Friday, November 5, 2010

వాణిజ్య లోటు

ప్రపంచంలోని అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు కరెన్సీ యుద్ధంలో మునిగితేలుతున్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా అమితంగా పెరిగిన విదేశీ మారకద్రవ్య ''కరెన్సీ ఖాతాలోటు'' ఈ యుద్ధానికి మూల కారణమైంది. కరెంటు ఖాతా లోటుకు వాణిజ్యలోటు కీలకమైంది. వాణిజ్య లోటు, వాణిజ్య మిగులు వాణిజ్య సమతుల్యతలో రెండు భాగాలు. ప్రపంచీకరణ విధానాల నేపథ్యంలో అత్యంత కీలకమైన విదేశీ మారకద్రవ్య నిల్వలలో వాణిజ్య సమతుల్యత వ్యూహాత్మక పాత్రను పోషిస్తున్నది.

వాణిజ్య సమతుల్యత అంటే

ఆర్థిక వ్యవస్థలోని ఎగుమతి, దిగుమతుల మధ్య ఉన్న సంబంధమే ''వాణిజ్య సమతుల్యత'' (బ్యాలెన్స్‌ ఆఫ్‌ ట్రేడ్‌) అని అంటారు. ఒక దేశం నుండి ఎగుమతయ్యే వస్తువులు, సేవల విలువ కంటే దిగుమతుల విలువ తక్కువగా ఉన్నప్పుడు ''వాణిజ్య మిగులు''(ట్రేడ్‌ సర్‌ప్లస్‌) అంటారు. ఒక దేశం యొక్క దిగుమతుల విలువ కంటే ఎగుమతుల విలువ తక్కువగా ఉంటే ''వాణిజ్య లోటు'' (ట్రేడ్‌ డెఫిసిట్‌) అంటారు. సాధారణంగా ''వాణిజ్య మిగులు'' ఒక ఆర్థిక వ్యవస్థ స్థూల దేశీయోత్పత్తిని పెంచడంతో పాటు, ఆ దేశంలో సంపదను ఉద్యోగ,ఉపాధి అవకాశాల్ని పెంచి దేశీయ పొదుపును, విదేశీ మారక ద్రవ్య నిల్వలను, ఆర్థిక సుస్థిరతను పెంచుతుంది. ''వాణిజ్య లోటు'' ఆర్థిక వ్యవస్థ స్థూలదేశీయోత్పత్తిని తగ్గించడంతోపాటు ఆ దేశ సంపదను, విదేశీ మారకద్రవ్య నిల్వలను కుదిస్తుంది. వాణిజ్య లోటు ప్రభావంగా దేశీయ పొదుపు తగ్గటమే కాకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు సన్నగిల్లి, ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు దారితీసే అవకాశాలున్నాయి. తాత్కాలికంగా ఏర్పడే వాణిజ్య లోటు కంటే, సుదీర్ఘకాలం కొనసాగే వాణిజ్య లోటు ప్రమాదకరమైంది. వాణిజ్య లోటును తగ్గించటానికి వస్తూత్పత్తిని పెంచి, దేశీయ వినియోగాన్ని, ఎగుమతులను పెంచటం పరిష్కారంగా ఉండేది. సాంప్రదాయ ఆర్థికవేత్తలు 1970కి పూర్వం వాణిజ్య సమతుల్యతను గూర్చి స్థూలంగా వివరించిన అంశాలివి. ఆర్థిక వ్యవస్థలో వస్తూత్పత్తికి అధిక ప్రాధాన్యతను ఇచ్చిన కాలమది. ప్రపంచీకరణ నేపథ్యంలో వాణిజ్య లోటును పరిష్కరించే మార్గాలు మారాయి.

ప్రపంచీకరణ నేపథ్యంలో వాణిజ్య లోటు

ఆర్థిక వ్యవస్థకు వాణిజ్య లోటు ప్రమాదకారి కాదని, పైపెచ్చు అది దోహదకారి అనే వాదనలు 1970 తరువాత ముందుకొచ్చాయి. 90ల తరువాత ప్రపంచీకరణ విధానాల మూలంగా ప్రాధాన్యతను సంతరించుకున్న స్వేచ్ఛా వాణిజ్యం కారణంగా, వివిధ దేశాలలో దిగుమతులు పెరిగాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటుతోను, సరుకులపై సంఖ్యాపర ఆంక్షలు (క్వాంటిటేటివ్‌ రిష్ట్రిక్షన్స్‌) ఎత్తివేయడంతోనూ ప్రతి ఆర్థిక వ్యవస్థలో అనివార్యమైన దిగుమతులు కుప్పలుగా పోగయ్యాయి. ప్రజల కొనుగోలు శక్తి పెరగడం, వినియోగం పెరగడం, దేశీయ వస్తువులు కొరతగాను, ఖరీదుగాను ఉండటం మూలంగా వినియోగదారుడి ప్రయోజనాల రక్షణకు దిగుమతులు లాభకరమనే వాదనలు ఊపందుకున్నాయి. వీటి ద్వారా పెరిగిన వాణిజ్య లోటు ఆర్థిక వ్యవస్థ శక్తి సామర్థ్యాలను వ్యక్తం చేస్తుందేకాని, ప్రమాదకారి కాదని మిల్టన్‌ ఫ్రీడ్‌మన్‌ లాంటి ఆర్థికవేత్తలు సిద్ధాంతాలను లేవనెత్తారు.

అమెరికా వాణిజ్య లోటు - ప్రపంచ ద్రవ్య సంక్షోభం

1970కి ముందుకాలంలో అమెరికా స్థూల దేశీయోత్పత్తిలో 1% వాణిజ్య మిగులును కలిగివుండేవి. 1970ల తరువాత ఆ దేశం అనుసరించిన నయాఉదారవాద విధానాల నేపథ్యంలో అమెరికా దేశీయ వస్తూత్పత్తిని తగ్గించుకొని, విదేశీ దిగుమతులపై ఆధారపడటం మొదలెట్టింది. దీని ప్రభావంగా ప్రపంచంలో అత్యధిక వాణిజ్య లోటుగల దేశంగా అమెరికా మారింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై డాలర్‌ ఆధిపత్యం పెరిగింది. ఆ మేరకు తన ఆర్థిక వ్యవస్థలో పెరిగిన వాణిజ్య లోటును, ఇతర దేశాలు డాలర్ల రూపంలో తమ దగ్గర పెట్టుకున్న పెట్టుబడులతో భర్తీ చేసుకోవడం మొదలెట్టింది. వాణిజ్య లోటు పెరిగిన మేరకు అమెరికాలో ఉపాధి అవకాశాలు తగ్గి నిరుద్యోగ రేటు పెరగడం మొదలైంది. దీనితోపాటు కరెంటు ఖాతా లోటు కూడా పెరిగింది. తదనంతరం ఆ వ్యవస్థలో కొనసాగుతున్న ఆర్థిక స్థంభన (స్టాగేషన్‌) 2007-08 సం||కి ఆర్థిక మాంద్యంగా మారి, అంతిమంగా ద్రవ్య సంక్షోభమై అమెరికాను, ప్రపంచదేశాల్ని ముంచెత్తింది. దీనితో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు తలకిందులై, అమెరికాకు రావలసిన పెట్టుబడులు సన్నగిల్లాయి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి అమెరికా చేపట్టిన ఉద్దీపన చర్యలతో కరెంటు ఖాతా తీవ్ర లోటుకు గురై, కరెన్సీ సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీని నుండి బయటపడటానికి అమెరికా తన ఎగుమతుల్ని పెంచు కోవడం కోసం, ఇతర దేశాల కరెన్సీ విలువలను పెంచాలని డిమాం డ్‌ చేస్తుంది. ఇదే అమెరికా, తన ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగే కాలంలో ఇతర దేశాల నుండి దిగుమతులను చౌకగా పొందేందుకు గాను ఆయా దేశాల కరెన్సీ విలువల్ని తగ్గించడం కోసం అంతర్జా తీయ ద్రవ్య సంస్థల్ని వినియోగించుకోవడం మనకు తెలుసు. అమెరికా ప్రయోజనాలు ప్రపంచ ప్రయోజనాలుగా పరిగిణించిన చర్యలివి.

వాణిజ్య లోటు - భారతదేశం

భారతదేశంలో వాణిజ్యలోటు 2004-05 సం||లో 33.7 బిలియన్‌ డాలర్లు ఉండగా, అప్పటినుండి క్రమంగా పెరుగుతూ 2009-10 సం||నికి 117.3 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ వాణిజ్య లోటు మరింత పెరుగుతూ 2010-11 సం||నికి 135 బిలియన్‌ డాలర్లు అయ్యే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత సం|| మొదటి త్రైమాసికంలో 4.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్న కరెంటు ఖాతా లోటు, ప్రస్తుత సం|| మొదటి త్రైమాసికంలో 13.7 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ప్రపంచ వాణిజ్య సంస్థ తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ వాణిజ్య గణాంకాలు 2010లో, ప్రపంచంలోని అత్యధిక వ్యాపార (మెర్కండైజ్‌) వాణిజ్య లోటులో అమెరికా, బ్రిటన్‌ దేశాల తరువాత భారతదేశం 3వ స్థానంలో ఉన్నట్లు ప్రకటించింది. రూపాయి విలువ పెరగడంతో ఎగుమతులు తగ్గి, ఎగుమతిదారులు రూపాయి విలువను తగ్గించమని కోరుతున్నా, భారత ప్రభుత్వం అంగీకరించడంలేదు. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల ద్వారా చేకూరిన 15 బిలియన్‌ డాలర్ల ''నికర పెట్టుబడి ఖాతా మిగులు'' (నెట్‌ క్యాపిటల్‌ ఎకౌంట్‌ సర్‌ప్లస్‌)తో గట్టెక్కగలమన్న ధీమాతో ప్రభుత్వ వర్గాలున్నాయి. ఈ పెట్టుబడుల అస్థిరత ప్రపంచ ఆర్థిక సంక్షోభ కాలంలో మన అనుభవంలోకి వచ్చిందే. అనూహ్య పరిస్థితుల్లో ఈ పెట్టుబడులు వెనక్కు మళ్ళితే, మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ముగింపు

ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పెరిగిన వివిధ దేశాల వాణిజ్య లోటులను ఎగుమతులతోనే పూడ్చుకోవాలనే నూతన దృక్పథం పెరగటానికి సంక్షోభమే కారణమైంది. వాణిజ్యలోటును ''హాట్‌ మనీ''తో సర్దుకోగలమనే విశ్వాసం ప్రపంచ దేశాల్లో సన్నగిల్లింది. ప్రముఖ ఆర్థిక నిపుణులు వారెన్‌ బఫెట్‌ వ్యాఖ్యానిస్తూ, వాణిజ్య లోటు అమెరికా అర్థిక వ్యవస్థకు ప్రమాదకరమన్నారు. చైనా గత ఆరు సంవత్సరాలుగా వాణిజ్య మిగులును సాధిస్తూ, క్రితం మార్చికి మొదటిసారిగా వాణిజ్య లోటును చవిచూసింది. అయినప్పటికి ఈ లోటు ప్రభావం తమ ఆర్థిక వ్యవస్థపై ఉండదని చైనా ప్రభుత్వం ప్రకటిస్తున్నది. దేశీయ వస్తూత్పత్తిని పెంచి, వ్యవసాయ రంగాన్ని పరిరక్షించుకొని, స్వావలంబన చర్యలకు ఉపక్రమించినప్పుడే మనం కూడా ఈ తీవ్ర వాణిజ్య లోటు నుండి బయటపడగలం.

No comments: