Sunday, December 27, 2009

వాయువిడుదలలు - జరిమానాలు

పర్యావరణ పరిరక్షణకు నడుంకట్టిన క్యోటో ఒప్పందాన్ని అటకెక్కించటానికే ''కొపెన్‌హగెన్‌ అంగీకారం'' కుదిరిందని, చట్టబద్ధత లేకున్నా దశాబ్ధాలుగా ప్రపంచ దేశాలు, శాస్త్రవేత్తలు శ్రమించి సాధించిన క్యోటో ఒప్పందంలోని విలువైన మౌళికాంశాల్ని నీరుకార్చడంలో సంపన్నదేశాలు సఫలమయినాయని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోపక్క కొపెన్‌హగెన్‌లో జరిగిన పర్యావరణ మార్పు సదస్సు అర్థాంతరంగా ముగిసి అభాసుపాలు కాకుండా తన చతురతతో కనీసం ఒక రాజకీయ ఒప్పందాన్నైనా కుదర్చగలిగానని అమెరికా అధ్యక్షులు బారక్‌ ఒబామా కీర్తించుకుంటున్నారు

క్యోటో ఒప్పందం-జరిమానాలు - సంపన్న దేశాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన గ్రీన్‌ హౌస్‌ వాయు విడుదలల కర్తవ్యాన్ని నిర్ధేశించి వర్థమాన దేశాలను ఆ వాయువిడుదలల తగ్గింపు బాధ్యత నుండి మినహాయించిన క్యోటో ఒప్పందంలోని కీలకాంశాన్ని, ''వాయు విడుదలల తగ్గింపు అందరి బాధ్యత'' అనే అంశంతో కొపెన్‌హగెన్‌ అంగీకారం తుడిపేసింది. క్యోటో ఒప్పందం చట్టబద్ధత కలిగినదైన, ఆ కాలానికి వాయువిడుదలల పరిమాణం లెక్కింపులో తగినంత సాంకేతిక అభివృద్ధిగాని, ఒప్పందనిర్ణయాలు అమలు చేయగల సంస్ధగత ఏర్పాట్లుగాని, జాతీయ కార్యాచరణలుగాని అంతగాలేవు కాని కొపెన్‌ హగన్‌ సదస్సు నాటికి, కొపెన్‌ హగన్‌ అంగీకారానికి చట్టబద్ధత లేకపోయినప్పటికి వాయువిడుదల పరిణామం లెక్కింపులో సాంకేతిక అభివృద్ధి, జాతీయ ప్రభుత్వాలు నిర్ణయాలను అమలు చేయగల సంస్ధాగత ఏర్పాట్లతో, సమాచారాన్ని పంచుకొనే జాతీయ కార్యాచరణను కల్గిఉన్నాయి. క్యోటో ఒప్పందంపై 2001లో బాన్‌లో జరిగిన 6వ వివిధ పక్షాల సమావేశంలో, వాయువిడుదలల తగ్గింపు లక్ష్యాన్ని సాధించని సంపన్న దేశాలపై విధించాల్సిన జరిమానాపై నిర్ణయం జరిగింది.

ఆ నిర్ణయం ప్రకారం ఏదైనా సంపన్న దేశం క్యోటో ఒప్పందం నిర్ధేశించిన వాయు విడుదలల తగ్గింపు లక్ష్యాన్ని, ఏదైన ఒక సంవత్సరంలో చేరలేకపోతే లోటైన వాయువిడుదలల పరిమాణానికి 130 శాతం మేరకు తదుపరి సంవత్సరంలో అదనంగా వాయువిడుదలలని తగ్గించాల్సిఉంటుంది. ఉదాహరణకు ఒక సంవత్సరంలో ఒక సంపన్నదేశం ఒక మెట్రిక్‌ టన్ను కార్బన్‌ వాయు పరిమాణం లక్ష్యం కంటే తగ్గితే, తదుపరి సంవత్సరం 1.3 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ వాయువిలువలలను అదనంగా తగ్గించాలి కాని ఈ వాయువిడుదలల తగ్గింపుపై విధించాల్సిన జరిమానా అమలుచేసే చట్టబద్ధ ప్రక్రియ ఏర్పాటు చేయటంలో నెలకొన్న లోపాలతో క్యోటో ఒప్పందం విఫలమైన కారణంగా సంపన్న దేశాలు బాహాటంగా వాయువిడుదలల తగ్గింపు లక్ష్యాల్ని ధిక్కరించాయి.

క్యోటో ఒప్పందంలో సంపన్న దేశాలకే పరిమితమైన ఈ జరిమానాలను, ''కొపెన్‌హగన్‌ అంగీకారం'' లో మారిన పరిస్థితులలో ''అంతర్జాతీయ సంప్రదింపులు మరియు విశ్లేషణ'' పేర వర్థమాన దేశాలపై వాయువిడుదలల తగ్గింపు నియంత్రణలను జరిమానాలను ఎక్కుపెట్టి, వాయువిడుదలల తగ్గింపు బాధ్యతల నుండితప్పుకోవటానికి సంపన్న దేశాలు సమాయత్తమవుతున్నాయి. కొపెన్‌హగన్‌ అంగీకారం కుదిరిన వెంటనే అమెరికా అధ్యక్షుడైన బారక్‌ ఒబామా సలహాదారుడు భారత్‌ చైనాలపై చేసిన వ్యాఖ్యలను ఈ దిశలో పరిశీలించాలి

లాభార్జనదుగ్ధతో సంపన్నదేశాలు- ''సమిష్ఠి లక్ష్యం వివిధ దేశాల విభిన్న బాధ్యతలు'' అనే పునాదిపై నిర్మించబడ్డ క్యోటో ఒప్పందం, కొపెన్‌హగన్‌ అంగీకారంలో ఆ పునాది ''సమిష్ఠి లక్ష్యం వివిధ దేశాల విభిన్న స్పందనలు'' గా మారిపోయింది.

కొపెన్‌హగన్‌ సదస్సు సందర్భంగా సంపన్న దేశాల వాయువిడుదలల లక్ష్యాల్ని ప్రభావితం చేయాలనే వ్యూహంతో అభివృద్ధి చెందుతున్న బేసిక్‌ దేశాలు (బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, ఇండియా, చైనా) క్యోటో ఒప్పందం ప్రకారం తమకు బాధ్యత లేకున్నా ఐచ్ఛికంగా వాయువిడుదలల తగ్గింపు లక్ష్యాన్ని ప్రకటించినప్పటికి, సంపన్న దేశాలు తాము ప్రకటించిన లక్ష్యాల్ని ఇసుమంతకూడా మార్పుచేయకుండా మొండిగా వ్యవహరించాయి. రెండు సంవత్సరాల క్రితం బాలీ కార్యాచరణ ప్రణాళికను ఒప్పుకున్న సంపన్న దేశాలు దాని స్పూర్తిని తుంగలో తొక్కాయి. సంపన్నదేశాలు ప్రకటించిన గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలల తగ్గింపులతో, గరిష్ఠ వాయువిడుదలల సంవత్సరం 2015 నాటికిగాని అమలుకాదని, అలా జరిగితే 2020 నాటికి వాతావరణ ఉష్ణోగ్రత 3డిగ్రీలు దాటి ప్రమాద ఘంటికల్ని మోగిస్తుందని సమావేశ సందర్భంగా ఐక్యరాజ్య సమితి రహస్య నివేదిక అభిప్రాయపడింది.

అంతేకాకుండా సదస్సు సందర్భంగా ప్రకటించిన వర్థమాన దేశాల వాయువిడుదలల తగ్గింపు పరిమాణం 5.2 బిలియన్‌ టన్నలుండగా సంపన్నదేశాల ప్రకటనల ప్రకారం వాయువిడుదలల తగ్గింపు పరిమాణం 2.1 నుండి 3.4 బిలియన్‌ టన్నులు మాత్రమే ఉన్నట్లు ఆ రహస్య నివేదిక భావించింది. గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలల ప్రభావం మానవాళిపై ఎంతో తీవ్రంగా ఉందని శాస్త్రవేత్తలు ఘోషించినా, సంపన్న దేశాలు లాభార్జనదుగ్ధతో అనుసరిస్తున్న నిర్లక్ష్య, బాధ్యతారహిత వైఖరిని ప్రపంచ ప్రజానికం ముందు ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వంచనను ప్రతిఘటించాలి- ''కొపెన్‌హగన్‌ అంగీకార పత్రంలో చట్టబద్ధమైన ఒప్పందం కుదుర్చుకోవటానికి గడువుతేదిగా డిసెంబర్‌ 2010ని ప్రకటించినా తుది పత్రంలో ఈ గడువు తేది తొలగించబడినట్లు తెలుస్తోంది. క్యోటో ఒప్పందంలో ఉన్న 1990 గరిష్ఠ వాయువిడుదలల సంవత్సరాన్ని సంపన్న దేశాలకు అన్వయించగా కొపెన్‌హగన్‌ అంగీకార పత్రంలో గరిష్ఠ వాయువిడుదలల ప్రస్థావన లేదు.ఈ అంశాన్ని సరిజేయటం ప్రపంచ దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం. అదే సందర్భంగా క్యోటో ఒప్పందంలోని వాయువిడుదలల తగ్గింపుపై సంపన్న దేశాలపై ఉన్న జరిమానాలు, చట్టబద్ధ అమలు తప్పనిసరిగా భవిష్యత్‌ ఒప్పందంలో ఉంటేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. జి 77 దేశాలతోను, చిన్న ద్వీపకల్ప దేశాలతోను కలసి బేసిక్‌ దేశాలు భవిష్యత్‌లో మెక్సికోలో జరిగే ఒప్పంద రూపకల్పనలో ఐక్యంగా పనిచేయాలి. స్థానిక ప్రయోజనాలకు బేసిక్‌ దేశాలు కక్కుర్తి పడితే విశ్వమానవ సంక్షేమానికి తీవ్రవిఘాతం ఏర్పడుతుంది. చరిత్ర క్షమించదు.

Sunday, December 20, 2009

గరిష్ట వాయు విడుదలల సంవత్సరం

త 12రోజులుగా పర్యావరణ మార్పుపై డెన్మార్క్‌ రాజధాని కొపెన్‌హాగన్‌ నగరంలో జరుగుతున్న ప్రపంచదేశాల సమావేశంలో 193దేశాల ప్రతినిధులు, అధినేతలు హాజరైనారు. క్యోటో సదస్సులో గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలల తగ్గింపుపై విధిగా కాలుష్యకారకులైన సంపన్నదేశాలు (ఎనేగ్జ్‌-1దేశాలు) అమలు చేయాల్సిన వాయు విడుదలల తగ్గింపు లక్ష్యాలను నిర్దేశించింది. అదే సమయంలో వర్ధమాన దేశాలను ఈ తగ్గింపు బాధ్యతనుండి మినహయించింది. ఈదేశాలు పర్యావరణ కాలూష్యానికి అనాదిగా కారణం కాదన్నది క్యోటో ఒప్పంద అవగాహన. దీనికి భిన్నంగా కోపెన్‌హెగెన్‌ సదస్సులో పరోక్షంగా చర్చించబడ్డ డెన్మార్క్‌ ముసాయిదా వర్ధమాన దేశాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఆ ముసాయిదాలో వర్దమాన దేశాలు కూడా ''గరిష్ట వాయు విడుదల సంవత్సరాన్ని'' పాటించాలనే అంశం వారి నిరసనలకు కారణమై, భారత్‌తో సహా నాన్‌ ఎనెక్స్‌-1 దేశాలు ఈ ముసాయిదాను ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. ''గరిష్ట వాయు విడుదలల సంవత్సరం'' అంటే ఏమిటి..., ఇది వివిధ దేశాల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే అంశాన్ని పరిశీలిద్దాం.


గరిష్ట వాయు విడుదలల సంవత్సరం

ఒక దేశ ఆర్ధిక వ్యవస్ధలో దశాబ్ధ కాలం వాయు విడుదల సగటును నిర్ధారణగా గరిష్ఠ వాయు విడుదల ప్రమాణాన్ని గుర్తిస్తారు. ఆలా గుర్తించిన గరిష్ఠ వాయు విడుదల సంవత్సరము నుండి ప్రతి సంవత్సరము ఒక నిర్దిష్ట ప్రమాణంలో వాయు విడుదలలను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గ్రీన్‌హౌస్‌ వాయువులు గరిష్ట స్ధాయిలో ఉండే సంవత్సరాన్ని ''గరిష్ట వాయు విడుదలల సంవత్సరం'' లేదా ''పీక్‌ ఇయర్‌ ఆఫ్‌ ఎమిషన్స్‌'' అని అంటారు. అంటే ఆ వాయువులను విడుదల చేసే శిలాజ ఇంధనాల వినియోగాన్ని గరిష్టంగా ఆ నిర్దిష్ట సంవత్సరానికి పరిమితం చేసి, ఆ తర్వాతి కాలంలో వాటి వినియోగాన్ని క్రమపద్ధతిలో తగ్గించడమే గరిష్ట వాయు విడుదలల సంవత్సర సారాంశం.

వర్దమాన దేశాలపై ప్రభావం...

పైన చెప్పుకున్నట్లు నిర్దిష్ట సంవత్సరానికి గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలను తగ్గించడ మంటే శిలాజ ఇందన వినియోగాన్ని తగ్గించడమే గాకుండా వాయు విడుదల తగ్గింపును అంగీకరించడమే. శిలాజ ఇంధనాల వాడకం తగ్గించడమంటే శిలాజ ఇంధనాల ద్వారా జరిగే ఉత్పత్తిని తగ్గించడం గానూ, లేదా ప్రత్యామ్నాయ పునరుద్ధరణ ఇంధనవనరులతో పారిశ్రామికోత్పత్తిని మార్చుకోవడంగా చూడాలి. ఇది చాలా వ్యయపూరితమైనది డెన్మార్క్‌ ముసాయిదా ప్రకారం వర్దమాన దేశాలు గరిష్ట వాయు విడుదలల సంవత్సరాన్ని పాటించాలంటే ఆ దేశాల వాయు విడుదలలపై పరిమితులు పెట్టడమే. ఇది క్యోటో ఒప్పంద స్పూర్తికి భిన్నమైనది.

ఉదాహరణకు భారతదేశంలో 80 శాతం ప్లాంట్‌లోడ్‌ ఫ్యాక్టర్‌ కలిగిన బొగ్గు ఆధారతి విద్యుత్‌ కేంద్ర స్ధాపనలు ఒక మెగావాట్‌కు రూ. 5 కోట్లు సరిపోతే, అదే సౌరశక్తితో కేవలం 25 శాతం ప్లాంట్‌లోడ్‌ ఫ్యాక్టర్‌తో ఒక మెగావాట్‌ విద్యుత్‌ కేంద్రానికి 20-25 కోట్ల రూపాయలు వ్యయం అవుతోంది. బొగ్గు ఆధారిత విద్యుత్‌ కేంద్ర సామర్థ్యానికి సమానమైన సౌరశక్తి విద్యుత్‌కేంద్ర స్థాపనకు బొగ్గు ఆధారితి కేంద్రం కంటే 12-15 రెట్టు అధికంగా పెట్టుబడి అవసరం అవుతోంది. అందుకనే వర్దమాన దేశాలు పర్యావరణ ముప్పు నుండి తట్టుకుని అభివృద్ధి చెందడానికి భారీస్థాయిలో పరిహారాన్ని, పరిజ్ఞానాన్ని సంపన్న దేశాల నుండి కోరుతున్నాయి. రియో సదస్సు సందర్భంగా క్యూబా మాజీ అధ్యక్షులు ఫైడల్‌ క్యాస్ట్రో ''ఈ పరిహారాన్ని సంపన్నదేశాలు, వర్దమానదేశాలకు చెల్లించాల్సిన బాకీ''గా అభివర్ణించారు.

కోపెన్‌హెగెన్‌ సదస్సులో ఆఫ్రికా దేశాల బృందం ఈ పరిహారం కింద షరతులు లేని 70 వేల కోట్ల డాలర్ల ఆర్థిక సహాయాన్ని కోరింది. అమెరికా ప్రతిపాదించిన 10 వేల కోట్లు, యూరోప్‌ ప్రతిపాదించిన వంద కోట్ల డాలర్ల లాంటి సంపన్నదేశాల సహాయం నామమాత్రమే. భారత్‌, చైనాలు 2005 స్థాయికి 2020లోగా వాయువిడుదలను తగ్గించాలనే ప్రతిపాదనలు ఐచ్ఛికంగా గరిష్టవాయు విడుదల సంవత్సరాన్ని అంగీకరించడమే.

సంపన్నదేశాలపై ప్రభావం...

గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలలోని కార్బన్‌డయాక్పైడ్‌ 1750 సంవత్సరం నాటికి 280 పిపిఎంలు ఉండగా 2004 నాటికి 387 పిపిఎంలు ఉంది. గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో 75% ఉన్న కార్బన్‌డయాక్సైడ్‌ ప్రధానంగా భూగోళ వాతావరణంలో ఉష్ణోగ్రత పెరగడానికి కారణభూతమవుతోంది. క్యోటో ఒప్పందంలో 1990 నాటి ఉష్ణోగ్రత కన్నా 2 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రత పెరిగితే మానవాళికి ముప్పుగా భావించారు. ఇందుకోసమే భూగోళ ఉష్ణోగ్రతలు 1990 నాటి ఉష్ణోగ్రతలకు 2 డిగ్రీలు మించకుండా కార్బన్‌ వాయువిడుదల తగ్గించాలని ప్రతిపాదించారు. అందువల్లే క్యోటో ఒప్పందం కాలుష్య వాయు విడుదలలకు ప్రధాన కారకులైన సంపన్న దేశాలు 1990 వాయు విడుదలల స్థాయి నుండి 2012లోగా 5.2 శాతం తగ్గించాలని ఉద్దేశించింది.

అంటే క్యోటో ఒప్పందం ప్రకారం సంపన్నదేశాలు 1990ని గరిష్ట వాయువిడుదల సంవత్సరంగా భావించాయి. కాని కోపెన్‌హెగెన్‌ సదస్సు నాటికి 5.2% వాయు విడుదల తగ్గింపు లక్ష్యం నిర్లక్ష్యం చేయబడింది. వాయువిడుదలలు మరింతగా 10% పెరిగాయి. ప్రస్తుత సదస్సు సందర్భంగా అమెరికా 2005 స్థాయి నుండి 17% వాయు విడుదలలను 2020కు తగ్గిస్తానంది. అంటే క్యోటో ఒప్పందం నిర్దేశించిన గరిష్ట వాయు విడుదలల సంవత్సరాన్ని మార్చడానికి అమెరికా తెగించింది. అదే సందర్భంలో ఈ ప్రతిపాదనను 1990 స్థాయి వాయు విడుదలలలో 3% కంటే లేదు. మిగిలిన సంపన్న దేశాల తీరు కూడా అటుఇటుగా క్యోటో ఒప్పంద లక్ష్యాల్ని నీరు గార్చేటట్టుగా ఉంది. గరిష్ట వాయు విడుదలల సంవత్సరాన్ని క్యోటో ఒప్పందంలోని 1990 నుండి 2005కు మార్చటం సంపన్నదేశాలకు ప్రయోజనకరం.

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ పర్యవసానంగా 1990 నుండి 2005 మధ్యకాలంలో అనేక సంపన్నదేశాలు వారి పారిశ్రామిక స్థావరాలను తరలించిన కారణంగా చైనా, భారత్‌, బ్రెజిల్‌, సౌత్‌ ఆఫ్రికా వంటి దేశాల కార్బన్‌ వాయు విడుదలల స్థాయి, తీవ్రత పెరిగింది. ఎనెక్స్‌-1 దేశాల సరసన ఈ దేశాలను చేర్చి గ్రీన్‌హౌస్‌ వాయువిడుదల బాధ్యతను దింపుకోవడానికి అమెరికా సారథ్యంలోని అనేక సంపన్న దేశాలు నడుంకట్టాయి.

అందుకనే కోపెన్‌హెగెన్‌ సదస్సులో క్యోటో ఒప్పందాన్ని అటకెక్కించడానికి సంపన్నదేశాలు చేయని ప్రయత్నం లేదు. సంపన్నదేశాలన్నీ కలిసి ఇప్పటివరకూ ప్రతిపాదించిన వాయు విడుదలల తగ్గింపులు భూగోళ వాతావరణ ఉష్ణోగ్రతలను 3డిగ్రీల నుండి 4డిగ్రీల వరకూ పెంచుతాయనే నిపుణుల అంచనా పరిస్థితుల తీవ్రతను తెలుపుతోంది. వాతావరణంలో ఒక డిగ్రీ పెరుగుదల భారతదేశంలో కనీసం 10% గోధుమల ఉత్పత్తితో పాటు ఇతర ఆహార పంటల దిగుబడులను తగ్గిస్తాయని, ఆహార భద్రతకు తీవ్ర విఘాతం తెచ్చిపెడతాయని ప్రముఖ వ్యవయసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్‌ స్వామినాథన్‌ అభిప్రాయపడుతున్నారు.

ముగింపు:- విశ్వ మానవ సౌభాగ్యానికి దోహదపడాల్సిన అమెరికా రియో సదస్సునుండి ప్రపంచ మానవాళి విధ్వంసానికి కారణమవుతున్న పర్యావరణ మార్పుపై క్రమం తప్పకుండా అనుసరిస్తున్న వైఖరిని కోపెన్‌హెగన్‌లో కూడా ప్రదర్శిస్తుంది. క్యోటో ఒప్పందంలో అమెరికా వైఖరితో నిమిత్తం లేకుండా మిగిలిన సంపన్నదేశాలు ఒప్పంద పరిపూర్తికి సహకరించగా కోపెన్‌హెగెన్‌లో అవి అమెరికాతో అంటకాగడం చూస్తున్నాం. క్యోటో ఒప్పందం అంపశయ్య ఎక్కకుండా వర్ధమానదేశాలన్నీ ఐక్యంగా కదలాలి.

Sunday, December 13, 2009

వాయు విడుదల కొలమానాలు

'పర్యావరణ మార్పు''పై కొపెన్‌హగెన్‌లో జరుగుతున్న శిఖరాగ్ర సదస్సుకు ముందే వివిధ దేశాలు ఆయా దేశాలలో కార్బన్‌ వాయువులను ఏమేరకు తగ్గించాలనుకుంటున్నాయో ప్రకటించాయి. భారతదేశం కూడా ఇంతవరకు తాను అనుసరిస్తూ సమర్ధిస్తున్న 'తలసరి వాయు విడుదలల'(పర్‌క్యాపిటా ఎమిషన్స్‌) స్థానంలో 'జిడిపి ఆధారిత కార్బన్‌వాయు విడుదలల తీవ్రత' ప్రాతిపదికగా 2005 స్థాయి నుండి 2020 నాటికి కార్బన్‌ వాయు విడుదలలను 20-25 శాతం తగ్గించుకునేందుకు ఐచ్ఛికంగా సంసిద్ధతను ప్రకటించింది. అంతకు ముందు ఇదే పద్ధతిలో చైనా 40-45 శాతానికి, అమెరికా 19 శాతానికి వాయువిడుదలల తగ్గింపుకు సిద్ధమైనట్లు ప్రకటించాయి. సంపన్న దేశాలపై వత్తిడి పెంచటానికే ఈ చర్య అని భారత్‌ వాదిస్తున్నది
అమెరికా వాయు విడుదలల నియంత్రణ దిశగా ముందడుగు ప్రయత్నాలు చేయకుండా వర్దమాన దేశాలన్నీ మరింతగా త్యాగాలు చేయాలని, ఏఏ దేశం ఎంత మేరకు నిర్దిష్టంగా వాయువు విడుదలలను తగ్గిస్తాయో ప్రకటించాలని వత్తిడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తలసరి వాయు విడుదలలు(పర్‌క్యాపిటా ఎమిషన్స్‌), జిడిపి ప్రేరిత వాయు విడుదలల తీవ్రత(ఎమిషన్‌ ఇన్‌టెన్సిటీ ఆఫ్‌ జిడిపి) అంశాలని పరిశీలిద్ధాం.

పూర్వరంగం: క్యోటో ఒప్పందం క్రింద ఎనెగ్జ్‌-1గా వర్గీకరించబడ్డ సంపన్న దేశాలు 1990 స్థాయి నుండి 5.2% విధిగా గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలల్ని తగ్గించుకోవాలి. కానీ ఈ లక్ష్య సాధనలో ఏ దేశమూ విజయవంతం కాలేకపోగా గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలల్ని మరింతగా పెంచి మానవ మనుగడకు ముప్పును తెచ్చాయి. ఎనెగ్జ్‌-1లో లేని దేశాలు ఐచ్ఛికంగా వాయువిడుదలల తగ్గింపు చర్యలు తీసుకోవచ్చు కానీ తగ్గింపు కోటాలు విధిగా పాటించనవసరం లేదు.

ఈ వాయువిడుదలల కోటాలను తలసరి వాయు విడుదలల తగ్గింపు పద్ధతిలోకానీ, జిడిపి ఆధారిత వాయు విడుదలల తీవ్రత తగ్గింపు పద్ధతిలోకానీ వ్యక్తం చేయవచ్చు. గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలలలో 75% కార్బన్‌ వాయు విడుదలలు ఉన్నందున వీటిపైనే కేంద్రీకరణ ఎక్కువగా ఉంటున్నది.

తలసరి వాయు విడుదలలు(పర్‌ క్యాపిటా ఎమిషన్స్‌): ఒక దేశం/ప్రాంతంలో విడుదలైన గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలల పరిమాణానికి, ఆ దేశ/ప్రాంత జనాభాకు మధ్య ఉన్న నిష్పత్తిని ''తలసరి వాయు విడుదల''లని అంటారు. అంటే ఆ దేశం/ప్రాంతంలో ఒక వ్యక్తిపై ఉన్న సగటు వాయువిడుదలల పరిమాణం ఇది. సాధారణంగా సంపన్న దేశాల వాయువిడుదలల సగటు పరిమాణం వర్ధమాన దేశాల కంటే 4 రెట్లకు మించి అధికంగా ఉంటుంది. ఉదాహరణకు అమెరికా తలసరి వాయు విడుదలలు 20.1 మెట్రిక్‌టన్నులుగా ఉంది. వర్దమాన దేశాల తలసరి వాయువిడుదలలో చైనా మొదటి స్థానంలో ఉంది.
2006లో ఆ దేశంలో 4.6 మెట్రిక్‌టన్నులు ఉన్న తలసరి వాయు విడుదలలు 2030కి 8.0 మెట్రిక్‌ టన్నులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అతి తక్కువ తలసరి వాయు విడుదలల దేశాలలో భారత్‌, ఆఫ్రికాలు ఉన్నాయి. భారత్‌లో 2006లో ఒక్కొక్క వ్యక్తిపై 1.1 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌వాయు పరిమాణం ఉంటే 2030 నాటికి 1.4 మెట్రిక్‌ టన్నులకు పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. ఆఫ్రికా దేశాలలో తలసరి వాయు విడుదలల స్థాయిలో 2006 నుండి 2030 వరకు మార్పు ఉండక పోవచ్చు.

డాలర్‌ జిడిపి ఆధారిత వాయు విడుదలల తీవ్రత: ఒక దేశంలో ప్రతి యూనిట్‌ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి డాలర్లలో) సంపదలో విడుదలయ్యే గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలల పరిమాణాన్ని ''జిడిపి ఆధారిత వాయు విడుదలల తీవ్రత'' అంటారు. స్థూల దేశీయోత్పత్తిలో ప్రారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, సేవా రంగాల భాగస్వామ్యం ఉంటుంది.
వీటిలో సేవారంగ అభివృద్ధి ద్వారా విడుదలయ్యే గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలలు నామమాత్రమే. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో వినియోగించే శిలాజ ఇంధనాల మూలకంగా ఉత్పన్నమయ్యే గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలలే పర్యావరణ మార్పుకు అపాయకరంగా పరిణమిస్తాయి. ఒక అంచనా ప్రకారం 2006లో ఒక మిలియన్‌ డాలరు జిడిపికి సంపన్న దేశాలలో 386 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ వాయు విడుదలల పరిమాణం ఉండగా, 2030 నాటికి 246 మెట్రిక్‌ టన్నులు ఉండవచ్చని లెక్కిస్తున్నారు.2005 నాటికి అమెరికా-475, జర్మనీ-330, జపాన్‌-328, ఫ్రాన్స్‌-214 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ తీవ్రతను కల్గిఉన్నాయి. ఇక్కడ కార్బన్‌ వాయు విడుదలల తగ్గింపు సామర్ధ్యం బాగా ఉన్నట్లు వారి అంచనా. అదే సందర్భంలో వర్ధమాన దేశాలలో 2006లో ఒక మిలియన్‌ డాలర్‌ జిడిపికి 624 మెట్రిక్‌ టన్నులు ఉన్న కార్బన్‌ వాయు విడుదలలు 2030 నాటికి 330 మెట్రిక్‌ టన్నులకు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.

2005 నాటికి చైనా-1046, భారత్‌-501 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ తీవ్రతను కల్గి ఉన్నాయి.2006లో వర్ధమాన దేశాలలో కార్బన్‌ వాయు విడుదలల పరిమాణం పెరగటానికి అనేక కారణాలు ఉన్నాయి. 1) సంపన్న దేశాల పారిశ్రామికోత్పత్తి వర్ధమాన దేశాలకు తరలడం, 2) సంపన్న దేశాలలో ఆర్ధికమాంద్యం పెరగటం, 3) సంపన్న దేశాల వినియోగపు సరుకులన్నీ వర్ధమాన దేశాలలో ఉత్పత్తి కావటం, 4) నయా ఉదారవాద విధానాల నేపధ్యంలో సంపన్న దేశాల జిడిపిలో అత్యధికంగా సేవారంగంపై ఆధారపడి ఉండటం. కానీ 2006వ సంవత్సరం పూర్వం సంపన్న దేశాల విచక్షణారహిత శిలాజ ఇంధనాల వినియోగం, విలాసవంత జీవనం, అడవుల నరికివేత లాంటి చర్యలు భూ ఖండంలో అత్యధిక ఉష్ణానికి కారణమైనాయి. వర్ధమాన దేశాల ప్రజానీకంపై తీవ్రమైన దుష్ప్రభావాల్ని కలిగిస్తున్నాయి.


విశ్లేషణ: పైన పేర్కొన్న వాయువిడుదలల కొలమాన పద్దతులను పరిశీలించినపుడు తలసరి వాయు విడుదలల పద్ధతి సంపన్న దేశాల ప్రయోజనాలకు ఆటంకంగా ఉంటుంది. అందువల్ల మన ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు మాంటెక్‌ సింగ్‌ అహుల్‌వాలియా ఈ అంశంపై మాట్లాడుతూ పాశ్చాత్య దేశాలు సహజంగా తలసరి వాయు విడుదలల పద్ధతిని వ్యతిరేకిస్తారు కాబట్టి జి.డి.పి ఆధారిత వాయు విడుదలల తీవ్రతా పద్ధతిని అనుసరించడం శ్రేయస్కరమన్నారు. సంపన్న దేశాల కొమ్ముగాసే ఈ వాదనలే భారత్‌ లాంటి దేశాలను సంపన్న దేశాల ఉచ్చులోకి లాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో తలసరి వాయు విడుదలల పద్ధతి వర్దమాన పేద దేశాలు సంపన్న దేశాల నుండి పరిహారాన్ని, పరిజ్ఞానాన్ని రాబట్టుకోవటానికి నైతిక బలాన్ని అందిస్తుంది. భారత్‌ ప్రదర్శిస్తున్న తాజా వైఖరి సామ్రాజ్యవాద దేశాలకు ముందుగానే లొంగిపోవటమే కాకుండా వర్దమాన దేశాల ప్రయోజనాలకు భంగకరంగా కూడా ఉంది. ఈ వైఖరిని భారత్‌ పునరాలోచించుకొవాల్చిన అవసరం ఎంతైనా ఉంది.

Monday, December 7, 2009

డాలర్‌ బదిలీ వాణిజ్యం (డాలర్‌ క్యారీ ట్రేడ్‌)

ప్రపంచ రిజర్వ్‌ కరెన్సీగా చలామణి అయి, వివిధ దేశాల ఆర్ధిక వ్యవస్ధలను గత మూడు దశాబ్దాలుగా శాసించిన అమెరికన్‌ డాలర్‌ ఇటివలీ కాలంలో తీవ్రంగా బలహీన పడింది. బలహీన పడ్డ అమెరికన్‌ డాలర్‌ను పెట్టుబడిగా మార్చుకొని విపరీతమైన లాభార్జన నెరుపుతున్న వాణిజ్యమే ''డాలర్‌ బదిలీ వాణిజ్యం'' గా పేరు పొందింది. డాలర్‌ బలహీనపడిన కొద్దీ, బంగారం, ఆయిల్‌, సరుకులు, ఈక్విటీల మార్కెట్లు జోరుగా పెరుగుతున్నాయి. డాలర్‌ పటిష్టంగా వున్న 2008 సం||లో యీ జోరు ఇంతగా లేదు. సాధారణంగా దేశ ఆర్ధికాభివృద్ధితో బాటుగా విదేశీ మారక విలువ పెరుగుదలను మంచి లక్షణంగా చూస్తాము.

ఇటీవలి కాలంలో అమెరికాతో పాటు ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్ధలు ద్రవ్య సంక్షోభం నుండి కోలుకుంటున్న వేగం కంటే, అమెరికాలోనే కాకుండా, చైనా, భారత్‌, బ్రెజిల్‌ తదితర అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉపందుకున్న ఫైనాన్షియల్‌ మార్కెట్ల వేగం అర్ధశాస్త్ర మౌళిక సూత్రాలకతీతంగా ఉంది. అమెరికా డాలర్‌ బలహీన పడ్డ కొద్దీ, అంతర్జాతీయ పెట్టుబడుల మార్కెట్‌లు శరవేగంతో దూసుకుపోతున్నాయి. ఈ వేగాన్ని సృష్ఠిస్తున్న ప్రక్రియే ''కరెన్సీ బదిలీ వాణిజ్యం''. డాలర్ల ఆధారంగా జరిగేది ''డాలర్‌ బదిలీ వాణిజ్యం''.

కరెన్సీ బదిలీ వాణిజ్యం అంటే

''తక్కువ వడ్డీ రేటుకు లభ్యమయ్యే కరెన్సీ నిధులను అత్యధిక లాభాలనార్జించే విదేశీ కరెన్సీ లోని పెట్టుబడి సాధనాలలో పెట్టుబడి పెట్టె వ్యూహాన్ని'' ''కరెన్సీ బదిలీ వాణిజ్యం'' అంటారు. ఉదాహరణకు 1 శాతం వడ్డీ రేటుతో జపాన్‌ బ్యాంకు నుండి యెన్‌ల రూపంలో అప్పు తీసుకొని ఆసొమ్మును 4 శాతం వడ్డీరేటు గల అమెరికన్‌ డాలర్‌ బాండ్లలో పెట్టుబడి పెడితే రెండు దేశాల విదేశీ మారక విలువలలో మార్పు లేనంత కాలం 3 శాతం వడ్డీ లాభంగా మిగులుతుంది. దీనితోపాటే విదేశీ కరెన్సీ మారక విలువలు పెరిగేటట్లయితే లాభాల రేటు ఇంకా పెరుగుతుంది. అదే సందర్భంలో విదేశీ, స్వదేశీ కరెన్సీ మారక విలువలలో ఎగుడుదిగుడులుంటే ఆదాయాలు తారుమారవుతాయి. లాభాలైనా, నష్టాలైనా ఫలితం తీవ్రంగా ఉంటుంది. నయా ఉదారవాద విధానాల సృష్ఠి ''కరెన్సీ బదిలీ వాణిజ్యం''.

వెలిగి పోతున్న అంతర్జాతీయ ఫైనాన్స్‌ మార్కెట్లు

1980, 1995, 2006, 2008 సంవత్సరాలలో జపాన్‌లో సంభవించిన ఆర్ధిక సంక్షోభాల నేపథ్యంలో జపాన్‌ 'ఎన్‌' మారక విలువ క్షీణించిన దశలో జపాన్‌ పెట్టుబడీదారులు అతి తక్కువ వడ్డీకి లభించిన యెన్‌లను అధిక విదేశీ మారక విలువగల విదేశీ ఫైనాన్స్‌ మార్కెట్లలో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు గడించారు. ''యెన్‌ బదిలీ వాణిజ్యం'' యింతవరకు పెట్టుబడి మార్కెట్లకు చౌకబారునిధుల వనరుగా వున్నది. దాని స్ధానంలో డాలర్‌ నేడు ఈ దుస్ధితికి దిగజారింది. అమెరిగాలో ఇటీవలి ద్రవ్య సంక్షోభం నుండి బయటపడేందుకు అమలుచేస్తున్న ఉద్దీపన పధకాలతో ద్రవ్య లభ్యత (లిక్విడిటి) విపరీతంగా పెరిగింది. సున్నా కంటే అతి తక్కువ శాతం వడ్డీ రేట్లకు ఫెడరల్‌ రిజర్వ్‌, ఇన్‌వెస్ట్‌మెంట్‌ బ్యాంకుల ద్వారా అందిస్తున్న ఋణాలను కార్పోరేట్‌ సంస్ధలు తమ దేశంలోనే కాక చైనా, భారత్‌, బ్రెజిల్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఫైనాన్షియల్‌ మార్కెట్లలో అత్యధికంగా పెట్టుబడులుగా పెడుతున్నాయి. దీనితో అంతర్జాతీయ ఫైనాన్స్‌ మార్కెట్‌ వెలిగి పోతున్నట్లు పెట్టుబడిదారులు ప్రచారం చేస్తూ ప్రజలలో భ్రమలు కల్పిస్తున్నారు. నిజ ఆర్ధిక వ్యవస్ధకు మళ్ళుతున్న నిధులు మాత్రం నామమాత్రం గానే ఉన్నాయి.

కరెన్సీ బదిలీ వాణిజ్యం ప్రభావాలు

కరెన్సీ బదిలీ వాణిజ్యం లో పెట్టుబడిగా పెట్టె కరెన్సీ మారక విలువ క్షీణత ఎక్కువ కాలం కొనసాగితే పెట్టుబడిదారుల లాభాలు అమితంగా ఉంటాయి. స్పెక్యులేషన్‌ కూడా అపరిమితంగా ఉంటుంది. అమెరికా అనుసరిస్తున్న ఈ తరహా కరెన్సీ విధానాల్ని (మానిటరీ పాలసీలు) ప్రపంచ దేశాలన్నీ అనుస రించాల్సిన దుస్ధితి ఏర్పడింది. అమె రికాలోని గృహరుణాల సంక్షోభం చేదు అనుభవాలు స్మృతి పథంనుండి తొలగక మునుపే, డాలర్‌ బదిలీ వాణిజ్యం ఆధారంగా ఫైనాన్షియల్‌ మార్కెట్‌ రంగంలోని స్పెక్యులేటర్లు అమితమైన దురాశతో. ''ఫైనాన్షియల్‌ రంగ బుడగ''ను అంతులేకుండా పెంచుతున్నారు. అమెరికన్‌ ఆర్ధిక నిపుణులు ప్రొఫెసర్‌ నౌరియేల్‌ రౌబీనీ యీ పరిమాణాల పట్ల వ్యాఖ్యానిస్తూ, ''సుధీర్ఘకాలం కొనసాగే డాలర్‌ బదిలీ వాణిజ్యంలో వాణిజ్య బుడగ పేలడం అనివార్యమని'' హెచ్చరించారు అమెరికా డాలర్‌ ధర ఏదోసమయానికి పెరగాల్సిందే. ఆ పరిణామమే వాణిజ్య బుడగ పగలటానికి కారణమౌతుందనేది అయన హెచ్చరిక సారాంశం. విధ్వంసాన్ని సృష్టించగలిగే వీటి పర్యవసానాలు. ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తున్నాయి.

డాలర్‌ భయాలు

సబ్‌ ప్రైం సంక్షోభ సూత్రధారులైన మెరిల్‌ లించ్‌, గోల్డ్‌ మాన్‌ సాచ్స్‌ లాంటి కార్పోరేట్‌ సంస్ధలు డాలర్‌ బదిలీ వాణిజ్య రూట్‌లో విదేశీ స్టాక్‌, బాండ్‌ల మార్కెట్‌లలో పెట్టుబడులు పెట్టి 40-60% లాభాలు ప్రకటించుకున్నారు. ఈ పెట్టుబడి ప్రవాహాలు అభివృద్ధి చెందుతున్న దేశాలను ముంచేస్తున్నాయి. ఆయా దేశాల కరెన్సీ మారక విలువలను ప్రభావితం చేసే పరిస్థితులు ఆయాచితంగా మీద పడుతున్నాయి. రాబోయే పరిణామాలను అధిగమించటానికి బ్రెజిల్‌ స్టాక్‌, బాండ్‌ల మార్కెట్‌లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహాలపై 2 శాతం పన్ను విధించింది. ఇటీవల జరిగిన జి-20 దేశాల ప్రధాన మంత్రుల సమావేశంలో బ్రిటన్‌ ప్రధాని గోర్డాన్‌ బ్రౌన్‌ విదేశీ చౌకబారు పెట్టుబడుల లావాదేవీలపై టోబిన్‌ పన్ను విధించాలని ప్రతిపాదించారు భారతదేశంలో దొడ్డిదారిన విదేశీ అనిశ్చితి పెట్టుబడులను ఆకర్షించే పార్టీసిపేటరీనోట్లను నిషేదించాలనే డిమాండ్‌ పార్లమెంట్‌లో లేవనెత్తారు.

కొన్ని ఆసియా దేశాలు డాలర్‌ బదిలీ వాణిజ్య దుష్పరిణామాలను ఎదుర్కొనేందుకు దేశీయ విధానాల మార్పుకు సమాయత్తం అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో అమెరికా అధ్యక్షులు బారక్‌ ఓబామా చైనా పర్యటన సందర్భంగా, ఆదేశ బ్యాంకింగ్‌ రంగ నియంత్రణాధికారి లియు మింకాంగ్‌, చౌక బారు పెట్టుబడుల ప్రోత్సాహంతో అమెరికా అనుసరిస్తున్న అభద్రమైన కరెన్సీ విధానాల్ని తీవ్రంగా విమర్శించారు. జర్మనీ నూతన ఆర్ధిక మంత్రి ఉల్ఫ్‌ గ్యాంగ్‌ షఉబుల్‌, అనారోగ్య స్పెక్యులేటివ్‌ ధోరణలను పెంచే డాలర్‌ బదిలీ వాణిజ్యాన్ని దుయ్యబట్టారు.

ముగింపు

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, పెట్టుబడి అంగ నిర్మాణంలో మార్పులు తేవటమే కాకుండా లాభాల రేటు కాపాడుకోవడానికి పలు నూతన మార్గాలను, రంగాలను ముందుకు తెస్తున్నది. ఇవన్నీ ఉత్పాదక రంగంతో నిమిత్తంలేని స్పెక్యులేటివ్‌ రంగాలే. అటువంటివాటిలో ఒకటి కరెన్సీ క్యారి ట్రేడ్‌. ఈ అంశంపై జరుగుతున్న తాజా చర్చ పెట్టుబడిదారి ఆర్ధిక వ్యవస్ధ ఎంతగా సంక్షుభిత మయ్యిందో నిరూపించే మరో ఉదాహరణ మాత్రమే. నయా వుదారవాద విధానాలు, కరెన్సీ (మానిటరీ) విధానాలతోనే ఆర్ధిక రుగ్మతల్ని నివారించాలనుకుంటే ఫలితం ఇలానే ఉంటుంది. ఒక రోగానికి మందు వేస్తే, మరో రోగం ముదురుతున్నది.

పర్యావరణ ఒప్పందాలు: అమలు తీరు

భూ వాతావరణంలో మితిమీరిన గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలలతో భూగోళం వేడెక్కి (గ్లోబల్‌వార్మింగ్‌) తీవ్ర పరిణామాలకు దారితీస్తు న్నాయి. ఈ సమయంలోనే డిసెంబర్‌ నెలలో డెన్మార్క్‌ దేశంలోని కొపెన్‌హగెన్‌ నగరంలో ''పర్యావరణ మార్పు''పై అంతర్జాతీయ సమావే శం జరుగనున్నది. పర్యావరణ పరిరక్షణపై 1997లో ఏర్పరచుకున్న ''క్యోటో ఒప్పంద'' కాలపరిమితి 2012తో ముగియనుండటంతో, దాని స్థానంలో వివిధ దేశాల మధ్య నూతన ఒప్పందం కుదరాల్సి ఉంది.

పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలు: అభివృద్ధికీ, పర్యావరణానికీ మధ్య ఉన్న సంబం ధం గురించిన అధ్యయనాలు 1960 దశకంలో ప్రారంభమైనాయి. 1964లో స్థాపించిన ''అంతర్జాతీయ జీవసంబంధ కార్యక్రమం (ఇంటర్‌నేషనల్‌ బైలాజికల్‌ ప్రోగ్రామ్‌) పర్యా వరణానికి, అభివృద్ధికి మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించింది. 1969లో పర్యావరణ సమస్యల శాస్త్రీయ కమిటీ (సైన్టిఫిక్‌ కమిటీ ఆన్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ప్రాబ్లమ్స్‌) ఏర్పాటు చేయబడింది. 1971లో 'మానవుడు మరియు జీవావరణ కార్యక్రమం' (మాన్‌ అండ్‌ బయోస్ఫియర్‌ ప్రోగ్రామ్‌) అన్న కార్యక్రమాన్ని 'యునెస్కో' చేపట్టింది. ఈ దశకంలోనే ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సమావేశంలో సమర్పించిన 'ధనిక దేశాల అభివృద్ధి నమూ నా'పై వర్ధమాన దేశాలు తీవ్ర అభ్యంతరాల్ని వ్యక్తం చేశాయి. ఈ నమూనా వర్ధమాన దేశాల ప్రయోజనాలను రక్షించలేవన్న నిర్ధారణకు వచ్చాయి.

ఐక్యరాజ్యసమితి 1972లో స్టాక్‌ హోమ్‌లో నిర్వహించిన మానవ పర్యావరణ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ''మన్నికయ్యే అభివృద్ధి'' (సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌) ఎజెండాను రంగం మీదకు తెచ్చింది. పర్యా వరణ పరిరక్షణకు లోబడిన ఆర్థిక, సామాజిక అభివృద్ధే మన్నికయ్యే అభివృద్ధిగా నిర్వచించారు. ''మన్నికయ్యే అభివృద్ధి''పై చర్చల నడుమ ''గ్లోబల్‌ వార్మింగ్‌'' తొలి హెచ్చరికలు మొదలయ్యాయి. వాతావరణ మార్పు మానవ సమాజం మొత్తాన్ని సమిష్టిగా భయాందోళనలకు గురి చేస్తున్న సమస్యగా ఐక్యరాజ్య సమితి 1988లో తీర్మా నించింది. విస్తృత స్థాయిలో వివిధ దేశాలలోని శాస్త్రవేత్తలు, పర్యావరణ వాదులు, విధాన నిపుణులతో ''పర్యావరణ మార్పుపై అంతర్జా తీయ ప్యానల్‌ (ఇంటర్‌ గవర్నమెంటల్‌ ప్యానల్‌ ఆన్‌ క్లైమెట్‌ ఛేంజ్‌)''ను నియమించి ''వాతావరణ మార్పు-ముప్పు''పై నివేదికను సమర్పించమంది.

ఆ ప్యానల్‌ సమర్పించిన మొదటి నివేదికే నవంబర్‌ 1990లో జెనివాలో జరిగిన మొదటి ప్రపంచ పర్యావరణ సమావేశ చర్చలకు ప్రాతి పదిక అయ్యింది. ఈ సమావేశమే 1992లో జరిగిన ధరిత్రి సదస్సులో ''వాతావరణ మార్పు పై అంతర్జాతీయ అవగాహనా ఒప్పందానికి (ఇంటర్‌నేషనల్‌ ఫ్రేమ్‌ వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమెట్‌ ఛేంజ్‌)'' భూమికను ఏర్పాటు చేసింది.

ధరిత్రి సదస్సు: 'ఐక్యరాజ్యసమితి పర్యా వరణం, అభివృద్ధి' సమావేశం జూన్‌ 1992లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగింది. వాతావరణ మార్పు దుష్ప్రభావాలపైన, పర్యా వరణ పరిరక్షణపైన ప్రపంచవ్యాప్త దృష్టిని మళ్ళించిన చారిత్రాత్మక సదస్సు ఇది. ప్రపంచ వ్యాప్తంగా 178 దేశాల నుండి వేలాది మంది అధినేతలు, ప్రభుత్వేతర సంస్థలు, సామాజిక కార్యకర్తలు, పత్రికా ప్రతినిధులు హాజరైన మొట్టమొదటి సదస్సు ఇది. పర్యావరణ పరిరక్షణ ప్రస్థానానికి పునాదిగా నిలిచిన ''ఇంటర్నేషనల్‌ ఫ్రేమ్‌ వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమెట్‌ ఛేంజ్‌'' ఈ సదస్సులోనే రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్త పర్యావరణ పరిరక్షణ చర్యల్ని ఈ సంస్థే అజమా యిషీ చేస్తున్నది. ఈ సందర్భంగానే ''గ్లోబల్‌ ఫోరమ్‌'' పేరుమీద వందలాది ప్రభుత్వేతర సంస్థలతో సమాంతర అనధికార సమావేశం కూడా జరిగింది.

ధరిత్రి సదస్సు మూడు విశాల లక్ష్యాలపై కేంద్రీకరించింది. 1) పర్యావరణ అభివృద్ధి, పరిరక్షణ ధ్యేయంగా సూత్రీకరించబడ్డ అధికార పత్రాన్ని తయారు చేయటం. 2) మన్నికయ్యే అభివృద్ధి సాధనకు ప్రపంచవ్యాప్త కార్యాచరణను నిర్ధేశించి ఎజెండా-21ని రూపకల్పన చేయటం. 3) వర్ధమాన దేశాల్లో మన్నికయ్యే అభివృద్ధి సాధించటానికి అభివృద్ధి చెందిన దేశాల నుండి నిధులు, ప్రత్యామ్నాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించటం. ఈ సదస్సులో అమెరికా తదితర సంపన్న దేశాలు, బహుళజాతి సంస్థలు శిలాజ ఇంధనాల లాబీయిస్టులు, చమురు, ఇంధన కంపెనీల ప్రతినిధులు అనేక అడ్డంకులు, చిక్కుల్ని సృష్టించారు. పర్యావరణ పరిరక్షణపై ప్రపంచ దేశాల కర్తవ్యాన్ని నిర్ధేశించే 27 సూత్రాల ''రియో సదస్సు'' ప్రకటనను నీరుకార్చ డానికి అమెరికా శతవిధాలా ప్రయత్నించింది. పర్యావరణ పరిరక్షణకు సదస్సు ప్రతిపాదించిన ''ఎజెండా 21'' పేర కార్యాచరణపై దాదాపు ఏకాభిప్రాయం కుదిరింది.

పర్యవసానంగా మన్నికయ్యే అభివృద్ధి కమీషన్‌, పర్యావరణ మార్పు కమీషన్‌, జీవవైవిధ్య కమీషన్‌లాంటి అంతర్జా తీయ సంస్థలు ఆవిర్భవించాయి. భూగోళ కౌన్సిల్‌, మన్నికయ్యే అభివృద్ధికి సంబంధించిన వాణిజ్య కౌన్సిల్స్‌ కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అయితే వాణిజ్య కౌన్సిల్‌లో 48 బహుళజాతి కార్పొరేట్‌ కంపెనీల ముఖ్యనిర్వహణాధికారులు సభ్యులుగా ఉండటంతో ''ఐక్యరాజ్యసమితి పర్యావరణం, అభివృద్ధి సంస్థ''ను కార్పోరేట్‌ శక్తులు హస్తగతం చేసుకున్నట్లయింది.

ఆకట్టుకున్న క్యాస్ట్రో ప్రసంగం: ఈ నేపధ్యం లో క్యూబా అధ్యక్షులైన ఫైడల్‌ క్యాస్ట్రో సదస్సు నుద్ధేశించి చేసిన ప్రసంగం ప్రపంచ దేశాలను విశేషంగా ఆకట్టుకుంది. పర్యావరణ పరి రక్షణలో సంపన్న దేశాలు చేయాల్సిన ఆర్ధిక సహాయాన్ని వర్ధమాన దేశాలకు ''బాకీ పడిన అప్పు''గా అభివర్ణిస్తూ, ''ప్రపంచ జనాభాలో 1/5వ వంతు ఉన్న సంపన్న దేశాలు ప్రపంచ ఖనిజాల్లో 2/3వ వంతు, ఇంథనాల్లో 3/4వ వంతు అనుభవిస్తున్నారు. వాళ్ళు సముద్రాల్ని, నదుల్ని విషమయం చేస్తున్నారు. గాలిని కాలుష్యపరుస్తూ ఓజోన్‌ పొరను బలహీనపర్చి బొక్కలు పొడుస్తున్నారు. వాతావరణాన్ని కలుషిత వాయువులతో నింపి మానవాళిని వాటి దుష్ప్రభావల బారికి నెట్టివేశారు. వాళ్ళ స్వార్ధం, ఆధిపత్యం, బాధ్యతారాహిత్యం, వంచన, మొద్దుబారిన తనం ఇక చాలు. ఎప్పుడో మనం నిర్వర్తించాల్సిన కర్తవ్యాన్ని రేపటి నుండి చేయాలనుకోవటమే చాలా ఆలస్యంగా ప్రారం భించిన కార్యాచరణ'' అని వర్ధమాన దేశాలకు తక్షణ కర్తవ్య బోధన చేస్తూ సంపన్న దేశాలను తీవ్రంగా హెచ్చరించారు.

రియో సదస్సు, తదనంతర పరిణామాలు: గ్రీన్‌హౌస్‌ వాయువుల అపాయకర స్థాయి నుండి వాతావరణ వ్యవస్థను రక్షించటమే లక్ష్యమని రియో సదస్సు ప్రకటనలోని ఆర్టికల్‌-2 ఉద్బోదించింది. వాతావరణ కాలుష్య కారకులు సంపన్న, పారిశ్రామిక దేశాలైనందున, 2000 నాటికి ఆ దేశాల కాలుష్య వాయు విడుదలల్ని 1990 స్థాయికి తగ్గించాలని సదస్సు అభిప్రా యపడింది. అభివృద్ధి చెందిన దేశాలకూ, వర్థమాన దేశాలకూ ''ఉమ్మడిగానే అయిన విభిన్న బాధ్యతలు'' ఉన్నాయంటూనే అందులో అభివృద్ధి చెందిన దేశాల బాధ్యత ప్రధానమని, వర్థమాన దేశాలకు సంపన్న దేశాలు ఆర్ధిక పరిహారాన్ని ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందచేయాలని ఈ సదస్సు నిస్సంకోచంగా స్పష్టపరిచింది. అయితే కాలుష్య కారకులైన సంపన్న దేశాలు ఎంత మోతా దులలో తమ వాయు విడుదలలను తగ్గించు కోవాలి, అందుకు ఏ ఏ పద్ధతులు పాటించాలి అన్న ఆచరణాత్మక అంశాలపై సదస్సులో ఏకాభిప్రాయం కుదరలేదు.

అంతేకాకుండా ఎజెండా 21 అమలుకు కావలసిన నిధుల సేకరణలో సంపన్న దేశాలు సహకరించలేదు. దాంతో రియో సదస్సు పర్యావరణ పరిరక్షణలో విజయం పొందలేకపోయింది. మళ్ళీ 1995లో బెర్లిన్‌లో జరిగిన అంతర్జాతీయ సమావేశంలో గ్రీన్‌హౌస్‌ వాయువిడుదల అదుపుకు కట్టుబడి ఉండాలనే తీవ్ర ఆకాంక్షను ''బెర్లిన్‌ మాన్‌డేట్‌''గా వివిధ దేశాలు ప్రకటించాయి. బెర్లిన్‌ సమావేశంలో భారత్‌, చైనా, ఇండోనేషియా, మలేషియా, బ్రెజిల్‌లాంటి దేశాలు కలుషిత వాయు విడుదలల్ని 20శాతం తగ్గించుకో వటానికి అంగీకరించగా అమెరికా తీవ్రమైన సహాయ నిరాకరణ ధోరణిని ప్రదర్శించింది.ఈ కాలంలోనే ''గాట్‌''పై ఉరుగ్వే చర్చలు కొలిక్కి వచ్చాయి. 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భవించింది.

క్యోటో ఒప్పందం: రియో సదస్సు అవగా హనలో ఉన్న లోపాలను సవరించి, పర్యావరణ చర్చలను అర్ధవంతంగా మార్చే లక్ష్యంతో తదుపరి చర్చలు జరిగాయి. బెర్లిన్‌ సమావేశం తరువాత 1997 డిసెంబర్‌లో జపాన్‌లోని క్యోటో నగరంలో జరిగిన 'అంతర్జాతీయ పర్యా వరణ, అభివృద్ధి సమావేశం' మరోసారి పర్యా వరణ పరిరక్షణపై కార్యాచరణకు పూనుకుంది. క్యోటో ఒప్పందం ప్రపంచ దేశాల్ని రెండు శ్రేణులుగా విభజించింది. నిర్ధిష్ట కోటా ప్రాతి పదికన గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలను నియం త్రించాల్సిన దేశాలను ఎనెగ్జ్‌ 1 దేశాలుగాను, మిగిలిన దేశాలను ఇతర దేశాలుగాను పరిగణించింది. ఎనెగ్జ్‌1లో 37 సంపన్న దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు 2008 నుండి 2012 మధ్య 1990 నాటి ఆ దేశ గ్రీన్‌హౌస్‌ వాయు విడుదల స్థాయి నుండి 5% తగ్గించాలని సదస్సు నిర్ణయించింది. మిగిలిన దేశాలు కలుషిత వాయువిడుదలపై 2012 వరకు ఏ రకమైన ఆంక్షలు విధించరాదని నిర్ణయించింది.

అదే సందర్భంలో సంపన్న దేశాలు క్యోటో ఒప్పంద బాధ్యతలను నెరవేర్చటానికి రెండు విధాలైన అవకాశాలనిచ్చింది. మొదటిది కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకోగలిగే అడవులను అభివృద్ధి చేయటం, అడవుల నరికివేతను నిరోధించటం. రెండవది - క్యోటో ఒప్పందం క్రింద ప్రత్యేకంగా రూపొం దించిన ''సరళ యంత్రాంగాన్ని'' (ఫ్లెక్స్‌బుల్‌ మెకానిజం) వినియోగించుకోవడం. ఈ సరళ యంత్రాంగంలో భాగంగా కార్బన్‌ వాణిజ్యం అనేది అభివృద్ధి చెందింది.

కార్బన్‌వాయు విడుదలను మారకం చేసుకునే యంత్రాంగానికి 'క్లీన్‌ డెవలప్‌మెంట్‌ మెకానిజం' అని పేరుపెట్టారు. ఈ యంత్రాం గం నిర్వహణకు ఒక ఎగ్జిక్యూటీవ్‌ బోర్డు ఉంటుంది. దీని ప్రకారం కార్బన్‌ వాయువులను అదుపు చేసే సందర్భంలో ప్రతి మెట్రిక్‌టన్ను వాయువుకు ఒక యూనిట్‌ క్రెడిట్‌ ఇస్తారు. కార్బన్‌ వాయువులను అదుపు చేయగలమేరకు క్రెడిట్‌ యూనిట్ల సంఖ్య పెరుగుతుంది. ఈ రకంగా ఆర్జించిన కార్బన్‌ క్రెడిట్‌లను క్యోటో ఒప్పంద పరిధిలోని అభివృద్ధి చెందిన దేశాలకుగానీ, ఆ దేశాల కంపెనీలకుగానీ వర్ధమాన దేశాలు లేదా ఆ దేశాల కంపెనీలు మార్కెట్‌ ధరకు అమ్ము కోవచ్చు. ఈ విధమైన క్రెడిట్‌ యూనిట్ల వాణిజ్యం కార్బన్‌ ట్రేడింగ్‌గా ప్రసిద్ధికెక్కింది. కార్బన్‌ వాణిజ్యంలో కార్బన్‌ క్రెడిట్‌లను అధికంగా కొనగలిగే సంపన్న వర్గాలకు భూ వాతావరణాన్ని కలుషితం చేయడానికి హక్కు సంక్రమిస్తున్నది. అంటే భూపైన గల వాతావరణం కూడా ప్రైవేటీకరించబడుతుంది.

2006లో 3000 కోట్ల డాలర్లున్న కార్బన్‌ వాణిజ్యం ప్రస్తుతం లక్ష కోట్ల డాలర్లకు మించి పోయింది. ఈ వాణిజ్యంలో స్పెక్యులేషన్‌ పెంచే ఫ్యూచర్‌లు, ఆప్షన్‌లులాంటి డెరివేటీవ్‌లు ప్రవేశిం చాయి. ఫైనాన్షియల్‌ రంగంలో డెరివేటీవ్‌లు సృష్టించిన విలయాన్ని భవిష్యత్‌లో కార్బన్‌ వాణిజ్యంలో సృష్టించబోతున్నాయని పర్యావరణ ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

మొత్తం మీద చూసినప్పుడు నేడు ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భావంతోనూ, నయా ఉదా రవాద విధానాలతోనూ సంపన్న దేశాల ప్రత్యక్ష పెట్టుబడులు, బహుళజాతి సంస్థలు వర్ధమాన దేశాల పారిశ్రామిక వ్యవస్థలలో ప్రవేశిస్తూ ఆయా దేశాల శిలాజ ఇంధన వినియోగాన్ని మరింత పెంచుతున్నాయి. దీనితో చైనా, భారత్‌, బ్రెజిల్‌లాంటి వర్ధమాన దేశాలలో గ్రీన్‌హౌస్‌ వాయు విడుదల కేంద్రీకరణ పెరుగుతోంది. దీని వల్ల వాయువిడుదలను తగ్గించాలనే లక్ష్యం నెరవేరటం లేదు. కార్బన్‌ క్రెడిట్‌ కొనుగోలుతో సంపన్న దేశాలలో తగ్గాల్సిన కార్బన్‌ వాయువుల పరిమాణం అక్కడ తగ్గకుండా వర్ధమాన దేశాల్లో తగ్గుతోంది. సంపన్న దేశాలు శిలాజ ఇంధనాల వినియోగాన్ని పెంచకుండా తగ్గించినప్పుడు మాత్రమే వర్ధమాన దేశాలలోని కార్బన్‌ పరిమాణం తగ్గుదల వాతావరణంపై అనుకూల ప్రభావాన్ని కలిగిస్తుంది. కానీ కార్బన్‌ ట్రేడింగ్‌ ప్రక్రియలో తక్కువ వ్యయంతో లభిస్తున్న కార్బన్‌ కొనుగోలుతో సంపన్న దేశాలు శిలాజ ఇంధనాల వినియోగాన్ని మరింత పెంచుతూ వాతావ రణాన్ని కలుషితం చేస్తున్నాయి.

క్యోటో ఒప్పందానికి అడ్డంకులు: 184 దేశాల భాగస్వామ్యం కలిగిన క్యోటో ఒప్పందం 2005 నుండి అమలులోకి వచ్చింది. క్యోటో ఒప్పందపు భాగస్వామ్య దేశాల సమావేశాలు (కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌) 1995 నుండి 2008 వరకు 14 సార్లు ప్రపంచంలోని వివిధ ప్రాంతా ల్లో జరిగాయి. 2009 సమావేశం కొపెన్‌ హగెన్‌లో జరగనున్నది. రియో సదస్సుకు భిన్నంగా గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలపై నిర్ధిష్ట నియంత్రణ ప్రక్రియను రూపొందించి సంపన్న దేశాలను అందుకు బాధ్యుల్నిగా చేయటంలో క్యోటో ఒప్పందం పురోగతిని సాధించింది. అదే సందర్భంలో సంపన్నేతర దేశాలను వాయు విడుదల పరిమితుల నుండి మినహాయించడం లో కూడా ఇది న్యాయంగానే వ్యవహరించింది. రియో ధరిత్రి సదస్సులో అనేక అడ్డంకులను సృష్టించిన అమెరికా క్యోటో సదస్సులోనూ అడ్డంగానే నిలిచింది.

1998నాటి సమావేశం లో అమెరికా అధ్యక్షుడైన బిల్‌క్లింటన్‌ క్యోటో ఒప్పందంపై సంతకం చేయటానికి సిద్ధమైనా, ఆ దేశ సెనెట్‌ అందుకు ఆమోదించలేదు. వర్ధమాన దేశాల వాయువిడుదలలపై ఆంక్ష లుండాలనే సాకుతో 2001లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జార్జ్‌బుష్‌ క్యోటో ఒప్పందం నుండి వైదొలుగుతూ పరిశీలకుడిగా ఉంటామని ప్రకటించాడు. వింతైన విషయ మేమంటే ఇప్పటికీ అమెరికాలోని శాస్త్రవేత్తల, ఆర్ధికవేత్తల లాబీ ఒకటి వాతావరణ మార్పు దుష్ప్రభావాలు సత్య దూరాలని వాదిస్తూనే ఉన్నది.

స్టెర్న్‌ రిపోర్టు: ప్రపంచబ్యాంకు మాజీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఆర్ధికవేత్త లార్డ్‌ నికోలస్‌ స్టెర్న్‌ బ్రిటీష్‌ ప్రభుత్వ ఆదేశాలపై క్యోటో ఒప్పందంపై అక్టోబర్‌ 2006లో నివేదికను సమర్పించాడు. ఆయన కార్బన్‌ ట్రేడింగ్‌తోపాటు కార్బన్‌ టాక్స్‌ విధింపును ప్రతిపాదించాడు. ప్రపంచ దేశాల స్థూల దేశీయోత్పత్తిలో 1% వెచ్చిస్తే వాతావరణ మార్పు దుష్ప్రభావాల నుండి ప్రపంచాన్ని రక్షించవచ్చన్నాడు.

మన్నికయ్యే అభివృద్ధి సాధ్యమేనా?: 2007 నాటికి ఎనెగ్జ్‌-1 దేశాలు వాయు విడుదలల్ని 1990 స్థాయిలో 5% తగ్గించాలనిక్యోటో ఒప్పందం నిర్దేశించింది. కాని ఈ దేశాలు విడుదలను తగ్గించకపోగా 1990 తో పోలిస్తే 10% పెంచాయి. అమెరికాల 17% పెంచింది. ఈ నేపధ్యంలో 2002లో జోహె న్స్‌బర్గ్‌లో 'మన్నికయ్యే అభివృది' (సస్టయినబుల్‌ డెవెలప్‌మెంట్‌)పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సదస్సు, ఎజెండా-21 అమలుకు అంతర్జాతీయ కమీషన్‌కు మార్గదర్శకాలను నిర్ధేశించింది. 2003లో ఈ కమీషన్‌ మార్గదర్శకాల అమలుకు ప్రతి దశకు 2 ఏళ్ల వ్యవధితో ఏడంచెల కార్యాచరణను రూపొందించింది. ఈ కార్యా చరణ 2004-05లో మొదలై 2016-17కు పూర్తి కావాలని నిర్ణయించింది. పేదరిక నిర్మూ లన, స్త్రీ పురుష సమానత్వం, విద్య వైద్య రంగా ల అభివృద్ధి, ప్రకృతి వనరుల సంరక్షణ కేంద్రం గా అమలు కావాల్సిన ఈ పథకాలు ఇంత వరకు సామాన్య ప్రజానీకానికి నిర్ధిష్టమైన ప్రయో జనాల్ని కల్గించలేదు.

2050 నాటికి కనీసం 40% మేరకు (1990 స్థాయి నుండి)విడుదలల్ని తగ్గించగలిగి నప్పుడే మానవ జాతి క్షేమంగా ఉంటుందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సంపన్న దేశాలు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయి. వ్యవసా యం, ఆహారం, ఇంధన సంక్షోభాలు దగ్గరలోనే పొంచి వున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆచరణలో సంపన్న దేశాలు చిత్తశుద్ధితో వ్యవహరించకపోవటంతో క్యోటో ప్రొటోకల్‌ లక్ష్యాలు సాధింపబడలేదు. కొపెన్‌హగెన్‌ సదస్సు తేదీలు దగ్గర పడినకొద్దీ వివిధ దేశాలు ప్రపంచ వాణిజ్య సంస్థ చర్చల తరహాలో గ్రూపులుగా ఏర్పడి తమతమ ప్రయోజనాల్ని ముందుకు తేవ టంతో సన్నాహక సమావేశాలలో ఏకాభిప్రాయం కుదరటం లేదు. ఈ పరిస్థితిని అదునుగా తీసు కొని అమెరికా, వివిధ వర్ధమాన దేశాలతో పర్యావరణ పరిరక్షణ ఒప్పందాలపై ద్వైపాక్షిక చర్చలకు సిద్ధమైంది. వాతావరణ మార్పు ముప్పు ప్రపంచ వ్యాప్తమైంది. విడివిడి ఒప్పందాల్తో ఉమ్మడి కృషిని భగం చేయటమే కాకుండా పర్యావరణ పరిరక్షణలో ఇంత వరకు సాధిం చిన ప్రయోజనాలు నీరుకారతాయి. కొపెన్‌హగెన్‌ సదస్సు పర్యావరణ పరిరక్షణలో పాత సవాళ్ళనే ఎదుర్కోబోతున్నది