Monday, February 28, 2011

హెడ్జ్‌ ఫండ్స్‌ -- లక్షణాలు, ప్రభావాలు

సంపన్న వర్గాలు, సంస్థాగత మదుపుదారుల అవసరాలను తీరుస్తూ, ద్రవ్య వ్యవస్థలపై ప్రమాదకర ప్రభావాలను కల్గిస్తున్న హెడ్జ్‌ ఫండ్స్‌ లక్షణాలు ప్రభావాలను పరిశీలిద్దాం.

లక్షణాలు

హెడ్జ్‌ ఫండ్స్‌ కొద్ది అంశాలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ లక్షణాలు కలిగి వున్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌లో వలె మదుపు నిపుణులు మదుపు దార్ల నుండి ధనాన్ని సమీకరించి హెడ్జ్‌ నిధిని ఏర్పరుస్తారు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో వలె మదుపుదారులు ఫండ్‌ మధ్య కాలంలో కొన్ని పరిమితులకు లోబడి తమ మదుపు సొమ్మును వెనక్కు తీసుకోవటానికి వీలుంటుంది. ఇంతకు మించి మిగిలిన అన్ని అంశాలలో హెడ్జ్‌ ఫండ్‌ లక్షణాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌కు సరితూగవు.

1. మ్యూచువల్‌ ఫండ్స్‌ సాపేక్ష రాబడి (రెలెటీవ్‌ రిటర్న్స్‌) లక్ష్యంగా ఉండగా, హెడ్జ్‌ ఫండ్స్‌ ద్రవ్య మార్కెట్‌ పరిణామాలతో నిమిత్తం లేకుండా సర్వ కాల సర్వావస్థలలో అత్యధిక లాభాల్ని సంపాదించడమే ప్రధాన లక్ష్యంగా కలిగి వున్నాయి. వాటి లాభాలకు ఆకాశమే హద్దుగా ఉంది.

2. మ్యూచువల్‌ ఫండ్స్‌లో అధిక రిస్క్‌ కలిగిన మదుపు ప్రక్రియలు నిషేధింప బడగా, హెడ్జ్‌ ఫండ్స్‌కు అటువంటి ఆంక్షలేమీ లేవు. ఒక వేళ ఉన్నా అవి నామమాత్రంగానే ఉంటాయి. షేర్లు, బాండ్లు, ప్రవేటు భాగస్వామ్యాలు, కరెన్సీలు, రియల్‌ ఎస్టేట్‌లలో హెడ్జ్‌ ఫండ్‌లను మదుపు చేస్తారు. ప్రమాదకరమైన ప్యూచర్‌లు, శ్వాప్‌లు, ఆప్షన్‌లు లాంటి డెరివేటివ్‌లు సాధనంగా ఈ హెడ్జ్‌ ఫండ్‌లను వినియోగిస్తారు. అత్యధిక పరిమాణంలో ఒకే కంపెనీ/రంగంకు సంబంధించిన ఆస్థులలోను, రంగాలలోను వైవిధ్యం పాటించాల్సిన అగత్యంలేదు.

3. హెడ్జ్‌ ఫండ్స్‌ 3 రకాలుగా ఉంటాయి. అవి మ్యాక్రో ఫండ్స్‌, గ్లోబల్‌ ఫండ్స్‌, రిలెటివ్‌ ఫండ్స్‌. జాతీయ స్థూల ఆర్థిక, ద్రవ్య రంగ స్థితిగతుల్ని దృష్టిలో ఉంచుకొని మదుపు చేయబడే నిధుల్ని మ్యాక్రో ఫండ్స్‌ (స్థూల నిధులు) అని అంటారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ కంపెనీల పని తీరును ప్రమాణంగా తీసుకొని నిర్వహించ బడే నిధులను గ్లోబల్‌ ఫండ్స్‌ (ప్రపంచ నిధులు) అంటారు. తమకు చేరువలో ఉండే ట్రెజరీ బిల్లులు, బాండులు వగైరా మార్కెట్‌ స్థితిగతుల్ని ప్రమాణంగా తీసుకొని నిర్వహింపబడే నిధులను రెలెటీవ్‌ ఫండ్స్‌ (సాపేక్ష నిధులు) అంటారు. క్వాంటమ్‌ ఫండ్‌ వ్యూహమైన గ్లోబల్‌ మ్యాక్రో 1994 వరకు విసృతంగా వినియోగింపబడింది. ప్రపంచ హెడ్జ్‌ ఫండ్స్‌లో 70% ఈ వ్యూహాన్ని అనుసరించాయి. 1997 ఆసియా సంక్షోభం, 1998లోని లాంగ్‌ టరమ్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌ సంక్షోభం తరువాత గ్లోబల్‌ మ్యాక్రో వ్యూహం కేవలం 10%నికి పతనమైంది. ఆ స్థానంలో ప్రపంచ పరిణామాల ప్రేరేపిత వ్యూహం (ఈవెంట్‌ డ్రివెన్‌), దీర్ఘకాల/స్వల్పకాల ఈక్విటీ వ్యూహాలు ఊపందుకున్నాయి. ఈక్విటీ మార్కెట్‌ తటస్థ వ్యూహం కూడా మార్కెట్‌లో మంచి ఆదరణను పొందింది. 2000 సం||లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ షేర్‌ మార్కెట్‌ బుడగ బద్దలౌటంతో దీర్ఘకాల స్వల్పకాల ఈక్విటీ వ్యూహం ఆదరణను కోల్పోయింది. ఆ తరువాత కాలంలో బహుముఖ వ్యూహాలు (మల్టీస్ట్రేటజీస్‌), ప్రపంచ పరిణామాల ప్రేరేపిత వ్యూహాలు అమలుచేయబడ్డాయి.

4. హెడ్జ్‌ ఫండ్స్‌లో సంపన్న వర్గాలు, సంస్థాగత మదుపుదారులు మాత్రమే మదుపు చేయగలుగుతారు. సామాన్యులకు అవి అందని ద్రాక్షలే. 15 లక్షల డాలర్ల నికర ఆస్థులు లేదా గత రెండు సం||లుగా ప్రతి సంవత్సరం 2 లక్షల డాలర్లకు మించిన ఆదాయం కలిగిన మదుపు దారులకు మాత్రమే హెడ్జ్‌ ఫండ్స్‌లో ప్రవేశం ఉంటుంది. వీరు కనీసం 10లక్షల డాలర్లకు మించిన సొమ్మును మదుపు చేయాల్సి ఉంటుంది. సంపన్నులైన వ్యక్తులతో పాటు సంస్థాగత పెట్టుబడిదార్లకు ఇవి ప్రధాన నెలవులుగా ఉన్నాయి. హెడ్జ్‌ ఫండ్స్‌లో మదుపుదారుల సంఖ్య పరిమితంగా ఉంటుంది. అత్యధికంగా 500 మంది మదుపుదారులు కలిగిన హెడ్జ్‌ నిధులు చాలా అరుదుగా ఉంటాయి.

5. 2/20 ప్రాతిపదికన ఈ నిధులు నిర్వహింపబడతాయి. దీనర్ధం సంవత్సరానికి ఆస్థుల విలువలో 2% యాజమాన్య ఫీజు క్రింద, లాభాలలో 20% నిర్వహణ ఫీజు (పర్ఫార్మెన్స్‌ ఫీజు) క్రింద మదుపుదారులు చెల్లించాల్సి ఉంటుంది.

6. హెడ్జ్‌ఫండ్స్‌ ఏ రకమైన నియంత్రణకు కట్టుబడి ఉండవు. ఒకవేళ ఉన్నా అవి నామామాత్రంగా ఉంటాయి. ఇవి కేవలం ప్రవేట్‌ యాజమాన్యాలలోనే నిర్వహింపబడతాయి.

7. హెడ్జ్‌ ఫండ్స్‌లో నష్టాలను నిర్వాహకులు భరించరు. మదుపుదారులే భరించాల్సి వుంటుంది.

8. అత్యధిక లాభాలనార్జించటానికి పలు రకాల వ్యూహాలను హెడ్జ్‌ ఫండ్స్‌ అనుసరిస్తాయి. ఒక్కొక్క నిధికి ఒక్కొక్క వ్యూహం ఉంటుంది. హెడ్జ్‌ ఫండ్స్‌లో నిధి తరపున రుణాలను సేకరించే హక్కు నిర్వాహకులకు ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఈ రుణాలు మూలధనం కంటె అనేక రెట్లు ఉండవచ్చు. మదుపు సొమ్ముతో పాటు అరువు సొమ్ము నిధి పరిమాణాన్ని పెంచుతుంది. దీర్ఘకాల, స్వల్పకాల లావాదేవీల విక్రయాల వ్యూహాన్ని తరచు వాడుతుంటారు. స్వల్పకాల లావాదేవీల వ్యూహం వాడకం అత్యధికంగా ఉంటుంది.

9. ఈ నిధులలో హెడ్జ్‌ ఫండ్‌ మేనేజర్ల దక్షత కీలకమైనది. అందువలన వీరు అత్యథిక పరిహారం పొందుతుంటారు. సంక్షోభ సమయాలలో సైతం వీరి ఆదాయం అధికంగానే ఉంటుంది.

10. హెడ్జ్‌ ఫండ్స్‌ నిర్దిష్ట నిర్వచనాన్ని కోల్పోయాయి. హెడ్జింగ్‌ ప్రక్రియ మొత్తం నిధులలో 10% మించి లేదు.

11. హెడ్జ్‌ ఫండ్స్‌లో పారదర్శకత చాలా తక్కువగా ఉంటుంది. వీటికి సంబంధించిన సమాచారం, ప్యూహాలు గోప్యంగా ఉంచబడతాయి. అవినీతి ఆరోపణలు, నిధుల దుర్వినియోగం, ప్రాధాన్యతలలో సమతుల్యత లోపించడం అధికంగా ఉంటుంది.

ప్రభావాలు

1. ఆర్థిక రంగ ఒడుదుడుకులతో నిమిత్తం లేకుండా హెడ్జ్‌ ఫండ్స్‌ మిగిలిన ద్రవ్య సాధనాలకు భిన్నంగా అత్యధిక లాభాలను సంపాదించిన చరిత్ర గలిగియున్నాయి. ద్రవ్య మార్కెట్‌ దిగ్గజం జార్జి సొరొస్‌ యాజమాన్యంలో నిర్వహింపబడ్డ క్వాంటం ఫండ్స్‌ దశాబ్ధకాలం పాటు సంవత్సరానికి 30% కు మించిన లాభాలను పొందగలిగిందని గొప్పగా చెప్తారు.

2. హెడ్జ్‌ ఫండ్స్‌ ప్రమాదాలకు అతీతమైనవేవీ కావు. అత్యధిక రాబడులకోసం హెడ్జ్‌ ఫండ్స్‌ అనుసరిస్తున్న పద్ధతులు హెడ్జ్‌ ఫండ్స్‌నే కాకుండా ద్రవ్య వ్యవస్థ మొత్తాన్ని ప్రమాదాల్లో పడేస్తుంది. ఇందులో మదుపు చేయబడే పెన్షన్‌ నిధులు, ఇన్సురెన్స్‌ నిధులు, ప్రావిడెంట్‌ నిధులపై పడే దుష్ప్రభాలు తీవ్రంగా ఉంటున్నాయి. పరిమితమైన హెడ్జ్‌ ఫండ్‌ మదుపుదారుల ప్రయోజనాలకోసం జాతీయ ఆర్థిక వ్యవస్థలతో సహా విస్తృతమైన ద్రవ్య వ్యవస్థలను, అందులోని భాగస్వాములైన ప్రభుత్వాలు, ప్రజలు, రిటైర్డ్‌ ఉద్యోగులు మొదలైన వారిని దివాళా తీయించటానికి హెడ్జ్‌ ఫండ్స్‌ వెనుకాడవు. 1998లో ద్రవ్య రంగ దిగ్గజాల బృందంతో వాల్‌ స్ట్రీట్‌ వాణిజ్యవేత్త జాన్‌ మెరీ వెదర్‌ నాయకత్వంలోని లాంగ్‌ టరమ్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌ దివాలా తీసి ప్రపంచ ద్రవ్య వ్యవస్థలను ముంచేసింది. చివరకు వాల్‌స్ట్రీట్‌లోని పెద్ద పెద్ద బ్యాంకులు ఈ ద్రవ్య వ్యవస్థల్ని కాపాడాల్సి వచ్చింది. దీని ప్రభావంతోనే జార్జి సొరొస్‌ యాజమాన్యంలోని క్వాంటం ఫండ్‌ తీవ్ర నష్టాలకు గురై చివరకు మూసివేయాల్సి వచ్చింది.

3. 1997, 2000 సం||రాలలో ఏర్పడ్డ ద్రవ్య సంక్షోభాలలో హెడ్జ్‌ ఫండ్స్‌ పాత్ర ఉన్నట్టు చెప్తుంటారు. ఈ హెడ్జ్‌ ఫండ్స్‌ ద్వారా వివిధ ద్రవ్య వ్యవస్థలలోని కరెన్సీ విలువలను తారుమారు చేశారన్న ఆరోపణలు అధికంగా ఉన్నాయి. ఈ సంక్షోభాలకు మించిన స్థాయిలో 2008లోని ప్రపంచ ద్రవ్య సంక్షోభంలో హెడ్జ్‌ ఫండ్స్‌ ప్రభావం మరింతగా ఉన్నదనే వాదనలు బలంగా ఉన్నాయి. హెడ్జ్‌ ఫండ్‌లలో చోటుచేసుకున్న రుణాల లభ్యత ప్రక్రియ నిధుల పరిమాణాన్ని పెంచటంలోను, ఈ నిధుల్ని అత్యధిక రిస్క్‌ కలిగిన ద్రవ్య డెరివేటివ్‌లలో మదుపు చేయటం వల్ల హెడ్జ్‌ ఫండ్‌ల ప్రమాదం, అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిక్యతను చెలామణి చేసే పరిస్థితుల్లో వినాశకరంగా మారింది. ఇదే సందర్భంలో 2008లో వివిధ ఆర్థిక వ్యవస్థలు స్వల్ప కాల లావాదేవీల విక్రయాలపై నిషేధాల్ని ప్రకటించటంతో హెడ్జ్‌ ఫండ్‌లు సాధారణంగా అమలు పరిచే స్వల్పకాల లావాదేవీల విక్రయ వ్యూహాలు తల్లక్రిందులయ్యాయి. దీనితో 2008 సం||లో అనేక హెడ్జ్‌ ఫండ్‌లు దివాలా తీశాయి.

4. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు వీటిని సాధనంగా తీసుకొని వివిధ ద్రవ్య వ్యవస్థలలో వీర విహారం చేస్తున్నారు.

హెడ్జ్‌ ఫండ్స్‌ -- భారతదేశం

ప్రపంచీకరణ విధానాలలో భాగంగా హెడ్జ్‌ ఫండ్స్‌ భారతదేశంలో అడుగుపెట్టాయి. భారత ద్రవ్య వ్యవస్థలోని పార్టిసీపెటరీ నోట్సు మార్గంలో హెడ్జ్‌ ఫండ్స్‌ భారత ద్రవ్య వ్యవస్థలో పాతుకుపోయాయి. 2007-08 సం|| ద్రవ్య సరఫరా విధానం మన దేశంలో హెడ్జ్‌ ఫండ్స్‌ పెరుగుదలకు బాటలు వేశాయి. మన దేశంలో హెడ్జ్‌ ఫండ్స్‌ యాజమాన్యంలోని నికర నిధుల విలువ సుమారుగా 6 కోట్ల 80 లక్షల డాలర్లు ఉంటుంది. 2011లోని ఆర్థిక పరిస్థితులు హెడ్జ్‌ ఫండ్‌ పెరుగుదలకు అనుకూలంగా లేవు. హెడ్జ్‌ ఫండ్స్‌ పై ఉన్న సెబి ఆంక్షలు వాటిని నియంత్రించే స్థాయిలో లేవు. ప్రపంచ అనుభవాల నేపధ్యంలో హెడ్జ్‌ ఫండ్స్‌ కార్యకలాపాలకై ఒక కన్ను వేసి ఉండాల్సిన అవసరం అనివార్యమైంది. తస్మాత్‌ జాగ్రత్త.


No comments: