Sunday, January 31, 2016

పునః పంపిణీతోనే వృద్ధి

- ప్రభాత్‌ పట్నాయక్‌

నేడు అభివృద్ధిని గురించి మౌలికంగా పొసగని రెండు దృక్పథాలు పరస్పరం పోటీపడుతున్నాయి. మొద టిది నయా ఉదారవాద దృక్పథం. దీని ప్రకారం అభివృద్ధి జరగాలంటే స్థూల జాతీయోత్పత్తి వేగంగా వృద్ధి చెందాలి. ఒకవేళ అలాంటి వృద్ధి 'ఊట సిద్ధాంతం'తో స్వయంచా లకంగా పేదల పరిస్థితిని మెరుగుపర్చలేకపోతే ఆ వృద్ధి వల్ల బాగా పెరిగిన ప్రభుత్వ ఆదాయా న్ని వారి సంక్షేమం కోసం వినియోగించ వచ్చు. అలాంటి అత్యధిక వృద్ధిని సాధించా లంటే పెద్ద ఎత్తున పెట్టుబడులు కావాలి. కాబట్టి ఆ స్థాయిలో పెట్టుబడులను సమీకరిం చాలనే లక్ష్యం ప్రభుత్వ విధానాలకుండాలి. ఈ విధానాలు అలాంటి పెట్టుబడులను పెట్టే దేశీయ కార్పొరేట్‌ కంపెనీ లకు, విదేశీ బహుళజాతి కంపెనీలకు 'ప్రోత్సాహకాల'ను ఇచ్చేలా ఉండాలి. దీనినిబట్టి అర్థమయ్యేదేమంటే కావలసి నంత భూమి లేకపోవటం, అనేక రకాల నిర్ణయాలు తీసుకో వటంలో అధికారులు చేసే అనవసర జాప్యం, కార్మికులను తొలగించటానికి కావలసిన 'స్వేచ్ఛ' లేకపోవటం వంటి అడ్డంకులను అలాంటి పెట్టుబడులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడకుండా చూడాలి. 'అభివృద్ధి ప్రాజెక్టులకు' రైతుల భూమిని గుంచుకునేందుకు మోడీ ప్రభుత్వం విడుదల చేసిన భూ సేకరణ ఆర్డినెన్స్‌, 'లేబర్‌ మార్కెట్‌ సరళత్వం' కోసం కార్మిక చట్టాలకు ప్రతిపా దించిన సవరణలు, గత కొంతకాలంగా భారతదేశ బడ్జెట్లలో కార్పొరేట్‌ కంపెనీలకు ఇచ్చే పన్ను రాయితీలు మొదలైనవన్నీ ఈ వ్యూహంలో భాగంగా అందజేయబడుతున్నాయి.

రెండవది వామపక్ష దృక్పథం. అది ఇలా ఉంటుంది. ఈ రాయితీలతో కార్పొరేట్‌ కంపెనీలు, బహుళ జాతి కంపెనీలు పెంచిన వృద్ధి ఫలితం దిగువ వర్గాల ప్రజలకు ఏమాత్రం 'అందక'పోగా పెరిగిన ప్రభుత్వ ఆదాయం పేదల కోసం వ్యయం చేయకుండా వృద్ధిని అదే స్థాయిలో కొనసా గించటానికి అవే కంపెనీలకు పన్ను రాయితీల రూపంలో ఇస్తున్నారు. మరోలా చెప్పాలంటే అలాంటి వృద్ధి పేదల స్థితి గతులను మెరుగుపర్చాలనే లక్ష్యం కోసం సాధనంగా ఉండ టానికి బదులు వృద్ధి తనకు తానే ఒక లక్ష్యంగా మారుతోంది. అంతేగాక వీరికి ప్రోత్సాహకాలు ఇవ్వటంవల్ల విత్త వనరులు తరిగిపోవటమేకాక రైతులు, చిన్న ఉత్పత్తిదారులు భూమిని కోల్పోయి ఒత్తిడికి లోనవుతారు(దీనినే 'పెట్టుబడి యొక్క ఆదిమ మూలధన సంచయం' ప్రక్రియ అంటారు). కార్మికుల హక్కులకు పరిమితులు విధించబడతాయి. దానితో వారి నిజ వేతనాలు తగ్గుతాయి. ఇవన్నీ కష్టజీవుల జీవన స్థితిగతులను మరింతగా దిగజారుస్తాయి. కాబట్టి ఈ వృద్ధితో పేదరికం తగ్గకపోగా పెరుగుతుంది.
అంతేకాక కార్పొరేట్‌ కంపెనీలకు, బహుళజాతి కంపె నీలకు ఇస్తున్న రాయితీలను పెంచటం వల్ల అలాంటి వృద్ధి కొనసాగబోదు. ఎందుకంటే అది 'బుడగల'పై ఆధారపడేది. ఎగుమతులను పెంచుకోవటానికి ప్రపంచవ్యాప్తంగా అలాంటి బుడగలను సృష్టించిన అతిపెద్ద పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థను కలిగివున్న అమెరికా తన ఆర్థిక వ్యవస్థలో కూడా అలాంటి బుడగలను సృష్టించటంపైనే ఆధారపడు తున్నది. దీనికి తోడు దేశీయ ఆర్థిక వ్యవస్థలో ధనికులు చేసే అత్యధిక వ్యయం ఆధారంగా ఈ బుడగలు ఏర్పడతాయి. ఇప్పటిలాగా అలాంటి 'బుడగలు' పేలిపోయిన తరువాత కాలాలలో పేదలకు వ్యతిరేకమైన ఈ వ్యూహంతో వృద్ధి జరగదు. అయితే ఈ వ్యూహం పరిధిలో అలా వృద్ధి జరగక పోవటం వల్ల పేదల పరిస్థితి మరింతగా క్షీణిస్తుంది. ఎందు కంటే వృద్ధిని ఉత్తేజపరిచే ప్రయత్నంలో భాగంగా పేదలకు కేటాయించవలసిన నిధులను కార్పొరేట్‌ కంపెనీలకు, బహుళజాతి కంపెనీలకు నిరర్థకంగా మరిన్ని రాయితీల రూపంలో ఇస్తారు.

పేదల స్థితి మెరుగుదలకు ప్రభుత్వ జోక్యం అవసరం కాబట్టి పేదల స్థితి మెరుగుపడటానికి ప్రభుత్వం తక్షణమే ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలని ఈ రెండవ దృక్పథం కోరుతుంది. దీనితో పేదల స్థితి మెరుగుపడట మేకాక తత్ఫలితంగా వారి కొనుగోలు శక్తి పెరిగి దేశీయ మార్కెట్‌ విస్తృతమౌతుంది. అలా పెరిగిన డిమాండ్‌ను అందుకోవటానికి కార్పొరేట్‌ కంపెనీలు, బహుళజాతి కంపెనీలే కాక చిన్నచిన్న వ్యాపారులు కూడా పెట్టుబడులు పెడతారు. పర్యవసానంగా ఏర్పడే 'ద్వితీయ, ఉన్నత శ్రేణి ప్రభావాల' వల్ల ఉద్యోగిత పెరిగి దేశీయ మార్కెట్‌ మరింతగా విస్తృతమవుతుంది. ఇది పేదరికాన్ని మరింతగా తగ్గిస్తుంది. మరోలా చెప్పాలంటే కష్టజీవుల జీవన ప్రమాణా లను ప్రభావితంచేసే, బుడగలు అవసరంలేని వృద్ధిని పెంపొందించే, మరింతగా సమానత్వాన్ని పెంపొందించే, పేదరికాన్ని నిర్మూలించగలిగే పునఃపంపిణీ వ్యూహంతో వృద్ధిని సాధించాలని, ఇది స్వాతంత్య్ర పోరాట ఆకాంక్ష అయిన స్వేచ్ఛా భారతావనికి అనుగుణంగా ఉంటుందని ఈ రెండవ దృక్పథం భావిస్తుంది. ఈ రెండవ దృక్పథాన్ని వక్రంగా చిత్రించటానికి నయా ఉదారవాద ప్రతినిధులు అన్ని విధాలుగా ప్రయత్నించటంలో ఆశ్చర్యం లేదు. సమానత్వాన్ని పెంపొం దించే ఆదాయాల, ఆస్తుల పునఃపంపిణీ వృద్ధికి వ్యతిరేకమైన దన్నట్టుగా వారు చిత్రిస్తారు. ఆ తరువాత సమాజంలో అందుబాటులో ఉండే అరకొర వనరులు పేదరికాన్ని పెంచే విగా ఉంటాయికాని తొలగించేవిగా ఉండవని వారు వాది స్తారు. వృద్ధి, పునఃపంపిణీలు పరస్పర విరుద్ధాలైనట్లు 'వృద్ధి కావాలా, పునఃపంపిణీ కావాలా' అనే విధంగా వారు మాట్లాడతారు. పునఃపంపిణీపైనే శ్రద్ధ చూపే వామపక్ష వ్యూహం వృద్ధిని మందగింపజేసి ప్రజలకు పంచే జాతీయస్థాయి మిగులును శాశ్వతంగా కుదింపజేస్తుందని వారు చెబుతారు. అదే వృద్ధిని ప్రాథమ్యంగా ఎంచుకునే తమ వ్యూహం వల్ల ప్రజలకు పంచే మిగులు పరిమాణం ఎక్కువగా ఉంటుందని, అది రేపు అందరికీ అందుబాటులోకి వస్తుందని వారు చెబుతారు.

అయితే ఇది వామపక్ష దృక్పథాన్ని పూర్తిగా వక్రీకరిం చటమే అవుతుంది. వృద్ధికి, పునఃపంపిణీకి మధ్య ద్వంద్వ విభజన ఉన్నదని ఈ దృక్పథం అంగీకరించదు. అంతేకాక పునఃపంపిణీ చర్యలను ఎంత వేగంగా, ఎంత సుస్థిరంగా, ఎంత కచ్చితంగా ప్రవేశపెడితే వృద్ధి అంతగా పెరుగు తుందని వామపక్ష దృక్పథం చెబుతుంది. అంగీకర యోగ్యమైనది కాకపోయినా ఆధిపత్యంలోకి వచ్చిన నయా ఉదారవాద దృక్పథం సామాజిక జీవితంలోని ఒక అస్తిత్వా నికి చెందిన ఆధిపత్యపు సామాన్య వ్యక్తీకరణ మాత్రమే. ఆ అస్తిత్వం పేరే అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి. దీనితో దేశంలోని కార్పొరేట్‌ ఫైనాన్షియల్‌ బూర్జువా వర్గం మమేక మయింది. భారతదేశంలో జాతీయ స్థాయిలో వామపక్ష దృక్పథం ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు. అయితే ప్రయోగశాలలో మాదిరిగా భారతదేశంలోని రెండు వేరు వేరు రాష్ట్రాలలో ఈ రెండు వేరువేరు అభివృద్ధి నమూనా లను ఆచరిస్తున్నారు. ఈ అభివృద్ధి నమూనాలే నయా ఉదారవాదం, వామపక్ష దృక్పథం. వీటిని ఆచరిస్తున్న రెండు రాష్ట్రాలు గుజరాత్‌, కేరళ. ఈ రెండు రాష్ట్రాల అనుభవాలను పోల్చిచూస్తున్నప్పుడు ఒక ముఖ్యమైన వాస్తవాన్ని మర్చిపో కూడదు. అదేమంటే గుజరాత్‌ అనుసరిస్తున్న వ్యూహానికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం, సమర్థన ఉండటమే కాకుండా అది జాతీయ స్థాయిలో అమలవుతున్నది. అదే కేరళ వ్యూహం విషయానికి వస్తే అది కేంద్ర ప్రభుత్వ ప్రాథమ్యానికి సమాంతరంగా ఉండి అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నది. కేంద్రం నుంచి రాష్ట్రానికి తగినంతగా వనరుల బదిలీ కాకపోవటం, దారిద్య్ర రేఖకు దిగువ, ఎగువ తేడాలతో ఆహార భద్రతకు కావలసిన ఆహార ధాన్యాలను కేంద్రం కేటాయించక పోవటం, ఇతర ఒత్తిడుల రూపంలో ఈ అడ్డం కులున్నాయి. వేరే మాటల్లో చెప్పాలంటే ఈ వ్యూహాన్ని పూర్తి స్థాయిలో అమలు చెయ్యటానికి ఏ మాత్రం అనుమతిం చటంలేదు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ మొత్తంగా నయా ఉదారవాదానికి దాస్యం చేస్తున్నది గనుక. అయినప్పటికీ కేరళ, గుజరాత్‌లను పోల్చటం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

ఉపయుక్తమైన పోలిక
2004-05, 2011-12ల మధ్య కాలంలో భారతదేశం అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. అంతకు ముందు వృద్ధి తక్కువగా ఉంది. ఈ కాలంలో బడా వ్యాపార సంస్థలకు, బహుళజాతి కంపెనీలకు ఎటువంటి ప్రత్యేక రాయితీలను ఇవ్వనప్పటికీ, ఆదిమ మూలధన సంచయానికి ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వనప్పటికీ కేరళ వార్షిక వాస్తవ జిడిపి వృద్ధి రేటు గుజరాత్‌తో దాదాపు సమానంగా 7.91 శాతం ఉన్నది. ఆ కాలంలో గుజరాత్‌ వృద్ధి రేటు 8.19 శాతం. అయితే మానవాభివృద్ధి సూచికలకు సంబంధించి కేరళ భారతదేశంలోని రాష్ట్రాలన్నిటి కంటే అగ్రస్థానంలో ఉన్నది. కానీ ఇదే కాలంలో వాస్తవ తలసరి ఆదాయంలో కేరళతో పోల్చినప్పుడు గుజరాత్‌ ఎటువంటి వృద్ధినీ సాధించలేదు. మానవాభివృద్ధి సూచికలకు సంబంధించి రాష్ట్రాల ర్యాంకింగులో దాని స్థానం దిగజారింది. 1981లో గుజరాత్‌ నాలుగవ స్థానంలో ఉన్నది. 2001లో అది ఏడవ స్థానానికి, 2008లో ఎనిమిదవ స్థానానికి దిగజారింది. 2000-2008 మధ్యకాలంలో మానవ అభివృద్ధి సూచిక పెరుగుదలకు సంబంధించి భారతదేశంలోని రాష్ట్రాలలో గుజరాత్‌ స్థానం 18! మానవ అభివృద్ధి సూచికలో తలసరి ఆదాయానికి గణనీయమైన ప్రాధాన్యత ఉంటుంది గనుక దానిలోని ఇతర అంశాల విషయంలో కూడా గుజరాత్‌ పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. అయితే ఒక సాధారణ నయా ఉదారవాద చట్రంలో వివిధ రాష్ట్రాలను పోల్చి చూచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జాతీయ మార్కెట్‌ కోసం ఉద్దేశింపబడిన పెద్దపెద్ద ప్రాజక్టుల కోసం కావలసిన పెట్టుబడులను సమీకరించే ప్రయత్నం రాష్ట్రాలు చేయ కూడదని పునఃపంపిణి వ్యూహం చెప్పదు. జాతీయ స్థాయిలో నయా ఉదారవాద వ్యూహం అమలవుతున్న స్థితిలో ఇతర ప్రత్యామ్నాయాలేవీ అందుబాటులో ఉండవు. అయితే అది ఆదిమ మూలధన సంచయం అవసరాన్ని రైతుల, చిన్న ఉత్పత్తిదారుల మీద రుద్దేదిగా ఉండకూడదు. అలాగే ప్రభుత్వ ఆధీనంలోని కొద్దిపాటి విత్త వనరులను హరించేదిగా కూడా ఉండకూడదు. ఎందుకంటే దీనితో ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం చేసే కార్యక్రమాలు కుంటుబడతాయి. ఆ విధంగా జాతీయ స్థాయిలో పునః పంపిణీ వ్యూహాన్ని అమలుచేసేందుకు అవకాశం ఉన్నప్పుడు మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమంటే అందుకు కావలసిన అనుబంధ చర్యలను కూడా తీసుకోవాలి. పెట్టుబడులు ఎప్పుడనుకుంటే అప్పుడు దేశం వీడిపోకుండా నియంత్రణలు విధించటం, విదేశీమారకపు చెల్లింపుల శేషంలో సమతౌల్యం ఉండేలా చూడటం కోసం వాణిజ్యాన్ని నియంత్రించటం వంటి చర్యలు ఈ వ్యూహానికి అనుబం ధంగా ఉంటాయి. ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకో కుండా అభివృద్ధిచెందిన దేశాలు చూస్తాయి. ఎందుకంటే ఈ చర్యల సారం అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యం నుంచి జాతి రాజ్య స్వంతంత్రతను పునఃస్థాపించటంగా ఉంటుంది గనుక. అయితే నయా ఉదారవాద వ్యూహం కంటే పునఃపంపిణీ వ్యూహం మేలైనదనే వాస్తవాన్ని వామపక్షం ప్రజలకు అర్థమయ్యేలా చూడాలి. ఎందుకంటే నయా ఉదారవాదం తనకు ప్రత్యామ్నాయం లేనేలేదని నిత్యం వామపక్షంపై దాడిజేస్తుంటుంది గనుక.

No comments: