకాన్ని కోరింది. 2010-11 సం|| బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రైవేట్‌ రంగంలో నూతన బ్యాంకుల ప్రవేశంపై చేసిన ప్రకటనకు కొనసాగింపుగా ఈ చర్చా పత్రం విడుదలయ్యింది.

భారతదేశంలో నూతన బ్యాంకులు ఎందుకు?

11వ పంచవర్ష ప్రణాళికా లక్ష్యమైన సమ్మిళిత వృద్ధి (ఇన్‌క్లూసివ్‌ గ్రోత్‌)ని సాధించేందుకు ద్రవ్య పునాది విస్తరణను (ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌) కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఇందుకు అవసరమైన బ్యాంకింగ్‌ పునాది విస్తరణను సుగమం చేయటానికి నూతన ప్రయివేట్‌ బ్యాంకుల అవశ్యకతను చర్చా పత్రం ప్రస్తావించింది. మార్చి 31, 2009 నాటికి భారతదేశంలో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఏడు నూతన ప్రయివేట్‌ బ్యాంకులు, 15 పాత ప్రయివేట్‌ బ్యాంకులు, 31 విదేశీ బ్యాంకులు, 86 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 4 స్థానిక ఏరియా బ్యాంకులు, 1721 అర్బన్‌ సహకార బ్యాంకులు, 31 రాష్ట్ర సహకార బ్యాంకులు, 371 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఉన్నాయి.

జూన్‌ 2005 నాటికి బ్యాంకు సేవలు పొందుతున్న సగటు జనాభా పట్టణాలలో 12,300 ఉండగా, జూన్‌ 2010 నాటికి 9400కు తగ్గినట్లు, ఇదే కాలంలో గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాలలో సగటు జనాభా 17200 నుండి 15900కు, దేశ వ్యాప్త సగటు జనాభా 15500 నుండి 13400కు తగ్గినట్లు చర్చా పత్రం వెల్లడించింది. దేశజనాభాలో బ్యాంకింగ్‌ సేవలు 37శాతానికి మించి అందట్లేదని, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు, వెనుకబడిన ప్రాంతాలకు సేవల లభించట్లేదని పత్రం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నూతన ప్రైవేట్‌ బ్యాంకులు అవసరం అంటూ చర్చాపత్రంలో ప్రభుత్వం ప్రకటించింది. పెట్టుబడిదారీ విధానం నిత్యం వల్లించే స్వేచ్ఛా పోటీ బ్యాంకుల మధ్య ఏర్పడుతుందని ఈ పత్రం అంచనా వేసింది. దీనివల్ల సేవల వ్యయం తగ్గి, నాణ్యమైన సేవలు ప్రజలకు అందుతాయని, అట్టడుగు వర్గాల ప్రజలు, వెనుకబడిన ప్రాంతాలకు బ్యాంకింగ్‌ సేవలు విస్తరిస్తాయని, బ్యాంకింగ్‌ పునాది కూడా పెరుగుతుందని చర్చాపత్రం విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.

నూతన ప్రైవేట్‌ బ్యాంకుల ప్రవేశంపై రిజర్వ్‌ బ్యాంకు గత అనుభవం

1969కంటే ముందు మన దేశంలో ప్రయివేటు బ్యాంకులుండేవి. ఇవి కేవలం నగరాలకు పరిమితమై ఉండేవి. సంపన్నులు, పారిశ్రామిక అధిపతుల ప్రయోజనాలపైనే కేంద్రీకరించేవి. ప్రజాధనం దుర్వినియోగమయ్యేది. డిపాజిట్‌దారుల ప్రయోజనాలను బేఖాతరు చేసి కాలరాసేవి. ఈ నేపథ్యంలోనే 1969లో బ్యాంకుల జాతీయీకరణకు నాటి ప్రభుత్వం పూనుకుంది. బ్యాంకుల జాతీయీకరణ తరువాత కార్యకలాపాలు, సేవలు దేశమంతా విస్తరించాయి. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్‌ శాఖలు ఏర్పడ్డాయి. గ్రామీణ, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బ్యాంకింగ్‌రంగం గణనీయమైన కృషి చేసింది. అందుకే దాదాపు 23 ఏళ్లు అంటే 1992 దాకా నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రస్తావనే రాలేదు.

సోవియట్‌ రష్యా కూలిపోవడం, ప్రపంచ బలాబలాల్లో మార్పులు రావడం, మన దేశీయ విదేశాంగ విధానంలో మార్పులు చోటుచేసుకోవడం వీటన్నింటి ఫలితంగా మనదేశంలో మళ్లీ ప్రయివేటు బ్యాంకుల ప్రస్తావన వచ్చింది. 1993లో నూతన ప్రయివేటు బ్యాంకుల ఏర్పాటుకు మార్గదర్శకాలు వచ్చాయి. 2001లో కొన్నింటిని సవరించారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా 12 కొత్త ప్రయివేటు బ్యాంకులకు ఆర్‌బిఐ అనుమతినిచ్చింది. వీటిలో అయిదు బ్యాంకులు చేతులు ఎత్తేయడంతో ఇతర బ్యాంకులతో విలీనం చేయబడ్డాయి. మరో 5 బ్యాంకులు అనేక అరిష్టాలను ఎదుర్కొని రకరకాల పద్ధతులలో నిలబడ్డాయి.

పై అనుభవాల నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో కాకుండా, తగినంత ప్రారంభ మూలధనంతోనే కొత్తప్రయివేటు బ్యాంకులకు ప్రవేశం కల్పించాలని, అప్పుడే ఈ రంగంలో సంభవించే ఒడిదుడుకుల్ని తట్టుకోగలుగుతాయని చర్చాపత్రం అభిప్రాయపడింది. సంస్కరణలలో భాగంగా ప్రారంభింపబడ్డ స్థానిక ఏరియా బ్యాంకుల పనితీరు సక్రమంగా లేదని చర్చా పత్రం పేర్కొంది. ఆర్థిక రంగంలో తగినంత అనుభవం, చాలినన్ని వనరులు, విశ్వాసనీయత, యాజమాన్య సామర్థ్యంగల సంస్థలే బ్యాంకులను సమర్థవంతంగా నిర్వహించగలుగుతాయని చర్చాపత్రం వెల్లడించింది.

ప్రైవేట్‌ బ్యాంకుల ప్రవేశానికి ప్రస్తుతం అమలులో వున్న మార్గదర్శకాలు

1. అతి పెద్ద పారిశ్రామిక సంస్థలు, వాణిజ్య గ్రూపులు, నూతన బ్యాంకుల్ని ప్రమోట్‌ చేయటానికి అర్హులు కావు. అయినప్పటికి ఈ సంస్థలతో సంబంధాలున్న కంపెనీలు, బ్యాంకు నియంత్రణ ప్రయోజనం లేకుండా, 10% మించని బ్యాంకు వాటాలను కలిగి ఉండొచ్చు. 2. మంచి వ్యాపారానుభవం, వనరులు కలిగిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ 'ఎఎఎ' లేదా దానికి సమానమైన పరపతి రేటింగ్‌, 12% లోపు క్యాపిటల్‌ ఎడిక్వసీ, 5% లోపు నిరర్ధక ఆస్తుల నిష్పత్తులు, కనీస మూలధన వనరులు కలిగి వున్నప్పుడు వాణిజ్య బ్యాంకుగా ప్రమోట్‌ చేయటానికి, లేదా మార్చటానికి వీలుంటుంది. ఈ సంస్థకు ఏ పెద్ద పరిశ్రమతోగాని, వాణిజ్య గ్రూపులతో గాని సంబంధం ఉండకూడదు. 3.నూతన బ్యాంకులు కనీసం 200 కోట్ల మూల ధనం కలిగి వుండాలి. మూడేళ్ళ కాలంలో దీన్ని రూ. 300 కోట్లకు పెంచాలి. 4. బ్యాంకు మూల ధనం మొత్తంలో 40% ప్రమోటర్ల మూలధనం ఉండాలి.

ఇది 5సం||రాల పాటు లాకిన్‌ చేయబడుతుంది. అంటే ఈ వాటాలను ఈ కాలంలో బదిలీ చేసే అవకాశం ఉండదు. ఒక వేళ ప్రమోటర్ల మూలధనం మొత్తం బ్యాంకు మూలధనంలో 40% మించి ఉంటే, అలా మించి ఉన్న మూలధనాన్ని బ్యాంకు కార్యకలాపాలు మొదలైనప్పటి నుండి సంవత్సరం తరువాత ఇతరులకు తప్పనిసరిగా బదిలీ చేయాలి. 5. ప్రవాస భారతీయులు నూతన బ్యాంకుల ప్రాథమిక ఈక్విటీలో 40% వరకు పెట్టుబడి పెట్టవచ్చు. కో ప్రమోటర్‌ గాను సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చే సంస్థగాను ఉన్న విదేశీ బ్యాంకింగ్‌ కంపెనీ కానీ, ఆర్థిక సంస్థగానీ ఈ 40%లో 20%నికి మించి వాటాలను కలిగి ఉండకూడదు. 6. బ్యాంకుల షేర్లు స్టాక్‌ ఎక్సేంజీల్లో లిస్ట్‌ అవ్వాలి. 7. బ్యాంకు కార్యకలాపాలు మొదలైనప్పటి నుండి బ్యాంకుల క్యాపిటల్‌ ఎడిక్వసీ నిష్పత్తి 10% క్రమబద్ధంగా ఉండాలి. 8. బ్యాంకులు ఇచ్చే రుణాలలో 40% ప్రాధాన్యతా రంగాలకు తప్పని సరిగా కేటాయించాలి. 9. బ్యాంకులు తెరిచే శాఖలలో 25% తప్పని సరిగా గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాలలో ఉండాలి. 10. ప్రమోటర్ల వ్యాపార వాణిజ్యాలకు, బ్యాంకులు దూరంగా ఉండాలి. ప్రమోటర్లకు, వాటి అనుబంధ కంపెనీలకు ఈక్విటీలో 10%నికి మించి రుణాలు ఇవ్వకూడదు. 11. ప్రయివేట్‌ బ్యాంకులు 74% వరకు విదేశీ పెట్టుబడులు (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ సంస్థా గత పెట్టుబడులు, ప్రవాస భారతీయ పెట్టుబడులు కలుపుకొని) కలిగి వుండవచ్చు. కానీ ఈ విదేశీ పెట్టుబడులు 50%నికి మించితే ఆ బ్యాంకు విదేశీ బ్యాంకుగా పరిగణించబడుతుంది.

చర్చాపత్రం - ప్రధానాంశాలు

పైన పేర్కొన్న మార్గదర్శకాలకు సవరణలు చేస్తూ రిజర్వ్‌ బ్యాంకు ఈ కింది అంశాలపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ చర్చాపత్రాన్ని విడుదల చేసింది. 1.నూతన బ్యాంకులకు కావలసిన కనీస మూలధనం మరియు ప్రమోటర్ల వాటా శాతం ఎంత వుండాలి? 2.ప్రమోటర్లు, ఇతర వాటా దారుల వాటాలపై విధించాల్సిన కనీస, గరిష్ట పరిమితులేమిటి? 3.నూతన బ్యాంకులలో విదేశీ పెట్టుబడుల అనుమతి ఎంత శాతం ఉండాలి? 4.నూతన బ్యాంకులకు ప్రమోటర్లుగా అతి పెద్ద పారిశ్రామిక, వాణిజ్య సంస్థలను అనుమతించవచ్చా? 5.బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను బ్యాంకులుగా మార్చడం లేదా ప్రమోటర్లుగా అంగీకరించడానికి అనుసరించాల్సిన పద్ధతులు. 6. వ్యాపార నమూనా. పై అంశాలపై వివిధ ప్రయోజనాలు, పర్యవసానాల్ని చర్చాపత్రం విస్తృతంగా చర్చించి, అవగాహన కోసం విభిన్న కోణాల్లో సమస్యలను వివరించింది. వివిధ దేశాలలో నూతన బ్యాంకుల ప్రవేశానికి అనుసరిస్తున్న మార్గదర్శకాలను చర్చాపత్రంతో జతపరిచింది.

ఆర్ బి ఐ ఈ క్రింది పేర్కొన్న అంశాలను స్పష్టపరిచింది.

1. నూతన బ్యాంకుల కనీస మూల ధనం రూ. 300 కోట్లకు మించి వుండాలి. అది 300 కోట్లు లేదా 500 కోట్లు లేదా 1000 కోట్ల అన్న అంశం చర్చకు పెట్టబడింది. 2. ప్రమోటర్ల కోటా లాకిన్‌ పిరియడ్‌ తరువాత ఉపసంహరించుకోవాల్సిన వాటా 10%, 20%, 30% - ఎంత అన్నది చర్చకు వదిలివేయబడింది. 3. విదేశీ పెట్టుబడులు 50%నికి మించి ఉండకూడదని స్పష్టంచేసింది. 4. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు, బ్యాంకులకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో సంబంధం ఉండకూడదన్నది. 5. అతి పెద్ద పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు బ్యాంకింగ్‌ రంగంలో ప్రవేశం కల్పించటానికి గాను, ముందుగా వారు నష్టాల్లో నడుస్తున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను నిర్వహించాలన్నది. 6. అనుమతించే బ్యాంకుల సంఖ్య కూడా పరిమితంగా ఉండాలన్నది.