Monday, February 28, 2011

హెడ్జ్‌ ఫండ్స్‌ -- లక్షణాలు, ప్రభావాలు

సంపన్న వర్గాలు, సంస్థాగత మదుపుదారుల అవసరాలను తీరుస్తూ, ద్రవ్య వ్యవస్థలపై ప్రమాదకర ప్రభావాలను కల్గిస్తున్న హెడ్జ్‌ ఫండ్స్‌ లక్షణాలు ప్రభావాలను పరిశీలిద్దాం.

లక్షణాలు

హెడ్జ్‌ ఫండ్స్‌ కొద్ది అంశాలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ లక్షణాలు కలిగి వున్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌లో వలె మదుపు నిపుణులు మదుపు దార్ల నుండి ధనాన్ని సమీకరించి హెడ్జ్‌ నిధిని ఏర్పరుస్తారు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో వలె మదుపుదారులు ఫండ్‌ మధ్య కాలంలో కొన్ని పరిమితులకు లోబడి తమ మదుపు సొమ్మును వెనక్కు తీసుకోవటానికి వీలుంటుంది. ఇంతకు మించి మిగిలిన అన్ని అంశాలలో హెడ్జ్‌ ఫండ్‌ లక్షణాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌కు సరితూగవు.

1. మ్యూచువల్‌ ఫండ్స్‌ సాపేక్ష రాబడి (రెలెటీవ్‌ రిటర్న్స్‌) లక్ష్యంగా ఉండగా, హెడ్జ్‌ ఫండ్స్‌ ద్రవ్య మార్కెట్‌ పరిణామాలతో నిమిత్తం లేకుండా సర్వ కాల సర్వావస్థలలో అత్యధిక లాభాల్ని సంపాదించడమే ప్రధాన లక్ష్యంగా కలిగి వున్నాయి. వాటి లాభాలకు ఆకాశమే హద్దుగా ఉంది.

2. మ్యూచువల్‌ ఫండ్స్‌లో అధిక రిస్క్‌ కలిగిన మదుపు ప్రక్రియలు నిషేధింప బడగా, హెడ్జ్‌ ఫండ్స్‌కు అటువంటి ఆంక్షలేమీ లేవు. ఒక వేళ ఉన్నా అవి నామమాత్రంగానే ఉంటాయి. షేర్లు, బాండ్లు, ప్రవేటు భాగస్వామ్యాలు, కరెన్సీలు, రియల్‌ ఎస్టేట్‌లలో హెడ్జ్‌ ఫండ్‌లను మదుపు చేస్తారు. ప్రమాదకరమైన ప్యూచర్‌లు, శ్వాప్‌లు, ఆప్షన్‌లు లాంటి డెరివేటివ్‌లు సాధనంగా ఈ హెడ్జ్‌ ఫండ్‌లను వినియోగిస్తారు. అత్యధిక పరిమాణంలో ఒకే కంపెనీ/రంగంకు సంబంధించిన ఆస్థులలోను, రంగాలలోను వైవిధ్యం పాటించాల్సిన అగత్యంలేదు.

3. హెడ్జ్‌ ఫండ్స్‌ 3 రకాలుగా ఉంటాయి. అవి మ్యాక్రో ఫండ్స్‌, గ్లోబల్‌ ఫండ్స్‌, రిలెటివ్‌ ఫండ్స్‌. జాతీయ స్థూల ఆర్థిక, ద్రవ్య రంగ స్థితిగతుల్ని దృష్టిలో ఉంచుకొని మదుపు చేయబడే నిధుల్ని మ్యాక్రో ఫండ్స్‌ (స్థూల నిధులు) అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ కంపెనీల పని తీరును ప్రమాణంగా తీసుకొని నిర్వహించ బడే నిధులను గ్లోబల్‌ ఫండ్స్‌ (ప్రపంచ నిధులు) అంటారు. తమకు చేరువలో ఉండే ట్రెజరీ బిల్లులు, బాండులు వగైరా మార్కెట్‌ స్థితిగతుల్ని ప్రమాణంగా తీసుకొని నిర్వహింపబడే నిధులను రెలెటీవ్‌ ఫండ్స్‌ (సాపేక్ష నిధులు) అంటారు. క్వాంటమ్‌ ఫండ్‌ వ్యూహమైన గ్లోబల్‌ మ్యాక్రో 1994 వరకు విసృతంగా వినియోగింపబడింది. ప్రపంచ హెడ్జ్‌ ఫండ్స్‌లో 70% ఈ వ్యూహాన్ని అనుసరించాయి. 1997 ఆసియా సంక్షోభం, 1998లోని లాంగ్‌ టరమ్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌ సంక్షోభం తరువాత గ్లోబల్‌ మ్యాక్రో వ్యూహం కేవలం 10%నికి పతనమైంది. ఆ స్థానంలో ప్రపంచ పరిణామాల ప్రేరేపిత వ్యూహం (ఈవెంట్‌ డ్రివెన్‌), దీర్ఘకాల/స్వల్పకాల ఈక్విటీ వ్యూహాలు ఊపందుకున్నాయి. ఈక్విటీ మార్కెట్‌ తటస్థ వ్యూహం కూడా మార్కెట్‌లో మంచి ఆదరణను పొందింది. 2000 సం||లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ షేర్‌ మార్కెట్‌ బుడగ బద్దలౌటంతో దీర్ఘకాల స్వల్పకాల ఈక్విటీ వ్యూహం ఆదరణను కోల్పోయింది. ఆ తరువాత కాలంలో బహుముఖ వ్యూహాలు (మల్టీస్ట్రేటజీస్‌), ప్రపంచ పరిణామాల ప్రేరేపిత వ్యూహాలు అమలుచేయబడ్డాయి.

4. హెడ్జ్‌ ఫండ్స్‌లో సంపన్న వర్గాలు, సంస్థాగత మదుపుదారులు మాత్రమే మదుపు చేయగలుగుతారు. సామాన్యులకు అవి అందని ద్రాక్షలే. 15 లక్షల డాలర్ల నికర ఆస్థులు లేదా గత రెండు సం||లుగా ప్రతి సంవత్సరం 2 లక్షల డాలర్లకు మించిన ఆదాయం కలిగిన మదుపు దారులకు మాత్రమే హెడ్జ్‌ ఫండ్స్‌లో ప్రవేశం ఉంటుంది. వీరు కనీసం 10లక్షల డాలర్లకు మించిన సొమ్మును మదుపు చేయాల్సి ఉంటుంది. సంపన్నులైన వ్యక్తులతో పాటు సంస్థాగత పెట్టుబడిదార్లకు ఇవి ప్రధాన నెలవులుగా ఉన్నాయి. హెడ్జ్‌ ఫండ్స్‌లో మదుపుదారుల సంఖ్య పరిమితంగా ఉంటుంది. అత్యధికంగా 500 మంది మదుపుదారులు కలిగిన హెడ్జ్‌ నిధులు చాలా అరుదుగా ఉంటాయి.

5. 2/20 ప్రాతిపదికన ఈ నిధులు నిర్వహింపబడతాయి. దీనర్ధం సంవత్సరానికి ఆస్థుల విలువలో 2% యాజమాన్య ఫీజు క్రింద, లాభాలలో 20% నిర్వహణ ఫీజు (పర్ఫార్మెన్స్‌ ఫీజు) క్రింద మదుపుదారులు చెల్లించాల్సి ఉంటుంది.

6. హెడ్జ్‌ఫండ్స్‌ ఏ రకమైన నియంత్రణకు కట్టుబడి ఉండవు. ఒకవేళ ఉన్నా అవి నామామాత్రంగా ఉంటాయి. ఇవి కేవలం ప్రవేట్‌ యాజమాన్యాలలోనే నిర్వహింపబడతాయి.

7. హెడ్జ్‌ ఫండ్స్‌లో నష్టాలను నిర్వాహకులు భరించరు. మదుపుదారులే భరించాల్సి వుంటుంది.

8. అత్యధిక లాభాలనార్జించటానికి పలు రకాల వ్యూహాలను హెడ్జ్‌ ఫండ్స్‌ అనుసరిస్తాయి. ఒక్కొక్క నిధికి ఒక్కొక్క వ్యూహం ఉంటుంది. హెడ్జ్‌ ఫండ్స్‌లో నిధి తరపున రుణాలను సేకరించే హక్కు నిర్వాహకులకు ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఈ రుణాలు మూలధనం కంటె అనేక రెట్లు ఉండవచ్చు. మదుపు సొమ్ముతో పాటు అరువు సొమ్ము నిధి పరిమాణాన్ని పెంచుతుంది. దీర్ఘకాల, స్వల్పకాల లావాదేవీల విక్రయాల వ్యూహాన్ని తరచు వాడుతుంటారు. స్వల్పకాల లావాదేవీల వ్యూహం వాడకం అత్యధికంగా ఉంటుంది.

9. ఈ నిధులలో హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్ల దక్షత కీలకమైనది. అందువలన వీరు అత్యథిక పరిహారం పొందుతుంటారు. సంక్షోభ సమయాలలో సైతం వీరి ఆదాయం అధికంగానే ఉంటుంది.

10. హెడ్జ్‌ ఫండ్స్‌ నిర్దిష్ట నిర్వచనాన్ని కోల్పోయాయి. హెడ్జింగ్‌ ప్రక్రియ మొత్తం నిధులలో 10% మించి లేదు.

11. హెడ్జ్‌ ఫండ్స్‌లో పారదర్శకత చాలా తక్కువగా ఉంటుంది. వీటికి సంబంధించిన సమాచారం, ప్యూహాలు గోప్యంగా ఉంచబడతాయి. అవినీతి ఆరోపణలు, నిధుల దుర్వినియోగం, ప్రాధాన్యతలలో సమతుల్యత లోపించడం అధికంగా ఉంటుంది.

ప్రభావాలు

1. ఆర్థిక రంగ ఒడుదుడుకులతో నిమిత్తం లేకుండా హెడ్జ్‌ ఫండ్స్‌ మిగిలిన ద్రవ్య సాధనాలకు భిన్నంగా అత్యధిక లాభాలను సంపాదించిన చరిత్ర గలిగియున్నాయి. ద్రవ్య మార్కెట్‌ దిగ్గజం జార్జి సొరొస్‌ యాజమాన్యంలో నిర్వహింపబడ్డ క్వాంటం ఫండ్స్‌ దశాబ్ధకాలం పాటు సంవత్సరానికి 30% కు మించిన లాభాలను పొందగలిగిందని గొప్పగా చెప్తారు.

2. హెడ్జ్‌ ఫండ్స్‌ ప్రమాదాలకు అతీతమైనవేవీ కావు. అత్యధిక రాబడులకోసం హెడ్జ్‌ ఫండ్స్‌ అనుసరిస్తున్న పద్ధతులు హెడ్జ్‌ ఫండ్స్‌నే కాకుండా ద్రవ్య వ్యవస్థ మొత్తాన్ని ప్రమాదాల్లో పడేస్తుంది. ఇందులో మదుపు చేయబడే పెన్షన్‌ నిధులు, ఇన్సురెన్స్‌ నిధులు, ప్రావిడెంట్‌ నిధులపై పడే దుష్ప్రభాలు తీవ్రంగా ఉంటున్నాయి. పరిమితమైన హెడ్జ్‌ ఫండ్‌ మదుపుదారుల ప్రయోజనాలకోసం జాతీయ ఆర్థిక వ్యవస్థలతో సహా విస్తృతమైన ద్రవ్య వ్యవస్థలను, అందులోని భాగస్వాములైన ప్రభుత్వాలు, ప్రజలు, రిటైర్డ్‌ ఉద్యోగులు మొదలైన వారిని దివాళా తీయించటానికి హెడ్జ్‌ ఫండ్స్‌ వెనుకాడవు. 1998లో ద్రవ్య రంగ దిగ్గజాల బృందంతో వాల్‌ స్ట్రీట్‌ వాణిజ్యవేత్త జాన్‌ మెరీ వెదర్‌ నాయకత్వంలోని లాంగ్‌ టరమ్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌ దివాలా తీసి ప్రపంచ ద్రవ్య వ్యవస్థలను ముంచేసింది. చివరకు వాల్‌స్ట్రీట్‌లోని పెద్ద పెద్ద బ్యాంకులు ఈ ద్రవ్య వ్యవస్థల్ని కాపాడాల్సి వచ్చింది. దీని ప్రభావంతోనే జార్జి సొరొస్‌ యాజమాన్యంలోని క్వాంటం ఫండ్‌ తీవ్ర నష్టాలకు గురై చివరకు మూసివేయాల్సి వచ్చింది.

3. 1997, 2000 సం||రాలలో ఏర్పడ్డ ద్రవ్య సంక్షోభాలలో హెడ్జ్‌ ఫండ్స్‌ పాత్ర ఉన్నట్టు చెప్తుంటారు. ఈ హెడ్జ్‌ ఫండ్స్‌ ద్వారా వివిధ ద్రవ్య వ్యవస్థలలోని కరెన్సీ విలువలను తారుమారు చేశారన్న ఆరోపణలు అధికంగా ఉన్నాయి. ఈ సంక్షోభాలకు మించిన స్థాయిలో 2008లోని ప్రపంచ ద్రవ్య సంక్షోభంలో హెడ్జ్‌ ఫండ్స్‌ ప్రభావం మరింతగా ఉన్నదనే వాదనలు బలంగా ఉన్నాయి. హెడ్జ్‌ ఫండ్‌లలో చోటుచేసుకున్న రుణాల లభ్యత ప్రక్రియ నిధుల పరిమాణాన్ని పెంచటంలోను, ఈ నిధుల్ని అత్యధిక రిస్క్‌ కలిగిన ద్రవ్య డెరివేటివ్‌లలో మదుపు చేయటం వల్ల హెడ్జ్‌ ఫండ్‌ల ప్రమాదం, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిక్యతను చెలామణి చేసే పరిస్థితుల్లో వినాశకరంగా మారింది. ఇదే సందర్భంలో 2008లో వివిధ ఆర్థిక వ్యవస్థలు స్వల్ప కాల లావాదేవీల విక్రయాలపై నిషేధాల్ని ప్రకటించటంతో హెడ్జ్‌ ఫండ్‌లు సాధారణంగా అమలు పరిచే స్వల్పకాల లావాదేవీల విక్రయ వ్యూహాలు తల్లక్రిందులయ్యాయి. దీనితో 2008 సం||లో అనేక హెడ్జ్‌ ఫండ్‌లు దివాలా తీశాయి.

4. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వీటిని సాధనంగా తీసుకొని వివిధ ద్రవ్య వ్యవస్థలలో వీర విహారం చేస్తున్నారు.

హెడ్జ్‌ ఫండ్స్‌ -- భారతదేశం

ప్రపంచీకరణ విధానాలలో భాగంగా హెడ్జ్‌ ఫండ్స్‌ భారతదేశంలో అడుగుపెట్టాయి. భారత ద్రవ్య వ్యవస్థలోని పార్టిసీపెటరీ నోట్సు మార్గంలో హెడ్జ్‌ ఫండ్స్‌ భారత ద్రవ్య వ్యవస్థలో పాతుకుపోయాయి. 2007-08 సం|| ద్రవ్య సరఫరా విధానం మన దేశంలో హెడ్జ్‌ ఫండ్స్‌ పెరుగుదలకు బాటలు వేశాయి. మన దేశంలో హెడ్జ్‌ ఫండ్స్‌ యాజమాన్యంలోని నికర నిధుల విలువ సుమారుగా 6 కోట్ల 80 లక్షల డాలర్లు ఉంటుంది. 2011లోని ఆర్థిక పరిస్థితులు హెడ్జ్‌ ఫండ్‌ పెరుగుదలకు అనుకూలంగా లేవు. హెడ్జ్‌ ఫండ్స్‌ పై ఉన్న సెబి ఆంక్షలు వాటిని నియంత్రించే స్థాయిలో లేవు. ప్రపంచ అనుభవాల నేపధ్యంలో హెడ్జ్‌ ఫండ్స్‌ కార్యకలాపాలకై ఒక కన్ను వేసి ఉండాల్సిన అవసరం అనివార్యమైంది. తస్మాత్‌ జాగ్రత్త.


Monday, February 21, 2011

హెడ్జ్‌ఫండ్స్‌ - పరిచయం



అమెరికా ద్రవ్య సంక్షోభ సందర్భంగా వెలువడిన వివిధ కథనాల్లో ప్రాధాన్యత సంతరించుకున్న ద్రవ్య సాధనం హెడ్జ్‌ఫండ్స్‌ లేదా హెడ్జ్‌ నిధులు. సామాన్య మదుపుదారుడికి అందుబాటులో లేకుండా కేవలం సంపన్న వర్గాలకే పరిమితమైన హెడ్జ్‌ఫండ్స్‌ వివిధ ద్రవ్య వ్యవస్థల సుస్థిరతపై తీవ్రమైన ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. ఆసియా ద్రవ్య సంక్షోభం సందర్భంగా అమెరికా హెడ్జ్‌ఫండ్‌లే తమ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశాయని మలేషియా అధినేత డా|| మహతిర్‌ మహ్మద్‌ చేసిన తీవ్ర ఆరోపణలను గుర్తుచేసుకుంటే, అత్యధిక రాబడుల ఆర్జనతో పాటు ద్రవ్య వ్యవస్థలపై హెడ్జ్‌ ఫండ్స్‌ ప్రాబల్యాన్ని ఊహించుకోవచ్చు. అంతర్జాతీయ పెట్టుబడి మార్కెట్‌ను ద్రవ్యీకరించడంలో (ద్రవ్య లావాదేవీల దిశగా మార్చటంలో) హెడ్జ్‌ఫండ్స్‌ మొదటి సాధనంగా పనిచేశాయి. కాలక్రమంలో ద్రవ్య ప్రపంచీకరణ విధానాల నేపధ్యంలో హెడ్జ్‌ఫండ్స్‌ వ్యవస్థాగత రిస్క్‌ నియంత్రణ సాధనంగా కాకుండా, స్వల్పకాలంలో విచ్చలవిడి లాభాలు పోగేసుకొనే స్పెక్యులేటివ్‌ సాధనంగా రూపాంతరం చెందింది.

హెడ్జ్‌ఫండ్స్‌ అంటే

అధునాతనమైన మదుపు వ్యూహాలతో అత్యధిక రాబడిని ఆర్జించాలనే లక్ష్యంతో చొరవగా మదుపు చేయగలిగిన నిధుల సమూహాన్ని హెడ్జ్‌ఫండ్స్‌ లేదా హెడ్జ్‌ నిధులు అంటారు. అనేక సంప్రదాయేతర పద్ధతులతో రిస్క్‌ అదుపుచేయగలిగిన ప్రవేటు యాజమాన్యంలో నిర్వహించే నిధి ఇది. ఆస్థుల ధరలలో అస్థిరతల వల్ల ఏర్పడే ప్రమాదం నుండి రక్షించే ప్రక్రియను హెడ్జింగ్‌ అంటారు. సారాంశంగా చెప్పుకుంటే ఆస్థుల ధరల అస్థిరత ప్రమాదాన్ని ఎదుర్కొంటూ, అధునాతన పద్ధతులతో అత్యధిక లాభాలను రాబట్టగలిగే ద్రవ్య సాధనాన్ని హెడ్జ్‌ఫండ్స్‌గా చెప్తున్నారు.

హెడ్జ్‌ఫండ్‌ భావనలు

ఫైనాన్షియల్‌ జర్నలిస్ట్‌, సామాజికవేత్త ఆల్‌ఫ్రెడ్‌ డబ్ల్యూ.జోన్స్‌ 1949లో మొట్టమొదటి హెడ్జ్‌ఫండ్‌ను ఆవిష్కరించారు. వివిధ ఆస్తుల (షేర్లు, సరుకులు మొ||) సమూహాన్ని పోర్టుపోలియో అంటారు. మార్కెట్‌ మొత్తంలో ఈ పోర్టుపోలియోలోని ఆస్తులు అంతర్భాగమై ఉంటాయి. ఒక ఆస్తి యొక్క ధరల చలనాలపై రెండు ప్రభావాలుంటాయని జోన్స్‌ విశ్వసించాడు. అవి మొత్తం మార్కెట్‌ యొక్క ప్రభావం, ఆస్తి తనకు తానుగా సృష్టించగల ప్రభావం. మార్కెట్‌ యొక్క ధరల చలనాల్ని తటస్థీకరించటానికి గాను, మార్కెట్‌ కంటే పటిష్టమైన ఆస్థుల్ని ఆ పోర్టుపోలియోకు జత చేయడంతో పాటు మార్కెట్‌ కంటే బలహీనమైన ఆ పోర్టుపోలి యోలోని ఆస్థుల్ని అమ్మటం ద్వారా, ఆ ఆస్థుల పోర్టు పోలియోలో సమతుల్యతను సాధించగలుగుతుంది. దీని ద్వారా మార్కెట్‌ మొత్తం పెరిగితే స్వల్ప కాల లావాదేవీల విక్రయ వ్యూహం (షార్టు సెల్లింగ్‌) ద్వారా వచ్చే నష్టం, దీర్ఘకాల లావాదేవీల విక్రయాలతో (లాంగ్‌ సెల్లింగ్‌) వచ్చే లాభాలతో సర్దుబాటవుతాయి. ఈ నిధులలో పెరిగే రిస్క్‌ను అదుపు చేయడమే కీలక ప్రక్రియగా ఉన్నందున ఈ నిధుల్ని ''హెడ్జ్‌ఫండ్స్‌''గా జోన్స్‌ నామకరణం చేసాడు.

జోన్స్‌ ప్రతిపాదించిన ఈ ''హెడ్డ్‌ఫండ్స్‌ భావన'' ప్రపంచీకరణ విధానాలలో భాగంగా 1990 సం|| తొలిదశలో కొత్త వైభవాన్ని సంతరించుకుంది. ప్రపంచ ప్రఖ్యాత మదుపుదారులైన జార్జి సొరొస్‌, జులియన్‌ రాబర్జ్‌సన్‌, వారెన్‌ బఫెట్‌ లాంటి ఫైనాన్స్‌ రంగ దిగ్గజాలు హెడ్జ్‌ఫండ్స్‌ భావనకు మొరుగులు దిద్ది వినూత్న శోభను అందించారు. 1996లో హెడ్జ్‌ఫండ్‌ మార్కెట్‌ 2000 హెడ్జ్‌ నిధులతో 135 బిలియన్‌ డాలర్ల విలువ కలిగి ఉండగా, 2007 సం|| నాటికి హెడ్జ్‌ ఫండ్స్‌ ఆస్థుల విలువ అత్యధికంగా 10000 హెడ్జ్‌ నిధులతో 2 ట్రిలియన్‌ డాలర్లకు పైబడి పెరిగింది. కాలక్రమంలో హెడ్జ్‌ ఫండ్స్‌ నిర్వచనం నూతన రూపాల్ని తీసుకొని తన నిర్దిష్టతను కోల్పోయింది. విచిత్రమేమంటే హెడ్జింగ్‌ లేని హెడ్జ్‌ఫండ్స్‌ ఎన్నో మార్కెట్‌లో వెలిశాయి.

దీర్ఘకాల, స్వల్పకాల లావాదేవీల విక్రయాలు

చాలా మంది మదుపుదారులు దీర్ఘకాలంలో తమ ఆస్థుల(షేర్లు, సరుకులు మొ!!) విలువలు పెరుగుతాయనే అంచనాతో మదుపు చేసి, పెరిగినపుడు అమ్ముకుంటారు.ఈ ప్రక్రియను దీర్ఘకాల లావాదేవీల విక్రయం (లాంగ్‌ సెల్లింగ్‌) అంటారు. దీనిలోని ఆస్థులు మదుపుదారుడికి పూర్తిగా స్వంతమైయుంటాయి. కానీ స్వల్పకాల లావాదేవీల విక్రయ (షార్ట్‌ సెల్లింగ్‌) ప్రక్రియలో ఆస్థుల విలువలు భవిష్యత్త్‌లో పడిపోతాయనే అంచనాతో, తమకు హక్కు లేని ఆస్థులను మరొకరి నుండి అరువు తీసుకొని అమ్మేస్తారు. ఆ నిర్ధిష్ట ఆస్థుల ధరలు మార్కెట్‌లో బాగా పడిపోయినపుడు వాటిని తిరిగి కొని అరువు తీసుకున్న వారికి తిరిగి చెల్లిస్తారు ఈ ప్రక్రియలో ఆస్థులు మదుపుదారుడి సొంతమైనవి కావు. ఈ ప్రక్రియను స్వల్పకాల లావాదేవీల విక్రయం అని అంటారు. హెడ్జ్‌ఫండ్‌లలో స్వల్పకాల లావాదేవీల విక్రయాలు కీలకపాత్రను పోషిస్తాయి.

Monday, February 14, 2011

కొనుగోలు శక్తి సమతుల్యత - పరిచయం

( పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ)


వివిధ దేశాల ప్రజల జీవన ప్రమాణాలను పోల్చే ప్రక్రియలోను, అంతర్జాతీయ వాణిజ్య అంచనాలలోను, కరెన్సీ మారక విలువల గణింపులోను, ప్రపంచ బ్యాంకు పోల్చే వివిధ ఆర్థిక వ్యవస్థల తలసరి స్థూల దేశీయోత్పత్తి పద్ధతిలోను, ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఒ.యి.సి.డి.) తయారు చేసే అంతర్జాతీయ ఆర్థిక గణాంకాల సమాచారంలోను కొనుగోలు శక్తి సమతుల్యత (పర్చేజింగ్‌ పవర్‌ పారిటి-పిపిపి) ప్రాధాన్యతను కలిగి వుంది.

కొనుగోలు శక్తి సమతుల్యత సిద్ధాంతం

అంతర్జాతీయ వర్తకం అభివృద్ధి క్రమంలో సంప్రదాయ ఆర్థిక వేత్త డేవిడ్‌ రికాల్డో కాలంలో మొదటగా కొనుగోలు శక్తి సమతుల్యత సిద్ధాంతం ప్రతిపాదించబడినప్పటికీ 1918లో స్వీడిష్‌ ఆర్థిక వేత్త గుస్తవ్‌ కాసెల్ ఈ సిద్ధాంతానికి ప్రాచుర్యం తెచ్చారు. ''రెండు దేశాల కరెన్సీల మధ్య ఆయా దేశాల కొనుగోలు శక్తులు సమానంగా వుండే స్థాయిలో ఆ రెండు దేశాల కరెన్సీ మారకపు రేట్లు సమతుల్యంగా వుంటాయని కొనుగోలు సమతుల్యత సిద్ధాంతం (పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ-పిపిపి) చెపుతుంది.

వివరణ

రెండు దేశాల కరెన్సీ మారకపు రేట్లు అస్థిరంగా వున్నప్పుడు, ఆయా దేశాల మారకపు రేట్లు తదనంతర కాలంలో ఆయా దేశాల కొనుగోళ్ళ శక్తిపై ఆధారపడి వుంటాయన్నది ఈ సిద్ధాంతంలోని కీలక అంశంగా వుంది. ప్రతి దేశం యొక్క దేశీయ కరెన్సీ ఆ దేశంలోని కొన్ని సరుకులు/సేవలు కొనగలిగే శక్తితోపాటు, ఇతర దేశాలలోని సరుకులు/సేవల్ని కొనగలిగే శక్తి కలిగి వుంటాయి. అందువల్ల దేశీయ కరెన్సీ, విదేశీ కరెన్సీతో మారకపు విలువని కల్గి వుండటం అనివార్యమైంది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ అనివార్యత మరింత తీవ్రమైంది. ఈ క్రమంలో రెండు దేశాల కరెన్సీల సాపేక్ష కొనుగోళ్ల శక్తి విలువలు మారకపు విలువను ప్రభావితం చేస్తాయి. ఒక నిర్దిష్ట పరిమాణం గల సరుకులు వుదాహరణకు అమెరికాలో 100 డాలర్లుగాను, భారతదేశంలో 4500 రూపాయలుగా వున్నాయనుకుంటే 100 డాలర్ల కొనుగోలు శక్తి 4500 రూపాయల కొనుగోలు శక్తి తో సమానంగా వుంటుంది. అంటే ఒక డాలర్ కొనుగోలు శక్తి 45 రూపాయల కొనుగోలు శక్తితో సమతుల్యతను కలిగి వుంటుంది. ఈ క్రమంలో భారతదేశంలో 45 రూపాయలకు లభించే సరుకుల/సేవల పరిమాణం అంతకంటే ఎక్కువగా పెరుగ కలిగినప్పుడు భారతదేశ సరుకుల/సేవలకు గిరాకీ పెరుగుతుంది. అమెరికా డాలర్లు రూపాయలుగా మార్పిడి జరిగి భారతదేశ సరుకులు/సేవల కొనుగోళ్ళు పెరుగుతాయి. ఆ మేరకు అమెరికాలో ఆ సరుకుల/సేవలకు గిరాకి తగ్గి ఆ దేశంలో వాటి ధరలు తగ్గే అవకాశం వుంటుంది. గిరాకీ పెరగడంతో భారతదేశంలో సరుకుల ధరలు పెరిగే అవకాశం వుంటుంది. ఈ రెండు దేశాల కరెన్సీ విలువల మధ్య సమతుల్యతను సాధించేవరకు, మారకపు విలువలో మార్పు కొనసాగుతుందని, ఆ రెండు దేశాల కొనుగోళ్ళ శక్తి సమానమైనప్పుడు, ఆ రెండు దేశాల కరెన్సీల మధ్య మారకపు రేటు సమతుల్యతను సాధింపబడుతుందనేది ఈ సిద్ధాంతంలో గమనించాల్సిన అంశం. అంటే కొనుగోళ్ళ శక్తిలో జరిగే ప్రతిమార్పు, ఆయా దేశాల కరెన్సీ మారకపు విలువలో ప్రతిబింబిస్తాయి.

ప్రభావం

కొనుగోలు శక్తి సమతుల్యత సిద్ధాంతంలో దేశీయోత్పత్తి లెక్కింపు ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి వుంది. తలసరి స్థూల దేశీయోత్పత్తికి కేవలం మారకం విలువలలో వ్యక్తం చేసినపుడు, ఆ విలువల ఆ మారకపు రేట్లపై వుండే మార్కెట్‌ శక్తుల ప్రభావంపై ఆధారపడి వుండి, నిజమైన విలువ నిర్ధారణ జరుగదు. ఉదాహరణకు భారతదేశ రూపాయి మారకపు విలువ సగానికి పడిపోయిందనుకుంటే డాలర్లలో వ్యక్తం చేసిన స్థూల దేశీయోత్పత్తి సగానికి పడిపోతుంది. భారతదేశంలోని ప్రజలు మరింత పేదలయ్యారని ఈ పరిణామం సూచించినా, ఆచరణలో భారతదేశంలోకి ఆదాయాలు, ధరలకు వెచ్చించే రూపాయి విలువలో మార్పు లేనంతవరకు, పై నిర్ధారణ వాస్తవాన్ని ప్రతిబింబించలేదు. అందువల్ల కొనుగోళ్ళ శక్తి సమతుల్యత ప్రాతిపదికన కొలిచే తలసరి స్థూల జాతీయోత్పత్తి అంతర్జాతీయ ప్రమాణమైంది.

ముగింపు

కొనుగోలు శక్తి సమతుల్యత ప్రమాణంపై కొలిచే తలసరి స్థూల దేశీయోత్పత్తిపైన, కొనుగోలు శక్తి సమతుల్యతను డాలర్లలో వ్యక్తం చేయడంలోను అనేక విమర్శలు, వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలను ప్రతిబింబించడంలో కొనుగోలు శక్తి సమతుల్యత సిద్ధాంతం సమగ్రతను, వాస్తవికతను సాధించడం లేదు. అంతర్జాతీయ వాణిజ్యంలో వినియోగం మేరకే ఈ సిద్ధాంత పరిధి పరిమితమైంది.

Sunday, February 6, 2011

ద్రవ్య సరఫరా విధానం - భారతదేశం (మొదటి భాగం)


ద్రవ్య సరఫరా విధానం చారిత్రక నేపథ్యం, ధ్యేయాలు మార్గాలు, సాధనాలు గూర్చిన ప్రాధమిక అవగాహన నేపథ్యంలో భారతదేశంలో ద్రవ్య సరఫరా విధానం ప్రాధాన్యతను చర్చించుకుందాం.

భారతదేశ ద్రవ్య సరఫరా విధాన ధ్యేయాలు

భారతదేశంలో కేంద్ర బ్యాంకుగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వ్యవహరిస్తుంది. భారతదేశ ద్రవ్య సరఫరా విధాన రూపకల్పన, అమలు, పర్యవేక్షణలను నిర్వహిస్తున్నది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం 1934 లోని ప్రవేశిక (ప్రియాంబుల్‌) లో రిజర్వ్‌ బ్యాంక్‌ ధ్యేయాలను ఇలా పేర్కొంది. ''భారతదేశంలో ద్రవ్య వ్యవస్థ సుస్థిరతను సాధించే దిశగా కరెన్సీ నోట్ల చలామణిని నియంత్రిస్తూ, భారత ప్రజల ప్రయోజనాలకనుగుణంగా కరెన్సీ చలామణితో పాటు, రుణ వ్యవస్థను నిర్వహించాలి''. ఈ ప్రవేశికలో ధరల స్థిరీకరణ ప్రత్యేకమైన నిర్దేశక సూత్రం కాకపోయినా, వివిధ దేశాలలో ధరల స్థిరీకరణ అయా దేశాల ద్రవ్య సరఫరా విధానంలో కీలకంగా నిర్వహింపబడుతున్న కారణంగా, భారతదేశ ద్రవ్యసరఫరా విధాన ధ్యేయాలలో ''ధరల స్థిరీకరణ, ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదక రంగాలకు తగినంతగా రుణ సరఫరానందించడం'' ప్రధాన అంశాలయ్యాయి. సారాంశంగా చెప్పుకోవాలంటే ''ధరల స్థిరీకరణ, ఆర్థిక వృద్ధి మధ్య సమతుల్యం సాధించడం'' భారతదేశ ద్రవ్య సరఫరా విధానంలో కీలకమైంది. అయా కాలమాన పరిస్థితులపై ఆధారపడి వాటి ప్రాధాన్యత ఉంటుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ తన ప్రకటనలో ఈ ప్రాధాన్యతలను వివరిస్తుంటుంది.

అదనపు ధ్యేయంగా ద్రవ్య రంగ సుస్థిరత

భారతదేశం అనుసరిస్తున్న స్వేచ్ఛా ఆర్థిక విధానాలు, ద్రవ్యరంగ సంస్కరణల నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంకు ధ్యేయాలలో ద్రవ్య రంగ సుస్థిరత అదనంగా చేరి ప్రాధాన్యతను సంతరించుకుంది. భారతదేశ పరిస్థితుల్లో ద్రవ్యరంగ సుస్థిరతను 3 అంశాలుగా విడగొట్టుకోవచ్చు. 1) ద్రవ్య లావాదేవీలను నిరాటంకంగా నిర్వహించడం, 2) ద్రవ్య వ్యవస్థలోని భాగస్వాములందరిలో విశ్వాసనీయతను నిలబెట్టడం, 3)ఉత్పాదక రంగాన్ని అకారణంగా నష్టపరిచే ఆర్థిక ద్రవ్య రంగ అనిశ్చితిని నివారించటం. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ ధ్యేయాలను సాధించటానికి ప్రయత్నిస్తుంది.

భారతదేశ మాధ్యమిక లక్ష్యంగా యం-3 ప్రమాణం

భారతదేశ ద్రవ్య సరఫరా విధానం అంతిమ ధ్యేయాల్ని చేరే క్రమంలో పరిస్థితులను బట్టి మాధ్యమిక లక్ష్యాన్ని (ఇంటర్మీడియేట్‌ టార్గెట్‌) నిర్ధేశించుకోవాల్సి వుంది. 1997-98 వరకు భారతదేశ ద్రవ్య సరఫరా విధానానికి విస్తృత ద్రవ్యం (బ్రాడ్‌ మనీ - యం.3) మాధ్యమిక లక్ష్యంగా ఉండేది. 1960లలో ద్రవ్యోల్బణాన్ని సంస్థాగత ప్రక్రియగా భావించేవారు. వ్యవసాయరంగ వైఫల్యాల మూలకంగా ద్రవ్యోల్బణం తీవ్ర అనిశ్చితికి గురౌతుండేది. ఆ రోజుల్లో ఎంచుకోబడ్డ రుణ నియంత్రణలకు అధిక ప్రాధాన్యత ఉండేది. ఉత్పాదకతను ప్రభావితం చేసే దిశలో బ్యాంకు రుణాలను ఒక ప్రక్క నియంత్రిస్తూ, మరోప్రక్క మార్కెట్‌లో స్పెక్యూలేషన్‌ పెరగకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ అదుపుచేసేది. బడ్జెట్లలో అత్యధిక ద్రవ్య లోట్ల మూలకంగానూ, చమురు షాక్‌ల వల్లనూ 1970లలో ద్రవ్యోల్బణం అదుపులేకుండా పెరిగిపోయింది. 1980ల తొలి సంవత్సరాలలో ద్రవ్యోల్బణ ప్రాధమిక కారణాలపై ఒక విస్తృత అవగాహన కుదిరింది. వ్యవసాయ వైఫల్యాలు, చమురు సంక్షోభాల కారణంగానే కాకుండా ఆర్థిక వ్యవస్థలో అత్యధికంగా చలామణిలో ఉన్న ద్రవ్యం కారణంగా కూడా ధరలు పెరుగుతాయని, అందుకనే 1960ల నుండి అధిక ధరల విజృంభణ కొనసాగుతుందనే వాదనలు బలం పుంజుకున్నాయి. ప్రభుత్వ బడ్జెట్‌లలో ప్రతిబింబించే అధిక ద్రవ్య లోటు భర్తి కోసం పెంచే ద్రవ్య చలామణి అధిక ద్రవ్యోల్బణానికి కారణమన్నది వారి వాదనల సారాంశం.

చక్రవర్తి కమిటీ (1985) సిఫార్సులు

పై అంశాన్ని అధ్యయనం చేయటానికి నియమించబడిన చక్రవర్తి కమిటీ 1985లో కొన్ని సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సులలో భాగంగా ద్రవ్య సరఫరా విధాన లక్ష్య నిర్ధేశిత కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సి వచ్చింది. ఎంచుకున్న ఉత్పాదకత వృద్ధికి అనుగుణంగా ద్రవ్య చలామణి పరిమితులపై రిజర్వ్‌ బ్యాంక్‌, కేంద్ర ప్రభుత్వం ఒక అంగీకారానికి రావాలని సిఫార్సు చేసింది. ధరల స్థిరీకరణలో ద్రవ్య చలామణి పాత్ర స్పష్టమైన నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంకు మాధ్యమిక లక్ష్యంగా బ్రాడ్‌మనీ (యం-3)ని ఎంచుకుంది. దీన్నే ''విస్తృత ద్రవ్యం'' అని కూడా అంటాం. ద్రవ్య సరఫరా చలామణిని కొలిచే ప్రమాణాలను యం-1, యం-2, యం-3 లుగా వర్గీకరించారు (కొన్ని దేశాలలో యం-0, యం-4లు కూడా అమలులో ఉన్నాయి).

యం-3 అంటే

యం-1 అనగా చలామణిలోను, కరెంటు ఖాతాలలోనూ ఉన్న ద్రవ్య పరిమాణం. దీన్నే నెరోమనీ (కుంచించిన ద్రవ్యం) అని అంటారు. చలామణిలో ఉన్న ద్రవ్యంతోపాటు కరెంటు, సేవింగ్స్‌ ఖాతాలలో ఉన్న ద్రవ్య పరిమాణాన్ని యం-2గా కొలుస్తారు. చలామణిలో ఉన్న ద్రవ్యం, కరెంటు సేవింగ్స్‌ ఖాతాలలో ఉన్న ద్రవ్యంతో పాటు దీర్ఘకాల డిపాజిట్లు, టైమ్‌ డిపాజిట్లు మరియు రెపోలలో ఉన్న ద్రవ్య పరిమాణాన్ని యం-3 గా కొలుస్తారు దీన్నే బ్రాడ్‌మనీ (విస్తృత ద్రవ్యం) అంటారు. చక్రవర్తి కమిటి సిఫార్సులకనుగుణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ యం-3 ప్రమాణాన్ని మాధ్యమిక లక్ష్యంగా ఎంచుకుంది. దీని ప్రకారం ద్రవ్య చలామణిని నియంత్రించాల్సి వస్తే పైన పేర్కొన్న వివిధ రకాల ద్రవ్య చలామణిని సవరించాల్సి వుంటుంది. ఈ భావనలో ద్రవ్య సరఫరా విధాన అంచనాలు ఎంచుకున్న స్థూల దేశీయోత్పత్తికి, భరించగలిగే ద్రవ్యోల్బణ రేటుకు లోబడి ఉంటాయి. ఈ ప్రాతిపదికన చేపట్టిన చర్యలను వాటి పర్యవసానాల అనుభవంతో సవరించడం జరుగుతుంది.

బ్రాడ్‌మనీ (యం-3)కి మంగళం

1985-1998ల మధ్య కాలంలో ఈ మాధ్యమిక లక్ష్య సాధనకు నిల్వల (రిజర్వ్‌) నిధులను నిర్వహణ లక్ష్యంగాను, నగదు నిల్వల నిష్పత్తిని (సి.ఆర్‌.ఆర్‌) నిర్వహణ సాధనంగా వాడుకోవడం జరిగింది. 1991 వరకు రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్ల నియంత్రణ ఎంచుకున్న రుణ నియంత్రణలను మాధ్యమిక లక్ష్య సాధనకు సాధనాలుగా వాడుకుంది. అధిక ద్రవ్య లోట్లను స్థిరీకరించడానికి ఈ సాధనాలు ఉపయోగపడేవి. మార్కెట్‌లో ద్రవ్య చలామణి అధికంగా ఉన్నప్పుడు ప్రత్యక్షంగా వడ్డీ రేట్లను పెంచడం, రుణ సరఫరాను అదుపు చేయడంతో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు పూనుకొనేవారు. వీటి ద్వారా ద్రవ్య చలామణి తగ్గించడం జరిగేది. ప్రభుత్వ బాండ్‌లపై వచ్చే వడ్డీరేటు అతి తక్కువగా నిర్ణయింపబడి చట్టబద్ధ నిధుల లభ్యత నిష్పత్తులను (యస్‌.ఎల్‌.ఆర్‌) తరచూ పెంచుతూ ప్రభుత్వ బాండ్‌లకు గిరాకీ సృష్టింపబడేది. ఆర్థిక సరళీకరణ అనంతరం మాధ్యమిక లక్ష్యంగా వున్న బ్రాడ్‌మనీ (యం-3)కి స్వస్తి చెప్పడం జరిగింది.