Sunday, November 21, 2010

బహుముఖ పేదరిక సూచి - పరిచయం


పేదరిక కొలమాన ప్రమాణాలు నిరంతరం మారుతూ వస్తున్నాయి. ఆదాయం, మౌలికావసరాలు, సాపేక్ష నిరాకరణ, సామర్థ్యాల ప్రాతిపదికన నిర్వచించబడ్డ వివిధ పేదరిక కొలమాన ప్రమాణాలను మనం ఈ శీర్షిక కింద గతంలో చర్చించుకున్నాం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యతను సంపాదించుకున్న 'మానవాభివృద్ధి పేదరిక సూచి' ఆధారంగా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం(యుఎన్‌డిపి) ప్రతి ఏటా ఒక నివేదికను ప్రచురిస్తోంది. ఈ 'సూచి'లో ఆరోగ్యం, విద్య, సముచిత జీవన ప్రమాణాల కొరత వంటి అంశాలు ప్రాతిపదికలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ప్రచురించిన తాజా 'మానవాభివృద్ధి వార్షిక నివేదిక-2010'లో 'మానవాభివృద్ధి పేదరిక సూచి' స్థానంలో 'బహుముఖ పేదరిక సూచి' (మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌-ఎంపిఐ) చోటు చేసుకుంది. పేదరిక ప్రమాణాల నిర్దారణలో ఈ సూచి మరో ముందడుగుగా ఉన్నది.

బహుముఖ పేదరిక సూచి (మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌)

ఒకే సమయంలో వివిధ రకాల వనరుల కొరత, సౌకర్యాల నిరాకరణను ఎదుర్కొంటున్న పేదల సంఖ్య, వాటి తీవ్రత ప్రభావాన్ని కొలిచే నూతన ప్రమాణమే బహుముఖ పేదరిక సూచి. అమర్త్యసేన్‌ రూపొందించిన మానవాభివృద్ధి సూచి దీనికి పునాది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో 'ఆక్స్‌ఫర్డ్‌ పేదిరక మానవాభివృద్ధి చొరవ(ఒపిహెచ్‌ఐ)' విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సబీనా అల్కైర్‌, జార్జి వాషింగ్టన్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ జేమ్స్‌ ఇ. ఫోస్టర్‌ ఈ సూచిని అభివృద్ధి చేశారు. 1999లో తన దేశంలో పేదరికాన్ని కొలిచేందుకు మెక్సికో ఈ సూచిని వాడింది. ఈ సూచి ప్రాతిపదికనే నేపాల్‌ స్వంతంగా 'స్థూల జాతీయ సంతోష సూచి'ని రూపొందించుకుంది. యుఎన్‌డిపి, ఒపిహెచ్‌ఐ కలిసి రూపొందించిన తాజా మానవాభివృద్ధి నివేదిక-2010 కూడా ఈ సూచి ఆధారంగానే తయారయింది

వివరణ

2009 వరకు మానవాభివృద్ధి నివేదికలు తయారు చేసేందుకు వాడిన సూచి వివిధ దేశాల్లో జీవన ప్రమాణాల కొరతను వివరిస్తుందేకానీ, ఈ కొరతలను ఎదుర్కొంటున్న వ్యక్తులు, కుటుంబాలు, ప్రాంతాలు, కొరతల సమిష్టి తీవ్ర ప్రభావాలను కొలవలేకపోయింది. పేదరిక నిర్మూలన కోసం, క్షేత్ర స్థాయిలో ఏ ప్రాతిపదికన చర్యలు చేపట్టవచ్చో నిర్దిష్టంగా గుర్తించేందుకు వీలులేకుండా పోయింది. ఈ లోటును 'బహుముఖ పేదరిక సూచి' తీరుస్తుంది. తీవ్ర పేదరికాన్ని, వివిధ బృందాలు, ప్రాంతాల వారీగా పేదరిక రేటును కనుక్కునేందుకు, జీవన ప్రమాణాల కొరత సమిష్టి ప్రభావాన్ని కొలిచేందుకు ఈ సూచి ఉపయోగపడుతుంది. ఈ సూచి నిర్మాణంలో విద్య, ఆరోగ్యం, జీవనప్రమాణాల ప్రాతిపదికగా పది అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. విద్యలో -పాఠశాలలో ఉన్న సంవత్సరాలు, బాల్య నమోదు, ఆరోగ్యంలో-బాల్య ఆయుకాలం, పౌష్టికాహారం, జీవన ప్రమాణాల్లో-విద్యుత్‌, త్రాగునీరు, పారిశుధ్యం, నివేశన స్థలం, వంట ఇంధనం, వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు ఉన్నాయి. ప్రతీ అంశానికి నిర్దిష్ట వెయిటేజీని కల్పిస్తారు. ఇలా వచ్చిన గణాంకాల ఆధారంగా కొరత / నిరాకరణల సగటు తీవ్రతను లెక్కిస్తారు. ఈ సగటు తీవ్రతను పేదల సంఖ్యతో (హెడ్‌కౌంట్‌) గుణిస్తే వచ్చేదే బహుముఖ పేదరిక సూచి. పై సూచిలో ఒక వ్యక్తి 30శాతం పైబడి పేదరిక తీవ్రతను కలిగి ఉంటే బహుముఖ పేదగా పరిగణిస్తారు. ఈ సూచిలో ఆదాయ సూచి చేర్చబడలేదు. ఆదాయ సూచి గణాంకాలలో విద్య, వైద్యానికి సంబంధించిన సమాచారం లేకపోవడమే ఇందుకు కారణమని నివేదిక పేర్కొంటోంది. బహుముఖ పేదరిక సూచికి కావలసిన సమాచారాన్ని జనాభా ఆరోగ్య సర్వే, బహుళ సూచి క్లస్టర్‌ సర్వే, ప్రపంచ ఆరోగ్య సర్వేల ఫలితాల నుంచి తీసుకున్నారు..

ప్రభావాలు

బహుముఖ పేదరిక సూచి వెనుకబడిన, తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు ఉపయుక్తంగా ఉంటుంది. ఆదాయం ఆధారంగా కొలిచే పేదరికం కంటే బహుముఖ పేదరిక సూచిలో పేదల సంఖ్య సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. సహస్రాబ్ధి అభివృద్ధి లక్ష్యాలను చేరటానికి కావలసిన పేదరిక తీవ్రత సమాచారాన్ని అందించటానికి ఈ సూచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సూచి ఆధారంగా మానవాభివృద్ధి నివేదిక పరిశీలించిన కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.

1. 104 దేశాల్లో పేదరిక నిర్దారణ గణించబడింది. ఈ దేశాల జనాభా ప్రపంచ జనాభాలో 78%గా ఉంది. ఈ దేశాల మొత్తం జనాభాలో (520కోట్లు) 3వ వంతు అనగా 175కోట్లు బిలియన్ల ప్రజలు బహుముఖ పేదరికంలో ఉన్నట్లు తేలింది. ఆదాయం ఆధారిత పేదరిక నిర్ధారణలో ఈ దేశాలలోని పేదలు 144కోట్లుగా గుర్తించబడింది.

2. యూరప్‌, మధ్య ఆసియా దేశాలలో బహుముఖ పేదరిక రేటు 3% ఉండగా, సబ్‌ సహారా దేశాలలో 65%గా ఉంది.

3. దక్షిణాసియాలో బహుముఖ పేదరిక సంఖ్య, సబ్‌ సహారా దేశాల కంటే అధికంగా ఉంది. ప్రపంచ పేదలలో సగ భాగం దక్షిణాసియా దేశాలలోను (51%), నాల్గవ వంతు (28%) ఆఫ్రికా దేశాలలో ఉన్నారు.

4. బహుముఖ పేదరిక తీవ్రత రేటులో సబ్‌ సహారా దేశాల శాతం అత్యధికంగా ఉంది (నైగర్‌లో 93%).

5. భారత దేశంలో 8 రాష్ట్రాలలోని బహుముఖ పేదలు 421 మిలియన్లు ఉండగా, 26 అతిపేద ఆఫ్రికా దేశాలలో బహుముఖ పేదలు 411 మిలియన్లుగా ఉన్నారు.

6. బహుముఖ పేదరికం దక్షిణాసియా దేశాలలో అత్యధికంగా ఉండగా, తూర్పు ఆసియా దేశాలలో (చైనా, థారులాండ్‌) తక్కువగా ఉంది. భారతదేశంలో బహుముఖ పేదరిక రేటు 55%గా ఉంది. ఇది టెండూల్కర్‌ కమిటి అంచనాల కంటే ఎక్కువ. భారతదేశంలో అతితక్కువ బహుముఖ పేదలున్న రాష్ట్రం కేరళ.

7. భారతదేశంలో ఢిల్లీ బహుముఖ పేదరిక రేటు, ఇరాక్‌, వియత్నాంలకు (14%)చేరువలో ఉండగా బీహార్‌ రాష్ట్రం సియెర్రా, గినియా దేశాల (81%) స్థాయిలో ఉంది.

8. భారతదేశంలో గిరిజన ప్రజలలో 81%, షెడ్యూల్‌ కులాల ప్రజానీకంలో 66%, ఇతర వెనుకబడిన తరగతులలో 58% ఇతరులలో 33% బహుముఖ పేదరికంలో ఉన్నారు. బారక్‌ ఒబామా చేత అభివృద్ధి చెందిన దేశంగా పిలువబడాలని ఉబలాటబడ్డ భారతదేశ పాలకులు పేదరికంలో ఏమని పిలిపించుకోవాలో తేల్చుకోవాలి.

ముగింపు

2010 మానవాభివృద్ధి నివేదిక బహుముఖ పేదరిక సూచితోపాటు అసమానతకు సర్దుబాటు చేయబడ్డ మానవాభివృద్ధి సూచిని, స్త్రీ,పురుష అసమానతకు నూతన కొలమానాన్ని ప్రవేశపెట్టింది. బహుముఖ పేదరిక సూచిపై విమర్శలు లేకపోలేదు. వివిధ అంశాలలో వాస్తవమైన సమాచార సేకరణలో అనేక లోటుపాట్లు ఉన్నాయి. వీటిని సరిదిద్దుకొని బహముఖ పేదరిక సూచిని మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ పేదరికం లోతుల్ని, నిజస్వరూపాన్ని దర్శించటానికి, పేదరిక నిర్మూలన చర్యలను మరింత మెరుగుపరచుకోటానికి పాలకులకు, పౌరసమాజానికి ఈ సూచి మార్గదర్శకంగా నిలుస్తుంది.

2010 మానవాభివృద్ధి నివేదిక సారాంశంలో మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ అవసరాన్ని ప్రస్తావిస్తూ ''నిలకడైన ఆర్థిక పురోగమనానికి మార్కెట్ల అవసరం ఉండవచ్చేమోగాని, వాటంతటవి మానవాభివృద్ధిలోని వివిధ పార్వ్శాల అభివృద్ధిని సాధించలేవు. వేగవంతమైన ఆర్థిక వృద్ధిని ఆకాంక్షించే అభివృద్ధి నమూనా అరుదుగానే మనగలుగుతుంది. మరోమాటలో చెప్పాలంటే మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ అవసరమేకాని, అదే (ఆర్థికాభివృద్ధికి) సరిపోదు''. ప్రపంచీకరణ విధానాలకు ఎదురొడ్డి పోరాడుతున్న ప్రగతిశీల శక్తులు ఇంత కాలం ఘోషిస్తున్న ''నిజం'' ఇది.

Sunday, November 14, 2010

ఆర్థిక మాంద్యం, కోలుకోవడం రూపాలు - పరిచయం

అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశాలలో ఆర్థిక సంక్షోభాలు తరచూ సంభవిస్తుండేవి. వాటి దుష్ప్రభావాలు ఆయా దేశాలకే పరిమితమౌతుండేవి. ప్రపంచీకరణ విధానాల నేపథ్యంలో ఆర్థిక సంక్షోభ భారాలు వివిధ దేశాలపై పడటం అనివార్యమైంది. వీటితో ఆయా దేశాలలోని స్థూల దేశీయోత్పత్తి, ఉపాధి కల్పన, ఉత్పాదన తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ మధ్య సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభ తదనంతర కాలంలో ఆర్థిక సంక్షోభాల గూర్చి అధ్యయనం, విశ్లేషణ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇటీవల జరిగిన జి-20 శిఖరాగ్ర సమావేశాల్లో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల మాంద్యం, కోలుకోవటాల స్థాయిలను చర్చించడం జరిగింది. సంక్షోభాల ప్రభావంగా స్టాక్‌ మార్కెట్లలో విజృంభణ, పతన ప్రక్రియలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఆర్థిక వ్యవస్థలో మాంద్యం (రెసిషన్‌), కోలుకోవడం (రికవరీ)ల స్థాయిని వ్యక్త పరిచే పద్ధతులలో రేఖాచిత్ర వ్యక్తీకరణ ప్రముఖంగా ముందుకొచ్చింది. వీటి ఆధారంగా పరిష్కార మార్గాల అన్వేషణ కూడా జరుగుతుంది. రేఖా చిత్రాలుగా వ్యక్తికరింపబడుతున్న ఆర్థిక మాంద్య/కోలుకోవడంల స్థాయిలనుV, U,W,L రూపాలుగా వ్యక్తపరుస్తున్నారు. ఆయా స్థాయిలను ఆయా రూపాల పేర్లతో ఆర్థిక నిపుణులు పిలుస్తున్నారు. ప్రపంప ఆర్థిక సంక్షోభ తదనంతర కాలంలో వివిధ దేశాలలోని ఆర్థిక మాంద్యం/కోలుకోవడంల స్థాయిలను W- రూపం గల స్థాయిగా పిలుస్తున్నారు. ఇదే డబుల్‌ డిప్‌ రెసిషన్‌/రికవరీ లేదా తిరగబెట్టిన ఆర్థిక మాంద్యం/కోలుకోవడం నమూనాగా ప్రముఖంగా చర్చల్లో ఉంది.

ప్రాతిపదిక

ఒక ఆర్థిక వ్యవస్థలో ఒక దశలోని ఉపాధి కల్పన రేటు, స్థూల దేశీయోత్పత్తి రేటు, ఉత్పాదక రేటుల నికర విలువను గణాంకంగా రేఖా చిత్రంలోని నిలువు అక్షం పైన, కాల వ్యవధిని గణాంకంగా తీసుకొని అడ్డంగా ఉండే అక్షం పైన తీసుకొని రేఖా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

V - రూపం గల మాంద్యం/కోలుకోవడం నమూనా


ఈ నమూనాలో మాంద్య దశ మొదలై ఆర్థిక వృద్ధి గణాంకం ఉన్నత స్థాయి నుండి దిగువ స్థాయికి పడిపోతుంది. అంటే ఉపాధి కల్పన, స్థూల దేశీయోత్పత్తి, ఉత్పాదన కలిసికట్టుగా పతనమైనట్లు భావించాలి. ఈ పతన దశ ఒక స్థాయికి చేరిన తరువాత అదే స్థాయిలో అదే వేగంతో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం జరుగుతుంది. ఈ రకంగా మాంద్యంతో పతనమై, తిరిగి కోలుకొనే స్థితి రేఖా చిత్రం V రూపంలో ఉంటుంది. స్వల్పకాలంలో పతనమై ఆర్థికాభివృద్ధి స్వల్ప కాలంలో కోలుకొనే స్థితి ఇది. వస్తూత్పత్తి ప్రాధాన్యతగా కలిగిన పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థలో ఇది సర్వ సామాన్యంగా ఉంటుంది.

U-రూపంలోని ఆర్థిక మాంద్యం/కోలుకోవడం నమూనా

V-రూప నమూనాలో కంటే U-రూప నమూనాలో ఆర్థిక వృద్ధి స్వల్ప కాలంలో పతనమై, నామమాత్రపు ఆర్థిక వృద్ధితో మాంద్యం దీర్ఘ కాలం కొనసాగి ఆ తరువాత కోలుకుంటుంది. ఆర్థిక నిపుణులు ఖ-రూప స్థాయిని ''స్నానాల తొట్టి''తో పోల్చారు. దీనిలో దిగిన వ్యక్తిలా ఆర్థిక వ్యవస్థ కూడా ఈ నమూనాలో నుంచి అంత తొందరగా బయటపడలేదని వాళ్ళు అభిప్రాయ పడుతున్నారు.
1972-1977ల మధ్య కాలంలోని మొదటి చమురు సంక్షోభం నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ధరలు అమితంగా పెరిగాయి. కార్మికవర్గ ఉపాధిపై, వేతనాలపై తీవ్రమైన కోతలు విధించారు. దీని కారణంగా ప్రజల కొనుగోలు శక్తి భారీగా పడిపోయింది. సరుకుల కుప్పలు పేరుకుపోయాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. నిరుద్యోగం పెరిగి, ఉత్పాదకత తగ్గిన కారణంగా అనేక దేశాలలో ఏర్పడ్డ సంక్షోభ పరిస్థితిని U-రూప నమూనాతో పోలుస్తున్నారు. ఈ కాలంలో అధిక ధరలు, మాంద్యం కలసి ఆర్థిక వ్యవస్థలను దీర్ఘ కాలంగా బాధించాయి. పాలక వర్గాలు ఈ సంక్షోభం నుండి బయటపడటానికి బలప్రయోగాన్ని ఉపయోగించారు. భారతదేశంలో ఈ కాలంలోనే అత్యవసర స్థితి విధించబడింది. మానవ హక్కుల్ని కాలరాశారు.

W-రూపం గల మాంద్యం/కోలుకోవడం నమూనా

దీన్నే డబుల్‌ డిప్‌ రెసిషన్‌/రికవరీ నమూనా లేదా తిరగబెట్టిన మాంద్యం/కోలుకోవడం నమూనాగా పిలుస్తారు. V-రూపం గల నమూనాలో స్వల్ప కాలంలో ఆర్థిక వృద్ధి పతనమై, అదే కాలంలో తిరిగి కోలుకొంటుంది. కానీ w-రూపం గల నమూనాలో స్వల్ప కాలంలో పతనమై తిరిగి కోలుకున్న ఆర్థిక వృద్ధి మళ్ళీ పతనమై తిరిగి కొంత కాలానికి కోలుకుంటుంది. అంటే ఈ స్థాయిలో ఆర్థిక వృద్ధి పతనం రెండు సార్లు వెంట వెంటనే జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకర స్థితి. ఈ స్థితిలో నిరుద్యోగ రేటు తీవ్రంగా పెరగటం, ఉత్పాదకత భారీగా తగ్గి పోవడం, స్థూల దేశీయోత్పత్తి గణనీయంగా పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థ మహా మాంద్య స్థితికి నెట్టబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఆర్థిక వృద్ధికి పటిష్టమైన మౌళిక చర్యలు చేపట్టకుండా ఆర్థిక మాంద్యాన్ని కేవలం ఉద్దీపన పథకాలతో పరిష్కరించాలనుకుంటే ఏర్పడే స్థితి ఇది. ఉద్దీపనలతో మాంద్య తీవ్రత తాత్కాలికంగా తగ్గుతూనే ద్రవ్యోల్భణం పెరుగుతుంది. ద్రవ్యోల్భణాన్ని తగ్గించటానికి వడ్డీ రేట్లను పెంచడం, కార్మిక వర్గ వేతనాలు తగ్గించడం లాంటి చర్యలు కొనుగోలు శక్తిని తగ్గించి మార్కెట్లో సరుకుల గిరాకీని తగ్గిస్తాయి. ఇది మళ్ళీ సంక్షోభానికి దారితీస్తుంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభ తదనంతర కాలంలో అమెరికా, యూరప్‌ తదితర దేశాలు ఎదుర్కొంటున్న సంకట స్థితి ఇదే. భారత దేశంలో రిజర్వ్‌ బ్యాంకు సంక్షోభ నివారణ చర్యలతో ఈ స్థితి రావచ్చునని ఆందోళన పడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో అమెరికాలో నిరుద్యోగ రేటు పెరగటం, వృద్ధి రేటు పెరగక పోవటం, అదే సందర్భంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ బ్రిటన్‌ మాంద్యానికి చేరువులో ఉన్నదని ప్రకటించడం లాంటివి w-రూప నమూనా లక్షణాలే.

L-రూపం గల మాంద్యం/కోలుకోవడం నమూనా

L-రూపం గల ఆర్థిక వ్యవస్థలోని వృద్ధి రేటు స్వల్ప కాలంలో పతనమై, మాంద్యం సుధీర్ఘ కాలం కొనసాగుతుంది. కోలుకొనే అవకాశాలు అంచనాలలో ఉండవు. ఈ కాలంలో ఆర్థిక వృద్ధి చాలా స్వల్పంగా ఉంటుంది. ఈ స్థితి ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన ప్రమాదకర పరిస్థితిగా చెప్తున్నారు. ఈ స్థితిని మహా మాంద్యంగా కూడా వర్ణిస్తారు.

రెండవ ప్రపంచ యుద్ధానంతర కాలం నుండి జపాన్‌ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా బలపడింది. 1980ల చివరిలో జపాన్‌లో ఆస్థుల ధరల బుడగ పగలడంతో ప్రతి ద్రవ్యోల్భణంతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అనేక సంవత్సరాలుగా పూర్వ స్థితికి చేరుకోలేక పోయింది. దీన్నే ''పోగొట్టుకున్న దశకం''గా కూడా ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు. ఈ స్థాయిని ూ-రూపం గల మాంద్యం/కోలుకోవడం నమూనాగా పరిగణిస్తున్నారు. U-రూపంలో,W-రూపాలలోని ఆర్థిక వ్యవస్థలుL-రూపం గల నమూనాలుగా మారే అవకాశాలు ద్రవ్య పెట్టుబడి ప్రాధాన్యత గల పెట్టుబడి దారీ వ్యవస్థలో అత్యధికంగా ఉంటాయి
.

ముగింపు

ఆర్థిక సంక్షోభానికి ఆర్థికపరమైన పరిష్కారాలు కావాలనుకొనే ప్రపంచ అధినేతలు ఉద్దీపన పథకాలు, ద్రవ్య విధాన చర్యల (మానిటరీ మెజర్స్‌)తోనే పరిమితమౌతున్నారు. ఈ చర్యలు సంక్షోభ సమస్యల్ని పరిష్కరించకుండా, నూతన సంక్షోభాల్ని సృష్టిస్తున్నాయి. అందుకోసం ఆర్థిక సంక్షోభ శాశ్వత పరిష్కారానికి రాజకీయ పరిష్కారం అనివార్యమైంది. వస్తూత్పత్తి రంగానికి ప్రాధాన్యతనిస్తూ ఉత్పాదనను పెంచే మార్గాలను అన్వేషించి అమలు చేయాలి. వినియోగంలోనికి రాని మానవ శ్రమ శక్తి, ఉత్పాదక శక్తి పూర్తి వినియోగానికి తగిన చర్యలు తీసుకోవాలి. ద్రవ్య పెట్టుబడి, ఆర్థికాభివృద్ధికి సహాయకారి కావాలి. కానీ అది ఆర్థిక వ్యవస్థను శాసించకూడదు. అప్పుడే సంక్షోభాల ప్రళయాల నుండి సామాన్య ప్రజానీకం, వివిధ దేశాలు కాపాడబడతాయి.


Friday, November 5, 2010

వాణిజ్య లోటు

ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కరెన్సీ యుద్ధంలో మునిగితేలుతున్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా అమితంగా పెరిగిన విదేశీ మారకద్రవ్య ''కరెన్సీ ఖాతాలోటు'' ఈ యుద్ధానికి మూల కారణమైంది. కరెంటు ఖాతా లోటుకు వాణిజ్యలోటు కీలకమైంది. వాణిజ్య లోటు, వాణిజ్య మిగులు వాణిజ్య సమతుల్యతలో రెండు భాగాలు. ప్రపంచీకరణ విధానాల నేపథ్యంలో అత్యంత కీలకమైన విదేశీ మారకద్రవ్య నిల్వలలో వాణిజ్య సమతుల్యత వ్యూహాత్మక పాత్రను పోషిస్తున్నది.

వాణిజ్య సమతుల్యత అంటే

ఆర్థిక వ్యవస్థలోని ఎగుమతి, దిగుమతుల మధ్య ఉన్న సంబంధమే ''వాణిజ్య సమతుల్యత'' (బ్యాలెన్స్‌ ఆఫ్‌ ట్రేడ్‌) అని అంటారు. ఒక దేశం నుండి ఎగుమతయ్యే వస్తువులు, సేవల విలువ కంటే దిగుమతుల విలువ తక్కువగా ఉన్నప్పుడు ''వాణిజ్య మిగులు''(ట్రేడ్‌ సర్‌ప్లస్‌) అంటారు. ఒక దేశం యొక్క దిగుమతుల విలువ కంటే ఎగుమతుల విలువ తక్కువగా ఉంటే ''వాణిజ్య లోటు'' (ట్రేడ్‌ డెఫిసిట్‌) అంటారు. సాధారణంగా ''వాణిజ్య మిగులు'' ఒక ఆర్థిక వ్యవస్థ స్థూల దేశీయోత్పత్తిని పెంచడంతో పాటు, ఆ దేశంలో సంపదను ఉద్యోగ,ఉపాధి అవకాశాల్ని పెంచి దేశీయ పొదుపును, విదేశీ మారక ద్రవ్య నిల్వలను, ఆర్థిక సుస్థిరతను పెంచుతుంది. ''వాణిజ్య లోటు'' ఆర్థిక వ్యవస్థ స్థూలదేశీయోత్పత్తిని తగ్గించడంతోపాటు ఆ దేశ సంపదను, విదేశీ మారకద్రవ్య నిల్వలను కుదిస్తుంది. వాణిజ్య లోటు ప్రభావంగా దేశీయ పొదుపు తగ్గటమే కాకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిల్లి, ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు దారితీసే అవకాశాలున్నాయి. తాత్కాలికంగా ఏర్పడే వాణిజ్య లోటు కంటే, సుదీర్ఘకాలం కొనసాగే వాణిజ్య లోటు ప్రమాదకరమైంది. వాణిజ్య లోటును తగ్గించటానికి వస్తూత్పత్తిని పెంచి, దేశీయ వినియోగాన్ని, ఎగుమతులను పెంచటం పరిష్కారంగా ఉండేది. సాంప్రదాయ ఆర్థికవేత్తలు 1970కి పూర్వం వాణిజ్య సమతుల్యతను గూర్చి స్థూలంగా వివరించిన అంశాలివి. ఆర్థిక వ్యవస్థలో వస్తూత్పత్తికి అధిక ప్రాధాన్యతను ఇచ్చిన కాలమది. ప్రపంచీకరణ నేపథ్యంలో వాణిజ్య లోటును పరిష్కరించే మార్గాలు మారాయి.

ప్రపంచీకరణ నేపథ్యంలో వాణిజ్య లోటు

ఆర్థిక వ్యవస్థకు వాణిజ్య లోటు ప్రమాదకారి కాదని, పైపెచ్చు అది దోహదకారి అనే వాదనలు 1970 తరువాత ముందుకొచ్చాయి. 90ల తరువాత ప్రపంచీకరణ విధానాల మూలంగా ప్రాధాన్యతను సంతరించుకున్న స్వేచ్ఛా వాణిజ్యం కారణంగా, వివిధ దేశాలలో దిగుమతులు పెరిగాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటుతోను, సరుకులపై సంఖ్యాపర ఆంక్షలు (క్వాంటిటేటివ్‌ రిష్ట్రిక్షన్స్‌) ఎత్తివేయడంతోనూ ప్రతి ఆర్థిక వ్యవస్థలో అనివార్యమైన దిగుమతులు కుప్పలుగా పోగయ్యాయి. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం, వినియోగం పెరగడం, దేశీయ వస్తువులు కొరతగాను, ఖరీదుగాను ఉండటం మూలంగా వినియోగదారుడి ప్రయోజనాల రక్షణకు దిగుమతులు లాభకరమనే వాదనలు ఊపందుకున్నాయి. వీటి ద్వారా పెరిగిన వాణిజ్య లోటు ఆర్థిక వ్యవస్థ శక్తి సామర్థ్యాలను వ్యక్తం చేస్తుందేకాని, ప్రమాదకారి కాదని మిల్టన్‌ ఫ్రీడ్‌మన్‌ లాంటి ఆర్థికవేత్తలు సిద్ధాంతాలను లేవనెత్తారు.

అమెరికా వాణిజ్య లోటు - ప్రపంచ ద్రవ్య సంక్షోభం

1970కి ముందుకాలంలో అమెరికా స్థూల దేశీయోత్పత్తిలో 1% వాణిజ్య మిగులును కలిగివుండేవి. 1970ల తరువాత ఆ దేశం అనుసరించిన నయాఉదారవాద విధానాల నేపథ్యంలో అమెరికా దేశీయ వస్తూత్పత్తిని తగ్గించుకొని, విదేశీ దిగుమతులపై ఆధారపడటం మొదలెట్టింది. దీని ప్రభావంగా ప్రపంచంలో అత్యధిక వాణిజ్య లోటుగల దేశంగా అమెరికా మారింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై డాలర్‌ ఆధిపత్యం పెరిగింది. ఆ మేరకు తన ఆర్థిక వ్యవస్థలో పెరిగిన వాణిజ్య లోటును, ఇతర దేశాలు డాలర్ల రూపంలో తమ దగ్గర పెట్టుకున్న పెట్టుబడులతో భర్తీ చేసుకోవడం మొదలెట్టింది. వాణిజ్య లోటు పెరిగిన మేరకు అమెరికాలో ఉపాధి అవకాశాలు తగ్గి నిరుద్యోగ రేటు పెరగడం మొదలైంది. దీనితోపాటు కరెంటు ఖాతా లోటు కూడా పెరిగింది. తదనంతరం ఆ వ్యవస్థలో కొనసాగుతున్న ఆర్థిక స్థంభన (స్టాగేషన్‌) 2007-08 సం||కి ఆర్థిక మాంద్యంగా మారి, అంతిమంగా ద్రవ్య సంక్షోభమై అమెరికాను, ప్రపంచదేశాల్ని ముంచెత్తింది. దీనితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తలకిందులై, అమెరికాకు రావలసిన పెట్టుబడులు సన్నగిల్లాయి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి అమెరికా చేపట్టిన ఉద్దీపన చర్యలతో కరెంటు ఖాతా తీవ్ర లోటుకు గురై, కరెన్సీ సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీని నుండి బయటపడటానికి అమెరికా తన ఎగుమతుల్ని పెంచు కోవడం కోసం, ఇతర దేశాల కరెన్సీ విలువలను పెంచాలని డిమాం డ్‌ చేస్తుంది. ఇదే అమెరికా, తన ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగే కాలంలో ఇతర దేశాల నుండి దిగుమతులను చౌకగా పొందేందుకు గాను ఆయా దేశాల కరెన్సీ విలువల్ని తగ్గించడం కోసం అంతర్జా తీయ ద్రవ్య సంస్థల్ని వినియోగించుకోవడం మనకు తెలుసు. అమెరికా ప్రయోజనాలు ప్రపంచ ప్రయోజనాలుగా పరిగిణించిన చర్యలివి.

వాణిజ్య లోటు - భారతదేశం

భారతదేశంలో వాణిజ్యలోటు 2004-05 సం||లో 33.7 బిలియన్‌ డాలర్లు ఉండగా, అప్పటినుండి క్రమంగా పెరుగుతూ 2009-10 సం||నికి 117.3 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ వాణిజ్య లోటు మరింత పెరుగుతూ 2010-11 సం||నికి 135 బిలియన్‌ డాలర్లు అయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత సం|| మొదటి త్రైమాసికంలో 4.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్న కరెంటు ఖాతా లోటు, ప్రస్తుత సం|| మొదటి త్రైమాసికంలో 13.7 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ప్రపంచ వాణిజ్య సంస్థ తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ వాణిజ్య గణాంకాలు 2010లో, ప్రపంచంలోని అత్యధిక వ్యాపార (మెర్కండైజ్‌) వాణిజ్య లోటులో అమెరికా, బ్రిటన్‌ దేశాల తరువాత భారతదేశం 3వ స్థానంలో ఉన్నట్లు ప్రకటించింది. రూపాయి విలువ పెరగడంతో ఎగుమతులు తగ్గి, ఎగుమతిదారులు రూపాయి విలువను తగ్గించమని కోరుతున్నా, భారత ప్రభుత్వం అంగీకరించడంలేదు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల ద్వారా చేకూరిన 15 బిలియన్‌ డాలర్ల ''నికర పెట్టుబడి ఖాతా మిగులు'' (నెట్‌ క్యాపిటల్‌ ఎకౌంట్‌ సర్‌ప్లస్‌)తో గట్టెక్కగలమన్న ధీమాతో ప్రభుత్వ వర్గాలున్నాయి. ఈ పెట్టుబడుల అస్థిరత ప్రపంచ ఆర్థిక సంక్షోభ కాలంలో మన అనుభవంలోకి వచ్చిందే. అనూహ్య పరిస్థితుల్లో ఈ పెట్టుబడులు వెనక్కు మళ్ళితే, మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ముగింపు

ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పెరిగిన వివిధ దేశాల వాణిజ్య లోటులను ఎగుమతులతోనే పూడ్చుకోవాలనే నూతన దృక్పథం పెరగటానికి సంక్షోభమే కారణమైంది. వాణిజ్యలోటును ''హాట్‌ మనీ''తో సర్దుకోగలమనే విశ్వాసం ప్రపంచ దేశాల్లో సన్నగిల్లింది. ప్రముఖ ఆర్థిక నిపుణులు వారెన్‌ బఫెట్‌ వ్యాఖ్యానిస్తూ, వాణిజ్య లోటు అమెరికా అర్థిక వ్యవస్థకు ప్రమాదకరమన్నారు. చైనా గత ఆరు సంవత్సరాలుగా వాణిజ్య మిగులును సాధిస్తూ, క్రితం మార్చికి మొదటిసారిగా వాణిజ్య లోటును చవిచూసింది. అయినప్పటికి ఈ లోటు ప్రభావం తమ ఆర్థిక వ్యవస్థపై ఉండదని చైనా ప్రభుత్వం ప్రకటిస్తున్నది. దేశీయ వస్తూత్పత్తిని పెంచి, వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకొని, స్వావలంబన చర్యలకు ఉపక్రమించినప్పుడే మనం కూడా ఈ తీవ్ర వాణిజ్య లోటు నుండి బయటపడగలం.