Sunday, September 12, 2010

నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రవేశం


ఆర్‌బిఐ చర్చా పత్రం

భారతదేశ బ్యాంకింగ్‌ రంగంలో నూతన ప్రైవేట్‌ బ్యాంకుల ప్రవేశానికి సంబంధించిన మార్గదర్శకాల రూపకల్పనపై రిజర్వ్‌బ్యాంక్‌ ఆగస్టు 11న చర్చా పత్రాన్ని విడుదల చేసింది. సెప్టెంబర్‌ 30 లోగా అభిప్రాయాలు తెలియచేయాలని ప్రజానీకాన్ని కోరింది. 2010-11 సం|| బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రైవేట్‌ రంగంలో నూతన బ్యాంకుల ప్రవేశంపై చేసిన ప్రకటనకు కొనసాగింపుగా ఈ చర్చా పత్రం విడుదలయ్యింది.

భారతదేశంలో నూతన బ్యాంకులు ఎందుకు?

11వ పంచవర్ష ప్రణాళికా లక్ష్యమైన సమ్మిళిత వృద్ధి (ఇన్‌క్లూసివ్‌ గ్రోత్‌)ని సాధించేందుకు ద్రవ్య పునాది విస్తరణను (ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌) కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఇందుకు అవసరమైన బ్యాంకింగ్‌ పునాది విస్తరణను సుగమం చేయటానికి నూతన ప్రయివేట్‌ బ్యాంకుల అవశ్యకతను చర్చా పత్రం ప్రస్తావించింది. మార్చి 31, 2009 నాటికి భారతదేశంలో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఏడు నూతన ప్రయివేట్‌ బ్యాంకులు, 15 పాత ప్రయివేట్‌ బ్యాంకులు, 31 విదేశీ బ్యాంకులు, 86 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, 4 స్థానిక ఏరియా బ్యాంకులు, 1721 అర్బన్‌ సహకార బ్యాంకులు, 31 రాష్ట్ర సహకార బ్యాంకులు, 371 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఉన్నాయి.

జూన్‌ 2005 నాటికి బ్యాంకు సేవలు పొందుతున్న సగటు జనాభా పట్టణాలలో 12,300 ఉండగా, జూన్‌ 2010 నాటికి 9400కు తగ్గినట్లు, ఇదే కాలంలో గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాలలో సగటు జనాభా 17200 నుండి 15900కు, దేశ వ్యాప్త సగటు జనాభా 15500 నుండి 13400కు తగ్గినట్లు చర్చా పత్రం వెల్లడించింది. దేశజనాభాలో బ్యాంకింగ్‌ సేవలు 37శాతానికి మించి అందట్లేదని, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు, వెనుకబడిన ప్రాంతాలకు సేవల లభించట్లేదని పత్రం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నూతన ప్రైవేట్‌ బ్యాంకులు అవసరం అంటూ చర్చాపత్రంలో ప్రభుత్వం ప్రకటించింది. పెట్టుబడిదారీ విధానం నిత్యం వల్లించే స్వేచ్ఛా పోటీ బ్యాంకుల మధ్య ఏర్పడుతుందని ఈ పత్రం అంచనా వేసింది. దీనివల్ల సేవల వ్యయం తగ్గి, నాణ్యమైన సేవలు ప్రజలకు అందుతాయని, అట్టడుగు వర్గాల ప్రజలు, వెనుకబడిన ప్రాంతాలకు బ్యాంకింగ్‌ సేవలు విస్తరిస్తాయని, బ్యాంకింగ్‌ పునాది కూడా పెరుగుతుందని చర్చాపత్రం విశ్వాసాన్ని వ్యక్తం చేసింది.

నూతన ప్రైవేట్‌ బ్యాంకుల ప్రవేశంపై రిజర్వ్‌ బ్యాంకు గత అనుభవం

1969కంటే ముందు మన దేశంలో ప్రయివేటు బ్యాంకులుండేవి. ఇవి కేవలం నగరాలకు పరిమితమై ఉండేవి. సంపన్నులు, పారిశ్రామిక అధిపతుల ప్రయోజనాలపైనే కేంద్రీకరించేవి. ప్రజాధనం దుర్వినియోగమయ్యేది. డిపాజిట్‌దారుల ప్రయోజనాలను బేఖాతరు చేసి కాలరాసేవి. ఈ నేపథ్యంలోనే 1969లో బ్యాంకుల జాతీయీకరణకు నాటి ప్రభుత్వం పూనుకుంది. బ్యాంకుల జాతీయీకరణ తరువాత కార్యకలాపాలు, సేవలు దేశమంతా విస్తరించాయి. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా బ్యాంకింగ్‌ శాఖలు ఏర్పడ్డాయి. గ్రామీణ, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బ్యాంకింగ్‌రంగం గణనీయమైన కృషి చేసింది. అందుకే దాదాపు 23 ఏళ్లు అంటే 1992 దాకా నూతన ప్రయివేటు బ్యాంకుల ప్రస్తావనే రాలేదు.

సోవియట్‌ రష్యా కూలిపోవడం, ప్రపంచ బలాబలాల్లో మార్పులు రావడం, మన దేశీయ విదేశాంగ విధానంలో మార్పులు చోటుచేసుకోవడం వీటన్నింటి ఫలితంగా మనదేశంలో మళ్లీ ప్రయివేటు బ్యాంకుల ప్రస్తావన వచ్చింది. 1993లో నూతన ప్రయివేటు బ్యాంకుల ఏర్పాటుకు మార్గదర్శకాలు వచ్చాయి. 2001లో కొన్నింటిని సవరించారు. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా 12 కొత్త ప్రయివేటు బ్యాంకులకు ఆర్‌బిఐ అనుమతినిచ్చింది. వీటిలో అయిదు బ్యాంకులు చేతులు ఎత్తేయడంతో ఇతర బ్యాంకులతో విలీనం చేయబడ్డాయి. మరో 5 బ్యాంకులు అనేక అరిష్టాలను ఎదుర్కొని రకరకాల పద్ధతులలో నిలబడ్డాయి.

పై అనుభవాల నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో కాకుండా, తగినంత ప్రారంభ మూలధనంతోనే కొత్తప్రయివేటు బ్యాంకులకు ప్రవేశం కల్పించాలని, అప్పుడే ఈ రంగంలో సంభవించే ఒడిదుడుకుల్ని తట్టుకోగలుగుతాయని చర్చాపత్రం అభిప్రాయపడింది. సంస్కరణలలో భాగంగా ప్రారంభింపబడ్డ స్థానిక ఏరియా బ్యాంకుల పనితీరు సక్రమంగా లేదని చర్చా పత్రం పేర్కొంది. ఆర్థిక రంగంలో తగినంత అనుభవం, చాలినన్ని వనరులు, విశ్వాసనీయత, యాజమాన్య సామర్థ్యంగల సంస్థలే బ్యాంకులను సమర్థవంతంగా నిర్వహించగలుగుతాయని చర్చాపత్రం వెల్లడించింది.

ప్రైవేట్‌ బ్యాంకుల ప్రవేశానికి ప్రస్తుతం అమలులో వున్న మార్గదర్శకాలు

1. అతి పెద్ద పారిశ్రామిక సంస్థలు, వాణిజ్య గ్రూపులు, నూతన బ్యాంకుల్ని ప్రమోట్‌ చేయటానికి అర్హులు కావు. అయినప్పటికి ఈ సంస్థలతో సంబంధాలున్న కంపెనీలు, బ్యాంకు నియంత్రణ ప్రయోజనం లేకుండా, 10% మించని బ్యాంకు వాటాలను కలిగి ఉండొచ్చు. 2. మంచి వ్యాపారానుభవం, వనరులు కలిగిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ 'ఎఎఎ' లేదా దానికి సమానమైన పరపతి రేటింగ్‌, 12% లోపు క్యాపిటల్‌ ఎడిక్వసీ, 5% లోపు నిరర్ధక ఆస్తుల నిష్పత్తులు, కనీస మూలధన వనరులు కలిగి వున్నప్పుడు వాణిజ్య బ్యాంకుగా ప్రమోట్‌ చేయటానికి, లేదా మార్చటానికి వీలుంటుంది. ఈ సంస్థకు ఏ పెద్ద పరిశ్రమతోగాని, వాణిజ్య గ్రూపులతో గాని సంబంధం ఉండకూడదు. 3.నూతన బ్యాంకులు కనీసం 200 కోట్ల మూల ధనం కలిగి వుండాలి. మూడేళ్ళ కాలంలో దీన్ని రూ. 300 కోట్లకు పెంచాలి. 4. బ్యాంకు మూల ధనం మొత్తంలో 40% ప్రమోటర్ల మూలధనం ఉండాలి.

ఇది 5సం||రాల పాటు లాకిన్‌ చేయబడుతుంది. అంటే ఈ వాటాలను ఈ కాలంలో బదిలీ చేసే అవకాశం ఉండదు. ఒక వేళ ప్రమోటర్ల మూలధనం మొత్తం బ్యాంకు మూలధనంలో 40% మించి ఉంటే, అలా మించి ఉన్న మూలధనాన్ని బ్యాంకు కార్యకలాపాలు మొదలైనప్పటి నుండి సంవత్సరం తరువాత ఇతరులకు తప్పనిసరిగా బదిలీ చేయాలి. 5. ప్రవాస భారతీయులు నూతన బ్యాంకుల ప్రాథమిక ఈక్విటీలో 40% వరకు పెట్టుబడి పెట్టవచ్చు. కో ప్రమోటర్‌ గాను సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చే సంస్థగాను ఉన్న విదేశీ బ్యాంకింగ్‌ కంపెనీ కానీ, ఆర్థిక సంస్థగానీ ఈ 40%లో 20%నికి మించి వాటాలను కలిగి ఉండకూడదు. 6. బ్యాంకుల షేర్లు స్టాక్‌ ఎక్సేంజీల్లో లిస్ట్‌ అవ్వాలి. 7. బ్యాంకు కార్యకలాపాలు మొదలైనప్పటి నుండి బ్యాంకుల క్యాపిటల్‌ ఎడిక్వసీ నిష్పత్తి 10% క్రమబద్ధంగా ఉండాలి. 8. బ్యాంకులు ఇచ్చే రుణాలలో 40% ప్రాధాన్యతా రంగాలకు తప్పని సరిగా కేటాయించాలి. 9. బ్యాంకులు తెరిచే శాఖలలో 25% తప్పని సరిగా గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాలలో ఉండాలి. 10. ప్రమోటర్ల వ్యాపార వాణిజ్యాలకు, బ్యాంకులు దూరంగా ఉండాలి. ప్రమోటర్లకు, వాటి అనుబంధ కంపెనీలకు ఈక్విటీలో 10%నికి మించి రుణాలు ఇవ్వకూడదు. 11. ప్రయివేట్‌ బ్యాంకులు 74% వరకు విదేశీ పెట్టుబడులు (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ సంస్థా గత పెట్టుబడులు, ప్రవాస భారతీయ పెట్టుబడులు కలుపుకొని) కలిగి వుండవచ్చు. కానీ ఈ విదేశీ పెట్టుబడులు 50%నికి మించితే ఆ బ్యాంకు విదేశీ బ్యాంకుగా పరిగణించబడుతుంది.

చర్చాపత్రం - ప్రధానాంశాలు

పైన పేర్కొన్న మార్గదర్శకాలకు సవరణలు చేస్తూ రిజర్వ్‌ బ్యాంకు ఈ కింది అంశాలపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ చర్చాపత్రాన్ని విడుదల చేసింది. 1.నూతన బ్యాంకులకు కావలసిన కనీస మూలధనం మరియు ప్రమోటర్ల వాటా శాతం ఎంత వుండాలి? 2.ప్రమోటర్లు, ఇతర వాటా దారుల వాటాలపై విధించాల్సిన కనీస, గరిష్ట పరిమితులేమిటి? 3.నూతన బ్యాంకులలో విదేశీ పెట్టుబడుల అనుమతి ఎంత శాతం ఉండాలి? 4.నూతన బ్యాంకులకు ప్రమోటర్లుగా అతి పెద్ద పారిశ్రామిక, వాణిజ్య సంస్థలను అనుమతించవచ్చా? 5.బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను బ్యాంకులుగా మార్చడం లేదా ప్రమోటర్లుగా అంగీకరించడానికి అనుసరించాల్సిన పద్ధతులు. 6. వ్యాపార నమూనా. పై అంశాలపై వివిధ ప్రయోజనాలు, పర్యవసానాల్ని చర్చాపత్రం విస్తృతంగా చర్చించి, అవగాహన కోసం విభిన్న కోణాల్లో సమస్యలను వివరించింది. వివిధ దేశాలలో నూతన బ్యాంకుల ప్రవేశానికి అనుసరిస్తున్న మార్గదర్శకాలను చర్చాపత్రంతో జతపరిచింది.

ఆర్ బి ఐ ఈ క్రింది పేర్కొన్న అంశాలను స్పష్టపరిచింది.

1. నూతన బ్యాంకుల కనీస మూల ధనం రూ. 300 కోట్లకు మించి వుండాలి. అది 300 కోట్లు లేదా 500 కోట్లు లేదా 1000 కోట్ల అన్న అంశం చర్చకు పెట్టబడింది. 2. ప్రమోటర్ల కోటా లాకిన్‌ పిరియడ్‌ తరువాత ఉపసంహరించుకోవాల్సిన వాటా 10%, 20%, 30% - ఎంత అన్నది చర్చకు వదిలివేయబడింది. 3. విదేశీ పెట్టుబడులు 50%నికి మించి ఉండకూడదని స్పష్టంచేసింది. 4. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు, బ్యాంకులకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంతో సంబంధం ఉండకూడదన్నది. 5. అతి పెద్ద పారిశ్రామిక, వాణిజ్య సంస్థలకు బ్యాంకింగ్‌ రంగంలో ప్రవేశం కల్పించటానికి గాను, ముందుగా వారు నష్టాల్లో నడుస్తున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను నిర్వహించాలన్నది. 6. అనుమతించే బ్యాంకుల సంఖ్య కూడా పరిమితంగా ఉండాలన్నది.

No comments: