Sunday, November 21, 2010

బహుముఖ పేదరిక సూచి - పరిచయం


పేదరిక కొలమాన ప్రమాణాలు నిరంతరం మారుతూ వస్తున్నాయి. ఆదాయం, మౌలికావసరాలు, సాపేక్ష నిరాకరణ, సామర్థ్యాల ప్రాతిపదికన నిర్వచించబడ్డ వివిధ పేదరిక కొలమాన ప్రమాణాలను మనం ఈ శీర్షిక కింద గతంలో చర్చించుకున్నాం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యతను సంపాదించుకున్న 'మానవాభివృద్ధి పేదరిక సూచి' ఆధారంగా ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం(యుఎన్‌డిపి) ప్రతి ఏటా ఒక నివేదికను ప్రచురిస్తోంది. ఈ 'సూచి'లో ఆరోగ్యం, విద్య, సముచిత జీవన ప్రమాణాల కొరత వంటి అంశాలు ప్రాతిపదికలుగా ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ప్రచురించిన తాజా 'మానవాభివృద్ధి వార్షిక నివేదిక-2010'లో 'మానవాభివృద్ధి పేదరిక సూచి' స్థానంలో 'బహుముఖ పేదరిక సూచి' (మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌-ఎంపిఐ) చోటు చేసుకుంది. పేదరిక ప్రమాణాల నిర్దారణలో ఈ సూచి మరో ముందడుగుగా ఉన్నది.

బహుముఖ పేదరిక సూచి (మల్టీ డైమెన్షనల్‌ పావర్టీ ఇండెక్స్‌)

ఒకే సమయంలో వివిధ రకాల వనరుల కొరత, సౌకర్యాల నిరాకరణను ఎదుర్కొంటున్న పేదల సంఖ్య, వాటి తీవ్రత ప్రభావాన్ని కొలిచే నూతన ప్రమాణమే బహుముఖ పేదరిక సూచి. అమర్త్యసేన్‌ రూపొందించిన మానవాభివృద్ధి సూచి దీనికి పునాది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీలో 'ఆక్స్‌ఫర్డ్‌ పేదిరక మానవాభివృద్ధి చొరవ(ఒపిహెచ్‌ఐ)' విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సబీనా అల్కైర్‌, జార్జి వాషింగ్టన్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ జేమ్స్‌ ఇ. ఫోస్టర్‌ ఈ సూచిని అభివృద్ధి చేశారు. 1999లో తన దేశంలో పేదరికాన్ని కొలిచేందుకు మెక్సికో ఈ సూచిని వాడింది. ఈ సూచి ప్రాతిపదికనే నేపాల్‌ స్వంతంగా 'స్థూల జాతీయ సంతోష సూచి'ని రూపొందించుకుంది. యుఎన్‌డిపి, ఒపిహెచ్‌ఐ కలిసి రూపొందించిన తాజా మానవాభివృద్ధి నివేదిక-2010 కూడా ఈ సూచి ఆధారంగానే తయారయింది

వివరణ

2009 వరకు మానవాభివృద్ధి నివేదికలు తయారు చేసేందుకు వాడిన సూచి వివిధ దేశాల్లో జీవన ప్రమాణాల కొరతను వివరిస్తుందేకానీ, ఈ కొరతలను ఎదుర్కొంటున్న వ్యక్తులు, కుటుంబాలు, ప్రాంతాలు, కొరతల సమిష్టి తీవ్ర ప్రభావాలను కొలవలేకపోయింది. పేదరిక నిర్మూలన కోసం, క్షేత్ర స్థాయిలో ఏ ప్రాతిపదికన చర్యలు చేపట్టవచ్చో నిర్దిష్టంగా గుర్తించేందుకు వీలులేకుండా పోయింది. ఈ లోటును 'బహుముఖ పేదరిక సూచి' తీరుస్తుంది. తీవ్ర పేదరికాన్ని, వివిధ బృందాలు, ప్రాంతాల వారీగా పేదరిక రేటును కనుక్కునేందుకు, జీవన ప్రమాణాల కొరత సమిష్టి ప్రభావాన్ని కొలిచేందుకు ఈ సూచి ఉపయోగపడుతుంది. ఈ సూచి నిర్మాణంలో విద్య, ఆరోగ్యం, జీవనప్రమాణాల ప్రాతిపదికగా పది అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. విద్యలో -పాఠశాలలో ఉన్న సంవత్సరాలు, బాల్య నమోదు, ఆరోగ్యంలో-బాల్య ఆయుకాలం, పౌష్టికాహారం, జీవన ప్రమాణాల్లో-విద్యుత్‌, త్రాగునీరు, పారిశుధ్యం, నివేశన స్థలం, వంట ఇంధనం, వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు ఉన్నాయి. ప్రతీ అంశానికి నిర్దిష్ట వెయిటేజీని కల్పిస్తారు. ఇలా వచ్చిన గణాంకాల ఆధారంగా కొరత / నిరాకరణల సగటు తీవ్రతను లెక్కిస్తారు. ఈ సగటు తీవ్రతను పేదల సంఖ్యతో (హెడ్‌కౌంట్‌) గుణిస్తే వచ్చేదే బహుముఖ పేదరిక సూచి. పై సూచిలో ఒక వ్యక్తి 30శాతం పైబడి పేదరిక తీవ్రతను కలిగి ఉంటే బహుముఖ పేదగా పరిగణిస్తారు. ఈ సూచిలో ఆదాయ సూచి చేర్చబడలేదు. ఆదాయ సూచి గణాంకాలలో విద్య, వైద్యానికి సంబంధించిన సమాచారం లేకపోవడమే ఇందుకు కారణమని నివేదిక పేర్కొంటోంది. బహుముఖ పేదరిక సూచికి కావలసిన సమాచారాన్ని జనాభా ఆరోగ్య సర్వే, బహుళ సూచి క్లస్టర్‌ సర్వే, ప్రపంచ ఆరోగ్య సర్వేల ఫలితాల నుంచి తీసుకున్నారు..

ప్రభావాలు

బహుముఖ పేదరిక సూచి వెనుకబడిన, తక్కువ అభివృద్ధి చెందిన దేశాలకు ఉపయుక్తంగా ఉంటుంది. ఆదాయం ఆధారంగా కొలిచే పేదరికం కంటే బహుముఖ పేదరిక సూచిలో పేదల సంఖ్య సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. సహస్రాబ్ధి అభివృద్ధి లక్ష్యాలను చేరటానికి కావలసిన పేదరిక తీవ్రత సమాచారాన్ని అందించటానికి ఈ సూచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సూచి ఆధారంగా మానవాభివృద్ధి నివేదిక పరిశీలించిన కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి.

1. 104 దేశాల్లో పేదరిక నిర్దారణ గణించబడింది. ఈ దేశాల జనాభా ప్రపంచ జనాభాలో 78%గా ఉంది. ఈ దేశాల మొత్తం జనాభాలో (520కోట్లు) 3వ వంతు అనగా 175కోట్లు బిలియన్ల ప్రజలు బహుముఖ పేదరికంలో ఉన్నట్లు తేలింది. ఆదాయం ఆధారిత పేదరిక నిర్ధారణలో ఈ దేశాలలోని పేదలు 144కోట్లుగా గుర్తించబడింది.

2. యూరప్‌, మధ్య ఆసియా దేశాలలో బహుముఖ పేదరిక రేటు 3% ఉండగా, సబ్‌ సహారా దేశాలలో 65%గా ఉంది.

3. దక్షిణాసియాలో బహుముఖ పేదరిక సంఖ్య, సబ్‌ సహారా దేశాల కంటే అధికంగా ఉంది. ప్రపంచ పేదలలో సగ భాగం దక్షిణాసియా దేశాలలోను (51%), నాల్గవ వంతు (28%) ఆఫ్రికా దేశాలలో ఉన్నారు.

4. బహుముఖ పేదరిక తీవ్రత రేటులో సబ్‌ సహారా దేశాల శాతం అత్యధికంగా ఉంది (నైగర్‌లో 93%).

5. భారత దేశంలో 8 రాష్ట్రాలలోని బహుముఖ పేదలు 421 మిలియన్లు ఉండగా, 26 అతిపేద ఆఫ్రికా దేశాలలో బహుముఖ పేదలు 411 మిలియన్లుగా ఉన్నారు.

6. బహుముఖ పేదరికం దక్షిణాసియా దేశాలలో అత్యధికంగా ఉండగా, తూర్పు ఆసియా దేశాలలో (చైనా, థారులాండ్‌) తక్కువగా ఉంది. భారతదేశంలో బహుముఖ పేదరిక రేటు 55%గా ఉంది. ఇది టెండూల్కర్‌ కమిటి అంచనాల కంటే ఎక్కువ. భారతదేశంలో అతితక్కువ బహుముఖ పేదలున్న రాష్ట్రం కేరళ.

7. భారతదేశంలో ఢిల్లీ బహుముఖ పేదరిక రేటు, ఇరాక్‌, వియత్నాంలకు (14%)చేరువలో ఉండగా బీహార్‌ రాష్ట్రం సియెర్రా, గినియా దేశాల (81%) స్థాయిలో ఉంది.

8. భారతదేశంలో గిరిజన ప్రజలలో 81%, షెడ్యూల్‌ కులాల ప్రజానీకంలో 66%, ఇతర వెనుకబడిన తరగతులలో 58% ఇతరులలో 33% బహుముఖ పేదరికంలో ఉన్నారు. బారక్‌ ఒబామా చేత అభివృద్ధి చెందిన దేశంగా పిలువబడాలని ఉబలాటబడ్డ భారతదేశ పాలకులు పేదరికంలో ఏమని పిలిపించుకోవాలో తేల్చుకోవాలి.

ముగింపు

2010 మానవాభివృద్ధి నివేదిక బహుముఖ పేదరిక సూచితోపాటు అసమానతకు సర్దుబాటు చేయబడ్డ మానవాభివృద్ధి సూచిని, స్త్రీ,పురుష అసమానతకు నూతన కొలమానాన్ని ప్రవేశపెట్టింది. బహుముఖ పేదరిక సూచిపై విమర్శలు లేకపోలేదు. వివిధ అంశాలలో వాస్తవమైన సమాచార సేకరణలో అనేక లోటుపాట్లు ఉన్నాయి. వీటిని సరిదిద్దుకొని బహముఖ పేదరిక సూచిని మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ పేదరికం లోతుల్ని, నిజస్వరూపాన్ని దర్శించటానికి, పేదరిక నిర్మూలన చర్యలను మరింత మెరుగుపరచుకోటానికి పాలకులకు, పౌరసమాజానికి ఈ సూచి మార్గదర్శకంగా నిలుస్తుంది.

2010 మానవాభివృద్ధి నివేదిక సారాంశంలో మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ అవసరాన్ని ప్రస్తావిస్తూ ''నిలకడైన ఆర్థిక పురోగమనానికి మార్కెట్ల అవసరం ఉండవచ్చేమోగాని, వాటంతటవి మానవాభివృద్ధిలోని వివిధ పార్వ్శాల అభివృద్ధిని సాధించలేవు. వేగవంతమైన ఆర్థిక వృద్ధిని ఆకాంక్షించే అభివృద్ధి నమూనా అరుదుగానే మనగలుగుతుంది. మరోమాటలో చెప్పాలంటే మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థ అవసరమేకాని, అదే (ఆర్థికాభివృద్ధికి) సరిపోదు''. ప్రపంచీకరణ విధానాలకు ఎదురొడ్డి పోరాడుతున్న ప్రగతిశీల శక్తులు ఇంత కాలం ఘోషిస్తున్న ''నిజం'' ఇది.

No comments: