Sunday, December 13, 2009

వాయు విడుదల కొలమానాలు

'పర్యావరణ మార్పు''పై కొపెన్‌హగెన్‌లో జరుగుతున్న శిఖరాగ్ర సదస్సుకు ముందే వివిధ దేశాలు ఆయా దేశాలలో కార్బన్‌ వాయువులను ఏమేరకు తగ్గించాలనుకుంటున్నాయో ప్రకటించాయి. భారతదేశం కూడా ఇంతవరకు తాను అనుసరిస్తూ సమర్ధిస్తున్న 'తలసరి వాయు విడుదలల'(పర్‌క్యాపిటా ఎమిషన్స్‌) స్థానంలో 'జిడిపి ఆధారిత కార్బన్‌వాయు విడుదలల తీవ్రత' ప్రాతిపదికగా 2005 స్థాయి నుండి 2020 నాటికి కార్బన్‌ వాయు విడుదలలను 20-25 శాతం తగ్గించుకునేందుకు ఐచ్ఛికంగా సంసిద్ధతను ప్రకటించింది. అంతకు ముందు ఇదే పద్ధతిలో చైనా 40-45 శాతానికి, అమెరికా 19 శాతానికి వాయువిడుదలల తగ్గింపుకు సిద్ధమైనట్లు ప్రకటించాయి. సంపన్న దేశాలపై వత్తిడి పెంచటానికే ఈ చర్య అని భారత్‌ వాదిస్తున్నది
అమెరికా వాయు విడుదలల నియంత్రణ దిశగా ముందడుగు ప్రయత్నాలు చేయకుండా వర్దమాన దేశాలన్నీ మరింతగా త్యాగాలు చేయాలని, ఏఏ దేశం ఎంత మేరకు నిర్దిష్టంగా వాయువు విడుదలలను తగ్గిస్తాయో ప్రకటించాలని వత్తిడి చేస్తోంది. ఈ నేపథ్యంలో తలసరి వాయు విడుదలలు(పర్‌క్యాపిటా ఎమిషన్స్‌), జిడిపి ప్రేరిత వాయు విడుదలల తీవ్రత(ఎమిషన్‌ ఇన్‌టెన్సిటీ ఆఫ్‌ జిడిపి) అంశాలని పరిశీలిద్ధాం.

పూర్వరంగం: క్యోటో ఒప్పందం క్రింద ఎనెగ్జ్‌-1గా వర్గీకరించబడ్డ సంపన్న దేశాలు 1990 స్థాయి నుండి 5.2% విధిగా గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలల్ని తగ్గించుకోవాలి. కానీ ఈ లక్ష్య సాధనలో ఏ దేశమూ విజయవంతం కాలేకపోగా గ్రీన్‌హౌస్‌ వాయువిడుదలల్ని మరింతగా పెంచి మానవ మనుగడకు ముప్పును తెచ్చాయి. ఎనెగ్జ్‌-1లో లేని దేశాలు ఐచ్ఛికంగా వాయువిడుదలల తగ్గింపు చర్యలు తీసుకోవచ్చు కానీ తగ్గింపు కోటాలు విధిగా పాటించనవసరం లేదు.

ఈ వాయువిడుదలల కోటాలను తలసరి వాయు విడుదలల తగ్గింపు పద్ధతిలోకానీ, జిడిపి ఆధారిత వాయు విడుదలల తీవ్రత తగ్గింపు పద్ధతిలోకానీ వ్యక్తం చేయవచ్చు. గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలలలో 75% కార్బన్‌ వాయు విడుదలలు ఉన్నందున వీటిపైనే కేంద్రీకరణ ఎక్కువగా ఉంటున్నది.

తలసరి వాయు విడుదలలు(పర్‌ క్యాపిటా ఎమిషన్స్‌): ఒక దేశం/ప్రాంతంలో విడుదలైన గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలల పరిమాణానికి, ఆ దేశ/ప్రాంత జనాభాకు మధ్య ఉన్న నిష్పత్తిని ''తలసరి వాయు విడుదల''లని అంటారు. అంటే ఆ దేశం/ప్రాంతంలో ఒక వ్యక్తిపై ఉన్న సగటు వాయువిడుదలల పరిమాణం ఇది. సాధారణంగా సంపన్న దేశాల వాయువిడుదలల సగటు పరిమాణం వర్ధమాన దేశాల కంటే 4 రెట్లకు మించి అధికంగా ఉంటుంది. ఉదాహరణకు అమెరికా తలసరి వాయు విడుదలలు 20.1 మెట్రిక్‌టన్నులుగా ఉంది. వర్దమాన దేశాల తలసరి వాయువిడుదలలో చైనా మొదటి స్థానంలో ఉంది.
2006లో ఆ దేశంలో 4.6 మెట్రిక్‌టన్నులు ఉన్న తలసరి వాయు విడుదలలు 2030కి 8.0 మెట్రిక్‌ టన్నులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అతి తక్కువ తలసరి వాయు విడుదలల దేశాలలో భారత్‌, ఆఫ్రికాలు ఉన్నాయి. భారత్‌లో 2006లో ఒక్కొక్క వ్యక్తిపై 1.1 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌వాయు పరిమాణం ఉంటే 2030 నాటికి 1.4 మెట్రిక్‌ టన్నులకు పెరగవచ్చునని అంచనా వేస్తున్నారు. ఆఫ్రికా దేశాలలో తలసరి వాయు విడుదలల స్థాయిలో 2006 నుండి 2030 వరకు మార్పు ఉండక పోవచ్చు.

డాలర్‌ జిడిపి ఆధారిత వాయు విడుదలల తీవ్రత: ఒక దేశంలో ప్రతి యూనిట్‌ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి డాలర్లలో) సంపదలో విడుదలయ్యే గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలల పరిమాణాన్ని ''జిడిపి ఆధారిత వాయు విడుదలల తీవ్రత'' అంటారు. స్థూల దేశీయోత్పత్తిలో ప్రారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, సేవా రంగాల భాగస్వామ్యం ఉంటుంది.
వీటిలో సేవారంగ అభివృద్ధి ద్వారా విడుదలయ్యే గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలలు నామమాత్రమే. పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో వినియోగించే శిలాజ ఇంధనాల మూలకంగా ఉత్పన్నమయ్యే గ్రీన్‌హౌస్‌ వాయు విడుదలలే పర్యావరణ మార్పుకు అపాయకరంగా పరిణమిస్తాయి. ఒక అంచనా ప్రకారం 2006లో ఒక మిలియన్‌ డాలరు జిడిపికి సంపన్న దేశాలలో 386 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ వాయు విడుదలల పరిమాణం ఉండగా, 2030 నాటికి 246 మెట్రిక్‌ టన్నులు ఉండవచ్చని లెక్కిస్తున్నారు.2005 నాటికి అమెరికా-475, జర్మనీ-330, జపాన్‌-328, ఫ్రాన్స్‌-214 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ తీవ్రతను కల్గిఉన్నాయి. ఇక్కడ కార్బన్‌ వాయు విడుదలల తగ్గింపు సామర్ధ్యం బాగా ఉన్నట్లు వారి అంచనా. అదే సందర్భంలో వర్ధమాన దేశాలలో 2006లో ఒక మిలియన్‌ డాలర్‌ జిడిపికి 624 మెట్రిక్‌ టన్నులు ఉన్న కార్బన్‌ వాయు విడుదలలు 2030 నాటికి 330 మెట్రిక్‌ టన్నులకు తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు.

2005 నాటికి చైనా-1046, భారత్‌-501 మెట్రిక్‌ టన్నుల కార్బన్‌ తీవ్రతను కల్గి ఉన్నాయి.2006లో వర్ధమాన దేశాలలో కార్బన్‌ వాయు విడుదలల పరిమాణం పెరగటానికి అనేక కారణాలు ఉన్నాయి. 1) సంపన్న దేశాల పారిశ్రామికోత్పత్తి వర్ధమాన దేశాలకు తరలడం, 2) సంపన్న దేశాలలో ఆర్ధికమాంద్యం పెరగటం, 3) సంపన్న దేశాల వినియోగపు సరుకులన్నీ వర్ధమాన దేశాలలో ఉత్పత్తి కావటం, 4) నయా ఉదారవాద విధానాల నేపధ్యంలో సంపన్న దేశాల జిడిపిలో అత్యధికంగా సేవారంగంపై ఆధారపడి ఉండటం. కానీ 2006వ సంవత్సరం పూర్వం సంపన్న దేశాల విచక్షణారహిత శిలాజ ఇంధనాల వినియోగం, విలాసవంత జీవనం, అడవుల నరికివేత లాంటి చర్యలు భూ ఖండంలో అత్యధిక ఉష్ణానికి కారణమైనాయి. వర్ధమాన దేశాల ప్రజానీకంపై తీవ్రమైన దుష్ప్రభావాల్ని కలిగిస్తున్నాయి.


విశ్లేషణ: పైన పేర్కొన్న వాయువిడుదలల కొలమాన పద్దతులను పరిశీలించినపుడు తలసరి వాయు విడుదలల పద్ధతి సంపన్న దేశాల ప్రయోజనాలకు ఆటంకంగా ఉంటుంది. అందువల్ల మన ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులు మాంటెక్‌ సింగ్‌ అహుల్‌వాలియా ఈ అంశంపై మాట్లాడుతూ పాశ్చాత్య దేశాలు సహజంగా తలసరి వాయు విడుదలల పద్ధతిని వ్యతిరేకిస్తారు కాబట్టి జి.డి.పి ఆధారిత వాయు విడుదలల తీవ్రతా పద్ధతిని అనుసరించడం శ్రేయస్కరమన్నారు. సంపన్న దేశాల కొమ్ముగాసే ఈ వాదనలే భారత్‌ లాంటి దేశాలను సంపన్న దేశాల ఉచ్చులోకి లాగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులలో తలసరి వాయు విడుదలల పద్ధతి వర్దమాన పేద దేశాలు సంపన్న దేశాల నుండి పరిహారాన్ని, పరిజ్ఞానాన్ని రాబట్టుకోవటానికి నైతిక బలాన్ని అందిస్తుంది. భారత్‌ ప్రదర్శిస్తున్న తాజా వైఖరి సామ్రాజ్యవాద దేశాలకు ముందుగానే లొంగిపోవటమే కాకుండా వర్దమాన దేశాల ప్రయోజనాలకు భంగకరంగా కూడా ఉంది. ఈ వైఖరిని భారత్‌ పునరాలోచించుకొవాల్చిన అవసరం ఎంతైనా ఉంది.

No comments: