Sunday, December 27, 2009

వాయువిడుదలలు - జరిమానాలు

పర్యావరణ పరిరక్షణకు నడుంకట్టిన క్యోటో ఒప్పందాన్ని అటకెక్కించటానికే ''కొపెన్‌హగెన్‌ అంగీకారం'' కుదిరిందని, చట్టబద్ధత లేకున్నా దశాబ్ధాలుగా ప్రపంచ దేశాలు, శాస్త్రవేత్తలు శ్రమించి సాధించిన క్యోటో ఒప్పందంలోని విలువైన మౌళికాంశాల్ని నీరుకార్చడంలో సంపన్నదేశాలు సఫలమయినాయని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోపక్క కొపెన్‌హగెన్‌లో జరిగిన పర్యావరణ మార్పు సదస్సు అర్థాంతరంగా ముగిసి అభాసుపాలు కాకుండా తన చతురతతో కనీసం ఒక రాజకీయ ఒప్పందాన్నైనా కుదర్చగలిగానని అమెరికా అధ్యక్షులు బారక్‌ ఒబామా కీర్తించుకుంటున్నారు

క్యోటో ఒప్పందం-జరిమానాలు - సంపన్న దేశాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన గ్రీన్‌ హౌస్‌ వాయు విడుదలల కర్తవ్యాన్ని నిర్ధేశించి వర్థమాన దేశాలను ఆ వాయువిడుదలల తగ్గింపు బాధ్యత నుండి మినహాయించిన క్యోటో ఒప్పందంలోని కీలకాంశాన్ని, ''వాయు విడుదలల తగ్గింపు అందరి బాధ్యత'' అనే అంశంతో కొపెన్‌హగెన్‌ అంగీకారం తుడిపేసింది. క్యోటో ఒప్పందం చట్టబద్ధత కలిగినదైన, ఆ కాలానికి వాయువిడుదలల పరిమాణం లెక్కింపులో తగినంత సాంకేతిక అభివృద్ధిగాని, ఒప్పందనిర్ణయాలు అమలు చేయగల సంస్ధగత ఏర్పాట్లుగాని, జాతీయ కార్యాచరణలుగాని అంతగాలేవు కాని కొపెన్‌ హగన్‌ సదస్సు నాటికి, కొపెన్‌ హగన్‌ అంగీకారానికి చట్టబద్ధత లేకపోయినప్పటికి వాయువిడుదల పరిణామం లెక్కింపులో సాంకేతిక అభివృద్ధి, జాతీయ ప్రభుత్వాలు నిర్ణయాలను అమలు చేయగల సంస్ధాగత ఏర్పాట్లతో, సమాచారాన్ని పంచుకొనే జాతీయ కార్యాచరణను కల్గిఉన్నాయి. క్యోటో ఒప్పందంపై 2001లో బాన్‌లో జరిగిన 6వ వివిధ పక్షాల సమావేశంలో, వాయువిడుదలల తగ్గింపు లక్ష్యాన్ని సాధించని సంపన్న దేశాలపై విధించాల్సిన జరిమానాపై నిర్ణయం జరిగింది.

ఆ నిర్ణయం ప్రకారం ఏదైనా సంపన్న దేశం క్యోటో ఒప్పందం నిర్ధేశించిన వాయు విడుదలల తగ్గింపు లక్ష్యాన్ని, ఏదైన ఒక సంవత్సరంలో చేరలేకపోతే లోటైన వాయువిడుదలల పరిమాణానికి 130 శాతం మేరకు తదుపరి సంవత్సరంలో అదనంగా వాయువిడుదలలని తగ్గించాల్సిఉంటుంది. ఉదాహరణకు ఒక సంవత్సరంలో ఒక సంపన్నదేశం ఒక మెట్రిక్‌ టన్ను కార్బన్‌ వాయు పరిమాణం లక్ష్యం కంటే తగ్గితే, తదుపరి సంవత్సరం 1.3 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ వాయువిలువలలను అదనంగా తగ్గించాలి కాని ఈ వాయువిడుదలల తగ్గింపుపై విధించాల్సిన జరిమానా అమలుచేసే చట్టబద్ధ ప్రక్రియ ఏర్పాటు చేయటంలో నెలకొన్న లోపాలతో క్యోటో ఒప్పందం విఫలమైన కారణంగా సంపన్న దేశాలు బాహాటంగా వాయువిడుదలల తగ్గింపు లక్ష్యాల్ని ధిక్కరించాయి.

క్యోటో ఒప్పందంలో సంపన్న దేశాలకే పరిమితమైన ఈ జరిమానాలను, ''కొపెన్‌హగన్‌ అంగీకారం'' లో మారిన పరిస్థితులలో ''అంతర్జాతీయ సంప్రదింపులు మరియు విశ్లేషణ'' పేర వర్థమాన దేశాలపై వాయువిడుదలల తగ్గింపు నియంత్రణలను జరిమానాలను ఎక్కుపెట్టి, వాయువిడుదలల తగ్గింపు బాధ్యతల నుండితప్పుకోవటానికి సంపన్న దేశాలు సమాయత్తమవుతున్నాయి. కొపెన్‌హగన్‌ అంగీకారం కుదిరిన వెంటనే అమెరికా అధ్యక్షుడైన బారక్‌ ఒబామా సలహాదారుడు భారత్‌ చైనాలపై చేసిన వ్యాఖ్యలను ఈ దిశలో పరిశీలించాలి

లాభార్జనదుగ్ధతో సంపన్నదేశాలు- ''సమిష్ఠి లక్ష్యం వివిధ దేశాల విభిన్న బాధ్యతలు'' అనే పునాదిపై నిర్మించబడ్డ క్యోటో ఒప్పందం, కొపెన్‌హగన్‌ అంగీకారంలో ఆ పునాది ''సమిష్ఠి లక్ష్యం వివిధ దేశాల విభిన్న స్పందనలు'' గా మారిపోయింది.

కొపెన్‌హగన్‌ సదస్సు సందర్భంగా సంపన్న దేశాల వాయువిడుదలల లక్ష్యాల్ని ప్రభావితం చేయాలనే వ్యూహంతో అభివృద్ధి చెందుతున్న బేసిక్‌ దేశాలు (బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, ఇండియా, చైనా) క్యోటో ఒప్పందం ప్రకారం తమకు బాధ్యత లేకున్నా ఐచ్ఛికంగా వాయువిడుదలల తగ్గింపు లక్ష్యాన్ని ప్రకటించినప్పటికి, సంపన్న దేశాలు తాము ప్రకటించిన లక్ష్యాల్ని ఇసుమంతకూడా మార్పుచేయకుండా మొండిగా వ్యవహరించాయి. రెండు సంవత్సరాల క్రితం బాలీ కార్యాచరణ ప్రణాళికను ఒప్పుకున్న సంపన్న దేశాలు దాని స్పూర్తిని తుంగలో తొక్కాయి. సంపన్నదేశాలు ప్రకటించిన గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలల తగ్గింపులతో, గరిష్ఠ వాయువిడుదలల సంవత్సరం 2015 నాటికిగాని అమలుకాదని, అలా జరిగితే 2020 నాటికి వాతావరణ ఉష్ణోగ్రత 3డిగ్రీలు దాటి ప్రమాద ఘంటికల్ని మోగిస్తుందని సమావేశ సందర్భంగా ఐక్యరాజ్య సమితి రహస్య నివేదిక అభిప్రాయపడింది.

అంతేకాకుండా సదస్సు సందర్భంగా ప్రకటించిన వర్థమాన దేశాల వాయువిడుదలల తగ్గింపు పరిమాణం 5.2 బిలియన్‌ టన్నలుండగా సంపన్నదేశాల ప్రకటనల ప్రకారం వాయువిడుదలల తగ్గింపు పరిమాణం 2.1 నుండి 3.4 బిలియన్‌ టన్నులు మాత్రమే ఉన్నట్లు ఆ రహస్య నివేదిక భావించింది. గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలల ప్రభావం మానవాళిపై ఎంతో తీవ్రంగా ఉందని శాస్త్రవేత్తలు ఘోషించినా, సంపన్న దేశాలు లాభార్జనదుగ్ధతో అనుసరిస్తున్న నిర్లక్ష్య, బాధ్యతారహిత వైఖరిని ప్రపంచ ప్రజానికం ముందు ఎండగట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

వంచనను ప్రతిఘటించాలి- ''కొపెన్‌హగన్‌ అంగీకార పత్రంలో చట్టబద్ధమైన ఒప్పందం కుదుర్చుకోవటానికి గడువుతేదిగా డిసెంబర్‌ 2010ని ప్రకటించినా తుది పత్రంలో ఈ గడువు తేది తొలగించబడినట్లు తెలుస్తోంది. క్యోటో ఒప్పందంలో ఉన్న 1990 గరిష్ఠ వాయువిడుదలల సంవత్సరాన్ని సంపన్న దేశాలకు అన్వయించగా కొపెన్‌హగన్‌ అంగీకార పత్రంలో గరిష్ఠ వాయువిడుదలల ప్రస్థావన లేదు.ఈ అంశాన్ని సరిజేయటం ప్రపంచ దేశాల ముందున్న తక్షణ కర్తవ్యం. అదే సందర్భంగా క్యోటో ఒప్పందంలోని వాయువిడుదలల తగ్గింపుపై సంపన్న దేశాలపై ఉన్న జరిమానాలు, చట్టబద్ధ అమలు తప్పనిసరిగా భవిష్యత్‌ ఒప్పందంలో ఉంటేనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. జి 77 దేశాలతోను, చిన్న ద్వీపకల్ప దేశాలతోను కలసి బేసిక్‌ దేశాలు భవిష్యత్‌లో మెక్సికోలో జరిగే ఒప్పంద రూపకల్పనలో ఐక్యంగా పనిచేయాలి. స్థానిక ప్రయోజనాలకు బేసిక్‌ దేశాలు కక్కుర్తి పడితే విశ్వమానవ సంక్షేమానికి తీవ్రవిఘాతం ఏర్పడుతుంది. చరిత్ర క్షమించదు.

No comments: