Sunday, September 26, 2010

బేసెల్‌ ప్రమాణాలు - బ్యాంకింగ్‌ వ్యవస్థ - పరిచయం


ప్రపంచీకరణ నేపథ్యంలో ద్రవ్య రంగ సుస్థిరత లక్ష్యంగా రూపొందించిన ''బేసెల్‌ ప్రమాణాలు'' (బేసెల్‌ నారమ్స్‌) బ్యాంకింగ్‌ వ్యవస్థలో పలు మౌళిక మార్పులకు కారణమవడమే కాకుండా, జాతీయ బ్యాంకుల రూపురేఖల్ని మారుస్తున్నాయి. సెప్టెంబర్‌ 12న బేసెల్‌ కమిటి ప్రతిపాదించిన బేసెల్‌-3 ప్రమాణాల అమలుకు, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ సంసిద్ధతను వ్యక్తం చేసింది. మౌళికంగా బ్యాంకింగ్‌ యాజమాన్యాల్ని ఉద్దేశించి రూపొందించిన ఈ ప్రమాణాలలో సాంకేతికత ఎక్కువగా ఉన్నా, ఇవి ప్రత్యక్షంగా దైనందిన బ్యాంకింగ్‌ నిర్వహణను నియంత్రిస్తూనే పరోక్షంగా డిపాజిట్‌దారులు, రుణగ్రహీతల ప్రయోజనాల్ని ప్రభావితం చేస్తున్నాయి. సాంకేతిక పదజాలంతో సంక్లిష్టంగా ఉండే బేసెల్‌ ప్రమాణాలు, వాటి పూర్వరంగాల్ని చర్చించుకుందాం.

బ్యాంకుల మనుగడ-మూలధన పరిమాణం

ప్రజల నుండి డిపాజిట్లు స్వీకరించడం, రుణాలు మంజూరు చేయడం బ్యాంకుల సాధారణ కార్యకలాపాలుగా మనకు తెలుసు. రుణాలపై వచ్చే వడ్డీ నుండే డిపాజిట్‌దార్ల సొమ్ముపై బ్యాంకులు వడ్డీ చెల్లిస్తుంటాయి. రుణాలపై తిరిగి రావలసిన అసలు, వడ్డీ చెల్లింపులు అనిశ్చితికి గురైనప్పుడు, డిపాజిట్లపై వడ్డీలను కూడా చెల్లించలేని స్థితిలో బ్యాంకులుంటాయి. అలాంటప్పుడు డిపాజిట్‌దార్లకు చెల్లించాల్సిన అసలు ఫాయిదాల్ని బ్యాంకుల మూలధనం నుండి చెల్లించాల్సి ఉంటుంది. చెల్లించిన రుణాలు మొండి బాకీలైతే, మూలధనం తగినంత లేకుంటే బ్యాంకులే మూతపడే పరిస్థితి ఏర్పడతాయి. అందువలన బ్యాంకుల రుణాల్లో ఇమిడివున్న ''రిస్క్‌''ను బట్టి, బ్యాంకుల మనుగడకు అవసరమైన మూలధన పరిమాణం ఆధారపడి ఉంది. ఈ ప్రాథమిక సూత్రమే బేసెల్‌ ప్రమాణాల రూపకల్పనకు పునాదిగా నిల్చింది.

బేసెల్‌ కమిటి పూర్వరంగం

రెండవ ప్రపంచ యుద్ధానంతరం జాతీయ ఆర్థిక వ్యవస్థ, ద్రవ్య సంస్కృతి మమేకమయ్యాయి. మొదటి చమురు సంక్షోభం తదనంతర కాలంలో తెరమీదకు వచ్చిన ప్రపంచీకరణ విధానాల నేపథ్యంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ, జాతీయ ఆర్థిక వ్యవస్థల అవసరాలను ప్రమాణంగా తీసుకోవాలా లేక వేగంగా ముందుకొస్తున్న ప్రపంచీకరణ ధోరణులకు ప్రాతినిథ్యం వహించాలా అన్న సవాళ్ళను ఎదుర్కొంది. ఈ సవాళ్ళకు సమాధానంగా ఆవిర్భవించిన బేసెల్‌ ప్రమాణాల నేపథ్యంలో బ్యాంకింగ్‌ వ్యవస్థకు, జాతీయ ఆర్థిక వ్యవస్థకు మధ్య సంబంధాలు బలహీన పడి, అంతిమంగా బ్యాంకింగ్‌ వ్యవస్థ ప్రపంచీకరణ ధోరణులకు లొంగిపోయింది.

బేసెల్‌ కమిటి ఆవిర్భావం

1970లలో తక్కువ మూలధనంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక బ్యాంకులు నిర్వహింపబడేవి. ప్రపంచీకరణ ప్రక్రియ ఊపందుకున్న మేరకు వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రమైన అస్థిరతకు గురౌతుండేవి. వీటి ప్రభావంతో అంతర్జాతీయ, జాతీయ బ్యాంకుల వైఫల్యాల పరిమాణం పెరుగుతుండేది. దీనితో పాటు ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ బ్యాంకుల విస్తరణ పెరిగింది. వివిధ దేశాల్లో బ్యాంకుల మూలధన పరిమాణంలో అనేక వ్యత్యాసాలుండేవి. 1974లో జర్మనీ బ్యాంకు ''హెడ్‌స్టట్‌'' వైఫల్యంతో జి-10 దేశాలైన అమెరికా, బ్రిటన్‌, బెల్జియం, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, నెదర్లాండ్స్‌, స్విజర్లాండ్‌ లు ''తక్కువ మూలధన సమీకరణ కల్గిన బ్యాంకుల నమూనా పై, సక్రమమైన బ్యాంకింగ్‌ నియంత్రణల కొరత''పై లోతైన అధ్యయనానికి సిద్ధమైయ్యాయి. ఈ దేశాలన్ని 1974లో ''అంతర్జాతీయ పరిష్కారాల బ్యాంకు'' (బ్యాంక్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ సెటిల్‌మెంట్స్‌ - బి.ఐ.యస్‌) పర్యవేక్షణలో స్విజర్లాండ్‌ నందలి బేసెల్‌ నగరంలో ''బ్యాంకింగ్‌ పర్యవేక్షణ కమిటి''గా ఏర్పడ్డాయి. ఈ కమిటియే తదనంతర కాలంలో ''బేసెల్‌ కమిటి'' గా ప్రాచుర్యం పొందింది. అంతర్జాతీయ పరిష్కారాల బ్యాంకు 1930లో బేసెల్‌ నగరంలో ఏర్పడ్డ అతి పురాతనమైన ఫైనాన్షియల్‌ సంస్థ. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులను సమన్వయ పరచడంలోనూ, వాటి సహకారాల్ని కూడకట్టడంలోనూ ఈ సంస్థ విశేషంగా కృషి చేస్తున్నది.

బేసెల్‌ -1 ప్రమాణాలు

జులై, 1988లో అంతర్జాతీయ బ్యాంకులకు కావల్సిన కనీస స్థాయి మూలధన అవసరాలపై బేసెల్‌ కమిటి కొన్ని ప్రమాణాలను రూపొందించింది. ఈ ప్రమాణాల్ని సభ్య దేశాలు అనివార్యంగా అమలు చేయాల్సిన అగత్యం లేకపోయినా, వారి వారి ఆర్థిక వ్యవస్థలకు ఈ ప్రమాణాలను అన్వయించుకొని 100కు పైగా దేశాల కేంద్ర బ్యాంకులు ఈ ప్రమాణాల అమలుకు సిద్ధమయ్యాయి. బ్యాంకింగ్‌ రంగ సుస్థిరతపై మొట్టమొదటిగా రూపొందించిన ఈ ప్రమాణాలను బేసెల్‌-1 ప్రమాణాలు లేదా బేసెల్‌ నారమ్స్‌గా ప్రసిద్ధికెక్కాయి. ఈ ప్రమాణాల ప్రకారం బ్యాంకు మంజూరు చేసిన ''రిస్క్‌''తో కూడిన రుణాల మొత్తంలో 8%తో సమానమైన మూలధనాన్ని ఆ బ్యాంకు అదనంగా కలిగి ఉండాలి. దీన్నే సముచిత మూలధన నిష్పత్తి (క్యాపిటల్‌ ఎడిక్వసీ రేషియో) లేదా మూలధన, రిస్క్‌తో కూడిన ఆస్థుల నిష్పత్తి (కేపిటల్‌ రిస్క్‌ రిలేటెడ్‌ ఎసెట్స్‌ రేషియో) అని అంటారు. దీన్ని లెక్కించడం కోసంగా వివిధ రుణాలకు, వాటిలో ఇమిడివున్న రిస్క్‌ను బట్టి వెయిటేజ్‌లను నిర్ణయించారు. గవర్నమెంట్‌ బాండ్‌లు 0% రిస్క్‌ వెయిటేజ్‌ గాను, ఇతర బ్యాంకులచే గ్యారంటీ చేయబడ్డ రుణాలకు 20%, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలచే గ్యారంటీ చేయబడ్డ రుణాలకు 40%, కార్పొరేట్‌ రుణాలతోపాటు ఇతర అన్ని రకాల రుణాలు (సిబ్బంది రుణాల మినహా) 100%గా రిస్క్‌ వెయిటేజ్‌ను నిర్ణయించబడ్డాయి. రుణాల నాణ్యతను బట్టి రుణ మొత్తంలో పైన పేర్కొన్న వెయిటేజ్‌ శాతం మేరకు ''సముచిత మూలధన నిష్పత్తి''ని బ్యాంకులు అమలు చేయాల్సి వుంటుంది.

బేసెల్‌ కమిటి వివిధ రకాల మూలధనాలకు ప్రామాణిక నిర్వచనాల్ని అందించింది. మూలధనాన్ని మొదటి అంచె (టైర్‌-1), రెండవ అంచె (టైర్‌-2) గా వర్గీకరించింది. ఈక్విటీ (మూల షేర్‌ ధనం) మొదటి అంచె మూలధనంగాను, అప్పుల ద్వారా సేకరించిన సహాయమూలధనాన్ని రెండవ అంచె మూలధనంగాను బేసెల్‌ కమిటి పేర్కొంది. ఈ ప్రమాణాల అమలు సరళంగా ఉన్నందున వీటిని ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు స్వచ్ఛందంగా శీఘ్రగతిని అమలు చేసాయి. నయాఉదారవాద విధానాలు అమలవుతున్న దేశాలలో ద్రవ్య రంగంలో స్పెక్యులేషన్‌ ధోరణలు మితిమీరడంతో ఆర్థిక వ్యవస్థలలో పెరుగుతున్న ఒడిదుడుకుల కారణంగా ఈ ప్రమాణాలను వివిధ దేశాలు అంగీకరించాల్సి వచ్చింది.

బేసెల్‌-1 ప్రమాణాల ప్రభావాలు

బ్యాంకులలో ''తగినంత మూలధన సమీకరణ''లో బేసెల్‌-1 ప్రమాణాలు విజయవంతమైనాయి. బేసెల్‌-1 ప్రమాణాలు ప్రధానంగా రుణాలలో ఇమిడి ఉన్న రిస్క్‌ పరిమాణంపై కేంద్రీకరించాయి. రుణాలలోని రిస్క్‌ విశ్లేషణ వర్గీకరణతో, అంతవరకు సామాజిక బాధ్యతగా అందించబడుతున్న రుణాలు అధిక రిస్క్‌ కలిగినవిగా భావించబడ్డాయి. దీనితో వాటి కేటాయింపులు తగ్గించడం మొదలైంది. ఫలితంగా వివిధ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రాధాన్యత రుణాల కేటాయింపు తగ్గిపోయింది. వసూలు కాని రుణాలను నిరర్ధక ఆస్థులు (నాన్‌ పర్‌ఫార్మింగ్‌ ఎస్సెట్స్‌)గా పరిగణించారు. బ్యాంకుల మొత్తం రుణాలలో నిరర్ధక ఆస్థుల నిష్పత్తిపై పరిమితి విధింపబడింది. ఈ పరిమితిని అమలు చేయటానికి అనేక బ్యాంకులు మొండి బకాయిలను తమ లాభాల్లో సర్దుబాటు చేసుకోవడంతో అవి నష్టాల బారిన పడ్డాయి. బేసెల్‌-1 తదనంతర కాలంలో ద్రవ్య రంగంలో నెలకొన్న మౌళిక మార్పుల కారణంగా ఉత్పన్నమైన సమస్యల్ని పరిష్కరించడంలో బేసెల్‌-1 ప్రమాణాలు వైఫల్యం చెందాయి. అందువల్ల వాటిని సవరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బేసెల్‌-2 ప్రమాణాలకు రూపకల్పన జరిగింది

No comments: