Sunday, July 25, 2010

మ్యూచువల్‌ ఫండ్‌ మార్కెట్‌


మొదటిభాగం

గత నాలుగు నెలలుగా ఈక్విటీ స్కీమ్‌లోని మ్యూచువల్‌ ఫండ్స్‌ ఖాతాలు గణనీయమైన సంఖ్యలో విరమించుకోవడం క్యాపిటల్‌ మార్కెట్‌ వర్గాలలో కలవరాన్ని లేపింది. ప్రపంచీకరణ విధానాల నేపథ్యంలో మ్యూచువల్‌ ఫండ్స్‌, ద్రవ్య ఉత్పత్తులలోనే అత్యధిక ఆదరణను పొందాయి. కానీ అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంతో కుప్పకూలిన ఫైనాన్షియల్‌ రంగంతోపాటు మ్యూచువల్‌ ఫండ్‌ రంగం నేలకొరిగింది. తదనంతర కాలంలో మన దేశంలో మార్కెట్‌ వేగంగా పుంజుకున్న నేపథ్యంలో తాజా పరిణామం మార్కెట్‌ వర్గాలకు అశనిపాతంలా ఉంది.

మ్యూచువల్‌ ఫండ్‌ అంటే

వివిధ మదుపుదారుల నుండి మదుపు సొమ్మును ఒక నిధిగా పోగుచేస్తారు. ప్రతిగా మదుపు దారులకు వారి మదుపు సొమ్ము నిష్పత్తిలో యూనిట్‌లుగా విక్రయిస్తారు. ఈ నిధిని మ్యూచువల్‌ ఫండ్‌ లేదా పరస్పర నిధి అంటారు. యూనిట్ల రూపంలో సేకరించిన నిధి సొమ్ము మొత్తాన్ని ఆ నిధి లక్ష్యాలకనుగుణంగా స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడతారు. ఈ పెట్టుబడులు వివిధ రంగాలు, పరిశ్రమలలో వైవిధ్యంగా పెట్టటం వల్ల ''రిస్క్‌'' అదుపు చేయబడుతుంది. మ్యూచువల్‌ ఫండ్‌ మదుపుదారులను ''ఫండ్‌ హోల్డర్లు'' అని పిలుస్తారు. ఈ పెట్టుబడులపై వచ్చే డివిడెండ్లు గాని, వడ్డీ ఇతర ఆదాయాలు ఆ నిధికి జమ చేస్తారు. యూనిట్లగా విభజించిన నిధి సొమ్ముతో పెట్టుబడి పెట్టిన ద్రవ్య ఉత్పత్తుల విలువపై, యూనిట్‌ విలువ ఆధారపడి ఉంటుంది. స్టాక్‌ మార్కెట్‌ లోని పరిణామాలతో యూనిట్‌ విలువ ప్రతి రోజు మారుతుంటుంది. ఏరోజుకారోజు యూనిట్‌ విలువను లెక్కిస్తారు. ఈ విలువ నుండి యూనిట్‌ నిర్వహణకై అయ్యే ఖర్చును మినహాయించిన విలువను నికర ఆస్థి విలువ లేదా నెట్‌ ఎస్సెట్‌ వ్యాల్యూ, క్లుప్తంగా యన్‌.ఏ.వి అంటారు. నిర్వహణ ఖర్చులు తగ్గిన మేరకు యూనిట్ల కేటాయింపు పెరుగుతుంది. నిధి మొత్తం మార్కెట్‌ విలువను యాజమాన్యంలోని ఆస్థుల విలువ (ఎస్సెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌) అంటారు. ఒక నిర్ణీత కాలంలోని కంపెనీలన్నింటి యాజమాన్యంలోని ఆస్తుల సగటు విలువను ''యాజమాన్యంలోని సగటు ఆస్తుల విలువ లేదా యావరేజ్‌ ఎస్సెట్స్‌ అండర్‌ మేనేజ్‌మెంట్‌'' అంటారు.

మ్యూచువల్‌ ఫండ్‌ - ప్రత్యేకతలు

మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ తప్పనిసరిగా సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్‌చేంజ్‌ బోర్డు ఆఫ్‌ ఇండియా) దగ్గర నమోదు చేసుకొని ఉండాలి. భారతదేశంలోని మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీల నియంత్రణ 1993లోనే సెబీకి అప్పగించబడింది. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టటానికి అవసరమైన అనుభవం, పరిజ్ఞానం, నైపుణ్యం, తీరిక లేని మదుపుదారులు మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టుబడి పెట్టి స్టాక్‌ మార్కెట్‌ ప్రయోజనాలను పొందవచ్చు ఈ రంగంలో అనుభవం, దక్షత కలిగిన నిపుణులు ఫండ్‌ మేనేజర్‌లుగా ఉంటారు. ఉన్నత మధ్య తరగతి వర్గం ఈ రంగంలో గణనీయంగా మదుపు చేస్తున్నారు.

మ్యూచువల్‌ ఫండ్‌లో పెట్టుబడి మార్గాలు

ప్రతియూనిట్‌ హోల్డరు తన నిధిని, ఏదో ఒక స్కీమ్‌ను ఎన్నుకొని పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. సామాన్యంగా మూడు పద్ధతులలో మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులు ఉంటాయి.

1. గ్రోత్‌ లేదా ఈక్విటీ స్కీమ్‌

ఈ స్కీమ్‌ని ఎంచుకున్న నిధులలో అత్యధిక భాగం షేర్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టబడతాయి. షేర్‌ మార్కెట్‌ ఒడుదుడుకుల రిస్క్‌ ఇందులో అధికంగా ఉంటుంది. అదే సమయంలో లాభాలు /నష్టాలు అదే స్థాయిలో ఉంటాయి. మధ్య/దీర్ఘకాలిక పెట్టు బడులతో మూల ధనాన్ని గణనీయంగా పెంచడం ఈ స్కీమ్‌ ఉద్దేశ్యం.

2. డెట్‌/ఇన్‌కమ్‌ స్కీం

మదుపుదారులకు నిర్ణీత వ్యవధిలో, క్రమ పద్ధతిలో ఆదాయాన్ని అందిచటం ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ స్కీమ్‌ లోని నిధులను స్థిరమైన ఆదాయాన్నిచ్చే బాండ్లు, కార్పొరేట్‌ డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, మనీ మార్కెట్లలో పెట్టుబడి పెడతారు. స్టాక్‌ మార్కెట్‌ ఒడుదుడుకులు ఈ పథకంపై ఉండవు. కానీ వడ్డీ రేట్లలో వచ్చే మార్పులు ఈ పథకంపై ప్రభావాన్ని కల్గిస్తాయి. రిస్క్‌ తక్కువ. ఆదాయం కూడా అదే పద్ధతిలో ఉంటుంది.

3. బ్యాలెన్స్‌డ్‌ ఫండ్‌

మదుపుదారులకు ఈక్విటీ మార్కెట్‌ ప్రయోజనాలతో పాటు క్రమబద్ధమైన ఆదాయాన్ని అందించడం ఈ పథకం లక్ష్యం. సాధారణంగా ఈక్విటీ, డెట్‌ (ఋణ) సాధనాలలో 40:60 నిష్పత్తిలో ఈ పథకంలో పెట్టుబడి పెడతారు. గ్రోత్‌ ఫండ్‌ కంటే ఈ పథకంలో రిస్క్‌ తక్కువగా ఉంటుంది. ఆదాయం మధ్యస్థంగా ఉంటుంది.

ఇవికాక కేవలం ప్రభుత్వం సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే గిల్ట్‌ఫండ్‌, ప్రత్యేకమైన రంగాలు/పరిశ్రమలలో పెట్టుబడి పెట్టే సెక్టార్‌ఫండ్‌, సరుకులు, రియల్‌ ఎస్టేట్‌, బులియన్‌ ఫండ్స్‌ కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. మ్యూచువల్‌ ఫండ్‌లో లాభనష్టాలన్నింటిని యూనిట్‌ హోల్డర్‌ భరించాల్సి ఉంటుంది. పథకాల గత ఫలితాల ఆధారంగా భవిష్యత్‌ అంచనాలు మ్యూచువల్‌ ఫండ్‌లో వేసికోకూడదు. ఎప్పటి పరిస్థితుల్ని అప్పుడే బేరీజు వేసుకోవాలి.

భారతదేశంలో మ్యూచువల్‌ ఫండ్స్‌

భారతదేశంలోని మొట్టమొదటి మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీగా యూనిట్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా (యుటిఐ)ని చెప్పుకోవాలి. 1963లో ఈ సంస్థ ప్రభుత్వరంగంలో రిజర్వ్‌ బ్యాంకు నియంత్రణతో ఏర్పాటు చేయబడినది. ఈ సంస్థ చేపట్టిన మొదటి పథకం యూనిట్‌-1964 (యు.యస్‌-64). 1987 నుండి 1993 మధ్య కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో ప్రవేశించాయి. ఈ రంగంలో ప్రవేశించిన మొదటి బ్యాంకు స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (1987). 1989లో ఎల్‌.ఐ.సి, 1990లో జి.ఐ.సి ఈ రంగంలో అడుగుపెట్టాయి. నూతన ఆర్థిక విధానాల అమలు తరువాత 1993 నుండి ఈ రంగంలో ప్రయివేటు కంపెనీలను అనుమతించారు. కొఠారి పయనీర్‌ (ప్రస్తుతం ఈ కంపెనీ ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ తో విలీనమైంది) 1993లో ప్రయివేటు రంగంలో ప్రారంభించబడిన మొదటి మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ. 1993 నుండి ఈ రంగం నియంత్రణను సెబీకి అప్పచెప్పారు. 2003వ సంవత్సరంలో యు.యస్‌-64 పధకాన్ని నిర్వహించే బాధ్యతను పూర్తిగా యుటిఐకి అప్పచెప్పి, యుటిఐ మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ ఏర్పాటు చేయబడింది. యుటిఐ మటుకు సెబీ నియంత్రణ పరిధిలో ఉండదు. ప్రభుత్వ ఆధీనంలో ప్రారంభమైన భారతీయ మ్యూచువల్‌ ఫండ్‌ రంగంలో అత్యధిక భాగం ప్రస్తుతం ప్రయివేట్‌ రంగంలో ఉండటం గమనించాల్సిన అంశం.

No comments: