Sunday, February 6, 2011

ద్రవ్య సరఫరా విధానం - భారతదేశం (మొదటి భాగం)


ద్రవ్య సరఫరా విధానం చారిత్రక నేపథ్యం, ధ్యేయాలు మార్గాలు, సాధనాలు గూర్చిన ప్రాధమిక అవగాహన నేపథ్యంలో భారతదేశంలో ద్రవ్య సరఫరా విధానం ప్రాధాన్యతను చర్చించుకుందాం.

భారతదేశ ద్రవ్య సరఫరా విధాన ధ్యేయాలు

భారతదేశంలో కేంద్ర బ్యాంకుగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వ్యవహరిస్తుంది. భారతదేశ ద్రవ్య సరఫరా విధాన రూపకల్పన, అమలు, పర్యవేక్షణలను నిర్వహిస్తున్నది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టం 1934 లోని ప్రవేశిక (ప్రియాంబుల్‌) లో రిజర్వ్‌ బ్యాంక్‌ ధ్యేయాలను ఇలా పేర్కొంది. ''భారతదేశంలో ద్రవ్య వ్యవస్థ సుస్థిరతను సాధించే దిశగా కరెన్సీ నోట్ల చలామణిని నియంత్రిస్తూ, భారత ప్రజల ప్రయోజనాలకనుగుణంగా కరెన్సీ చలామణితో పాటు, రుణ వ్యవస్థను నిర్వహించాలి''. ఈ ప్రవేశికలో ధరల స్థిరీకరణ ప్రత్యేకమైన నిర్దేశక సూత్రం కాకపోయినా, వివిధ దేశాలలో ధరల స్థిరీకరణ అయా దేశాల ద్రవ్య సరఫరా విధానంలో కీలకంగా నిర్వహింపబడుతున్న కారణంగా, భారతదేశ ద్రవ్యసరఫరా విధాన ధ్యేయాలలో ''ధరల స్థిరీకరణ, ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదక రంగాలకు తగినంతగా రుణ సరఫరానందించడం'' ప్రధాన అంశాలయ్యాయి. సారాంశంగా చెప్పుకోవాలంటే ''ధరల స్థిరీకరణ, ఆర్థిక వృద్ధి మధ్య సమతుల్యం సాధించడం'' భారతదేశ ద్రవ్య సరఫరా విధానంలో కీలకమైంది. అయా కాలమాన పరిస్థితులపై ఆధారపడి వాటి ప్రాధాన్యత ఉంటుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ తన ప్రకటనలో ఈ ప్రాధాన్యతలను వివరిస్తుంటుంది.

అదనపు ధ్యేయంగా ద్రవ్య రంగ సుస్థిరత

భారతదేశం అనుసరిస్తున్న స్వేచ్ఛా ఆర్థిక విధానాలు, ద్రవ్యరంగ సంస్కరణల నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంకు ధ్యేయాలలో ద్రవ్య రంగ సుస్థిరత అదనంగా చేరి ప్రాధాన్యతను సంతరించుకుంది. భారతదేశ పరిస్థితుల్లో ద్రవ్యరంగ సుస్థిరతను 3 అంశాలుగా విడగొట్టుకోవచ్చు. 1) ద్రవ్య లావాదేవీలను నిరాటంకంగా నిర్వహించడం, 2) ద్రవ్య వ్యవస్థలోని భాగస్వాములందరిలో విశ్వాసనీయతను నిలబెట్టడం, 3)ఉత్పాదక రంగాన్ని అకారణంగా నష్టపరిచే ఆర్థిక ద్రవ్య రంగ అనిశ్చితిని నివారించటం. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ ధ్యేయాలను సాధించటానికి ప్రయత్నిస్తుంది.

భారతదేశ మాధ్యమిక లక్ష్యంగా యం-3 ప్రమాణం

భారతదేశ ద్రవ్య సరఫరా విధానం అంతిమ ధ్యేయాల్ని చేరే క్రమంలో పరిస్థితులను బట్టి మాధ్యమిక లక్ష్యాన్ని (ఇంటర్మీడియేట్‌ టార్గెట్‌) నిర్ధేశించుకోవాల్సి వుంది. 1997-98 వరకు భారతదేశ ద్రవ్య సరఫరా విధానానికి విస్తృత ద్రవ్యం (బ్రాడ్‌ మనీ - యం.3) మాధ్యమిక లక్ష్యంగా ఉండేది. 1960లలో ద్రవ్యోల్బణాన్ని సంస్థాగత ప్రక్రియగా భావించేవారు. వ్యవసాయరంగ వైఫల్యాల మూలకంగా ద్రవ్యోల్బణం తీవ్ర అనిశ్చితికి గురౌతుండేది. ఆ రోజుల్లో ఎంచుకోబడ్డ రుణ నియంత్రణలకు అధిక ప్రాధాన్యత ఉండేది. ఉత్పాదకతను ప్రభావితం చేసే దిశలో బ్యాంకు రుణాలను ఒక ప్రక్క నియంత్రిస్తూ, మరోప్రక్క మార్కెట్‌లో స్పెక్యూలేషన్‌ పెరగకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ అదుపుచేసేది. బడ్జెట్లలో అత్యధిక ద్రవ్య లోట్ల మూలకంగానూ, చమురు షాక్‌ల వల్లనూ 1970లలో ద్రవ్యోల్బణం అదుపులేకుండా పెరిగిపోయింది. 1980ల తొలి సంవత్సరాలలో ద్రవ్యోల్బణ ప్రాధమిక కారణాలపై ఒక విస్తృత అవగాహన కుదిరింది. వ్యవసాయ వైఫల్యాలు, చమురు సంక్షోభాల కారణంగానే కాకుండా ఆర్థిక వ్యవస్థలో అత్యధికంగా చలామణిలో ఉన్న ద్రవ్యం కారణంగా కూడా ధరలు పెరుగుతాయని, అందుకనే 1960ల నుండి అధిక ధరల విజృంభణ కొనసాగుతుందనే వాదనలు బలం పుంజుకున్నాయి. ప్రభుత్వ బడ్జెట్‌లలో ప్రతిబింబించే అధిక ద్రవ్య లోటు భర్తి కోసం పెంచే ద్రవ్య చలామణి అధిక ద్రవ్యోల్బణానికి కారణమన్నది వారి వాదనల సారాంశం.

చక్రవర్తి కమిటీ (1985) సిఫార్సులు

పై అంశాన్ని అధ్యయనం చేయటానికి నియమించబడిన చక్రవర్తి కమిటీ 1985లో కొన్ని సిఫార్సులు చేసింది. ఈ సిఫార్సులలో భాగంగా ద్రవ్య సరఫరా విధాన లక్ష్య నిర్ధేశిత కార్యాచరణ ప్రణాళిక రూపొందించాల్సి వచ్చింది. ఎంచుకున్న ఉత్పాదకత వృద్ధికి అనుగుణంగా ద్రవ్య చలామణి పరిమితులపై రిజర్వ్‌ బ్యాంక్‌, కేంద్ర ప్రభుత్వం ఒక అంగీకారానికి రావాలని సిఫార్సు చేసింది. ధరల స్థిరీకరణలో ద్రవ్య చలామణి పాత్ర స్పష్టమైన నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంకు మాధ్యమిక లక్ష్యంగా బ్రాడ్‌మనీ (యం-3)ని ఎంచుకుంది. దీన్నే ''విస్తృత ద్రవ్యం'' అని కూడా అంటాం. ద్రవ్య సరఫరా చలామణిని కొలిచే ప్రమాణాలను యం-1, యం-2, యం-3 లుగా వర్గీకరించారు (కొన్ని దేశాలలో యం-0, యం-4లు కూడా అమలులో ఉన్నాయి).

యం-3 అంటే

యం-1 అనగా చలామణిలోను, కరెంటు ఖాతాలలోనూ ఉన్న ద్రవ్య పరిమాణం. దీన్నే నెరోమనీ (కుంచించిన ద్రవ్యం) అని అంటారు. చలామణిలో ఉన్న ద్రవ్యంతోపాటు కరెంటు, సేవింగ్స్‌ ఖాతాలలో ఉన్న ద్రవ్య పరిమాణాన్ని యం-2గా కొలుస్తారు. చలామణిలో ఉన్న ద్రవ్యం, కరెంటు సేవింగ్స్‌ ఖాతాలలో ఉన్న ద్రవ్యంతో పాటు దీర్ఘకాల డిపాజిట్లు, టైమ్‌ డిపాజిట్లు మరియు రెపోలలో ఉన్న ద్రవ్య పరిమాణాన్ని యం-3 గా కొలుస్తారు దీన్నే బ్రాడ్‌మనీ (విస్తృత ద్రవ్యం) అంటారు. చక్రవర్తి కమిటి సిఫార్సులకనుగుణంగా రిజర్వ్‌ బ్యాంక్‌ యం-3 ప్రమాణాన్ని మాధ్యమిక లక్ష్యంగా ఎంచుకుంది. దీని ప్రకారం ద్రవ్య చలామణిని నియంత్రించాల్సి వస్తే పైన పేర్కొన్న వివిధ రకాల ద్రవ్య చలామణిని సవరించాల్సి వుంటుంది. ఈ భావనలో ద్రవ్య సరఫరా విధాన అంచనాలు ఎంచుకున్న స్థూల దేశీయోత్పత్తికి, భరించగలిగే ద్రవ్యోల్బణ రేటుకు లోబడి ఉంటాయి. ఈ ప్రాతిపదికన చేపట్టిన చర్యలను వాటి పర్యవసానాల అనుభవంతో సవరించడం జరుగుతుంది.

బ్రాడ్‌మనీ (యం-3)కి మంగళం

1985-1998ల మధ్య కాలంలో ఈ మాధ్యమిక లక్ష్య సాధనకు నిల్వల (రిజర్వ్‌) నిధులను నిర్వహణ లక్ష్యంగాను, నగదు నిల్వల నిష్పత్తిని (సి.ఆర్‌.ఆర్‌) నిర్వహణ సాధనంగా వాడుకోవడం జరిగింది. 1991 వరకు రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్ల నియంత్రణ ఎంచుకున్న రుణ నియంత్రణలను మాధ్యమిక లక్ష్య సాధనకు సాధనాలుగా వాడుకుంది. అధిక ద్రవ్య లోట్లను స్థిరీకరించడానికి ఈ సాధనాలు ఉపయోగపడేవి. మార్కెట్‌లో ద్రవ్య చలామణి అధికంగా ఉన్నప్పుడు ప్రత్యక్షంగా వడ్డీ రేట్లను పెంచడం, రుణ సరఫరాను అదుపు చేయడంతో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు పూనుకొనేవారు. వీటి ద్వారా ద్రవ్య చలామణి తగ్గించడం జరిగేది. ప్రభుత్వ బాండ్‌లపై వచ్చే వడ్డీరేటు అతి తక్కువగా నిర్ణయింపబడి చట్టబద్ధ నిధుల లభ్యత నిష్పత్తులను (యస్‌.ఎల్‌.ఆర్‌) తరచూ పెంచుతూ ప్రభుత్వ బాండ్‌లకు గిరాకీ సృష్టింపబడేది. ఆర్థిక సరళీకరణ అనంతరం మాధ్యమిక లక్ష్యంగా వున్న బ్రాడ్‌మనీ (యం-3)కి స్వస్తి చెప్పడం జరిగింది.

No comments: