Sunday, January 31, 2016

ఆర్థిక మాంద్యం, అస్థిరత వెనుక..?


అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ బ్యాంకులు గత కొన్నేళ్లుగా డాలర్లను యథేచ్ఛగా ముద్రించిన ఫలితమే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం, తీవ్ర అస్థిరతకు దారితీసింది. ఇదే ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పతనానికి కూడా కారణమైందని అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు స్టీఫెన్‌ లెండ్‌మాన్‌ చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలక ఇంజన్‌లా వుంటున్న చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడంతో షేర్‌ మార్కెట్లలో కల్లోలం మరింత తీవ్రరూపం దాల్చిందన్నారు. ఈక్విటీ మార్కెట్ల పతనం సమీప భవిష్యత్తుతో పాటు దీర్ఘకాలికంగా కూడా ఆర్థికప్రగతిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన విశ్లేషించారు.. ఇటువంటి బుల్‌ మార్కెట్‌ తన జీవితంలో మరోసారి చూడబోనని ప్రముఖ ఆర్థికవేత్త మార్క్‌ఫేబర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దుస్థితికి దర్పణం పడుతున్నాయి. ప్రముఖ హెడ్జ్‌ ఫండ్‌ ఇన్వెస్టర్‌ రే డాలియో మాట్లాడుతూ 50-75 ఏళ్ల పాటు సాగే రుణ విష వలయం చివరిలో మరో స్వల్పకాలిక వలయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పడిందని, ఇది 8 నుంచి 10 ఏళ్ల వరకు కొనసాగే అవకాశముందని తెలిపారు. దావోస్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బద్ధ కమ్యూనిస్టు వ్యతిరేకి జార్జి సొరోస్‌ మాట్లాడుతూ, చైనా తన ఆర్థిక వ్యవస్థ దిద్దుబాటుపై ప్రధానంగా దృష్టి సారించిందని, ఇదే ప్రస్తుత సంక్షోభానికి కారణమని చెప్పారు. ఇది 2008 నాటి పరిస్థితిని గుర్తు చేస్తోందని లెండ్‌మాన్‌ వ్యాఖ్యానించారు.. ఫైనాన్షియల్‌ మార్కెట్లకు ఇదొక తీవ్రమైన సవాల్‌ విసురుతోందన్నారు. ముడి చమురు ధరల పతనం గురించి ప్రస్తావిస్తూ వీటి ధరలు పడిపోవడానికి అధిక సరఫరాతో బాటు డిమాండ్‌ పడి పోవడం ఒక ముఖ్య కారణమన్నారు. చమురు దేశాల కూటమి ఒపెక్‌ ముడి చమురు ఉత్పత్తిని 5 శాతం తగ్గించబోతోందన్న పుకార్లు రావడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు స్వల్పంగా పెరిగాయి. ఒపెక్‌ సమావేశ అజెండాలో ముడిచమురు ఉత్పత్తి కుదింపు అంశం అసలు లేనే లేదని ఒపెక్‌ దేశమైన సౌదీ అరేబియా స్పష్టం చేసింది. ఆరునూరైనా ప్రస్తుత స్థాయిలోనే చమురు ఉత్పత్తిని కొనసాగిస్తామని అది పేర్కొంది. రష్యన్‌ వార్తా సంస్థ ఇటార్‌ టాస్‌ కథనం మరోలా వుంది. ముడి చమురు ఉత్పత్తిని తగ్గించుకోవాలనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు రష్యా ఇంధన శాఖ మంత్రి అలెగ్జాండర్‌ నొవాక్‌ను ఉటంకిస్తూ ఆ వార్తా సంస్థ తెలియజేసింది. దీనిపై ఒపెక్‌ కూటమి తన సభ్య దేశాలతోను, సభ్యత్వయేతర దేశాలతో కలసి త్వరలో ఒక సమావేశాన్ని నిర్వహించేందుకు యత్నిస్తున్నదని ఇటార్‌ టాస్‌ తెలిపింది. కొన్ని దేశాలు ఈ సమావేశాన్ని నిర్వహించాలని కోరుతున్నాయని, అటువంటి సమావేశం ఏది జరిగినా దానికి తాము హాజరవుతామని రష్యా ఇంధన శాఖ మంత్రి పేర్కొన్నట్లు అది వివరించింది. కాగా, ఒపెక్‌ గత సమావేశంలో ముడి చమురు ఉత్పత్తిని 5శాతం మేర తగ్గించుకోవాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే ఒపెక్‌ దానిని తిరస్కరించింది. రష్యాకే చెందిన పేరు తెలపడానికి ఇష్టపడని ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, వచ్చే ఒపెక్‌ సమావేశంలో చమురు ఉత్పత్తి తగ్గింపు ప్రతిపాదన చర్చకు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.

రష్యాపై పోరుకు స్వస్తి పలికిన జార్జ్‌ సోరోస్‌
జీవితాంతం కమ్యూనిజాన్ని, రష్యాను వ్యతిరేకించిన జార్జ్‌సోరోస్‌ ఎట్టకేలకు తన పోరును స్వస్తి చెబుతున్నట్ల్లు ప్రకటించారు. ఇటీవల దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికలో ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు ఐరోపా దేశాలతో పాటు ఒకప్పటి తన బద్ధ శత్రువు రష్యాకు కూడా అమెరికా ఆర్థిక సాయం చేయాల్సిన అవసరం వుందన్నారు. అయితే రష్యా వ్యతిరేక పోరును పూర్తిగా విడిచిపెట్టారా లేక సస్పెండ్‌ చేశారా? అన్న విషయం తెలియరాలేదు.

(ప్రజా శక్తి 1.2.2016 నుండి)

No comments: