Sunday, January 3, 2016


హేమంతం....
 'నవతెలంగాణ' సంపాదకీయం  
హేమంతం...! హిమంలా.. సుమంలా.. సుందరం.. సుమధురం... చల్లని ఆకాశం. చుట్టూ సతత హరితం. పచ్చని ఆకుల నిగారింపు. సుతి మెత్తని సవ్వడి. తెరలు తెరలుగా తెమ్మెర మీటినట్టే వుంటుంది. అరవిచ్చిన గులాబీలూ, పొలం గట్లమీద పచ్చని తంగేడు పూలూ. మురిపించే మందారాలూ.. నవపారిజాతాల మృదుత్వం.. చామంతుల సింగారం.. వెరసి ఈ హేమంతంలో సుమంతం చూడ చక్కని ముచ్చట..! హేమంతం ప్రారంభంలో చలిగాలులు అంతగా వీచవు. తెల్లవారు జామునుంచే పక్షుల కిలకిలారావాలు.. తెలతెలవారే వాతావరణం కాలమిలా ఆగిపోతే..ఎంత బావుండు అన్నంత ఆహ్లాదంగా కమనీయంగా కన్నుల పండుగలా వుంటుంది. సూర్యుడు ఒక కక్ష్యలో నుండి మరో కక్ష్యలో అడుగు పెడుతుంటాడు. ఇలా అడుగు పెట్టడమే సంక్రమణ..! సంక్రమణ అంటే గమనం.. ఈ గమనం వల్లనే వీచే చలిగాలులు. వీటి నుంచి రక్షణగా వెచ్చని సంతోష సౌభాగ్యాలు సమకూరుతాయని గుండెనిండుగా విశ్వాసం.
''తల్లీ...!
నీవెప్పుడు నాకొక పట్టెడు మెతుకులు పెడతావో
ఒక్క నిజమైన కథ చెపుతావో
ఎదలో చోటిచ్చి నిదుర పొమ్మంటావో
అప్పుడు నీ పాటలు
పక్షులై విహరిస్తాయి ఆకాశంలో
నీ నవ్వులు పువ్వులై వికసిస్తాయి
భూమండలంలో
నీ యెండలు
జెండాలై ఎగురుతాయి దిగంతాల్లో
నేనొక కన్నీటి బిందువునై కలిసి పోతాను
మానవతా సముద్రంలో..'' తన రుతుఘోష పద్యకావ్యంలో కవి శేషేంద్రశర్మ చెబుతారు. ప్రకృతికీ కాలచక్రానికీ వున్నటువంటి అవినాభావ సంబంధమిది. ఈ హేమంత రుతువులో ఫలసాయాలు పుష్కలంగా చేతికంది ఇంటింటా సిరుల పంటలు పండుతాయి. పంట చేల నుంచి ధాన్యరాశులు ఇంటికి వస్తాయి. ముంగిట్లో తీరైన ముగ్గులు.. గొబ్బెమ్మలు.. గంగిరెద్దుల నృత్యాలు, హరిదాసుల కీర్తనలతో పల్లెలు సందడితో విలసిల్లుతాయి. విశిష్టమైన భౌగోళిక, వ్యవసాయక, ఆర్థిక ప్రాధాన్యత సంతరించి పెడుతుంది. అదిగో..! సరిగ్గా ఇదే సమయాన నవీన సంవత్సరం అడుగిడుతుంది. ఎన్నెన్నో ఆశల పందిళ్లు.. అవి పచ్చ పచ్చని చివుళ్లతో.. మొగ్గలు తొడుగుతుంది. ఇలా కాలం ఎప్పటికప్పుడు తాజాగా పరిమళిస్తుంది. మనిషి ఆశాజీవి. తన జీవితం ఓ అందమైన కలగా ఊహిస్తాడు. తన బతుకంతా బాధ కావొద్దని కోరుకుంటాడు. మంచి జరిగితే మంచిరోజులుగా స్వీకరిస్తాడు. చెడు జరిగితే కుంగిపోతాడు. మానవుడు సంఘజీవి. తన చుట్టూ జరిగే తప్పిదాల్ని అర్థం చేసుకోవాలి. కనుక నలుగురితో పాటు నడవడం అవసరం. కలిసి వుంటే కలదు సుఖం అన్నారు పెద్దలు. ఒంటరిగా మనజాలం. బతికినన్నినాళ్లూ అందమె ఆనందం...ఆనందమె జీవిత మకరందం...అనుకొని అందరితో కలిసి మమేకమైతే జీవితానికి సార్థకత. 
మనుషుల మధ్య ఐక్యత వుంటే మనమే కాదు. మన కుటుంబం, మన దేశంలో అన్నీ బాగు పడతాయి. అందుకే ఐకమత్యమే మహాబలం అన్నారు. బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చావదే సుమతీ...అన్నట్టు కలిసికట్టుగా పోరాడితే చీమలదండంతా కలిసి ఆ పెద్దపామును కూడా చంపేయగలదు. వేటగాడు బియ్యం చల్లి, వల విసిరి సునాయాసంగా దొరికినన్ని పావురాలను పట్టేసుకుంటాడు. పావురాలు ఆలోచించి సమిష్టిగా ఒక నిర్ణయం చేసుకున్నాయి. అందరం ఒకేసారి వలలో వాలిపోవాలనీ... వలలో చిక్కిన తరువాత కలిసికట్టుగా ఒకేసారి వలతో సహా ఆకాశంలోకి రివ్వున ఎగిరిపోయాయి. తెల్లబోవటం వేటగాని వంతయింది. అంతేమరి. ఐక్యతను మించిన ఆయుధం లేదు.
'కావ్‌..కావ్‌..!' అంటూ కాకులు గోలగోల చేస్తాయని అనుకుంటాం. నిజానికి కాకులు ఐక్యతకు పెట్టింది పేరు. ఒక కాకి ప్రమాదంలో చిక్కుకుంటే, మిగతా కాకులు కొన్ని వందల సంఖ్యలో క్షణాల్లో వచ్చి వాలి, ప్రమాదం నుండి కాకిని తప్పించడానికి విశేష ప్రయత్నం చేస్తాయి. మన శరీరంలోని అవయవాలన్నీ ఉమ్మడిగా పని చేస్తేనే సమన్వయం వుండి జీర్ణ వ్యవస్థ మనగలుగుతుంది. యావత్‌ దేశం కూడా అంతే. విభిన్న జాతులు, భాషలు, మతాలు, సంస్కృతులూ వుండటం సహజం. వీటన్నిటి మధ్య సరైన అవగాహన వుంటేనే దేశం భవిష్యత్‌ సుస్థిరం. అదుపు తప్పుతున్న పరిస్థితుల్ని అధిగమించడానికి పల్లె నుంచి ఢిల్లీ దాకా అన్ని రంగాల్లో సుపరిపాలన నెలకొల్పడానికి మనమంతా అంకితమైతే మన దేశం బాగుంటుంది. మన ఇల్లు ప్రశాంతంగా వుంటుంది. సుశాంతి వల్ల మనం బాగుంటాం. అప్పుడే హేమంతంలో సుమంతం. ప్రజల జీవితాల్లో నవవసంతం.

No comments: