Monday, February 14, 2011

కొనుగోలు శక్తి సమతుల్యత - పరిచయం

( పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ)


వివిధ దేశాల ప్రజల జీవన ప్రమాణాలను పోల్చే ప్రక్రియలోను, అంతర్జాతీయ వాణిజ్య అంచనాలలోను, కరెన్సీ మారక విలువల గణింపులోను, ప్రపంచ బ్యాంకు పోల్చే వివిధ ఆర్థిక వ్యవస్థల తలసరి స్థూల దేశీయోత్పత్తి పద్ధతిలోను, ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఒ.యి.సి.డి.) తయారు చేసే అంతర్జాతీయ ఆర్థిక గణాంకాల సమాచారంలోను కొనుగోలు శక్తి సమతుల్యత (పర్చేజింగ్‌ పవర్‌ పారిటి-పిపిపి) ప్రాధాన్యతను కలిగి వుంది.

కొనుగోలు శక్తి సమతుల్యత సిద్ధాంతం

అంతర్జాతీయ వర్తకం అభివృద్ధి క్రమంలో సంప్రదాయ ఆర్థిక వేత్త డేవిడ్‌ రికాల్డో కాలంలో మొదటగా కొనుగోలు శక్తి సమతుల్యత సిద్ధాంతం ప్రతిపాదించబడినప్పటికీ 1918లో స్వీడిష్‌ ఆర్థిక వేత్త గుస్తవ్‌ కాసెల్ ఈ సిద్ధాంతానికి ప్రాచుర్యం తెచ్చారు. ''రెండు దేశాల కరెన్సీల మధ్య ఆయా దేశాల కొనుగోలు శక్తులు సమానంగా వుండే స్థాయిలో ఆ రెండు దేశాల కరెన్సీ మారకపు రేట్లు సమతుల్యంగా వుంటాయని కొనుగోలు సమతుల్యత సిద్ధాంతం (పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ-పిపిపి) చెపుతుంది.

వివరణ

రెండు దేశాల కరెన్సీ మారకపు రేట్లు అస్థిరంగా వున్నప్పుడు, ఆయా దేశాల మారకపు రేట్లు తదనంతర కాలంలో ఆయా దేశాల కొనుగోళ్ళ శక్తిపై ఆధారపడి వుంటాయన్నది ఈ సిద్ధాంతంలోని కీలక అంశంగా వుంది. ప్రతి దేశం యొక్క దేశీయ కరెన్సీ ఆ దేశంలోని కొన్ని సరుకులు/సేవలు కొనగలిగే శక్తితోపాటు, ఇతర దేశాలలోని సరుకులు/సేవల్ని కొనగలిగే శక్తి కలిగి వుంటాయి. అందువల్ల దేశీయ కరెన్సీ, విదేశీ కరెన్సీతో మారకపు విలువని కల్గి వుండటం అనివార్యమైంది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ అనివార్యత మరింత తీవ్రమైంది. ఈ క్రమంలో రెండు దేశాల కరెన్సీల సాపేక్ష కొనుగోళ్ల శక్తి విలువలు మారకపు విలువను ప్రభావితం చేస్తాయి. ఒక నిర్దిష్ట పరిమాణం గల సరుకులు వుదాహరణకు అమెరికాలో 100 డాలర్లుగాను, భారతదేశంలో 4500 రూపాయలుగా వున్నాయనుకుంటే 100 డాలర్ల కొనుగోలు శక్తి 4500 రూపాయల కొనుగోలు శక్తి తో సమానంగా వుంటుంది. అంటే ఒక డాలర్ కొనుగోలు శక్తి 45 రూపాయల కొనుగోలు శక్తితో సమతుల్యతను కలిగి వుంటుంది. ఈ క్రమంలో భారతదేశంలో 45 రూపాయలకు లభించే సరుకుల/సేవల పరిమాణం అంతకంటే ఎక్కువగా పెరుగ కలిగినప్పుడు భారతదేశ సరుకుల/సేవలకు గిరాకీ పెరుగుతుంది. అమెరికా డాలర్లు రూపాయలుగా మార్పిడి జరిగి భారతదేశ సరుకులు/సేవల కొనుగోళ్ళు పెరుగుతాయి. ఆ మేరకు అమెరికాలో ఆ సరుకుల/సేవలకు గిరాకి తగ్గి ఆ దేశంలో వాటి ధరలు తగ్గే అవకాశం వుంటుంది. గిరాకీ పెరగడంతో భారతదేశంలో సరుకుల ధరలు పెరిగే అవకాశం వుంటుంది. ఈ రెండు దేశాల కరెన్సీ విలువల మధ్య సమతుల్యతను సాధించేవరకు, మారకపు విలువలో మార్పు కొనసాగుతుందని, ఆ రెండు దేశాల కొనుగోళ్ళ శక్తి సమానమైనప్పుడు, ఆ రెండు దేశాల కరెన్సీల మధ్య మారకపు రేటు సమతుల్యతను సాధింపబడుతుందనేది ఈ సిద్ధాంతంలో గమనించాల్సిన అంశం. అంటే కొనుగోళ్ళ శక్తిలో జరిగే ప్రతిమార్పు, ఆయా దేశాల కరెన్సీ మారకపు విలువలో ప్రతిబింబిస్తాయి.

ప్రభావం

కొనుగోలు శక్తి సమతుల్యత సిద్ధాంతంలో దేశీయోత్పత్తి లెక్కింపు ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి వుంది. తలసరి స్థూల దేశీయోత్పత్తికి కేవలం మారకం విలువలలో వ్యక్తం చేసినపుడు, ఆ విలువల ఆ మారకపు రేట్లపై వుండే మార్కెట్‌ శక్తుల ప్రభావంపై ఆధారపడి వుండి, నిజమైన విలువ నిర్ధారణ జరుగదు. ఉదాహరణకు భారతదేశ రూపాయి మారకపు విలువ సగానికి పడిపోయిందనుకుంటే డాలర్లలో వ్యక్తం చేసిన స్థూల దేశీయోత్పత్తి సగానికి పడిపోతుంది. భారతదేశంలోని ప్రజలు మరింత పేదలయ్యారని ఈ పరిణామం సూచించినా, ఆచరణలో భారతదేశంలోకి ఆదాయాలు, ధరలకు వెచ్చించే రూపాయి విలువలో మార్పు లేనంతవరకు, పై నిర్ధారణ వాస్తవాన్ని ప్రతిబింబించలేదు. అందువల్ల కొనుగోళ్ళ శక్తి సమతుల్యత ప్రాతిపదికన కొలిచే తలసరి స్థూల జాతీయోత్పత్తి అంతర్జాతీయ ప్రమాణమైంది.

ముగింపు

కొనుగోలు శక్తి సమతుల్యత ప్రమాణంపై కొలిచే తలసరి స్థూల దేశీయోత్పత్తిపైన, కొనుగోలు శక్తి సమతుల్యతను డాలర్లలో వ్యక్తం చేయడంలోను అనేక విమర్శలు, వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలను ప్రతిబింబించడంలో కొనుగోలు శక్తి సమతుల్యత సిద్ధాంతం సమగ్రతను, వాస్తవికతను సాధించడం లేదు. అంతర్జాతీయ వాణిజ్యంలో వినియోగం మేరకే ఈ సిద్ధాంత పరిధి పరిమితమైంది.

No comments: